ధ్వని

ముందుగా ఒక ప్రతిధ్వని :

గొప్ప ” కథ ” … చదివిన క్షణాల్లో ఉద్విగ్నత నీ.. చదివేసాక ఒక నిశ్శబ్దాన్ని .. తర్వాత తలచుకున్నప్పుడల్లా, కొన్ని క్షణాల పాటు , చదివి అర్ధం చేసుకొనే శక్తి ఉన్నందుకు కించిత్ గర్వాన్నీ కలగచేస్తుంది …” కథల మీద ఎప్పుడో రాసుకున్న ఈ వాక్యం గుర్తొచ్చింది “ధ్వని “ కథ చదవగానే-

ధ్వని గురించి రాయాలన్నా కూడా అదే రకమైన ఉద్విగ్నత, ప్లస్ కొంచం భయం కూడా వేసింది.. రాయగలనా అని !

డిస్క్లైమర్  : నేను రాసినవేవీ , నాకలాంటి భావాన్ని కలిగించలేదు .. ఎంత నేర్చుకోవాలో తెలుసుకున్నప్పుడు భలే హాయిగా ఉంది .. జీవితంలో ఇంకా వొంపుకోవాల్సిన విషయాలు గుర్తొచ్చి..!

ధ్వని  వివిన మూర్తి గారి కథ .. ఒక అంధత్వం ఉన్న ముస్లిం లాయర్ కథ , అతని సహాయకురాలిగా పరిచయం అయి, స్నేహితురాలిగా మారి, సన్నిహితంగా మారటానికి తటపటాయించే ఒకమ్మాయి సత్య కధ ..!

అంధత్వాన్ని, ఇస్లాం నా నేను’ లలో ముఖ్యమైనవి అని కథ మొదలెడతారు ఆయన ..! ధ్వని ఎంత అవసరం ? ఒక మనిషిని అంచనా వేయటానికి, కేవలం ధ్వనే ఆధారంగా బ్రతకటానికి అనే … కథలో మాటల్లో చెప్పాలంటే –“ చూడగల వాళ్లకి ముఖమే అన్నీ చెపుతుంది. వినగల వాళ్లకి స్వరమే అన్నీ చెపుతుంది. అమ్మీజాన్ మాట నాకు ఈమాన్. “ అనే ఈ Quintessential ప్రశ్న తో, ఈ కథ మొదలవుతుంది. చూపుల, కొలతల బేరసారాల్లో జీవితం కోల్పోయిన అమ్మాయి, ఆమె గొంతులో మెత్తదనాన్ని ఆస్వాదిస్తూనే, అనలైజ్ చేసి, శల్య పరీక్ష చేస్తున్న .. ఒకబ్బాయి ..!! నా కళ్ళ ముందు చాలా జీవితాలు కదిలాయి.

“ఆలోచనలు నడిచిన బాటలో విశ్వాసాలు మొలకెత్తవు”- అనుకొనే తండ్రి ఉన్నప్పటికీ, తండ్రి చెప్పాడని , లాయర్ జీవితంలోకి , వస్తుంది .. సత్య, ఆమె గొంతు అంత మెత్తగా .. కానీ, నిశ్శబ్దంగా , నోరు తెరచి చెప్పనప్పటికీ తనదైన నిశ్చితాభిప్రాయాలతో.. సత్య మాట్లాడక పోవటానికీ, లాయర్ కేవలం ధ్వని మాత్రమే వినటానికీ .. తనలోని లోపాన్ని కప్పి పెట్టేంత మాట్లాడటానికీ, తెలివితేటలు కలిగి ఉండటానికీ .. ఓహ్.. ఎన్ని పొరలు ఒకే మనిషిలో ..!

ఇదే కథలో ఎన్నో కాంప్లెక్సిటీలు కలబోసి పెట్టారు వివిన మూర్తి గారు – ఉదాహరణ కి మంచు లాంటి మౌనం కరిగిన సత్య మాట్లాడుతూ – “మా నాన్నకి కొన్ని మూఢవిశ్వాసాలు ఉన్నాయి. మనుషులను చూడగానే తనకు ఏర్పడిన తొలి అభిప్రాయంతో ప్రవర్తించటం వాటిలో ఒకటి. తొలి తెలుగు సాహిత్యంలో మహమ్మదీయుల పట్ల కనిపించే ఒక చిత్రమైన రొమాంటిక్ ఆరాధన మా నాన్నకీ ఉంది. అది మరొకటి.” – తన అభిప్రాయాల్ని ఇంత తెలివిగా పాత్ర ద్వారా చెప్పటం ..నాకొక లెర్నింగ్.

అదే సమయంలో , ఇంత తెలివైన అమ్మాయికి , ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించటం , కష్టం తమకొస్తే, బేలగా తయారవటం.. వేరేవాళ్ళ విషయంలో , అనలైజ్ చేసే , సాధారణ మనస్తత్వాన్ని .. సూచిస్తుంది.

సరిగ్గా అలాగే, వివాహానికి ప్రతిపాదించిన లాయర్ .. ఆమె కాదు అన్నట్టు సూచించగానే – తాను గుడ్డివాడు కాబట్టే ఆమె కాదంటోంది అన్నట్టు తొందర పడటం కూడా – సింపుల్ గా కనిపించే కాంప్లెక్స్ మెంటాలిటీ.

తమకి నచ్చింది తీసుకొని, ఆ ప్రకారం జడ్జ్ చేసే లాయర్ మనస్తత్వానికి శర్మ తో స్నేహం తాలూకా ఉదంతం  వొక ఉదాహరణ .

ఈ కథ నాకు కొంత అసూయని కలగజేసింది ..ఇంత బాగా రాయలేక పోయినందుకు. కానీ అదే సమయంలో , ఒక యార్డ్ స్టిక్ లా కూడా పనికొస్తుంది అనిపించింది. కథ నిండా ఉన్న సూక్తులు , కొంత ఇబ్బందిని కలుగజేసాయి.. అవసరం కానీ, కొన్ని కథలో బ్లెండ్ కాలేదు అనిపించింది.

వోల్గా రచనల ద్వారా వివాహ ప్రతిపాదన నాకు అంతగా అర్ధం కాలేదు .. కానీ, సత్య జవాబు మాత్రం చాలా నచ్చింది – “వివాహం వేరు. స్నేహం వేరు. కామం వేరు. ప్రేమ వేరు. ఈ నాలుగింటిలో ఒకదానికోసం ఒకటి చెయ్యటం తగదని నేను ప్రస్తుతం అనుకుంటున్నాను. నన్ను నమ్ము. వివాహం గురించి నాకున్న భావాలను నా మాటలు చెపుతున్నాయి.. నా భావాలు అంగీకరించొచ్చు.. చర్చించొచ్చు.. నిరాకరించొచ్చు.. కాని వాటిని నేను నా నిరాకరణకే వాడుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. దానికి కారణం.. నువ్వు వాచ్యర్ధం మీదకన్న ధ్వని మీద ఎక్కువ ఆధారపడటం. ”

వివాహమే కాదు, ఏ బంధమైనా .. వాచ్యార్ధం కన్నా ధ్వని మీద ఆధారపడితే, బోలుతనమే మిగులుతుంది అన్నదానికి ఇంతకంటే, గొప్ప వాక్యాలు రాయబడలేదు అని నాకు అనిపించింది.

ఇంత రాసి, లాయర్ పాత్రకి వొక పేరు పెట్టకపోవటం నాకు నిరాశని కలిగించింది .. కానీ , వికలాంగులకి అనేకాల్లో .. పేరు లేకపోవటం కూడా సమాజం సహజంగా తీసుకొనే విషయం.. కుంటి, గుడ్డి , మూగోడు .. ఇలా .. హ్మ్మ్ !!

చాలా వొంటరితనాలకి .. కేవలం వోటి గిన్నెల శబ్దం లా ద్వనించటమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు .. చాలా ఇజాలకి కూడా ..!

ధ్వని’ – చాలా తెలుగు కథల బోలుతనాన్ని , మెతకతనాన్ని , సున్నితంగా ప్రశ్నించే కధ ..!

-సాయి పద్మ

 ధ్వని 

vivina murthy

  -వివిన మూర్తి

నేను అనేకం. అందులో రెండు ముఖ్యం. నా అంధత్వం. నా ఇస్లాం.

ఈ రెంటిలో ఏది తెలిస్తే ఆమె నోరు మూత పడుతుంది.. ? ఏదితెలిస్తే మరింత పెద్దదవుతుంది.. ? ఆకాశంలో సగమైన మొగవాళ్లు మిగిలిన సగాన్ని తాకటంలో మలిన వాంఛలు తప్ప మరే అనివార్యతలూ ఉండవన్న ఆమె నమ్మకం వమ్మవుతుంది.. ? నన్ను తిడుతున్నావిడ పూలు నా ముక్కుకి తగిలాయి.. నాలాగే పొడుగు అయుంటుంది. నా పొడుగుని, నా వెడల్పాటి రొమ్ముని చూసి అమ్మీజాన్ లో ఆనందం వినిపించేది.. తతిమ్మా వారిలో ఖుదా కీ మర్జీ వినిపించేది. అసంకల్పితంగా ఆ పూల పరీమళాన్ని నా శ్వాస పీల్చుకుంది. ఆ శ్వాసే కాకుండా నా శరీరంలో ఏదైనా భాగం ఆమెకు తగిలి ఉండవచ్చు. అదీ నా అపరాధం.

ఆలోచనలు వేగంగా ఒకదాని మీద నుంచి ఒకటి దొర్లుతున్నాయి..
నేను ప్రతిస్పందించకముందే ఆమె బస్సులోని జనాన్ని, బహుశా మగ జనాన్ని నా దుశ్చర్యకు వెంటనే ప్రతిస్పందించమని వేడుకుంటోంది. అటునున్న జనానికి నా నల్ల కళ్లజోడు సందేహం కలిగిస్తోందనుకుంటాను. చేతిలో ఓ చప్పుడు కర్ర ఉండి ఉంటే వాళ్లకి ఆ సందేహం లేకుండా పోయేది.
ఆమె తిట్లకూ, జనం సందేహాలకూ, నా ఆలోచనలకూ ముగింపునిస్తూ… ఓ మెత్తని చెయ్యి, అంతకన్న మెత్తని స్వరం, ఆ వ్యక్తిత్వం నిండుకూ నింపిన గులాబి అత్తరులోంచి అప్పుడే బయటపడ్డట్టు… నాకు అల్లా ప్రసాదించిన నాలుగు జ్ఞానేంద్రియాలలో మూడింటిని ఒకేమారు ఉత్తేజితం చేస్తున్నట్లు… ఇక్కడ కూర్చోండి.. అని కూర్చోబెట్టింది.
“మంచిపని చేసావు కన్నా.. కూర్చోండి లాయరు గారూ..”.

2.

ఆ మెత్తదనం పేరు సత్య. ఆ సత్యను లోకంలోకి తీసుకు రావటమే కాకుండా, నా జ్ఞాపకాలలోనే నిక్షిప్తమై పోకుండా నా జీవితంలో కొనసాగే వీలు కల్పించినవాడు సూర్యచంద్రవర్మ.
గుడ్డి లాయరుని. ఎవ్వరైనా గుర్తుంచుకుంటారు. వర్మ నన్ను నా కారుతో సహా గుర్తుంచుకున్నాడు. మీరీ రోజున కారులో రాలేదేం- అదీ తొలి ప్రశ్న. కారులో వస్తుంటాను. రాగలను. రాగలపాటి అతి కొద్దిమంది భారతీయ ముస్లింలలో నేనూ ఉన్నాను. కాని నాకు బస్సు ఇష్టం. ధ్వనులు. చప్పుళ్లు. వాసనలు. స్పర్శలు. నవ్వులు. కబుర్లు. లోకం నాచుట్టూ వెచ్చటి దుప్పటి కప్పుతున్నట్లుంటుంది. అమ్మీజాన్ ఇచ్చిన ఆలోచనల చేతివేళ్లతో లోకాన్ని తాకుతున్నట్టుంటుంది.
కానీ- ఒక్కటే ముల్లులా పొడుస్తుంటుంది. అది లోకం తాలూకు జాలి.
కోర్టుకి వెళ్లి తొలి వకాలతు అందిస్తున్నపుడు జడ్జి –అయ్యో పాపం- అనుకునే ఉంటాడు. ఆ –అయ్యో పాపం- తనపై –అయ్యో పాపం-గా మారుతుందని నాకు కేసు అప్పగించిన వాడు నిశ్చితంగా అనుకున్నాడు. నాకందిన ధ్వని వాస్తవమై పోయింది.
నే దిగవలసిన చోటు వచ్చింది. నా సెల్ లోని జీపియస్ హెచ్చరిస్తోంది.
అందాకా కబుర్లు చెపుతున్న వర్మ నేనూ, సత్యా ఇక్కడే దిగాలి అని ప్రకటించి నా వెనకే దిగాడు. ఆ మెత్తటి చెయ్యి నాకు సాయంగా నా చేతిని పట్టుకుంది. ఆ చేతిని విదిలించెయ్యాలని…. మర్యాద నా చర్యను విదిలించి వెయ్యాలని..
కిందకు దిగాక-
“నేను పట్టుకోటం మీకు నచ్చలేదు.”
“మీరు పొడుగా?”
“ఏం- ఎందుకూ”- మెత్తదనం నశిస్తున్న గొంతు.
అదెందుకు నశిస్తున్నదో ఆ తర్వాత అర్ధమయింది. మన సంభాషణలో మనని మనం చెప్పుకోటానికి వెచ్చించే సమయం ఎదుటివాళ్లని మాటలని గ్రహించటానికి వెచ్చించంట. ఈ మాట నాకు అర్ధమయ్యేటట్టు ఆ తర్వాత కాలంలో సత్యే చెప్పింది.
“తెల్లవాళ్లకి నల్ల వాళ్లని చూస్తే లోకువ. పొడుగు వాళ్లకి పొట్టి వాళ్లని చూస్తే లోకువ. కాకపోతే జాలి.”
పద నాన్నా పోదాం.. ఆమె వెళ్లి పోతున్నట్టుంది మెత్తదనాన్ని వదిలేసినా వెంటబడుతున్న గొంతుతో.
ఉండమ్మా ఉండు.. అంటూ వర్మ కూతురుని వెంబడించాడు.
నాకా క్షణంలో కలిగినది ఆమె అనాగరిక ప్రవర్తనపై కోపం. నేను చెప్పినది కేవలం స్వానుభవం నుంచి ఏర్పరచుకున్న ఓ అభిప్రాయం. నేనలా నా అభిప్రాయాన్ని చెప్పటం నాగరికమేనని ఆ క్షణాన నా నిశ్చితాభిప్రాయం.
అంతటితో ముగిసిపోయే కథని వర్మ ఆరోజు మధ్యాహ్నం నన్ను కలిసి పొడిగించాడు.

3

సత్య జీవితంలో ఆమె ఎత్తు చాలా కష్టాలు తెచ్చిపెట్టింది. కోర్టు గడపను ఎక్కించింది. ఇంటర్నెట్ ద్వారా కుదిరిన సంబంధం. వధువు వివరాల్లో ఐదు అడుగులు అని రాసాడు వర్మ. ఫొటో చూసాడు. నచ్చింది. ఇంటికొచ్చి చూసుకున్నాడు. నచ్చింది. కులం గోత్రం డబ్బూ దస్కం అన్నీ సరిపోయాయి. అందరికీ అన్నీ నచ్చాక అడ్డేముంది.. పెళ్లై పోయింది. మూడు నెలల కాపురం వెలగ బెట్టాక అనుమానం వచ్చింది. కొలిచాడు. నాలుగడుగుల పదంగుళాలే ఉంది. దగా చేసారని కోర్టుకెక్కాడు. వివాహం చెల్లదని రద్దు చెయ్యాలనీ వాదన.
“నిజంగా..”
“ఈరోజు వాయిదా..”
“పిచ్చాడులాగున్నాడే..”
“నేను మాత్రం? ఉన్నదున్నట్టు వెయ్యొచ్చు గదా..”
“విడాకులకి ఆ కారణం చెల్లదు..”
“అతను విడాకులు అడగటం లేదు. 1955 హిందూ వివాహ చట్టం కింద ఫిర్యాదిని ప్రాడ్ చేసి వివాహంకి ఒప్పిస్తే అది చెల్లదని వాళ్ల లాయర్ వాదన.”
“-కోర్టు స్వీకరించిందా..”
“ఆయన గట్టివాడు. మా అల్లుడి దగ్గర మస్తుగా ఉంది డబ్బూ, పట్టుదలా..”
వర్మ చాలా వషయాలు చెప్పాడు.
మీడియా ఈ కేసుకి బాగా ప్రాధాన్యత ఇచ్చింది. చర్చ జరిపింది.
రెండు అంగుళాలు ఎక్కువ అని బొంకటం ఆడపిల్ల తండ్రికి శుక్ర నీతి వంటిదే అన్నారు కొందరు. పెళ్లి కోసం ఆడిన బొంకుకి పాపం ఉండదట. పేద్దపేద్ద అబద్దాల మధ్య బ్రతుకుతున్నాం- సముద్రంలో కాకిరెట్ట ఈ చిన్ని అబద్దం- అన్నారు సాధు నైతిక దృష్టితో కొందరు.
చిన్నదైనా పెద్దదైనా అబద్ధం అబద్ధమే. తప్పు తప్పే. చట్టపరంగా ఇది నేరంగా తేలినా మానినా తప్పే. కొన్ని తప్పులకు ఇహలోకంలోనే అనుభవిస్తాం. ఇక్కడ తప్పినా అక్కడ తప్పదు- అన్నారు కఠిన నైతిక దృష్టితో కొందరు.
ఎత్తు అతగానికి అంత ముఖ్యమైతే పెళ్లికి ముందు ఎందుకు కొలుచు కోలేదు. ఒక వస్తువును కొనుక్కునే ముందే దాని నాణ్యతనూ కొలతలనూ చూసుకోవటం వినియోగదారుడి బాధ్యత కదా – అని కొందరి ప్రశ్న.
ఒక వస్తువు తయారీ లోపముంటే దానిని వాడిన తర్వాత నిరాకరించటం వినియోగదారుడి హక్కు- అన్నారు కొందరు సమాధానంగా.
ఆడది వస్తువా- వస్తు నాణ్యతా పరిశీలన స్త్రీకి యుగయుగాలుగా అమలు జరుగుతూనే ఉంది – అన్నారు లింగ వివక్షతను లేవనెత్తుతూ కొందరు. అసలు కొనుగోలు అన్నది జరిగితే సొమ్మిచ్చి కొనుక్కునేది ఆడదే- అని కూడా చేర్చారు.
అందుకేగదా ఈనాడు చట్టాలన్నింటికీ స్త్రీ పరమైన వివక్ష, ప్రత్యేక రక్షణ.. ఈ కేసులో కూడా చట్టం మగవానికి న్యాయం చెయ్యదు- అన్నారు కొందరు.
దృశ్య, అక్షర మాధ్యమాలు రెండూ కొంత కాలం చర్చించి పాల్గొన్నవారికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాయి.
వర్మ చెప్పిన దానికి నా వివేచన జోడించి విన్నాను.
“మీరేమంటారు-” అన్నాడు వర్మ.
“నేను ముస్లింని. నాది ఇస్లాం”.- అన్నాను.
ఆయనను కంగు తినిపించాలని నేను అనలేదు. కాని ఆయన గట్టిగా ఆశ్చర్య పోయాడని – అంటే!?- అన్న ప్రశ్న వంటి స్వరం వినగానే గ్రహించాను.
“నాపేరుని బట్టి మీకు నా మతం తెలుసు. ఇస్లాం తెలుసా..”
“చెప్పండి..” అన్నాడు.
“విశ్వంలోని ప్రాణులూ, పదార్ధాలూ ముస్లింలే. అల్లా – ఆ విశ్వ ప్రభువు – ఆజ్ఞాపాలనకి లోబడి ఉంటాయి. ఆ దైవానికి స్వయంసమర్పణే ఇస్లాం… లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అన్న కలిమాను విశ్వసిస్తే ఇదంతా మరోలా అర్ధమవుతుంది..”
“ఇలాంటి విశ్వాసాలు హిందువులకీ ఉంటాయి. అన్ని మతాలకీ ఉంటాయి..” అన్నాడు మధ్యలోనే.
“మీరు హిందువులు కారా..”
“- నేను నాస్తికుడిని. అయినా నావిశ్వాస అవిశ్వాసాలకి దీనితో సంబంధం లేదు. మీరు అనేదానికీ నా కూతురు పరిస్థితి మీద మీ అబిప్రాయానికీ సంబంధం నాకు పూర్తిగా బోధ పడటంలేదు…”
“కొంత బోధ పడిందిగా.. అదేంటి..” అన్నాను
“లాయర్లు వాళ్ల మాటలు ఎదుటి వాళ్ల నోళ్లలో కుక్కి అదే కక్కేట్టు చేస్తారుట.. ఏముంది., అంతా కర్మ అనుకుని అనుభవించాలి.. అంతేగదా ఏ మతమైనా చెప్పేది.” అంటూ నవ్వి లేచాడు. వెళ్లేముందు నా చిరునామా పత్రం ఇచ్చాను. కాని అది అతను ఉంచుకుంటాడనీ ఉపయోగిస్తాడనీ అనుకోలేదు.
నాకు చాలా చికాకు కలిగింది. నేను అందరినీ అర్ధం చేసుకోవాలి. నన్ను అర్ధం చేసుకునీ ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చెయ్యరు. కావాలంటే జాలి పడగలరు.. ముస్లిం షరీఅత్ ఇలాంటి కేసు ఎదుర్కుంటుందా.. వివాహం ఒక ఒప్పందంగా భావించే సమాజానికీ, అది ఒక దైవనిర్ణయంగా భావించే సమాజానికీ – స్త్రీ ఎదుర్కొనే రక్షణ సమస్యలో ఉన్న తేడాపాడాల గురించి మాటలాడాలని నా ఆలోచన. ఒక నాస్తికుడికి హిందూ ఆస్తికుడి మీద ఉండేపాటి సహనం కూడా ముస్లిం ఆస్తికుడి మీద ఉండదు.
కాని ఆ గొంతు మెత్తదనం నన్ను వెన్నాడుతూనే ఉంది.
అమ్మీజాన్ విని ఫొటో లోంచి అంది.. చూడగల వాళ్లకి ముఖమే అన్నీ చెపుతుంది. వినగల వాళ్లకి స్వరమే అన్నీ చెపుతుంది. అమ్మీజాన్ మాట నాకు ఈమాన్.

4

నా మొబైల్ నాకు వచ్చిన ఈ-మైల్స్ చదివి వినిపిస్తోంది. ఆ సమయంలో వచ్చాడు వర్మ.
సత్య ఆత్మహత్యా ప్రయత్నం చేసింది… వర్మ చెపుతుంటే ఆయన గొంతు వణుకు తెలుస్తోంది.
మరణం ఎవరిదవనీ.. ఆ వార్త బాధ కలిగిస్తుంది. ఆ వ్యక్తులతో మనకున్న దగ్గరతనాన్ని బట్టి ఆ బాధ తీవ్రత ఉంటుంది. నాకు సత్యతో ఉన్నది స్వల్ప పరిచయమే. చెపుతున్నది కన్నతండ్రి కనక మరికొంత కదలిక. కాని నాలో అంతకన్న ఎక్కువ కదలికకి కారణం? ప్రతి ఒక వ్యక్తికీ మనకీ చెందిన బృందం ఒకటుంటుంది. దానికో పేరూ ఉంటుంది. మతం, జాతి, కులం, భాష, ప్రాంతం, రాష్రం, దేశం .. ఇలా ఎన్నో. ఒక్కోమారు ఈ బృందాలన్నింటికీ అతీతంగా కూడా కదులుతాం. అప్పుడు మనని కదిపేది ఏది.. కలిపేది ఏది.. అన్న ప్రశ్న వస్తుంది.
ఈ ప్రశ్నలూ, ఆలోచనలూ ఆ క్షణంలో లేవు ఒక ఉద్విగ్నత తప్ప.
ఆయన వెంట వెళ్లి పోలీసులతో, వైద్యులతో మాట్లాడాను.
ఆత్మహత్య పాపమైతే దానికి తీర్పు దినాన మాత్రమే జవాబు చెప్పుకోవలసి వస్తే సమస్య లేదు. అది నేరం అంటుంది చట్టం. బతికి బయటపడ్డ వారిని నేరస్తులు అంటుంది. బతకటంలో విఫలమై చావబోయి, చావులో విఫలమై నేరగాడు అయిపోతాడు పౌరుడు.
సత్య ఆస్పత్రి నుంచి, చట్టం నుంచీ బయట పడటంలో చెయ్యగలిగినది చేసాను.
ఆ తర్వాత ఒకరోజు వర్మ నాకు మా ఇంటివద్దకి వచ్చి మరో ఆభ్యర్ధన చేసాడు.
“తప్పు నాది.. శిక్ష తనకి..” అన్నాడు ఆరంభంలో.
“నేరం నిర్ధరించటం.. తీర్పు ఇవ్వటం అంతా మీరేనా.. ” నవ్వాను.
నవ్వితే బాగుంటానుట. నా బుగ్గ మీద సొట్ట పడుతుందిట. అదీ పడవలసిన చోట పడుతుందిట. ఆ సమయంలో కళ్లజోడుతో ఉన్నాను. తెల్లటి కుర్తా పైజామాల్లో ఉన్నాను. విశాలమైన గదిలో ఉన్నాను. ఆగది విశాలమైన బంగ్లాలో ఉంది. ఆ బంగ్లా విశాలమైన జాగాలో అందంగా పెంచుతున్న తోటలో ఉంది. అది అలాంటి తోటలు జాగాలూ కలిగిన భవనాల వరసలో ఉంది. కనక నేను బాగా ఉన్నాననిపించే నేపథ్యంలో ఉన్నాను.
“మీరనేది.. ” అంటూ ఆగాడు.
“రెండంగుళాలు ఎక్కువ చెప్పటం అనే నేరం మీరు చేసారు. కోర్టుకేసు.. వివాహ భగ్నం.. ఆత్మహత్య.. ఆమెకు శిక్షలు.. అదీ మీరన్నది.” అన్నాను.
కొంతసేపు మాటలాడలేదు. మళ్లీ అడిగితే అన్నాడు..
“మీరు కళ్లతో చూడలేక పోయినా మీకు అంతర్నేత్రాలు ఉన్నాయి. నా కన్న ఎక్కువ చూడగలరు. ”
“మరీ గాలి కొట్టకండి. పేలిపోగలను. ”
నవ్వులు. నవ్వులు.
“సత్యకి మీ స్నేహం ధృఢత్వం ఇస్తుంది. ”
ఆయన అంటున్నది ఆ క్షణంలో హాయిగా అనిపించింది. ఆమె మెత్తని గొంతు ఆ క్షణంలో మరింత మెత్తగా జ్ఞాపకాలను తాకింది.
అతను వెళ్లిపోయాక అది మరీ అంత మెత్తనా అనిపించింది.
ఆలోచిద్దామంటే నాకు రాని సత్య మెయిల్ చదివి చెప్పే శక్తి నా మొబైల్ కే కాదు నాకూ లేదు.

10951421_10155158252645363_7689865125180948401_n

5

వర్మ తరచు ఫోన్ చేస్తున్నాడు. కలుస్తున్నాడు. ఒకటి రెండు మార్లు సత్యనీ తీసుకు వచ్చాడు. ఒకటి రెండు మాటలు తప్ప సత్య దాదాపు మౌనంగానే ఉంది. ఆ గొంతు మెత్తదనం మనసుని స్పృశిస్తూనే ఉంది. మనసు సత్యలో ఏదో విశేషం ఉందని నమ్మించజూస్తోంది.
దైవం మీదా, విధి మీదా కించిత్తు కూడా విశ్వాసం లేదుట. తన విశ్వాస రాహిత్యంతో భార్యని బాధించాడట. కుటుంబం లేకుండా చేసాడుట. కూతురికి దిక్కు లేకుండా చేసాడుట. లోకవిరుద్ధంగా ఆలోచించే వాళ్లు లోక విరుధ్ధంగా జీవించ గలగాలిట. లోపలి ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, బైట ప్రపంచం ముందు అదృశ్య శృంఖలాలతో జీవించేవాళ్ల కన్న నిస్సహాయులు లేరట. – వర్మ వస్తువు విశ్వాస రాహిత్యం కాదు. దానివల్ల ఏర్పడే పరిస్థితి.
“ ఇప్పుడు విశ్వాసం కలిగించుకోవచ్చు గదా వర్మ గారూ”
“ఆలోచనలు నడిచిన బాటలో విశ్వాసాలు మొలకెత్తవు”
“అవిశ్వాసులు ఎందరో విశ్వాసులు అయినట్టు విన్నాను. ”
“కాదు. నాస్తి అన్న విశ్వాసం నుంచి అస్తి అన్న విశ్వాసానికి మారారు. అది సాధ్యం. ఆలోచనా ప్రవృత్తితో సత్యం ఏదని వెతికేవారికి ఏ విశ్వాసమూ ఉండదు. ”
“నాకు అర్ధం కాలేదు. నేను ఒప్పుకోను. ”
“మీరు ఎలా భావించినా ఫరవాలేదు. నా జీవితం గడిచి పోయింది. సత్యకింకా చాలా బ్రతుకుంది. నా ఆలోచనల ప్రభావం తన మీద ఉండుంటే ఈ పని చేసుండేది కాదు. .. ” ఆయన గొంతు రుద్ధమైంది. “ పైగా నిరాధారం చేసింది. మీరు ఆమెలో విశ్వాసం కలిగించాలి. ” ఆ గొంతులో ఓటమి, ధృఢత్వం, ఆశ మూడూ జమిలిగా వినిపించాయి.
నా మాటలను ఆయన కొనసాగనివ్వలేదు.
ఆ మెత్తని గొంతు స్పర్శను ధ్వనించబోతోందా…

6

సత్య అసత్యపు భ్రాంతిలోంచి నా జీవితంలోకి చాలా నెమ్మదిగా ప్రవేశించింది. నేను మాటలాడేవన్నీ వినేది. ప్రశ్నలు లేవు. వ్యాఖ్యానాలు లేవు. ఆమె ఏమనుకుంటున్నదీ ముఖంచూసి తెలుసుకునీ అవకాశం నాకు లేదు. స్వరం విని తెలుసుకునీ అవకాశం సత్య ఇచ్చేది కాదు. ఒక మార్మికమైన మౌనం ఒకటి రెండు మాటలై గుండెలను తాకి ఏదో బలిష్టమైన ఉచ్చులో నన్ను బంధించేది. ఆమె తండ్రి ప్రోత్సాహం తోనే నన్ను కలుస్తోంది. నా మనసే నన్ను ప్రోత్సహిస్తోంది. చెప్పిన కారణం ఆమెకి జీవించే ఉత్సాహమివ్వటం, దైవంమీద విశ్వాసం కలిగించటం. ధ్వనించే కారణం జీవితమివ్వటం. నాస్తికుడికి మతం అడ్డయే అవకాశం లేదు. మెజారిటీ మతస్తుడికి తన అభ్యుదయ ప్రదర్శనకి ఒక అవకాశం కూడా.
ఒక గుడ్డికీ, ఒక మూగకీ ఏర్పడని సంపర్కం అన్నంత బాధ.. నిరాశ.. కలిగేది అప్పుడప్పుడు..
“మీరు జవాబివ్వటం లేదు. ” అన్నాను నిరాశ కప్పి పుచ్చుకుంటూ కొన్నాళ్లయాక ఒకరోజు.
“ప్రశ్నలుంటే జవాబులుంటాయి సార్.. ” ఆ స్వరం మరింత మెత్తగా.. కొద్దిగా జీవం నింపుకుని.. తొలిసారి.
“నేనన్నీ స్టేట్మెంట్స్ ఇస్తున్నానంటారు.. ”
“నోరులేని లాయరు ముందు ఛాన్సు దొరికిందిగదా అని రెచ్చిపోయే పబ్లిక్ ప్రాసిక్యూటర్లా.. ”
నవ్వులతో మంచు కరిగింది..
మరికొన్ని మాటలయాక..
“ముందుగా మీకు నా కృతజ్ఞతలు. ”
“దేనికి?”
“మా నాన్న నా ఆత్మహత్యా ప్రయత్నానికి కారణం ఫలానా అని చెప్పాడు. మళ్లీ అలా జరక్కుండా ఉంచే విరుగుడు మీ వద్ద ఉందని తను నమ్మాడు. మిమ్మల్ని నమ్మించాడు. మీరు చాలా శ్రద్ధగా మీరు తీసుకున్న బాధ్యత నిర్వహిస్తున్నారు. అవునా? ”
“మీరు చెప్పేది చెప్పండి. ”
“మా నాన్నకి కొన్ని మూఢవిశ్వాసాలు ఉన్నాయి. మనుషులను చూడగానే తనకు ఏర్పడిన తొలి అభిప్రాయంతో ప్రవర్తించటం వాటిలో ఒకటి. తొలి తెలుగు సాహిత్యంలో మహమ్మదీయుల పట్ల కనిపించే ఒక చిత్రమైన రొమాంటిక్ ఆరాధన మా నాన్నకీ ఉంది. అది మరొకటి. ఆయన ఇటీవల మాటలనూ, ప్రవర్తననూ గమనించితే నా చర్య ఆయనను ఎంత షాటర్ చేసినదీ నాకు అర్ధమవుతోంది. పోతే.. ”
“చెప్పండి.. ”
“మీతో కలిసిన ఈ నాలుగైదు పరిచయాలలో మీమీద మా నాన్న ఇంప్రెషన్ తప్పు కాదనే అనిపించింది. నిజంగానే మీరు మంచివారు. మనుషులు. నాకు మీరో సాయం చెయ్యగలరా?”
“చెయ్యగలిగినదైతే తప్పక చేస్తాను. ”
“మా నాన్నతో చెప్పండి. నేనిక అలాంటి ప్రయత్నం చెయ్యనని. అవసరమైతే ఆయనకి నమ్మకం కలగటానికి .. అంటూ ఆగి.. నాకు దైవం మీద విశ్వాసం కలిగిందనో – కావాలంటే – కలిగించాననో చెప్పండి. నన్ను కౌన్సిలింగ్ చేసే బరువు మీకూ తగ్గుతుంది. ”
“నన్ను అబద్ధం ఆడమంటారు. ”
“అహఁ .. అబద్ధమని కాదూ.. ”
“మీరు అంటున్నది అదే .. నేను అసత్యం ఆడను. మీరు ఆడండి ప్లీజ్ బడుద్దాయి గారూ .. అని. ”
సత్య మాటలాడలేదు.
“మీ నాన్నగారు నా ఊహ ప్రకారం భిన్నంగా జీవించారు. వివాహం చేసుకున్నారు. మిమ్మలని పెంచారు. మీరు అందరి కన్న భిన్నంగా ఉండాలని బహుశా ఆశించారు. వివాహం విషయంలో మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని అలాంటి మనిషికి అనిపించే ఉంటుంది. చివరికి”..
అంటూ ‘నాబోటి గుడ్డిపోచ మీద ఆధారపడటం కూడా ఆయన భిన్న ప్రవర్తనకి సంకేతం’ అంటూ నోటి చివరి వరకూ వచ్చిన మాటను తుంచేసి కొనసాగించాను.
“ఆ మాట తండ్రిగా ఆయన చెప్పటం సరే ధ్వనించటానికి కూడా సాహసించలేక పోయుంటారు. తనే పెళ్లి ప్రయత్నాలు చేసారు. ఫలితం ఇలా జరిగింది. అవతల వాడు ఏదో వంక పెట్టి మిమ్మలని కాదన్నపుడు మీరు ఈ నీచుడు లేకపోతే నేను బ్రతకలేనా నాన్నా విడాకులు ఇచ్చేద్దాం అనుండాలి. అదీ మీరు చెయ్యలేదు. కోర్టు.. కేసు.. ఎక్కడ ఎందుకు మీ స్థైర్యం దెబ్బతిందో.. చివరకు ఇలాంటి ప్రయత్నం చేసి ఆయన నడుం విరగ్గొట్టారు. నాబోటి అపరిచితుడితో మీరన్నారే ఆ కౌన్సిలింగ్ .. దానికి కూడా మీరు ఒప్పేసుకున్నారు. మీ అంతట మీరు అబద్దం ఆడరు. నిజం.. మీలో అదొకటి ఉంటే.. చెప్పరు. ఆయనా, చివరకి ఏ సంబంధం లేని నేనూ అబద్ధం చెప్పాలి.. ”
నేను చెప్పవలసింది అయిపోయింది.
చాలాసేపు మౌనం.
“నేను వెళ్తాను సార్”
“కోపం వచ్చిందా? ”
“నాకు నేనే తేల్చుకోవలసిన విషయం స్పష్టం చేసారు.. నాకు సమయం కావాలి.. ”
బయలుదేరుతోంది సత్య.
“ ఒక్క నిమషం.. ” అంటూ బిల్లు చెల్లించి కాఫీడే నించి బయటకు వచ్చి కారువైపు నడుస్తున్నాను. ఆగి “నాతో వస్తారా మీకు కావలసిన చోట దింపుతాను.. ” అన్నాను.
“నాకు వేరే పనుంది.” అంది.
“అనుకున్నాను.. ” అన్నాను నవ్వటానికి ప్రయత్నిస్తూ.
సత్య తొలిసారి స్పర్శించింది.
“మీరీ రోజున నాకో విషయం చెప్పి గురువు అయారు. ‘ధ్వనించ కూడదూ చెప్పాలీ’ అన్నారు. నేనీ దేశపు ఆడదాన్నిగదా- ధ్వనించటమే మా బ్రతుకు. మీరూ అది పాటించాలి. నేనేమన్నానో అదే మీరూ తీసుకోవాలి. ”అంది మెత్తటి నవ్వుతో.
ఆ నవ్వూ, గొంతూ, స్పర్శా నన్ను వెన్నాడుతున్నాయి.
నా సారధి నన్నొకడినే తీసుకుని బయలుదేరాడు.

7

నెల పైగా గడిచింది.
ఈ మధ్యలో చాలా జరిగిపోయాయి. సత్య పరస్పర అంగీకారం మీద విడాకులకి ఒప్పుకుంది. ఆమె ఎత్తు మీద మీడియాలో దాని చర్చతో రచ్చకెక్కిన సత్య పరిస్థితిని వాడుకుని వేధించటానికి ప్రయత్నించి ఆమె ఆత్మహత్యా ప్రయత్నానికి కారకుడైన సహోపాధ్యాయుని మీద యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వాళ్లు వెంటనే చర్య తీసుకోకపోతే తోటి ఉపాధ్యాయులను, స్త్రీ సంఘాలనూ కూడగట్టుకుని అతని మీద చర్య తీసుకునేట్టు చేసింది. నిర్భయంగా స్కూలుకి వెళ్లడం మొదలెట్టింది.
నా మాటలు తన కూతురి మీద చాలా ప్రభావం చూపించాయని వర్మ అన్నాడు.
నిజానికి నేను కూడా సత్యలో అంతటి మార్పుని ఊహించలేదు. దానికి కారణం నేనే అని కూడా నాకు అనిపించలేదు. అల్లా దయామయుడు అనుకున్నాను.
నన్ను తాకే ఆ మెత్తదనం కేవలం ఆమె గొంతులోనే కాదు ఆమె నిండుకూ ఉంది.
మీరు తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నారు. అందొకమారు.
“చిన్న సవరణ. చదువుకోలేదు. విన్నాను. మా నాన్నగారు సంస్కృత పండితులు. ఎందరో తెలుగు రచయితలను వినిపించారు. శాస్త్రి నా ప్రాణస్నేహితుడు. నా అమ్మీజాన్ బాబాజాన్ నేనీ స్థితికి రాటానికీ, నేనిలా నించోటానికీ ఎంత కారకులో అంత కారకుడు. వాడు నాకూ సాహిత్యానికీ నా చదువుకీ ఒక ఆధారం. ”
శాస్త్రి గురించి కబుర్లు. అమ్మీజాన్ బాబాజాన్ ఏక్సిడెంటు. పిఠాపురం నుంచి హైదరాబాదు మకాం మార్పు. “నా ఈ అంధత్వానికి కారణం నా తలిదండ్రులు అన్నదమ్ముల బిడ్డలు కావటం – అన్నాడోమారు శాస్త్రి. దానికి అమ్మీజాన్ జవాబివ్వమంది. ఇచ్చాను. మీ తలిదండ్రులు అక్కాతమ్ముళ్ల పిల్లలు కదా నీకెందుకు రాలేదు- వాడా వెంటనే నిజమే గదా- అన్నాడు. అదీ మా శాస్త్రి. ” అన్నాను. నవ్వింది సత్య. వినిపించింది. మనసంతా కంపించింది.
“ఎందుకో అంత నవ్వు-” అని అడిగాను. మళ్లీ నవ్వింది. మరింత సత్యంగా.. స్వచ్ఛంగా..
“ధ్వనించకూడదు. చెప్పాలి. ”. అన్నాను. నా గొంతులో నాకే వశంకాని మాదకత.
“సరే.. చెప్తా. నా నవ్వు మీరు ఎంజాయ్ చేసారు. ఐనా ప్రశ్న వదలలేదు. అదీ రెండో నవ్వు కారకం. మీ తర్కాన్ని ఒప్పేసుకునీ వాళ్లుంటే మీకు దగ్గరవుతారు.. మీ శాస్త్రిగారిలా. ”.
నవ్వులు..
సత్యని కలిసినపుడల్లా రెండు ఉత్తుంగ తరంగాలు నాలో ఎగసి పడేవి. ఆమెతో జీవితం నా బ్రతుకును పూరిస్తుందన్నదొక భావ తరంగం. ఆమె నాకు దక్కదన్నది మరో తరంగం. ఒకదాని వెంట మరొకటి. దక్కినా కారణం నా స్థితీ కావచ్చు, ఆమె స్థితీ కావచ్చు. అప్పుడామె దక్కినట్టా దక్కనట్టా- అమ్మీజాన్ అనేది- నమ్మి మోసపో కాని నమ్మక కోలుపోకు. అమ్మ మాట ఈమాన్. కాని నమ్మకం- అందులోనూ తోటి మానవుల మీద- అందులోనూ నా స్థితిలో మరింత కష్టం. అపనమ్మకాన్ని రక్షణ కవచం చేసుకుంటుంది ఆశ.
శాస్త్రితో ఫోనులో మాటలాడాను. ప్రయత్నించు. తప్పులేదు. అనొచ్చు. నేనొస్తాను. మాటాడతాను. అనొచ్చు. రెండూ అనలేదు. ఆశ పెట్టుకోకు. నువ్వు భగ్నమైతే నేను భరించలేను. అన్నాడు. అంటే వాడుకూడా హిందువులా మాటలాడాడు. అమ్మీజాన్ ఉంటే వాడి మాటలను మరో కోణంలో చూపించగలిగేదేమో..
చివరికి నేను నన్ను పట్టుకోలేక పోయాను.

8

అప్పటికి ఏడాదికి పైగా గడిచి పోయింది.
ఓరోజు కావాలనే ఓల్గా సాహిత్యం మీదకి మరలించాను సంభాషణను. ఆపేరు వింటే సత్యలో ఉత్తేజం అనేకమార్లు గమనించాను. సంభాషణ వివాహం మీదకు తప్పనిసరిగా మరలుతుందని నా ఆశ.
-నవలలో ప్రతిపాదితమైన స్వేచ్ఛ, ఓల్గా ఆశించే స్వేచ్ఛ, స్త్రీలకవసరమైన స్వేచ్ఛ వేరంటారు మా నాన్న. ఆయన నవలగురించీ, రచయిత గురించీ, సమాజం గురించీ విడి విడిగా మాటలాడతారు. ఓల్గా అంటే ఆయనకు ప్రాణం. స్త్రీల సమస్యకి పరిష్కారం కేవలం ఆర్దిక స్వావలంబన మీద లేదన్న భావన ఓల్గాని చదివినపుడు తనకు కలిగిందిట… సత్య ఉత్సాహంగా చెపుతోంది.
నాకు చేదుమాత్ర మింగినట్టుంది.
నాదృష్టిలో ఓల్గా నేటి చదువుకున్నఆడపిల్లల వివాహ ఆశలకు ఒక ప్రేరణ. ఆవిడ ప్రశక్తి వస్తే ఎటువంటి ఆడదైనా వివాహిత అయితే తన జీవితం గురించి, అవివాహిత ఆయితే తన వివాహం గురించి తన అబిప్రాయాలను ఎంతోకొంతైనా బయట పడేస్తుందని నా నమ్మకం. ఆమె సాహిత్యంగురించి తన అభిప్రాయాలను తండ్రి ఆలోచనలను కలగాపులగం చేసేసి మాటలాడేస్తోంది సత్య.
నా సహనం తెగిపోయింది. నేను దానిని తెగ్గొట్టాల్సినంతటి ఉద్రేకం వచ్చేసింది.
“జ్ఞానోదయాన్ని నిర్వచిస్తూ కాంట్ దానికి కావలసిన ప్రధాన అవసరం స్వేచ్ఛ మాత్రమే అంటాడు. అత్యున్నత మానవ సమాజం ప్రజలకు దానిని కల్పించగలదంటాడు. ఓల్గా గారు చెప్పే స్త్రీస్వేచ్చ సరైన సమాజంతోనూ, పురుషుల స్వేచ్ఛతోనూ సంబంధం లేకుండా ఊహించటం సాధ్యంకాదు.”– అన్నాను.
ఆ తర్వాత జరిగిన సంభాషణలో సత్య మాటలాడినవేవీ నాకు అర్ధం కాలేదు. విషయం పట్ల ఉత్సుకతతో నేనందులోకి దిగలేదు గదా. అది కేవలం నెపం. ఇప్పుడు పునరాలోచిస్తే నేను సత్య మధనను అర్ధం చేసుకునీ అవకాశాన్నిమరోమారు పోగొట్టుకున్నాను. ఆమెను ఒక వస్తువుగా పొందటానికి చేసిన ప్రయత్నంలో సహస్రాంశమైనా ఒక వ్యక్తిగా సామీప్యతని సాధించటానికి చెయ్యలేదు.
ఆ విషయం నేను ధ్వనులను విడిచి పెట్టి నేరుగా వివాహం ప్రస్తావించి నపుడు కూడా నాకు అర్ధం కాలేదు.

9

“సత్యా.. నీ జీవితానికి కొత్త వెలుగు నివ్వాలనీ, నా బ్రతుకుకి నువ్వు ఆధారం కావాలని నా కోరిక. ”
నేనెంతకాలమో ఆలోచించి తయారు చేసుకున్న ఈ వాక్యం ఎంత కృతకంగా ఉందో నాకే తెలిసిపోతోంది. వాక్యం ఎంత శక్తిహీనమయిందో ఆ క్షణాన నాకు అర్ధమయింది.
“తప్పకుండా”.. అంది వెంటనే.
ఆ అంగీకారం నాకు చెప్పరాని ఆనందాన్నీ కలిగించింది. అంతులేని అనుమానాన్నీ కలిగించింది. ఆ క్షణంలో ఆ కళ్లను చూడగలిగే కళ్లు నాకుంటే అందులో ఏదో ఒకటి మాత్రమే కలిగేది.
“మీ నాన్నగారితో వెంటనే మాటలాడతాను. ” అన్నాను.
“దేని గురించి.. ”
“పెళ్లి గురించి.. ఎప్పుడూ.. ఎలా.. ”
“ఆగాగు.. దేనిగురించీ.. ” అంది.
“మన పెళ్లిగురించీ .. ” అన్నాను అయోమయంగా.
చాలాసేపు సత్యనుంచి మాటలు లేవు.
నేనూ ఆ మౌనాన్ని కొనసాగించాను. ఆ కాస్త మౌనంలోనూ నేనామెకు ఇచ్చే ఆధారం ఏమీ లేదనిపించింది. ఆ మాట అనటం ద్వారా నేనామెను కోల్పోతానా అనిపించింది. మరుక్షణంలో ఆమె విలువ పెరిగి పోయింది. ఆమె తప్పకుండా అన్నది దేనిగురించి ?
“సత్యా” – అన్నాను చాలా సేపటికి.
“ఊఁ-” అంది. ఆ గొంతులో నే వెదుకుతున్న మృదుత్వం అలాగే ఉంది. అంత అలజడిలోనూ అది నాకు కలిగించే అనుభూతి అలాగే ఉంది.
“నేను పెళ్లాడతానని ఎలా అనుకున్నావు.. నేనెక్కడ ఎప్పుడు నీకు అలాంటి అవకాశమిచ్చానా అని గుర్తు చేసుకుంటున్నాను. ” అంది. ఆమె మాట పూర్తి కాలేదు. నేనేదో అనబోతున్నాను.. కనులున్నాయిగదా.. ఉపయోగించుకుంది.. నాచేయి పట్టుకుంది.. నా చెయ్యి ఆమెతో ఏమందో తెలీదు..
“మనకి వివాహమాడే అర్హత లేదు.. వివాహం మనమున్న పరిస్థితిలో మనకున్న సత్సంబంధాలకి ముగింపు. ప్లీజ్ అర్ధం చేసుకో.. ” అంది.
“అవును.. నిజమే.. ఒక అంధుడితో పెళ్లా.. ఒక ముస్లింతో అందులోనూ. ”. నేను నా వశం తప్పాను..
“ఏంటదీ.. నువ్వు.. ఎలా ఇలా .. మాటలాడగలుగుతున్నావ్.. ” సత్యచేతిలో నా చేయి అలాగే ఉంది. దాన్ని విదిలించుకునే నా ఉద్రేకం సత్యకి అర్దమవుతూనే ఉంది..
“నీ మాటలకి ఇంకే అర్దముంది.. ” అన్నాను.
చెప్పింది.. సమాజం గురించి.. వివాహ వ్యవస్థ గురించి.. తన అనుభవం నుంచి చేసుకున్న నిర్ణయాన్ని గురించి.. వివాహం వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాలను ఛిద్రం చేయటం గురించి.. ఆమె మనసు వివాహాన్ని అంగీకరించటం లేదట. నా మనసు దేనినీ స్వీకరించటం లేదు.. ఆమెది నిరాకరణ అన్న భావన నుంచి బయట పడటం లేదు.. ఆమె ఏ వాక్యాలను ఎంత సరళంగా చెప్పినా అందులో నిరాకరణ తప్ప మరేమీ ధ్వనించటం లేదు..
చెప్పి.. చెప్పి.. నన్ను వినివిని.. చూసి చూసి అంది.. సత్య.
“కళ్లు లేకపోవటం లోపం కాదు. మరేదో ఇంద్రియాన్నో, ఇంకేదో సాంకేతిక పరికరాన్నో ఉపయోగించుకుని దాన్ని అధిగమించవచ్చు. కాని, .. నువ్వు మరింత గాయపడతావేమో.. ”
“చెప్పు.. ఇంతకన్న నన్నేం గాయపరచగలవు.. ”
“కళ్లు మూసుకోటం ఎవరూ సరిచెయ్యలేని లోపం. దయచేసి ఆలోచించు. వివాహం వేరు. స్నేహం వేరు. కామం వేరు. ప్రేమ వేరు. ఈ నాలుగింటిలో ఒకదానికోసం ఒకటి చెయ్యటం తగదని నేను ప్రస్తుతం అనుకుంటున్నాను. నన్ను నమ్ము. వివాహం గురించి నాకున్న భావాలను నా మాటలు చెపుతున్నాయి.. నా భావాలు అంగీకరించొచ్చు.. చర్చించొచ్చు.. నిరాకరించొచ్చు.. కాని వాటిని నేను నా నిరాకరణకే వాడుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. చానికి కారణం.. నువ్వు వాచ్యర్ధం మీదకన్న ధ్వని మీద ఎక్కువ ఆధారపడటం. ”
“సత్యా. ”. నా మనసు నాకు తెలియకుండానే నా స్వరంలో నిండింది.
“ఎక్కువ సంఖ్యవాళ్లలో అధిక శాతం తక్కువ సంఖ్యవాళ్లను తక్కువ చేసి చూస్తారనేది తక్కువ సంఖ్యవాళ్లను వెన్నాడుతుంటుంది.. దానిని ఉపయోగించుకునే ప్రపంచంలో అనేక అవాంఛనీయ కృత్యాలు జరిపిస్తున్నారు కొద్దిమంది. వాళ్లు అధికసంఖ్యకీ చెందవచ్చు. అల్పసంఖ్యకీ చెందవచ్చు. వాళ్ల లక్ష్యాలు వేరుగా ప్రకటించుకోవచ్చు. కాని ఆకొద్దిమంది లక్ష్యమూ ఒక్కటే. మనిషిని మనిషితో కలిపే సమస్త మార్గాలనూ మూసివేయటం. నిజమైన ఆ కొద్దిమందీ మొత్తం మానవజాతిని మానసికంగా శాసించగలుగుతున్నారు. దానినుంచి వ్యక్తులుగా ముందు మనం బయటపడాలి.. మనం చర్చను నేర్చుకోవాలి. అభిప్రాయాలను మార్చే ప్రయత్నం ప్రేమతో.. ఓరిమితో చెయ్యాలి. మనలను శాసించే భావాలలో మనవేవో.. మనం కొనితెచ్చుకున్నవేవో.. గింజ ఏదో పొల్లు ఏదో వేరుచేసుకోగలగాలి. అందులో మనం తోడూనీడా కాగలగాలి. స్నేహితుడా ధ్వనిని అలంకారప్రాయం చేసుకుని ఎవరైనా దేనినైనా నేరుగా మాటలాడగలిగే ప్రపంచం కలగందాం రా. నా మనవి ఒక్కటే.. సాధ్యమైనంత వరకూ మనం మాటల మీద వాటి వాచ్యర్ధం మీద ఆధారపడటం ద్వారానే మనం ఏకమయీ అవకాశం ఎంతో కొంత ఏర్పడుతుంది.. ప్లీజ్ నేరుగా అర్ధం చేసుకో.. ”

(2010 ఆగస్టు రచన సంచిక)

Download PDF

1 Comment

 • bhavani says:

  ఎంతో బాగుంది కథ ముందు నాకు ఈ కథ చాలా ఏళ్ళ క్రితం రాసిన కథేమో అనిపించింది ఎందుకో మరి . కాదని పూర్తిగా చదివాకా అర్థమయింది.
  ఒక్క కథలో ఎన్ని కాంప్లెక్స్ లు , ఇజాలు ,నిజాలు , అభిప్రాయాలూ, ఆవేదనలు !! కానీ ఒకే హారంలో గుది గుచ్చబడినట్టుగా అన్నీ చక్కగా అమరిపోయాయి . ఆలోచనా పరిథి విస్తృతంగా కలిగిన మనిషి తన వైపు నుండే కాదు ఎదుటి వారి వైపు నుండి కూడా ఆలోచిస్తూ , ఈ రెండు ఆలోచనల్నీ, వాటి భారపు విలువల్నీ తూకం వేసుకుంటూ అనుక్షణం ఓ చిత్రమైన స్థితిలో ఉంటాడు . కథ మొత్తం ఇటువంటి తార్కిక మైన ఆలోచనతో సాగడం బాగుంది .
  ఇంకా మనిషి ఆలోచన జీవితాంతం ఒకేలా ఉండదన్న అభిప్రాయం కథ మొత్తం ధ్వనించింది . కాదు కాదు వినిపించింది . కాలమో , పరిస్థితులో తమ అభిప్రాయాల్ని మార్చివెయ్యచ్చన్న ఎరుకతో ఇందులోని పాత్రలు మాట్లాడతాయి . (1. నాకా క్షణంలో కలిగినది ఆమె అనాగరిక ప్రవర్తనపై కోపం. నేను చెప్పినది కేవలం స్వానుభవం నుంచి ఏర్పరచుకున్న ఓ అభిప్రాయం. నేనలా నా అభిప్రాయాన్ని చెప్పటం నాగరికమేనని ఆ క్షణాన నా నిశ్చితాభిప్రాయం.-లాయర్ 2. దయచేసి ఆలోచించు. వివాహం వేరు. స్నేహం వేరు. కామం వేరు. ప్రేమ వేరు. ఈ నాలుగింటిలో ఒకదానికోసం ఒకటి చెయ్యటం తగదని నేను ప్రస్తుతం అనుకుంటున్నాను-సత్య )
  అలాగే కళ్ళు లేని లాయర్ పై అతని అమ్మీ జాన్ తాలుకు ప్రభావం కథంతా పరుచుకుని కనిపిస్తుంది . ఒక కథలో ప్రత్యక్షంగా లేని పాత్ర బలాన్ని కూడా చాలా బాగా చూపించారు రచయిత .
  కథ చాలా బాగుంది . కథలోని ఎన్నో బలమైన అంశాల్ని సాయి పద్మ గారు చక్కగా విశ్లేషించారు . మంచి కథని చదివింపచేసినందుకు ధన్యవాదాలు . .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)