ముప్ఫై ఏళ్లగా
అతన్ని చూస్తూనే ఉన్నాను
ఎక్కేబండి దిగే బండిగా
ప్రయాణమే…
జీవితంగా మలుచుకున్నట్టున్నాడు
తలకు చిన్నగుడ్డ తలపాగాచుట్టి
మొలను నిక్కరు ధరించి
చేతుల్లోని పినలిగర్రను మూతికి ఆనించి
ఏకకాలంలో వందలమందిని శిశువులుగా చేసి
సమ్మోహ పరిచే మంత్రగాడు
ఎన్నేళ్లుగా అతడలా గాలికి గంధం పూస్తున్నాడో
తన వూపిరితో మురళికి ప్రాణంపోస్తూన్నాడో
తనెక్కిన రైలును ఉయ్యాలగా చేసి ఊపుతున్నాడో
తెలియదు కానీ
తన శరీరంలో ఎన్నో చిల్లుల వెదురుగొట్టాలు
చర్మం చాటున దాచుకున్నట్టున్నాడు
అతడు మురళి వూదితే చాలు
లోపలి వేణువులన్నీ ఒక్కసారిగా మ్రోగినట్టుంటాయి
అతనిలోనేనా!…
మనలోకూడా…
ఒక్కోసారి అతడు కనిపించడు
నేను బండి ఎక్కిన కాన్నుంచి
అతని ఉనికి కోసం వెతుకుతూనే వుంటాను
కనులతో చెవులతో
ఎక్కడా కానరాక కళ్ళు మూసుకుంటానా
ఏచివరనుంచో ఒక సమ్మోహన మంత్రం
“నామది నిన్ను పిలిచింది గా..నమై… వేణు..గానమై..”
నేనక్కడే కూచుంటాను
నామది మాత్రం స్వాధీనం తప్పి
ఆ రాగపు కొసను పట్టుకొని
అలా..అలా.. అతన్ని చేరుకుంటుంది
అతడు నెమ్మెదిగాదగ్గరౌతూ
మనపిల్లల పుణ్యం కోసమని
చెయిచాచి
మనపాపాన్ని రూపాయికాసంత అడిగి తీసుకుపోతుంటాడు
అతడు బండిలో వున్నంతవరకూ నామనసు
తేనెటీగై అతనిచుట్టే తిరుగుతుం టుంది
చివరికి
అతడన్నా బండిదిగాలి
లేదా
నేనన్నా బండిదిగాలి
అంతవరకూ
నామనసు తిరిగి నా స్వాధీనం లోనికి రాదు.
- రెడ్డి రామకృష్ణ
రామకృష్ణ గారు మంచి ఫీల్ ఉన్న కవిత
శ్రీనివాసరావు గారూ ధన్య వాదాలు .
ఎన్నేళ్ళుగా అతనల గాలికి గంధం పూస్తున్నదో తన శరీరంలో ఎన్నో చిల్లుల వెదురు గొట్టాలు . చాల చాల బావుంది కవిత .
– సలీం
సలీం గారూ ధన్యవాదాలు సార్,కవితపై మీస్పందన వచ్చింది.చాలా సంతోషం.ఈ శీర్షిక అనుకున్నప్పుడు మీ ‘కాలుతున్న పూలతోట’ గుర్తుకు వచ్చింది.మీరు గుర్తుకు వచ్చారు.
రైలును ఉయ్యాలగా చేసి, ప్రయాణికులను శిశువులుగా మార్చి సమ్మోహన పరచే ఆ మంత్ర గాడి గురించి మీ కవిత్వం చాలా బాగుంది రామకృష్ణ గారు.
అభినందనలు,
నారాయణ.
ధన్యవాదాలు నారాయణ గారూ
చాలా బావుంది మీ కవిత. ఏదో ఆర్ద్రత దాగి ఉన్నట్టుగా …..
ధన్యవాదాలు పద్మప్రియ గారూ,కవిత్వం హృదయ సంబంధి అని నమ్ముతాను.
చాలా బావుంది సార్
ఎన్నేళ్లుగా అతడలా గాలికి గంధం పూస్తున్నాడో…
మనపిల్లల పుణ్యం కోసమని
చెయిచాచి
మనపాపాన్ని రూపాయికాసంత అడిగి తీసుకుపోతుంటాడు…
చాలా బాగుంది సర్ …
బాగుందండి,.
పాత వేణువునే మధుర స్మృతుల్లోకి తీసుకెళ్తూ సరి కొత్తగా పలికించారు మళ్ళీ. బాగుంది.
రాజ్ కుమార్ గారూ… మీరన్నట్టు పాతవేణువే,కొత్తరాగం పాడాలనే ప్రయత్నం,విషయం ఎన్నో దశాబ్దాల క్రిందటిదనితెలుసు,ఎంతో మంది కవులు యిదేవిషయం మీదరాసారని తెలుసు,అయినప్పటికి రోజూ నేను రైళ్లో చూస్తున్న విషయం గనక రాయలనిపించి,రాసాను.మీ భావాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు
సార్,ఉదయగారు ,భాస్కర్ కొండ్రెడ్డి గారు,మరియు రాజ్ కుమార్ గారు ,ధన్యవాదాలు
తన శరీరంలో ఎన్నో చిల్లుల వెదురుగొట్టాలు
చర్మం చాటున దాచుకున్నట్టున్నాడు
తన శరీరంలో ఎన్నో చిల్లుల వెదురుగొట్టాలు
చర్మం చాటున దాచుకున్నట్టున్నాడు
అతనిలోనేనా!
మనలోకూడా
ప్రత్యేకించి ఈ భావాలు మరలా మరలా చదివించాయి
ధన్యవాదాలు మురలీధర్ గారూ