పి.ఆర్. కాలేజీ లో ప్రీ – యూనివర్సిటీ చదువు

పి.ఆర్. కళాశాల ప్రధాన భవనం

జూన్, 1960 లో నేను ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలో పాస్ అవగానే మరింకే విధమైన ఆలోచనా లేకుండా మా కాకినాడ పి.ఆర్. కాలేజీ లో చేర్పించడానికి నిర్ణయం జరిగిపోయింది. అప్పటికే మా చిన్నన్నయ్య లాయరు, మా సుబ్బన్నయ్య బి.ఎస్.సిలో అక్కడే చేరి, ఎం.బి.బి.యస్ చదివి డాక్టర్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు కాబట్టీ, పైగా నాకు లెక్కల సబ్జెక్ట్ లో మార్కులు బాగానే వస్తాయి కాబట్టీ నేను సహజంగానే ఇంజనీరు అవాలని కూడా నిర్ణయం జరిగిపోయింది.

నాకు గుర్తు ఉన్నంత వరకూ అప్పుడు ఒక ఏడాది పాటు చదవ వలసిన ప్రీ-యునివర్సిటీ కోర్స్ లో మేథమేటిక్స్ ప్రధాన పాఠ్యాంశం గా ఉన్న వాటిల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఒక గ్రూప్, ఫిజిక్స్, లాజిక్ కలిపి మరొక గ్రూప్, బహుశా ఫిజిక్స్ , అకౌంటింగ్ కలిపి మరొకటీ ఉండేవి. అప్పటి లాజిక్ నాకు తెలియదు కానీ నేను లాజిక్ ఉన్న ఎం.పి.ఎల్. గ్రూప్ తీసుకున్నాను. అప్పటి పి.ఆర్. కాలేజీ ప్రిన్సిపాల్ పిరాట్ల శ్రీ రామం గారు మా నాన్న గారి క్లాస్ మేట్. ఆయనే ఆ సలహా ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు అని నా అనుమానం. ఇది నిజంగానే పుణ్యం ..ఎందుకంటే…ఆ తరువాత జన్మంతా చదువుల్లో నేను ఎప్పుడు కెమిస్ట్రీ చదవవలసి వచ్చినా బొటాబొటీ మార్కులతోటే గట్టెక్కే వాడిని. ఈ ప్రీ – యూనివర్సిటీ అనేది బహుశా ఆ ఏడు నాలుగో బేచ్ అనుకుంటాను. అంతకు ముందు వరకూ ఎస్ఎస్ఎల్సీ తరువాత రెండేళ్ళు ఇంటర్ మీడియేట్ అనీ, ఆ తరువాత రెండేళ్ళు డిగ్ర్రీ కోర్స్ ఉండేవి.

నేను అక్కడ చదివినది కేవలం ఒక్క ప్రీ-యూనివర్సిటీ సంవత్సరమే అయినా, అది కూడా 55 ఏళ్ళు దాటినా , కాకినాడ పి.ఆర్. కాలేజీ పేరు వినగానే ఇప్పటికీ నా ఒళ్ళు పులకరించి పోతుంది. ఎందుకంటే మొత్తం భారత దేశం లోనే ఆ కాలేజీ అత్యంత పురాతనమైన ఆధునిక కళాశాల. 1853  లో ముందు ఒక హై స్కూల్ గా ప్రారంభించబడి, 1884 లో డిగ్రీ కాలేజ్ గా రూపొందిన ఆ కళాశాల పిఠాపురం మహారాజా శ్రీ రాజా రావు వెంకట మహీపతి గంగాధర రామారావు రావు బహద్దర్ వారు. ఆయన పేరిట వెలసిన రామారావు పేట లో 63 ఎకరాలు, కాకినాడ మైన్ రోడ్ లో బాలాజీ చెరువు దగ్గర 28 ఎకరాలు దానం చేసి, తొలి భవన నిర్మాణాలు చేసి, ఆడ పిల్లలకి ట్యూషన్ ఫీజులు రద్దు చేసి, మహత్తరమైన మానవతా వాదంతో, సాంస్కృతిక సేవకి కూడా పెద్ద పేట వేసిన ఆ మహానుభావుడూ, ఆయన కుమారుడు రాజా మహీపతి సూర్యా రావు బహద్దర్ వారూ కాకినాడ పట్టణాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు. 1952 లో ఆ కాలేజీని ప్రభుత్వం వారు తీసుకుని, 2000 నుంచీ ఒక ఆటానమస్ కాలేజ్ గా నిర్వహించబడుతోంది. అంటే ప్రస్తుతం ఆ కాలేజ్ అనాధ కాని అనాధ. అలా ఎందుకు అనిపిస్తొందో తరువాత వివరిస్తాను.

నేను పి.ఆర్. కాలేజీ లో చేరగానే నా జీవితంలో జరిగిన ప్రధానమైన మార్పు పగలు పొట్టి లాగులు మానేసి పంట్లాలు వేసుకోవడం, రాత్రి పడుకునేటప్పుడు పైజామాలు వేసుకోవడం. ఆ రోజుల్లో ఇదేమంత చెప్పుకోదగ్గ విషయం కాక పోయినా, అందరూ చేసే పని అయినా ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానూ అంటే ఒక కుర్రాడు బాల్యావస్థ నుంచి యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టాడు అనడానికి ఈ చిన్న విషయమే ఆ రోజుల్లో ఒక “సింబాలిక్” గుర్తు. గెడ్డాలూ, నూనూగు మీసాలూ మొలవడం మరొక గుర్తు. ఈ రోజుల్లో ఐదో ఏటికే అందరూ యవ్వనం లోకి వచ్చేసి వ్యక్తిత్వ వికాసం ప్రదర్శిస్తున్నారు. బాల్యం అనే అపురూపమైన అమాయకత్వపు అనుభవం దాట వేసి అర్జంటుగా ఎదిగిపోయే తరం ఈ నాటిది.

పి.ఆర్. కళాశాల ప్రధాన భవనం

పి.ఆర్. కళాశాల ప్రధాన భవనం

మా ఇంటి నుంచి పి.ఆర్. కాలేజీకి వెళ్ళడానికి “ఏ బస్సు కిందో పడి చస్తావు” అని మా నాన్న గారు సైకిల్ కొనడానికి ఒప్పు కోలేదు. అంచేత మా గాంధీ బొమ్మ నుంచి రామారావు పేటలో మూడు లైట్ల జంక్షన్ దాకా రోడ్డు మీద అరగంటా, అక్కడ కుడి పక్కకి తిరిగి మరో పావు గంటా నడిస్తే కాలేజీ రౌండ్ గేటు దాకా నడిచే కాలేజ్ కి వెళ్ళే వాడిని. ఇది కేవలం ఒక మనిషి పట్టే గుండ్రంగా తిరిగే గేటు.  పొద్దున్నే మా అమ్మ పెట్టిన ఆవకాయ నల్చుకుని తరవాణీయో,  మరేమన్నానో తినేసి ఆదరా బాదరాగా నడక లాంటి పరుగు తో కాలేజీకి వెళ్ళేవాడిని అని గుర్తే కానీ కూడా మిత్ర బృందం ఎవరైనా ఉండే వారా, ఉంటే వాళ్ళ పేర్లు ఏమిటీ అన్న విషయాలు ఇప్పుడు బొత్తిగా గుర్తు లేవు. మూడు లైట్ల జంక్షన్ దగ్గర పుత్రయ్య కొట్టు అనే చిన్న బడ్డీ కొట్టు ఉండేది. ఎదురుగుండా రామకోటి హోటెల్ ఉండేది. నేను ఎప్పుడూ పుత్రయ్య కొట్టులో రస్కులు, బిళ్ళలు, జీళ్ళు వగైరాలు కానీ, అటు రామకోటి లో దోశలు, పెసరెట్లు  తినడం గానీ చెయ్య లేదు. అలా చిరు తిళ్ళు తినడం, అల్లరి చిల్లరి పనులు చెయ్యడం, అమ్మాయిలని ఏడిపించడం లాంటివి ఎవరైనా చేస్తుంటే చూశాను కానీ వాటి జోలికి ఎన్నడు వెళ్ళని “రాము మంచి బాలుడు” లాగానే హాయిగా ఉండే వాడిని.

ఆ మూడు లైట్ల జంక్షన్ నుంచి కాలేజ్ రౌండ్ గేటు దాకా నడవడానికి మటుకు చాలా భయం వేసేది. ఎందుకంటే  ఆ రోడ్డు మీద ఎప్పుడూ “పిచ్చి వరహాలు” అనే ఆవిడ ఒంటి నిండా గిల్టు నగలు వేసుకుని, అందరినీ తిడుతూ పొద్దుటి నుంచీ సాయంత్రం దాకా తిరుగుతూ ఉండేది. కొందరు కుర్రాళ్ళు ఆట పట్టించినప్పుడల్లా ఇంకా రెచ్చి పోయేది కానీ ఎవరికీ ఎప్పుడూ హాని కలిగించేది కాదు. నాకు పూర్తి కథ తెలియదు కానీ ఆవిడ భర్త స్వాతంత్ర్య ఉద్యమానికి ఉన్న ఆస్తి అంతా ధార పోసి, సత్యాగ్రహాలు చేసి జైలు కెళ్ళి మరణించాడనీ, అందుకే ఆవిడకి మతి భ్రమించింది అనీ చెప్పుకునే వారు. అలాగే మరొకాయన రోజు కొక జంక్షన్ లో నుంచుని, ఎవరు విన్నా, వినక పోయినా,  మన దేశం గురించీ, గాంధీ గారి గురించీ లెక్చర్ ఇస్తూ ఉండే వాడు.

ఆ రోజుల్లో కాకినాడ గాంధీ నగరం, రామారావు పేటలలో ఇంచుమించు అన్నీ బ్రాహ్మణ కుటుంబాలే. అందరి ఇళ్ళ నుంచీ..మా నాన్న గారితో సహా….దేశ స్వాతంత్ర్యం  కోసం ఎన్నో కష్టాలు పడిన వాళ్ళే. ఏదో స్థాయి లో త్యాగాలు చేసిన వాళ్ళే. తీరా ఆ స్వాతంత్ర్యం వచ్చాక పూర్తిగా విస్మరించబడి రోడ్డున పడిన వాళ్ళే. అయినా మన సాంస్కృతిక మూలాలని కాపాడుకుంటూ వచ్చినది కూడా వాళ్ళే!

పి.ఆర్. కాలేజ్ లో ఆర్ట్స్ క్లాసులన్నీ …అంటే మేథమేటిక్స్, లాజిక్, అకౌంటింగ్, ఇంగ్లీషు, తెలుగు వగైరాలు అన్నీ రామారావు పేట మెయిన్ కేంపస్ లో ఉంటే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లాంటి సైన్స్ క్లాసులు, లేబరేటరీలు బాలాజీ చెరువు దగ్గర ఉన్న చిన్న కేంపస్ లో జరిగేవి. రెండింటి మధ్యా నడక గంట పైగా ఉంటుంది. ఏ ప్రాంగణం అనుభూతి దానిదే. మా లెక్చరర్స్ లో నాకు ఇప్పటికీ గుర్తున్న వారు కెమిస్ట్రీ చెప్పిన బి.ఎన్నార్. గారు, ఆల్జీబ్రా చెప్పిన ఎ.ఎస్. రామారావు గారు, ట్రిగానామెట్రీ చెప్పిన డి.ఎస్. ఆర్ గారు, ఇంగ్లీష్ మేష్టారు వీరాస్వామి గారు మాత్రమే. తెలుగు, లాజిక్, ఫిజిక్స్ మేడం ఇలా ఎవరి పేర్లూ గుర్తు లేవు కానీ వారు పాఠాలు చెప్పిన పద్ధతి, ఆత్మీయత ఇంకా గుర్తున్నాయి.

నా క్లాస్ మేట్స్ లో నా హైస్కూల్ నుంచి భమిడిపాటి ప్రసాద రావు, పుల్లెల సత్య కామేశ్వర సోమయాజులు మాత్రమే నాతో పియుసి కూడా చదివారు అని జ్జాపకం.  ఇందులో ప్రసాద రావు ది కాకినాడ పక్కనే గోనేడ దగ్గర పాలెం అనే గ్రామం. నేను కాకినాడ వదిలి బొంబాయి వెళ్ళే దాకా  చిన్నప్పటి నుంచీ మా కుటుంబంలో ఒకడుగా ఉండేవాడు. పియుసి తరవాత వాడు పాలిటెక్నిక్ చదివాడు కానీ వ్యవసాయం లోనే స్థిరపడ్డాడు. వాణ్ని చూసి పదేళ్లయింది. ఇక సోమయాజులు గాడు మా ఇంటి పక్కనే. చాలా తెలివైన వాడు కానీ తిక్క శంకరయ్య. జీవితంలో రకరకాల పనులు చేసి, కేలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. వాణ్ని గత నలభ ఏళ్ల లోనూ ఒక సారి చూశాను.

నా పియుసి క్లాసులో నాకు ఎంతో దగ్గర మిత్రులు అయిన వాళ్ళలో డి. గణపతి రావు. ఎం.వి.ఎస్. పేరి శాస్త్రి, చెల్లూరి శివరాం అతి ముఖ్యులు. ఇందులో గణపతి రావు తరువాత ఇంజనీరింగ్ లో కూడా నాకు సహాధ్యాయి. విశాఖ పట్నం లో ని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఎదిగాడు. పేరి శాస్త్రిది పశ్చిమ గోదావరి జిల్లలో మొగల్తుర్రు గ్రామం…అంటే బారిస్టర్ పార్వతీశం ఊరు…అన్న మాట. అతను ఇప్పుడు  బెంగుళూరు లో ఒక ఐటి కంపెనీ వ్యవస్థాపకుడు. ఈ విషయం ఇప్పుడు అతనికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు కానీ మేము పియుసి లో ఉండగానే పేరి శాస్త్రి “నాకో చెల్లెలు కావాలి” అనే కథ వ్రాసి ఏదో పత్రికలో ప్రచురించాడు. అతనికి నిజంగానే చెల్లెలు లేదు అప్పుడు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది…..బహుశా నా తోటి వయసు వాళ్ళలో నాకు తెలిసిన తొలి రచయిత బహుశా పేరి శాస్త్రే!

ఆ వయసులో నాకు ఏదో పత్రికలూ చదవడం, మంచి సినిమాలు చూడడం, క్రికెట్ ఆడుకోడం, చదువుకోవడం లాంటి మామూలు అలవాట్లే కానీ కథలూ, కమామీషులూ రాద్దామనే బుద్ది వికాసం లేనే లేదు. సుమారు పదేళ్ళ క్రితం నేను ఒక సారి బెంగుళూరు వెళ్ళినప్పుడు ఒక సాహితీ సమావేశానికి పేరి శాస్త్రి వచ్చాడు…అంటే ఇంచుమించు నలభై ఏళ్ల తరువాత అతన్ని కలుసుకోవడం జరిగింది. నిడమర్తి రాజేశ్వర రావు గారి ఇంట్లో నా గౌరవార్థం జరిగిన ఆ సాహితీ సమావేశాన్ని సుప్రసిద్ద రచయిత దాసరి అమరేంద్ర గారు ఏర్పాటు చేశారు. ఆ రోజు విపరీతమైన వర్షంలో కూడా అంబికా అనంత్, తదితర బెంగుళూరు నగర సాహితీవేత్తలు వచ్చి నన్ను ఎంతో ఆదరించారు. ఇక శివరాం తో నా స్నేహం కాకినాడ నుంచి మొదలై, బొంబాయి ఐ.ఐ.టిలో బలపడి అమెరికా లో కూడా కొనసాగింది.

పీయూసీ మార్కుల షీట్

పీయూసీ మార్కుల షీట్

యధాప్రకారం నేను ప్రి-యూనివర్సిటీ లో మా సెక్షన్ కి మొదటి మార్కులతో ప్రధముడి గానూ, మొత్తం కాలేజ్ కి నాలుగు మార్కులు తేడాతో రెండో వాడిగానూ ఏప్రిల్ 29, 1961 నాడు పరీక్ష పాస్ అయ్యాను. ఆ రోజే నా పుట్టిన రోజు కూడాను. ఆ మార్కుల షీట్ ఇందుతో జతపరుస్తున్నాను. ఆ రోజుల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ కీ 200 చొప్పున ఐదు సబ్జెక్ట్స్ కీ కలిపి 1000 మార్కులకీ 700 వస్తే చాలా గొప్ప. నాకు 692 మాత్రమే వచ్చాయి కాబట్టి అది కొంచెమే గొప్ప. కానీ నాకు తెలిసీ ఇంగ్లీషులో కాలేజ్ ఫస్ట్ గానూ, లాజిక్ లో …అవును…మొత్తం ఆంధ్ర విశ్వ విద్యాలయానికే మొదటి వాడు నిలిచినా వాటి ఉపయోగం అప్పుడు తెలియ లేదు. ఆ పతకాలు మాత్రం మా అమ్మ జాగ్రత్తగా దాచుకుని, నేను అమెరికా వలస వచ్చినప్పుడు నా చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆ పతకాలూ, మా అమ్మా కాలగర్భంలో కలిసిపోయినా, నా స్మృతులలో మిగిలిపోయారు.

పి.ఆర్. కాలేజీ అనగానే నాకు వ్యక్తిగతంగా మొదట గుర్తుకు వచ్చేది క్రికెట్. ఇంచు మించు ఐదో క్లాసు లో క్రికెట్ ఆడడం మొదలు పెట్టిన దగ్గర నుంచీ, ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళే దాకా మా క్రికెట్ రోజు వారీ ప్రాక్టీసు, వారాంతంలో మా మేచ్ లూ, పెద్ద వాళ్ళ  పెద్ద మేచ్ లు అన్నీ ఆ కాలేజ్ ప్రాంగణం లోనే. రోజూ సాయంత్రం అయ్యే సరికి అక్కడ కనీసం యాభై టీములు ఆడుతూ ఉండేవి. ఆట అవగానే, కొంచెం చీకటి పడుతూఉండగా సత్తి రాజు పట్టుకొచ్చిన ఐస్ క్రీములు తినేసి రామారావు పేటలోనే ఉన్న శివాలయానికి వెళ్లి పోయి అక్కడ సాతాళించిన శనగలు తినేసి ఇంటికెళ్ళి పోయే వాళ్ళం.  ఇక సాంస్కృతిక పరంగా గుర్తుకు వచ్చేది పి.ఆర్. కాలేజీ వారోత్సవాలు.

1940 దశకంలో ఈ ఉత్సవాలని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ప్రారంభించారు. ఒక వారం రోజుల పాటు పెద్ద స్టేజ్ కట్టించి, దేశం నలుమూలలనుంచీ మహానుభావులనీ, గొప్ప వక్తలనీ, పండితులనీ పిలిపించి మాట్లాడించడం, హరి కథ, బుర్ర కథ, సాంఘిక నాటకం, పౌరాణిక నాటకాలు వేయించడం, గొప్ప గాయనీమణులు, గాయకులచేత కచేరీలు చేయించడం ఒక్క కాకినాడ పట్టణమే కాక తూర్పు గోదావరి జిల్లా అంతా ఈ సాంస్కృతిక వాతావరణంలో వారం రోజుల పాటు తరించడం …అదీ ఈ వారోత్సవాల ప్రభావం.

ఈ వారోత్సవాల కోసమే కృష్ణశాస్త్రి గారు  “జయ జయ ప్రియ భారత “ వంటి అద్భుతమైన గేయాలు వ్రాసి, సీత-అనసూయల చేత పాడించే వారు. ఈ వారోత్సవాల లోనే మహా కవి శ్రీశ్రీ గారి “మహా ప్రస్థానం” కూడా అనసూయ గారు తొలి సారి ఆయన సమక్షంలోనే వరస కట్టి పాడారు. ఇవన్నీ ఆ తరువాత రికార్డు గా కూడా వచ్చాయి. నేను దేవులపల్లి వారిని గారిని చూడ లేదు కానీ, బాగా చిన్నప్పుడు ఈ వారోత్సవాలలో పాడడానికి ఒక సారి సీత-అనసూయ లు మద్రాసు నుంచి వచ్చి “జయ జయ ప్రియ భారత” పాడడం బాగా గుర్తు. ఆ తరువాత 1980 లో వారిద్దరితోటీ మా తమ్ముడి పెళ్ళిలో పాడించుకునేటంత అవినాభావ సంబంధమూ, చనువూ నాకు కలిగాయి.

నా ప్రి-యూనివర్సిటీ చదువు కి కొన్నేళ్ళు అటు, ఇటూ కూడా కాకినాడ పి.ఆర్. కాలేజ్ రెండి ప్రాంగణాలలోనూ నేను అత్యున్నతమైన సాంస్కృతిక కార్యక్రమాలని చూశాను. బాలాజీ చెరువు దగ్గర సైన్స్ కేంపస్ & హైస్కూల్ ప్రాంగణం లో ఉన్న క్వాడ్రాంగిల్ హాల్ లో నేను విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, జటావల్లభుల పురుషోత్తం, కాటూరి వేంకటేశ్వర రావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, జాషువా, భమిడిపాటి రాధాకృష్ణ, రావి కొండల రావు, బివి. నరసింహా రావు, ఎస్. రాధాకృష్ణన్ గారు, బాలాంత్రపు రజనీకాంత రావు గారు, నేరెళ్ళ వేణు మాధవ్…ఇలా ఒకరేమిటి….ఆ నాడు తెలుగు నాట పేరున్న సాహితీ నిష్ణాతులందరినీ….విన్నాను. కళాకారుల ప్రదర్శనలని చూశాను. భువన విజయం, పాండవోద్యోగ విజయాలు, పేరయ్య రాజంట, గయోపాఖ్యానం లాంటి భారీ నాటకాలు, కుక్క పిల్ల దొరికింది, దంత వేదాంతం, కీర్తి శేషులు లాంటి  సాంఘిక నాటకాలు చూసి తరించాను. వాటిల్లో నటించిన రావి కొండల రావు, హరనాథ రాజు, ఏడిద నాగేశ్వర రావు (శంకరా భరణం సినిమా నిర్మాత), నల్ల రామ్మూర్తి…లాంటి చాలా మంది ఆ తరువాత సినీ రంగంలో రాణించారు.

ప్రస్తుత్త పరిస్థితికి వస్తే…..

నేను రెండేళ్ళ క్రితం ఒక సారి కాకినాడ వెళ్ళినప్పుడు ఆప్త మిత్రుడు యనమండ్ర సూర్యనారాయణ మూర్తి తో మా పి.ఆర్. కాలేజ్ ప్రాంగణాన్ని చూడడానికి వెళ్ళగానే అక్కడ  ఆర్ధిక వనరుల కొరత కొట్టొచ్చినట్టు కనపడింది. ముందుగా ఆకట్టుకున్నది చిందర వందరగా పెరిగిపోయిన గడ్డి, అడ్డదిడ్డంగా ఎదిగిపోయిన చెట్లూ, భవనాల లోనూ ఎటు చూసినా maintenance లేని వాతావరణమే!

రాజు, వై. యస్సెన్...తదితరులు

రాజు, వై. యస్సెన్…తదితరులు

తక్షణం మరొక ఆప్తుడూ, హ్యూస్టన్ నివాసి కూడా అయిన డా. ముత్యాల మూర్తి కలిసి వై. యస్. ఎన్. మూర్తి, కాంట్రాక్టర్ స్నేహితుడు వినోద్ ల సహకారంతో లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టి, సుమారు పాతిక ఎకరాల కళాశాల ప్రాంగణాన్ని కొంత వరకూ బాగు చేయించాం. కాలేజ్ ప్రిన్సిపాల్ డా. ఎం. సత్యనారాయణ గారినీ, పూర్వ విద్యార్ధుల సంఘం  సభ్యులనీ కలుసుకుని అనేక అంశాలు, ముఖ్యంగా వారు తలపెట్టిన “విద్యార్ధుల మధ్యాహ్న భోజన పధకం” పుట్టు పూర్వోత్తరాలు, నిర్వహణలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాం.

నేను వెనక్కి అమెరికా రాగానే అందరినీ బతిమాలుకుని, అందరిలో కొందరి దాతృత్వం ప్రధాన కారణంగా ఈ “విద్యార్ధుల మధ్యాహ్న భోజన పధకం” కింద 125 మందికి కిందటేడు ఆరు నెలలు ఉచితంగా భోజనం ఏర్పాటు చేశాం. కాలేజ్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ గారూ, స్టాఫ్ మెంబర్  శ్రీనివాస రావు గారు, పూర్వ విద్యార్థుల సంఘం నుండి మా వై.ఎస్.ఎన్. మూర్తి, ఉషా రాణి గారు మొదలైన వారెందరో దీనికి సహకరించారు. ఆ సమయంలో నేను మళ్ళీ కాకినాడ వెళ్లి ఒక రోజు లాంఛన ప్రాయంగా విద్యార్థులకి అన్న దానం చేస్తూ, దానికి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఉన్న బోర్డు దగ్గర తీయించుకున్న ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను.

రేకుల షెడ్డులో క్లాస్ దగ్గర నేను, తురగా చంద్ర శేఖర్

రేకుల షెడ్డులో క్లాస్ దగ్గర నేను, తురగా చంద్ర శేఖర్

ఇలాంటి ఫోటోలు, గొప్పలు చెప్పుకోవడాలు రాజకీయ వాదుల సొత్తే అని తెలుసు కానీ..నా ఉద్దేశ్యం అది కానే కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడు పి.ఆర్. జి. జూనియర్ కాలేజ్ కి విస్తరించడమే కాకుండా, అక్కడి భవనాలు , ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆ క్వాడ్రాంగిల్ పునరుద్ధరణ కూడా మా బృందం చేపట్టింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఎస్. వీ. రంగారావు, రేలంగి, మహర్షి బులుసు సాంబమూర్తి, దుర్గాబాయమ్మ గారు, రఘుపతి వెంకట రత్నం నాయుడు గారు మొదలైన వేలాది లబ్ధప్రతిష్టులు నడయాడిన ఆ  కళాశాల, ఆ క్వాడ్రాంగిల్ హాల్ ఇప్పుడు ఎలా ఉందో ఆరు నెలల క్రితం నేను వెళ్ళినప్పుడు తీసిన ఫోటో, ఆరు బయట రేకు షెడ్డు క్రింద క్లాసు ముందు చంద్ర తురగాతో ఉన్న ఫోటో  ఇక్కడ జతపరుస్తున్నాను. ఆ రోజు నా మానసిక పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి. దేవుడి దయ, దాతల విరాళాల వలన గత ఆరు నెలలలో కొన్ని భవనాలు బాగు చేశాం. మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీ కి కూడా విస్తరించాం. మరో మూడు నెలల్లో ఈ క్వాడ్రాంగిల్ హాల్ ని పునర్నిర్మాణం పూర్తి చేస్తాం.  మా బృందానికి కాకినాడలో వెన్నెముక గా నిలుస్తున్న వారు తురగా చంద్ర శేఖర్ & యనమండ్ర సూర్యనారాయణ మూర్తి.  అమెరికాలో ముత్యాల మూర్తి. కేవలం దాతల సహకారంతోటే ఈ మాత్రం సహాయం చెయ్యగలుగుతున్నాం.

అంతెందుకూ, ఇప్పుడు మా పి.ఆర్. కాలేజ్ వారి అధికారిక వెబ్ సైట్ లో కానీ, పూర్వ విద్యార్థుల సంఘం వారి వెబ్ సైట్ లో కానీ ఆ కళాశాలతో ఎంతో అనుబంధం ఉన్న దేవులపల్లి వారు, వెంకట రత్నం నాయుడు గారు, దుర్గాబాయమ్మ గారు, బులుసు సాంబమూర్తి గారు, పాలగుమ్మి పద్మరాజు, సి. పుల్లయ్య, వీణ చిట్టి బాబు, బులుసు వెంకటేశ్వర్లు, సినీ నటులు హరనాథ్, రావు గోపాల రావు మొదలైన వారి ఎవరి పేర్లూ కనపడవు.

భారత దేశం మొత్తం లోనే తొలి కళాశాలలలో ఒకటైన 162 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇటువంటి అనేక విద్యాలయాలని గాలికొదిలేసి, అవి నేర్పే తెలుగు భాషని పక్కనే ఉన్న బంగాళా ఖాతంలో ముంచేసి, సింగపూర్ లో ఎత్తయిన భవనాలు, జపాన్, అమెరికా వారి స్మార్ట్ నగరాల ఊహా సౌధాలలో విహరించే మన రాజకీయ వ్యవస్థని, పరిపాలనా యంత్రాంగాలనీ, వాటిల్లో వెతకక్కర లేకుండానే సర్వత్రా కనపడుతున్న “మానసిక” దారిద్ర్యం గురించీ ఏమనాలి? ఏం చెయ్యాలి? ఎవరో, ఏదో చేస్తారు అని అనుకునే బదులు, ఆక్రోశించే బదులు మనకి చేతనైన మంచి పనులు మనం చేద్దాం. ఏమంటారు ?  నా జీవితంలో నేను నేర్చుకున్న, ఆచరించే ప్రయత్నం చేస్తున్న ఒక చిన్న పాఠం. ఆ పాఠానికి అక్షరాభ్యాసం జరిగింది కాకినాడ పి.ఆర్. కాలేజీ లో.

 –వంగూరి చిట్టెన్ రాజు

chitten raju

 

Download PDF

8 Comments

 • చిట్టెన్ రాజు గారికి
  నమస్తె
  కాలేజి సుందరీకరణకు, పునరుద్దరణకు మీరు చేస్తున్న కృషి అపూర్వమైనది. మీరు పెరిగిన ప్రాంగణం పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గొప్పది.

  ప్రముఖులైన పూర్వవిద్యార్ధుల వివరాలను (ఈ వ్యాసంలో చెప్పిన వారితో సహా) మీరేమైనా ఒక వర్డ్ ఫైల్ రూపంలో నాకందించగలరా? సంబందిత ఇంచార్జ్ ద్వారా వాటిని వెబ్ సైట్ లో లింక్ రూపంలో వచ్చేలా అప్లోడ్ చేయించగలను. (bollOjubaba@gmail.com).

  అంతఘనచరిత్ర కలిగిన కాలేజీలో పనిచేస్తున్నందుకు, ఇలాంటివ్యాసాలు చదివినపుడల్లా అద్దంలో నాకు నేనే అంగుళ్యమాత్రం గా కనిపిస్తుంటాను. మాకుండే పరిధులు, పరిమితులు మీకు తెలియనివికావు.

  వ్యాసంలోని విషయాలు బాగున్నాయి. ధన్యవాదములతో
  భవదీయుడు
  బొల్లోజు బాబా

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీరు మన పి.ఆర్. కాలేజీలో పనిచేస్తున్నారా? అయితే మీతో చాలా పని ఉంది. ఈ వ్యాసం లో టూకీ గా చెప్పిన కారణాలకి ఆ కాలేజ్ సమగ్ర చరిత్ర నేనే ఎందుకు రాయకూడదూ అని ఇప్పుడు అనుకుని ఆ ప్రయత్నాలు మొదలుపెడుతున్నాను. అందులో అక్కడి వారి సహాయం చాలానే కావాలి. మీకు ఆసక్తి ఉంటే విడిగా మైల్ పంపించండి.
   అక్కడి వెబ్ సైట్ లో పేర్లు ఎలాగైనా ముందుగా జరగాల్సిన పనే. అదీ చేద్దాం.
   ధన్యోస్మి….

 • మోహననాయుడు కర్రి says:

  మీరు చదువుకున్న విద్యాలయాభివ్రుద్దిగూర్చి మీరు చేస్తున్న ప్రయత్నం చాలా హర్షించదగినది.ధన్యవాదాలు.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు మేష్టారూ…ఏదో ఉన్నంతలో తంటాలు పడుతున్నాం.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు మేష్టారూ..

 • Venkata S Addanki says:

  శ్రీ చిట్టెన్ రాజు గారికి ప్రణామములు,
  నేను పీఆర్జీ స్కూల్ పూర్వ విద్యార్థిని, క్రితం సంవత్సరం వెళ్ళినప్పుడు కో ఎడ్యుకేషన్నుండి బాలుర పాఠశాలగా మార్చినట్లు గమనించాను.పక్కన ఉన్న కాలేజ్ మరమత్తులు జరుగుతుండగా చూసాను.మీ లాంటి ఉదార స్వభావం కలవారు పూర్వ విద్యార్ధులుగా ఉండడం కళాశాల ధన్యం అయ్యింది.ఇంతమంది గొప్పవాళ్ళు అక్కడ చదివేరని తెలుసుకుంటేనే గుండె ఆనందంతో ఉప్పొంగుతోంది. ఎవరో కొంతమంది రేలంగి గారు వీరి గురించి తెలుసుగానీ మిగిలిన మహానుభావుల గురించి ఈ రోజు మీ ఈ కాలం ద్వార తెలుసుకున్నను.
  మీకు మరింత శక్తిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ప్రసాదించాలని కొరుకుంటూ

  శెలవు
  వెంకట్ అద్దంకి

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   అదే కదా విషయం. మన కాలేజ్ లో చదివిన వారు కొందరు పద్మభూషణ్ బిరుదు కూడా అందుకున్నారు. (చర్ల గణపతి శాస్త్రి గారు). కానీ ఎక్కడా పి.ఆర్. కాలేజ్ చరిత్ర నాకు కనపడ లేదు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)