లండన్ లో చరిత్ర సృష్టించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

 

సౌవెనిర్ ఆవిష్కరణలో...

సౌవెనిర్ ఆవిష్కరణలో…

లండన్ మహా నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, స్థానిక యుక్త సంస్థల సంయుక్త నిర్వహణలో సెప్టెంబర్ 27-28, 2014 తేదీలలో దిగ్విజయంగా జరిగి తెలుగు సాహిత్య చరిత్రలో మరొక అధ్యాయానికి తెర తీసింది. కళ్యాణి గేదెల మొదటి రోజు “మా తెలుగు తల్లికి” , రెండవ రోజు “జయ జయ ప్రియ భారత” శ్రావ్యంగా ఆలపించిన ప్రార్థనా గీతాలతో ప్రారంభం అయిన ఈ మహా సభలకి ఇంగ్లండ్, అమెరికా , ఫ్రాన్స్ , జర్మనీ దేశాలనుండి సుమారు 150 మంది సాహిత్యాభిలాషులు, కవులు, రచయితలూ పాల్గొనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారు ప్రధాన అతిథిగా విచ్చేసి తెలుగు బాషని ప్రపంచ బాషగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహకారాన్ని అందజేస్తామని ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభోపన్యాసం, కేంద్ర సాహిత్యా ఎకాడెమీ బహుమతి గ్రహీత “పద్మశ్రీ” యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కీలకోపన్యాసం చేయగా సుప్రసిద్ధ కవులు “సిరివెన్నెల “ సీతారామ శాస్త్రి, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల, అశోక్ తేజ తమ అద్భుతమైన ప్రసంగాలతో రెండు రోజులూ ఈ సాహిత్య సభకి వన్నె తెచ్చారు. పౌరాణిక నటులు అక్కిరాజు సుందర రామకృష్ణ తన పద్యాలతో సభని రంజింప జేయగా, ఫ్రెంచ్ దేశీయుడైన డేనియల్ నేజేర్స్ తన దండక పఠనంతోనూ, సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, పత్రికా సంపాదకురాలు కేతవరపు రాజ్యశ్రీ ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు. సినీ నటులు సునీల్, రాజా రవీంద్ర ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచి సముచిత ప్రసంగాలు చేశారు.

ఈ మహా సభలని ఇటీవల నిర్యాణం చెందిన బాపు గారికి అంకితం ఇస్తూ జరిగిన అంకిత సభలో వంగూరి చిట్టెన్ రాజు, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల బాపు గారితో తమ వ్యక్తిగత అనుభవాలని సభికులతో పంచుకున్నారు. ఈ మహా సభల సందర్భంగా బాపు గారికి అంకితం ఇస్తూ ఎంతో తక్కువ సమయంలో డా. వెలగపూడి బాపూజీ రావు గారి సంపాదకీయంలో ఎంతో ఆకర్షణీయంగా వెలువరించిన సావనీర్ ని, తనికెళ్ళ భరణి రచించిన “ప్యాసా” రాజ్యశ్రీ రచించిన “రెక్కల్లో గీతామృతం”, సుద్దాల అశోక్ తేజ కవితల ఆంగ్ల అనువాదాలు పుస్తకం, వడ్డేపల్లి కృష్ణ గారి గేయాల సీడీ “తెలుగు రాగాంజలి” మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు శ్రీ ఎ. చక్రపాణి గారి కుమార్తె నీరజ రేగుల రచించిన “మై డాడ్” అనే పుస్తకం, ఆచార్య “పద్మశ్రీ” కొలకలూరి ఇనాక్ గారి కుమార్తె మధుజ్యోతి రచించిన ఆయన జీవిత చరిత్ర “నాన్న” ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డాయి.

స్వీయ రచనా పఠనం విభాగంలో డా. వ్యాకరణం అచ్యుత రామారావు, దివాకర్ అడ్డాల, డా. జొన్నలగెడ్డ మూర్తి, కేతవరపు రాజ్యశ్రీ మొదలైన వారు తమ కవితాలాపనలతో సభికులని రంజింపజేసారు. ముఖ్యంగా తనికెళ్ళ భరణి శ్రీశ్రీ, దేవులపల్లి, భానుమతి, రేలంగి, సూర్యాకాంతం, జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా, బాపు- బాపూజీ మొదలైన అనేక రంగాల లబ్ధప్రతిష్టులైన పైన తను రచించిన వచన కవితలను అద్భుతంగా చదివి సభ మెప్పుదల పొందారు.

అవధాని సత్కారం గుడ్

ఈ మహా సభలకి పరాకాష్ట గా యావత్ ఐరోపా ఖండంలోనే మొట్ట మొదటి సారిగా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు సంస్కృత పదాలు ఎక్కడా వాడకుండా అచ్చ తెనుగు పదాలతో అపురూపమైన అవష్టావధాన కార్యక్రమాన్ని, ధారణతో సహా కేవలం గంటా పదిహేను నిముషాలలో ముగించి చరిత్ర సృష్టించారు. కవి జొన్నవిత్తుల గారి సమర్థవంతమైన సంచాలకుడిగా ఆద్యంతం ఆహ్లాదంగా జరిగిన ఈ అష్టావధానంలో కేతవరపు రాజ్యశ్రీ (దత్త పది), శ్రీ రంగస్వామి (సమస్య), మాదిన రామకృష్ణ (చిత్రాక్షరి), డేనియల్ నేజేర్స్, వడ్డేపల్లి కృష్ణ (నిషిద్ధాక్షరి), అక్కిరాజు సుందర రామకృష్ణ (వర్ణన), “అమెరికా ఆస్థాన అప్రస్తుత ప్రసంగి” గా పేరొందిన వంగూరి చిట్టెన్ రాజు అప్రస్తుత ప్రసంగిగా చమత్కారమైన ప్రశ్నలతో పృఛ్చకులుగా వ్యవహరించారు. అవధానం అనంతరం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అవధాని పాలపర్తి వారి సత్కార కార్యక్రమం జరిగింది.

నాకు ఉప ముఖ్యమంత్రి గారి సత్కారం 2

వంగూరి చిట్టెన్ రాజు గారికి సత్కారం

ఈ మహా సభలలో “భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఉండే భారత దేశం ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి తెలుగు వారు విడిపోయిన నేపధ్యంలో, హిందీ భాష అభివృద్ది నమూనాలో తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ది బాధ్యతలు, కేంద్ర ప్రభుత్వమే చేపట్టి “కేంద్రీయ తెలుగు సంస్థ” ని ఏర్పాటు చేయాలి “ అనే తీర్మానాన్ని వంగూరి చిట్టెన్ రాజు ప్రవేశ పెట్టగా ఆ తీర్మానాన్ని నాలుగవ ప్రపంచ తెలుగు సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ సందర్భంగా ఈ రోజు ప్రారంభ సభలో వంగూరి చిట్టెన్ రాజు ప్రతిపాదించిన “యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో తెలుగు పీఠం” ఆవశ్యకతను గుర్తిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగానూ సహకరిస్తుంది అని ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.యి. కృష్ణ మూర్తి, శాసన సభ ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రకటించారు.

ఈ సమావేశాన్ని అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి వచ్చిన వంగూరి చిట్టెన్ రాజు, యునైటెడ్ కింగ్డం వాస్తవ్యులు డా. మాదిన రామకృష్ణ, డా. వెలగపూడి బాపూజీ రావు, కృష్ణ యలమంచి వేదిక నిర్వహణ బాధ్యతలని చేపట్టారు. ఈ రెండు రోజుల సమావేశాలని యుక్త అధ్యక్షులు జయకుమార్ గుంటుపల్లి పర్యవేక్షించగా, కిల్లి సత్య ప్రసాద్ & వెంకట పద్మ దంపతులు అన్ని చోట్లా వారే నిర్వహణ బాధ్యతలని చేపట్టి ఎంతో సేవ చేశారు. శ్రవణ లట్టుపల్లి, నరేంద్ర మున్నలూరి నాయకత్వంలో ప్రమోద్ పెండ్యాల, రాజశేఖర్ కుర్బా, అమర్ నాథ్ చింతపల్లి, ప్రసాద్ మద్దసాని, ఉదయ్ కిరణ్ బోయపల్లి, ఉదయ్ ఆరేటి, కృష్ణ యలమంచిలి, సుదీర్ కొండూరు, బలరామ్ ప్రసాద్ తదితరులు ఎంతో శ్రమ కోర్చి ఈ మహా సభలు విజయవంతం చెయ్యడంలో ప్రముఖ పాత్ర వహించారు.

 

 -వంగూరి చిట్టెన్ రాజు

Download PDF

3 Comments

  • buchireddy gangula says:

    అమెరికా తెలుగు జాతీయ సంగాల లాగా — అదే తిరు —సిని నటులు — రాజకీయ నాయకులు —అవే బతుకమ్మ ఆటలు// పాటలు —-
    శాలువలు కప్ప డాలు — కప్పించుకో డాలు —అంతే —

    యీ సబల తర్వాత — తెలుగు వినిపించదు — కనిపించదు ?????
    ———————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  • గాదిరాజు మధుసూదన రాజు says:

    అమ్మనుఅధికంగా ప్రేమిస్తే గౌరవిస్తే ఓర్వలేమా? తనికెళ్ళ నాన్నా?
    …………………………………
    దెబ్బతగిలిన బిడ్డ అమ్మా అనే
    అంటాడు నాన్నా అనడని బాధ పడ్డ తనికెళ్ళ.

    అమ్మతొమ్మిది నెలలు మోస్తే
    నాన్న పాతికేళ్ళు మోస్తాడంటూ
    రెండూ సమానమే ఐనా అంటూ పైకి అన్నా
    సమానమెట్లవుతుంది
    అయినా మేమేదో పెద్దమనసుతో సమానమంటున్నామన్నట్లు వ్యాఖ్య.

    కానీ అమ్మ కూడా పాతికేళ్ళుకాదు. బ్రతికున్నంతవరకు బిడ్డల్ని మోస్తుంది.
    తొమ్మిదినెలలు కడుపులో.
    ఆ తరువాత పొత్తిళ్ళలో
    చంకలో
    ఆ పై పెళ్ళయ్యేదాక కళ్ళల్లో గుండెల్లో.
    పెళ్ళయ్యాక కూడా కూతురికిపురుళ్ళుపోసి ఆ కూతురికి పుట్టిన పిల్లలబాధ్యతల్నికూడా భారంగాభావించక ..గారాబం పంచేది అమ్మే.
    కొడుకుకుపుట్టిన బిడ్డల్ని ప్రేమగా లాలించేది కూడా అమ్మే.

    అంటే తల్లిమోసేది తొమ్మిది నెలలు కాదు ..తాను బ్రతికున్నంతకాలం బిడ్డలకుబిడ్డలు పుడుతున్నంతకాలం.
    ఒక భర్తగా కాక ఒక కొడుకుగా ఆలోచించలేకపోయారు మహనీయునిస్థాయికి ఎదిగిన పూజనీయులైన తనికెళ్ళ వారు.

    తనికెళ్ళ కూడా చిన్నప్పుడు క్రిందపడ్డప్పుడు అమ్మా అనే అరిచి వుంటాడు.నాన్నా అని ఎందుకు అరవలేదో తనకు తెలియదా?
    జీతం లేకుండా అమ్మ గుర్తింపుపొందితే

    జీతం అంతా ఇంట్లో ఇస్తూకూడానాన్న గుర్తింపు పొందలేదన్నాడు తనికెళ్ళవారు.

    మద్యం సిగరెట్లు త్రాగుళ్ళు సరదాలు తిరుగుళ్ళకు తగలేశాక మిగిలిన సొమ్మేకదా నాన్నలు ఇంట్లో ఇచ్చేది.
    శివభక్తులు దాంతులు వేదాంతులుదైవస్వరూపులైన తనికెళ్ళవారు తన సంపాదన నయాపైసాతో సహా ఇంట్లో ఇచ్చి ఉండవచ్చు.
    కానీ సగటు నాన్నలు అలా వుండరు.

    అడిగినవన్నీ చేసి పెట్టాలంటే అమ్మకి ఇంట్లో అన్నీఉండాలి.
    తయారు చేయటం కుదరక పిల్లలకు చిరుతిళ్ళు బయట కొనిపెట్టాలంటే అమ్మకు చేతిలో డబ్బు ఉండాలి. అంటే నాన్న ఇవ్వాలి.

    ఇంట్లో సరుకులు లేక పోవటం
    అమ్మకు నాన్న పైసలివ్వక పోవటం ..నాన్న త్రాగి అర్థరాత్రులు ఇంటికి రావటం
    స్నేహితులతో జలసాలు చేస్తూ విలాసంగా తిరుగుతూ పిల్లల కంటపడటం.. సగటు కుటుంబాలలో మామూలే.
    అందుకే ప్రత్యక్షసత్యసాక్షులైన పిల్లలు అమ్మను ప్రేమించినంతగా నాన్నను ప్రేమించలేరు.

    పూజ్యశ్రీ తనికెళ్ళవారికి అటువంటి పేదకుటుంబాల వెతలు తెలియవు.

    అమ్మకు పిల్లలకు బీరువానిండా బట్లలు
    నాన్నకు దండెంకూడా నిండదు.

    బట్టలు బిగుతయిపోయాయి,చిరిగిపోయాయి ,వెలిసిపోయాయి,అంటూ బీరువానిండా బట్టలున్నా అందులో తొడుక్కోవడానికి పనికి వచ్చేవి ఎన్నో ఏవిటో అమ్మకి మాత్రమే తెలుసు.
    మాకు కూడా తెలీదు.
    అవి కట్టుకుని ఫంక్షన్ కి వెళితే పరువుపోతుందని బాధపడేది అమ్మే.
    గుండీలు హుక్సులూ మా బట్టలకు నాన్నకుకూడా కుట్టేది అమ్మే.
    పండుగ కీ ,పెళ్ళికీ ,బడికీ ,బట్టలు కొనిపెట్టమని బిడ్డలబట్టల కోసం అమ్మ ఏడ్వటం చూస్తారు బిడ్డలు.

    ఊర్లకీ,క్యాంపులకు వెళ్ళివచ్చిన ప్రతిసారీ మంచి మంచి షూస్ బట్టలు తనకై నాన్న తెచ్చుకోవటం బిడ్డలకు తెలుసుకదా.
    అందుకే నాన్న అవసరమైతే ఏ క్షణంలో నైన కొనుక్కోగలిగిన సర్వ స్వతంత్రుడు కదా ఆయన కేం మా రాజు అని తృప్తిగా ఉంటారు నాన్న విషయంలో.
    బీరువానిండా వున్నప్పటికీ వాటిలో పనికీ రానిచీరలే ఎక్కువ. అమ్మ ఇంట్లో కట్టుకుంటుంది గుట్టుగా.
    ఇంటిగుట్టు అమ్మకు తెలిసినంతగా నాన్నకు తెలీదు.

    నాన్నకు మోటారు సైకిల్ కారు ఉంటాయ్ .
    అమ్మకు వాటిని ఎక్కాలంటే నాన్న అనుమతికావాలి.
    బండిపెట్రోలు ఖర్చుకు డబ్బుంటుంది. కానీ అమ్మను బిడ్డలమైన మమ్మల్ని సినిమాకు తీసుకెళ్ళాలంటే డబ్బుండదు.టై ఉండదు.

    చేతికి రెండుంగరాలు ,మెళ్ళోచైను మా నాన్న శరీరంలో భాగాల్లా మెరుస్తూంటాయ్ తళతళా.

    అమ్మ మెళ్ళోని బంగారుతాళిబొట్టుచైను మాత్రం కష్టమొచ్చిన ప్రతిసారీ తాకట్టుకెళుతుంది.
    అమ్మనగలెప్పుడూ మా అవసరాలు తీర్చే పరికరాలే.
    సగటు బతుకులను గురించి గురుతుల్యులు తనికెళ్ళ భరణివారికి తెలియదు.

    ఎప్పుడో ఒకప్పుడు పిల్లలు తృప్తిగా తిన్నప్పుడు ..నాన్న పచ్చడి మెతుకులు తిన్నాడేమో..
    కానీ ..అమ్మరోజూ తినేది..మిగిలిన పులుసే అడుగంటిన మెతుకులే. అవి కూడా బిడ్డలమైన మేమూ నాన్నా తినంగా మిగిలితేనే.
    అమ్మ పస్తుందని తెలిసేది అమ్మతనకు తానుగా చెప్పితేనే.
    అమ్మ ఎవరికీ చెప్పదుగా మనకై మనం చూస్తేతప్ప.
    తెలిస్తే నాన్నైనా బిడ్డలైనా తెలిస్తే బాధపడతారని రహస్యంగా దాస్తుంది తప్ప!

    ఇలా నాన్న తాను వెనుక బడ్డానని బాధపడతాడని తెలిస్తే!
    నాన్నను పొగిడేస్తుంది అమ్మ!
    చులకన చేసిచూస్తున్న బిడ్డలపై అలిగేస్తుంది అమ్మ!
    నిష్టూరాలకురిపిస్తూ నాన్నంటే కృతజ్ఞతలేదంటూ మా మనసుల్ని నాన్న గారి త్యాగాలజ్ఞాపకాలతో నింపేస్తుంది అమ్మ!

    గాదిరాజు మధుసూదన రాజు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)