చూస్తూ చూస్తూ వుండగానే, అతనొక జ్ఞాపకం!

Dsc_7391

ముఖపుస్తకాలు లేని వొక అనగా అనగా కాలంలో స్నేహితులు వొకరి ముఖాలు వొకళ్ళు ఎలా చూసుకునే వారు? పొద్దూ పొద్దున్నే వొక చాయ్ తాగేసి, ఏ పొద్దుటి రైలో, ఫస్ట్ బస్సో అందుకొని దగ్గిరే వున్న స్నేహితుడి ముందు వాలిపోయే వాళ్ళు.

అవును, శేఖర్ – మేం “కంభా” అని పిలిచేవాళ్ళం- అలాగే వాలిపోయే వాడు వో ఆదివారం పొద్దున్న ఖమ్మంలో!

ట్విటర్లూ గట్రా లేని ఆ కాలంలో స్నేహితులు ఎలా పక్షి ముక్కుల్తో పొడుచుకునే వాళ్ళు? బహుశా, ఎక్కడో వొక పబ్లిక్ ఫోన్ పట్టుకొని, వొక పలకరింతో, ఇంకో తిట్టో రాల్చి వెళ్ళిపోయే వాళ్ళు.

అవును, కంభా అలాగే వున్నట్టుండి ఏ నెంబరూ లేని వొక ఫోన్లోంచి కొన్ని మాటలు మెల్లిగా రాల్చి తన వూళ్ళో తన మూలలో ఎక్కడో వొదిగి వుండి పోయే వాడు.

నెట్లూ మొబైల్ సెట్లూ లేని ఆ అనగా అనగా కాలంలోనే బహుశా మనుషులు ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు. మాట కోసం ఎదురు చూస్తూ వుండే వాళ్ళు. మాట కోసం కలవరిస్తూ వుండే వాళ్ళు. నిద్రలో స్నేహితుల పేర్లు పలవరిస్తూ వుండే వాళ్ళు.

చాలా అమాయకంగా ముఖంమీద ఎలాంటి పేచీ లేని వొక విశాలమైన నవ్వుతో కంభా ఖమ్మంలో మా ఇంటికొచ్చే వాడు. “ఖంభా ఆయారే, బాబూ!” అంటూ మా అమ్మ నవ్వుకుంటూ లోపలికొచ్చి కబురు చెప్పేది. (ఆ రోజుల్లో నేను వంట గదిలో డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని రాసుకునే వాణ్ని, మధ్య మధ్యలో అమ్మతో కబుర్లు చెప్తూ) శేఖర్ ఇంటి పేరు అమ్మ దగ్గిరకి వచ్చేసరికి ఉర్దూ యాసలో “ఖంభా” – అంటే స్తంభం- అయిపోయేది.

javed

చిత్రం: జావేద్

2

అప్పుడు కార్టూన్ అంటే ఇంకా ఏమిటో కంభాకి పూర్తిగా తెలీదు. పుస్తకాలు విపరీతంగా చదివే వాడు. . కార్టూనిస్టులు ఆ కాలంలో సాహిత్యంతో సంబంధం లేని వేరే లోకంలో వుండే వాళ్ళు నిజానికి!

కాని, కార్టూనిస్టుల లోకంలో కూడా సాహిత్యమూ కవిత్వమూ వుంటాయని అప్పుడే నా మటుకు నాకు సురేంద్ర (ఇప్పుడు “హిందూ” సురేంద్ర) వల్ల అనుభవమైంది. అప్పుడే సురేంద్ర – తన పేరుని సురేన్ద్ర- అని రాయడం మొదలెట్టాడేమో! సురేంద్రలాగానే శేఖర్ కి కూడా సాహిత్యం వొక ప్రాణం! తన అసలు ప్రాణం కార్టూన్ లో వుందని కొంచెం ఆలశ్యంగా తెలిసి వచ్చింది శేఖర్ కి! కాని, ఆ ప్రాణం చిరునామా తెలిసాక వొక క్షణం వృధా చేయలేదు శేఖర్!

శేఖర్, శ్యాం మోహన్, సురేన్ద్ర…ఇలా ఇంకా ఈ తరం కార్టూనిస్టులు అక్షరంలోంచి కుంచెలోకి చేసిన ప్రయాణం చాలా విలువైనదని నాకు అనిపిస్తుంది. ఈ సాహిత్య సహవాసం వల్ల ముందు తరంలో ఏ కొద్ది మంది కార్టూనిస్టులకో పరిమితమైన కొత్త అందం వీళ్ళ కుంచెల్లోకి వచ్చి చేరింది.

శేఖర్ చివరి దాకా ఆ సాహిత్య సహవాసాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాడు. బాగా గుర్తు- మహాశ్వేతా దేవి నవలల్ని చదివిన తాజా ఉద్వేగంలోంచి నడిచి వచ్చి, ఖమ్మంలో వొక ఆదివారం పొద్దున్న శేఖర్ అన్న మాటలన్నీ! “జీవితంలోని ఆ చిన్ని డీటెయిల్స్ మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం?” అని ఆ రోజు అతను నన్ను అడిగాడు. శేఖర్ కి ఆ “చిన్ని డీటెయిల్స్” మీద విపరీతమైన పట్టింపు! సాహిత్య వ్యాసాల రచనతో మొదలైన శేఖర్ ప్రయాణం కార్టూన్ దగ్గిర స్థిర పడడంలోడీటైల్స్ మీది పట్టింపే కారణమని నాకు అనిపిస్తుంది. రోజువారీ జీవితాన్ని కార్టూనిస్టు చూసినంత దగ్గిరగా మరో కళాకారుడు చూడలేడు అని నేను ఖాయంగా చెప్పగలను. ఎందుకంటే, కార్టూనిస్టు daily basis మీద జీవితాన్ని బేరీజు వేసుకోవాలి. వాస్తవికతని చూస్తూనే దాన్ని ఆట పట్టించే క్రిటిక్ అతనిలో వుండాలి. అంత కంటే ఎక్కువగా ఆ వాస్తవికతని దాని అసలు రూపు చెడకుండా నవ్వు పుట్టించే కోణంలోంచి కూడా చూడాలి. కార్టూన్ వెనక వున్న ఈ ఫిలాసఫీ శేఖర్ కి అర్థమైంది. అందుకే, కార్టూన్ని వొక కళారూపంగా గుర్తించి తీరాలని మొండి పట్టుదల అతనికి!

ఇవాళ శేఖర్ మన ముందు లేని ఈ రోజున మీరు అతని కార్టూన్లన్నీ దగ్గిర పెట్టుకొని, వొక్కోటీ చూస్తూ వెళ్ళండి. ఈ కార్టూనిస్టు ఫిలాసఫీ గురించి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది.

శేఖర్ చివరి గీత

శేఖర్ చివరి గీత

3

నిజమే, జీవితం చాలా వేగంగా దూసుకుపోతోంది. మన మధ్య ఎవరున్నారో ఎవరు లేరో కనుక్కునే వ్యవధి మనకెవ్వరికీ లేదు. చూస్తూ వుండగానే, మన కళ్ళ ముందు పెరిగి పెద్దదైన వొక కార్టూన్ గీత నిష్క్రమించింది. వొక చిర్నవ్వు నిశ్శబ్దంలోకి రాలిపోయింది. వొక స్నేహ హస్తం మన భుజమ్మీంచి బలహీనంగా కూలిపోయింది. బతికి వుండగా వొక మనిషి ఎన్ని పాత్రాలు పోషించ గలడో, ఆ పాత్రలన్నీ ధైర్యంగా వాటిల్లో ప్రాణం పొదివినంత పదిలంగా పోషించి వెళ్ళిపోయాడు శేఖర్!

“కలడు కలండు అను వాడు కలడో లేడో!” అన్న నిత్య సంశయంలోకి నేను వెళ్లదలచుకోలేదు కాని, వుంటే, ఇదిగో – ఖాలిద్ హుస్సేనీ నవల The Kite Runners లో వొక పాత్ర అడిగినట్టుగా ఇలా అడగాలని వుంది…

When you kill a man, you steal a life. You steal his wife’s right to a husband, rob his children of a father. When you tell a lie, you steal someone’s right to the truth. When you cheat, you steal the right to fairness. Do you see?

మన మధ్యలోంచి వెళ్ళిపోయింది కేవలం వొక వ్యక్తి మాత్రమే కాదు, వొక కుంచె మాత్రమే కాదు. వొక నిజాన్ని నిజాయితీగా పలికే స్వరం. నిజానికి వున్న అనేక రూపాల్లో వొక రూపం!!

 – అఫ్సర్

Download PDF

9 Comments

  • buchi reddy gangula says:

    శేకర్ అన్నా —మిస్ you ——
    ——————————
    బుచ్చి రెడ్డి గంగుల

  • kcubevarma says:

    మన మధ్యలోంచి వెళ్ళిపోయింది కేవలం వొక వ్యక్తి మాత్రమే కాదు, వొక కుంచె మాత్రమే కాదు. వొక నిజాన్ని నిజాయితీగా పలికే స్వరం. నిజానికి వున్న అనేక రూపాల్లో వొక రూపం!!

    గొప్ప నివాళి..

  • kaashi raaju says:

    ఆయనతో స్నేహ బంధం తక్కువే అయినా చాలా భాదనిపించింది ఆయన లేరు అనే మాట వింటుంటే. ఇక మిత్రులు ఆయన కుటుంభం ఎంత భాధలో ఉన్నారో ! తప్పనిసరి తప్పిదాలు దేవుడెందుకు చేస్తాడో !

  • raamaa chandramouli says:

    “మన మధ్యలోంచి వెళ్ళిపోయింది కేవలం వొక వ్యక్తి మాత్రమే కాదు, వొక కుంచె మాత్రమే కాదు. వొక నిజాన్ని నిజాయితీగా పలికే స్వరం. నిజానికి వున్న అనేక రూపాల్లో వొక రూపం!!”
    అఫ్సర్.. నువ్వు మనుషుల్ని ఇంత గొప్పగా ఎలా ప్రేమిస్తావయ్యా.
    ఈరోజు శేఖర్ మీద వచ్చిన చాలా వ్యాసాల్లో ..ఈ హృదయ పరిమళం..కనబడలేదు.
    గొప్ప నివాళి.
    ఒక మనిషికి ఇంతకన్నా ఏమివ్వగలం.
    రామా చంద్రమౌళి,వరంగల్లు.

  • చక్కని ట్వీట్….బట్ అ ట్వీట్ నెవర్ ది లెస్..

  • రవి వీరెల్లి says:

    కుంచె కూడా కన్నీళ్లు పెట్టుకునే సందర్భం. అఫ్సర్ గారు, గొప్ప నివాళి! హార్ట్ టచింగ్! నాదీ రామా చంద్రమౌళి గారి మాటే!
    “అఫ్సర్.. నువ్వు మనుషుల్ని ఇంత గొప్పగా ఎలా ప్రేమిస్తావయ్యా?”

  • balasudhakarmouli says:

    మనుషుల పట్ల ఎంతో ప్రేమ వుంటేనే యిలా రాయగలరు. గొప్పగా రాసారు. కొందరి ప్రతిధ్వనులివి. అందరిని మీరే పలికారు. జీవితంలో మన స్నేహహస్తాలు రాలిపోతుంటే వొక దిగులు ఆవరిస్తుంది. మరణానికి మరణం లేదా ? అనిపిస్తుంటుంది.

    • చాల గొప్పగా వ్రాసారు. చెప్పే విధానములోనే ఎంత బలీయమైన ప్రేమ ఉన్నదో అర్దమైయే రితితో చాల అర్ధవంతంగా చక్కగా ఉంది. అమరులకు అశ్రు నివాళి ఎంత ప్రేమ భాందవ్యాలతో ముడి వేసినదో అర్దమైతుంది.

  • Afsarji,e ratri puta,mee rachanalu chadavadam, entha bagundi!
    T

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)