ఆదికాలపు గుడులు అమ్మవారి తోపులే!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…”

అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. డిమీటర్ అనే గ్రీకుదేవతగురించిన సందర్భంలో క్యాంప్ బెల్ The Great Goddess of the Universe అనడం గురించి గత వ్యాసంలో చెప్పుకున్నాం. వేరే భాషలో అన్నప్పటికీ ఆ మాట సూచిస్తున్నది కూడా పోతనగారు పేర్కొన్న అమ్మలగన్న అమ్మనూ, మూలపుటమ్మనే! ఆమె జగజ్జనని, లోకమాత. ఆదిశక్తి.

ప్రపంచమంతటా జగజ్జననిగా కొలుపు లందుకున్న ఆదిమదైవం, స్త్రీ దేవతే.

Hekateఈ చిత్రం చూడండి. చూడగానే ఈమె మన అమ్మవారే నని మీకు అనిపించి తీరుతుంది. సూక్ష్మంగా చూసినప్పుడు వివరాలలో తేడాలు ఉంటే ఉండవచ్చు. నిజానికి ఈమె హెకటే (Hekate) అనే గ్రీకు దేవత. జార్జి థాంప్సన్ ప్రకారం, ఈమె చంద్ర సంబంధి, చంద్రునికి ప్రతీక. మాంత్రిక దేవత కూడా. హెకటే, అర్తెమిస్ ఒకరే ననీ, ఈమె ప్రసూతి దేవత అనీ అంటారు. హెకటేను, అర్తెమిస్ ను త్రియోదితిస్ (trioditis), అంటే మూడు మార్గాల కూడలిలో ఉండే దేవతగానూ; త్రిప్రోసొపొస్ (triprosopos), అంటే మూడు ముఖాలు కలిగిన దేవతగానూ కూడా పిలుస్తారు.

ప్రతినెలా కృష్ణపక్షంలో పాడ్యమి రోజున, అంటే పౌర్ణమి మరునాడు స్త్రీలు గుండ్రని అప్పచ్చులు చేసి వాటి మీద కొవ్వొత్తి లాంటి దీపాలు గుచ్చి మూడు మార్గాల కూడలిలో ఉండే హెకటేకు నివేదనం చేస్తారు. ఇది చంద్రుడికి సంబంధించిన తంతు. మూడు మార్గాలు, చంద్రుడికి గల మూడు దశలను సూచిస్తాయి. నివేదనగా అర్పించే దీపాలను ప్రకాశికలు (shiners) అంటారు. చంద్రకాంతిని సంరక్షించడం వీటి వెనుక ఉద్దేశం.

మన దగ్గర కూడా స్త్రీలు శ్రావణమాసంలోనూ, కార్తీక పౌర్ణమి రోజునా వరిపిండి, బెల్లం కలిపి చలిమిడి ముద్దల్లా తయారుచేసి వాటి మీద వత్తి వేసి వెలిగించి పూజిస్తారు. ఇది కూడా చంద్ర సంబంధమైన తంతే.

నాకీ సందర్భంలో శూద్రకుని మృచ్ఛకటికం నాటకంలోని ఒక తంతుపై కోశాంబి తన Myth and Reality లో చేసిన విశ్లేషణ గుర్తొస్తోంది. నాటకం తొలి అంకంలోనే ఒక కృష్ణపక్షం రోజున, నాయకుడైన చారుదత్తుడు సాయం సంధ్యాదికాలు చేసుకుని, గృహదేవతలకు నివేదన (బలి) సమర్పిస్తాడు. తర్వాత తన మిత్రుడైన మైత్రేయుని పిలిచి, కృతో మయా గృహదేవతాభ్యో బలిః, గచ్ఛ త్వం అపి చతుష్పథే మాతృభ్యో బలిం ఉపహార అని చెబుతాడు. “నేను గృహదేవతలకు బలి సమర్పించాను. నువ్వు చతుష్పథానికి, అంటే నాలుగు మార్గాల కూడలికి బలి తీసుకుని వెళ్లి అమ్మవార్లకు సమర్పించు” అని దీని అర్థం. సరిగ్గా అప్పుడే నాయిక వసంతసేన తన వెంటబడిన శకారుని తప్పించుకుంటూ చారుదత్తుని ఇంటికి వస్తుంది. అదే వారి తొలి కలయిక.

మార్గాల కూడలిలో బలి సమర్పించడంలో పైన చెప్పిన గ్రీకు తంతుకు, ఈ తంతుకు ఉన్న పోలిక స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాకపొతే, గ్రీకు తంతు మూడు మార్గాల కూడలిలో జరిగేదైతే, మృచ్ఛకటికంలో పేర్కొన్నది నాలుగు మార్గాల కూడలిలో జరిగేది. అందులో స్త్రీలు అయితే, ఇందులో పురుషులు. ఈ తంతు కృష్ణపక్షంలో షష్ఠినాడు(ఆరవ రోజున), పట్టణశివార్లలో రాజమార్గం కూడలిలో జరిపేదిగా కోశాంబి గుర్తించారు. గుప్తుల కాలానికి (క్రీ.శ. ౩౦౦-5౦౦) ముందు నుంచే ఈ తంతు ఉండేదనీ, ఇది జనసామాన్యంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న తంతుగా కనిపిస్తుందనీ కోశాంబి అంటారు. గృహసంబంధమైన అన్ని తంతులను పూసగుచ్చినట్టు పొందుపరచిన బ్రాహ్మణ గ్రంథాలు దీనిని పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందంటారు. అలాగే, పి.వి. కాణే తన History of Dharmasastra లో సాయంకాలం ఇచ్చే ఇతర బలుల వివరాలు అన్నీ ఇచ్చి పై తంతు గురించి ఇవ్వకపోవడం, మొత్తంగా అమ్మవారికి జరిపే నివేదనల గురించి ముక్తసరిగా తేల్చివేయడంపై కూడా కోశాంబి విస్మయం వ్యక్తంచేస్తారు. పురామానవ పరిణామ శాస్త్రంపై బొత్తిగా లక్ష్యం లేకపోవడానికి ఇది నిదర్శనం అంటారు.

ఇక మనుస్మృతి (3-81-92) రోజూ నిర్వహించవలసిన ఒక తంతు గురించి చెబుతుంది. దాని పేరు వైశ్వదేవం. పిండాలు చేసి మొదట పితృదేవతలకు సమర్పించి, ఆ తర్వాత కుక్కలు మొదలైన జీవులకు, ‘అంటరాని’వారికి, రోగగ్రస్తులకు పెట్టడం ఈ తంతు. ఇందులో అమ్మవార్లకు నివేదనం ఇవ్వడం గురించి కానీ, చతుష్పథ ప్రస్తావన కానీ లేకపోవడాన్ని కోశాంబి ఎత్తిచూపుతారు. అమ్మవార్లకు బలి ఇవ్వడం మాతృస్వామికమైన తంతు అనీ, మనుస్మృతి పితృస్వామికానికి చెందినది కనుక అందులో అమ్మవారికి జరిపే తంతును పేర్కొనలేదనీ దీనినిబట్టి అనుకోవాలి. మృచ్ఛకటికం రచించిన శూద్రకుడు క్రీ.పూ. 2- క్రీ.శ. 4శతాబ్దాల మధ్య కాలానికి చెందివాడు కావచ్చని ఊహ. ఒకవేళ క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినవాడనుకుంటే, అప్పటికి మాతృస్వామిక తంతులు కొనసాగుతున్నాయనీ, మనుస్మృతి అనంతర కాలంలో, బహుశా గుప్తుల కాలంలో సంకలనం అయిందనీ అనుకోవాలి. శూద్రకుని పేరు బ్రాహ్మణేతరుని సూచిస్తోంది కనుక, తనకు బాగా తెలిసిన బ్రాహ్మణేతరమైన తంతు గురించి ఆయన రాసి ఉండచ్చు.

అదలా ఉంచితే, గ్రీసులో జరిగే పండుగలలో, నిగూఢమైన తంతులలో హోమర్ పురాణగాధలకు ముందునాటి అవశేషాలు కనిపిస్తాయని జోసెఫ్ క్యాంప్ బెల్ అంటారు. వాటిలో పురుష దేవుళ్ళకు కాక, స్త్రీ దేవతకే ప్రముఖస్థానం. ఆ దేవత కొలుపులు జరిగేది, మనకిప్పుడు బాగా తెలిసిన దేవాలయాలలో కాదు; మసకచీకటి(twilight) నిండిన తోపులు, లేదా వనాలలోనూ, పొలాలలోనూ, కందకాలలోనూ!

వనాలు, పొలాలలో అమ్మవారి కొలుపులు జరగడం అనేది గ్రీసులోనే కాదు, మొత్తం యూరఫ్ లోనూ, మనదేశంలోనూ, బహుశా ప్రపంచమంతటా ఉండేది. కొన్ని చోట్ల ఇప్పటికీ ఉండి ఉండచ్చు. ఇందుకు సంబంధించిన అనేక ప్రస్తావనలలో కొన్నైనా ఉటంకించుకోవలసిన అవసరం కనిపిస్తోంది. రాంభట్ల కృష్ణమూర్తి గారు ‘సొంత కథ’ లో రాసిన వాక్యాలతో ప్రారంభిద్దాం:

ఊరికి ఒక మూల అమ్మవారి వనం ఉంది. ఒక విషముష్టి చెట్టు, నాలుగు ఊడుగు చెట్లు, కొన్ని బర్రెంక చెట్లు ఉన్నాయా వనంలో. వ్యవసాయ సమాజాన ఈ అమ్మవారి వనాలు ప్రపంచమంతటా ఉండేవి. అమ్మవారు సౌభాగ్యదేవత. ఈ వనాలు ఆమె ఆవాసం. ఈ వనంలో చెట్లు అల్లె కట్టినట్లు ఉంటాయి. అల్లి మధ్య ఏమీ ఉండదు. వనంలోని చెట్ల నెవరూ కొట్టరు. ఇప్పుడు పురుషాధిక్యాన్ని, పురుషదేవతలను ఆరాధించే దేశాల్లో ఒకప్పుడు జనం అంతా ఈ స్త్రీదేవతలనే, అంటే అమ్మవారినే ఆరాధించేవారని చరిత్రకారులంటున్నారు. గ్రామదేవత పేరు ఏదైనా కావచ్చు. ఆమె సౌభాగ్య దేవత. ఆమెనంతా గౌరి అంటారు.

గౌరికి ప్రాచీనకాలం నుంచీ వనాలే దేవాలయాలు- ఆమెకు ప్రత్యేకం గుళ్ళు ఉండవు. వ్యవసాయ కేంద్రాలైన పల్లెల్లో తప్ప వర్తక కేంద్రాలైన పట్నాల్లో గౌరి ఆరాధనలు కానరావు. రామాయణంలో గౌరీదేవి నివేశనం మిథిలానగరానికి ఆవల ఉండేదని వాల్మీకి అంటాడు. పెళ్ళికి ముందు తన సౌభాగ్యవర్ధనం కోసం చెలికత్తెలతో సీత గౌరీపూజకు వెళ్లింది. ఊరి చివరనే వసతి కల్పించుకున్న రాముడు ఆ సందర్భంలోనే సీతను చూశాడంటాడు వాల్మీకి. పెళ్ళికి ముందు కన్యలు గౌరీపూజ చేయడం ఆచారం. ఈ ఆచారం తెలుగునాట సంప్రదాయం పాటించేవారిలో నేటికీ కానవస్తుంది.

స్త్రీలకు చెందిన రహస్యప్రదేశాల్లోకి, అంటే వనాలు, కొలనులు మొదలైన చోట్లలోకి పురుషులు ప్రవేశించకూడదనీ, ఒకవేళ ప్రవేశిస్తే మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలు ఉంటాయన్న సంగతిని ఇంతకు ముందు ఒక వ్యాసంలో రెండు గ్రీకు పురాణ కథల ద్వారా చెప్పుకున్నాం. మన దేవీభాగవతం లో కూడా అలాంటి కథే ఒకటుంది:

వివస్వంతుడనే రాజుకు శ్రాద్ధదేవుడనే కొడుకు ఉన్నాడు. అతనికి ఎంతకాలానికీ పిల్లలు కలగలేదు. మగపిల్లవాడి కోసం వశిష్టుని సలహాపై పుత్రకామేష్టి జరిపాడు. అయితే అతని భార్య శ్రద్ధాదేవి ఆడపిల్ల కోసం హోమం చేయించింది. కొంతకాలానికి ఆమె గర్భవతై ఆడపిల్లను ప్రసవించింది. ఆమెకు ‘ఇల’ అని పేరుపెట్టారు. ఆడపిల్ల పుట్టినందుకు నిరుత్సాహం చెందిన భర్త ఈశ్వరుని ప్రార్థించాడు. ఈశ్వరుడు అనుగ్రహించడంతో ఇల కాస్తా పురుషుడుగా మారిపోయింది. అతనికి సుద్యుమ్నుడని పేరు పెట్టారు.

సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒకరోజున వేటకు వెళ్ళి ఒక మహావనంలో ప్రవేశించాడు. వెంటనే స్త్రీగా, అంటే ఇలగా మారిపోయాడు. దాని వెనుక కథ ఏమిటంటే, ఒకప్పుడు ఆ వనంలో శివపార్వతులు క్రీడిస్తుండగా మునులు ఆ సంగతి తెలియక ఆ వనంలోకి ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. శివుడికి కోపం వచ్చి, పురుషులెవరైనా ఈ వనంలోకి అడుగుపెడితే స్త్రీగా మారిపోతారని శపించాడు.

సుద్యుమ్నుడే కాక అతని గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. అతను ఏం చేయాలో తెలియక అడవిలో తిరుగుతూ చంద్రుడి కొడుకైన బుధుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. వారికి పురూరవుడు జన్మించాడు. తర్వాత శివుని ప్రార్థించిన సుద్యుమ్నుడు ఒక నెల పురుషుడిగానూ, ఒక నెల స్త్రీగానూ ఉండేలా వరం పొందాడు. అందుకు కూడా సంతృప్తి చెందక ఈసారి అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారు అతనికి ఎప్పుడూ పురుషుడిగానే ఉండేలా వరమిచ్చింది.

ఇది అంతిమంగా అయ్యవారి(శివుడు) మహిమ కంటే అమ్మవారి మహిమదే పై చేయి అని చెబుతున్న ఒక పురాణకథే కానీ, మాతృస్వామ్య/పితృస్వామ్యాల మధ్య పోటీని సూచించే ఒక చారిత్రకదశనూ ఇది ప్రతిఫలిస్తూ ఉండచ్చు. భర్త మగపిల్లవాడిని కోరితే భార్య ఆడపిల్లను కోరుకోవడమే చూడండి. కానీ ఆ ఆడపిల్లను మగపిల్లవాడిగా మార్చివేయడం ద్వారా భర్త తన ఆధిక్యాన్ని చాటుకున్నాడు. కానీ శివుని శాపం వల్ల ఆ అబ్బాయే మళ్ళీ స్త్రీగా మారిపోవడం, మధ్యేమార్గంగా నెల రోజులు స్త్రీగానూ, నెలరోజులు పురుషునిగానూ ఉండవలసి రావడం; తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల పూర్తికాలం పురుషుడిగా మారిపోవడం సంభవించాయి. ఇందులోని మాతృస్వామిక/పితృస్వామిక స్పర్థకు సంబంధించిన కోణాన్ని మరీ సాగదీయకుండా మీ ఊహకే వదిలేస్తాను.

దేవీభాగవతంలోనే ఇలాంటి కథ మరొకటి ఉంది:

ఒకసారి నారదుడు విష్ణుమాయ ఎలాంటిదో చెప్పమని విష్ణువును కోరాడు. విష్ణువు సరేనని దగ్గరలో ఉన్న ఒక కొలను చూపించి అందులో మునగమన్నాడు. మునిగి బయటికివచ్చేసరికి నారదుడు స్త్రీగా మారిపోయాడు. ఆమెను తాళధ్వజుడనే రాజు చూసి మోహించి తన రాణిగా చేసుకున్నాడు. వారికి కొడుకులు కలిగారు. కొంతకాలానికి శత్రువులు రాజ్యంపై దండెత్తి కొడుకుల్ని చంపేశారు. అప్పుడు స్త్రీరూపంలో ఉన్న నారదుడు దుఃఖిస్తుండగా విష్ణువు ప్రత్యక్షమై ఎవరూ శాశ్వతం కాదని బోధించి మళ్ళీ వెనకటి కొలనులో మునగమన్నాడు. నారదుడు అందులో మునిగి మళ్ళీ పురుషుడిగా మారిపోయాడు.

కొంచెం విషయాంతరంలా కనిపించినా పై పురాణకథలతో ఉన్న పోలిక దృష్ట్యా ఒక గ్రీకు పురాణ కథనూ ఇక్కడ ప్రస్తావించాలనిపిస్తోంది:

జియస్ దేవతల నాయకుడు(మన బ్రహ్మదేవుడి లాంటివాడనుకుందాం). అతని అర్థాంగి హేరా. ఓసారి ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు, “సంభోగంలో మీ ఆడవాళ్ళు మగవాళ్ళకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారు” అన్నాడు జియస్ భార్యతో నవ్వులాటగా. హేరా “అది అబద్ధం” అంది. కాసేపు వాదించుకున్న తర్వాత, టెరేసియస్ అనే ఒక మునిని పిలిపించి తమిద్దరిలో ఎవరిది నిజమో చెప్పమని కోరారు.

అతన్నే అడగడానికి కారణం ఏమిటంటే, అతనోసారి అడవిలో తిరుగుతూ, సంభోగిస్తున్న పాముజంటను చూశాడు. కర్రతో వాటిని కొట్టాడు. వెంటనే స్త్రీగా మారిపోయాడు. అలా ఏడేళ్లపాటు స్త్రీగా ఉండిపోయాడు. ఎనిమిదో ఏట మళ్ళీ అదే అడవికి వెళ్లినప్పుడు ఆ పాముజంటే మళ్ళీ సంభోగిస్తూ కనిపించింది. కిందటిసారి కర్రతో కొట్టినప్పుడు స్త్రీగా మారిపోయాడు కనుక, ఈసారి కొడితే పురుషుడిగా మారిపోవచ్చుననుకుని అలాగే చేశాడు. పురుషుడిగా మారిపోయాడు. ఈవిధంగా అతనికి స్త్రీ గానూ, పురుషుడిగానూ జీవించిన అనుభవం ఉంది. అదీ అతన్ని తీర్పు చెప్పమనడానికి కారణం.

జియస్ చెప్పిందే నిజమని టెరేసియస్ అన్నాడు. దాంతో హేరాకు కోపం వచ్చింది. అంధుడివి కమ్మని శపించింది. అప్పుడు జియస్ జోక్యం చేసుకుని ఆ శాపానికి పరిహారంగా అతని భవిష్యత్తును చెప్పగల శక్తిని ఇచ్చాడు.

ఈ కథకు మన ప్రస్తుతాంశానికి అవసరమైన వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే చెప్పుకుందాం. మళ్ళీ అమ్మవారి వనాల దగ్గరికి వెడితే…

Golden Bough

Golden Bough

ఇంగ్లీష్ రొమాంటిసిస్ట్ చిత్రకారుడు జోసెఫ్ మల్లార్డ్ విలియం టర్నర్(1775-1851) గీసిన The Golden Bough చిత్రం ప్రసిద్ధం. ‘బంగారు కొమ్మ’అని ఆ మాటకు అర్థం. సర్ జేమ్స్ ఫ్రేజర్(1854-1941) మాంత్రికత, మతం పై తను రాసిన ప్రఖ్యాత రచనకు ఆ పేరే పెట్టి, ముఖచిత్రంగా ఆ చిత్రాన్నే వాడుకున్నారు.

ఇటలీలో ఇప్పుడు నేమి అనే గ్రామం ఉన్నచోట ఒక చెట్ల తోపు, నేమి అనే పేరుతోనే ఒక సరస్సు ఉన్నాయి. ఆ సరస్సులోని నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉంటాయంటే, ఆ సరస్సు అనే అద్దంలో అక్కడి దేవత డయానా తన ప్రతిబింబాన్ని చూసుకుంటుందనేవారు. ఆ సరోవర తీరంలోనే నిద్రపోతున్నట్టు ఉండే రెండు ఇటలీ గ్రామాలతో సహా ఎంతో ప్రశాంతత ఉట్టిపడే ఆ పరిసరాలను ఒకసారి చూసినవారు ఎప్పటికీ మరచిపోలేరని ఫ్రేజర్ అంటారు. టర్నర్ చిత్రం స్వర్ణకాంతులనీనుతూ, ఒక స్వాప్నిక దృశ్యంలా ఉంటుందని అంటూ -ఆ చిత్ర పరిచయంతోనే తన రచన ప్రారంభిస్తారు.

ఇంతకీ విషయమేమిటంటే, ఆ సరోవరాన్ని అనుకుని ఉన్న చెట్ల తోపు, దేవత డయానాకు చెందిన ఒక పవిత్రవనం(Sacred Grove)! దాని గురించి ఆ తర్వాతి పేరాలోనే ఫ్రేజర్ ఇచ్చిన వివరాలు పై ఆహ్లాదకర చిత్రణకు భిన్నంగా విషాదాన్ని, భయాన్ని, గగుర్పాటును కలిగించేలా ఉంటాయి. ఈ పవిత్రవనంలో ఒక చెట్టు దగ్గర పగలంతా, రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ఒక వ్యక్తి వేటగాడిలా పొంచి ఉంటాడు. అతని చేతిలో సంధించిన కరవాలం ఉంటుంది. అతని ముఖం క్రూరంగా భయంగొలుపుతూ ఉంటుంది. అతను ఆనుక్షణం వెయ్యి కళ్ళతో పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. అతను ఒక పూజారి, రాజూ కూడా. రెండు వ్యవస్థలూ ఒకరి కిందే ఉన్న కాలం అది. అయితే ఆ పూజారి-రాజు పదవి అతను మరణించిన తర్వాత అతని వారసులకో, మరొకరికో అనాయాసంగా అందేది కాదు. అతణ్ణి చంపి మరొకరు దానిని చేజిక్కించుకోవలసిందే. అందుకే ఆ వ్యక్తి ప్రతి క్షణం ప్రాణగండాన్ని, పదవీగండాన్ని ఎదుర్కొంటూ అప్రమత్తంగా ఉండవలసిందే. అయినాసరే, ఏ క్షణంలోనైనా పదవితోపాటు, ప్రాణమూ పోకతప్పదు.

పూజారిత్వానికి సంబంధించిన ఈ విచిత్రమైన నిబంధనతో పొల్చదగినదేదీ ప్రాచీన ఇతిహాసకాలంలో కనిపించదనీ, దీనిని అర్థం చేసుకోవాలంటే ఇంకా ప్రాచీనతలోకి వెళ్లాలని ఫ్రేజర్ అంటారు. అంటే, స్త్రీ దేవతే ప్రాధాన్యం వహించిన మాతృస్వామ్యంలోకి వెళ్ళాలన్నమాట.

అదలా ఉంచితే, ‘దేవాలయం’ అనే మాటకు జర్మన్ భాషలో ఉన్న పర్యాయపదాలను పరిశిలిస్తే, జర్మన్ల అతి పురాతన ఆరాధనాప్రదేశాలు అడవులు, లేదా వనాలే నని అర్థమవుతుందని ఫ్రేజర్ అంటారు. ఆయన ప్రకారం, యూరప్ కు చెందిన ఆర్య తెగలు అన్నిటా చెట్లను పూజించడం ఉంది. కెల్టులలో ఆరాధనా ప్రదేశాన్ని సూచించే పురాతన పదం వ్యుత్పత్తిలో, అర్థంలో లాటిన్ పదం ‘నెమస్’ (nemus)కు తుల్యంగా ఉంటుంది. దానికి వనం లేదా తోపు అనే అర్థం. పైన పేర్కొన్న ‘నేమి’కి, లాటిన్ ‘నెమస్’ కు ఉన్న సంబంధం తెలుస్తూనే ఉంది. ప్రాచీన జర్మన్లలో పవిత్ర వనాలు సర్వసాధారణమే కాక, అందులోని చెట్లను నరికినా, బెరడు తీసినా తీవ్రమైన శిక్షలు ఉండేవి. ప్రాచీన స్వీడన్ లోనూ, 14వ శతాబ్దిలో క్రైస్తవంలోకి మారేవరకు లిథుయేనియాలోనూ పవిత్రవనాలు సర్వ సామాన్యం. యూరప్ లోని ఫిన్నిష్-ఉగ్రియాన్, ఓల్గా తెగలకు చెందిన పవిత్రవనాలలోకి స్త్రీల ప్రవేశం నిషిద్ధం.

వ్యవస్థ మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మారగానే, పవిత్ర వనాలలో ప్రవేశంపై ఉండే నిషేధమూ తారు మారు అయిందంటూ కోశాంబి (The Culture and Civilisation of ANCIENT INDIA in Historical Outline) ఇలా అంటారు:

కొన్ని చోట్ల (కొలీనా అని పిలిచే వ్యక్తి) స్త్రీ దుస్తులు ధరించి హోలీ మంట దగ్గర జరిగే నృత్యంలో పాల్గొంటాడు. బెంగళూరు లో ఏటా జరిగే కరగ ఉత్సవంలో పాల్గొనే ముఖ్య వ్యక్తి స్త్రీ దుస్తులు ధరిస్తాడు. పశ్చిమభారతంలోని పార్థీలు జరిపే సౌభాగ్యతంత్రాలలో కూడా పురుషులు స్త్రీ దుస్తులు ధరిస్తారు. ఈ తంతులు, ఉత్సవాలు అన్నీ మొదట్లో స్త్రీలకు చెందినవి. ఆ తర్వాత పురుషులు వాటిని తమ చేతుల్లోకి తీసుకున్నారు.

అలాగే, బ్రాహ్మణ పురాణాలు అమ్మవారికి చెందిన పవిత్ర వనాలను ప్రస్తావిస్తున్నాయి. ఇలాంటి వనాలు ఇప్పటికీ గ్రామాలలో రహదారికి దూరంగా కనిపిస్తాయి. అయితే, వలసవచ్చిన వ్యవసాయదారుల చేతుల్లోకి పూజారిత్వం పోకుండా, స్థానిక తెగ చేతుల్లో ఉంటే తప్ప; సాధారణంగా ఈ వనాలలోకి ఇప్పుడు స్త్రీల ప్రవేశం నిషిద్ధం. మొదట్లో ఈ నిషేధం పురుషులపై ఉండేది. సమాజం మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మారగానే పూజారిత్వమూ, తంతులూ కూడా చేతులు మారాయి.

మరికొన్ని విశేషాలు తర్వాత….

 

 

 

 

 

 

 

 

Download PDF

2 Comments

 • Lalitha P says:

  గ్రీకు అమ్మవారి బొమ్మ చాలా బాగుందండీ అచ్చు మన అమ్మవారి లాగానే! కట్టల మీదా చెట్ల కిందా ఉన్న అమ్మ దేవతల్ని చూడ్డం తప్ప, బ్రాహ్మణ పురాణాలలోని అమ్మవారి వనాల గురించి అసలు వినలేదు. కొంచెం వివరంగా చెప్తారా? ఆ వనాలలో చెట్ల కింద విగ్రహాలు ఉంటాయా ?

  మృచ్చకటికం అంత మంచి నాటకంగా పేరు పొందటానికి కారణం అందులోని ఇలాంటి సామాజిక అంశాలు కూడా! చక్కటి ప్రస్తావన చేశారు.

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు లలితగారూ…
   పురాణాలలో, రామాయణ,భారత, భాగవతాలలో అమ్మవారి వనాల ప్రస్తావన వస్తుంది. కాకపోతే ప్రతి ప్రస్తావన పురాచారిత్రకత దృష్టి నుంచి కచ్చితంగా పోల్చుకునే రూపంలో ఉండకపోవచ్చు. పురాతన సమాజానికి బాగా దూరమైపోయిన కాలంలో అవి గ్రంథరూపం ధరించడం, కథకుడు వీటిలోని కథలకు చరిత్రను, పురామానవ పరిణామ కోణాన్ని మరుగుపుచ్చే పూర్తి భిన్నమైన orientation ఇవ్వడం వంటి అనేక అంశాలు ఇందుకు కారణం. శతాబ్దాలుగా మనం వాటిని సంప్రదాయం అలవాటు చేసిన దృష్టితోనే చూస్తాం కనుక వాటిలో పురాచారిత్రక విశేషాలు ఉన్నప్పటికీ మన దృష్టి సాధారణంగా అటువైపు వెళ్ళదు.
   వచ్చే వ్యాసంలో పురాణాలు వగైరాలలో అమ్మవారి వనాల గురించి మరికొన్ని ఉదాహరణలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
   ఆ వనాలలో చెట్ల కింద అమ్మవారి విగ్రహాలు తప్పకుండా ఉండి ఉంటాయి.
   మృచ్చకటికంలో సామాజిక అంశాల గురించి మీరు మంచి ప్రస్తావన చేశారు. నా ఉద్దేశంలో మనం సాంప్రదాయిక సాహిత్యాన్ని గుప్తులకు ముందు/తర్వాత అని విభజించుకోవాలి. మృచ్చకటికం, భాసుని రచనలు, గాథాసప్తశతి వంటివి గుప్తుల ముందు కాలానికి చెందినవి. వాటికి ఒకవిధమైన cosmopolitan స్వభావం ఉండి వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. గుప్తుల కాలం నుంచే హైందవంతో పాటు సంస్కృత సాహిత్యం పై దానికి భిన్నమైన రూపం తీసుకుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)