మంచును కరిగించిన పాపాయి

MythiliScaled

ఒకానొకప్పుడు బల్గేరియా లో, ఒక ఊర్లో – ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. శీతాకాలం ఎప్పటికీ అయిపోయేట్లు లేదు, వసంతం వచ్చేటట్లు లేదు.ఒక రోజైతే, పొద్దున్నే లేచేప్పటికి ఇళ్ళన్నీ మంచు లో కూరుకుపోయి ఉన్నాయి. వాకిలి తలుపులు తెరవటమే కష్టమైపోయింది. అలాగే మంచుని తవ్వుకుని తలుపులు తీసి, ఇళ్ళ మధ్యన మంచు కిందన సొరంగాల లాగా దారి చేసుకుని, అందరూ ఊరి మధ్యన ఉన్న చర్చ్ లో కలుసుకున్నారు. ఇప్పట్లో పరిస్థితి మారకపోతే ఏం చేయాలనేది చర్చించారు. రకరకాల అభిప్రాయాలు వచ్చాయి కానీ ఏదీ తేల్చుకోలేకపోయారు. ఆ ఘోరమైన చలీ మంచు కురవటమూ అలాగే ఉంటే ఇహ ఆ యేడు పంటలేవీ పండించుకోలేరు. నెగళ్ళు వేసుకుందుకు అడవిలోంచి కట్టెలు తెచ్చుకోవటం కూడా వీలు పడదు. బతకటమే కష్టమైపోతుంది.

little girl 1” ఎవరో ఒకరు మంచు దేవుడి   దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పి వేడుకోవాలి. ఆయన ఆజ్ఞాపిస్తేనే గాని చలిగాలులు వెనక్కి వెళ్ళవు ” అన్నాడొక పెద్దాయన. అక్కడికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంటాడు మంచు దేవుడు. ఆ దట్టమైన మంచు కిందన అంత దూరం సొరంగం తవ్వి ఎవరు అక్కడికి వెళ్ళగలరు ? అదే అన్నారు అంతా. పెద్దాయన అన్నాడు – ” అలా అక్కర్లేదు, మన ఊరంటే లోయలో ఉంది కనుక ఇంత దట్టమైన మంచు. ఎలాగో అలా ఊరి చివరి వరకూ సొరంగం తవ్వితే చాలు, అక్కడినుంచీ కొండల వరస మొదలవుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ గాలులు బలంగా వీస్తాయి కాబట్టి మంచు పల్చగానే ఉంటుంది, సులువుగా చెదరగొట్టచ్చు ” అని.

అక్కడ చేరిన మగవాళ్ళంతా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఎవరికి వారికి పక్కవారెవరైనా వెళ్తే బావుండునని ఉంది. ప్రతివారూ ఏదో ఒక వంక చెప్పారు . చివరికి ఎవరూ మిగల్లేదు. సిగ్గుతో తలలు దించుకున్నారు గాని అప్పటికైనా ఒకరు ముందుకు రాలేదు.

పెద్దాయన అన్నాడు – ” ఇహ నేనే మిగిలినట్లున్నాను. ఒక ఇరవై ఏళ్ళ కింద అయితే ఈ పని ఇట్టే పూర్తి చేసి ఉండేవాడిని. ఇప్పుడు నా వల్ల అవుతుందో లేదో ! అయినా బయల్దేరతాను లెండి ” అని.

little girl 2

” అక్కర్లేదు తాతా. నేను వెళ్తానుగా ” అందొక చిన్న పిల్ల. ఆమెని పసిపిల్లగా ఉన్నప్పుడే అమ్మా నాన్నా పోతే , పెద్దాయన పెంచుకుంటున్నాడు.

” వద్దు వద్దు ” అన్నారు అంతా జాలిగా. ఆమెకి సరైన కోటు అయినా లేదు. వెచ్చటి ఉన్ని టోపీ గాని, శాలువా గాని, చేతి తొడుగులు గానీ- ఏవీ లేవు .పాప తల నిమురుతూ తాత అన్నాడు – ” వద్దు తల్లీ. చిన్న పిల్లవి, అంత దూరం వెళ్ళలేవు ” అని.

” నాకస్సలు భయం లేదు తాతా ” పాప అంది. ” నా కాళ్ళకి చాలా బలం ఉంది. మంచు గొర్రెలంత వేగం గా పరిగెట్టగలను కూడా ”

” చలికి గడ్డకట్టుకు పోతావమ్మా , దారిలో ఎక్కడా తలదాచుకునేందుకేమీ ఉండదు ”

” అందరికీ మంచి జరగాలి కదా తాతా మరి ? నాకేమంత చలి ఉండదు తెలుసా ? ”

తాత ఆలోచించాడు. తనకా శక్తి లేదు, దారి మధ్యలో ఆగిపోయినా తనకేమైనా జరిగినా ఏమీ లాభం ఉండదు. ఇంకెవరూ వెళ్ళేలా లేరు. పాప చిన్నదైనా ధైర్యం గలది, ఆరోగ్యం ఉన్నది. చివరికి ఒప్పుకున్నాడు-” నీ గుండె నిండా ప్రేమ ఉందమ్మా ! అదే నీకు వెచ్చదనం ఇస్తుంది. వెళ్ళిరా ”

అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఒకరు కోటూ, ఒకరు టోపీ, ఒకరు శాలువా, ఇంకొకరు బూట్లూ చేతి తొడుగులూ – ఇలా తమ దగ్గర ఉన్న వెచ్చటి దుస్తులని, పాపకి సరిపోయేవాటిని – తెచ్చి ఇచ్చారు. మగవాళ్ళంతా కలిసి ఊరి చివరి కొండవాలు దాకా సొరంగం తవ్వారు. అందరూ పాపని దీవించి జాగ్రత్తలు చెప్పారు. పాప బయలుదేరింది. ఇంతా అయేసరికి ఇంచుమించు సాయంత్రమైంది. మొదటి కొండ చేరే సరికే చీకటి పడిపోయింది. అయితే కాసేపటికి చందమామ వచ్చాడు. పౌర్ణమి రోజులేమో, వెన్నెల బాగా  వెలుతురు ఇచ్చింది. పాప రాత్రంతా నడుస్తూనే ఉంది, ఎక్కడా ఆగకుండా. వీలైనంత తొందరగా మంచు దేవుడి దగ్గరికి చేరాలని ఆమె ఆరాటం.

కాని మంచుగాలులు పాపని చూసి – ” ఎంత ధైర్యం ఈమెకి ! ఈమె పని చెబుదాం ఉండండి. గట్టిగా వీద్దాం , పడదోద్దాం ఆమెని. ఎందుకోసం వచ్చిందో మర్చిపోయేంత ఇబ్బంది పెడదాం ” అని కూడబలుక్కున్నాయి. చాలా విసురుగా, దుమారం లాగా వీచటం మొదలెట్టాయి. పాప   తొణకలేదు, బెణకలేదు. నడుస్తూనే ఉంది.

గాలులకి కోపం వచ్చింది. ఇంకా, ఇంకా విసిరి విసిరి వీచాయి, ఆయాసం వచ్చి ఆగాయి. ” ఏం పిల్ల ! మనకి అలుపు వస్తోందేగానీ ఆమెకేమీ లెక్కలేదే ” అని ఆశ్చర్యపోయాయి .

” ఇలా వదిలేస్తే లాభం లేదు. మనల్నెప్పుడైనా ఏ మనిషైనా గెలిచాడా ? ఇంత చిన్న పిల్ల ముందు ఓడిపోతామా ? మళ్ళీ మొదలెట్టండి ” రొప్పుతూ అంది   వాటిలో ఒకటి.

” నీకు ఓపిక ఉంటే నువ్వు మొదలెట్టు. ఇంక నావల్ల కాదు . ఒకరోజంతా పడుకుంటే గాని కదల్లేను ” అంది ఇంకొకటి.

” మేమూ అంతే, మా వల్లా అవదు ” ఒప్పుకున్నాయి తక్కినవి. మొదటిది అంది – ” అయితే మన అన్నయ్య ఉన్నాడు కదా మంచు తుఫాన్ … వాడు మనకన్న బలవంతులు. వాడిని పిలిచి పురమాయిద్దాం. ఈ పిల్లని మాత్రం వదిలేది

లేదు ‘’

అలాగే అన్నీ కలిసి మంచు తుఫాన్ ని పిలిచారు. అతను గబగబా వచ్చాడు. జరిగిందంతా విన్నాడు. ఆ సరికి పాప దూరంగా చివరి కొండ ఎక్కబోతూ కనిపించింది. తుఫాన్ ద్వేషం తో రుసరుసలాడిపోయాడు. ఎడాపెడా చేతులు జాడించాడు. అదేమి వింతో, పాప తుఫాన్ ని కూడా లెక్క పెట్టలేదు, ఆమెకేమీ కాలేదు.

” సిగ్గు సిగ్గు ” అనుకున్నాడు తుఫాన్. ” కోపమూ ద్వేషమూ ఈమెనేమీ చేయలేకుండా ఉన్నాయి. అటు వైపునుంచి ప్రయత్నిద్దాం ” అన్నాడు అతను.

ఒక చెల్లెలు వెటకారం చేసింది- ” ఎత్తుకుని కొండ మీద దించుతావా ఏమిటి ? ”

” కాదులే. మన అక్కయ్యని పిల్లుద్దాం. ఆమెని ఎవరూ ఎదిరించలేరు. తెలియకుండా వచ్చేసి ఎవరినైనా లోబరచుకుంటుంది ” అన్నాడు అతను. ఆ అక్కయ్య చలిరాక్షసి . మనుషుల ఒళ్ళు బిగుసుకుపోయి చచ్చిపోయేలా చేస్తుంది. ఆ దుష్టురాలు వీళ్ళు పిలవగానే వచ్చింది. ఆమెకి రూపం లేదు, కాని ఎలా కావాలంటే అలా మనుషులకి కనిపించగలదు. ఎప్పుడో చనిపోయిన పాప తల్లి రూపం ధరించి వచ్చి పాప కోసం తల్లి పాడే లాలిపాట పాడింది.

పాప నడక వేగం తగ్గించి, వింది, దూరం నుంచి చూసింది . ” ఇదేమిటి..అమ్మ మొహం, అమ్మ గొంతు, అమ్మ పాట … కాసేపు ఇక్కడ కూర్చుని వింటాను, అమ్మ దగ్గరికి వస్తుందేమో. దగ్గరికి వచ్చేశాను కదా , మంచు దేవుడి భవనం కనిపిస్తూనే ఉంది ” – కూర్చుండిపోయింది. పాట వింటూంటే పాపకి కళ్ళు మూసుకుపోతున్నాయి. మెల్లిగా నిద్రపోయింది. చలి రాక్షసి పళ్ళు బయట పెట్టి ఇకిలిస్తూ తమ్ముడికీ చెల్లెళ్ళకీ తన ఘనకార్యాన్ని చెప్పేందుకు వెళ్ళింది. అమ్మ కలలో కనిపిస్తుంటే పాప నిద్రలో నవ్వుకుంటోంది. కాని మొహం రంగు మారిపోతోంది, గులాబి రంగులోంచి నీలంగా అయిపోయింది.. తర్వాత పాలిపోయిన పసుపు పచ్చ రంగులోకి మారింది.. పాప బిగిసిపోతోంది. ఇంకెవరూ కాపాడేందుకు లేనట్లే ఉంది.

little girl 3

అప్పుడొక చిన్న శబ్దం, కీచుమని. పక్కన ఉన్న కలుగులోంచి చిట్టెలుక ఒకటి బయటికి వచ్చి తన చిన్న చిన్న కళ్ళతో పాప పరిస్థితి చూసింది. ” అయ్యో పాపం ” అనుకుని తోటి ఎలుకలని పిలిచింది. అవన్నీ పరుగెట్టుకొచ్చి పాప చేతులూ కాళ్ళూ రుద్ది వేడి పుట్టించే ప్రయత్నం చేశాయి. అవి చాలా చిన్నవి కనుక ఆ పని త్వరగా జరగటం లేదు పాపం, స్నేహితులని పిలిచాయి. బొరియల్లోంచి కుందేళ్ళు వచ్చాయి. మంచు కప్పిన పైన్ చెట్ల మీదినుంచి ఉడతలు కిందికి దూకాయి. పాప ఒంటిమీదికి ఎక్కి తమ బొచ్చుతో వెచ్చదనం పుట్టించాయి. పాప బుగ్గలు మెల్లి మెల్లిగా గులాబి రంగులోకి మారాయి. కళ్ళు విప్పబోయింది… రెప్పల మీద రెండు కన్నీటి బొట్లు గడ్డకట్టి ఉన్నాయి. ఒక చిట్టి ఉడత తోకతో వాటిని విదిలించింది. పాప కళ్ళు తెరిచింది. జంతువులకి గొప్ప సంతోషం వేసింది. పాప వాటికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుని తనెందుకు వచ్చిందో వివరించింది.

” మేమూ వస్తాం నీతో ” అన్నాయి అవి. ” ఈ చలికి మేమూ తట్టుకోలేకపోతున్నాం ”

అంతా కలిసి మంచుదేవుడి భవనం చేరారు. వాకిలి మూసి ఉంది. పాప గట్టిగా కేక పెట్టి పిలిచింది. ఎవరూ పలకలేదు. చిన్న ఎలుకలూ ఉడతలూ ప్రతి కిటికీ దగ్గరికీ వెళ్ళి చూశాయి. ఒక కిటికీ మటుకు కొద్దిగా తెరుచుకుని ఉంది. అందులోంచి దూరి లోపలికి వెళ్ళి అవి తలుపు గడియ తీశాయి. గాజు  పలకల నడవాలగుండా నడిచి మంచు దేవుడి సభ కి వెళ్ళారు. అక్కడి సింహాసనం మలిచి స్ఫటికం తో మలిచి ఉంది. అందులో కూర్చుని మంచు దేవుడు – గాఢంగా నిద్రపోతున్నాడు. జంతువులు ఆయన ఒళ్ళోకీ భుజాల మీదికీ గెంతాయి. ఒక ఉడుత తన చిన్న తోకతో ఆయన ముక్కుని రాసింది. ఆయన తుమ్మాడు, మె లకువ వచ్చింది. నీలి రంగు కళ్ళతో వీళ్ళని చూసి నవ్వాడు.

” రండి, రండి. ఎందుకు వచ్చారు మీరు ? ” అడిగాడు.

పాప సంగతి అంతా చెప్పింది.

” అయితే మీరు లేపేవరకూ నేను నిద్ర పోతున్నానా ఏమిటి ? ”

” అవునండి ”

” ఇది నా సేవకులు, అదే మంచు గాలులూ మంచు తుఫాన్ లూ- వాళ్ళ పనే అయిఉంటుంది . మామూలు గా నేనింత మొద్దు నిద్ర పోనే పోను. ఈ పాటికి వాళ్ళందరినీ గదుల్లో పెట్టి తాళం వేసి ఉండేవాడిని, వసంతం వచ్చేసేది. వాళ్ళు ఎప్పటికీ అధికారం చలాయించాలని నన్ను నిద్ర పుచ్చినట్లున్నారు. ఎలా ? అవును, గుర్తొచ్చింది. నాకేదో కొత్తరకం టీ అని ఇచ్చారు. తాగుతుంటే నాకేదో అనుమానం గానే ఉండింది. మధ్యాహ్నం పడుకుని రాత్రికి లేవవలసినవాణ్ణి వారాల తరబడి నిద్రపోయాను. ఉండండి, అంతా చక్కబెడతాగా ”

little girl 4

చేతిలో ఉన్న వెండి ఈలని ఊదాడు. సేవకులంతా గజ గజా వణుకుతూ వచ్చి నిలుచున్నారు. వాళ్ళలో ఏ తప్పు చేయని వాళ్ళకి తలా ఒక టూత్ బ్రష్ ఇచ్చి,  వెళ్ళిఆకురాలే కాలం ముగిసేదాకా హాయిగా నిద్ర పొమ్మని చెప్పాడు. తప్పు చేసినవాళ్ళకి మాత్రం శిక్ష వేశాడు- వేడి వేడి మంటలు ఉన్న గదుల్లో వారం రోజులు గడి పేలా.

జంతువులకీ పాపకీ మంచి ఐస్ క్రీం తెప్పించి పెట్టాడు. పాప ధైర్యసాహసాలని మెచ్చుకుని ప్రత్యేకంగా సన్నటి వెండి గొలుసు కానుక ఇచ్చాడు. దానికి హృదయం ఆకారం లో ఉన్న స్ఫటికం వేలాడుతోంది. నిజం ఏదో మోసం ఏదో కనిపెట్టే శక్తిని ఆ స్ఫటికం ఇస్తుంది.

తలుపులు తెరుచుకుని బయటికి వచ్చేసరికి చెట్లన్నీ చిగిర్చి ఉన్నాయి. పూలు విచ్చుకుంటున్నాయి, పిట్టలు కువకువమంటున్నాయి….వసంతం వచ్చేసింది.

తిరుగు ప్రయాణం సులభంగా, సుఖంగా సాగింది. మళ్ళీ కలుసుకుందామని చెప్పుకుంటూ స్నేహితులు విడిపోయారు.

ఊర్లో అందరూ పాపని దేవతలాగా చూశారు. ఆమెని ఏ లోటూ లేకుండా పెంచేందుకు వాళ్ళ తాతకి అన్నీ ఇచ్చారు. చలికాలం ముగిసినందుకు వారం రోజుల పాటు ఉత్సవాలు చేసుకున్నారు .

 • బల్గేరియన్ జానపద గాథ
 • mythili
Download PDF

10 Comments

 • చాలా బావుంది. ధైర్యానికీ సాహసానికీ మంచితనానికీ ఎప్పటికైనా విజయం లభిస్తుందని చెప్పిన కథ. మంచి కథనం. రచయిత్రికి అభినందనలు.

 • Mythili abbaraju says:

  ధన్యవాదాలండి

 • అనువాదం అన్న ఛాయలే కనపడకుండా రాశారు. అద్భుతంగా, ఆహ్లాదంగా వుంది.

 • Suresh says:

  కథలో ఈ వాక్యాల దగ్గర ఆగిపొయాను కొద్ది సేపు “” నీ గుండె నిండా ప్రేమ ఉందమ్మా ! అదే నీకు వెచ్చదనం ఇస్తుంది. వెళ్ళిరా ” తరువాత, పాప తో పాటు నేనూ ఆ వెచ్చధనాని అనుభవిస్తూ, సునాయసంగా మంచు గాలులు, మంచు తూఫానులు దాటాను, ఉడుతలతో ఆడుకొన్నాను, చివరికి మంచు దేవుడిని చూసాను. తలుపు తెరిచినపుడు చెట్లు చిగురించటం నేనూ చూసాను కదా!! ఎంత మంచి కథని అందించారండి ఈ సారి. ఆ కథ పేరు నుండి ఆ మంచు భవనం ఫోటో వరకు అన్నీ చక్కగా అమరాయి

 • vanam venkata varaprasadarao says:

  ” అందరూ తమ చేతగాదంటే ‘బాల’బయల్దేరింది! అందరూ తమ తమ ఉపకరణలు ‘బాల’కు ఇచ్చి బయల్దేరదీశారు! “..నాకు
  ‘బాల’ కథ గుర్తుకొచ్చింది!
  ‘గుండెలనిండా నిండిన ప్రేమ వెచ్చదనాన్నిస్తుంది!’ చిన్న వాక్యం, విశ్వవ్యాప్తము, విశ్వజయంకరము ఐన సత్యం! చాలా బాగుందండీ! ఏ తప్పూ చేయనివాళ్ళకి తలా ఒక టూత్ బ్రష్ ఇవ్వడం ఏంటో! ఏదో తెలియని చక్కిలిగింతకు సన్నగా నవ్వినట్టుంది, హాయిగా, లేచినతర్వాత శుభ్రముగా రావడం కోసమేమో గానీ, ఒక రంగురంగుల చిన్ని టూత్ బ్రష్ కొనిపెడితే
  చాలు మురిసిపోయే పిల్లలు గుర్తొచ్చారు. మైథిలిగారూ! పెద్దపిల్లలందరినీ చిన్నపిల్లలను చేసేసి మురిపిస్తున్నారు!
  అభినందనలు!

 • Rekha Jyothi says:

  “అమ్మ కలలో కనిపిస్తుంటే పాప నిద్రలో నవ్వుకుంటోంది.” – నిద్ర లో నవ్విన నవ్వుకి ఎంత అందమైన కారణం అద్దారు ? “అందరికీ మంచి జరగాలి కదా తాతా మరి … ” ఈ ఆలోచన చిన్నప్పుడే మనసులో నాటగలిగితే , పెరిగే మానవత్వం అనే వృక్షం క్రింద అందరూ సేద తీరవచ్చునేమో కదా!
  ” గాలులకి అన్నయ్య తుఫాన్ , అక్కయ్య చలిరాక్షసి , మంచు దేవుడు , మంచు దేవుడి భవనం …. ” బోలెడు పదాలు పిల్లల నిధిలోకి. Thank u for giving a ‘Brave Girl ‘ story Mythili Mam .

 • Mythili Abbaraju says:

  ధన్యవాదాలు రేఖా

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)