తెగని గాలిపటం

Kadha-Saranga-2-300x268

2002 ఆగస్టు 15.

 

సికింద్రాబాద్ స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌లోంచి దిగి ఆటో ఎక్కేలోగా తడిసి ముద్దయ్యాడు శేఖర్. ఇంటికి వొచ్చేసరికి అరగంట. ఆటో దిగాడు. గజగజా వొణికిపోతున్నాడు. ఆతడి కోసమే ఎదురుచూస్తో కమలిని. ఆ వాన నీళ్ల సవ్వడిలోనూ ఆటో ఆగిన చప్పుడు ఆమె చెవులకు. ఇంట్లోంచి ఒక్క పరుగున బయటకు వొచ్చింది. ఆటోవాలాకు డబ్బులిచ్చి, గేటు తీస్తున్నాడు శేఖర్. తల గిర్రున తిరిగింది. కాళ్లు సత్తువ కోల్పోయాయి.

అతని స్థితి చూసి, ప్రమాదం శంకించి, ఒక్క ఉదుటున అతడి వొద్దకు వొచ్చింది. ఆమె పట్టుకోబోయినట్లయితే కింద పడిపోయేవాడే. అతడి తడి ఒళ్లు కొలిమిలో పెట్టిన కర్రులా సలసలా కాలిపోతోంది. అతడి చేతిని తన భుజం మీద వేసుకొని, నెమ్మదిగా నడిపించుకుంటూ ఇంట్లోకి – కమలిని.

శేఖర్ నిల్చోలేకపోతున్నాడు. తనను కమలిని పట్టుకోవడం, ఇంట్లోకి తీసుకురావడం తెలుస్తూనే ఉంది. ఆమెకు దూరంగా జరగాలని మనసు కోరుకుంటుంటే, శక్తి చాలడం లేదు దేహానికి. ‘శ్రీనాథ్‌గాడి కింద నలిగిన ఆమె దేహానికి తన దేహం రాచుకోవడమా?’. తల నరాలు చిట్లినంత నొప్పి. తెలివితప్పిపోయాడు.

ఆమెకు కాళ్లూ చేతులూ ఆడలేదు. అతడికి చలిజ్వరమని తెలుస్తోంది. తమాయించుకుంటూ – చకచకా అతడి బట్టలు విప్పేసింది. రగ్గు కప్పింది. తల తుడిచింది, టవల్‌తో. రెండు అరచేతుల్నీ రుద్దింది. జ్వరాలూ, తలనొప్పులూ, వొంటినొప్పులూ, జలుబులూ, గాయాలూ వంటి వాటికి వేసే మందులెప్పుడూ ఇంట్లో సిద్ధం. వాటిలోంచి పారాసెట్మాల్ టాబ్లెట్ తీసి, వేసింది. అప్పుడు ఆమె కళ్లు పరిశీలనగా, అతడి మొహంలోకి.
మనిషి బాగా తగ్గిపోయాడు. కళ్లు, బుగ్గలు లోతుకుపొయాయి. రగ్గు తీసి చూసింది. పొట్ట వీపుకు అతుక్కుపోయినట్లు డొక్కలు స్పష్టంగా. అతను  కదిలాడు. రగ్గు కప్పింది. మంచం మీద పడుకోబెట్టింది. కొన్ని క్షణాల తర్వాత, అతను పలవరిస్తున్నాడు. ఆ పలవరింతలు ఆమె గుండెల్లో బాకుల్లా సూటిగా గుచ్చుకున్నాయి. కళ్లళ్లోంచి నీళ్లు ఉబికుబికి వొచ్చాయి. వెక్కిళ్లు. ఏడుస్తూనే అతడి అరచేతులూ, అరికాళ్లూ రుద్దుతూ – ఆమె. ఎన్ని కన్నీటి చుక్కలు రగ్గుమీద పడి ఇంకాయో!
*   *   *
కొంత కాలం వెనక్కి.
1997 ప్రారంభ రోజులు.
శేఖర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఆరేళ్లయిపోయింది. ఇంతదాకా ఏ ఉద్యోగంలోనూ కుదురుగా ఉండలేకపోయాడు. ఈ ఆరేళ్లలో తన చదువుకు సంబంధంలేని ఉద్యోగాలూ చేశాడు. గవర్నమెంట్ జాబ్‌కు యత్నిద్దామంటే రిక్రూట్‌మెంట్లే లేవు. కేంద్రంలో ఐక్య ఫ్రంట్ ప్రభుత్వం అనిశ్చితిలో. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అనిశ్చితిలో. ఎక్కడైనా ఒకటీ, అరా జాబ్స్ పడుతున్నా, ‘ఆమ్యామ్యా’ ప్లస్ రికమండేషన్ ఉంటే తప్ప వొచ్చే స్థితి లేదు. శేఖర్‌లాంటి ‘ఎందుకూ పనికిరాని’ నిజాయితీపరుడికి ఆ అవకాశం అసలే లేదు.
ఉద్యోగం వేటలో భాగంగా విజయవాడలో ఉంటున్న మేనమామ వరసయ్యే నరసింహం ఇంటికొచ్చాడు శేఖర్. అక్కడికి రావడం అది మొదటిసారేమీ కాదు. కానీ ఆ రోజు – అతడి జీవితాన్ని మలుపు తిప్పిన రోజు!
నరసింహం కూతురు కమిలిని. గతంలో వాళ్లు బాపట్లలో ఉండే కాలంలో, అక్కడే ఇంజనీరింగ్ చదివాడు శేఖర్. పేరుకు హాస్టల్లో ఉంటున్నా, వాళ్లింట్లోనే ఎక్కువ కాలం గడిపాడు. శని, ఆదివారాలు అక్కడే పడుకునేవాడు. సాధారణంగా భర్త తరపు చుట్టాలంటే నరసింహం భార్య వరలక్ష్మికి గిట్టేదు. చిత్రంగా శేఖర్ ఆమె ఆదరణకు నోచుకున్నాడు. ఒళ్లు దాచుకోకుండా పనిచేసే తత్వం అతడిది. బయటి పనులే కాదు, వంట పనిలోనూ సాయం చేసే అతడి గుణం నచ్చడంతో, అతడిపై అభిమానం చూపేది వరలక్ష్మి.
శేఖర్ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు పెద్దమనిషయ్యింది కమలిని. అతడక్కడ నాలుగేళ్లున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మానసికంగానూ దగ్గరయ్యారు. ‘శేఖరే నా మొగుడు’ – మనసులో ఆనాడే కమలిని నిర్ణయం. ఇప్పటిదాకా బయటపెట్టలేదు. హోదాపరంగా, ఆర్థికపరంగా కమలిని వాళ్లు శేఖర్ వాళ్లకంటే పైమెట్టు. ఇది అతడికి బాగా తెలుసు. ఆమె ముందు అతనూ బయటపడలేదు. ధైర్యం చెయ్యలేకపొయ్యాడంటే కరెక్ట్.
కమలినికి సంబంధాలు చూస్తున్నారు. తన అన్న కొడుకుతో కూతురి పెళ్లి చెయ్యాలనేది వరలక్ష్మి కోరిక. అతగాడంటే కమలినికి ఇష్టంలేదు. ఆ సంగతి తల్లికి చెప్పాలంటే ఆమెకు జంకు.
t- galipatam-1
అట్లాంటి రోజుల్లో ఆ ఇంటికొచ్చాడు శేఖర్. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. నరసింహం, వరలక్ష్మి డాబామీదకెళ్లారు, పడుకోవడానికి. కాసేపటికి వాళ్లిద్దరూ వాదులాడుకుంటున్న సంగతి కింద హాల్లో ఉన్న అతడికి తెలుస్తోంది. ‘పెళ్లి’ అనే మాట తప్ప మిగతా మాటలు అర్థం కాలేదు.
టైం పదిన్నర. తన గదిలోంచి బయటకొచ్చింది కమలిని. మనసులో భయం స్థానంలో తెలీని తెగువ. నవారు మంచం మీద అటూ ఇటూ పొర్లుతూ శేఖర్. అతని మనసు స్థిమితంగా లేదు. ఆమెకు తెలిసింది. కొద్ది క్షణాల ఊగిసలాట. మనసుకి ధైర్యం చెప్పుకుని అతని మంచం కాడికి ఆమె. మంచం కోడు కాలికి తగిలి అలికిడి. కళ్లు తెరిచి, అటు చూసి గతుక్కుమన్నాడు శేఖర్. గబాల్న లేచి కూర్చున్నాడు.
“ఏంటి కమ్మూ?” చిన్న గొంతుతో, శేఖర్.
కొద్ది క్షణాల మౌనం.
“నన్నేం చెయ్యదలచుకున్నావ్?” – కమలిని.
ఏం చెప్పాలో తోచలేదు. ఆమె దేనిగురించి అడుగుతోందో తెలుసు. చుట్టూ చీకటి. హృదయంలో మిణుకుమిణుకుమంటూ సన్నటి వెలుగు. తనకు కమలిని కావాలి. కావాల్సిందే.
“నీకు నిజంగా నేనంటే అంత ప్రేమా?” – శేఖర్.
మౌనం. మళ్లీ అడిగాడు.
“ఎందుకు మళ్లీ మళ్లీ అడుగుతావ్? నిన్ను ప్రేమిస్తున్నాననీ, నీతోనే నా జీవితమనీ నీకు తెలీదూ? నోటితో చెబితే కానీ తెలుసుకోలేని మొద్దబ్బాయివా?” – ఆమె గొంతు పూడుకుపోయింది.
ఆమె ఏడుస్తోందని తెలుస్తోంది. అతడిలో కంగారు. డాబామీద పడుకున్న వాళ్ల అమ్మానాన్నలకు వినిపిస్తే?
“ప్లీజ్ ఏడవకు కమ్మూ. నాకు తెలుసు, నేనంటే నీకిష్టమని. నాకూ నువ్వన్నా ప్రేమే. కానీ ఎట్లా? నేనింకా ఏ జాబ్‌లోనూ సెటిలవలేదు. ఇంకా వెతుక్కోవడంలోనే ఉన్నా. ఇప్పటి రోజుల్లో జాబ్ దొరకడం కష్టంగా ఉంది. ఒకవేళ జాబ్ దొరికినా మీ నాన్నలా సంపాదించలేను. వొచ్చినదాంతో సర్దుకుపోయే మెంటాలిదీ నాది. కష్టాల్ని భరించడం చిన్నప్పట్నించీ అలవాటైనవాణ్ణి. నీ స్థితి వేరు. నువ్విక్కడ యువరాణిలా పెరిగావ్. నన్ను చేసుకుంటే నీ కలలు నిజం కాకపోవచ్చు. నన్ను చేసుకుంటే సుఖంగా ఉండలేవు. నువ్వేది కావాలంటే అది తెచ్చివ్వలేను. నేను ఆలోచిస్తోంది అదే. మనిద్దరికి మ్యాచ్ కాదనేది నా అభిప్రాయం. ఆలోచించు” – వాస్తవికంగా శేఖర్.
“నువ్వుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు.”
“ఇంకోసారి బాగా ఆలోచించు. తర్వాత కష్టపడతావ్.”
“ఇంక ఆలోచించడానికేమీ లేదు శేఖర్.”
“అయితే మనం పెళ్లి చేసుకుందామంటావ్?”
“నీకు కాకుండా నన్నెవరికి కట్టబెట్టినా బతకను” – శేఖర్ కళ్లల్లోకి చూస్తూ, స్థిరంగా కమలిని.
“అయితే నేను నీవాణ్ణే. మనం పెళ్లి చేసుకుందాం.”
ఆమె చేతినందుకుని చటుక్కున తన మీదికి లాక్కున్నాడు. అతను కింద, ఆమె పైన. ఆమె స్తనాలు అతని ఛాతీని ఒత్తుకుంటుంటే.. నెత్తురు వేడెక్కుతూ.. ఆమె కింది పెదవి మీద బలంగా ముద్దు పెట్టుకున్నాడు. నరాలు వశం తప్పుతూ.. అంతలోనే స్పృహ తెలిసి…
“అమ్మో, ఏమో అనుకున్నా. బుద్ధావతారానివేం కాదు.” – అతన్ని విడిపించుకుని, సన్నగా నవ్వుతూ తుర్రున తన గదిలోకి కమలిని.
వాళ్ల పెళ్లికి మొదట మొండికేసింది వరలక్ష్మి. తండ్రీ కూతుళ్లు ఒక్కటయ్యారు. ఒప్పుకోక తప్పలేదు. శేఖర్, కమిలిని పెళ్లి విజయవాడలో గొప్పగా చేశాడు నరసింహం.
*   *   *
1997 ఏప్రిల్.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట కాలనీలో రెండు గదుల పోర్షన్‌లో కొత్తజంట కాపురం. వాళ్లొచ్చిన నాలుగో రోజు సిటీ అంతా గడబిడ. నడిచే పాట గద్దర్‌పై గుర్తుతెలీని కిరాతకుల కాల్పులు. ఆయన ఛాతీ కుడిభాగంలో, పొట్టలో, కుడిచేతిలో – మొత్తం మూడు బుల్లెట్లు. అయినా మృత్యుంజయుడు గద్దర్.
ఆయనంటే విపరీతమైన అభిమానం శేఖర్‌కు. నిమ్స్‌లో ఉన్న ఆయన్ను అతి కష్టమ్మీద చూసొచ్చాడు. అదివరకు ఓసారి చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండులో అందరిలాగే తనూ ఆ ఆవేశంలో, ఆ ఉద్రేకంలో, ఉద్వేగంలో కొట్టుకుపోయాడు. స్టేజి కింద గద్దర్‌తో కరచాలనం చెయ్యడం, తనను తాను పరిచయం చేసుకోవడం, బాగా చదువుకొమ్మని ఆయన చెప్పడం అతడి జీవితంలోనే మరచిపోలేని క్షణాలు. అప్పటి గద్దర్ ఇంకా శేఖర్ కళ్లల్లో…
తూటాల దెబ్బతిని, ఒంటిమీద కట్లతో, బెడ్‌మీద నీరసంగా.. ప్రజా ఉద్యమ నౌక. దుఃఖం ఆగలేదు శేఖర్‌కు. రెండు రోజుల దాకా మామూలు మనిషి కాలేకపోయాడు. తనకే తుపాకి తూటాలు తగిలినంత బాధ. కమలిని అనురాగంలో తెరిపినపడ్డాడు. ప్రాణాపాయం నుంచి గద్దర్ బయటపడ్డాడనీ, తేరుకుంటున్నాడనీ పత్రికల్లో చదివి, సంతోషపడ్డాడు. ఎప్పటిలా ఉద్యోగాన్వేషణ.
రాష్ట్రంలో, దేశంలో ఎటు చూసినా ఏదో ఒక అలజడి. దేవెగౌడ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణ. ఉన్నపళాన కూలింది ఐక్య ఫ్రంట్ గవర్నమెంట్. పది రోజుల తర్వాత మళ్లీ అదే గవర్నమెంట్. ఈ సారి ప్రధాని, గుజ్రాల్. రాష్ట్రంలో.. ఆర్టీసీ సమ్మె. ఇంటర్వ్యూలకు తిరగడానికి బస్సులు లేక శేఖర్‌కు నానా తిప్పలు.
నరసింహం నుంచి ఉత్తరం – జన్మభూమి పనులు మొదలు కాబోతున్నాయనీ, ఇంటరెస్ట్ ఉంటే ఆ పనులు ఇప్పిస్తాననీ, ఏ విషయం వెంటనే ఫోన్ చెయ్యమనీ.
శేఖర్ సంగతి అటుంచితే, కమలినికి మళ్లీ అటెళ్లడంలో ఆసక్తి లేదు. తను, శేఖర్.. హైదరాబాద్‌లో జాలీ లైఫ్! శేఖర్‌కు జాబొస్తే జోరుగా, హుషారుగా షికార్లు!! కులాసాగా కాలం!!! తమ మధ్య ఇంకో మనిషంటూ ఉండకూడదు.
“ఆ పనులు ఎన్ని రోజులుంటాయ్ కనుక. మళ్లీ ఏదైనా జాబ్ చూసుకోవాల్సిందేగా. ఇంట్రెస్ట్ లేదని నాన్నకు చెప్పు” – కమలిని.
శేఖర్‌లోనూ అదే రకమైన ఆలోచన. కష్టమో, నష్టమో కొద్ది రోజులు ఓపిక పడితే ఇంత పెద్ద సిటీలో ఉద్యోగం దొరకదా. ఇక్కడే ఉంటే ఉద్యోగావకాశాలు తెలుస్తుంటాయి.
మావయ్యకు ఫోన్ చేశాడు. జన్మభూమి వర్క్స్ మీద ఇంటరెస్ట్ లేదనీ, ఇక్కడే ఉండి ఉద్యోగం చూసుకుంటాననీ చెప్పాడు.
మే నెల. శేఖర్‌కు ఉద్యోగం, ఓ పేరుపొందిన హాస్పిటల్లో మెయింటెనెన్స్ ఇంజనీర్‌గా. ఇదివరకు చేసిన ఉద్యోగాలతో పోలిస్తే, ఇది నచ్చింది. కొద్ది రోజుల్లోనే అతడి సామర్థ్యం, పనిపై అతడి అంకితభావం హాస్పిటల్ ఛైర్మన్‌కు నచ్చాయి.
జీవితం చకచకా, హాయిగా. అతడి ప్రేమలో ఉక్కిరిబిక్కిరవుతూ కమలిని. పని ఒత్తిడితో అతడెప్పుడైనా ఆలస్యంగా ఇంటికి వొస్తే ఏడుస్తూ, అతని గుండెల మీద వాలిపోతూ – ఆమెకు పుట్టిల్లే జ్ఞాపకం రావట్లేదు.
సుఖంగా రెండేళ్లు. ఒక్కటే అపశృతి. 1998 ఆగస్టులో నెలతప్పిన కమలినికి నాలుగో నెలలో అబార్షన్. శేఖర్ అనురాగంలో త్వరగానే కోలుకుంది. అతడి శాలరీ వెయ్యి రూపాయలు పెరిగింది. దాన్ని వెక్కిరిస్తూ మార్కెట్లో అన్ని వస్తువుల రేట్లూ పెరిగాయి. ఇంటి రెంట్ పెరిగింది. కమలిని కోరికల చిట్టా మరింత పెరిగింది. ఆమెలో క్రమంగా అసహనం, అసంతృప్తి పెరుగుతున్నాయి.
హాస్పిటల్లో పని ఒత్తిడి. శేఖర్‌కు ఊపిరి సలపడం లేదు. హాస్పిటల్ విస్తరణ పనులు. ఆదివారాలూ అతడికి డ్యూటీ. నెలలో ఒక్క ఆదివారం ఇంటిపట్టున ఉంటున్నాడేమో. ఆ ఒక్క రోజైనా ఎక్కడికీ తిరక్కుండా, ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటుంది అతడి శరీరం. కమలిని పడనివ్వదు. అన్ని రోజులూ ఒక్కతే ఇంటిపట్టున ఉంటున్న తనను ఆ ఒక్క రోజైనా బయటకు ఎక్కడికైనా షికారుకు తీసుకెళ్లమనేది ఆమె డిమాండ్. చాలా న్యాయమైన డిమాండ్. కాదనలేడు. కానీ, షికారుకు అతని మనసు, శరీరం సహకరించట్లేదు. షికార్లని ఆస్వాదించలేకపోతున్నాడు. అతడి స్థితితో ఆమెకు నిమిత్తం లేదు. ఆ ఒక్క రోజునూ ఆమె ఆస్వాదిస్తోంది. గోల్కొండ, చార్మినార్, జూపార్క్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్, టాంక్‌బండ్, బిర్లా టెంపుల్, సుల్తాన్ బజార్, ఫిలింనగర్, కొత్తగా ఏర్పడిన రామోజీ ఫిలింసిటీ కలియతిరిగింది. ఆమె మనసు నాట్యం చేసింది, నెమలిలా. అదంతా ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడే. అక్కణ్ణించి ఇవతలకు వొస్తే.. మనసంతా వెలితి వెలితిగా…
t- galipatam-2-ff
బైకుల మీదా, కార్లలో తిరిగే యువ జంటలను చూస్తూ వాళ్లదెంత సుఖవంతమైన జీవితం అనుకుంటే ఆమె మనసు చిన్నబోతోంది. శేఖర్ బైకుని నడుపుతుంటే, వెనక కూర్చొని అతని నడుము చుట్టూ చేతులేసి, అతని వీపుమీద తలవాల్చితే ఎంత హాయిగా ఉంటుంది! ఎప్పుడొస్తుందో ఆ రోజు – అనుకుని ఉసూరుమంటోంది.
“మా నాన్నని అడిగితే డబ్బు సర్దుబాటు చేస్తాడు. బైకు కొనొచ్చుగా” – కమలిని.
“అత్తింటి నుంచి ఏమీ ఆశించకూడదని మన పెళ్లి కాకముందే నా నిశ్చితాభిప్రాయం. అలా తీసుకోవడం నా మనస్తత్వానికి విరుద్ధం. ఇప్పుడు బైకు అవసరం ఏముంది? అవసరం వొచ్చినప్పుడు ఎలాగో కష్టపడి కొంటాలే. అప్పటిదాకా సర్దుకుపోవాలమ్మాయ్” – నవ్వుతూ తేలిగ్గా, శేఖర్.
తేలిగ్గా తీసుకోలేకపోయింది కమలిని.
“బైకుల మీదా, స్కూటర్ల మీదా ఝామ్మని పోతున్న జంటల్ని చూస్తుంటే నాకెంత కష్టంగా ఉంటోందో తెలుసా? నాక్కూడా అలా తిరగాలని ఉండదూ? మా నాన్నను అడగాలే కానీ, చిటికెలో సమకూర్చి పెట్టడూ? అయినా లోకంలో నీలాంటివాణ్ణి ఎక్కడా చూళ్లేదు. అతి మంచితనం, నిజాయితీ ఈ సొసైటీలో పనికిరావ్ శేఖర్. ఇంజనీర్‌వి. కావాలనుకుంటే ఎంత సంపాదించొచ్చు! నువ్వు తప్ప అందరూ సంపాదించుకునేవాళ్లే” – నిష్ఠూరంగా కమలిని.
శేఖర్ మొహంలో నవ్వు మాయం. ఒంట్లోని నెత్తురంతా మొహంలోకి వొచ్చినట్లుగా ఎరుపు.
“ప్లీజ్ కమ్మూ. ఇంకోసారి నా దగ్గిర ఇట్లాంటి మాటలు అనొద్దు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మన పెళ్లికి ముందు ఏమన్నావో. నేనుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదన్నావ్. ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్‌గా బిహేవ్ చేస్తున్నావ్” – కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ శేఖర్.
కమలిని గొంతు పూడుకుపోయింది, వేదనతో. కళ్లల్లో నీళ్లు. ఆ క్షణం శేఖర్ ఆమె మొహంలోకి చూసినట్లయితే, ఆ కళ్లు ఏం మాట్లాడుతున్నాయో తెలిసేదేమో.
2000 సంవత్సరపు రోజులు.
హైదరాబాద్ యమ స్పీడ్‌గా డెవలప్ అవుతోంది. ఇదివరకు అబిడ్స్, కోఠీ మాత్రమే మెయిన్ షాపింగ్ సెంటర్లు. ఇప్పుడు అమీర్‌పేట, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, చందానగర్, దిల్‌సుఖ్‌నగర్, బేగంపేట, ప్యాట్నీ పెద్ద షాపింగ్ సెంటర్లయ్యాయి. ఎటు చూసినా షాపింగ్ మాల్సే. బట్టల దుకాణాలూ, జ్యూయెలరీ షాపులూ, ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూంలూ. డిస్‌ప్లేలలో కళ్లుచెదిరే చీరలూ, చుడీదార్లూ, నెక్లెస్‌లూ, చెయిన్‌లూ.. కమలిని కళ్లు పెద్దవవుతున్నాయి, వాటిని చూస్తూ. వాటిలో ఆమె కళ్లకు నచ్చుతున్నవెన్నో. కానీ, కమలినికి హృదయాన్నిచ్చిన శేఖర్ జిగేల్‌మంటున్న ఖరీదైన చీరల్నీ, నగల్నీ ఇవ్వలేకపోతున్నాడు. ఆమెలో ఇదివరకు ఉన్న సంతోషం, హుషారు క్రమేపీ తగ్గిపోతున్నాయి.
కావాలనుకున్నవి దక్కకపోతే అసంతృప్తి తీవ్రమై మనల్ని దహించివేస్తుంది. మనసు కంట్రోల్ తప్పుతుంది. మంచి, చెడు విచక్షణ లోపిస్తుంది. కమలినిది సరిగ్గా ఇదే స్థితి.
కమలినిలో మార్పును గమనిస్తున్న శేఖర్, ఆమెను కాస్తయినా సంతోషపెట్టాలని అప్పుడప్పుడూ చార్మినార్‌కో, సుల్తాన్‌బజార్‌కో తీసుకుపోతున్నాడు. గాజులూ, ఒన్ గ్రాం గోల్డ్ నగలూ, చుడీదార్‌లూ కొనిస్తున్నాడు. కమలిని కోరుకుంటోంది వాటిని కాదు. అయినా అయిష్టంగానే, అసంతృప్తిగానే వేసుకుంటోంది, వాటిని.
ఇంజనీరంటే ఎంతో కొంత బెటర్ లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చని ఆశించింది కమలిని. కొత్త మోజు తగ్గిపోయాక ఆమె కలలన్నీ కల్లలవుతున్నాయ్. మనసులో ఎడతెగని వేదన. ఈ జీవనశైలి కారణంగా తనపై ఆమెకు ప్రేమ తగ్గిపోతుందని అస్సలు ఊహించలేకపోయాడు శేఖర్. అతను ఊహించనిదే జరిగింది. కమలినిలో చిరాకులూ, పరాకులూ. శేఖర్ విషయంలో నిర్లక్ష్యం. ఆమె ఆశించింది ఈ జీవితమైతే కాదు.
*   *   *
ఆదిలాబాద్ హాస్పిటల్ కోసం ప్లాన్ ప్రకారం మార్కింగ్ చేయించి, భూమి పూజ ఏర్పాట్లు చేసే పనిని శేఖర్‌కు అప్పగించాడు ఛైర్మన్. అక్కడ వారం రోజులు దాకా ఉండాల్సి రావచ్చు.
“మా అమ్మానాన్నల్ని రమ్మని చెప్పేదా?” – శేఖర్.
“అవసరం లేదులే. వారం రోజులేగా. ఎలాగో గడిపేస్తా” – కమలిని.
వారం అనుకున్నది నాలుగు రోజుల్లో పూర్తి. ఐదో రోజు సాయంత్రానికి హైదరాబాద్‌లో శేఖర్. ఇంటికొచ్చేసరికి చీకటి పడుతోంది. ఆశ్చర్యపోయాడు. తలుపులకు తాళం కప్ప. ఆలోచించి, భరత్‌నగర్‌కు వెళ్లాడు. అక్కడ అతని చిన్నమ్మ వాళ్లుంటున్నారు. దగ్గరి బంధువైన ఆమె తప్ప కమలినికి తెలిసిన వాళ్లెవరూ ఆ దగ్గరలో లేరు.
“ఏరా గుర్తొచ్చామా. మీ మొగుడూ పెళ్లాలు ఈ వైపే రావడం మానేశారే. వొచ్చిన కొత్తలో రెండు మూడు సార్లు వొచ్చి పోయారంతే. నువ్వంటే సరే. తీరికలేని ఉద్యోగం అనుకో. ఇంట్లో ఉండి ఆ అమ్మాయి ఒక్కతే ఏం చేస్తోంది? ఇటేపొస్తే ఇద్దరికీ కాలక్షేపం అవుతుంది కదా. అయినా ఇప్పుడు చీకటి పడ్డాక వొచ్చావేం?” – చిన్నమ్మ.
కమలిని అక్కడకు రాలేదన్న మాట.
“చిన్నమ్మా! అలా అంటావనే ఇలా వొచ్చాను, నేరుగా ఆఫీసు నుంచి. కమలినికి చెబుతాలే, వీలున్నప్పుడల్లా ఇక్కడకొచ్చి కాలక్షేపం చెయ్యమనీ” – బలహీనంగా నవ్వాడు శేఖర్.
ఐదు నిమిషాల తర్వాత అక్కణ్ణించి బయటపడ్డాడు. కడుపులో పేగుల సొద. పొద్దున నాలుగిడ్లీలు తినడమే. చిన్నమ్మ భోజనం చేసి వెళ్లమంటే, ఇంటివొద్ద కమలిని ఎదురు చూస్తుంటుందని వొద్దన్నాడు. మధ్యహ్నం నుంచీ కడుపులో ఏమీ పోలేదు.
రోడ్డు మీదకొచ్చాడు. షేరింగ్ ఆటోలో అమీర్‌పేట చౌరస్తాలో దిగాడు. ఇమ్రోజ్ హోటల్లో కార్నర్ టేబుల్ కాడ కూర్చున్నాడు. ఎదురుగా రోడ్డు నాలుగువేపులా కనిపిస్తోంది. పరోటా ఆర్డర్ చేసి, కమలిని ఎక్కడికి వెళ్లుంటుందా అని ఆలోచిస్తున్నాడు. ఫ్లాష్! కళ్లకు కమలిని కనిపించి, మాయమైంది. తల విదిల్చాడు. అపనమ్మకంగా చూశాడు.
ఆనంద్ బజార్ షాప్ ముందు ఆగిన ఆటోలో కమలిని! కమిలినే!! ఆమె పక్కన.. ఎవడు? ఎవడో కాదు, శ్రీనాథ్! తమ పక్క పోర్షన్‌లో ఉంటున్న బ్యాచిలర్. చక్కగా తయారై ఉంది కమలిని. శ్రీనాథ్‌తో నవ్వుతూ కబుర్లు చెబుతోంది కమలిని. ఒకరి భుజం ఒకరు రాసుకుంటూ, కొత్త జంటల్లాగా, ప్రేమికుల్లాగా, సన్నిహితంగా – శేఖర్ కళ్లకే శక్తి ఉంటే, క్షణాల్లో ఆ ఇద్దరూ బూడిదైపోవాల్సిందే.
గ్రీన్ సిగ్నల్. ఆటో కదిలింది. ఎందుకో.. తను వాళ్లకు కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు శేఖర్. ఎక్కణ్ణించి వొస్తున్నారు? అట్నుంచి వొస్తున్నారంటే బేగంపేటో, సికింద్రాబాదో వెళ్లుంటారు. షికారుకెళ్లారా? సినిమాకెళ్లారా?
దెబ్బకు ఆకలి చచ్చింది. కడుపు రగులుతోంది కోపంతోటీ, అవమానంతోటీ. స్వతహాగా సౌమ్యుడు శేఖర్. కానీ ఈ అవమానం ఎలా తట్టుకోవడం? తల పగిలిపోతోంది. ఎవేవో పిచ్చి అలోచనలు. ఎందుకు బతకడం? ఏ బస్సుకిందో, లారీకిందో పడితే?
బయటకు నడిచాడు. వెనుక నుంచి సర్వర్ పిలుస్తున్నాడు. పట్టించుకునే స్థితిలో లేడు. బస్సెక్కాడు. తమ కాలనీకి కాదు. భాగ్యనగర్ కాలనీకి. అనితా అపార్ట్‌మెంట్స్‌లో ఉండే మిత్రుని దగ్గర ఆ రాత్రి గడిపాడు.
*   *   *
పొద్దున తొమ్మిది. ఇంటికొచ్చాడు, చెప్పుల చప్పుడు వినవచ్చేలా నడుస్తూ. తలుపు తట్టబోయాడు. తెరుచుకుంది. ఎదురుగా కమలిని, నవ్వుతూ! క్షణం.. నవ్వు మాయం! ఆమె కళ్లల్లో తత్తరపాటు!!
‘శ్రీనాథ్‌గాడు వొచ్చుంటాడనే ఆనందంతో తలుపు తీసిందన్న మాట’ – మనసులో కసిగా శేఖర్.
బలవంతాన కమలిని మొహంలో నవ్వు.
“అరె శేఖర్. రా రా. సర్‌ప్రైజ్.. చేసేశావ్. వారం అన్నావ్‌గా. ఐదో.. రోజే వొచ్చాశావేం. పోనీలే మంచి.. పని చేశావ్. ఈ ఐదు రోజులూ తోచక చచ్చి..పొయ్యాననుకో.”
శేఖర్ మొహంలో నిర్లిప్తపు నవ్వు. ఆమె గమనించలేదు. చూపులు ఎక్కడో. అతను కోపం, ఆవేశం ప్రదర్శించలేదు. ఎలాంటి అనుమానాన్నీ వ్యక్తం చెయ్యలేదు.
“తొందరగా పనైపోయింది. ఇక అక్కడ ఉండటమెందుకని వొచ్చేశా. నువ్వసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు కదూ, ఇప్పుడే వొచ్చేస్తానని” – శేఖర్.
లోపలికెళ్లాడు, ఆమె జవాబు కోసం చూడకుండా. బట్టలు మార్చుకున్నాడు.
*   *   *
2001 మార్చి.
మనసు కుదుటపడట్లేదు. కుదుటపడ్డానికి యత్నిస్తున్నాడు. కమలినిపై అతడి ప్రేమలో మార్పులేదు. ఉంటే అది ప్రేమ కాదు కదా.
ఆ శ్రీనాథ్‌కూ, కమలినికీ ఏం సంబంధం? ఎట్లాంటి సంబంధం? కమలిని ఉద్దేశమేంటి? ఏం చేయాలనుకుంటోంది? ఆమే, తనూ ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. పైగా తనను పెళ్లి చేసుకొమ్మని అడిగిందే కమలిని. ఆమె ఎందుకు ఇట్లాంటి పనిచేసింది?.. పిచ్చెక్కుతోంది శేఖర్‌కు.
సాధ్యమైనంత వరకు నిజాయితీగా బతుకుతూ, కమలినితో జీవితాన్ని ఆస్వాదిస్తూ, పిల్లలు పుట్టాక తనూ వాళ్లలో ఒకడై, వాళ్లను ఆడిస్తూ, తను ఆడుతూ, వాళ్లను తాననుకున్నట్లు తీర్చిదిద్దుతూ బతకాలని ఎంతగా ఆశించాడు. కమలిని కొట్టిన ఒక్క దెబ్బతో అతడి ఆశలన్నీ ధ్వంసం.
జీవితమంటే నాటకమనీ, మనమంతా అందులో పాత్రధారులమనీ ఎక్కడో చదువుకున్న మాటలు జ్ఞాపకానికొచ్చాయి. ఇదేం నాటకం! ఇలాంటి నాటకంలో తన పాత్రేమిటి? నాటకాల్లో వేషాలు వేసేవాళ్లు బయట తిరిగేప్పుడు రంగులు తుడిచేసుకుంటారు. తనేమో ఇంటా, బయటా రంగులు వేసుకునే తిరగాలా? తనకంటే వాళ్లు చాలా బెటర్.
మనసులో థామస్ మెదిలాడు. ఈ మధ్యే అతను తమ హాస్పిటల్ నుంచి కొట్టాయం మెడికల్ కాలేజీకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా వెళ్లాడు. వెళ్లేప్పుడు “ఓసారి కేరళకు రా బ్రదర్. నీకు మళ్లీ ఇక్కడకు రావాలనిపించదు” అన్నాడు తనతో. అతడిది కేరళలోని కోజికోడ్.
థామస్‌కు ఫోన్ చేశాడు.
“వాట్ ఎ కో ఇన్సిడెన్స్” – థామస్.
“ఏమిటి?” – శేఖర్, కాస్త ఆశ్చర్యంగా.
“నీకు కాల్ చేయాలని ఇంతకు కొద్దిసేపటి క్రితమే అనుకున్నా” – థామస్.
“విషయమేంటి?” – శేఖర్, ఒకింత కుతూహలంగా.
“మా కాలేజీలో సీనియర్ మెయిన్‌టెనెన్స్ ఆఫీసర్ జాబ్ ఖాళీ అయ్యింది. నువ్వే జ్ఞాపకమొచ్చావు. ఇక్కడకు వొచ్చే ఆలోచన ఉంటే చెప్పు. మా వాళ్లకు చెప్పి పెడతాను. ఇంతకీ నువ్వెందుకు చేశావో చెప్పు.”
“సడన్‌గా జ్ఞాపకమొచ్చావు. చాలా రోజులైంది కదా, ఓసారి పలకరిద్దామని చేశా.”
“ఓకే. మరిక్కడకు వొచ్చే ఆలోచన ఉందా?”
“అక్కడ బాగుంటుందంటే వొచ్చేస్తా.”
“అయితే.. డన్.”
కేరళకు వెళ్తున్నానని కమలినికి చెప్పాడు శేఖర్.
“ఇప్పుడక్కడి దాకా వెళ్లాల్సిన పనేముంది?” – కమలిని.
“మంచి ఆఫర్. శాలరీ కూడా ఎక్కువే. నీక్కావాల్సింది కూడా అదేగా” – శేఖర్.
అతని మాటల్లోని శ్లేష ఆమె మెదడుకు చేరలేదు.
“ఏమో నాకైతే అక్కడకు వెళ్లడం ఇష్టం లేదు.”
“సరే. ఇక్కడ ఓ నెల రోజులు సెలవు పెడతా, ఏదో కారణం చెప్పి. కొట్టాయంలో బాగుందో, లేదో తెలుసుకోడానికి ఈ నెల సరిపోతుంది కదా. నచ్చకపోతే వొచ్చేస్తా. నచ్చితే అక్కడే.”
“సరే నీ ఇష్టం.”
“కావాలనుకుంటే ఈ నెల రోజులు నీకు తోడుగా మీ అమ్మను పిలిపించుకో.”
“చూస్తాలే. అమ్మ ఇక్కడకొస్తే నాన్నకు కష్టమవుతుంది. నాలుగు రోజులుండి పొమ్మంటే ఇబ్బంది ఉండదు కానీ, నెల రోజులంటే ఇబ్బందే. సరేలే. ఎలాగో నేనే సర్దుకుపోతాను. అంతగా బోర్‌కొడితే అప్పుడు చూసుకోవచ్చులే.”
‘ఇబ్బంది వాళ్లకా, నీకా?’ – అడుగుదామనుకున్నాడు. పైకి “నీ ఇష్టం” అని ఊరుకున్నాడు.
కొట్టాయం వెళ్లాడు. నెల రోజులు గడిచాయి. శ్రీనాథ్‌తో కలిసి హాయిగా తిరుగుతోంది కమలిని. ఇంట్లోనే అతనితో కులాసాగా కబుర్లు చెబుతోంది. ఇలా జరుగుతుందని శేఖర్‌కూ తెలుసు. తెలిసీ తనెందుకు ఇలా చేస్తున్నట్లు? ఎందుకు ఇలాంటి అవకాశం అనాయాసంగా ఆమెకు కల్పించినట్లు? ఆమెకు అడ్డు కాకూడదనా? తన చేతకానితనాన్ని నిరూపించుకోడానికా? లేక ఆమెను పరీక్షించడానికా? తేల్చుకోలేకపోయాడు.
*   *   *
చిత్రమైన స్థితిలో కొట్టుమిట్టాడుతూ కమలిని. శ్రీనాథ్‌తో షికార్లకు వెళ్తున్నా అతడితో శారీరక సంబంధం పెట్టుకోలేదు. ఒకసారి ఆటోలో గోల్కొండకు వెళ్తుంటే ఆమె నడుం మీదుగా చేయిపోనిచ్చి బ్లౌజ్ మీద నుంచే ఆమె గుండ్రటి స్తనాన్ని పట్టుకొని వొత్తాడు శ్రీనాథ్. ఆమైనే ఉలిక్కిపడి అతడి చేతిని తోసేసింది.
“ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఇంక నీతో ఎక్కడికీ రాను” అని చెప్పింది మందలింపుగా. మిర్రర్‌లోంచి ఆటోడ్రైవర్ ఆసక్తిగా చూస్తున్నాడు. చూసి, వెనక్కి తగ్గాడు శ్రీనాథ్.
ఇంకోసారి – ఇద్దరూ ఇంట్లో కలిసి భోజనం చేస్తున్నారు. తన మొహం వొంక అదేపనిగా అతడు చూస్తుంటే “ఏమిటి?” – ఆమె.
మూతి పక్కన ఏదో అంటిందన్నట్లు సైగ చేశాడు. వేలుపెట్టి చూసుకుంది. ఏమీ తగల్లేదు.
“నీకు కనిపించదులే” – శ్రీనాథ్.
వేలిని ఆమె మూతివొద్దకు తెస్తున్నట్లుగా తెచ్చి, చటుక్కున తన మొహం వొంచి తన ఎంగిలి పెదాలతో, ఈమె ఎంగిలి పెదాలను గట్టిగా ఒత్తేశాడు.
గట్టిగా తోసేసి “ఇంకోసారి ఇలా చేస్తే నీకూ నాకూ కటీఫ్” – విసురుగా, కోపంగా కమలిని.
ఆమె మనసేమిటో అర్థంకాక అతను తికమక. తనతో సినిమాలకూ, షికార్లకూ తిరగడానికి ఏమాత్రం సంకోచించని ఆమె, చేతులు పట్టుకున్నా, అప్పుడప్పుడూ ఒళ్లూ ఒళ్లూ రాసుకున్నా పట్టించుకోని ఆమె, అంతకుమించి తనను ఎందుకు దగ్గరకు రానీయట్లేదు? తనెక్కడకు తీసుకుపోతే అక్కడకు వొచ్చే ఆమె, కులాసాగా ఎన్ని కబుర్లయినా చెప్పే ఆమె, కనీసం ముద్దు కూడా ఇవ్వదెందుకని? తనను వాడుకుంటోందా? ‘సరే. ఇట్లా ఎంతకాలం దూరం పెడుతుందో అదీ చూద్దాం’ – మనసులో.
“నీకు కోపం వొస్తే.. సారీ.. నిన్ను చూస్తూ ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయా. ఇంకెప్పుడూ.. నువ్వు కావాలన్నా ముద్దు పెట్టుకోనులే” – శ్రీనాథ్.
భోజనం పూర్తయ్యేదాకా వాతావరణం గంభీరం. అతడి మనసు కష్టపడిందని అర్థమైంది. ‘నేను మరీ అంత విసురుగా మందలించాల్సింది కాదు.. అమ్మో.. అలా గట్టిగా కోప్పడకపోతే అలుసైపోనూ.. ఇంకా ఇంకా చనువు తీసుకోడూ..’ – మనసులో, కమలిని.
నిజానికి ఇప్పుడే రోజులు హాయిగా గడుస్తున్నట్లున్నాయి ఆమెకు. హైదరాబాద్‌లో చూడాలనుకున్న చోట్లన్నీ ఒకటికి రెండుసార్లు చూసేసింది. ఏ సినిమా కావాలంటే ఆ సినిమాకు తీసుకుపోతున్నాడు శ్రీనాథ్. హుస్సేన్‌సాగర్ జలాల్లో జోరుగా స్పీడ్ బోటింగ్ చేసింది. గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో చూసి చిన్నపిల్లలా సంబరపడింది. జూపార్క్ అంతా కలియతిరిగి అక్కడి జంతువుల్నీ, పక్షుల్నీ పలకరించింది. ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్, లుంబినీ పార్క్, బొటానికల్ గార్డెన్స్, దుర్గం చెరువు రిసార్ట్స్‌లో విహరించింది. బిర్లా ప్లానిటోరియం చూసి ఆశ్చర్యపోయింది.
ఇవన్నీ ఒకెత్తు, షాపింగ్స్ ఇంకో ఎత్తు. పంజాగుట్ట మీనాబజార్‌లో షిఫాన్ చీర, పోలీస్ కంట్రోల్ రూం దగ్గరున్న కళాంజలిలో డిజైన్ శారీ, బేగంపేట షాపర్స్ స్టాప్‌లో టైటాన్ వాచ్, లైఫ్‌స్టైల్‌లో శాండల్స్, బషీర్‌బాగ్ జగదాంబ జ్యూయెలర్స్‌లో ముత్యాల హారం.. కొనిచ్చాడు శ్రీనాథ్. వారానికోసారి సాయంవేళ ఏ చట్నీస్‌కో, టచ్ ఆఫ్ క్లాస్‌కో, స్వాగత్‌కో, అనుపమకో వెళ్లి తినొస్తున్నారు.
కమలినికి జీవితం చాలా సుఖంగా, హాయిగా. ఇవేవీ శేఖర్‌తో తీరేవి కావు. అయినా ఏదో వెలితి, ఏదో అసంతృప్తి – కమలిని మనసును చికాకుపెడుతూ…
నెలకోసారి శేఖర్ వొస్తున్నాడు. ఆమెతో ముభావంగా గడుపుతున్నాడు. పేరుకు మొగుడూ పెళ్లాలు. మునుపటి దగ్గరితనమైతే లేదు. ఏమీ ఎరగనట్లే ఆమె ముందు నటించాల్సి రావడం శేఖర్‌కు చాలా కష్టం. పక్కనే శ్రీనాథ్‌తో తిరుగుతూ, శేఖర్ ఉన్నప్పుడు అతని తోడిదే లోకం అన్నట్లు గడపాలంటే కమలినికి మహా కష్టం.
*   *   *
శేఖర్‌లో కొత్త దిగులు. కమలిని తనను వొదిలేసి ఆ శ్రీనాథ్‌గాడితో లేచిపోతే? తన జీవితం సంగతి తర్వాత, కమలిని జీవితం ఏమై పోతుంది? పెళ్ళాం లేచిపోతే ఆ మొగుడిపై సొసైటీకి సానుభూతి. లేపుకుపోయిన వాడు కూడా బాగానే ఉంటాడు. ఆ లేచిపోయిన స్త్రీకే కష్టాలన్నీ. శూలాల్లాంటి మాటలతో గుచ్చిగుచ్చి పొడుస్తుంది లోకం. మోజు తీరాక ఆ మగాడు వొదిలేస్తే, ఆ స్త్రీ జీవితం మరింత ఘోరం, నరకం. అనాదిగా సంఘం ఇంతే.
కొట్టాయంలో ఆడా, మగా జంట కనిపిస్తే చాలు, శేఖర్ హృదయంలో క్షోభ. ఈ మధ్య ‘మిన్సార కణవు’ అనే తమిళ సినిమా చూశాడు. అందులో అరవింద్‌స్వామి చెప్పిన డైలాగులు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. కాజోల్‌ని తనను ప్రేమించేట్లు చెయ్యమని ప్రభుదేవాను ప్రాధేయపడతాడు అరవింద్. సరేనని కాజోల్‌ని పరిచయం చేసుకుంటాడు ప్రభు. ఇద్దరూ స్నేహితులవుతారు. అరవింద్ గురించి గొప్పగా చెప్పి, అతడిపై ఆమెకు ప్రేమ పుట్టించాలని చూస్తుంటాడు ప్రభు. చిత్రంగా అరవింద్‌ను కాకుండా ప్రభును ప్రేమిస్తుంది కాజోల్. ఇది తెలిసి ఆవేదనతో ఊగిపోతాడు అరవింద్. “నీ దగ్గర ఉన్నదేంటి? నా దగ్గర లేనిదేంటి?” అని ప్రభుదేవాను అడుగుతాడు.
ఇప్పుడు ఆ మాటలే పదేపదే జ్ఞప్తికొస్తున్నాయి. ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చూసి శ్రీనాథ్‌వైపు ఆకర్షితురాలైంది కమలిని? ఏ మాత్రం సంకోచం లేకుండా అతనితో ఎలా తిరుగుతోంది? తనేం లోటు చేశాడు? తిండికీ, బట్టకీ కరువు లేదే? అడపాదడపా ఆమె తీసుకెళ్లమన్న చోటుకు తీసుకుపోతూనే వొచ్చాడు కదా.
అంటే ఆమెకు తృప్తిలేదు వీటితో. ఇంకా ఇంకా కావాలి. తనకంటే ఆర్థికంగా లేనోళ్లు ఈ సొసైటీలో ఎన్నో లక్షలమందే.. కాదు.. కాదు.. కోట్లమంది. తమ ఆర్థిక స్థితిని అర్థం చేసుకొని, అందుకు తగ్గట్లుగా వాళ్లు బతకడం లేదా? సర్దుకుపోవట్లేదా? కమలినికి ఇలాంటి చెడుపని చేయడానికి ఎలా మనసొప్పింది? ఇదే ప్రశ్న ఆమెను అడగాలనుకున్నాడు, అడగలేకపోయాడు.
2002 మొదలు. ఈ మధ్యలో కమలినికి డబ్బు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. అప్పటికే మొబైల్ ఫోన్లు మార్కెట్లో వినియోగంలోకి ఎక్కువగా వొచ్చినా, ఇంకా అతను సమకూర్చుకోలేదు. ఎప్పుడైనా ఫోన్‌లో మాట్లాడుకోవచ్చని, అతన్నయినా ఒక మొబైల్ కొనుక్కోమని ఆమె చెబుతుంటే, దాటవేస్తూ వొస్తున్నాడు. అతనికి తెలీని సంగతి ఏమంటే, ఈ కాలంలో కమలిని హృదయానికి ప్రశాంతత అనేది లేకుండా పోయిందని. ఆమెకు చీరల మీదా, అలంకరణల మీదా, షికార్ల మీదా మోజెక్కువైనా, శ్రీనాథ్‌తో కొద్దో గొప్పో ఆ మోజు తీర్చుకుంటున్నా, అతడి చేష్టలు ఆమెకు భయాన్ని కలిగిస్తున్నాయి.
ఆమెకు అర్థమవుతోంది – అతను తన కోరికలు తీరుస్తోంది, కేవలం తన శరీరంపై కాంక్షతోనే అని. తన దేహంపై సున్నితమైన చోట్లను తాకుతూ అతను ఆనందం పొందుతున్నాడు. తన రొమ్ముల్ని రెండు మూడు సందర్భాల్లో వొత్తాడు. అప్పుడు తన దేహం వొణికిపోయింది – మైకంతోటో, మైమరపుతోటో కాదు – భయంతో, జుగుప్సతో.
ఏమీ ఆశించకుండా తను కోరుకున్నవాటిని అతనెందుకు అమర్చిపెడతాడు? అతన్నుంచి తను కోరుకున్నవి పొందుతున్నప్పుడు, తన నుంచి అతను ఆశించకుండా ఎందుకుంటాడు? ఆ తెలివి తనకెందుకు లేకపోయింది?
తను ప్రేమగా ఉంటే, తనకు కావాల్సినవన్నీ శ్రీనాథ్ అమర్చిపెడతాడని ఊహించుకుందే కానీ, అతను తన దేహాన్నే కోరుకుంటాడని ఊహించలేక పోయిందెందుకని? అతడితో పరిచయమైన రోజు నుంచీ, ఈ రోజు దాకా చూసుకుంటే తన కోరికలు కొన్ని తీరాయనేది నిజమే. కానీ, వాటితో అప్పటికి తాత్కాలికంగా సంతోషం కలిగినా, తర్వాత్తర్వాత ఏదో తెలీని అశాంతి వేధిస్తూ వొస్తోంది. శేఖర్‌తో అందమైన జీవితాన్ని కలలు కన్నది. ఆ కలలు నెరవేరడం లేదని షోకిల్లారాయుడైన శ్రీనాథ్‌కు దగ్గరైంది.
నగలూ, ఖరీదైన చీరలూ కొనిపెట్టలేకపోయినా శేఖర్ తనను ప్రేమించాడు. తన బాధ అతడి బాధ. ఎట్లా లాలించేవాడు! తనకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని తపించేవాడు. తనను దగ్గరకు తీసుకున్నప్పుడల్లా అతడి స్పర్శలో, అతడి ఊపిరిలో ఎంతటి అనురాగం!
కొంతకాలంగా శేఖర్ తనతో అంటీ అంటనట్లుగా ఉంటున్నాడు. ప్రేమగా పలకరించడం లేదు. దగ్గరకు రాకుండా దూరదూరంగా మసలుతున్నాడు. అంటే.. అంటే.. తన విషయం శేఖర్‌కు తెలిసిపోయిందా? అందుకనే అట్లా దూరంగా మసలుకుంటున్నాడా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అనిపించడమేమిటి? అదే నిజం. లేకపోతే అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు?
ఆందోళనా, ఆవేదనా కలిసి.. కమలిని ఒంటిలో వొణుకు. తన వ్యవహారం తెలిసి కూడా ఒక్క మాటా అడగకుండా, ఒక్క మాటా అనకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? నిజంగా తెలిసుంటుందా? తెలీకపోతే అతడి ప్రవర్తనకు అర్థం? శేఖర్‌కు తెలుసో, తెలీదో.. పోనీ. ఇకముందు అతడిని మోసం చెయ్యకూడదు. కానీ.. ఇప్పటిదాకా చేసిన తప్పుడు పనులో? అతడి ముందు తన తప్పును వొప్పుకొని క్షమించమని అడగొద్దా? తను శేఖర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకొని అతడితోనే లోకమని అబద్ధాలాడి, ఇంకొకరితో తిరుగుతోంది. దీన్నెలా సరిదిద్దుకోవాలి?.. కమలిని తల పగిలిపోతోంది.
శనివారం రాత్రి కొట్టాయం నుంచి వొచ్చాడు శేఖర్. భోజనాలయ్యాయి. తను చేసిన పిచ్చి పనులు చెప్పుకొని, క్షమించమని అడగాలని చెబుతోంది కమలిని మనసు. ధైర్యం చాల్లేదు. దానికి బదులుగా “నేను కూడా నీతో వొచ్చేస్తా. నువ్వక్కడ, నేనిక్కడ.. ఇట్లా ఎంత కాలం? నువ్వొచ్చేదాకా వారాల పాటు ఎదురుచూస్తూ ఉంటం నా వల్ల కావట్లేదు” – ఆమె.
అతనిలో కాస్తంత ఆశ్చర్యం. నవ్వొచ్చింది. ఆమెకు కనిపించకుండా పెదాల మాటున అదిమిపెట్టి “ఇప్పుడు నేనుంటున్న ఇంట్లో కుదరదు. ఒక్కటే గది. ఇద్దరికీ సౌకర్యంగా ఉండే ఇల్లు చూస్తా. అప్పుడు వొద్దువుగానీలే” – అతను.
దూర ప్రయాణం చేసి అలసివుంటంతో నిద్ర ముంచుకువొస్తోంది. వెళ్లి పడుకున్నాడు. ఆ పూట అతడితో కాసేపు కబుర్లు చెప్పాలనీ, మనసు విప్పాలనీ కమలిని ఆరాటం.
“ఏమైనా కబుర్లు చెప్పకూడదూ? కొట్టాయం ఎట్లా ఉందో, అక్కడి మనుషులు ఎట్లా ఉంటారో, నీకు అక్కడ ఎట్లా అనిపిస్తున్నదో చెప్పొచ్చు కదా. ఎప్పుడూ రావడం, అలసిపోయానని పడుకోడం. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని ఇన్నాళ్లూ నేను ఏమీ అడగలేదు. ఇవాళ పౌర్ణమి. డాబా పైకెళ్లి పడుకొని, కాసేపు కబుర్లు చెప్పుకుందాం” – కమలిని.
తట్టింది, అతడి భుజంపై. లేద్దామనుకున్నాడు. మనసు ఎదురు తిరిగింది. ఆమె నటిస్తోందనీ, తనకు అనుమానం రాకుండా ప్రేమ వొలకబోస్తోందనీ ఊహ.
“ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాంలే. నిద్ర ఆగట్లేదు” – శేఖర్. ఆవులించాడు. కళ్లు మూసుకున్నాడు.
కమలినికి తన్నుకొస్తోంది, ఏడుపు. చప్పుడు చెయ్యకుండా డాబా పైకెళ్లి చాపమీద పడుకుంది. ఆమె కన్నీళ్లతో తడిసి దిండు ఉక్కిరిబిక్కిరి.
*   *   *
ఇప్పుడు కోజికోడ్‌లోని సెంట్రల్ లైబ్రరీకి బానిస శేఖర్. ప్రపంచ సాహిత్యం చదువుతుంటే ఇంకా ఇంకా విశాలమవుతూ మనసు. అక్కడికెళ్లే సమయం చిక్కకపోతే కొట్టాయంలోని పబ్లిక్ లైబ్రరీకెళ్లి ఇంగ్లీష్ పత్రికలు చూస్తున్నాడు.
కొట్టాయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వెన్నిమాల, మాతృమాల అనే కొండ ప్రాంతాలకు వెళ్లి సాయంత్రాలు కాలక్షేపం చేస్తున్నాడు. థామస్ మరింత దగ్గరయ్యాడు. అతను లేకుండా ఒంటరిగా వెళ్లాలనుకున్నప్పుడు లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాన్ని తీసుకుపోయి, అక్కడ చదువుకుంటుంటే మనసు వెలిగిపోయేది.
కొట్టాయం దగ్గరలోనే ఉన్న తిరునక్కర మహాదేవ ఆలయం (శివాలయం)కు అప్పుడప్పుడూ వెళ్లొస్తున్నాడు.
అక్కడ మరో రెండూళ్లు తెగ నచ్చేశాయ్. ఒకటి కల్లర, రెండు రామాపురం. కల్లరలో ఎటు చూసినా యేర్లు, వరిపొలాలు, ప్రాచీన గుళ్లు, చర్చిలు. ఎళుమంతురూత్ యేటిలో పడవపై ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోయాడు.
రామాపురం ఓ చారిత్రక స్థలం. రామాపురత్తు అనే యోధుడి జన్మభూమి. ప్రఖ్యాత మలయాళ రచయిత్రి లలితాంబిక నివసించిన ఊరు. అక్కడ రామాలయం ఉంది. ఆ గుడికి చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో భరత, లక్ష్మణ, శతృఘ్న గుడులున్నాయి. అన్నింటినీ దర్శించాడు. లలితాంబిక రాసిన ఏకైక నవల ‘అగ్నిసాక్షి’ ఫేమస్ అనీ, దానికి కేంద్ర సాహిత్య  అకాడమీ అవార్డు వొచ్చిందనీ తెలుసుకొని, దాని ఇంగ్లీష్ అనువాదం చదివాడు.
“ఏమిటి విషయం?” – థామస్, ఒక రోజు.
“ఏ విషయం?” – శేఖర్.
“సెలవులు వొస్తున్నా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నావ్. పుస్తకాలు తెగ తిరగేస్తున్నావ్. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చుట్టబెట్టేస్తున్నావ్. ఏంటి కత?” – థామస్.
బలహీనంగా నవ్వుతూ, మౌనంగా శేఖర్.
“నువ్వెళ్లకపోతే పోయావ్. నీ వైఫ్‌నైనా తీసుకొచ్చేయొచ్చుగా. నువ్విక్కడ, ఆమేమో అక్కడ. ఏం బాలేదు. ఇట్లా ఎంత కాలం?” – థామస్.
“ఆమె కూడా అదే అంటోంది. చూడాలి” – శేఖర్.
థామస్ ఇక పొడిగించలేదు. నిజానికి అతను శేఖర్‌తో మాట్లాడాలనుకున్నది ఆ విషయం కాదు.
“శేఖర్, నేను ‘నవజీవన్’ అనే ఓ సేవా సంస్థను ప్రారంభించాలనుకుంటున్నా. దానికి నా స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం ఉంటే సక్సెస్‌ఫుల్‌గా చేస్తాననే నమ్మకం ఉంది” – థామస్.
“నవజీవనా. బాగుంది. దానితో ఏం చేద్దామని?” – శేఖర్.
“అనాథలు, శారీరక, మానసిక వికలాంగులు ఎంతోమంది అనారోగ్యాలతో సరైన వైద్యం లభించక చచ్చిపోతున్నారు. అలాంటి వాళ్లకు మన హాస్పిటల్లోనే ట్రీట్‌మెంట్ ఇప్పించి, ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం. కేవలం వైద్యమే కాదు, వాళ్లకు ప్రేమానురాగాల్నీ అందించాలి. తద్వారా వాళ్లకు అందరిలా జీవితాన్ని కొనసాగించే ఏర్పాటు చెయ్యాలనేది నా సంకల్పం” – థామస్.
“ఎంత గొప్ప సంకల్పం!” – శేఖర్, అప్రయత్నంగా.
అతనిలో చాలా సంభ్రమం. ఇట్లాంటి ఆలోచన థామస్‌కు ఎట్లా వొచ్చింది? తనేమో సొంత సమస్యతో తెగ సతమతమైపోతూ, దాన్నుంచి ఎట్లా బయటపడటమా అని ఆలోచిస్తుంటే, థామస్ నలుగురికీ మంచి చేసే పని గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచన రావడం సరే, దాన్ని ఆచరణలోకి తీసుకు రావాలంటే ఎంత శ్రమ చెయ్యాలి! ఎంత ఓపిక కావాలి!!
“ఆలోచనదేముంది శేఖర్. ఆచరణ ముఖ్యం. వాళ్ల వైద్యానికి అయ్యే ఖర్చును భరించాలి. అందుకోసం నా జీతంలో పాతిక వంతును దీనికోసం కేటాయించాలని నిర్ణయించుకున్నా. పైగా ఇక్కడున్నంత కాలం వాళ్లకు ఆహారాన్ని ఏర్పాటుచేయడం కూడా ప్రధానమే. అందుకే నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాలి. ఇప్పటికే కొంతమంది నెలనెలా కొంత విరాళంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంతేకాదు. మన నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్, మెడికల్ స్టాఫ్ కూడా ఖాళీ టైంలో పేషెంట్స్‌కు ఉచితంగా సేవ చేస్తామని మాటిచ్చారు” – థామస్.
అతని ముందు తాను మరుగుజ్జు అయిపోయిన భావన శేఖర్‌లో.
“నువ్వు తలపెట్టింది చిన్న పనికాదు థామస్. నీకు సంసారముంది. పిల్లలున్నారు. సొంత కుటుంబం చూసుకోడానికే కష్టమైపోతోందని అందరూ చెబుతుంటారు. అట్లాంటిది ఇతరుల కోసం ఇంత పెద్ద పని తలకెత్తుకోడం, దాని కోసం టైం కేటాయించడం మామూలు విషయం కాదు. దానికి ఎంతో గొప్ప మనసు కావాలి. నీది ఖచ్చితంగా గొప్ప మనసు. నీకు నేనెలా ఉపయోగపడగలనో చెప్పు. తప్పకుండా చేస్తా” – శేఖర్.
థామస్ మొహంపై నవ్వు. “మరీ అంతగా పొగడకోయ్. ఇది నేనొక్కణ్ణే చేస్తున్నానా. చాలామంది సాయం తీసుకుంటున్నా. నువ్వనుకుంటున్నట్లు ఇది ఇప్పటికిప్పుడు నాలో కలిగిన ఆలోచన కాదు. నేను కుర్రాడిగా ఉన్నప్పట్నించీ ఉన్నదే. ఓ రోజేమైందో తెలుసా? మా నాన్నకు విపరీతమైన కడుపునొప్పి వొచ్చింది. మా ఊళ్లో ఆస్పత్రి లేదు. జిల్లా ఆస్పత్రికెళ్లాలంటే పది కిలోమీటర్లు ప్రయాణించాలి. నాన్నను  బస్సులో తెచ్చేసరికి హాస్పిటల్ మూసేశారు, టైం అయిపోయిందని. ఆ రోజంతా ఆస్పత్రి వరండాలోనే ఉన్నాం. కడుపునొప్పితో విలవిల్లాడుతున్న నాన్నను పరీక్షించిన డాక్టర్ వెంటనే ఆపరేషన్ చెయ్యాలన్నాడు. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు మా వద్ద లేదు. ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్లో ఉన్న పేషెంట్సే తలా కొంచెం చందాలు వేసుకొని ఆదుకున్నారు. మానవత్వాన్ని ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూశా. అప్పుడే అనుకున్నా. ఆపదలో ఉన్న పేషెంట్స్‌ను ఎలాగైనా ఆదుకోవాలని. ఇప్పటికి అది కొలిక్కి వొచ్చింది. సరే.. ఈ పనిలో నువ్వెలా భాగం కావాలనుకున్నా సంతోషమే. డబ్బు సాయం చెయ్యొచ్చు. అనాథలను హాస్పిటల్‌కు తేవడంలో మాకు తోడ్పాటునీయొచ్చు” – వివరంగా, థామస్.
“రెండూ చేస్తా. నీకేమైనా అభ్యంతరమా?” – మనస్ఫూర్తిగా, శేఖర్.
‘నవజీవన్’ పని మొదలైంది. మొదటి రోజు అన్నదానానికి కిలో బియ్యం సరిపోయింది. నెల రోజులు గడిచేసరికి అది పది కిలోలకు పెరిగింది. రోగుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన వాళ్ల కోసం ఓ అద్దె ఇల్లు తీసుకున్నారు. దానికి ‘నవజీవన్ భవన్’ అనే పేరు పెట్టారు. ఇప్పుడు శేఖర్‌కు ఖాళీ సమయం ఉండట్లేదు. హాస్పిటల్ డ్యూటీ అవగానే నవజీవన్ భవన్‌కు వొచ్చేస్తున్నాడు.
జబ్బు నయం అయిన అనాథ పిల్లలను ఎర్నాకుళంలోని శిశుభవన్‌కు తీసుకెళ్లే బాధ్యతను అతనే చూసుకుంటున్నాడు. ఈ పనిలో పడి రెండు నెల్లపాటు హైదరాబాద్ రావడానికి అతనికి వీలు చిక్కలేదు.
*   *   *
రోజురోజుకూ పెరిగిపోతోంది, కమలిని మనసులో అశాంతి. శేఖర్ ప్రవర్తనతో పిచ్చిపడుతుందేమో అన్నట్లుంది. తన విషయం అతడికి తెలిసిపోయిందనే నమ్మకం గట్టిపడింది. అంతకు ముందే దూరం పెట్టేసింది శ్రీనాథ్‌ను.
ఒకసారొచ్చి “ఏమైంది నీకు? పద. స్వాగత్‌కు వెళ్దాం. నీ బాధేంటో చెబ్దువు గానీ” – శ్రీనాథ్.
“ముందు ఇక్కణ్ణించి వెళ్లు. పిచ్చి తలకెక్కి ఇంతదాకా నీతో తిరిగింది చాలు. ఇంకొంచెంసేపు ఇక్కడే ఉన్నావంటే అల్లరి పెడుతున్నావని గోలచేస్తా” – కమలిని, స్థిరంగా.
‘నువ్వూ, నేనూ కలిసి తిరగడం ఇక్కడివాళ్లకంతా తెలుసు. గోల చేసుకో. ఎవరూ నమ్మరు’ అందామనుకున్నాడు. ఆమె మొహంలోని నిజాయితీ ఆపేసింది. తనను ఇంతదాకా శారీరకంగా ఆమె హద్దుల్లోనే ఉంచిందన్న నిజం జ్ఞాపకమొచ్చింది. ఆమె వొంక అలాగే కొన్ని క్షణాలు చూసి, మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
అతడు తనకు కొనిచ్చిన వస్తువులన్నింటినీ అతడింట్లో పడేసి వొచ్చింది కమలిని.
*   *   *
2002 ఆగస్ట్ 7. ఉదయం నుంచీ ఒకటే వాన ముసురు. గద్దర్ ఇంటి ముందు ఆగింది ఆటో. కమలిని దిగింది. ఆ టైంలో ఇంట్లోనే గద్దర్. హాల్లో నలుగురైదుగురు రచయితలు, కవులు. అప్పటి రాజకీయాల గురించీ, సాహిత్యం గురించీ చర్చ. మధ్యమధ్యలో గద్దర్‌తో పాటు ఇంకో కవి నోటివెంట ఆశువుగా పాటలు. ఎవరో యువతి గబగబా గేటు తీసుకుని రావడం హాల్లోంచి చూశాడు గద్దర్. తలుపు తెరిచే ఉంటంతో నేరుగా హాల్లోకొచ్చి గద్దర్‌కు నమస్కారం పెట్టింది కమలిని.
t- galipatam-3
“దండాలు తల్లీ. ఎవరమ్మా నువ్వు. అట్లా కూర్చో” – చాప చూపిస్తూ, గద్దర్.
అక్కడున్నోళ్లంతా చాపలపైనే కూర్చుని ఉన్నారు. ఆమెకు గద్దర్ తప్ప మిగతా వాళ్లెవరూ తెలీదు. కమలినిలో మొహమాటం. గమనించాడు గద్దర్.
“వీళ్లంతా మనవాళ్లేనమ్మా. మంచి రచయితలు, కవులు. మొహమాటపడకుండా చెప్పు” – గద్దర్.
“నా పేరు కమలిని అండీ. మీరంటే మా ఆయనకు చాలా ఇష్టం” – కమలిని.
“అవునా. ఎవరు మీ ఆయన?” – గద్దర్.
“శేఖర్. మీరప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని చూసొచ్చిందాకా నిలవలేకపోయాడండీ” – కమలిని.
“మంచిది తల్లీ. ఎందుకొచ్చావో చెప్పు. ఆ పోరగాడికేమీ కాలేదు కదా. అతను లేకుండా ఒక్కదానివే వొచ్చావంటే ఏదో పెద్ద గడబిడ అయ్యుంటుంది” – గద్దర్.
ఏడుపు తన్నుకొచ్చింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
“ఈ తల్లికి నిజంగానే ఏదో కష్టమొచ్చినట్టుంది గద్దరన్నా. ఫర్లేదు చెల్లెమ్మా. మేమంతా నీ అన్నల్లాంటోళ్లమే. నీ బాధేందో చెప్పరాదే” – ఒకతను.
“గోరటి ఎంకన్న పేరు వినుంటావులే తల్లీ. ఇతనే ఆ ఎంకన్న. చెప్పు బిడ్డా. శేఖర్ ఏడున్నాడు?” – గద్దర్.
ధైర్యం తెచ్చుకొని పది నిమిషాల్లో తన కథంతా చెప్పింది.
“నేను తప్పుచేశాను. దాన్ని దిద్దుకోవాలనుకుంటున్నా. ఎలాగో తెలీడం లేదు. రెండు నెలలు దాటిపోయింది. మనిషి రావట్లేదు. నాలుగైదు రోజుల క్రితం ఫోన్‌చేసి అడిగితే వొస్తానన్నాడు. అతను రాలేదు కానీ మనియార్డర్ వొచ్చింది. తను నా మొహం చూడ్డానిక్కూడా ఇష్టపడట్లేదని అర్థమైంది. నాకు శేఖర్ కావాలి. అతనెక్కడెంటే నేనూ అక్కడే. అతన్ని ఇంకెప్పుడూ కష్టపెట్టే పని చెయ్యను. ఆ విషయం నేను చెబితే నమ్మడు. మీరు చెబితే నమ్ముతాడు. మీరు ఆయనకు దేవుడికిందే లెక్క. అందుకే వెతుక్కుంటూ మీ వద్దకొచ్చాను” – కమలిని.
రెండు మూడు నిమిషాల నిశ్శబ్దం. గద్దర్ వద్దకు ఈ రకమైన పంచాయితీ ఇదివరకెప్పుడూ రాలేదు. కమలిని గొంతులో, మొహంలో నిజాయితీ తోచింది అందరికీ.
“అన్నా, ఈ బిడ్డ చేసిన తప్పు తెలుసుకుంది. ఇక నుంచీ మంచిగా ఉంటానంటోంది. సాయం చెయ్యన్నా” – వెంకన్న.
గద్దర్ నవ్వాడు. కమలిని తలమీద చేయేసి “నిజం నిన్ను నీడగా వెంటాడుతున్నదే తల్లీ. ఇవాళ నువ్వే కాదు, ఎంతోమంది మార్కెట్ మాయలోపడి విలాసాలకు బానిసలవుతున్నారమ్మా. జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అనుబంధాల్నీ, ఆత్మీయతల్నీ విస్మరిస్తున్నారు. నువ్వు చాలా త్వరగానే నీ తప్పు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. శేఖర్ సంగతి నేను చూసుకుంటా. అన్నంతినెళ్లు తల్లీ” – గద్దర్.
*   *   *
మరోసారి ఆగస్ట్ 15కి. తెల్లవారితే 16.
ఒంటిమీదున్న రగ్గుతీసి అవతలకు నెట్టాడు శేఖర్. ఒళ్లంతా చెమట్లు. పక్కకు చూశాడు. కమలిని లేదు. లేచాడు. విపరీతమైన నీరసం. గద్దర్ ఫోన్ చేయడం, రాత్రి తను రావడం, కమలిని తనకు సపర్యలు చెయ్యడం.. అన్నీ జ్ఞాపకానికొచ్చాయి. ఆమె కన్నీటి చుక్క తన చేతిపైపడ్డం జ్ఞాపకానికొచ్చింది. ఆమె తప్పు తెలుసుకుందా? పశ్చాత్తాపపడుతోందా? లేక తన స్థితికి బాధపడుతోందా? ఆమె దుఃఖానికి రెండూ కారణమేనా?
మంచం మీంచి దిగాడు. ముందు గదిలో వెల్తురు. చప్పుడు చెయ్యకుండా కిటికీ రెక్కను నెమ్మదిగా తెరిచాడు. కింద కూర్చొని పేపర్‌పై ఏదో రాస్త్తూ, కమలిని. మధ్య మధ్య కళ్లు తుడుచుకుంటూ…
ఆ ఒక్క దృశ్యం.. ఆ ఒకే ఒక్క దృశ్యం.. ఎన్నో విషయాలు చెప్పింది. సందేహమే లేదు. ఈ కమలిని, మునుపటి కమలిని కాదు. తన కమ్ము!
ఆమెపై ప్రేమ ఉప్పెనలా తోసుకువొస్తుంటే.. తన కళ్లు తడవటం అతడు గమనించలేదు. ఒళ్లు స్వాధీనంలో లేని విషయం పట్టించుకోలేదు. తలుపు తోశాడు. “కమ్మూ!” అంటా ఒక్క ఊపున వెళ్లాడు. ఆమెలో ఉలికిపాటు. రాస్తున్న పేపర్‌ను దాచబోయింది, కంగారుగా. పేపర్ ఆమె మాట వినలేదు. చేతిలోంచి జారి కిందకి.
ఆమె తియ్యబోతుంటే, చటుక్కున దాన్నందుకున్నాడు. ఆమె కన్నీళ్లతో తడిసిన ఆ పేపర్‌లోని అక్షరాల వెంట అతని కళ్లు పరుగులు.
“శేఖర్ నన్ను క్షమించు. నీకు తీరని ద్రోహం చేశాను. నువ్వెంత మంచివాడివి. నాపై ఎంత ప్రేమ చూపావు. కానీ నేను ఆడంబరాల్లో, షోకుల్లో సుఖముందనే భ్రమల్లో మునిగాను. నీ ప్రేమను నిర్లక్ష్యం చేశాను. ఎండమావుల వెంట పరుగులు పెట్టాను. నా సంగతి తెలిసి కూడా తెలియనట్లు ఉంటున్నావని అర్థమైంది. నీ స్థానంలో ఇంకెవరున్నా అదే రోజు నాతో తెగతెంపులు చేసుకునేవాడు. లేదంటే ఆ చెంపా, ఈ చెంపా వాయించేవాడు. నీది అతి మంచితనం. నేను దారి తప్పుతున్నానని తెలిసి కూడా ఆ బాధను నీలోనే దాచుకొని, ఎంతగా కుమిలిపోతున్నావో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నావో. ‘ఇట్లాంటిదాన్నా.. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందీ’ అని ఎంతగా వేదన చెందుతున్నావో. నీ బాధ, వేదన న్యాయమైనవి. మానసికంగా నిన్నెంత క్షోభపెట్టానో తలచుకుంటుంటే నాపై నాకే పరమ అసహ్యం వేస్తోంది. నిజమైన సుఖమేమిటో, ప్రేమేమిటో తెలిసేసరికి నువ్వు నాకు చాలా దూరమైపోయావ్. నేను తప్పు చేశాననేది నిజం. కానీ నేను వ్యభిచారం చెయ్యలేదు. నీతో జరగని సరదాలను తీర్చుకోవాలనుకున్నానే కానీ ఈ శరీరాన్నీ, మనసునీ నీకు తప్ప ఇంకెవరికీ అర్పించలేదు. సంజాయిషీ కోసం ఈ సంగతి చెప్పడం లేదు. నీకు నిజం తెలియాలనే చెబుతున్నా. ఇదే సంగతి నువ్వు అభిమానించే గద్దర్‌గారికి చెప్పి, కొంత ఉపశమనం పొందాను. ఆయన మాటతోనే ఇప్పుడు నువ్వొచ్చావని తెలుసు. కానీ ఇందాక నువ్వు పలవరించినప్పుడు అర్థమైంది, నీ హృదయం ఎంతగా గాయపడిందో, ఎంతగా క్షోభించిందో. ‘కమ్మూ, ప్రేమ అంటే నమ్మకం, ప్రేమ అంటే భరోసా అనుకున్నా. నువ్వేమో డబ్బులోనూ, ఆడంబరాల్లోనూ, సరదాలు, షికార్లలోనూ ప్రేమ ఉందనుకుంటున్నావ్.  నన్నేందుకు మోసం చేశావ్?’ అని నిద్రలోనే అడిగావ్. నీతో కలిసి బతికే అర్హత నాకులేదని అర్థమైంది. అందుకే…”
అంతవరకే రాసింది. ఆ తర్వాత కన్నీటి చుక్క పడ్డట్లు తడిసింది పేపర్. కమలిని వొంక చూశాడు శేఖర్. తల అవతలకు తిప్పుకొని ఉంది, తన మొహం అతడికి చూపించే ధైర్యంలేక.
తన ప్రమేయం ఏమీ లేకుండానే, తనేమీ అనకుండానే ఆమె తన తప్పు తెలుసుకుంది. కమలిని ఇప్పుడు మారిన మనిషి. ఆమెకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అది చెయ్యలేడా?
ఆమె ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. ఆమె తలను చేతుల్లోకి తీసుకున్నాడు. “కమ్మూ, నన్ను వొదిలిపెట్టి నీ దారిన నువ్వు పోదామనుకుంటున్నావా? నేనేమైపోవాలనుకున్నావ్?” అంటా ఆమె పెదాలపై, నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు. తడిసిన కన్నులను పెదాలతో అద్దాడు. కన్నీటి చుక్కలు ఉప్పగా ముద్దాడాయి. రెండు చేతులూ అతడి వీపు వెనుగ్గా పోనిచ్చి మళ్లీ ఎవరైనా తమను వేరు చేస్తారేమోననే భయం ఉందేమో అన్నట్లుగా గట్టిగా, బలంగా శేఖర్‌ను వాటేసుకుంది కమలిని.
-బుద్ధి యజ్ఞ మూర్తి 
buddhi
Download PDF

2 Comments

  • JAYA REDDY BODA says:

    చాలా బాగుంది కథ .. ఏదయినా ఒక ఆకర్షణ లో ఇల్లు విడచి పోయే ఆడవాళ్ళకు సందేశం బాగుంది

  • mani kumar says:

    సామాన్య కమిలిని కంటే మెరుగ్గా ఉంది. ఎక్కువ మందికి నచ్చే కమిలిని ఈమె. సామాన్య కమిలిని ని లేడీ శోబన్ బాబు లేదంటే లేడీ జగపతి బాబు అనుకుంటే అక్కడ ఇబ్బంది ఉండదు. కిలాడీ అనుకుంటేనే తెగ విమర్శలు చేయాల్సి వస్తుంది. ఈ కమిలిని నేటి సగటు మిడిల్ క్లాస్ స్త్రీ. రైటర్ చక్కగా డీల్ చేసారు. అబినందనలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)