రీసెర్చ్

Kadha-Saranga-2-300x268

 

“రమ్యా… నేను చేస్తాను కదా, నువ్వు తప్పుకోరా!”

“ఏం అక్కరలేదు. ఇవాళ వంకాయ కూరను రుచిగా ఎలా వండాలో నేను నీకు వండి చూపిస్తాను కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా!”

ఇరవై ఆరేళ్ళ కూతురు రమ్యకి, ఆమె తల్లి వసుమతికీ ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో జరిగిన సంభాషణ అది. ఒక పావుగంట క్రితం నుండీ ఆ తతంగం నడుస్తూనే ఉంది.

“నీకంత అలవాటు లేదు కదమ్మా, నేను చేసుకుంటాను కదా.” మరోసారి బ్రతిమాలింది వసుమతి.

“మరేం పర్వాలేదన్నాను కదా. నీ రుచీ పచీ లేని కూరలకిక గుడ్ బై!” నాటకీయంగా చెప్పి, అంతలోనే తల్లి వైపు కోపంగా చూస్తూ “నిన్ను వెళ్ళమన్నాను కదా! మళ్ళీ వంటింట్లోకి వచ్చావంటే నేనూరుకోను!” స్వరాన్ని తీవ్రతరం చేసింది రమ్య.

చేసేదేమీ లేక హాల్లోకి నడిచింది వసుమతి.

మరో గంటన్నర నడిచింది. హాల్లో కూర్చున్న వసుమతి, ఆమె భర్త మహీధర్ వంటింట్లోంచి వస్తున్న చప్పుళ్ళను వింటూనే ఉన్నారు. అప్పటికి వాళ్ళిద్దరూ ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్ళేందుకు సిద్ధంగా కూర్చుని ఉన్నారు.

తుఫానులా హాల్లోకి దూసుకొచ్చి చెప్పింది రమ్య. “అమ్మా, ఇప్పటివరకూ ఎలానో ఏదో చేసాను కానీ ఇక నా వల్ల కాదు. ఆ వంకాయకూర మధ్యలో ఉంది. నువ్వే వండేసుకో!.”

“ఇప్పుడా?! మరో పది నిమిషాల్లో మేము బయల్దేరిపోవాలి కదా రమ్యా?!” వాడిపోయిన ముఖంతో చెప్పింది వసుమతి.

“ఏదో ఒకటి చెయ్యి మరి. నాకైతే ఇక వంట చెయ్యాలని మాత్రం లేదు. నేను స్నానానికెళుతున్నా.” అని విసురుగా చెప్పేసి వెళ్ళిపోయింది రమ్య.

“ఇప్పుడెలాగండీ? కనీసం టిఫిన్ కూడా చెయ్యలేదు మీరు.” బాధగా అంది వసుమతి.

“నువ్వు మాత్రం చేసావా ఏంటి? మరి రమ్య సంగతేంటి?” అడిగాడు మహీధర్.

“నేను కార్న్ ఫ్లేక్స్ పాలలో వేసుకుని తినేసాను. మీరు కూడా అదే పని చేసి వెళ్ళండి.” లోపలినుండి వాళ్ళ మాటలను విని జవాబుగా అరిచి చెప్పింది రమ్య.

“నేను క్యాంటీన్లో భోంచేస్తానులే వసూ! దార్లో టిఫిన్ చేద్దాంలే పద, ఆఫీసుకు టైం అయిపోతోంది.” భార్యను బయల్దేరదీసాడు మహీధర్.

“మరి రమ్య…”

“నేను ఇంట్లోనే ఉంటాను కదా. ఏదో ఒకటి చేసుకుంటానులే. ఆ వంకాయ కూర మాత్రం మళ్ళీ ముట్టుకోను. చూడ్డానికి బాగా రాలేదది. ఇంకేదైనా చేసుకుంటానులే. మీరు వెళ్ళండి.” తల్లి మాటలకు అడ్డు తగులుతూ హాల్లోకి వచ్చి చెప్పింది రమ్య.

భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు.

“మీరు బయటకు నడిస్తే నేను తలుపేసుకుంటాను.” విసుగ్గా అంది రమ్య.

బరువుగా అడుగులేస్తూ బయటకు నడిచారు వసుమతి, మహీధర్.

***

“ఇవాళ నిన్నటిలా చెయ్యలేదులే! వంటంతా పూర్తి చేసేసాను.” నవ్వుతూ తల్లితో చెప్పింది రమ్య.

తన అపనమ్మకాన్ని దాచుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది వసుమతి కానీ కృతకృత్యురాలు కాలేకపోయింది.

“చూడు కావాలంటే! ఇదిగో పప్పు. ఇదిగో దొండకాయ కూర. ఇవి కాకుండా నీకు బత్తాయిపండు కూడ ఒలిచి ఈ భరిణలో పెట్టాను. నాన్నగారికి కూడా తీసుకెళ్ళేందుకు అన్నీ సర్దేసాను.” మూతలు తెరిచి చూపిస్తూ చెప్పింది రమ్య.

“ఓ… ఎప్పుడు లేచావురా, చాలా పని చేసేసావు?” మెచ్చుకోలుగా అంది వసుమతి.

“ఉదయం ఐదు గంటలకే లేచిపోయాను. నిన్న మిమ్మల్ని బాధ పెట్టాను కదా మరి!”

“బాధ ఏమీ లేదులే రమ్యా! అది సరే కానీ బత్తాయి సరిగ్గా ఒలిచినట్టు లేదు కదరా?!”

“అలాగే తినాలమ్మా. లేకపోతే మనకు అందవలసిన పోషకాలేమీ అందవు.”

“కానీ ఆ తెల్లగా ఉన్న తొక్క కూడా తీయకపోతే చేదుగా ఉంటుంది రమ్యా!” కూతురికి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది వసుమతి.

“ఏమీ కాదు. లోపల తొనల రుచి నోటికి తగలగానే చేదన్నదే మర్చిపోతావ్. దొండకాయ కూర కూడా ఉడకలేదని సాయంత్రం నాకు చెప్పి నా మనసు కష్టపెట్టకు. ఎక్కువగా ఉడికించి, అందులో ఉప్పు, కారం తక్కువగా వేసుకుని తింటేనే మన ఆరోగ్యం బావుంటుంది. నీలా నూనె అంతా కుమ్మరించి చేస్తే మన ఆరోగ్యం చెట్టెక్కినట్టే! మరో రెండేళ్ళలో రిటైర్ కాబోతున్నారు మీ ఇద్దరూ. ఇప్పటినుండే ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా చెప్పు?!”

కూతురి మాటలు కొనసాగుతూ ఉండగానే లోపలికొచ్చిన మహీధర్ చెప్పాడు- “రిటైర్ కాబోతున్నామన్న బాధ కంటే పెళ్ళి చేసుకునేందుకు నిన్ను ఒప్పించలేకపోతున్నామన్న బాధే మాకెక్కువగా ఉంది రమ్యా!” అతని కంఠంలో విచారం తొంగి చూసింది.

“వద్దు బాబోయ్ వద్దు! పెళ్ళి మాట మళ్ళీ ఎత్తొద్దని మొన్ననేగా మీకు గట్టిగా చెప్పాను. నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడరంటే మీతో జీవితాంతం మాట్లాడను!” బిగ్గరగా అరుస్తూ చెప్పింది రమ్య.

వసుమతి కన్నుల్లో నీళ్ళు తిరిగాయి. “అంత గట్టిగా అరవకు రమ్యా! ఎప్పటికైనా నువ్వు జీవితంలో స్థిరపడాలి కదా!” కూతురికి హితవు చెప్పబోయింది.

“ఇప్పుడు నాకేం తక్కువ చెప్పు? మీ దగ్గరే ఉంటాను. రిటైర్ అయ్యాక వచ్చే డబ్బులతో మనం హాయిగా గడపొచ్చు.” ధీమాగా చెప్పింది రమ్య.

“గడపొచ్చు. కాదనడంలేదు రమ్యా! మేము బ్రతికి ఉన్నంత వరకూ పర్వాలేదు. ఆ తర్వాత నీ భ్యవిష్యత్తు గురించి ఆలోచించావా? ఒంటరిగా ఎలా ఉంటావు?!” బాధగా అడిగాడు మహీధర్.

“అలాంటి మాటలు మాట్లాడకండి నాన్నా! నాకిష్టం ఉండదు.”

“ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రకృతిసిద్ధంగా జరిగేవాటిని ఎవ్వరమూ ఆపలేము కదా రమ్యా! నువ్వు పెళ్ళి చేసుకుంటే మా బెంగలన్నీ తీరిపోతాయి. నువ్వు సుఖంగా ఉన్నావన్న తృప్తితో మా శేషజీవితం హాయిగా గడిచిపోతుంది.” అనునయంగా చెప్పింది వసుమతి.

“పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు… ఇష్టం లేదు… ఇష్టం లేదు అంతే!” మళ్ళీ బిగ్గరగా చెప్పింది రమ్య.

నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు వసుమతి, మహీధర్.

“వెళ్ళండి. మీకు ఆఫీసులకు టైం అయిపోతోంది.” కొద్ది నిమిషాల గంభీరమైన నిశ్శబ్దం తరువాత చెప్పింది రమ్య.

“పోనీ మనం ఒక ఇల్లైనా కొనుక్కుంటే నువ్వు నిశ్చింతగా అందులో ఉంటావన్న భరోసా మాకు ఉంటుంది కదమ్మా!” సౌమ్యంగా చెప్పాడు మహీధర్.

“పెళ్ళీ ఇల్లూ… పెళ్ళీ ఇల్లూ! ఈ గోల తప్ప మీ ఇద్దరికీ ఇంకేమీ ఉండదా?! ఇప్పుడు ఈ అద్దె ఇల్లు బాగానే ఉంది కదా?! అన్ని డబ్బులూ ఖర్చు పెట్టేస్తే ముందు ముందు మనం ఎలా బ్రతుకుతాం? చెప్తే అర్థం కాదా మీకు?”  ఆ గది గోడలు బీటలు వారుతాయేమో అనిపించేటట్టుగా అరిచి చెప్పింది రమ్య.

తన్నుకొస్తున్న దు:ఖాన్ని కష్టం మీద ఆపుకొంటూ ఆఫీసులకు బయలుదేరారు ఆ దంపతులు.

ఆ సాయంత్రం కాలింగ్ బెల్ వింటూనే పరుగు పెడుతూ వచ్చింది రమ్య. “అమ్మా, నాన్నా! శుభవార్త. ఫిలడెల్ఫియా నుండి మావయ్య ఫోన్ చేసాడు. ఎల్లుండి సాయంత్రానికి విమానం దిగి సరాసరి మన ఇంటికే వస్తాడట.”

ఆ మాటకు మహీధర్, వసుమతిల ముఖాలు సంతోషంతో విప్పారాయి.

“ఏదో పని మీద వస్తున్నాడేమో కరుణాకర్.” అన్నాడు మహీధర్.

“వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడేమోలెండి. వాడికి ఎక్కువ రోజులు సెలవు దొరకదు కదా!” వసుమతి చెప్పింది.

“మరి డాక్టరంటే ఏంటనుకున్నావ్? ఎంత మంది పేషెంట్లు మావయ్య కోసం ఎదురుచూస్తారో ఏమో కదా! కానీ ఈసారి అత్త, పిల్లలతో సహా కలిసి వస్తున్నాడట. ఇక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్లో రీసెర్చ్ ఏదో చేసేందుకు. ఆరునెలలూ కూడా మన ఇంట్లోనే ఉంటాడు ఎంచక్కా!” చిన్నపిల్లల్లా సంతోషపడిపోతూ చెప్పింది రమ్య.

వాళ్ళంతా అనుకున్న రోజు రానే వచ్చింది. మహీధర్ కుటుంబమంతా ఎయిర్ పోర్టుకి వెళ్ళి టాక్సీలో అందరినీ తీసుకొచ్చారు.

మావయ్యను, అత్తను, పిల్లలనూ చూసి రమ్య పడిన ఆనందం అంతా ఇంతా కాదు.

ఇంట్లోకి రాగానే అందరినీ సాదరంగా ఆహ్వానించి, “రండి మావయ్యా, అత్తా! ఒరేయ్ టింకూ, పింకీ నాతో లోపలికి వస్తే మనం మంచి కాఫీ తయారుచేద్దాం.” అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది.

వెళ్తున్న కూతురి వైపు చూస్తూ సంతోషంగా చెప్పింది వసుమతి, “చాలా కాలం తర్వాత రమ్య ముఖంలో ఇంత వెలుగు చూస్తున్నా తమ్ముడూ! చాలా థ్యాంక్స్. నీక్కూడా పల్లవీ!”

“అయ్యో, దానికేముంది వదినా! ఈయన చాలా రోజులనుండీ వద్దామనే అంటున్నారు. ఇన్నాళ్ళకు ఇలా కుదిరింది.” నవ్వుతూ బదులిచ్చింది పల్లవి.

“ఆరునెలలంటే పిల్లలకు చదువు ఇబ్బంది కాదా?” మహీధర్ అడిగాడు.

“లేదు బావగారూ, పిల్లలు ఓ నెల తర్వాత వెళ్ళిపోతారు. నాతో పని చేసే మోహన్ అనే కొలీగ్ కూడా వచ్చే వారం వాళ్ళ ఊరు రాజమండ్రి వస్తున్నాడు. అతను మరో నెలలో వెళ్ళిపోయేటపుడు పిల్లలను తీసుకుని వెళ్తాడు. అతని ఇల్లు, మా ఇల్లు దగ్గరే. వాళ్ళ కుటుంబం, మా కుటుంబం అక్కడ చాలా సఖ్యంగా ఉంటాం. అచ్చం అన్నదమ్ముల్లాగే మా ఇళ్ళలో రాకపోకలు, విందు వినోదాలు ఉంటాయి. మేం వెళ్ళేవరకూ పిల్లలను చూసుకుంటామని హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ చదువుకు ఏ ఆటంకమూ ఉండదు.

“అక్కడ నీకు కాలక్షేపం ఎలా పల్లవీ?” అడిగింది వసుమతి.

“నేను కూడా అక్కడి లింకన్ యూనివర్సిటీలో పీజీ చేసాను వదినా! త్వరలోనే ఉద్యోగం కూడా రావొచ్చు.” పల్లవి చెప్పింది.

“చాలా సంతోషం. దాదాపు అయిదేళ్ళ తర్వాత ఇలా మీరు రావడం ఎంతో బావుంది. రమ్యకు కూడా మీరు గడిపే ఆరునెలలు సంతోషాన్ని కలిగిస్తాయి. మాకూ ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది.” మహీధర్ చెప్పాడు.

“అదేం మాట బావగారూ, ఎప్పటినుండో వద్దామనుకున్నది ఇన్నాళ్ళకు సాధ్యపడినందుకు మాకూ చాలా ఆనందంగా ఉంది.”

“హాయ్…. కాఫీ రడీ!” హుషారుగా ట్రేలో పెట్టిన కాఫీ కప్పులతో వచ్చి చెప్పింది రమ్య.

మూడు నెలలు గడిచాయి.

***

పిల్లలతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఓ నెల చాలా త్వరగా, సంతోషంగా గడిచిపోయింది. పిల్లలిద్దరూ తిరిగి వెళ్ళిపోతున్నందుకు అంతా బాధపడినా కరుణాకర్, పల్లవి ఉండడంతో ఊరడిల్లారు. ఎప్పుడూ ఒంటరిగానే గడిపే రమ్యకు వాళ్ళతో గడపడం ఉల్లాసంగా ఉంది. మొదటినుండీ రమ్యకు మావయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుండీ అతని దగ్గరే ఎంతో గారబం. మావయ్యకు తగిన భార్య అత్తయ్య పల్లవి. ఆమె కూడా ఎంతో స్నేహంగా ఉండడంతో రమ్యకు చాలా సంతోషంగా రోజులు గడుస్తున్నట్టుగా తోచింది.

ప్రతిరోజూ మధ్యాహ్నం వరకూ మధ్యాహ్నం వరకూ కరుణాకర్ ఇంట్లో ఉండి హాస్పిటల్ కి వెళ్ళడం, ఆ తరువాత  రమ్యతో పాటు ఉండి పల్లవి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉండడం దినచర్యగా మారింది. తెలియండానే మరో మూడునెలలు గడిచిపోయాయి.

ఇప్పుడు మావయ్య అంటే ఎంత ఇష్టమో పల్లవి అంటే కూడా అంతే ప్రాణప్రదమైపోయింది రమ్యకు. కూతురిని అంత ఉత్సాహంగా చూస్తున్న మహీధర్, వసుమతిల సంతోషం అంతా ఇంతా కాదు.

ఓ రోజు ఆఫీసుకు మహీధర్, వసుమతి ఆఫీసుకు వెళ్ళిపోయారు.

రమ్య, పల్లవి, కరుణాకర్ హాల్లో కూర్చుని ఉన్నారు. “రమ్యా! ఓ విషయం అడుగుతాను ఏమైనా అనుకుంటావా?” ఉన్నట్టుండి అడిగాడు కరుణాకర్.

“అడుగు మావయ్యా, దానిదేముంది?” తొణక్కుండా చెప్పింది రమ్య.

“కొంచెం వ్యక్తిగతమైన ప్రశ్న. అత్తను లోపలికి వెళ్లమందామా?” అడిగాడు కరుణాకర్.

“అయ్యో మావయ్యా, అత్త బయట మనిషి కాదు కదా! పర్వాలేదు ఉండనీ!” నొచ్చుకుంటూ చెప్పింది రమ్య.

సంతృప్తిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కరుణాకర్, పల్లవి.

“చాలాకాలంగా ఎందుకని నువ్వు పెళ్ళి చేసుకోను అంటున్నావ్?”

“ఏమో మావయ్యా! నాకు ఇష్టం లేదు.” ముక్తసరిగా చెప్పింది రమ్య.

“మరి ఉద్యోగం కూడా చెయ్యనంటున్నావేం?”

“అది కూడా ఇష్టం లేదు నాకు.” మళ్ళీ అదే ముక్తసరి సమాధానం!

“పెళ్ళి చేసుకోవు. ఉద్యోగం చెయ్యవు. పోనీ అమ్మానాన్నలు ఇల్లు కొందామంటే కూడా ఒప్పుకోవెందుకు?”

“అమ్మానాన్నలు రిటైర్ అయ్యాక వాళ్ళకొచ్చే పెన్షన్ చాలదు కదా. దానికి తోడు వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా మావయ్యా! ఇప్పుడు వాళ్ళు దాచుకున్న డబ్బు, రాబోయే రిటైర్మెంట్ డబ్బు అంతా ఒకేసారి ఖర్చు పెట్టేస్తే చాలా కష్టమవుతుంది కదా!”

afsar-rajesh yalla

“వాళ్ళ గురించి చాలా బాగా ఆలోచించావు రమ్యా! ఎంత మంచిదానివో!” పల్లవి ప్రశంసకు రమ్య ముఖం వికసించింది.

“మంచి ఆలోచనే. కానీ ఒకటి ఆలోచించావా రమ్యా? నువ్వు పెళ్ళి చేసుకోనంటున్నావు. బీ టెక్ చాలా మంచి మార్కులతో పాసై కూడా ఉద్యోగం చెయ్యనంటున్నావు. ఉద్యోగం కానీ, పెళ్ళి కానీ లేకుండా ఉన్నప్పుడు ఇల్లైనా ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది కదా?!” కరుణాకర్ అడిగాడు.

“ఇల్లు కొని ఏం చేసుకోవాలి మావయ్యా?!” ముఖం దిగులుగా పెట్టి అడిగింది రమ్య.

“నువ్వేం అనుకోనంటే నేనొకటి చెప్పనా?! నీకు అమ్మానాన్నల మీద బాగా కోపం. అవునా?!” ప్రశ్నించాడు కరుణాకర్.

“అబ్బే అదేం లేదు మావయ్యా” ఇబ్బందిగా సోఫాలో కదిలింది రమ్య.

“నీకు కోపం ఎందుకో కూడా నాకు తెలుసు రమ్యా.” చాలా సౌమ్యంగా చెప్పాడు కరుణాకర్.

రమ్యకు మావయ్య మాటలకు కోపం రాలేదు. నిర్లిప్తంగా ఉండిపోయింది. అమావాస్య చీకటిలా ఆమె ముఖమంతా దిగులు అలుముకుంది.

“నీ మనసులో ఏముందో నాకు తెలుసు రమ్యా! అన్నయ్య చనిపోవడానికి అమ్మానాన్నలే బాధ్యులు. అదేగా నీ కోపానికి కారణం.” మృదువుగా అడిగాడు కరుణాకర్.

ఒక్కసారిగా రమ్య కళ్ళల్లో వరదగోదారిలా కన్నీరు పొంగింది. ఉబికిపెట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా విఫలం చేస్తూ దు:ఖం మరింత ఎక్కువై బిగ్గరగా రోదించసాగింది.

“ఊరుకోరా రమ్యా! బాధపడకు అన్నయ్య అలా చనిపోయినందుకు మాకూ చాలా బాధగా ఉంది. ఎంతో ఆహ్లాదంగా ఉండే మీ కుటుంబం ఇలా ఎడారిలా తయారైనందుకు మేము కూడా ఎప్పుడూ ఎంతో బాధపడతాం.” భుజం తడుతూ రమ్యను తన దగ్గరగా తీసుకుని పసిపిల్లలకు చెప్పినట్టుగా చెప్పింది పల్లవి.

మరో పావుగంటకు కానీ మామూలు మనిషి కాలేకపోయింది రమ్య. కరుణాకర్ కూడ ఆమె మరో పక్కకు చేరి చాలాసేపు ఓదార్చాక కానీ ఆమె నోరు విప్పలేదు.

“అవును మావయ్యా! అమ్మానాన్నలే అన్నయ్య మరణానికి కారకులు.” ఆమె ముఖంలో కోపం గోచరిస్తోంది.

“అలా అని ఎందుకు అనుకుంటున్నావ్?” ప్రశ్నించాడు కరుణాకర్.

“నీకు తెలిసినదే కదా మావయ్యా! చిన్నప్పటినుండీ అమ్మానాన్నలకు ఎంత చాదస్తమో! ఆ ఛాదస్తంతోనే వాడు ప్రేమించిన అమ్మాయికిచ్చి పెళ్ళి చెయ్యలేదు. అందుకే వాడి మనసు చెదిరి బలవన్మరణాన్ని ఆశ్రయించాడు అన్నయ్య.” ఆరిపోయిన ఆమె కన్నీటి చారికలు మళ్ళీ తడిగా తయారయ్యాయి.

“జరిగిన విషయం తెలిస్తే నీవు ఇన్నాళ్ళూ ఇంత విపరీతంగా ప్రవర్తించేదానివి కాదేమో!” పల్లవి చెప్పింది.

“ఏం జరిగింది?”

***

“ఏంటీ? ప్రేమించాడా నీ కొడుకు? నువ్వు తగుదునమ్మా అని సంబంధానికి బయల్దేరావా?” గుడ్లురిమి చూస్తూ భీకరంగా అరిచాడు ఫణీంద్ర.

రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా పలుకుబడి, దేశాన్నంతా పోషించగలిగిన డబ్బు కలిగిన వ్యక్తి ఫణీంద్ర.

“తప్పే అనుకోండి. కానీ మీ అమ్మాయి కూడా వాడిని బాగా ఇష్టపడుతోంది కదా ఫణీంద్ర గారూ. మనం కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బావుంటుంది కదా!” ఒప్పించేందుకు విఫల ప్రయత్నం చేసాడు మహీధర్.

“ఏం ఆలోచించాలి? తల్లిదండ్రులకంటే బాగా ఆలోచించగలరా పిల్లలు? తెలిసీ తెలియని వయసులో వాళ్ళు ప్రేమా గీమా అంటే దానికి సై అనేస్తే మన పెద్దరికం ఏమవ్వాలి? మంచీ మర్యాదా, కులమూ గోత్రమూ చూసుకోకుండానే అది ప్రేమించిన వాడి బాబుననంటూ నువ్వు రాగానే నేను తాంబూలం పళ్ళాన్ని పట్టుకుని స్వాగతం ఇవ్వాలా?!” కన్నెర్రజేస్తూ అరిచాడు ఫణీంద్ర.

“అది కాదు అన్నయ్యగారూ… మీరు కొంచెం పెద్దమనసు చేసుకుని ఆలోచించండి….”

“ఎవరు నీకు  అన్నయ్య? ముందు మీరు నోరుమూసుకుని బయటకు నడవండి. లేదా మా మనుషులు ఈడ్చుకుని వెళ్ళి అవతల పడేస్తారు.” బ్రతిమాలుతున్న వసుమతిని కూడా నిర్దాక్షిణ్యంగా తూలనాడాడు ఫణీంద్ర.

చేసేదేమీ లేక దీనవదనాలతో ఆ ఇంటినుండి బయటకు అడుగు వేసారు మహీధర్, వసుమతి.

“మళ్ళీ మీ వాడు మా అమ్మాయితో కనిపించాడో, అదే వాడికి ఆఖరిదినం అవుతుంది. గుర్తు పెట్టుకోండి.” వెనుకనుండి ఫణీంద్ర గర్జన వినవచ్చింది.

ఉసూరుమంటూ ఇంటికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ. ఇంటికి వస్తూనే ఆత్రుతగా అడిగాడు వినోద్. “నాన్నా వెళ్ళారా మాధురి వాళ్ళింటికి? ఏమన్నారు అంకుల్?!”

“వినోద్… నువ్వు మాధురిని ఇంక మనసులోంచి తుడిచెయ్యాలిరా!” బావురుమంది వసుమతి.

“నిజానికి నీ మీద ప్రేమతో కులమనే అడ్డుగోడను కూడా  తొలగించాలని నిర్ణయించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ సంవత్సరం క్యాంపస్ సెలెక్షన్ లో నాకు జాబ్ కూడా వచ్చేసింది కదా నాన్నా, మాధురి లేకుండా నేనుండలేను అని ఎంతగానో నువ్వు బ్రతిమాలితే నీ దిగులు చూడలేక వెళ్లాము. కానీ ఫణీంద్ర చాలా పలుకుబడి గల ధనవంతుడే కాదు… పరమ కర్కోటకుడు కూడా అని మాకు అర్థమయింది. మాధురి గురించి ఇక నువ్వు ఆలోచించకు నాన్నా! మరో మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్ళి చేస్తాం.” కొడుకును అనునయిస్తూ చెప్పాడు మహీధర్.

ఒక్కసారిగా పిడుగు మీద పడ్డట్టుగా చూసాడు వినోద్. కానీ కొద్దిక్షణాలలోనే మామూలుగా అయిపోయాడు.

“సరే నాన్నా. మీరు చెప్పినట్టే వింటాను.” అని తనగదిలోకి వెళ్ళిపోయాడు.

ఆ దంపతులిద్దరూ ఎంతసేపుండిపోయారో వాళ్ళకే తెలియనట్టుగా ఆ గదిలో మౌనంగా మిగిలిపోయారు.

“ఏంటమ్మా? అలా శిల్పాల్లా ఉండిపోయారు? ఏమయింది?” లోపలికి వచ్చిన రమ్య మాటలకు ఉలిక్కిపడుతూ ఈ లోకానికొచ్చారు వాళ్ళిద్దరూ.

“అన్నయ్య వచ్చేసాడా? ఏడీ?” అంటూ వినోద్ గది వైపు గబగబా వెళ్ళింది రమ్య.

మరుక్షణంలోనే కెవ్వు మంటూ అరిచింది రమ్య. పరుగులు పెట్టి వినోద్ గది దగ్గరకు చేరుకున్న మహీధర్, వసుమతిలకు అక్కడ కనిపించిన దృశ్యం- నేల మీద స్పృహ తప్పిపోయిన రమ్య, పైనుండి వేళ్ళాడుతూ ఉరిపోసుకున్న వినోద్ విగతశరీరం.

***

అన్నయ్య మరణానికి జరిగిన సంఘటనలు అప్పుడే తెలిసిన రమ్య తెల్లబోయింది. తిరిగి దు:ఖంతో తల్లడిల్లిపోయింది.

“చాలా తప్పు చేసాను మావయ్యా! అమ్మానాన్నలను నా పిచ్చి ప్రవర్తనతో, మొండితనంతో చాలా బాధ పెట్టాను.” ఏడుస్తూ చెప్పింది రమ్య.

“అవును రమ్యా. వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. తాము చనిపోయాక నీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని బాగా మనోవేదనతో ఉన్నారు ఇద్దరూ.  ఒకరోజు  అమ్మ నాకు ఫోన్ చేసి ‘నాకు చనిపోవాలనుందిరా తమ్ముడూ, ఆయనకూ ప్రాణాల మీద ఆశ లేదు. రమ్యకు కూడా ఇంత విషాన్ని పాలల్లో కలిపి ముగ్గురం ఒకేసారి చనిపోతే ఏ బాధా ఉండదు.’ అని హృదయవిదారకంగా చాలాసేపు ఏడ్చింది. తనను ఫోన్లో ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. ఇక్కడ మీరంతా ఏమైపోతారో అన్న ఆందోళనతో నాకు నిద్ర పట్టేది కాదు. అందుకే అత్తను కూడా తీసుకుని ఇలా వచ్చేసాను.” చెప్పాడు కరుణాకర్.

“మరి వాళ్ళను ఇంతగా నేను వేధిస్తున్నప్పుడు కూడా అమ్మానాన్నలెప్పుడూ ఇలా జరిగిందని నాకు చెప్పలేదేంటి మావయ్యా?!” వెక్కి వెక్కి ఏడుస్తోంది రమ్య.

“చెప్పే అవకాశం ఎప్పుడిచ్చావ్ రమ్యా?! అసలు ఇప్పుడు మాట్లాడుతున్నంత సౌమ్యంగా నువ్వు ఇదివరకు ఎప్పుడైనా మాట్లాడావా? మూడు నెలల క్రితం ఈ ఇంట్లో మేం అడుగుపెట్టినప్పుడు కూడా వాళ్ళతో నీ ప్రవర్తన క్రూరంగానే అనిపించేది మాకు. నెమ్మదిగా ఇప్పుడు కాస్త మామూలుగా ఉంటున్నావు.” వివరించాడు కరుణాకర్.

“నిజమే మావయ్యా! ఇంతకాలమూ వాళ్ళను నేనెంత బాధపెట్టానో!” నొచ్చుకుంటూ చెప్పింది రమ్య.

“ఇలా జరిగింది అని మేము నీకు చెప్పడానికే మాకు మూడు నెలలు పట్టిందంటే నువ్వు ఎలా ఉండేదానివో అర్థం చేసుకో! అసలు మేము వచ్చిందే ఇందుకు.” చెప్పింది పల్లవి.

“మరి మావయ్య రీసెర్చ్?” ఆశ్చర్యంగా అడిగింది రమ్య.

“మావయ్య అక్కడ సైకియాట్రీలో రీసెర్చ్ చేసాకే కదా, ప్రొఫెసర్ అయింది? మళ్ళీ రీసెర్చ్ ఏముంటుంది చెప్పు?!” నవ్వింది పల్లవి.

“ఓ… నిజమే ఇక్కడ మెడిసిన్ చదివాక మావయ్య అక్కడ ఏం చదివారో నాకింతవరకూ తెలియదు అత్తా!”

“తెలియకపోవడమే మంచిదిలే. లేకపోతే నన్ను గుమ్మంలో కాలు పెట్టనిస్తావా నువ్వు?” నవ్వాడు కరుణాకర్.

“నిజమే!” అని అకస్మాత్తుగా ఏదొ ఆలోచన వచ్చినట్టు పల్లవి వైపు తిరిగి అడిగింది రమ్య, “లింకన్ యూనివెర్సిటీలో నువ్వెందులో పీజీ చేసావ్ అత్తా, నిజం చెప్పు?!”

నవ్వుతూ కరుణాకర్ జవాబు చెప్పాడు- “సైకాలజీ!”

“నీ రీసెర్చ్ కూడా నా మీద అయిపోయిందిలే అత్తా! డాక్టరేట్ వచ్చేస్తుందిలే!” తేలిక పడిన మనసుతో అందంగా నవ్వింది రమ్య.

***

Download PDF

7 Comments

  • krishna says:

    నైస్ స్టొరీ సర్

  • V V Bharadwaja says:

    సర్, మీ కథ kaastabhinnamga వుంది కధనం ఆకట్టుకొంది .కానీ కథ లోపించింది, ముడిని బాగానే విప్పారు సున్నితంగా, మనసిఖంగా ఎదినిగ్న వాళ్ళుగా మావ్వయ్య అత్తా రమ్యని mariyu ఇంటి వాతావరణం పసిగట్ట గల నేర్పు వారి రీసెర్చ్ బాగా పనిచేసింది. ఇంకా మంచి kathani ఆశించా, కొండని తవ్వారు……అల్ల్ ది బెస్ట్ రాజేశ్గారు.

    • Rajesh says:

      ధన్యవాదాలు భరద్వాజ గారూ!

      ఈ కథను మలచడంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినది అని నాకూ అనిపించింది. సున్నితమైన మీ వ్యాఖలకు మరోసారి కృతజ్ఞతలు.

  • కథ చెప్పిన పధ్ధతి బాగుంది

  • Venkata S Addanki says:

    chaalaa baagaa raasaaru మీ కద రాజేష్ గారు, గుడ్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)