మొక్కాలి, కనబడాలంటే…

devotionఒక శివరాత్రి చిత్రం ఇది.
వేములవాడలోని రాజన్న సన్నిధిలో తల్లీబిడ్డలు.ఒక సాన్నిధ్యం.
భగవంతుడూ… తల్లీ…బాలుడూ…
ఒక్కమాటలో మొక్కు.
అదే ఈ దృశ్యాదృశ్యం.

గుర్తుకొస్తున్నాయి. ఏవేవో.
తరతరాలు.

చిన్నప్పటి కాలువలు. బంగారు పురుగులు. చీమచింతకాయలు.
గోడను పట్టుకుని నాన్న కాళ్లు తొక్కడం.
రెండు జడల జె.పద్మ. లెక్కలు చెప్పే నారాయణ రెడ్డి సార్.
హైపో. ఇంకా చాలా.

నిజానికి అవన్నీ కాదు, తరతరాలు.

నాకు ‘పసకలు’ అయ్యాయి. అయ్యాకేమో, ఒక వర్షపు రాత్రి మా తాతమ్మ నన్ను తీసుకుని ఊర్లోని ఒక చోటుకు, ఎక్కడికో తీసుకెళ్లినట్టు గుర్తు. చాలా రోజులు నడిచినట్టనిపించే జ్ఞాపకం.
నడుస్తున్నంత సేపూ హోరున వర్షం. నిజానికి వర్షం అంటే గుర్తున్నది కూడా అదే తొలి అనుభవం.
అట్లా ఆ వర్షపు రోజు ఒక సుదీర్ఘ ప్రయాణం. చేతుల్లో చేయించుకుని!

అనంతరం ఎవరితోనో ఏమో, అది ఎటువంటి వైద్యమో ఏమో – ఇప్పించనైతే ఇప్పించింది మా తాతమ్మ.
వివరం తెలియదుగానీ అదొక సుదీర్ఘ ప్రయాణ ప్రాణ దృశ్యం. దృశ్యాదృశ్యం.
లీలగా గుర్తున్నది.

చిత్రమేమిటంటే చిన్నప్పుడు తిరిగిన ఇండ్లు, వీధులు, కూడళ్లు, ఆ పరిసరాలు అప్పటి వైశాల్యంతో ఉంటాయి.
పెరిగాక వాటిని చూస్తే అవి చిన్నబోతై.

అప్పుడు అంత దూరం నడవడం నిజంగా దూరం.
కానీ, తర్వాత అంత దూరం లేదు. దగ్గరే.
కానీ ఆ బుడిబుడి నడకలు, నా నడక కోసం తాతమ్మ ఆగి ఆగి వేసిన అడుగులూ…అన్నీనూ సుదీర్ఘమైనవి.
అట్లా ప్రతి ఒక్కరికీ ఏవో కొన్ని.జ్ఞాపకాలు చిన్నతనంలో పెద్దబడిలా ఉండనే ఉంటాయి.
అవన్నీ ఆయా స్థలకాలాల్లో ఫ్రీజ్ అయ్యే లీలలు.

చిత్రం. ఇల్లు చిన్నగా అనిపిస్తుంది. విశాలమైన బడి ఆవరణ కూడానూ అంత విశాలం కాదని తెలుస్తుంది.
అప్పుడు ఇరుకిరుగ్గా అనిపించిన గల్లీలు మరీ అంత ఇరుకేమీ కాదనీ ఇప్పుడు ఆశ్చర్యపోతాం.
అంతేకాదు, పవిత్రంగా ఆలయాలుంటాయి. ఎత్తుగా ధ్వజస్తంభం ఉంటుంది. అది అంత ఎత్తుకాదని తెలిసి ఒక దివ్యానుభవం ఏదో మిస్ అవుతాం కూడా.
కానీ, తప్పదు. చాలా నిజాలు అబద్ధం అని తెలిసి విస్తుపోతూ ఉంటాం, ఇప్పుడు!

ధ్వజ స్తంభమే కాదు, గుడి గంట కూడానూ అప్పుడు ఎంతో ఎత్తు!
కానీ తర్వాత విజిట్ చేస్తే, నాయినమ్మ చనిపోయినప్పుడు ఆ దేవాలయంలోనే ఒక రాత్రి నిద్ర చేస్తే, అప్పుడు బాల్యపు వర్షం తాతమ్మతో సుదీర్ఘ నడకా అంతానూ కల లాగా తలంపుకొచ్చి ‘ఏదీ ఎత్తు కాదు, బాల్యమే సమున్నతం’ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు చూసిన దృశ్యమే తొలి తలుపు అనిపిస్తుంది.

నవ్వూ వస్తుంది.
గర్భగుడిలోకి వెళ్లాలంటే తల వంచుకుని వెళ్లే ఎత్తు ఏమీ బాగుండదు. విచారం కలుగుతుంది.
చిన్నప్పుడే బాల్యంతో ఈజీగా దేన్నయినా ముట్టుకోగలం. పెద్దయ్యాక ప్రతి దానికీ బహుముఖ దృశ్యం.
అంటూ ఉంటుంది. ముట్టూ ఉంటుంది. దూరం పెరుగుతూ ఉంటుంది.

ఈ చిత్రంలో ఉన్నది అటువంటిదే. దగ్గరితనం.
మూపు. చూపు. ఒక ఎక్స్ పోజ్. దృశ్యాదృశ్యం.

ఆమె కళ్లు మూసుకుని చూస్తోంది, చూడాల్సినది.
ఆ బాలుడు తెరుచుకుని చూస్తున్నాడు, కొత్తగా తెరుచుకుంటున్న లోకాలకేసి!

వారిద్దర్నీ కలిపిన చూపు, ఆ చేతులు. అవి చూడాలి.

చిత్రంలో అదే చిత్రం.

ఆ తల్లి చేతుల్లో బిడ్డ.
బిడ్డ చేయి.
అదీ ఒక చూపు.చూపించు దృశ్యాదృశ్యం.నిజానికి ఆ తల్లి దర్శిస్తున్నది వేరు. ఆ కుమారుడు వీక్షిస్తున్నదీ వేరు.
అది తల్లికి అది దివ్య దర్శనం అయివుంటుంది. కొడుక్కి మాత్రం ఒక అనుభవం. ఒక కుతూహలంతో కూడిన వీక్షణం. లేదా బిత్తరి చూపూ అయివుండవచ్చు.

కానీ, అవతల తల్లి అంతటి ఏకాగ్రతతో, లీనమై చూస్తున్నదేదో బాలుడికి తెలియదు.
వాణీ, విను. అసలు ఎటు చూడాలో కూడా తెలియని బాల్యం వాడిది.
అయినా తల్లి వెంట బాల్యం ఎన్నో చూస్తుంది.

అది తల్లే కానక్కర్లేదు, తండ్రీ కావచ్చు, నానమ్మా, తాతమ్మా కావచ్చు.
మా రమణమ్మ నన్ను ఎట్లయితే మా ఊర్లో చివరాఖరికి, దుబ్బ దాటాక…ఇంకా ఇంకా నడిస్తే వారంతపు అంగడి ఎక్కడైతే జరుగుతుందో అక్కడిదాకా…ఎలా నన్ను నడిపించుకు వెళ్లిందో అలా పిల్లల్ని ఎవరో ఒకరు ఎందుకో ఒకందుకు తీసుకెళుతూ ఉంటారు. అప్పుడు తెలియదు. ఎప్పుడో తెలుస్తుంది.

మొట్టమొదట వర్షాన్నిచూసిన రోజు అదే అని నాకెలా తెలిసిందో మీకెలా తెలుస్తుంది.

బహుశా అప్పుడు తాతమ్మకు  తెలియదేమో! వీడు ఏం గుర్తించున్నాడో అన్న ఆలోచనా తనకు రాలేదేమో!
కానీ, ఒక్కటి మాత్రం అనుకుంటుంది. ఎట్లయినా ‘పస్కలు’ తగ్గాలని అనుకుని ఉంటుంది!

కానీ నాకు వేరే దృశ్యం ఉంటుంది.
ఈ ఈ చిత్రంలో మల్లే.

ఇందులో ఈ అమ్మా ఆ భగవానుడిని ధ్యానిస్తూ ఏదో అనుకుంటూనే ఉంటుంది.
వాడి గురించి కూడానూ ఏదో కోరుకునే ఉంటుంది. కానీ, వాడికేమీ తెలియకపోవచ్చు.

ఆ రోజో -మరో రోజో- ఇంకో రోజో వాడు కొత్తగా ఒకటి చూస్తాడు.
తర్వాత అది ఎప్పుడు చూశాడో కూడా గుర్తు రాదు.

కానీ, మీరు చూడండి.
మీ దృశ్యావరణంలోకి వర్షమూ, వెన్నెలా ఎప్పుడు వచ్చిందో!
లేక పక్షీ, పామూ ఎలా వచ్చిందో గమనించండి.
లేదంటే పుస్తకమూ, డిగ్రీ సర్టిఫికెట్టూ, ఒక ప్రశంసా పత్ర.
ఇంకా దేవుడూ, దయ్యమూ. ఇంకేవో!
లేదా కొన్ని ప్రియరాగాలు.

‘లవ్యూ రా’ అన్న పదం!
అది తొలిసారిగా వినికిడిగా వచ్చిందా లేక దృశ్యంగా హత్తుకున్నదా చూడండి.
ఏమీ లేకపోతే గుడిగంటలా మీలోపల మీరు రీ సౌండ్ కండి.
దృశ్యాలు రీళ్లు కడతాయి.

కాకపోతే తొలి అనుభూతి కోసం మీరు ఈ చిత్రంలోని తల్లిలా మొక్కు కోవాలి.
నిశ్శబ్దం కావాలి. దేవుడి సన్నిధిలా మీరూ మీ సన్నిధిలోకి వెళ్లాలంటే ఏకాంతంగా, పక్కన ఉన్నది బాల్యం అన్నంత ప్రేమతో ఎవరి డిస్టర్బెన్సూ లేకుండా వెళ్లండి. తెరుచుకున్న వాడి కన్నుల కేసి చూస్తూ మీ జీవితంలో దృశ్యాదృశ్యం కండి.

~ కందుకూరి రమేష్ బాబు
Kandukuri Ramesh
Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)