సామాన్యుడి కరవాలం ఆర్కే లక్ష్మణ్!

10906334_783511928409479_579760221439027300_n

with r k laxman

కొంతమంది కాలగర్భంలో కలిసిపోరు. కాలం చంకనెక్కి కూచుంటారు. కొన్ని తరాల పాటు బతికే ఉంటారు.

పౌరాణికాలు అంటే ఎన్టీయారు, అందమైన అమ్మాయి అంటే బాపుగారులాగే కార్టూన్ అంటే ఆర్కే లక్ష్మణే. ఇంత వయసొచ్చి, ఇంత పెద్ద పేపర్లో పని చేస్తున్నా కొన్ని సందర్భాల్లో “నేను పేపర్ కార్టూనిస్టుని” అని పరిచయం చేయగానే… “అంటే ఆర్కే లక్ష్మణ్ లాగానా.. నాకు ఆయన బాగా తెలుసు” అన్న వ్యక్తుల్ని అనేకసార్లు చూశాను. కార్టూనిస్టుకు పర్యాయపదం ఆయన. కార్టూనిస్టుకు ఉండాల్సిన అన్ని లక్షణాలు.. పరిశీలన, విషయ పరిజ్ఞానం,

వ్యంగ్యం, కరవాలం లాంటి  రేఖలు… అన్నింటికీ మించి రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద contempt (తూష్ణీభావం) పుష్కలంగా కలిగిన సంపూర్ణ వ్యంగ్య చిత్రకారుడు.

కార్టూనిస్టుగా ఆయన నా గురువు అని చెప్పను కానీ, కార్టూన్ ఎలా ఉండాలో ఆయన్ను చూసి అర్థం చేసుకున్నా. ఒకరోజు ఆలస్యంగా వచ్చే Times of Indiaలో ఆయన తాజా కార్టూన్ ను అపురూపంగా చూసుకున్న సందర్భాలు ఎన్నో.

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మీద ఈ రెండు కార్టూన్లు ఒక రకంగా ఆయన ధోరణిని ప్రతిబింబిస్తాయి. ఇందిర మీద కార్టూన్ చూడండి. ఆ నిలబడ్డ ఏబ్రాసి ముఖాలు, ఇందిరా గాంధీ posture ఒక అత్యంత ప్రతిభావంతుడికి మాత్రమే సాధ్యం.

ఇప్పుడవి అనేక కార్టూన్లలో ఒకటి అనిపించొచ్చు. కానీ, అది అచ్చులో వచ్చిన సందర్భం, timing పడి పడి నవ్వించాయి.

r k laxman 1

50కి పైగా ఏళ్ళ పాటు నిరంతరంగా ఆయన చేసిన పనిని తూకం వేయడం ఇక్కడ సాధ్యం కాదు. ఆయన గురించి నాకున్న complaint.. యాభై ఏళ్ళ పాటూ ఒకే ధోరణిలో కార్టూన్లు వేయడమే. అందరి జీవితాల్లో లాగే కళాకారుడి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. అనుభవాలు, చదువు, సమాజం కళాకారుడి కళ మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. వాటి తాలూకు ఎదుగుదలో, క్షీణతో కళలో కనపడి తీరుతాయి.

r k laxman 2

ఆర్కే లక్ష్మణ్ లో ఆ మార్పు దాదాపు శూన్యం. ఆయన అభిప్రాయాలు కానీ, ధోరణి కానీ మారలేదు. అందుకే ఆయనను అర్థం చేసుకోవడం కష్టం కాదు. నాకీ కార్టూన్ అర్థం కాలేదు అని ఎవరూ అన్న సందర్భమే లేదు. ఆయన బలహీనత అని నేననుకున్నదే ఆయన గొప్ప బలం. ఆయన సామాన్యుడి కార్టూనిస్టు.

-సురేన్ద్ర

Download PDF

8 Comments

 • P Mohan says:

  మంచి విశ్లేషణ, నివాళి. మన తోలుమందం రాజకీయ నాయకులకు ఇప్పుడు కాస్త హాయిగా నిద్రపడుతుంది కాబోలు. లక్ష్మన్లో మార్పు లేకపోయినా అయన పక్కదారి పట్టలేదు, కొంతమంది మన తెలుగు కార్టూనిస్ట్లు ల్లాగా. అస్తమానం అప్పడాల కర్రలు, చీపుర్లు, దేవుళ్ళ వెకిలి గీతల్లో మునిగి తేలుతున్న మన కార్టూనిస్ట్లు లక్ష్మన్ నుంచి నేర్చుకోవాలి..

 • అతి సామాన్యుడి వ్యంగచిత్రకారుడు. …సురేన్ద్ర (!)

 • నారాయణస్వామి says:

  చాలా మంచి నివాళి సురేంద్ర గారూ! ముఖ్యంగా మీ కార్టూన్ చాలా బాగుంది! అయితే ఆర్కే పట్ల మీ కంప్లేంట్ సమంజసమే – మీరే సమర్థించినట్టు ఆయన సామాన్యుడి కార్టూనిస్ట్ – అయితే అసామాన్య కార్టూనిస్ట్! మన దేశంలో సామాన్యుడు చాలా కాంప్లెక్స్ పర్సన్ ! అసామాన్యుడు!! అతని నాడి పట్టుకున్న ఆర్కే కూడా అసామాన్యుడే!

 • Rajani says:

  Very nicely wrItten

 • N.RAJANI says:

  సురేంద్ర గారూ బాగుంది ముఖ్యంగా మీ కార్టూన్ కూడా రజని నెల్లుట్ల

 • కల్లూరి భాస్కరం says:

  సురేంద్రగారూ…ఆర్కే లక్ష్మణ్ గురించి మీరు రాయడం బాగుంది. మంచి నివాళి.

 • sasi kala says:

  ఒక త్రోవ ఆయన వేసి వెళ్ళారు . ఎన్నో మైలు రాళ్ళు నాటి వెళ్ళారు .
  కొనసాగింపే ఒక కళాకారుడికి ఇవ్వగల నివాళి . చక్కగా వ్రాశారు .

 • నిశీధి says:

  అద్భుతంగా రాసారు , మంచి ట్రిబ్యూట్

Leave a Reply to Anil అనిల్ అట్లూరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)