ఆమె ఒక కరుణ కావ్యం!

drushya drushyam 33

drushya drushyam 33

పేరు తెలియదు.

కోల్ కతా నగరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కు చెందిన ఒక నన్ ఈవిడ.
నన్ అంటారో సిస్టర్ అంటారో కూడా తెలియదు గానీ, అమ్మ వెనుక అమ్మ.

+++

సుప్రసిద్ధ ఛాయాచిత్రకారులు రఘురాయ్ చిత్రించిన మదర్ థెరిస్సా ఛాయా చిత్రాల ప్రదర్శన ఒకటి రెండేళ్ల క్రితం జరిగింది.
ఆ సందర్భంగా సిస్టర్ నిర్మలతో కూడి వచ్చిన ఒక సోదరి తాను.

ఆమె అందం, హుందాతనం ఆ కార్యక్రమంలో గొప్ప ఆకర్షణ.
బాధ.

సామాన్యమైన మనిషైతే అందరూ చేతులు కలిపేవారు.
కబుర్లు చెప్పేవారు.
కానీ, తాను సోదరి.

అంతకన్నాముఖ్యం, తాను కదులుతుంటే ఒక దేవదూత వలే అనిపించడం.
దాంతో మనిషిగా అందరూ వినమ్రంగా పక్కకు జరగడం మొదలైంది.
కానీ, ఏదో బాధ.

సేవానిరతి తప్పా మరో విషయం లేని…లేదా విషయాసక్తి అస్సలు లేని…ఒక అలౌకికమైన సేవా తరుణిగా తాను.
దాంతో ఒక బాధ. విచారం.

ఆంత అందమైన మనిషిని చూస్తే తెలియకుండానే ఒక జాలి.

సేవకు అంకితమైన సిస్టర్ గా, జీవితమంతా అందాన్ని, ఆనందాలను ఫణంగా పెట్టి, సుఖమూ సౌకర్యవంతమూ అయిన జీవితాన్ని పూర్తిగా వొదిలి, రోగగ్రస్థులను స్వాంతన పరచడమే జీవితం చేసుకున్న ఈ మనిషి చూస్తే, ఆమె సాహసానికి ఆవేదనా కలిగింది.

ఎందుకని చెప్పలేనుగానీ ఒక చెప్పలేని విచారంతోనే ఉంటిని.
గుండె గొంతుకలోన కొట్లాడినప్పటి నా నిశ్శబ్ద బాధకు ఈ చిత్రం ఒక ఉదాహరణ.

+++

చిత్రమేమిటంటే, ఈ చిత్రం తీసి ఊరుకోలేదు.
ఆ బాధను అణచుకోలేక తన దగ్గరకు వెళ్లి వ్యక్తం చేస్తిని కూడా.
కానీ, తాను చిరునవ్వు నవ్వింది.

నవ్వు కూడా కాదు, ప్రేమను పంచింది.
‘అందమైన ప్రపంచం కోసం తప్పదు’ అని చిన్నగా, ప్రేమగా అని ఊరుకున్నది.

అంతే!
ఇంతకన్నాఎక్కువ మాట్లాడటం విజ్ఞత అనిపించుకోదని ఆమె అనుకున్నట్టున్నది.
ఈ రెండు ముక్కలు చెప్పి తప్పుకున్నది.

అర్థమైంది.
ఇక ఆ నాటి నుంచి నా చిత్రాల్లో వ్యక్తి అందం అన్నది ద్వితీయం అయిపోయింది.
అందమైన మనుషులంటే నాకు అప్పట్నుంచీ ఆసక్తీ పోయింది.

బహుశా ఈ చిత్రంతోనే నేను వ్యక్తులను చిత్రించడం ఆగిపోయింది.

ఒక స్త్రీ తాలూకు సౌందర్యం అన్నది పురుషుడి తాలూకు దృష్టి అయినట్టు, సొత్తు అయినట్లు అనిపించి ఆసక్తి చెడింది.
ఇక నాటి నుంచీ స్త్రీలను మనుషులుగా చూడటం మొదలైంది.
జీవితంగా దర్శించడం ప్రారంభమైంది.

ఆమె తన మొత్తం బతుకును సమాజానికి ఇచ్చిన మనిషి అయినప్పుడు ఇక ఆమె అందం చందం సేవా అంతా కూడా వ్యక్తిత్వం, స్త్రీ వ్యక్తిత్వం అవడం మొదలైంది.
అది నాలోని పురుషుడిని దాటేసి మనిషిని కలుసుకునే అపూర్వ చాలనంగా మారింది.
అప్పట్నుంచీ జీవితాల చిత్రణం మొదలైంది.

+++

దృశ్యాదృశ్యం అంటే అదే.
మనిషిని చేయడం.

+++

మీరూ గమనించి చూడండి.
నా వలే మీలోని పురుషుడిని దాటేసే చిత్రణలు జరిగినయా అని!
ఉంటే అదృష్టం, జీవితానికి దారి దొరుకుతుంది.
లేకుంటే వ్యక్తులే జీవితం అవుతుంది.

నిజం.
అందంతోనే ఇదంతా.
సోదరి నేర్పిన పాఠం ఇది.

ధన్యుణ్ని.

 

- కందుకూరి రమేష్ బాబు

ramesh

Download PDF

4 Comments

 • david says:

  నిజమే పురుషుడు వ్యక్తిత్వం కలిగిన మనిషిగా మారితేతప్ప జీవితానికి దారి దొరకదు. ఇలాంటిది పురుషుడిలో కలిగిందా అతడు జీవితాన్ని జయించినట్లే. మీరు దాంట్లో విజయం సాధించారు…ఇవ్వాలే లకిడీకాపుల్ వెళుతుంటే బస్ భవన్ ముందు ఉన్న సిగ్నల్ ఒక వెహికిల్ లో కొంత మంది నన్స్ కనిపించారు…మీరు ఫోటొ తీసిన ఆవిడ కంటే ఇంకాస్త అందమైన వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురు ఆ వెహికిల్లో ఉన్నారు. వాళ్లను తదేకంగా చూస్తుంటే నాతో పాటు ఉన్న మిత్రుడు మాట్లాడుతూ ఇంత అందంగా ఉన్నా వీళ్లు జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు…సేవ పేరుతో వాళ్ళు శారీరక సుఖాన్ని త్యాగం చేసుకోవాల్సిందేనా…వాళ్ళు ఆ పరిక్షలో విజయం సాధిస్తారా? త్యాగం అంత గొప్పదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. కాసేపు దానిపైనే మా మధ్య చర్చ జరిగిందనుకొండి. కాని ఇలాంటి కొంతమంది నన్స్ ను దగ్గరి నుంచి చూసిన నేను విలువలతో కూడినా మనిషి తత్వం ముందు అందం, శరీరక సుఖం చాలా చిన్నదిగా కనిపిస్తుంది అని వివరించాననుకోండి కాని వాళ్ల మనిషి తత్వాన్ని దగ్గర నుంచి చూసి అనుభవిస్తే తప్పా అంగికరించడం సాధ్యం కాదేమో? నిజంగా అందమైన ప్రపంచంకోసం అలాంటి మనుషుల అద్భుత జీవితాలు అవసరమే. మీ రచన బాగుంది సార్.

  • అనుభవం గీటు రాయి కావడమే మంచిది బ్రదర్.
   థాంక్ యు ఫర్ యువర్ షేరింగ్, ఎక్స్పీరియన్స్.

 • ఆదిత్య says:

  మిత్రమా! మీరన్న కోణంలో కాకుండా నేను మరొక కోణంలో ఆలోచించి నా భావాన్ని పంచుకుంటున్నా. మీ ఆదర్శాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాదు. సో కాల్డ్ కల్చర్డ్.. ఆధునిక భావలు గలిగిన సమాజం.. స్త్రీలను ఇట్లా మతసూత్రాల పలుపుతాడుకు కట్టివేయడం సరైనదేనంటారా? ఇదే సమాజం భారతీయ పురాణ జనపదాల్లోని “దేవదాసి” “జోగిని” వ్యవస్థల్ని మూఢాచారాలుగా చాటి మనను అన్ కల్చర్డ్ సమాజంగా ముద్రిస్తున్నది కదా? ప్లీజ్ ఎవరైనా స్పందించండి.

 • మీ ఆలోచనలు బాగున్నై.
  ఒక బొమ్మ చూస్తే ఆలోచనలు కలగడం ఒక పద్ధతి . అనుభూతులు గుర్తు కు రావడం మరో పద్ధతి.
  కాని నేను ఆలోచించడం మానేసి చాల రోజులయింది
  జీవించడం లో ఇలాంటి అలొచనలు రధ్హు అవుతాయి. థాంక్ యు.

  మీరు ఆలోచించింది బాగుంది, అది వేరే వాళ్ళ స్పందిస్తే మంచిది.

Leave a Reply to kandukuri ramesh babu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)