మార్మిక ఊహలు రేపే గుహలు, సొరంగాలు

అమరనాథ్ గుహాలయం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చిన్నప్పుడు విజయవాడలో మా అమ్మ కనకదుర్గగుడికి తీసుకువెడుతుండేది. అక్కడ కొండ మీద ఒకచోట ఒక సొరంగం ఉండేది. దానికి కటకటాలున్న ఒక చిన్న ఇనపతలుపు, తాళం ఉండేవి. చాలాకాలంగా తీయకపోవడం వల్ల ఆ తలుపు, తాళం బాగా తుప్పు పట్టాయి. మా అమ్మే చెప్పిందో, ఇంకెవరైనా చెప్పారో గుర్తులేదు కానీ, అది కాశీకి వెళ్ళే సొరంగమార్గమట! ఒకప్పుడు సాధువులు, సన్యాసులు ఆ మార్గంలో కాశీకి వెళ్ళేవారట! అది ప్రమాదకర మార్గం కావడంతో తర్వాత తాళం వేసేసారట!

పైగా ఆ తుప్పు పట్టిన తలుపు, తాళం చూస్తే అది నిజమేననిపించేది.

ఆశ్చర్యంగా, కుతూహలంగా ఆ సొరంగం వైపే చూస్తూ ఉండిపోయేవాణ్ణి. అందు లోంచి వెడితే ఎంతో దూరంలో ఉన్న కాశీకి చేరుకుంటామన్న ఊహ అంత చిన్నప్పుడే నాకు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించేది. ఆ తర్వాత కూడా కనకదుర్గ గుడికి ఎప్పుడు వెళ్ళినా తప్పనిసరిగా ఆ సొరంగం దగ్గరకు వెళ్లి దానివైపే చూస్తూ ఉండేవాడిని, అక్కడి నుంచి బయలుదేరి కాశీకి వెళ్లడాన్ని రకరకాలుగా ఊహించుకునేవాణ్ణి. ఆ సొరంగం ముచ్చట నా మీద ఎంతగా ముద్ర వేసిందంటే, పెద్దైన తర్వాత కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా ఆ సొరంగం దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా అది అలాగే ఉందా అన్నది నాకు తెలియదు. నేను చివరిసారి వెళ్లి చాలా ఏళ్ళు అయింది.

లోకజ్ఞానం పెరిగిన కొద్దీ, ఆ సొరంగం లోంచి వెడితే కాశీలో తేలతామనడంలో ఆవగింజంత కూడా నిజం లేదని మనకు తెలుస్తూనే ఉంటుంది. కాని, ఇంకోవైపు అది నిజం ఎందుకు కాకూడదని కూడా అనిపిస్తుంది. నిజానికీ కల్పనకీ మధ్య అదో రకమైన డోలాయమాన స్థితి. సంగతేమిటంటే, వాస్తవికతను అంటిపెట్టుకునే నిగూఢతా ఉంటుంది. ఒక కోణంలో చూస్తే, వాస్తవికత ఎంత వాస్తవమో, నిగూఢతా అంతే వాస్తవం. ప్రకృతిలోనూ, మానవప్రకృతిలోనూ ఈ రెండూ అంతర్భాగాలు, బొమ్మా బొరుసూ లాంటివి. నమ్మకానికీ, అపనమ్మకానికీ కూడా ఇదే వర్తిస్తుంది. మనిషి జీవితం ఏదో ఒక రూపంలో ఈ రెంటి మధ్యా పయనిస్తూనే ఉంటుంది.
ఇలా అన్నానని నేనేదో తాత్విక చర్చలోకి వెడుతున్నాననో, తాడూ బొంగరం లేని ఊహల్ని సమర్థిస్తున్నాననో అనుకుంటున్నారేమో, అదేం లేదు. మానవపరిణామచరిత్రలోకి వెడితే ఈ నిగూఢత, రహస్యం, లేదా మిస్టరీ అనేవి మనిషి జీవితంలో ప్రముఖపాత్ర పోషించాయని మనకు తెలుసు. సొరంగాలు, లేదా గుహలు; ఇంతకు ముందు చెప్పుకున్న అమ్మవారి తోపులు వగైరాలు ఆ నిగూఢతను అంటిపెట్టుకుని ఉన్నవే. నిగూఢమైన తంతులలో అవి భాగాలు. వాటిని ఒక మార్మికత ఆవరించి ఉంటుంది.

ఉండవల్లి గుహాలయాలు

ఉండవల్లి గుహాలయాలు

సొరంగాలు, గుహలు, తోపుల చుట్టూ అల్లుకున్న మార్మికత ఎన్ని వేల సంవత్సరాలుగా మనిషి ఊహల్లో జీర్ణించుకుని ఉందో! కనకదుర్గగుడిలోని ఆ సొరంగాన్ని చూడగానే, అది ఒకప్పుడు కాశీకి రహస్య మార్గం అన్న ఊహ పుట్టడం వెనుక ఇంత చరిత్ర ఉందన్న మాట.

సొరంగాలు, గుహలు చీకటి గుయ్యారాలుగా; లోపల ఏముందో అంతుబట్టనివిగా, ఎంత దూరం వ్యాపించాయో తెలియనివిగా ఉంటాయి. భూమి అడుగున అలాంటి ఒక అజ్ఞాతప్రపంచాన్ని మనిషి ఊహ సృష్టించి, దానికి ఒక పేరు పెట్టింది: అదే, పాతాళం! పాతాళం స్వర్గంలా ఆనందం, ఆహ్లాదం గొలిపే ప్రపంచం కాదు. భయ, బీభత్సాలను కలిగించేది. అక్కడ ఉండేది దేవతలు కాదు; కాలకూట విషాన్ని పుక్కిలించే మహాసర్పాలు. పాతాళం మన భాషల్లో ఒక న్యూనార్థకం, నిందార్థకం. పాతాళానికి సమానార్థకమైన under world కూడా అలాంటిదే. స్మగ్లర్లు, ఇతర నేరాలు చేసేవాళ్ళు ఉండే ప్రపంచం అది. పాతాళానికి తోక్కేయడం అనే నుడికారం మన భాషల్లో కనిపిస్తుంది. వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు.

మన దగ్గరే కాదు, పాతాళం ఇతర పురాణకథల్లోనూ ఇలాంటి న్యూనార్థంలోనే కనిపిస్తుంది. గ్రీకుపురాణకథల్లోని పాతాళ ప్రస్తావనలను ఉదహరించుకునే సందర్భం ముందు రావచ్చు. అదలా ఉంచితే, మార్మికత, మాంత్రికత నిండిన పురా మానవ జీవితంలో గుహలు, పాతాళం ఒక ముఖ్యపాత్ర పోషిస్తూవచ్చాయి. మనదేశంలో అజంతా, ఎల్లోరా గుహల గురించి మనకు తెలుసు. అమరనాథ్ గుహ గురించి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఇలాంటివే ఇంకా దేశంలో చాలా ఉన్నాయి. ఇవి కాక కొన్ని ప్రాచీన ఆలయాలలో విడిగా గుహాలయాలు, భూగర్భ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. భూగర్భ ఆలయాలలోని దేవుడి పేరుముందు ‘పాతాళ’ అనే మాట చేర్చి చెబుతుంటారు. ఉదాహరణకు, శ్రీకాళహస్తిలో పాతాళ విఘ్నేశ్వరుని గుడి ఉంది. అందులోకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. అలాగే, కొండలను గుహలుగా తొలచి ఏర్పాటు చేసిన గుడులు అనేకచోట్ల కనిపిస్తాయి.

అన్నట్టు, కొందరు ఉగ్రదేవతల గుడులు పాతాళంలో ఉంటాయి. ‘పాతాళ భైరవి’ అనే సినిమా పేరులోనే పాతాళం ఉంది. ఆ ఉగ్రదేవతలను ఆరాధించే మాంత్రికుల నివాసం కూడా పాతాళంలోనే ఉంటుంది. అందుకే వారి ఉనికిని గుర్తించడం కష్టమవుతుంది. దాని నుంచే ‘సప్తసముద్రాలు-దానికి ఆవల ఓ మర్రిచెట్టు-దాని తొర్రలో చిలుక- ఆ చిలుకలో మాంత్రికుని ప్రాణం…’వగైరా అద్భుత కల్పనలు, మహిమలు పుట్టాయి.

అలవాటు వల్ల వీటిని యాంత్రికంగా తీసుకుంటాం. ఇందులో కొత్త ఏముందని అనుకుంటాం. కానీ చరిత్ర క్రమంలో వీటిని పెట్టి చూడండి…ఇవి కొత్తగా, ఆసక్తికరంగా కనిపిస్తాయి. చరిత్రకోణం నుంచి చూసినప్పుడు ఆసక్తికరం కాని దేదీ ఉండదనిపిస్తుంది.

గుహల విషయానికి వెడితే, ఆదికాలపు గుడులు గుహలే ననీ; గ్రీకు సంప్రదాయమూ, పురావస్తు ఆధారాలు దానినే నిరూపిస్తున్నాయనీ థాంప్సన్ అంటారు. మన సంప్రదాయం కూడా అదే నని పైన చెప్పుకున్న గుహాలయాలు, పాతాళ ఆలయాలు చెబుతూనే ఉన్నాయి. గ్రీకు పురాణాలలోని డిమీటర్, పెరెస్పోన్ అనే అమ్మవార్లకు చెందిన పవిత్రగుహలను మెగరాన్ (megaron) అంటారు. హోమర్ కాలం నాటికి ఆ మాట ఇంటికీ, ప్రాసాదానికీ కూడా పర్యాయపదమైంది. హేడ్స్ అనే పాతాళదేవుడు, పెరెస్పోన్ అనే దేవకన్యను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళి ఆమెపై అత్యాచారం చేస్తాడు. అది జరిగిన చోటే మెగరాన్. థాంప్సన్ ప్రకారం పాతరాతియుగంలో గుహలే ఆలయాలుగానూ, నివాస స్థలాలు గానూ ఉండేవి. కొత్తరాతి యుగానికి వచ్చేసరికి గుహలలో నివసించడం ఆగిపోయింది. వాటిని ఆలయాలుగా, సమాధులుగా, ధాన్యాగారాలుగా ఉపయోగించడం మాత్రం కొనసాగింది.

అమరనాథ్ గుహాలయం

అమరనాథ్ గుహాలయం

గ్రీసులోని గుహాలయాలలో అనేకం ప్రాచీన క్రీటు ద్వీపానికి చెందినవి. క్రీటు రాజధాని నోసోస్ కు దగ్గరలోని ప్రముఖ గుహాలయమైన అమ్నిసోస్ ను హోమర్ కావ్యం ఒడిస్సీ కూడా ప్రస్తావించింది. ప్రాచీన గ్రీసుపై మాతృస్వామ్యానికి చెందిన క్రీటు సంస్కృతి ప్రభావం చాలా ఉంది. క్రీటులో నేల తొలిచి, చుట్టూ బండరాళ్ళు పేర్చి కృత్రిమ గుహలను కూడా కల్పించేవారు. అవే క్రమంగా చనిపోయినవారిని పూడ్చిపెట్టే సమాధుల నిర్మాణానికి దారితీసాయి.

అనటోలియా(నేటి టర్కీ)లో ఫ్రిజియన్లు, బహుశా వారికి ముందు హిట్టైట్లు సహజసిద్ధమైన గుట్టలలో గోతులు తవ్వి, ఎండా, చలి తగలకుండా వాటికి కలపతో రక్షణ కల్పించేవారు. ఇలాంటి గోతులనే కపడోసియా(టర్కీ మధ్యప్రాంతం), ఆర్మేనియా, ఇటలీ, జర్మనీ, లిబియా, స్పెయిన్ లలో ధాన్యాగారాలుగా లేదా గాదెలుగా ఉపయోగించేవారు. విశేషమేమిటంటే, ఈ గాదెల్లో తృణధాన్యాలను జాగ్రత్తగా భద్రపరిస్తే అవి ఎంతకాలమైనా చెడకుండా ఉండేవట. ఉదాహరణకు, గోధుమలు యాభై ఏళ్లపాటు; జొన్నలు మొదలైన చిరు ధాన్యాలు నూరేళ్ళకు పైగా నిల్వ ఉండేవట.

రోమ్ లో ఇటువంటి నిర్మాణాలను ‘ముండస్’(mundus) అనేవారు. ఏదైనా నగరనిర్మాణాన్ని ప్రారంభించేటప్పుడు, మధ్యలో ఒక గొయ్యి తవ్వేవారు. అందులో ప్రథమఫలా(first-fruits)న్ని, అంటే కొత్తపంటలో కొంత భాగాన్ని అర్పించేవారు. ఈ ప్రథమఫలం గురించి చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని అలా ఉంచితే, ఏటా కొత్త పంట రాగానే, ఆగస్టు 24న ప్రథమ ఫలాలను అర్పించే తంతు జరిగేది. తిరిగి నవంబర్ 8న దాని మూత తెరిచి అందులోంచే మరో పంటకు విత్తనాలు తీసుకునేవారు. ఆ మూత తెరవడం మతపరమైన తంతుగా శాస్త్రోక్తంగా జరిగేది. తలుపు తెరచి ప్రేతాత్మలను బయటికి రప్పించే పద్ధతిలో అది ఉండేది. ఎందుకంటే, ఆ ధాన్యాగారం కోశాగారాన్నీ, గిడ్డంగినే కాక సమాధినీ తలపించేలా ఉండేది. అంటే, ప్రేతాత్మలు, విత్తనాలు అందులో సహజీవనం చేసేవన్నమాట.

అలాగే, ఎల్యూసిస్ అనే చోట ఉన్న డిమీటర్ అనే దేవతకు గ్రీకు రాజ్యాలు అనేకం ప్రథమఫలాలను పంపించడం ఆనవాయితీగా ఉండేది. ఆకురాలు కాలం వరకు వాటిని నిల్వ ఉంచి, ఆ తర్వాత రైతులకు విక్రయించేవారు. రైతులు వాటిని మిగతా విత్తనధాన్యంలో కలిపి కొత్తపంటకు ఉపయోగించేవారు. ఇవన్నీ లౌకికమైన చర్యలే కానీ వీటిని మతపరమైన తంతుగా జరపడం తప్పనిసరి. ఆదిమకాలంలో లౌకికమైన చర్యకు, మతపరమైన తంతుకు తేడా ఉండేది కాదని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం.

మొదట్లో ఆలయాలుగా, నివాసాలుగా ఉపయోగపడిన గుహలు, పాతాళగృహాలు క్రమంగా సమాధులు, ధాన్యాగారాల నిర్మాణానికి నమూనాను అందించినట్టు పై వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఒకరకంగా ఆయా నిర్మాణాల తాలూకు పరిణామక్రమాన్ని, చరిత్రనే చెబుతుంది. ఇలా చూసినప్పుడు, అలవాటు పడిపోవడం వల్ల అంత విశేషంగా తీసుకోని గుహాలయాలు, పాతాళమందిరాలు పురాచారిత్రకు సాక్ష్యాలుగా సరికొత్త రూపంలో కనిపించి ఆసక్తిని రేపుతాయి.

అందులోనూ మన రామాయణం, మహాభారతం లాంటి ప్రాచీన సాహిత్యంలో పురామానవ చరిత్ర తాలూకు ఆనవాళ్ళను పట్టుకోవడం మరింత ఆసక్తికరం. గుహలు అనేటప్పటికి నాకు రామాయణం, కిష్కింధకాండలోని ఒక ఘట్టం చటుక్కున గుర్తుకొచ్చింది. అది ఇలా సాగుతుంది:

సుగ్రీవుడి ఆజ్ఞపై సీతను వెతకడానికి దక్షిణదిశకు వెళ్ళిన వానర వీరులలో హనుమంతుడు, అంగదుడు మొదలైనవారు ఉన్నారు. వారు సీతను వెతుకుతూ వింధ్యపర్వతం దాకా వెళ్ళారు. మొదట పర్వతం లోతట్టున ఉన్నగుహలను, అడవులను గాలించారు. గుట్టలు, గుబురులు శోధించారు. తర్వాత వింధ్యపర్వతం పై భాగం మీదికి వెళ్ళారు. అక్కడ ఇంకా పెద్ద గుహలు కనిపించాయి. వాటిలో అన్నింటికంటే పెద్దదైన ఒక బిలం వాళ్లను ఆకర్షించింది. దానిపేరు ఋక్షబిలం. అంటే, ఎలుగుబంట్ల బిలం. చెట్లూ, వాటికి దట్టంగా తీగలు అల్లుకోవడంతో దాని ముఖద్వారం సరిగా కనిపించడం లేదు. అంతలో లోపలి నుంచి క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గురుపక్షులు ఎగురుతూ వచ్చాయి. అవి నీటిలో తడిసి ఉన్నాయి. దప్పికతో ఉన్న వానరులు లోపల నీటి జాడ ఉన్నట్టు తెలిసి సంతోషించారు. అతికష్టం మీద లోపలికి ప్రవేశించారు. లోపల చాలాదూరం చిమ్మ చీకటి వ్యాపించి ఉంది. క్రమంగా వెలుగు కనబడింది. సింహాలు, ఇతర మృగాలు తిరుగుతూ కనిపించాయి.

కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్రశాంత వనం కనిపించింది. అందులో రకరకాల పూలమొక్కలు ఉన్నాయి. బంగారాన్ని, వెండిని తాపడం చేసిన భవనాలు ఉన్నాయి. ఆ వనంలో ముందుకు వెళ్ళిన తర్వాత జింకచర్మాన్ని వస్త్రంగా ధరించిన ఒక స్త్రీ కనిపించింది. ఆమె గొప్ప తేజస్సుతో దివ్యస్త్రీలా కనిపిస్తోంది. పరస్పరం పరిచయం చేసుకున్నారు. తన పేరు స్వయంప్రభ అనీ, తను మేరుసావర్ణి కూతురినని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆ బిలం గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చింది:
ఈ బిలంలోని భవంతులను, వనాలను మయుడనే దానవుడు సృష్టించాడు. అతడు హేమ అనే అప్సరసను మోహించాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మండిపడ్డాడు. అతణ్ణి చంపేసాడు. అప్పుడు బ్రహ్మ ఆ బిలంలోని వనాన్ని, బంగారు గృహాలను హేమకే కానుకగా ఇచ్చేసాడు. తన ప్రియసఖి అయిన హేమ ఈ వనాన్ని, భవనాలను సంరక్షించే బాధ్యతను తనకు అప్పగించింది.

ఇంతా చెప్పిన తర్వాత, “ఈ బిలంలోకి ప్రవేశించినవారు ప్రాణాలతో బయటపడడం కష్టమే. మీరు ఎలా బయటకు వెడతా’రని వానరులను అడిగింది. నువ్వే మిమ్మల్ని బయటపడేయాలని వారు ఆమెను ప్రార్థించారు. చివరికి ఆమె సాయంతో అందులోంచి బయటపడ్డారు.

ఉజ్జయిని లోని భూగర్భ ఆలయం

ఉజ్జయిని లోని భూగర్భ ఆలయం

ఒక నిర్జన పర్వత ప్రాంతంలో, ఎవరికీ అంత తేలికగా చొరడానికి వీలు కాని ఒక మహాబిలంలో, సింహాల వంటి క్రూర జంతువుల మధ్య, మగతోడు లేకుండా స్వయంప్రభ అనే స్త్రీ ఒంటరిగా నివసిస్తుండడమే చూడండి…ఇది లీలగా ఒకనాటి మాతృస్వామ్యాన్ని సూచిస్తోందా? పురాచరిత్ర కోణం నుంచి చూసినప్పుడు ఈ సన్నివేశాన్ని మరోలా అన్వయించుకోవడం కష్టమే. అలాగే, ఇది చదువుతున్నప్పుడే, ఓడిసస్ కథలో చెప్పుకున్న గ్రీకు అప్సరస సిర్సే గుర్తుకొచ్చి ఉండాలి. సిర్సే కూడా ఒక దీవిలోని అడవిలో నునుపు రాళ్ళతో కట్టిన ఒక భవనంలో ఒంటరిగానే ఉంటూ ఓడిసస్ సహచరులకు కనిపించింది. స్వయంప్రభ ఉన్న బిలంలో వానరులకు సింహాలు, ఇతర మృగాలు కనిపించినట్టే; సిర్సే భవంతికి అన్నివైపులా సింహాలు, తోడేళ్ళు తిరుగుతూ కనిపించాయి. సిర్సే వాటికి మందు పెట్టడం వల్ల అవి సాధుజంతువులుగా మారిపోయాయని కథకుడు చెబుతున్నాడు.
సిర్సే లానే ఋక్షబిలం యజమానురాలు హేమ కూడా అప్సరసే. ఆమెను మోహించిన నేరానికి ఇంద్రుడు మయుని చంపాడు సరే, మయునికి చెందిన వనాన్ని, బంగారు గృహాలను హేమకు బ్రహ్మ కానుకగా ఇవ్వడమేమిటి? ఇందులో ఎలాంటి అర్థమూ కనిపించదు. అలాకాక, హేమకు, మయునికి ఏదో ఒక సంబంధం ఉందనుకుంటేనే అతని సంపద ఆమెకు లభించడంలో అర్థం ఉంటుంది. ఆ సంబంధం సిర్సేకు, ఓడిసస్ కు ఉన్న సంబంధం లాంటిదా?

సిర్సే తన భవంతి దగ్గరకు వచ్చిన ఓడిసస్ సహచరులను లోపలికి ఆహ్వానించి వారిని పందులుగా మార్చివేసింది. ఇది తెలిసి ఓడిసస్ ఆమెపై ప్రతీకారానికి బయలుదేరినప్పుడు హెర్మన్ అనే దేవుడు ఎదురై, ఆమెను లొంగదీసుకునే ఉపాయం చెప్పాడు. ఓడిసస్ అతను చెప్పినట్టే చేశాడు. దాంతో ఆమె లొంగిపోయింది. అలా జరిగి ఉండకపోతే తన సహచరులకు పట్టిన గతే అతనికీ పట్టి ఉండేది.

ఇదే కథను మయునికి, హేమకు అన్వయించి చూస్తే, సిర్సే వల్ల ఎదురయ్యే ప్రమాదం నుంచి ఓడిసస్ బయటపడగా; మయుడు బయటపడలేకపోయాడనుకోవాలి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది, హోమర్ ఓడిసస్ కథకు, వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టానికీ ఉన్న పోలిక!

ఇంకో స్పష్టమైన పోలిక చూడండి…’ఈ బిలంలోకి ప్రవేశించినవారు ఎవరైనా ప్రాణాలతో బయటపడడం కష్టం. మీరెలా బయటపడతా’రని వానరులను స్వయంప్రభ అడుగుతుంది. సిర్సే భవంతిలో ఓడిసస్ సహచరులకు, ఓడిసస్ కు ఎదురైన పరిస్థితి దాదాపు అదే.

ఇంతకీ రామాయణంలోని ఈ ఋక్షబిలం ఉదంతం, పురాకాలంలో గుహలే మానవ ఆవాసాలన్న చారిత్రక వివరాన్ని నమోదు చేస్తోందా?! అవుననే అనిపిస్తోంది. రామాయణంలో పురా చారిత్రక సమాచారం లభించడం ఎంత అపురూపం, ఎంత అద్భుతం!!

మరికొన్ని విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం 

Download PDF

1 Comment

  • మీ వ్యాసం చదివాక మరోకటి గుర్తుకు వస్తోంది. చిన్న పిల్ల ఆటల్లో అత్యంత సహజంగా ఒక ఆట ఉంటుంది. చుట్టూ దుప్పట్లు కట్టేసుకుని, మంచం కింద గాని, కుర్చీల కిందగాని పిల్లలందరూ దూరిపోయి, అక్కడ నిశ్శబ్దంగా ఆడుకుంటారు. అప్పుడు చీకటి వాళ్ళని భయపెట్టదు. బహుశా, మన అందరి జీవితాల్లో కూడా ఇది జరిగి ఉండవచ్చనుకుంటున్నాను. గుహల్లో మానవ జీవితానికి బహుశా ఈ ఆట కూడా ఒక అవశేషం కావచ్చు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)