కథ ఒక instant మాత్ర!

10994836_409436082540368_611743555_n

 

కథకుల అంతరంగం గురించి కొత్త శీర్షిక 

~

చిన్నప్పుడు చదివే అక్షరాల్లో…కథలైతే వాక్యాల వెంట కళ్ళు పరుగుతీయడమూ, వ్యాసాలైతే నత్తనడక సాగి కళ్ళు మూతపడడమూ- ఇదీ వరస! కథ పూర్తయ్యాక కూడా ఆ పాత్రలూ సంభాషణలూ నా మనసులో ఒక మూవీలా పదేపదే కదలడం, కొన్నిసార్లు ఆ పాత్రలు తమ కథాపరిధులుదాటి ఇంకా నా ఆలోచలనలో కథ ఇంకొంత కొనసాగి ఇంకో ముగింపు ఇవ్వడం, కొన్నిసార్లు ఆ పాత్రలు నా కలల్లో రావడం…. ఇలా జరుగుతూ ఉండేది. అందుకేనేమో కథలు మనసులో ఆలోచనలు రేగడానికి ఒక బలమైన సాధనం- అనే భావాన్ని బలపరిచాయి. ఉదాహరణకు రంగనాయకమ్మ ‘కాపిటల్’ కన్నా ‘జానకివిముక్తి’ ద్వారా అర్ధం చేసుకున్న వర్గపోరాటమే ఎక్కువ. నా ప్రాపంచిక జ్ఞానాన్ని పక్కన పెడితే సోషల్ వర్క్ చదువు, ఆ తర్వాత ఎన్. జీ. వో ల్లో నేను చేసిన ఉద్యోగాలూ, గాక, కథలు కూడా నన్ను ప్రభావితం చేసాయి. కథలవల్ల నా ఆలోచనలు హద్దులుదాటి ఎగిరాయి.

మరి నవల కాదా అంటే? అది కూడా. కానీ కథే నవల కన్నా బలమైనది. కథ ఒక instant మాత్రలాంటిది. కాంటెంపరరీ జీవితాన్ని అంత బ్రిస్క్ గా సాహిత్యం లో అద్దం పట్టే సాధనాలు కథలూ, కవితలూ. చదివడానికి తేలిక అనే కాదు. లౌకికంగా ఇప్పటి జీవన విధానంలో రచయితకూ పాఠకుడికీ చాలా వెసులుబాటిచ్చేది కథలే. రచనను త్వరగా పూర్తిచేసే వెసులుబాటు రచయితకు ఉంటే, అంతే త్వరగా చదివి విశ్లేషించగలిగే వీలు పాఠకుడికి ఉంటుంది. అయితే,  నాలుగు నుంచి పది పేజీల్లో కొన్ని పాత్రల సృష్టించి, వాటికో వ్యక్తిత్వాన్నద్ది, కాస్త ఎమోషనల్ సర్కస్ పకడ్బందీగా చేయించి మన పరిమిత ఆలోచనలలో చెక్ పెట్టడం చిన్న విషయమేమీ కాదు.

నాకు సాహిత్యపు బాటలో కథ ఒక కంపల్సివ్ మార్గంగానే తోచింది తప్ప ఎంచుకున్న మాధ్యమం కాదు. ఇంకోరకంగా వ్యక్తీకరించడం చేతగాకపోవడంవలన కూడాగావొచ్చు! సరే, రాయగలిగే సామర్ధ్యం, జీన్స్ ఉన్నాయని పదేపదే రెచ్చగొట్టారు సాహితీ శ్రేయోభిలాషులు. ఇక నేనూ కాస్త రాసాను. పొగడ్తకు పొంగిపోయి, ఉత్సాహం చల్లారాక దానికి ఆవల ఏంటో ఆలోచిస్తున్నాను. ఈ కథ అవసరం ఎంతుంది, ఎవరికి ఉపయోగం వగైరా…

రాస్తున్న కొద్దీ అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటికీ నిజంగా ప్రచురితమైనవి నాలుగు కథలే. కానీ ప్రతీసారీ అనిపిస్తుంది. ఇంకా చాలా పార్శ్వాలు కదలాలి. బోల్డన్ని పొరలు తొలచాలి. ఖలీల్ జిబ్రన్ అన్నట్టు దుఃఖ్హమూ, సంతోషమూ, ఆనందమూ, విషాదమూ, దయా, క్రూరత్వమూ, ఉన్నతమూ, నీచమూ ఇవన్నీ మనిషి ఆలోచనా స్రవంతిలో భాగాలే. ఇవి ప్రతిపాత్రలో కదలాలి. మానవత్వమనే మాట మనిషి తనకు తాను ఇచ్చుకుంటున్న మంచిపేరనీ, కాని మానవ మనుగడ అవసరం మీదే, ఇంకా చెప్పాలంటే సర్వైవల్ మీదే ఆధారపడి ఉంటుందనే నిజాన్ని చాటి చెప్పగలగాలి.

IMG_9390

స్వాతి కుమారి ఒక కథలో చెప్పినట్టు, ఇప్పటి సమాజపు నైతిక, అనైతిక నియమాలకావలగా చూడగలిగి రాయగలిగితే సృజనకు ఒక అర్థం ఉంటుంది. ఈ విషయం అర్ధమవుతున్న కొద్దీ ఇదివరకు కన్నా ఎక్కువగా మనుషులను గమనించడం పెరిగింది. ఆ గమనింపులో నేను నాలోని మనిషిని గమనిస్తున్న సంగతి క్రమంగా అర్ధమైంది. సాధారణకథలూ, నీతికథలూ, పాత్రలుబుద్ధి తెచ్చుకున్న కథలూ- ఇలాంటి కథలు నెమ్మదిగా బోరు కొడుతున్నాయి. looking and thinking beyond- ఇప్పటి నినాదం నాకు. ప్రణయాలూ, వ్యక్తిత్వాలూ, వాదాలూ….దీనికి మించింది ఏది? జీవితం నిజంగా ఒక linear పద్ధతిలో సాగుతోందా? కథలో పాత్రలు ఒక కాన్షియస్ లాజిక్ తో ప్రవర్తించడం నిజజీవితంలో ప్రతీసారీ జరుగుతుందా?

కథలు జీవితానికి అద్దంపడతాయంటారు. కాని కథలో ప్రస్తావించే సమస్య మాత్రమె జీవితం కాదుగా..!   మరలాంటి విషయాలు చెప్పగలిగే intertwined కథ రాయాలనుందిప్పుడు. ప్రతీ సమస్యా రెండు రకాలుగానే ప్రవేశిస్తుంది జీవితంలో. ఒకటి వ్యక్తీ నుంచి, ఇంకొకటి సమాజం నుంచి. ఇది అర్ధంయ్యాక వేరే సమర్ధనలేమీ దృష్టినాకర్షించడం లేదు.

అంతూ పొంతూ లేని ఆలోచనా స్రవంతిని ఇలా మీ ముందు పెడుతున్నా.  అసలు ప్రశ్నకొస్తే కథల ద్వారా నా వ్యక్తీకరణ మారిందా అంటే నేను రాసిన నాలుగు కథల మధ్య సామ్యభేదాలే మార్పు. నిజజీవితంలో వ్యక్తీకరణ మార్పులు అంటే స్నేహితులూ, ఆత్మీయులే చెప్పాలి. కాని కథ రాద్దామన్న ఆలోచనలో, నా చుట్టూ ఉన్న భారపు విలువల గోడల్ని కూల్చేసాను. అందువల ప్రతీ ఘటనలోనూ ఏ విధమైన  వాదాన్ని బుజాన్నేసుకునే బాధ్యతను వదిలించుకుని కేవలం ఒక విషయం గానే వ్యక్తపరచగలుతున్నా. ప్రస్తుతపు భావఝారిలో లోకం లో ఏ మనిషి ఏ పని చేసినా నాకు  వాటి కారణాలు అర్ధం చేసుకుందామనే అనిపిస్తుంది. దాదాపు Frictionలో ఉన్న ప్రతీ మనిషిలోను ఒక helplessness, ఒక dependence కనిపిస్తుంది. ఆ Friction ను దాటుకుని వచ్చి నెమ్మదిగా తమకు తామే నిలబడగలిగే వాళ్ళను చూస్తే అద్భుతంగా ఉంటుంది.   తమాషాగా అది నాలో రచయితను ధైర్యస్తురాలిని చేస్తుంది.

 -అపర్ణ తోట 

 

Download PDF

6 Comments

 • You are such a beautiful reviewerof stories. I loved the way you reviewed the stories of other writers in the past! ఇప్పుడు మీ కథల గురించే, మీలో ఉన్న కథకురాలిగురించే, మీ ఆలోచనల తీరుగురించే, కథలవల్ల ఏం ప్రయోజనం అన్న అంశం గురించే రాయడం మొదలుపెట్టడం బాగుంది. రాయండి రాయండి.

  “కథ పూర్తయ్యాక కూడా ఆ పాత్రలూ సంభాషణలూ నా మనసులో ఒక మూవీలా పదేపదే కదలడం, కొన్నిసార్లు ఆ పాత్రలు తమ కథాపరిధులుదాటి ఇంకా నా ఆలోచలనలో కథ ఇంకొంత కొనసాగి ఇంకో ముగింపు ఇవ్వడం, కొన్నిసార్లు ఆ పాత్రలు నా కలల్లో రావడం…. ఇలా జరుగుతూ ఉండేది.” – నిజం!

  “ప్రస్తుతపు భావఝారిలో లోకం లో ఏ మనిషి ఏ పని చేసినా నాకు వాటి కారణాలు అర్ధం చేసుకుందామనే అనిపిస్తుంది.” — This confirms that you are looking and thinking beyond! ఎదుగుతున్నారు!!

 • mohan.ravipati says:

  ఇప్పటి సమాజపు నైతిక, అనైతిక నియమాలకావలగా చూడగలిగి రాయగలిగితే సృజనకు ఒక అర్థం ఉంటుంది. ఈ విషయం అర్ధమవుతున్న కొద్దీ ఇదివరకు కన్నా ఎక్కువగా మనుషులను గమనించడం పెరిగింది. ఆ గమనింపులో నేను నాలోని మనిషిని గమనిస్తున్న సంగతి క్రమంగా అర్ధమైంది. సాధారణకథలూ, నీతికథలూ, పాత్రలుబుద్ధి తెచ్చుకున్న కథలూ- ఇలాంటి కథలు నెమ్మదిగా బోరు కొడుతున్నాయి. జీవితపు లోతులు, సమాజం తీరుతెన్నులు తెలిసేకొద్దీ ఇలాంటి తెచ్చిపెట్టుకున్న నీతులు బోర్ కొడతాయి మరి :)
  జీవితం నిజంగా ఒక linear పద్ధతిలో సాగుతోందా? కథలో పాత్రలు ఒక కాన్షియస్ లాజిక్ తో ప్రవర్తించడం నిజజీవితంలో ప్రతీసారీ జరుగుతుందా? అలా జరిగితే జీవితానికి కథకు తేడా ఏముంటుంది , కథ, జీవితం రెండూ బోర్ కొట్టేస్తాయి :)

 • Good show. Keep writing.

 • చక్రధర్ says:

  చూద్దాం ( వెయిటింగ్) మీరనుకున్నట్టు ఏం కథలు రాస్తారో !! :)

 • Thirupalu says:

  //ఏ విధమైన వాదాన్ని బుజాన్నేసుకునే బాధ్యతను వదిలించుకుని కేవలం ఒక విషయం గానే వ్యక్తపరచగలుతున్నా//
  //“ప్రస్తుతపు భావఝారిలో లోకం లో ఏ మనిషి ఏ పని చేసినా నాకు వాటి కారణాలు అర్ధం చేసుకుందామనే అనిపిస్తుంది.” //

  ఇవి రెండు వాక్యాలు పరస్పర విరుద్దమైనవి గా నేను భావిస్తున్నాను. ఇక్కడ వాదం అంటే– ద్రష్టి, లేక దృక్పధం. ఇది లేకుండా ఎలా ? ఒక సంఘటనను అర్ధం చేసు కోవాలంటే ఇది కావాలిగా ! ఆ సంఘటనను ఆ దృక్పధం తో వ్యాక్యానిస్తున్నారు.
  ఇక రెండోది. కారణాలు అర్ధం చేసుకోవాలి అంటున్నారు. — అంటే సత్యాన్వేషణ మొదలు పెట్టారన్నమాట. ఈ సత్యాన్వేషణ తప్పని సరిగా మీ దృక్పదాన్ని అనుసరించే ఉంటుమ్దన్నమాట.

 • alluri gouri lakshmi says:

  విన్న కధల్ని విన్నట్టుగా ప్రెజెంట్ చేసే సందర్భం లో జుగుప్సా, వికృతత్వం చొరబడకుండా రచయితలం అందరమూ జాగ్రత్త వహించాలి.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)