మౌనం సంధించిన బాణం కామన్ మాన్: ఆర్కే  లక్ష్మణ్

తేదీ గుర్తులేదు కానీ అది 1985 సంవత్సరం.
 
అప్పుడు నేను శ్రీ పద్మావతీ విశ్వ విద్యాలయం లో జర్నలిజం విద్యార్థినిగా ఉన్నాను. ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, తిరుపతి  వారి జాతీయ అవార్డులు అందుకోవడానికి ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్, ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్, ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తదితరులు అవార్డ్స్ అందుకోవడానికి తిరుపతి వచ్చారు.  
 
మా జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ శర్మ గారు, లెక్చరర్  వి. దుర్గా భవాని గారు  ఆర్కే  లక్ష్మణ్ ని మా యూనివర్సిటీ కి ఆహ్వానించారు. (అప్పట్లో మా యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజి ఆవరణలోనే ఉండేది).  అలా జర్నలిజం విద్యార్థులుగా ఆర్కే  లక్ష్మణ్ ని ఇంటర్ వ్యూ చేసే అరుదైన అవకాశం మాకు దక్కింది.

అప్పటికి  ఆర్కే  లక్ష్మణ్ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ.  మాల్గుడి డేస్ రచయిత ఆర్కే  నారాయణ్ సోదరుడని మాత్రమే తెలుసు..  ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ వాతావరణం నుండి వెళ్ళిన నేను జర్నలిజం లో చేరిన తర్వాతే హిందూస్తాన్ టైమ్స్ పత్రిక గురించి విన్నాను.  మా శర్మ గారు ఇంటర్ వ్యూ చేయడానికి సిద్దం అవ్వమన్నారు.  ఇంటర్వ్యూ చేయడం కూడా మాకు కొత్త.   మా లైబ్రరీలో ఉన్న హిందూస్తాన్ టైమ్స్ పేపర్స్ తిరగేసి అయన కార్టూన్స్ చూసి కొంత అవగాహన చేసుకొని ఇంటర్ వ్యూ కి సిద్దమయ్యాం. జర్నలిజం అండ్ మాస్ కమ్యునికేషన్ విద్యార్థులుగా మేం చేసిన మొదటి ఇంటర్వ్యూ  ఆర్కే  లక్ష్మణ్ దే.

అతిసామాన్యంగా కనిపిస్తూన్న ఆర్కే  లక్ష్మణ్ అతని భార్య కమల గారితో కలసి మా యూనివర్సిటీకి వచ్చారు.   అతి సౌమ్యంగా కన్పిస్తున్న ఇతని కార్టూన్స్ బుల్లెట్స్ లా పేలుతున్నాయా.. రాజకీయ నాయకుల గుండెల్లోకి సూటిగా దూసుకుపోతున్నాయా.. వారిలో కలవరం కలిగిస్తున్నాయా అని ఆశ్చర్యంగా ఆయనకేసి చూశాం.
10945637_10203558629236835_6306386002277021008_n

అప్పుడు మేం ఆయనతో చేసిన ముచ్చట్ల  జ్ఞాపకాలు మీ కోసం ….

*కామన్ మాన్ సృష్టి కి కారణం

– సాధారణ పౌరుడిగా ఆలోచించడమే (చిరునవ్వుతో )

*ప్రతి రోజు కొత్త దనంతో ఎలా జనం ముందుకు రాగలుగుతున్నారు. అసలు అంత వైవిధ్యంతో కూడిన కార్టూన్స్ కు సరుకు ఎక్కడి నుండి వస్తుంది ?

– ఆయన చిన్నగా నవ్వేసి  ఇంటి నుండి ఆఫీసుకి , ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పుడు బస్ స్టాప్ లో నుంచొని సామాన్యుడి జీవితాన్ని పరిశీలించడం.  ప్రజల ఆశలను, ఆకాంక్షలను మన రాజకీయ నాయకులు స్వార్ధంతో ఎలా కాలరాస్తున్నారో వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారో నాకక్కడే తెలిసేది. వారి ఆలోచనల్ని మౌనంగా పరికించడం మూలంగానే నా కామన్ మాన్ బతుకుతున్నాడు.
*అందుకే మీరు సృష్టించిన కామన్ మాన్ కూడా మౌని ..?
– ఆ మౌనంలోంచి సంధించిన బాణం కామన్ మాన్

* మీ వ్యంగ్య చిత్రాలతో ప్రముఖ నేతలందరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు కదా .. ఆ రాజకీయ నాయకుల కేరికేచర్ల  వల్ల ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా .. 

– జవహర్ లాల్ నెహ్రూ ప్రతి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో తన గురించి కార్టూన్ ఏమైనా వచ్చిందా అని చూసుకునే వారనీ. కొందరు నాయకులు మొహాన్ని కందగడ్డలా ఎర్రబరుచుకునేవారనీ .  కొందరు నవ్వుకునే వారనీ . ఇందిరా గాంధీ మాత్రం అసహనం ప్రదర్శించే వారనీ విన్నాను.  అంతకు మించి ప్రత్యక్షంగా ఎలాంటి ఇబ్బంది పడలేదు.
* మీరు మీ వ్యంగ్య చిత్రణ లో ఏ నాయకుడినీ వదలలేదనుకుంటా .. ?
– అవును . (అంటూ ఆనాటి సంఘటనల ఆధారంగా వచ్చిన కార్టూన్లకి ప్రజల స్పందన, రాజకీయ నాయకుల ఆక్రోశం గురించి చాలా చెప్పారు కానీ అవి నాకు సరిగ్గా జ్ఞాపకం లేక రాయలేకపోతున్నా)

*మీరు హిందూస్తాన్ టైమ్స్ నుండే కార్టూనిస్టు గా జీవితం ప్రారంభించారా?

– మొదట్లో కన్నడ పత్రికకి పనిచేశాను. ( పేరు చెప్పారు. కాని నాకది గుర్తులేదు )

* మీకు స్ఫూర్తినిచ్చే కార్టూనిస్టు ఎవరు ?

– ఒక బ్రిటిష్ కార్టూనిస్ట్ ని నేను చాలా అభిమానిస్తాను.
( దాదాపు 30 ఏళ్ళ క్రితం నా  జ్ఞాపకాల మడతల్లో దాగిన విషయాలు ఇప్పుడు కొన్ని తుడుచుకుపోయాయనుకుంటా … )

*అసలు కార్టూన్స్ వేయాలని ఎందుకనిపించింది .. ?
– కార్టూన్స్ అని కాదు కానీ చిన్నప్పటి ఏవేవో గీతలు గీసేసే వాడిని.  అంతా  బొమ్మలు బాగా వేస్తున్నావ్ అనేవారు. అంతకు ముందు నుంచే బొమ్మల పుస్తకాలు బాగా చూసే వాడిని.  అలా రకరకాల బొమ్మల పుస్తకాలు చూసి చూసి బొమ్మలపై అభిరుచి నాకు తెలియకుండానే ఏర్పడింది కావచ్చు. ఎక్కడపడితే అక్కడ బొమ్మలు గిసేవాడిని. మా ఇంటి గోడల్ని, తలుపుల్ని నా బొమ్మలతో పాడుచేసేవాడిని.  మా పంతుళ్ళ బొమ్మలూ గీసేవాడిని .  నేను గీస్తున్న చిత్రాల్ని చూసి మెచ్చుకున్న మా టీచర్లు నాలో మరింత ఉత్సాహం నింపారు. ఆ తర్వాత మా అన్నయ్య  నారాయణ్ రాసిన మాల్గుడి డేస్ కి, ఇతర కథలకి బొమ్మలు వేసేవాడిని.
* మీకు పద్మ భూషణ్, రామన్ మెగ్సేసే అవార్డ్ వచ్చాయి కదా .. అభినందనలు
– ఆ పురస్కారాలు నావి కాదు నా కామన్ మాన్ వి.
సునిశిత హాస్యం, చమత్కారంతో కామన్ మాన్ ద్వారా ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చి, సామాన్య మానవుడి పక్షాన నిలిచి రాజకీయ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించే ఆర్కే  లక్ష్మణ్ భౌతికంగా మనమధ్య లేక పోయినా ఆయన సృష్టించిన కామన్ మాన్, ఆయన చిత్రాలు, వ్యాసాలూ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.
-వి. శాంతి ప్రబోధ
Download PDF

4 Comments

 • prasad bhuvanagiri says:

  కమాన్ మాన్ ఏమనుకుంటున్నాడు, repatinunchi ప్రశ్నించే వాడేది,

  కార్టూనిస్ట్ గ జీవితం – RK నారాయణ్ పూర్తి గ JEEVINCHARU , మే హిస్ సోలె రెస్ట్ ఇన్ PEACE

 • విన్నకోట నరసింహారావు says:

  ఆర్ కే లక్ష్మణ్ గారు ఉద్యోగం చేసింది టైంస్ ఆఫ్ ఇండియా లోనండి, హిందుస్ధాన్ టైంస్ లో కాదు.

 • gks raja says:

  ఆర్కె లక్ష్మన్ గారి వ్యంగ్యాస్త్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యేకించి చెప్పుకోదగినది, ఎప్పటికీ మనసున పట్టేసి వదలనిదీ ‘మాల్గుడి డేస్’. టైటిల్స్ వచ్చేటప్పుడు నేపధ్యం లో వినిపించే సంగీతం, లక్ష్మన్ గారి ‘హావభావపూరితమయిన’ బొమ్మలు మనల్ని ఊహాజనితమయిన ‘మాల్గుడి’కి తీసుకెళ్ళిపోయేవి. అయ్యో, అప్పుడే అయిపోయిందా అనీ, ‘మాల్గుడి’ లాంటి ఊరు ఉంటే వెంటనే వెళ్ళి వాలిపోవాలనీ తీవ్రమయిన కోర్కె కలిగేది. కనీసం మళ్ళీ మళ్ళీ ఆ ఎపిసోడ్ చూడాలంటే అప్పట్లో రికార్డింగు సౌకర్యం లేదు. ఎట్టకేలకు డివిడి లు దొరకడంద్వారా కొంత తృప్తి కలిగింది. కానీ విషాదం ఏవిటంటే, ఆ డివిడీ లు మన దేశం లో ఎన్ని చోట్ల ప్రయత్నిచినా దొరకలేదు. అమెరికాలోని ఆత్మీయులు కొనిచ్చారు.
  రాజా. gksraja.blogspot.in

 • O. సరస్వతి says:

  శాంతిప్రబోధ గారి ఫోన్ నెంబర్ ఇవ్వగలరు మనవి

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)