పెరుమాళ్, పెరుమాళ్!

myspace

 

ఓ వారం అవుతోంది. పెరుమాళ్ మురుగన్ గురించి రాద్దామని. చచ్చిపోయిన పెరుమాళ్ గురించి. కానీ, ఎంతకీ పెన్ను ముందుకు కదలడం లేదు. నిస్సత్తువ వెనక్కి గుంజుతున్నది. రక్తమాంసాలతో, గుండెలో ప్రాణంతోవున్న పెరుమాళ్ బతికే వున్నాడు కావచ్చు. కానీ, రచయిత పెరుమాళ్ చనిపోయాడు. అలా అని, పెరుమాళ్ ప్రకటించి వున్నాడు. తను రాసిన పుస్తకాల్ని వెనక్కి తీసుకున్నాడు.

మనగురించి లేదా మనలాటి వాళ్ళ గురించి రాసిన ఆ రచయిత పెరుమాళ్ చనిపోలేదు. హత్యకు గురయ్యాడు. అంతకంటే దారుణం ఏంటంటే, మనం చూస్తుండగానే చంపేశారు. మనలో కొందరు పెరుమాళ్ కి మద్దతు చెప్పి వుండొచ్చు. ఇదేం అన్యాయం అని అరచి వుండవచ్చు. కానీ, మన మద్దతు మన అరుపులు హంతకుడి చేతుల్ని భయపెట్టలేక పోయాయి.

పెరుమాళ్ లాటి రచయితలకే అభద్రత ఈ సమాజంలో. ఈమధ్య కాలంలో దాడులు ఎదుర్కొన్న రచయిత ఒక్క పెరుమాళే కాదు. పుదుక్కోటై లోనే కణ్ణన్, దురై గుణ అనే ఇద్దరు రచయితలు కూడా భౌతిక దాడులకు గురయ్యారు.    బూతు రచనలు చేసిన వాళ్ళు, పులిహార సాహిత్యం సృష్టిస్తున్న వాళ్ళు, జవసత్వాలు లేని, రంగూ రుచీ వాసనాలేని పుస్తకాలు రాస్తున్నవాళ్లు హాయిగా వర్ధిల్లుతున్నారు. జుగుప్సా సంస్కృతికి చెందిన సాహిత్యకారులు సత్కారాలు అందుకుంటున్నారు. విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి హానీ జరగదు. వాళ్ళు గొప్ప సృజనకారులుగా చలామణీ అవుతారు. కానీ జీవితాన్ని జీవితంగా చూపించిన, అపురూమైన సంక్లిష్టమైన సంబంధాల్ని చిత్రీకరించిన, చరిత్ర నేపథ్యంలో కలలాటి నిజాన్ని చెప్పిన పెరుమాళ్ మాత్రం ఉరికంబం ఎక్కాల్సివస్తున్నది.

సత్యాన్ని చెప్పినందుకు, సృజనాత్మక వ్యక్తీకరణ వున్నందుకు హత్యకు గురైనవాళ్లు, బహిష్కరణకు  గురైన వాళ్ళు, వేధింపులకు గురైన వాళ్ళు ఎంతమందిలేరు చరిత్రలో. సోయెంకా, ఎమ్ ఎఫ్ హుస్సేన్, తస్లీమా నస్రీన్, రష్దీ, చెరబండ రాజు – ఇలా ఎంతమంది లేరు రాజ్యం చేతిలో, రాజ్యం అండతో చెలరేగిపోయే మౌడ్యుల చేతిలో!

ఇంతకీ, పెరుమాళ్ రాసిందేమిటి? ‘అర్ధ నారీశ్వరుడు’ అన్న నవల. ఏదో కపోలానికి ఆదాటుగా తట్టిన ఏదో ఒక ఇతివృత్తంతో కాదు. ఓ అరవై డెబ్బై ఏళ్లక్రితం వుండిన ఓ జంట గురించి. వాళ్ళ చుట్టూ కనిపిస్తూ, కనిపించకుండా వున్న జీవితం గురించి, దాని పరిష్వంగం గురించి. పిల్లలు కలగని మహిళ ఒకానొక సమూహంలో మరొకరితో జతకట్టి సంతానం కోసం ప్రయత్నించగలిగే ఒకానొక సాంఘిక వెసులుబాటు గురించి.

images

ఇది నచ్చలేదు మౌడ్యులు కొందరికి. అది కూడా మతమే ప్రధానమైన ఎజెండాగా వున్న ఓ భావజాలం అధికారంలోకి వచ్చేక. పెరుమాళ్ పై వచ్చిన వత్తిడి అంతా ఇంతా కాదు. చిత్రమేమిటంటే, బ్రాహ్మిణీకల్ వ్యవస్థపై తీవ్రమైన వ్యతిరేకత కనబరిచిన తమిళనాడులో ఈ వత్తిడి రావడం. ఇక తమిళనాడులోనే ఈ పరిస్తితి వచ్చిందంటే ఇక సాంఘికంగా ఎంతో వెనుకబడిన రాష్ట్రాల్లో మత మౌఢ్యం రెచ్చిపోతుంది.

ఫ్రాన్సులో, సిరియాలో జరుగుతున్న అన్యాయాలపై ‘నేను చార్లీని’ అని తనివితీరా సాలిడారిటీని ప్రకటించే వాళ్ళు, పత్రిక స్వేచ్ఛ హననం గురించి, భావప్రకటనా హక్కు గురించి  పోరాడే వాళ్ళు పెరుమాళ్ గురించి ఎందుకో పట్టించుకోరు. ఆయనెవరో, ఆయనను ఎందుకు రక్కసి మూకలు వేటాడుతున్నారో పట్టించుకోరు. లేదా, కావాలనే ఉపేక్షిస్తారు.   ఎందుకంటే, పెరుమాళ్ తెల్లగా లేడు. ఆయన రాసింది ‘మన’ గురించి కాదు. ఎక్కడో సమాజపు అట్టడుగుపొరల్లో వున్నవాళ్ల గురించి రాసేడు. ఆయనపై దాడి చేస్తున్నది ‘మన’ వాళ్ళు. కాబట్టి ‘I am Charlie’ అని మనం గొంతెత్తి అరుస్తాం గానీ, అదే సమయంలో మన పెరట్లో ‘నేను చచ్చిపోతున్నా రచయితగా,” అని అరుస్తున్న, ఏడుస్తున్న, భయపడుతున్న, కలవరపడుతున్న పెరుమాళ్ మనకి కనబడడు.

మన కళ్ళు, మన చెవులు, మన మనసు, మన ఊహలు – అన్నిటిని ‘వాళ్ళు’ నియంత్రిస్తున్నారు. ఇది స్పష్టంగా రెండు విభిన్నమైన ప్రపంచాల వ్యవహారం. ఈ రెండు ప్రపంచాల అవసరాలు, విలువలు, బలాలు, ఊహలు, ప్రయోజనాలు భిన్నమైనవి. చిత్రంగా, మన ప్రపంచాలకు భిన్నమైన అవసరాల గురించి, ప్రయోజనాల గురించి, ఊహల గురించి, విలువల గురించి మనం పోరాడుతున్నాం. రెండు ప్రపంచాల్లో కేవలం ఒక ప్రపంచం దగ్గర మాత్రమే అన్ని వనరులు, సమాచార, సాంస్కృతిక ప్రసార సాధనాలు వున్నాయి. అవి కేవలం తమ ప్రపంచంలోని వారిని మాత్రమే కాక, అవతలి ప్రపంచంలో వాళ్ళను కూడా తీవ్రంగా ప్రభావితం చెయ్యగలవు.

ఫ్రెంచి పత్రిక చార్లీ హెబ్డే మీద జరిగిన ఆటవికమైన, అమానుషమైన దాడిని ప్రపంచమంతా ఖండిస్తుంది. ఖండించాలి కూడ. కానీ దురదృష్టవశాత్తూ మన ఖండన పాశ్చాత్య ప్రసార మాధ్యమాల ప్రభావం వల్లనే. గాజా పిల్లల్ని ఇజ్రాయిల్ హననం చేసినపుడు మనకి ఇంత కోపం రాలేదు. ‘I am Gaza kid’ అని ఆవేశంతో ఊగిపోలేదు. ఎందుకంటే, పాశ్చాత్య ప్రసార సాధనాలు పూనకంతో ఊగిపోలేదు. పిల్లల రక్తం కళ్ల చూసిన ఇజ్రాయిల్ ప్రధాని పారిస్ వీధుల్లో సిగ్గులేకుండా నిరసన ప్రదర్శనలోకి జొరబడితే కూడా మనకి కోపం రాదు.

పెరుమాళ్, కణ్ణన్, గుణ – మన ప్రపంచానికి చెందిన మనుషులు. మట్టి మనుషుల వేదన గురించి, నలిగిపోతున్న జీవితం గురించి, వాళ్ళు పడుతున్న హింస గురించి, వాళ్ళ సంతోషాల గురించి, అంతరించిపోతున్న వాళ్ళ చరిత్ర గురించి – అంటే మన గురించి – ఎంతో ప్రేమతో రాస్తున్నారు. అది మన సొంత ప్రపంచం గురించి.

అందుకే, పెరుమాళ్ లో చచ్చిపోయిన రచయితను మళ్ళీ బతికించుకోవాలి. పెరుమాళ్ లాటి రచయితలు చనిపోకుండా చూసుకోవాలి. మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలి.  అందుకే, I am Perumal.

*

Download PDF

12 Comments

 • ns murty says:

  కూర్మనాథ్ గారూ,

  I endorse your views. It is time that writers shed off their hypocrisies and stand united in condemning political atrocity on writing community.
  అసలు ఏ రచయితకైనా తను చెప్పదలుచుకున్నది చెప్పే హక్కు ఉంది. మనం చెప్పేదెప్పుడూ సమాజం లో కొన్ని వర్గాలకి అనుకూలం గానూ, మరికొన్ని వర్గాలకి ప్రతికూలంగానూ కూడా ఉంటుంది. అయితే, తన అభిప్రాయాన్ని రచయిత తనకున్న తార్కిక చింతనా పరిథిలో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. నచ్చితే మెచ్చుకోవచ్చు, లేకుంటే మౌనంగా ఊరుకోవడమో, తార్కికంగా దాన్ని ఎదిరించడమో చెయ్యాలి. ఎప్పుడూ విషయాన్నే తప్ప, వ్యక్తిని దూషించడం, నిందించడం చెయ్యకూడదు.
  “ప్రభుత్వాలకే కాదు, రచయితలకి కూడా ప్రజల ఆలోచనలని ప్రభావితం చెయ్యగల ప్రాథమిక హక్కు ఉంది” … అన్న విషయం సాటి రచయితలు తెలుసుకోగలిగితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. పైకి ఎన్ని మాటలు చెప్పుకుంటున్నా, చాలమంది కవులూ రచయితలూ తాము ఖండించే భావజాలాలకి అంతరాంతరాల్లో తెలిసీ, తెలియకుండా కూడా బానిసలే. బానిసత్వం అంటే, తప్పుని తప్పుగా చెప్పలేని తనం; అదే తప్పుని మరొకరు చేస్తున్నారని కప్పిపుచ్చుకోవడం; దాన్ని తాత్త్విక దృక్పథం లోంచి గాక, లౌకిక దృక్పథంలోంచి విశ్లేషించ పూనుకోవడం.

  I unequivocally support Perumal.

 • Thirupalu says:

  /మన కళ్ళు, మన చెవులు, మన మనసు, మన ఊహలు – అన్నిటిని ‘వాళ్ళు’ నియంత్రిస్తున్నారు/
  అవును ఈ దేశ రచయితలే కాదు, ఈ దేశ ప్రజలు కూడా నియతృత్వాన్ని ఎదుర్కొ వలసి రావచ్చు- త్వరగా మేలుకోక పోతే. కోట్ల పెరుమాళ్ మురుగాన్లు రావాల్సి ఉంది.

 • balasudhakarmouli says:

  ఐ యామ్ పెరుమాళ్

 • మనము జంతువు బుద్ధులు వదిలి వచ్చి చాలా ఎల్లయ్యిది అది తెలిసిన మనిషి పెరుమాళ్ళు అతడు మనవాడు.

 • నన్నడిగితే తెలుగు ఫిక్షను రచయిత ఎప్పుడో యాభయ్యేళ్ళ కిందటే నోరు నొక్కేసుకున్న పెరుమాళ్ అయ్యాడు.

 • Yes. I am Perumal! I am proud to be Perumal!

 • varmavizag says:

  బాగుంది కూర్మనాధ్

 • Shiva says:

  అయ్యా కుర్మనాథ్ గారు,

  భావవ్యక్తికరణ స్వేఛ్చ అత్యవసరం అని అందరు ఒప్పుకుంటారు.
  మీరు రాసిన గాజా ఉదాహరణ మటుకు సరిగ్గా లేదు.
  Israel – పాలస్తీనా సమస్య మంచి చెడుల సమస్య కాదు. అది చాలా కాంప్లెక్స్.
  జనాలందరికీ వివేచనా ఇంకా తార్కిక బుద్ధి లేదని అనడం సరి కాదు. కేవలం మీడియా వల్లే ప్రభావితులు అయ్యి జనాలు ఆలోచిస్తున్నారు అనుకోవద్దు. అకారణ మరణాలు మరి ముఖ్యంగా పిల్లల మరణాలు అందరిని కలిచివేస్తాయి.అది గాజా అయినా, బెస్లన్ అయినా,కుంబకోణం అయినా.
  గాజా మీద దాడి ని నేను సమర్ధించను కాని ఖండించ లేను కూడా. దానికి కారణం నేను Israel బానిసను అని కాదు.
  నాకు హమాస్ అంటే అసహ్యం.హమాస్ చార్టర్ మీరు ఎప్పుదిన చూసారా . Israel & అందులో జనాలను నాశనం చెయ్యడమే దిని లక్ష్యం. దాన్ని సుపోర్ట్ మీరు చేస్తున్నారా ??
  ఇలా అనగానే మీరు అంటారు అంటే Israel Settlements పరిస్తి ఏంటి? మరి Plasetine హక్కులు ?
  వాటిని సాధించే మార్గము హమాస్ మార్గం కాదు kakudhadu
  .
  కాని మీరు ఒప్పుకోరు. అమెరికా ని దేశించే వాడు ఎంత నరరూప రాక్షసుడిన వాడినీ సమర్ధించాలి. లేదంటే సామ్రాజ్య వాదులం. మిడి మిడి జ్ఞానం తో అందరి మీద నిందలు వేయడం మానండి

 • వురుపుటూరి శ్రీనివాస్ says:

  “తెంగ్లిష్” లో రాస్తున్నందుకు మన్నించాలి.

  నాలుగు విషయాలు:

  1. వాక్‌స్వేచ్ఛ. I am on the side of Perumal Murugan. Reading the novel, I did not get the impression that the author wrote it to offend anyone. He was very gentle in his treatment of the subject and the characters. And there is no justification for the hooliganism of the offended group of people.

  2. యథార్థ చిత్రణ. నాకింకా అనుమానాలు – ఈ నవలలో పేర్కొన్న ఆచారం ఒకప్పుడు తిరుచెంగోడులో నిజంగా ఉండేదా? స్వాతంత్ర్యానికి కొన్నేళ్ళ క్రితం దాకా ఉండి ఉన్నట్లయితే అది ఇన్ని రోజులూ ఎవ్వరి దృష్టికీ అందకుండా ఎలా ఉండిపోయింది? మనదేశంలో ఇంకెక్కడైనా అర్ధనారీశ్వరదేవాలయాలున్నాయా? అక్కడా ఇలాంటి ఆచారాలు ఉండి ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయా? This is just to verify if the the facts/fiction part of the story and to see if there is even a grain of merit in the argument of the offended group of people.

  3. This could be a trivial one but are there caste questions in this controversy that are not being focused on while we are talking about the religious/communal side of it? I think, I am struggling to convey that there might be more questions that we might need to ask. I am not clear on what I have in my mind. :)

  4. తెలుగు రచయితలు యాభయ్యేళ్ళ క్రితమే తమ నోళ్ళు కుట్టేసుకున్నారు అన్నారు, నారాయణస్వామి గారు. ఏమైనా ఉదాహరణలిస్తారా? I am not contesting his observation but I would like to know better.

  శ్రీనివాస్

 • Vilasagaram Ravinder says:

  అయామ్ పెరుమాల్

 • buchireddy gangula says:

  కుర్మా నాధ్ గారు

  excellent… వన్
  I అగ్రీ విత్ యు సర్ 100%

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)