ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 4 వ భాగం

Ekkadi(1)

( గత వారం తరువాయి)

4

Ekkadi(1)

తన కొత్త ఇన్‌ఫినిటీ కార్‌లో దూసుకుపోతున్నాడు నలభై ఏళ్ళ రామం. ఇంటర్‌ స్టేట్‌ టు సెవన్టీపై..వేగం ఎనభై ఎమ్‌పిహెచ్‌. దాదాపు గంటకు నూటాపది కిలోమీటర్లు.. టైర్ల ధ్వని బీభత్సంగా..కార్లమంద..అప్పుడే కురిసి వెలిసిన వర్షపు నీరు దూసుకుపోతున్న కార్ల టైర్ల రాపిడివల్ల ఆవిరిగామారి తెల్లని పొగమంచువలె ఎగిసి,ఎవరో వెంటపడి తరుముతూంటే పరుగెత్తుతూ పారిపోతున్నట్టు ఎవరికివారు కార్లలో మందలు మందలుగా ఒకటే.. పరుగు. ఏదైనా అడ్డొస్తే తునాతునకలై ఎక్కడో ఎగిరి పడ్తుందన్నంత వేగం..మనిషికి ఇంత విధ్వంసకర వేగం అవసరమా అని అనిపించే ఒకణ్ణి మించి మరొకరి దూకుడు. గ్లోబల్‌ పొజిషనింగు సిస్టంలోనుండి ఆమె అరుస్తోంది..’టేక్‌ ఎగ్జిట్‌’ అని
రామం జిపిఎస్‌సిస్టం విన్నప్పుడల్లా ఆశ్చర్యంతో, పులకింతతో, మనిషి సాధిస్తూ వస్తున్న ఈ అనేక విజయాలపట్ల గర్వపడ్తూంటాడు. ఒక ఇంజినీర్‌గా ఈ ఊహాతీత సౌఖ్యాల సాధన అతనికి ఓ అద్భుతంగా తోస్తూంటుంది. వాషింగ్టన్‌ నేషనల్‌ పైక్‌.. ఫాదర్‌ హర్లే రోడ్‌.. టంగు టంగు.. ఘంట వంటి అలర్ట్‌ శబ్దం. ఎదురుగా స్టీరింగు పానల్‌ తెరపై సిక్స్‌ట్రాక్‌ రోడ్‌ బొమ్మ.. గుండ్రగా ఎంట్రీ, ఎగ్జిట్‌ రోడ్లతో కలిసి బ్రిడ్జ్‌ బొమ్మ., అందులో కారును సూచిస్తూ కదుల్తున్న బాణం ఎర్రగా.. లోపల్నుండి సమాంతరంగా సిడిలోనుండి సన్నగా వినిపిస్తున్న కంఠ ధ్వని..బయట వర్షం మళ్ళీ ఆరంభమై.,
”సాప్ట్‌ సిడి” అన్నాడు రామం. ఠక్కున వీణధ్వని ఆగిపోయింది. లోపల ఎవరో ఓ మనిషి కూర్చుని చెబుతున్న విషయాలన్నింటినీ విని అతి ఖచ్చితంగా, విధేయంగా చేస్తున్నట్టు..రిడ్జ్‌రోడ్‌ జంక్షన్‌.. ఎదురుగా ఎర్రని స్టాఫ్‌ లైట్లు.. మెల్లగా కారుకు బ్రేక్‌ వేస్తూ,
చీకటి ముంచుకొస్తోంది ఒక పెద్ద సముద్ర కెరటంలా..అందరూ గుంపులు గుంపులుగా ఆగితే..ముందున్న  కార్ల ఎర్రని టెయిల్‌ ల్యాంప్స్‌ సమూహం కణకణలాడే నిప్పుల ప్రవాహంవలె..ఎదురుగా ప్రక్క అప్‌స్ట్రీమ్‌లో..వస్తున్న కార్లమంద హెడ్‌లాంప్స్‌..పచ్చని కాంతితో ప్రవహిస్తున్న కరిగిన ఇనుమువలె..టు సెవెన్టీ ఎక్స్‌ప్రెస్‌ వే నుండి బయటికొచ్చి. ఎడమదిక్కు అబ్జర్వేషన్‌ డ్రైవ్‌లోకి..ఎదురుగా ఎర్రనిలైట్లు ఆకుపచ్చగా మారగానే..కదలికల్లో ఓ చైతన్యం…మళ్ళీ కార్ల పరుగు..
రాయల్‌ క్రౌన్‌..విలియం గిబ్స్‌ ఎలిమెంటరీ స్కూల్‌. మైల్‌స్టోన్‌ డ్రైవ్‌..డార్సిమిల్‌ రోడ్‌..’టేక్‌ లెఫ్ట్‌’ అని జిపిఎస్‌లోనుండి సూచన..వాటర్స్‌ హాలో..బ్రూక్‌ ఫీల్డ్‌..ఓల్‌నెస్ట్‌ సర్కిల్‌..నౌ..యు రీచ్చ్‌ యువర్‌ డిస్టినేషన్‌..గమ్యం..ఇల్లు చేరుట..,
మనిషి నిజానికి ఎప్పుడు తన గమ్యాన్ని..ఇంటిని..లక్ష్యాన్ని చేరినట్టు..తను ప్రారంభమౌతున్న చోటును..తను చేరవలసిన గమ్యాన్ని స్పష్టంగా నిర్వచిస్తే మానవ మేధతో నిర్మితమైన ఈ ఉపగ్రహ, సంచార, ఉత్సర్గ గ్రాహక వ్యవస్థ ఖచ్చితంగా దారిని చూపిస్తుంది. దిశానిర్దేశం చేస్తుంది. దారి తప్పితే సవరించి మళ్ళీ సరియైన దార్లోకి మార్గదర్శనం చేస్తుంది. మళ్ళీ దారితప్పుతూంటే హెచ్చరికకూడా చేసి దాదాపు తిట్టినంతపని చేస్తుంది.
కాని జీవితంలోనో.,
ఎందరికి తన జీవితం ఎక్కడ ప్రారంభమౌతోందో..తను చేరవలసిన గమ్యం ఏమిటో తెలుస్తుంది. ఎవరికైనా తన గమ్యం నిర్వచించుకుంటే దారి తెలుస్తుంది దారి తెలిస్తే దిశ, దూరం..దూరంతో వేగం స్పృహ..వేగంతో కాలం అంచనా.. కాలంతో తన ప్రణాళిక..పథకం..పథకంతో వ్యూహం.,
ఎవరినైనా ఓ మనిషిని ఎంచుకుని..నువ్వు రేపేం చేస్తావు..నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు. ప్రత్యేకంగా సాధించవలసిన లక్ష్యాలేవైనా నీకున్నాయా అని అడిగితే..పెళ్లిచేసుకుంటా, పిల్లలను కంటా, వీలైనంత ఎక్కవ డబ్బు కూడబెడ్తా.. పద్ధతి ఏదైనా ఫర్వాలేదు. డబ్బును గుట్టలు గుట్టలుగా పోగెేస్తా అని తప్పితే భిన్నమైన ఒక నిర్మాణాత్మక జవాబును ఎంతమంది ఇవ్వగలరు.
ఓ పుచ్చలపల్లి సుందరయ్యలా ఈ దేశంకోసం జీవించవలసిన తను భవిష్యత్తులో పిల్లలుంటే తన నిర్దేశిత లక్ష్యాలను చేరలేనని పిల్లలను కనకుండా ఎందరు కఠోర, త్యాగపూరిత నిర్ణయాలు తీసుకోగల్గుతారు.
అసలు భవిష్యత్తునే ఊహించలేని ఈ తరం..అస్తవ్యస్తంగా ఉన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడ్తూ దిక్కుమాలిన నీతిహీన, అనైతిక, అసమర్ధ ప్రభుత్వాల పాలనలో మగ్గుతున్న సమాజంలో..ఏమని ‘రేపు’ను స్వప్నించగల్గుతుంది. ఇక విలువలు, నీతి, నిజాయితీ, నైతికత.. వీటిగురించి కనీసం ఆలోచనైనా చేయగల్గుతుందా.,
రామం కారును గ్యారేజిముందు ఆఫ్‌ చేసి.. దిగి..సన్నగా కురుస్తున్న చినుకుల్లో..నాల్గడుగులు వేసి..తన ఇంటి తలుపులను తాళం చెవితో తెరిచి..ముందు గదిలో బూట్లు విడిచి, రాక్‌లో పెట్టి.,
‘ఇక తనకు కూడా..ఎప్పుడో పదేళ్లకు ముందు స్పష్టంగా నిర్వచించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కార్యరంగంలోకి దూకవలసిన సమయం ఆసన్నమైందా..’అనే ప్రశ్న..బాధ్యత…ఉద్యుక్తత ఉదయంనుండీ మనసులో పదేపదే కదుల్తూ.,
రామంకు గతవారంనుండీ మనసు మబ్బుపట్టిన ఆకాశంలా, గాలి దుమారంలో ఎడారిలా, కల్లోల సముద్రంలాఉంది. గతం.. ఏళ్ళకు ఏళ్ళుగా అనుభవించిన సంఘర్షణ..మేధోపరంగా ఒట్టి పుస్తకాల పురుగులా జీవిస్తూ.. ఉద్యోగం,వృద్ధి, సుఖవంతమైన జీవితం, విలామయమైన వ్యష్టి వికాసం..వీటినే పరమావధిగా భావిస్తూ నిర్మించుకున్న స్వప్న ప్రపంచంనుండి.. నాన్న.. నాన్నను తను అమెరికా వచ్చిన తర్వాతనుండే నిజంగా అర్ధం చేసుకున్నాడు.
‘నాన్న’..నాన్న జ్ఞాపకం రాగానే మనసు బకెట్‌లోని నీళ్ళను చేతితో లొడపెట్టినట్టు కల్లోలమై పోయింది.
రెండేళ్ళక్రితం నాన్న తన దగ్గరికి..యిక్కడి అనేక విశ్వవిద్యాలయాల్లో, మేధావుల సమావేశాల్లో, తెలుగు సంఘాలు ఏర్పాటుచేసిన సభల్లో మాట్లాడ్డానికి వచ్చినపుడు తనుకూడా ప్రతి సమావేశానికీ వెంటవెళ్ళాడు. నాన్న చేసిన అర్ధవంతమైన, అవశ్యమైన సామాజికాంశాలతోకూడి మనిషిని ప్రశ్నించే అనేక ఆలోచనాత్మకమైన ప్రసంగాలను ఒక ‘భారతీయ యువకుడిగా’ జీర్ణించుకుని ఎంతో ఉత్తేజాన్ని పొందాడు. చిన్ననాటినుండి పుస్తకాలు..చదువు..చదువు..ర్యాంకులు..స్థాయి..క్వాలిఫికేషన్‌ పెంచుకోవడం, స్టార్‌ స్టూడెంట్‌గా ఎదగడం..స్కూల్‌ ఫస్ట్‌..కాలేజి ఫస్ట్‌..స్టేట్‌ ఫస్ట్‌..ఐఐటిలో చేరాలని లక్ష్యం..ఐఐటీయన్‌ కాని జీవితం ఛీ.. ఏం జీవితం అని అహర్నిశలు పుస్తకాలు పుస్తకాలు..ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌.. శక్తి నిత్యత్వ సూత్రాలు, అణుధార్మిక సిద్ధాంతాలు, అత్యాధునిక శాస్త్ర పురోగతులు. కృత్రిమ మేధో విశ్లేషణలు..ద్రవ్య ప్రతిదవ్య భావనలు..నియమాలు. ఇవే ఇవే.,
రాత్రింబవళ్ళు..లైబ్రరీ..ఇంటర్నెట్‌..వికీపీడియా..డిజిటల్‌ పుస్తకాలు..ఐఐటీ మద్రాస్‌ హాస్టల్‌లో..ఎన్ని రాత్రులో.. ఒక అసాధారణ మేధోజీవిగా రామం అనే తనకు ఓ పేద్దపేరు. 1959లో ప్రారంభించబడి భారతదేశంలోనే ఒక అత్యుత్తమ విద్యాసంస్థగా పేరున్న ఐఐటి మద్రాస్‌నుండి మెకానికల్‌ ఇంజినీరింగులో..ఎమ్‌టెక్‌లో బంగారు పతకాన్ని సాధించడం ఒక సుందర స్వప్నం.

third week fig-2
నాన్న అప్పటికే రీజినల్‌ ఇంజినీరింగు కాలేజ్‌ వరంగల్‌లో ప్రొఫెసర్‌..అమ్మ తను హైస్కూల్‌లో ఉన్నపుడే పోయింది. అమ్మంటే ఒక దేవత అనే తీయని జ్ఞాపకం.. అమ్మ అంటే నవ్వు..అమ్మ అంటే ఒక ఆశీర్వాదం..అంతే తెలుసు తనకు..నాన్న అంటే ఋషి..పుస్తకాలు..పాఠం..బోధన..జ్ఞానం..ఒక సజీవ సిద్ధాంతం..తను పుట్టినప్పటినుండీ తనకు తెలిసిందీ, తను ఆడుకున్నదీ, తన పరిసరాలూ అన్నీ పుస్తకాలే..అంతా నాన్నే.
నాన్న చెప్పేవాడు..పుస్తకాలు రెండు రకాలని..ఒకటి విద్యావిషయక శాస్త్రాలు..గణితం, భాష, చరిత్ర, భౌతిక, రసాయనికి శాస్త్రాలు..ఇవి..ఈ ప్రపంచ భౌతిక జీవితం గురించి చెప్పేవి. రెండు సృజనాత్మక పుస్తకాలు..కవిత్వం, శాస్త్రాలు, సంగీతం, కళలు, జీవితాధ్యయనాలు, దేశచరిత్రలు..పరిణామ సిద్ధాంతాలు, మనిషి పరిణామ ప్రక్షిప్తాలు, ఇతిహాలు, తత్వ, ఆధ్యాత్మిక శాస్త్రాలు..ఇవి..మనిషి గురించి, జీవితం గురించీ, జీవిత పరమావధి గురించి, హృదయం గురించి, అంతిమంగా ఈ సృష్టి ఏమిటి..గురించీ..ఒక అనంతానంత ఆత్మ దర్శనం.
దాదాపు.. ఎమ్‌.టెక్‌ పూర్తయి..స్వర్ణపతకం పొంది..రెండు మూడు ప్రఖ్యాత కంపెనీలలో కాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ వచ్చి.. ఓహ్‌ా.. పందొమ్మిది వందల తొంభై ఏడు..అనుకున్న ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి..అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షి పిల్ల పొందే అవ్యక్త మహానుభూతి..కాన్వొకేషన్‌ జరిగి..గవర్నర్‌ చేతులమీదుగా బంగారు పతకాన్ని మెడలో వేయించుకుని..పొంగి పొంగి.,
నాన్నకూడా వచ్చాడు ఆ కీలకమైన సభకు. ఆహుతుల్లో ఒకనిగా కూర్చుని కాన్వొనేషన్‌ను తిలకించాడు. అప్పుడు ఆయన కేవలం తండ్రి.. అప్పటికే ఆయన రీజినల్‌ ఇంజినీరింగు కాలేజిలో పేద్ద పేరున్న మెకానికల్‌ ఇంజినీరింగు ప్రొఫెసర్‌. ఐతే అనేక సామాజికశాస్త్ర, సాహిత్య గ్రంథాలు రాసిన రచయితగా నాన్నకు పెద్దపేరు..రాష్ట్రపతినుండి, రాష్ట్రప్రభుత్వంనుండి ఉత్తమ అధ్యాపకునిగా పురస్కారం పొందినవాడు. అతి తక్కువగా మాట్లాడేవాడు.. అనర్ఘళంగా ఉపన్యసించేవాడు.. అతి నిరాడంబరంగా ఒక నమూనాగా జీవించేవాడు.
ఆ రాత్రి.. భీకరంగావర్షం కురుస్తున్న రాత్రి..పన్నెండు దాటిందేమో.,హాస్టల్‌కు నాన్నా..తనూ తిరిగొచ్చి..నాన్నకు తను పొందిన బంగారు పతకాన్ని చూడమని ఇచ్చి..అతని కళ్ళలోకి తనకీ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా చూచిన క్షణం..
”వెల్‌ డన్‌ మై బాయ్‌..”అన్నాడు నాన్న..ఒక తండ్రి.
”థాంక్యూ నాన్నా..”నాన్నా అని పిలిపించుకోవడమే ఆయన కిష్టం.
”ఇటువంటి..ఎమ్‌టెక్‌లో స్వర్ణపతకాన్ని నలభై ఏళ్ళక్రితమే మీరు సాధించారుగదా నాన్నా..ఏమనిపిస్తోంది మీకు.”
‘ది ట్రెడిషన్‌ కంటిన్యూస్‌. అప్పుడు నాకుగానీ..ఇప్పుడు నీకుగానీ ..ఒక అధ్యాయం ముగిసింది నాన్నా..ఇప్పుడు మనిషి ఒక చౌరస్తాలోకి వచ్చి నిలబడ్డాడు. ఈ కీలకమైన సందిగ్ధసమయంలో మనిషి తన జీవితాన్ని నిర్దేశించగల ప్రధాన నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంటుంది.. ఐతే..” అని ఓ క్షణం ఆగి..తన కళ్ళలోకి చూశాడు నాన్న ఎంతోసూటిగా..బాగా జ్ఞాపకం తనకు ఆ చూపు ..గుచ్చుకున్న ఆ చూపు.,
”ఐతే.. మనిషి ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఆ నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపపడవలసిన పరిస్థితి రావద్దు. ఆచితూచి, మనిషిగా పరిపూర్ణమైన జ్ఞానంతో అడుగుముందుకు వేయాలి.”
”…..”ఒట్టిగా వింటున్నాడు తను.
”మనిషి ప్రధానంగా వ్యష్టి జీవి.ఎంతసేపూ నూటికి తొంభైఐదు శాతం మందికి తను, తన భార్య, తన పిల్లలు, తన పరివారం, తన సంపద..తన అభివృద్ధి.. తన సంతోషం..ఇవే. ఐతే ప్రకృతిసహజంగా మనిషి. ఆ మాటకొస్తే ఏ జీవియైనా సంఘజీవి అనే ప్రాథమిక సూత్రాన్ని మరిచి, తన సహ మానవులపట్ల, జీవులపట్ల, సమాజంపట్ల..సంఘ బాధ్యతలపట్ల మనిషి ఆలోచించడం క్రమంగా మరచిపోతూ..”
”అర్థమైందా రామం..”
”ఊఁ.. ఔతోంది”
”మనిషి ఎప్పుడూ సమాజంలోనుండి ఎదుగుతాడు. ఉదాహరణకు ఒక ఐఐటీయన్‌గా నువ్వీ డిగ్రీ పొందడానికి ప్రభుత్వం..అంటే ఈ భారత ప్రజలు దాదాపు ఇరవై ఐదు లక్షలు నీపై ఖర్చు చేశారు..నువ్వనుకుంటావు..నిన్ను నేను కన్నాను, కొంత నేను చదివించాను..ఎక్కువగా రేయింబవళ్ళు కష్టపడి నువ్వు చదువుకున్నావు.సాధించావు..అని..అది పాక్షిక సత్యమే. పూర్తి సత్యంకాదు. ఐఐటి అనే ఈ మహత్తరమైన ప్రజల డబ్బుచే నిర్మించబడ్డ సంస్థ సమాజపరంగా చేస్తున్న విద్యాదాన క్రతువువెనుక లక్షలమంది అతి సామాన్యపౌరుల చెమటతో నిండిన డబ్బే ఖర్చవుతున్న సంగతి..”
”….”
”కొన్ని బయటికి కనిపించవు. కనబడకుండా గుప్తంగానే దాగి ఉంటాయి అగ్నిలా..ఇక్కడే మనిషి బాధ్యతాయుతంగా ఆలోచించాలి.. వ్యష్టిగా కాదు.. సమిష్టికోసం..”
”అంటే..”
”నీకిప్పుడు టిసిఎస్‌లో సెలక్షన్‌ వచ్చింది. నువ్వు యుఎస్‌ఎ – మేరీల్యాండ్‌ ఆఫీస్‌లో జూన్‌ పదిన రిపోర్ట్‌ చేయాలి. హెచ్‌వన్‌బి వీసాగీసా, నీ ఫ్లైట్‌ టికెట్‌ ..అన్నీ రెడీ చేయబడ్డాయ్‌..ఔనా..”
”ఔను..”
”నలభై ఏండ్ల క్రితం నాకిదే జరిగింది..రీజినల్‌ ఇంజినీరింగు కాలేజి మొదటి బ్యాచ్‌ విద్యార్థిని నేను..ఎమ్‌ఇ చేసి.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో..అరబ్‌ దేశమైన బహ్రాన్‌లో..అరామ్‌కో అనే ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తి కంపెనీలో ట్వంటీ కె డాలర్లతో ఉద్యోగం వచ్చింది..నా మిత్రులు, నా ప్రొఫెసర్లు, అందరూ ఆ అదృష్టానికి ఎంతగానో అభినందించారు.. కాని నేనా ఉద్యోగంలో చేరలేదు. తిరస్కరించాను.” ఆగిపోయాడు నాన్న.
” మా నాన్నా ఒక సాధారణ ప్రాథమిక పాఠశాల పంతులు. నిజాయితీకి ప్రతీక. అన్నాడు..’ఇన్నాళ్ళూ నిన్ను కని, సాది, పెంచి పెద్దచేసిన నన్నూ, అమ్మనూ నువ్వు అర్థాంతరంగా ఈ వృద్ధాప్యంలో విడిచి వెళ్ళడం ఎంతవరకు న్యాయమో తెలియదు నాన్నా..కాని..నిన్ను ఈ దేశపు బీదాబిక్కి ప్రజలు పన్నులరూపంలో సమకూర్చిన డబ్బుతో ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డ మేధోజీవివైన తర్వాత ఈ దేశంపట్ల, ఈ ప్రజలపట్ల, ఈ సమాజంపట్ల, నీకెటువంటి బాధ్యతా లేదా నాన్నా. నీ అద్భుతమైన తెలివితేటలు ఈ దేశంకోసం, ఈ దేశప్రగతికోసం, ఉపయోగపడొద్దా..అవన్నీ నిన్ను పోషించే వేరే ఇతర దేశాలకోసమే ధారపోయాలా.’ అని..”
”……”
”ఒక రాత్రంతా ఆలోచించాను..నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజుకూడా ఇలాగే..కుండపోతగా వర్షం..ఎడతెగని వర్షం.. మర్నాడు నిర్ణయం తీసుకున్నాను..అరామ్‌కోలో చేరలేదు. ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాను. స్థిరంగా, లోతుగా, బాధ్యతాయుతంగా ఆలోచించి చివరికి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగు కాలేజిలో లెక్చరర్‌గా చేరాను.. ఎందుకంటే టీచర్‌ ఒక జ్యోతివంటివాడు..ఒక జ్యోతి లక్షల దీపాలను వెలిగిస్తుంది. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని కాంతిమయం చేస్తుంది.. ఇన్నాళ్లుగా నేను చేస్తున్నదదే..నేను కొన్ని తరాలను తయారు చేస్తున్నాను.” చెప్పుకుపోతున్నాడు నాన్న ఒక ట్రాన్స్‌లో ఉన్న మనిషిలా.
”మంచి టీచర్‌ ఒక అంకెవంటివాడు రామం. ఒట్టి సున్నాల్లాంటి విద్యార్థులు అతని ప్రక్కన చేరి విజ్ఞానవంతులై పదులు, వందలు, వేలు, లక్షల సంఖ్యలుగా విస్తరిస్తారు. విద్యాదానం ఒక యజ్ఞం..ఒక క్రతువు..ఒక అదృష్టం..”
”…..”
”ఐతే ఎవరి జీవితం వారిది. తత్వాలు కూడా ఎవరివి వారివే. అప్పటి సామాజిక, వ్యక్తిగత సందర్భంలో వ్యక్తి విజ్ఞతనుబట్టి తగు నిర్ణయం తీసుకోవాలి. నౌ ఇటీజ్‌ లెప్ట్‌ టు యు..”
”…..”నాలో ఒక అనిశ్చితి.. కాని అవగతమౌతున్న మనిషి బాధ్యత.. జీవిత పరమార్థం.
ఇన్నాళ్ళూ వ్యక్తిగత వృద్ధి..వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నడక..ఇవన్నీ హస్తగతమైనాయి. ఇప్పుడు ఇక ‘నడత’ గురించిన స్పృహ కావాలి. అందరిలా పుట్టినం, ఎదిగినం, సంపాదించినం, పిల్లలను కన్నాం, చచ్చినం.. కాకుండాఏదో ఒక విలక్షణమైన మహా సంకల్పాన్ని ఒక పరిమితమైన పరిధిలోనే విస్తరించిఉన్న చూపును యిక విస్తృతపరచాలి. ఈ భారత సమాజాన్నీ, రాజకీయాలనూ, ప్రజల స్థితిగతులనూ, లోలోతుల్లోకి పయనించి చూడవలసిన నిజమైన జనజీవితాలనూ, అడవులను.. ఆదివాసీలను, గిరిజనులకు, విస్మరించబడ్డ బడుగుజాతులను.,
ఐతే.. వర్తమానాన్ని అంతర్జాతీయ మానవ సమాజంతో పోల్చి చూచినపుడు మాత్రమే పేదరికం, దరిద్రం, అవిద్య, కుళ్ళు రాజకీయాలు, అవినీతి, అనైతికత..ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అందుకే ఇప్పుడు ఒక విపులమైన అధ్యయనం చేయాలి తను. ఒక రాహుల్‌ సాంకృత్యాయన్‌వలె, ఇంగ్లండ్‌లో చదివి దక్షిణాఫ్రికాలో ఒక మామూలు మనిషిలా అడ్వకేట్‌ జీవితం జీవిస్తూనే ప్రపంచ రాజకీయాలను శాసించగల మహావ్యక్తిగా ఎదిగిన గాంధీవలె, దేశాంతర పర్యటనలతో తనను తాను తెలుసుకున్న అనిబిసెంట్‌ , జిడ్డు కృష్ణమూర్తివలె..ఇప్పుడు ఒక అధ్యయనాత్మక జీవితాన్ని కొంతకాలం గడపితే.. తర్వాత కార్యరంగంలోకి దూకితే..,
అదే అన్నాడు రామం అతని తండ్రితో..,
”మన్య విప్లవం ప్రారంభించడానికి ముందు అల్లూరి సీతారామరాజు విస్తృతంగా దేశమంతా పర్యటించి ప్రజల జీవితాలను అధ్యయనం చేశాడు. గాంధీకూడా అహింసా విప్లవోద్యమంలో దూకేముందు కాశ్మీర్‌నుండి కన్యాకుమారి దాకా అధ్యయన యాత్ర జరిపాడు. ఐతే..ఇప్పుడు భారతదేశం ఇంగ్లీష్‌వాడు పాలించినప్పటికంటే అనేకరెట్లు చెడిపోయి, పతనమై పోయి, కుళ్ళిపోయి ఉంది. భారతేతరులు పరిపాలించినపుడు ఎక్కడ జనం తిరుగబడ్తరోనన్న భయంతో ఒళ్లుదగ్గరపెట్టుకుని మెదిలారు. కాని యిప్పుడు మనల్ని పాలిస్తున్న మనవాళ్ళుమాత్రం నిస్సిగ్గుగా, నీతిహీనంగా ప్రజలను పీడించుకు తింటున్నారు. సమాజాన్ని దోపిడీ చేస్తున్నారు. పందికొక్కుల్లా అందినంత మేరకు స్వాహాచేసి ఇకిలిస్తున్నారు.”
”…..” శ్రద్ధగా వింటున్నాడు రామం.
”ఓట్లకోసం ఏమైనా చేయగల నిర్లజ్జ రాజకీయాలు ఈ దేశానికి శాపంలా దాపురించాయి. గత కొన్ని థాబ్దాలుగా వృద్ధనాయకత్వంలో దేశం మగ్గిపోతోంది. కొత్త మేధావితరం రాజకీయాల్లోకి రావడంలేదు. రాజకీయాలన్నీ మాఫియాలు, గుండాలు, నేరచరితులు, దొంగలు, దోపిడీదారులతో భ్రష్టుపట్టిపోయాయి. అధికారంకోసం ఏ దౌర్భాగ్యపు పనికైనా సిద్ధపడి పాలకులు విలువలను భూస్థాపితం చేశారు. దేశభక్తి, సామాజిక బాధ్యత, విలువలు, నైతికత, ఆత్మ.. యివన్నీ ఒట్టి కాలంచెల్లిన పదాలుగా మిగిలిపోయాయి. విషాదమైన విషయమేమిటంటే ప్రజలను ఈ ప్రభుత్వాలు తాగుబోతులుగా సోమరిపోతులుగా, అవినీతిపరులుగా, ఒట్టి కుక్కగొడుగులవంటి పారసైటిక్‌ తరంగా తయారుచేస్తున్నాయి. యధారాజా తథాప్రజా ధోరణిలో ప్రజలుకూడా పూర్తిగా అవినీతిపరులై ఎవనికి అందిందివాడు దోచుకుతింటున్నాడు. ఒక మున్సిపల్‌ ఇంజినీర్‌ ఇంటిపై దాడిచేస్తే కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్తున్నాయి. జనం ఈ రోజు విని రేపు అన్నీ మరిచిపోతున్నారు. ఎక్కడా జవాబుదారీతనం లేదు. ఒకవైపు హద్దులు మీరిన మీడియా, విచ్చలవిడి సినిమాలు, అతిస్వేచ్ఛాయుత వాతావరణంలో ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ సౌకర్యాల విషవలయంలో చిక్కి యువత నిర్వీర్యమై, దారితప్పి, పుట్టుకతోనే వృద్ధులుగా మిగిలి.. దేశం దేశమంతా వృద్ధ నాయకత్వంతో, అసమర్థులైన యువ వృద్ధులతో నిండి కుళ్లిపోతోంది రామం. ఏ కొద్దో మేధోసంపద ఉన్న నీవంటి క్రీమ్‌ విదేశాలపాలై ఈ దేశాన్ని అనాథను చేస్తోంది. ఈ దేశం కుక్కల పాలైపోతోంది రామం..” చటుక్కున ఆగిపోయాడుాన్న.
తలెత్తి చూస్తే..ఎదుట తండ్రి కళ్ళనిండా నీళ్ళు..పొంగిపొర్లుతున్న దుఃఖం అతని మాటలను సమాధి చేసింది.
ఇద్దరిమధ్య ఒట్టి నిశ్శబ్దం.
నిశ్శబ్దం ఒక్కోసారి ఎంతో శక్తివంతంగా సంభాషిస్తుంది. గర్జిస్తుంది. నినదిస్తుంది..నిలదీస్తుంది.
”..ఇప్పుడీ దేశానికి శస్త్ర చికిత్స జరగాలి రామం..బహుముఖంగా విరుచుకుపడ్తున్న అవినీతి, లంచగొండితనం ఈ భారత సమాజాన్ని కేన్సర్‌లా పీడిస్తోంది. ఒక తరిమెల నాగిరెడ్డి ‘ఇండియా మార్టిగేజ్డ్‌’ పుస్తకం రాసినప్పటి పరిస్థితి ఏమాత్రం మెరుగు పడకపోగా యింకా యింకా ఎన్నిరెట్లో కుళ్ళిపోయింది. కంపుకొడ్తోంది. దిస్‌ నీడ్స్‌ ఎ ప్రెషరైజ్డ్‌ వాషింగు, రాథర్‌ డిస్ట్రాయింగు అండ్‌ రీకన్‌స్ట్రక్టింగు..”
”ఔను..” స్థిరంగా జవాబు చెప్పాడు తను.
సరిగ్గా అప్పుడే ఫెళఫెళారావంతో ఎక్కడో పిడుగుపడింది. బాగా గుర్తు తనకు.. స్థితి తెలుసు తనకు.. తన ధర్మమూ, తన బాధ్యతా తెలుసు తనకు.. గురి తప్పకుండా బాణాన్ని సంధించి లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు నిగ్రహం, సంయమనంతో కూడిన పరిణతీ, ప్రావీణ్యం, సాధనా అవసరం.
అందుకే.. వ్యూహాత్మకంగానే తను అమెరికా వచ్చాడు.
మొట్టమొదట తను అమెరికా భూభాగంపై అడుగుపెట్టింది వాషింగ్టన్‌ డి.సి డల్లెస్‌ ఏర్‌పోర్ట్‌లో.. తొంభై ఏడు మే పదిహేనవ తేదీ సాయంత్రం నాల్గుగంటల ముప్పయి నిముషాలకు.
రాక్‌ విల్లేలో ఆఫీస్‌ …టాటా కన్‌సల్టేన్సీ లో హైటెక్‌ ఇంజినీరింగు, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌, సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవహారాలు చూచేవాడు తను. కనీసం ఒక ఏడాది పాటు టాటాస్‌తో ఉండాలని ప్లేస్‌మెంట్‌ అగ్రిమెంట్‌. హండ్రెడ్‌ కె పేమెంట్‌ పర్‌ ఆనం.
మేరీల్యాండ్‌ విలేజ్‌ గ్రీన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో మకాం. ఇక ప్రయాణం, ప్రయోగం, భవిష్యత్‌ పథక ప్రణాళిక  ప్రారంభం.
అమెరికాతో ఇండియన్స్‌కు ఉన్న వలసల అనుబంధం ఎంతో సుదీర్ఘమైందని రామంకు అతితొందరగానే అర్థమైంది  దాదాపు గత ఎనభై సంవత్సరాల నుండి భారతదేశం నుండి, ఆంధ్రదేశం నుండి కూడా విపరీతంగా వలసలు జరిగాయి. ఐతే ఎవరు వలస వచ్చినా ఒక మేధోపరమైన విలక్షణతతోనే యుఎస్‌ఎకు వచ్చారు. మొదట ఎక్కువగా  డాక్టర్లు, వ్యాపారులు, ఏ ఆధారమూ లేకుండా అలా గాలికి వచ్చి స్థిరపడ్డ బాపతు ఎక్కువైతే, తొంభైలలో అనూహ్యంగా వచ్చిన బూంవల్ల మాత్రం ఐటి ఇండస్ట్రీ ఈ వలసల వెల్లువను ఒక కుదుపు కుదిపి విడిచిపెట్టింది. ఐతే గతంలో వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఇండియన్స్‌ అంటే గౌరవనీయులై మేధోజీవులన్న సామాజిక విలువను యిక్కడ స్థిరపర్చి పదిలపర్చారు. ఈ పరంపర ఉధృతంగా కొనసాగి న్యూజెర్సీ, డెట్రాయిట్‌లాంటి చోట తెలుగువాళ్ల సంఖ్యాబలం ఎంత పెరిగిందంటే..అంతటా ఇండియన్‌ స్టోర్స్‌ ప్రత్యేకంగా నెలకొల్పబడ్డాయి. కాగా రాజకీయాలనుండి మొదలుపెట్టి భారత సంతతి జనం అనేక అమెరికా జీవనరంగాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. అమెరికాలోని మొత్తం డాక్టర్లలో ముప్పయి ఎనిమిది శాతం మంది భారతీయ డాక్టర్లు, ముప్పయి ఆరుశాతం ప్రతిష్టాత్మక నాసాకేంద్ర శాస్త్రజ్ఞులు, దేశ శాస్త్రవేత్తల్లో పన్నెండుశాతం, మైక్రోసాఫ్ట్‌లో ముప్పయినాల్గుశాతం,ఐబియంలో ఇరవై ఎనిమిదిశాతం, ఇంటెల్‌, జిరాక్స్‌లాంటి బహుళ జాతి కంపెనీల్లో పదిహేడు పదిహేను శాతం భారతీయులే విస్తరించి పోయారంటే..విస్తృతి ఎంత ఉధృతంగా జరిగిందో ఊహించవచ్చు.
ఐతే తొంభైలలో అమెరికాలోకి వచ్చిపడ్డ చెత్త చెదారం మాత్రం యిక్కడి నాణ్యతా ప్రమాణాలను బాగా దెబ్బతీసి ఒక రకమైన నిస్పృహను మిగిల్చి క్రమక్రమంగా భారతదేశం నుండి వలసలు తగ్గడానికి కారణం కావడం మాత్రం ఒక పచ్చినిజంగా జరిగింది. పెరుగుట విరుగట కొరకే అనేసూక్తి నిజమైంది కూడా. వేలు చూపితే కొండబాకే తత్వమున్న తెలుగువాళ్ళు అనేక అమెరికా సామాజిక రంగాల్లోకూడా చొరబడ్డారు.,
ఈ నేపథ్యంలో నిలబడ్డ వర్తమానం మాత్రం.. వాల్‌మార్ట్‌, జెయింట్‌. కాట్‌స్కో వంటి భారీ వ్యవస్థల్లో సేల్స్‌మెన్‌, మెయింటెనెన్స్‌ పీపుల్‌, ల్యాండ్‌ స్కేపర్స్‌, రోడ్‌ వర్కర్స్‌ వంటి అన్ని ప్రజా వినిమయ రంగాల్లో చిన్నస్థాయి ఉద్యోగాల్లో ఉన్న స్థానిక అమెరికన్లకు..’ఈ ఎక్కడనుండో వచ్చిన భారతీయులు మమ్మల్ని దోచుకుంటున్నారు అన్న కొంగ్రొత్త భావన కల్గుతున్నట్ట్థుానిక భారతీయుల అనుభవాలు చెబుతున్నాయి.
అడవి అంటుకోవద్దు..ఒకసారి నిప్పురవ్వ ఎండిన చెట్లనడుమ పడిందంటే ఆ బడబాగ్నిని నియంత్రించడం ఎవరితరమూకాదు. గత నాల్గుయిదు సంవత్సరాలుగా అంతర్జాతీయ సమాజంలో ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడా వంటి దేశాల్లో స్థానికేతరుల ఉనికి అక్కడి పౌరులను అసహనానికి గురిచేస్తున్న ఉదంతాలు పదేపదే పొటమరించడం.. ఒక విపరీత పరిణామం.
ఐతే చాలామంది సాధారణ అమెరికన్లు పౌరులుగా ఎంతో సంస్కారవంతులు. ప్రేమమయులు. క్రమశిక్షణ గల ఉత్తమపౌరులు. అందరిలోనూ ఎంతో గొప్పగా భాసించేది వాళ్ల దేశంపట్ల వాళ్ళకున్న విపరీతమైన ప్రేమ, దేశభక్తి, సమాజంపట్ల ఉన్న అంకితభావం. పౌరవిధులపట్ల స్పృహ. ఉదయం వాకింగు చేస్తున్నపుడు ఎదురైన ఏ అమెరికనైనా ప్రేమగా,నవ్వు ముఖంతో ‘హాయ్‌’అని పలకరిస్తాడు. కాని ఇండియన్స్‌ పలకరించలేకపోవడం సర్వసాధారణంగా కనబడే విషయం. అమెరికన్స్‌ ఎందుకో చదువులో..ఉంటే మహాగొప్పగా..లేకుంటే సగటుకంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
ఐతే.. చాలామంది అమెరికన్లు దురాశపరులు కారు. సంపాదించిన దాన్ని తమ తక్షణావసరాలకోసం, జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడం కోసం, ప్రధానంగా నాణ్యమైన ఆహారంకోసం, అలంకరణ, ఆరోగ్యంకోసం ఖర్చుచేస్తారు. కడుపు చంపుకుని పొదుపుచేసి తెలుగువాళ్లవలె డబ్బును దాచిదాచి ఆస్తులు, సంపదలు కూడబెట్టుకోవాలన్న యావలేదు వీళ్ళకు. తెలుగువాళ్ళలో వలె సంపాదన మొదలుపెట్టి తన తరంతోపాటు భావి ఇంకో ఐదు తరాలు సుఖపడేట్టు మందికొంపలు ముంచయినా కూడబెట్టే దుష్టసంస్కృతికూడా అమెరికన్లలో లేదు. తను కష్టపడి ఏదో ఒక ఆదాయం కల్గించే పనిచేసి జీవిస్తూ పిల్లలను వాళ్ల కాళ్ళమీద వాళ్ళు నిలబడే ప్రయత్నమే అందరూ చేస్తారు. పారదర్శకమైన జీవితం వాళ్ళ విశిష్టత.
భారతసమాజంలో ఉన్న తీవ్రమైన ఆర్థిక అసమానతలు, బీదరికం, నిరుద్యోగం, అవిద్య మనుషులందరినీ ఒకేచోట, ఒకేవిధంగా, జీవించే వీలు కల్పించలేకపోతుంది. కాని శతాబ్దాల పర్యంతం కొనసాగిన అనేక దూరదృష్టిగల పాలకుల పరిపాలనా పద్ధతులు, సంస్కరణల వల్ల ప్రస్తుతం ఎక్కువగా ఆర్థిక నిమ్నోన్నతులు లేని సమసమాజం అమెరికాలో వేళ్ళూనుకుంది. అందరికీ కనీసాదాయం, కనీస వసతి, కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్థితి సాధించడం సాధారణ విషయమేమీకాదు. భారతదేశంతో పోల్చుకుకంటే అనైతికత, విచ్చలవిడితనం, అవినీతి, లంచగొండితనం, రాజకీయ కాలుష్యం అమెరికాలో అస్సలే లేవు.
ఈ నేపథ్యంలో..,
రామం డ్రెస్‌ మార్చుకుని, డ్రాయింగు రూంలోకి వచ్చి..అప్పటినుండీ మనసునిండా ఒక వీడియో కార్యక్రమంలా కదిలిన గతాన్ని పునశ్చరణ చేసుకుంటూనే.,
తను అమెరికా వచ్చిన మొట్టమొదటిరోజు నుండి..ఒకటే ఆలోచన..ఒకటి..ఎప్పటికైనా..సాధ్యమైనంత త్వరగా భారతదేశానికి వెళ్లిపోవాలి..ఈ లోగా తను వర్తమాన భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న సర్వరుగ్మతలనూ రూపుమాపగల పరిష్కారాలను తయారు చేసుకోవాలి. రూపొందించుకోవాలి వాటిని పకడ్బందీగా అమలు చేయగల కార్యాచరణ ప్రణాళికను రచించుకోవాలి.
ఉద్యమం అంటే హింసాయుతమైన, రక్తపాతంతో కూడిన దౌర్జన్యకర ప్రజాప్రతిఘటనే కానవసరంలేదు. అర్ధవంతమైన హృదయ పరివర్తనతో కూడిన చైతన్యంకూడా ఉద్యమమే ఔతుంది. విప్లవం అంటే పెనుమార్పేగాని వేల లక్షలమంది ఆత్మార్పణతో నిండిన హింసాత్మక ఘటన కాదు. మనుషుల్లో సమూలమైన, నీతివంతమైన ప్రవర్తనను నెలకొల్పడం, అప్పటికే పతనమై ఉన్న మానవీయ మూలవిలువలను పునఃప్రతిష్టించడం కూడా ఒక అతి ప్రధానమైన విప్లవం క్రిందే లెక్క. ప్రశాంతంగా కూడా విప్లవాలు సాధ్యమౌతాయని తన అంచచల విశ్వాసం. అందుకు పటిష్టమైన సిద్ధాంతాన్ని రూపొందించుకోవాలి. రెండు..ఏ పెనుమార్పును ప్రవేశపెట్టాలన్నా మొదట తగిన ఆర్థిక పరిపుష్టత కావాలి. ప్రారంభథలో డబ్బు చేతిలో లేకుండా ఉద్యమాలను నిర్మించడం సులభసాధ్యం కాదు. కనీస పోషణలేకుండా కార్యకర్తలు ఒక పోరాటంలో నిలబడలేరు. అందువల్ల ఒక నియమితకాలం కష్టపడి కొంత డబ్బును అతివేగంగా సంపాదించాలి. ‘ధనం మూలం మిదం జగత్‌’ అన్నది ఎవరూ విస్మరించలేని పరమసత్యం.
మూడవది.. ప్రజా ఉద్యమాలెప్పుడూ ఒకే ఒక వ్యక్తిచే నిర్మించబడి, నిర్వహించబడితే విజయవంతంకావు. ఒకే ఆలోచనా విధానం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం కలిగిన కొంతమంది మూలవ్యక్తుల భాగస్వామ్యం ప్రతి ఉద్యమ నిర్మాణంలో ప్రారంభథలోఅవసరం. భారతదేశ సమూల మార్పును కాంక్షించే తనవంటి ఎందరో యువకులు, వ్యక్తులు ఎందరెందరో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్లను గుర్తించడం, సమీకరించడం, ఒకచోట చేర్చడం, అందరినీ కలిపి ఒక శక్తిగా ఏకీకృతం చేయడం.. అప్పుడు ఒక సిద్ధాంతబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగడం.. ఇదంతా ఒక దీర్ఘకాలిక, జీవసమానమైన ప్రణాళిక.
ఒక మార్క్స్‌, ఒక మావో జుడాంగు, ఒక హోచిమిన్‌, ఒక గాంధీ..వీళ్లందరూ తమవైన విలక్షణమైన మానవీయ వ్యూహాత్మక సిద్దాంతాలతో ఈ మానవ సమాజానికి వివిధ జీవనసూత్రాలనందిస్తేగదా ఆ బలమైన పునాదుల మీద అనేక సమాజాలు, దేశాలు నిర్మితమై ఎదిగి ఈ రోజు మనగల్గుతున్నాయి.ఐతే..ఆ సిద్ధాంతాలు కాలపరీక్షకు నిలబడి మారుతున్న మానవ సమాజంలో ఎన్నేళ్ళు నిలబడగలిగాయి..ఎంతకాలం మనగలిగాయి..ఇంకా సజీవంగా ఉన్నాయా, కాలగర్భంలో కలిసి అంతరించిపోయాయా అన్నది వేరే విషయం.
ఏమైనా..ఒక సామాజిక పెనుమార్పుకు మాత్రం ఒక సూత్రబద్ధమైన సిద్ధాంతం, విపులమైన మానిఫెస్టో, విధానం అవసరం.. దాన్ని రూపొందించుకోవాలిప్పుడు తను..ఐతే లీలా మాత్రంగా ప్రస్తుత పరిస్థితికి పరిష్కారాలనబడే పద్ధతుల గురించి ఎప్పట్నుండో తను తన సహానుభూతిగల మిత్రులతో చర్చిస్తూనే ఉన్నాడు. అవి కార్యరూపం ధరించేందుకు సమయం ఆసన్నం కాబోతోందిక.
రామం నిశ్శబ్దంగా సోఫాలో ఒరిగి..అలా నిర్వ్యాపారంగా చూస్తు ఉండిపోయాడు. ఎదురుగా..చిన్నప్పటినుండీ  తనకున్న అలవాటును ప్రతిబింబిచే ఒక చిత్రం ఉంది. గోడపై..ఒక ముఖ్యవాక్యాన్ని ఎదురుగా ఉదయం లేవగానే కనబడేవిధంగా బెడ్‌రూంలో గోడకు అతికించుకునేవాడు తను. మరుపు రాకుండా..’మనిషి దొంగ’ అని రాసిపెట్టుకున్నాడు ఎన్నో నెలలు. అది పైకి అసత్యమేమో అనిపించినా ఆత్మసమీక్ష స్థాయిలో అదే సత్యమని ఎవరి అనుభవం వారికి చెబుతుంది.
ఇప్పుడు.. ఎదురుగా ఉన్న మందపు డ్రాయింగు షీట్‌పై..ఒక బొమ్మవేసి ఉంది. కుళాయి నుండి వడివడిగా నీళ్ళు ఒక కుండలో పడ్తున్నాయి. ఆ నీళ్ళపై ‘దేశప్రజల ఆర్థిక వనరులు’ అని రాసి ఉంది. ఆ నీటిధార క్రింద ఒక కుండ ఏర్పాటు చేయబడి ఉంది. దానికి అడుగు లేదు.కుండపై ‘భారతదేశం..ప్రజలు..ప్రజాసంక్షేమం’ అని రాసి ఉంది. కుండలో ఒక్క నీటి బొట్టుకూడా పడకుండా సూటిగా నీళ్లుమొత్తం క్రింద ఉన్న బకెట్‌లో పడి, నిండి పొంగి పొర్లిపోతున్నాయి. బకెట్‌ఫై ‘మంత్రులు..రాజకీయనాయకులు..దళారులు..ప్రభుత్వ అధికారులు’ అన్న అక్షరాలున్నాయి.
భారతదేశపు భావి ప్రధానిగా భావించబడ్తున్న రాహుల్‌ గాంధీ ఒక సందర్భంలో భారతదేశంలో ఊడలుదిగిన అవినీతి గురించి చెబుతూ ‘ఈ దేశంలో ప్రభుత్వం ఒక రూపాయిని ప్రజాపథకాలకు అందిస్తే కనీసం ఐదు పైసలు కూడా లబ్దిదారులకు అందడంలేదు’ అని వాపోడం జ్ఞాపకమొచ్చింది రామంకు.
‘ఈ దేశంలోనుండి అవినీతి లంచగొండితనం  అనే రక్కసిని మనందదరం ఏకస్తులమై పారద్రోలాలి’ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో ఉద్ఘాటించడం స్ఫురణకొచ్చింది.. పారద్రోలవలసిన రాష్ట్రపతే ‘మనందరం కలిసి పారద్రోలాలి’ అని నిస్సహాయంగా అంటే.. ఇక పారద్రోలవలసింది ఎవరు.

( సశేషం)

Download PDF

14 Comments

 • ramu.r says:

  ‘భారతసమాజంలో ఉన్న తీవ్రమైన ఆర్థిక అసమానతలు, బీదరికం, నిరుద్యోగం, అవిద్య మనుషులందరినీ ఒకేచోట, ఒకేవిధంగా, జీవించే వీలు కల్పించలేకపోతోంది .’
  …ఇదీ ఈ నవలలో మౌళి గారి వేదన …ఈ దిశలో సాగుతున్న సృజన ఆసక్తికరంగా ఉంది.ఇప్పుడే చదివాను ఆబగా,పత్రిక పెట్టగానే.హాప్పీ.
  రాము రావెల్ల,ఖమ్మం

 • shyamala.k says:

  మనిషికి ‘ ఇంత విధ్వంసకర వేగం అవసరమా ‘ అని రాశారు మౌళి గారు.
  ఎందుకో దు~ఖమొచ్చింది ..అస్సలే అవసరంలేదు.
  శాంతి కావాలి.ఎక్కడుందది.
  శ్యామల.కె ,కాకినాడ

 • rama.p says:

  ప్రజల డబ్బుతో ఐ ఐ టి లలో చదువుకుని ఈ దేశాన్ని విడిచివెళ్లి తన స్వంత ప్రయోజనాలకోసం వెంపర్లాడే ఈ తరం
  ప్రస్తావనతో ఒక అత్యంత కీలకమైన ఆలోచనను మౌళి గారు మనముందుంచి విశ్లేషించడం బాగుంది.ఇది ఒక ప్రయోజనాత్మక
  నవల..రాబోయే సంచికలకోసం ఎదురు చూస్తాం.
  రమ.పి,కరీంనగర్

 • karuna says:

  అనేక ఆలోచనాత్మక ప్రసంగాలను ఒక భారతీయ యువకునిగా . జీర్ణించుకున్న ఎంతో ఉత్తేజం పొందిన ………. …, విలువలు, నీతి నిజాయితి ,నైతికత వీటి గురించిన కనీస ఆలోచన చేయగలుగుతుందా ……..రామం వ్యక్తిత్వం ఆకట్టుకుంటూ …….. మౌళీ గారు ఆభినందనీయులు ..

 • Lalitha says:

  ఉద్యమం అంటే హింసాయుతమైన ,రక్తపాతం తో కూడిన దౌర్జన్యకర ప్రజా ప్రతి ఘటనే కానవసరం లేదు. అర్ధవంతమైన హృదయ పరివర్తన తో కూడిన చైతన్యం కూడా ఉద్యమమే అవుతుంది . ఈ విధమైన ఆచరణాత్మక ఉద్యమం కొనసాగించే దిశగా రామం పాత్ర ద్వారా రచయిత కోరుకుంటున్న సమాజం కోసం ఆశ గా ఎదురు చూస్తూ ……

 • boora lakshmaiah says:

  రామం పాత్ర ప్రవేశం ఒక ఊపు నిచ్చింది. దేశం,దేశ
  స్పృహ …బాధ్యత ఈ దిశలో సాగుతున్న ఆలోచనలతో నవల తన రూపును ప్రదర్శిస్తోంది ..బాగుంది.మౌళి గారూ. ఒక మంచి నవలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు .
  బూర లక్ష్మయ్య ,నిజామాబాద్

 • rajyalaxmi.k says:

  ‘పుచ్చలపల్లి సుందరయ్య గారు పిల్లలు పుడితే…..’ ఈ తరానికి ఇటువంటి మన పూర్వీకులు ఉన్నారని తెలుసా అసలు..విలువైన విషయాలెన్నింటినో చెబుతూ నడిపిస్తున్న సీరియల్ చాలా బాగుంది. మౌళి గార్కి అభినందనలు.
  రాజ్యలక్ష్మి కలువకొలను ,హైదరాబాద్

 • prof.Rajamouli says:

  అమెరికా వాతావరణం ..వేగవంతమైన నడక,జలజలా సాగే వచనం,..ఇవి ఈ నవలకు ప్రాణాలు.చాలా బాగుంటోంది వారం వారం.మౌళి గార్కి అభినందనలు.
  ప్రొఫెసర్ ఆర్.రాజమౌళి ,అమీర్ పేట్

 • ramarao.v says:

  మౌళి సీరియల్లో దేశం గురించిన ప్రస్తావన, చర్చ,వివరణ చాలా బాగున్నాయి. మితృనుకి అభినందనలు.
  రామారావు.వి ,హైదరాబాద్

 • vasundhara.G says:

  ‘ఈ దేశంలోనుండి అవినీతి లంచగొండితనం అనే రక్కసిని మనందరం ఏకస్తులమై పారద్రోలాలి’ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో ఉద్ఘాటించడం స్ఫురణకొచ్చింది.. పారద్రోలవలసిన రాష్ట్రపతే ‘మనందరం కలిసి పారద్రోలాలి’ అని నిస్సహాయంగా అంటే.. ఇక పారద్రోలవలసింది ఎవరు.
  ఇది ఈనాడు మన భారతదేశంలోని నిస్సహాయ పరిస్థితి .మౌళి గారు సరియైన సమయంలో సరియైన విషయాన్నే ఎంచుకుని
  రాస్తున్నారు.అత్యంత సమకాలీన సమస్య ఇది.అభినందనలు.
  వసుంధర గాండ్ల,లక్నో

 • rajanarasimha rao.h says:

  నిర్మాణాత్మక కథనంతో,ప్రయోజనాత్మక దృక్పథంతో ఒక్కో పాత్రను సృష్టిస్తూ నవలను అందిస్తున్న రామా చంద్రమౌళి గారికి కృతగ్జ్ఞతలు .సంపాదకులకు ధన్యవాదాలు.
  రాజా నరసింహారావు .హెచ్ ,విజయనగరం.

 • vishwaprasad.R says:

  ‘ నాన్న చెప్పేవాడు..పుస్తకాలు రెండు రకాలని..ఒకటి విద్యావిషయక శాస్త్రాలు..గణితం, భాష, చరిత్ర, భౌతిక, రసాయనికి శాస్త్రాలు..ఇవి..ఈ ప్రపంచ భౌతిక జీవితం గురించి చెప్పేవి. రెండు సృజనాత్మక పుస్తకాలు..కవిత్వం, శాస్త్రాలు, సంగీతం, కళలు, జీవితాధ్యయనాలు, దేశచరిత్రలు..పరిణామ సిద్ధాంతాలు, మనిషి పరిణామ ప్రక్షిప్తాలు, ఇతిహాలు, తత్వ, ఆధ్యాత్మిక శాస్త్రాలు..ఇవి..మనిషి గురించి, జీవితం గురించీ, జీవిత పరమావధి గురించి, హృదయం గురించి, అంతిమంగా ఈ సృష్టి ఏమిటి..గురించీ..ఒక అనంతానంత ఆత్మ దర్శనం.’
  ఒక వెలుగు..ఒక దారి..ఒక నడక…ఐ సాగుతోంది ‘ఎక్కడినుండి.?ఎక్కడిదాకా.?’.హృదయానుగత ( నావంటి )పాఠకులకు
  ఇది అమృతపానం. రచయితకు,సంపాదకులకు అభినందనలు.
  విశ్వప్రసాద్.ఆర్ ,చెన్నై.

 • Dr.ramalakshmi says:

  అమెరికా జీవన వాతావరణంలో నడుస్తున్న కథ..అక్కడి రోడ్లు,వీధులు,పరిసరాలతో సాగుతూ కొత్తగా ఉంది.ఒక మార్పు.మంచిదే.
  డా.రామలక్ష్మి. హైదరాబాద్

 • nagendar.j says:

  చంద్రమౌళి సార్ నవల బాగుంది.
  నాగేందర్,కో-వాకర్,వరంగల్

Leave a Reply to rama.p Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)