అపుడు కరెంటుండ్లేదు!

అపుడు కరెంటుండ్లేదు. తెల్లారి మూడుగటల్కే లేసి మా నాయినావాళ్లు కపిలిబాన దాని సరంజామా అంతాతీసుకోని,ఎద్దులు తోలుకోని,సేన్లకి నీళ్లు తోలేదానికి పోతావుండ్రి.

దూళి దూళి మబ్బున్నట్లే మాయమ్మ,అన్నయ్య,అక్కయ్యావాళ్లు లేసి ఎనుములు(బర్రెలు)ఇంట్లోనుంచి బయటకట్టేసి,ప్యాడ తిప్పకిమోసి,గంజుతీసి పారబోసి పాలు పిండతావుండ్రి. అయిదుగంటల్కే ఇందూపురమ్నుండి పాలోడొచ్చి సేర్తోకొల్సి సైకిల్లో తీసుకుపోతావుండె.ఏడుగంటల్కి ఇసుకూలుమొదలయ్యి పదిగంటల్కి ముగుస్తావుండె.అపుడు ఇసుకోలు పిళ్లోళ్లంతా ఎనుముగొడ్లు మేపుకోనొచ్చేకి పోతావుంటిమి.

సానామంది రెడ్డ్ల ఇండ్లల్లో పనులుసేసేకి,సేద్యాలు సేసేకి, జీవాలుమేపేకి జీతగాళ్లు(సంబళగాళ్లు)వుంటావుండ్రి(ఎక్కువగా మాదిగలు ఒకసారి పెళ్లికో,జాత్రకో,ఇతరఖర్చులకో కొంత అప్పుచేసి,దానికి హామీగా వారిపిల్లల్ని చాకిరీకి వుంచేవారు దాదాపు 1977(ఎమర్జెన్సీ) వరకూ ఈపద్ధతి వుండేది). మాఇంట్లో అన్నిపన్లూ మేమేసేయల్ల.

వుప్పర నరసిమ్ముడు, పింజిరి పీరూగాడు,బేల్దారి అస్వత్తుడు,మురవోడు,నేను ఎనుముల జతగాళ్లు.వాటిమింద కూకోని గుర్రాలమాదిరీ ఎగిరిస్తావుంటిమి. అపుడు వాన్లు బాగకురుస్తావుండె. పొలాల్లో పంట్లు,కాణాసిల్లోగడ్డి పెరుగుతూనే “కట్” సేసినట్ల తప్పెటకొట్టి సాటింపేస్తావుండ్రి. ఇద్దురు ముగ్గురు కావలిగాల్లు పొలిమేర్లకానా గస్తీతిరుగుతావుండ్రి.పంట్లు కోసేవొర్కూ జీవాలు పోగూడదు,గడ్డికోయగూడ్దు.అట్లసేస్తే జూల్మానా ఏస్తావుండ్రి. బందుల్ దొడ్డికి తోల్తావుండ్రి.

అందుకే మేము బాటపక్కకి తోల్తావుంటిమి. సుక్కురువారుము ఇందూపురంసంత.సుట్టూపక్కల వూర్లజనాలంతా పొద్దుట్నుంచి రాత్రిఒరుకూ ఇసకేస్తే రాల్నట్ల పోతావుండ్రి.ఒగరిద్దరు రెడ్లు,కోమిటి లెచ్చుమయ్య మాత్రమే పావళాఇచ్చి జట్కాలో పోతావుండ్రి.

వుప్పరనరసిమ్ముడు బొలే కిల్లేకిత్తిరిగాడు. బోకుల్ని రెండణాలమాదిరీ(అప్పుడు పగలంతాపనికి రెండణాలకూలి.12పైసలు) తయారుసేసి పాతబట్టల్ని కర్చీపుల్మాదిరీసించి మూటగట్తి దావలో ఏస్తావుండె.శానామంది దుడ్లే అనుకోని అక్కడిక్కడసూసి ఎత్తుకుపోతావుండ్రి.సెట్లమరుగ్లో దీన్నిసూసి కడుపులు పగిలేతట్ల నగుతావుంటిమి.

మావూర్లపక్క యాడసూసినా సెరుకుతోట్లే!! బెల్లాన్ని బండ్లకినింపి మండీలకి తోల్తావుండ్రి.వాళ్లని అడిగితేసాలు తినే అంతబెల్లమిస్తావుండ్రి.ముందుగానే సంటకుపొయ్యి తిరిగొచ్చే వాళ్లనడిగితే బొరొగులూ కారంబూందీలు పెడతావుండ్రి.ఈపన్లు నరసిమ్ముడు,మురవోడు సేస్తావుండ్రి.

ఒంటిగంటకి సైరన్నుకూస్తావుండె.అవుడు ఎనుముల్ని గుంతల్లోకో సెరువులోకో దించి నల్లగా నిగనిగలాడేతట్ల కడిగి ఇంటికి యల్బార్తావుంటిమి.రెండుగంటల్కి పాలోడొచ్చేటయానికి మద్యాన్నంబెల్లుపడతావుండె. గోదుమరవ్వతో వుప్పుమా,పొవుడరుపాలూ ఇస్తావుండ్రి.రవ్వంత సదువవుతూనే ఇసుకూలు తోటకి సెరువునీళ్లు మోస్తావుంటిమి.

ఇంటికిపొయ్యినంక కట్లికి(వంటచెరుక్కు) పోవల్ల. ఆకాలంలో మావూరిదగ్గర తిండికన్నా కట్టెలకరువుశానా. ఈత తట్టెల్తీసుకోని జొన్నకొయ్యలు,కందికొయ్యలు,సన్నబన్న గబ్బుసెట్లు ఏరుకోని తెస్తావుంటిమి. తిరగ ఇంటిముంద్ర,పసువులకిందా కసువు సిమ్మల్ల.ఎద్దులకి సొప్ప,అగిశాకూ తినిపించల్ల. కుడితికి,ఇంటికి కావల్సినన్ని నీళ్లు బాయినుంచి సేదల్ల.(కొన్నిపన్లు నావరకూవచ్చేవికావు.అప్పుడు అందరు దాదాపు చేయాల్సినపనులు చెబుతున్నాను) రాగులు ఇసరల్ల,జొన్నలు వొడ్లుదంచల్ల సన్నపిళ్లోల్లని ఎత్తుకోవల్ల. లాటీన్ల(ల్యాంపుల) చిమిలీలమస్సితుడుసల్ల. సీమనూనె పోయల్ల,తావదీపం పెట్టేకి ప్యాడ తేవల్ల. ఏడుగంటల్కే బువ్వతినల్ల.

కడుపుకు సరయిన కూడులేక మేము సస్తావుంటే వానెమ్మ!!

నల్లుల బాదయాలసెప్పల్ల.ఇంటి నడిమద్య సాపలు,గోనిసంచులు పర్సుకోని అవిరాకుండ సుట్టూర కోటమాదిరీ రాగివుబ్బళ(రాగులమీది పొట్టు),మూటకట్టాకు(వరిమడికోశాక మొలిచే బంకబంక ఆకులుండేకలుపుమొక్క) ఏసుకొంటా వుంటిమి.జనాల రగతం తాగేదానికేమో!! అవి శానాతెలివయిన్వి.పక్క గోడ్లు,తడకలూ ఎక్కి మేలాటం (టాపు)మీద్నుంచి మిందకి దుముకుతావుండె.

నీళ్లు పోసుకోనేది, బట్టలిడిసేది ఒగవారం లేటయితేసాలు బట్టల్నిండా కూరేగంట్లు(చీర పేన్లు) ఇంకాకొంద్రు బీదాబిక్కీ జనాలకి పీడ పేన్లు పడతావుండె.అవి సంకలకింద,తొడలమద్య,కన్రెప్పల్కి అతుక్కోని గోరుల్తో గీకినా కనిపిస్తావుండ్లేదు.ఇట్ల అర్దం రగతం అవేతాగుతావుండె.

పున్నమికోసరం నెలంతా ఎదురుసూస్తావుంటిమి. యాలంటే ఆపొద్దు రాత్రిలో ఎలుగుంటుంది. యంతసేపయినా ఆడుకోవొచ్చు. ఆడపిల్లోల్లు మగపిళ్లోల్లు కల్సి సల్లేమల్లే గుడ్లు( చల్లే మల్లెల కుప్పలు-ఎంత అధ్భుతమైన పేరోకదా!!)పెద్దోళ్లు వుప్పురపెట్టెలు- ఆట్లు ఆడ్తావుంటిమి.

ఏమాట్లాడినా మానాయిన లేకుంటేనే!! ఆయప్ప కతలు ఇంగొగ సారిసెప్పుతాను. మాయన్న ఇంట్లో వుంటే నేను మాయమ్మకి సిక్కల్ల. నీళ్లు పోపిచ్చుకోవల్ల. పేన్లు సూపిచ్చుకోవల్ల. ఈపిలు(పేల గుడ్లు)ఈరబానితో ఈరిపిచ్చుకోవల్ల. గోర్లు కత్తిరిచ్చుకోవల్ల. పండుకొంటే ఇసనగర్రి తోఇసరుకొంటా కూకోవల్ల.

మాఇల్లు యట్లున్నిందో రవ్వంత సెప్పుతాను. అట్లాఇల్ల యాడన్నావుందేమో అని శానాఏండ్లు యెదికినా కనపడ్లేదు. నేను పుట్టేకి ముందే మాయప్పప్పా(చిన్నాయన) మానాయినా యారేపొయ్యిండారు. సుట్టూ ఇటికెలగోడ దానిమింద సెరుకు సోగల కప్పడము మాసిన్నాయనది.దాని పక్కలోనే సుట్టూ టెంకాయ గర్రుల తడకలు.ఆడ వానొస్తే ఈడకారేసోగలకప్పడము మాది.వాకిలికూడా తడకే.కుక్కలు,కోళ్లు,పిల్లులు,మేము యాడ్నుంచీ అయినా దూరి లోపలికిపోవొచ్చు.అందుకే మాయమ్మ శార,సంగటి,మజ్జిగ..అన్నీ వుట్టిమిందే ఎత్తిపెడ్తావుండె.

అది కూటికరువుకాలము. జనాలు పుట్టిండేది తినేదానికే అనిపిస్తావుండె. మేము అయిదారుమంది పిల్లోల్లు. వుండేది ఒగతట్ట. మాయమ్మ సంగటి కెలుకుతూనే తెడ్డు సుట్టూసేర్తావుంటిమి. అందురూ ఒగే తట్ట సుట్టూసేరి-నువ్వుముందో నేనుముందో-అన్నట్ల తింటావుంటిమి. వేరే ఇండ్ల్లో ఆడోల్లు మగోల్లు కూడా ఒగేతట్లో తింటావుండ్రి.

మానాయిన ఇపరీతంగా బీడీలు తాగుతావుండె.(గణేష్ బీడీలు) సాయంట్రమౌతూనే వాళ్లూ వీళ్లూ వొచ్చి మాగుడిసితాకొస్తావుండ్రి. వాల్లకి రాజకీయాలు,బారతంకతలు,దేశాలుతిరిగి సూసిన సంగత్లన్నీ సెప్పుతావుండె.మద్యాలో బీడీ ఆరిపోతే బుడ్డీలోనో,పొయ్యిలోనో అంటిచ్చుకు రమ్మని సెప్పుతావుండె.అది యంతసేపటికీ అంటుకోకుంటే నోట్లో పెట్టుకోని ఒగ పీక పీకుతావుంటి.

ఒగదినము గుంతులో పగసేరి తగ్గొస్తే అది సూసి జుట్టుపట్టుకోని వంగబెట్టి కొట్టింది ఇంకాబాగ గురుతుంది.

అట్ల బీడీలు తాగీ తాగీ నోరు సెడిపోతావున్నేమో. మాయమ్మ యంతబాగ శార సేసినా రుసీ పసీలేదని గలాటకి పెట్టుకొంటావుండె.గిన్నిచ్చి నన్ని ఇండ్లంటీ తరుముతావుండె.ఒగొగుదినము ఒగొగు ఇంటికిపొయ్యి శార పోపిచ్చుకొస్తావుంటి.ఇండ్లతాకిపొయ్యి అడుక్కుతినేవోళ్లమాదిరీ అడిగేకి, నాకి శానాసిగ్గి. పోకుంటే ఏట్లు.మేం పదిమంది సంతానం. మా అక్కయ్య ఇద్దరన్నయ్య గార్లూ శానా పెద్దోల్లు. ఇంకిద్ద రన్నయ్యగార్లూ సచ్చిపొయ్యిండారు.(వాళ్లు యట్ల సచ్చిరో తిరగ సెప్పుతా) ఇంకిద్దరు తమ్ముల్లూ, సెల్లెళ్లూ శానా సన్నపిల్లోళ్లు.అందుకే సన్నాబన్నా పన్లన్నీ నామిందే పడ్తావుండె.

-సడ్లపల్లె చిదంబరరెడ్డి

Download PDF

5 Comments

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)