అఫ్సానా మేరా…

M_Id_379644_Shamshad_Begum

1

నువ్వొట్టి పాటవే అయితే

ఇంత దిగులు లేకపోను,షంషాద్!

నువ్వు కొంత నా బాల్యానివి, కొంత నా తొలియవ్వనానివి.

ఇంకా కొంత సగం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిన నిండుయవ్వనానివి.

వొక్కొక్క తలుపూ మూసుకుంటూ వచ్చిన గుమ్మం ముందు చతికిలబడిన నా కోరికల దేహానివి.

అప్పుడంతా అల్లరి చేయాలనుకొని గమ్మున వుండిపోయిన నా లోపలి ఆకతాయితనానివి.

 

వేళ్ళ శక్తి కొద్దీ చెవులు బిగబట్టుకొని నన్ను లాక్కు వెళ్ళి ఏ ఆకాశం కింద ఎండలోనో ఆరేశావ్ చొక్కాలా,

ఆ తరవాత రెపరెపలాడుతూ వుండిపోయా నీ గొంతు అనే మెరుపు తీగ మీద వేలాడుతూ.

 

చినుకు పడితేనే వెంట వెంటనే సుతారంగా తుడిచేసుకునే నన్ను

కట్టిపడేసి వొక జలపాతంలోకి గడ్డివామిలోకి తోసినట్టు తోసేశావ్!

 

అప్పుడంతా

నువ్వు నన్ను ఆటపట్టిస్తున్నావనుకున్నానే కానీ

నా సంశయాల సంకోచాల దుమ్ము దులిపేస్తున్నావని అనుకోలేదు.

నా మీదికి నన్నే తిరుగుబాటుకి పంపిస్తున్నావని అసలే అనుకోలేదు.

 

2

పాటలు అందరూ పాడతారు, షంషాద్!

కానీ ఇంత చిలిపితనాన్ని ఎవరు పాడతారు,నువ్వు తప్ప

ఇంత అల్లరల్లరిగా మాటల్ని ఎవరు రువ్వుతారు నువ్వు తప్ప

ఇంత నిర్లక్ష్యంగా ఎవరు నవ్వుకుంటూ వెళ్తారు వొక్క నువ్వు తప్ప!

 

3

ఇన్నేసి

పాటల్ని కెరటాల్లా రువ్వీ రువ్వీ

చివరికి నువ్వు ఎక్కడో ఈ ప్రపంచానికొక మూల

ఆ అజ్నాత దిగంత రేఖ మీద వున్నావనే తెలియదే,

రహస్యంగా పాడుకుంటూ వున్నావనే తెలియదే!

 

నిజంగా చెప్పు,

నిజానికి ఈ లోకానికి నువ్వూ నేనూ కావాలా?

ఇన్ని పాటల అలజడివాన కావాలా?

ఈ ఉద్వేగాలు పొదువుకున్న మాటల నురగలు కావాలా?

 

4

వెళ్లిపోతావ్

నువ్వు గొంతులోకి గుండెని వొంపి పాడుతూ పాడుతూ.

నేనేమో అక్షరాల్లోకి నా ప్రాణమంతా ధారపోస్తూ పోస్తూ వెళ్లిపోతాను.

నీ కథ కొన్ని స్వరాల్లోకి నా కథ కొన్ని కాగితాల మీదికి జాలిగా జారిపోతుంది.

భలే పాడుకున్నావు గా నువ్వు,

“అఫ్సానా మేరా బన్ గయా అఫ్సానా కిసీకా!” అంటూ.

 

5

ఇద్దరమూ

వొకే ఖాళీతనంలోకి వొలికిపోయాక

మన ఇద్దరి ఈ కథలూ ఎవరి కథలుగానో మిగిలిపోతాయి.

ఆఖరి కథ ఎవరు చెప్పుకొని ఎలా నవ్వుకుంటారో తెలియదే!

 

6

“హమే మాలూమ్ హై… మాలూమ్ హై”

అంతా తెలుసు తెలుసు అని పాడుకొని

వెంటనే నాలిక్కర్చుకొని

‘లేకిన్’…

కానీ కానీ…అన్నావే….

అదిగో

అదే

అసలు జీవితమంతా!

*

 

(జలియన్ వాలా బాగ్ విషాదం జరిగిన మర్నాడు అంటే 1919 ఏప్రిల్ 14న అమృత్సర్ లో షంషాద్ బేగమ్ అనే చిలిపి కోయిల పుట్టింది. నాకు ఆమె గొంతులో చిలిపిదనం నచ్చి, చిలిపి కోయిల అంటున్నా గాని, అన్నీ రకాల పాటలూ పాడింది షంషాద్. హిందీ సినిమా లోకంలో తొలితరం నేపధ్య గాయని.  ఆమె ఎంత గాఢమయిన ముద్ర వేసిందంటే, పాడితే ఆమెలానే పాడాలని లతా ఆషా భోంస్లే లని సినిమా లోకం  రాసి రంపాన పెట్టేది. ఆమెలా ఎవరూ పాడలేరని వాళ్ళిద్దరూ బాహాటంగానే వొప్పుకున్నారు. మొన్న ఏప్రిల్ 23న ఆమె కన్నుమూసిన రోజు నా కంటి మీద కునుకు లేదు! ఆమె పాటల హోరుగాలి నా కళ్లని, నన్నూ చుట్టుముట్టి, వొక అలలాగా నన్ను నేను కనిపించని తీరానికి కొట్టుకుంటూ వుండిపోయా)

 

Download PDF

37 Comments

 • *పాటలు అందరూ పాడతారు, షంషాద్!

  కానీ ఇంత చిలిపితనాన్ని ఎవరు పాడతారు,నువ్వు తప్ప

  ఇంత అల్లరల్లరిగా మాటల్ని ఎవరు రువ్వుతారు నువ్వు తప్ప

  ఇంత నిర్లక్ష్యంగా ఎవరు నవ్వుకుంటూ వెళ్తారు వొక్క నువ్వు తప్ప!*

  అఫ్సర్ జీ..

  ఒక వీడ్కోలులో ఎంతటి బాధ
  గుండె నిండి ఒలికే గాధ…

  ఇంత హృద్యం గా ఎవరు చెప్పగలరు.. మీరు తప్ప…

 • విజయవాడలో పుట్టిపెరిగిన నాకు మీసం మొలవడమూ పాత హిందీ పాటల రుచి తెలియడమూ ఒక్కమాటే. అంచేత షంషాద్ ని తల్చుకోవడం అంటే తొలియవ్వనపు తూగుని ఒక్క కషణం పాటైనా మళ్ళీ పలవరించి పరవశించడమే.
  A beautiful and fitting tribute, Afsar.

 • స్వాతీ శ్రీపాద says:

  పాటలు నా చుట్టూ పరదాలను చేసుకు

  అటూ ఇటూ తూగే స్వరం చిరు గాలిలో

  కలల పల్లకిలో బ్రతికిన రోజుల్లోకి

  మళ్ళీ వెళ్లి పోయినట్టు

  పూర్తిగా కరిగి నీరై

 • Sree says:

  పాటలు అందరూ పాడతారు, షంషాద్!
  కానీ ఇంత చిలిపితనాన్ని ఎవరు పాడతారు,నువ్వు తప్ప….భలే చెప్పారు అఫ్సర్ గారు!

 • Malakpet Rowdy says:

  Too Good!

 • నువ్వు గొంతులోకి గుండెని వొంపి పాడుతూ పాడుతూ.

  నేనేమో అక్షరాల్లోకి నా ప్రాణమంతా ధారపోస్తూ పోస్తూ వెళ్లిపోతాను.

  నీ కథ కొన్ని స్వరాల్లోకి నా కథ కొన్ని కాగితాల మీదికి జాలిగా జారిపోతుంది………..సార్వజనీనతకు వైయక్తికాన్ని జోడించడం ,భలేగా చేసారు. ఇట్ ఇస్ ఎ సైన్ అఫ్ గ్రేట్ ఆర్ట్ .

 • kranthisrinivasarao says:

  వేళ్ళ శక్తి కొద్దీ చెవులు బిగబట్టుకొని నన్ను లాక్కు వెళ్ళి ఏ ఆకాశం కింద ఎండలోనో ఆరేశావ్ చొక్కాలా,

  ఆ తరవాత రెపరెపలాడుతూ వుండిపోయా నీ గొంతు అనే మెరుపు తీగ మీద వేలాడుతూ.

  చినుకు పడితేనే వెంట వెంటనే సుతారంగా తుడిచేసుకునే నన్ను

  కట్టిపడేసి వొక జలపాతంలోకి గడ్డివామిలోకి తోసినట్టు తోసేశావ్!

  అప్పుడంతా

  నువ్వు నన్ను ఆటపట్టిస్తున్నావనుకున్నానే కానీ

  నా సంశయాల సంకోచాల దుమ్ము దులిపేస్తున్నావని అనుకోలేదు.

  నా మీదికి నన్నే తిరుగుబాటుకి పంపిస్తున్నావని అసలే అనుకోలేదు……………………..నేనిక్కడే కాసేపు ఆగిపోఅయా .ం……అక్షరాల పూలు చల్లడం అంటే ఇదేనేమో …అఫ్సర్ సోదరా

 • K.Geeta says:

  చాలా చాలా గొప్ప కవిత అఫ్సర్ గారూ-
  ఎంత ఆర్ద్రత! ఎన్ని చల్లని మృదువైన మాటలు!!
  హృదయాన్ని వెలిబుచ్చే భాషలో మీ వచనమూ, కవిత్వమూ ఒకదానినొకటి పోటీపడ్తున్నాయ్-
  మొన్నటి ఏ నీటి వెనకాల ఏముందో, నిన్నటి శ్రీ శ్రీ గురించీ, ఇవేళ్టి షంషాద్ ని గురించీ చదివేక-

 • akella raviprakash says:

  “ఇద్దరమూ

  వొకే ఖాళీతనంలోకి వొలికిపోయాక

  మన ఇద్దరి ఈ కథలూ ఎవరి కథలుగానో మిగిలిపోతాయి.

  ఆఖరి కథ ఎవరు చెప్పుకొని ఎలా నవ్వుకుంటారో తెలియదే!”

  నీ సైగల్ కవిత కి దీటుగా వుంది ,
  అసలు పాట గురించి నీకన్న ఎవరు బాగా రాయగలరా?

 • sreedhar parupalli says:

  గాయనీ మణులకు ఆమె బేగం. హృద్య రాగం. పాటకు పతాక. హృదయ గీతిక. ఒక షంషాద్ బేగం, ఒక నూర్జహాన్ మళ్ళీ పుట్టరు. ఆ గాత్రాలు సినీ లోకంలో నిత్య స్తోత్రాలు. ధ్వన్య నుకరణ లే స్వరకల్పనలుగా , పాటలుగా చెలా మణీ అవుతున్న కాలంలో ఈ మధుర తుషారాలే సేద తీరుస్తాయి. షంషాద్ బేగం మీద అఫ్సర్ కవిత అద్భుతం. కవికి అక్షరాలూ, గాయకులకు స్వరాలూ జీవ నాడులూ..నదులూ అనవచ్చేమో.

 • అఫ్సర్….
  పోయెం ఎత్తుగడ, ముగింపు, ప్రవహించిన తీరు…చాలా అద్భుతంగా వొచ్చింది….
  మన బాల్యం, యవ్వనం ‘శంషాద్’ పాటల్లో తడిసిన జ్ఞాపకాల గానం లా వుంది మీ పద్యం …
  (నా ‘ఆక్వేరియం లో బంగారు చేప’ లో ‘నాస్తేంక’ పోయెం లో తన ‘కాహే కోయల్ షోర్…’ పాట ప్రస్తావన ఒకటి వుంటుంది …. )
  మొన్న ఒక పోయెం చదివినపుడు ‘బాగుంది’ అనిపించింది గానీ, ఏదో తెలియని వెలితి ..
  అంత గొప్ప గాయని కి మనం ఇవ్వ వలసిన గొప్ప నివాళి ఏదో ఒకటి ఇంకా బాకీ వుందని…
  అది మీ పద్యం తీర్చింది ….రవిప్రకాష్ అన్నట్టు, మీ ‘సైగల్’ కవితకు దీటుగా వుంది….బహుశ, మరిపించింది, నాకైతే ….
  అభినందనలు

 • Mercy Margaret says:

  ఇంకేం మాట్లాడగలను … ??
  ఎం రాయగలను ?? ఎలా స్పందించగలను ??
  నా ఆలోచనలు మనసు కూడా మీ కవిత తీగపై ఎందేసిన చొక్కయిలా ఉండిపోయి నా దగ్గరికి రానంటుంటే …
  ఇలా మీ మాటలను ఒక అందమయిన గొంతును వర్ణిస్తూ రాయడం , ఆ పాటల పైన మక్కువ పెంచడమో
  లేక మీ కవిత వెంట తీసుకెళ్ళి అక్కడెక్కడో ఆ ఆకాశాలలో నిశబ్ద కవితా గానం విని , ఆ గాయనిని అభినందించడమో జరిగిపోతున్నట్టే ఉండి కాలం ఇక్కడే మీ కవితా ఇరుసులో ఇరుక్కుపోయినట్టుంది అఫ్సర్ సర్ .. మరో అధ్బుతమైన కవిత.
  మాటలు మూగబోయెలా

 • రవి says:

  అఫ్సర్ గారు,

  కవితను మళ్ళీ మళ్ళీ చదువుకున్నా. చాలా గొప్పగా ఉంది.

  “వేళ్ళ శక్తి కొద్దీ చెవులు బిగబట్టుకొని నన్ను లాక్కు వెళ్ళి ఏ ఆకాశం కింద ఎండలోనో ఆరేశావ్ చొక్కాలా,

  ఆ తరవాత రెపరెపలాడుతూ వుండిపోయా నీ గొంతు అనే మెరుపు తీగ మీద వేలాడుతూ.” గ్రేట్ లైన్స్.

  చక్కటి నివాళి.

  -రవి

 • Saikiran says:

  A beautiful tribute to a beautiful singer. Afsar gaaru, I am sure, she must be smiling at you from heavens!

 • Viplove says:

  ” నా మీదికి నన్నే తిరుగుబాటుకి పంపిస్తున్నావని అసలే అనుకోలేదు ”
  great words !

 • సి.వి.సురేష్ says:

  ఏకబిగిన చదివి౦చిన కవిత. తర్వాత లైన్ లో ఇ౦కేమి చెప్తారో అనే ఉత్సుకత ను ని౦పారు. హృదయ౦ ఎ౦తగా పరితపిస్తేనో, ఎ౦తగా గు౦డెల్ని తాకుతేనో ఇలా౦టి భావుకత ఉన్న కవితలు జాలువారుతాయి…
  “హమే మాలూమ్ హై… మాలూమ్ హై”

  అంతా తెలుసు తెలుసు అని పాడుకొని

  వెంటనే నాలిక్కర్చుకొని

  ‘లేకిన్’…

  కానీ కానీ…అన్నావే….

  అదిగో

  అదే

  అసలు జీవితమంతా!

  ఇలా౦టి సన్నివేశాలు అక్షరాల్లో దృశ్యీకరి౦చడ౦ మీకు మీరే సాటి సార్! అద్భుతమైన కవిత….ప్రతి లైన్ ను కొట్ చెయాల్సిన౦త గాఢత ! ఎ క్సె లె ౦ ట్ పోయిమ్!

 • Nishigandha says:

  పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్, అఫ్సర్ జీ!!
  అసలు పొడవు కవితలతో నాకు చాలా పెద్ద సమస్య.. అక్కడక్కడా ఆపి.. ఆగి.. ఒకసారి మళ్ళి ఊపిరి తీసుకుని కానీ కొనసాగించలేను..
  ఈ కవిత మాత్రం మొదలుపెట్టడం వరకే గుర్తుంది!!

 • Kaneez Fathima says:

  వండర్ఫుల్ ట్రిబ్యూట్ తో శంషాద్ బేగం

 • ఊడుగుల వేణు says:

  అన్న అద్భుతంగా ఉంది.చాలా సరళంగా…తాత్వికంగా ఉంది.నేను ఇంతకుముందు చదివాను…ఇప్పుడూ చదివాను…రేపూ చదువుతాను.ఆ గొంతుకే కాదు..ఆ గొంతు కొరకు పుట్టిన నీ కవిత్వానిక్కూడా నెత్తురుకుండే జీవశక్తి ఉంది.అందుకే చదివినప్పుడల్లా కొత్తగా అన్పిస్తోంది..చీర్స్…

 • s.haragopal says:

  షంషాద్బేగం ఎంత గొప్ప గాయకురాలు. ఆమె పాటలు నిషాదంలో, విషాదంగా
  మెహఫిల్లో రాగాలపరదాల గాలి అలల్లా తాకే ఒక మృదుభావన
  మీరు ఆమె కోసం రాసిన కవిత చాలా బాగుంది.

 • gudipati says:

  హాయ్ అఫ్సర్,

  కవిత చదివా.. అప్పుడెప్పుడో కాంపస్ లో a హాస్టల్ ముందు కనిపించిన అఫ్సర్ గుర్తుకు వచ్చాడు.

  తొలి యవ్వన ప్రేమ లాంటి కవిత నీది.

  మరల మరల తలపించే కవిత నీది.

  తలపించిన ప్రతి సారి వొక స్నేహ తప్త స్పర్హ్స లాంటి కవిత నీది.

  చూసావా, అఫ్సర్, నిన్ను పలకరిస్తేనే కవిత పొంగుకొస్తుంది.

  అందుకే యు అర్ మై ఇన్స్పిరేషన్.
  ఐ లవ్ యు ఫ్రెండ్.

 • vamshi says:

  వెళ్లిపోతావ్

  నువ్వు గొంతులోకి గుండెని వొంపి పాడుతూ పాడుతూ.

  నేనేమో అక్షరాల్లోకి నా ప్రాణమంతా ధారపోస్తూ పోస్తూ వెళ్లిపోతాను.

  నీ కథ కొన్ని స్వరాల్లోకి నా కథ కొన్ని కాగితాల మీదికి జాలిగా జారిపోతుంది.

  భలే పాడుకున్నావు గా నువ్వు, :) కొన్ని.. చదవడం వరకే గుర్తుంటాయి , మనల్ని మనం మర్చిపోయాక ..

 • Potu rangarao rao says:

  Manchi సాహిత్య సంపద.అఫ్సర్ పలవరించి ,కలవరించి రాసినట్టు vundhi. మీ యత్నం,ప్రయత్నం ఆగకుండా సాగాలి.

 • Ismail says:

  వెళ్లిపోతావ్

  నువ్వు గొంతులోకి గుండెని వొంపి పాడుతూ పాడుతూ…

  ***
  గొంతులో ఏదో అడ్డం పడినట్లయ్యింది:-(

 • pvsrinivas says:

  ANNA GARU KAVITHA CHADHUVUTHUNTA AFSAR LO KASITHAGALADHANNI THALLIPOYENDHI ANY HAVE CHALABAGUNDHI

 • Srinivasacharya Kandala says:

  అఫ్సర్ గారూ,

  నిజంగా, చాలా చాలా రోజుల తర్వాత ఇలాంటి కవితను చదివా, ఎంతో హృద్యంగాను, రమ్యంగాను ఉంది అని రాసినా అవి చాలవు చెప్పటానికి … జోహార్లు

 • pratap reddy kasula says:

  అఫ్సోస్ నహీ హువా… I thrilled to read it.. ఆమె పాటలో తేలిపోతున్నట్లే ఉంది. చాలా రోజుల తర్వాత ఓ మంచి పోయెమ్ చదివిన అనుభూతి.. పండిన కాయ రాలి పడకుండా ఉండదు కదా.. షంషాద్ అందుకే.. నువ్వు లేవు నీ పాట ఉందని నెమరేసుకుందాం. స్మృతి కవిత.. ఆమె అందించిన స్ఫూర్తి కవితలో వ్యక్తమైంది. అందరమూ అంతేనా.. మన పాదముద్రలు ఈ నేల మీద ఉంటాయా.. ఈ గాలిలో మన ఆత్మ ఎగురుతూ ఉంటుందా..

 • imam shaik says:

  మనసులో ఉన్న బాధనీ, గుండె బరువునీ అక్షరాల్లొ చెక్కి ఇంతకన్నా ఎవరు రాయగలరు.
  హాట్స్ ఆఫ్ అఫ్సర్ గారు.

 • Yaji says:

  నాకు కవిత్వం అర్ధం కాదు, అని ఇన్నాళ్ళూ అనుకొనే వాడిని. చాలా కవితలకు దూరంగా ఉండేవాడిని కుడా. ఎందుకంటే, శంకరాభరణం సినిమాలో, మిడిమిడి జ్ఞానంతో, చంద్రమోహన్, రిషభానికి బదులు, ఋషభం అని, శంకరశాస్త్రి చేత తిట్లు తిన్న సీన్ గుర్తుకొచ్చి. కానీ, అలాంటి నా చేత కూడా రెండు సార్లు చదివించు కొనేలా రాసి పారేశారు అఫ్సర్ గారూ. నా కెందు కింత నచ్చిందంటే, ఎదో మీ బాల్య స్నేహితుడిని కోల్పోయినట్లుగా, అంత చక్కని పర్సనల్ టచ్ ఇస్తూ వ్రాసారు కాబట్టి.

  “మన ఇద్దరి ఈ కథలూ ఎవరి కథలుగానో మిగిలిపోతాయి” – ఈ వాక్యం లోని ఆ “పర్సనల్ టచ్” నాకు ఎంత నచ్చిందో!

  ఇక తప్పేటట్లు లేదు, కవిత్వమూ చదవాలి!

 • ఒక్కొక్క వాక్యాని వందసార్లు వల్లెవేసి ఆస్వాదించినా తనివితీరక… ఏదో వెలితి…ఏదో కోల్పోయిన భావన…అప్పుడే అయిపోయిందే అన్న చింత…అదీ మా అఫ్సర్ భయ్యా కవిత.

 • నచకి says:

  హిందీ పాటలతో (యిటీవలి దాకా) ఎక్కువగా పరిచయం లేని నన్ను షంషాద్ బేగమ్ మరణం యెక్కువగా బాధించలేదు కానీ… మీ వంటి యెందఱో రసజ్ఞుల భావాలని నావిగా చేసుకుంటే నేనెంత కోల్పోయానో తెలుస్తోంది. షంషాద్ బేగమ్‌తో పరిచయం పెంచుకోవాలి నేను త్వరగా! :)

  ఏ మాటకా మాటే చెప్పుకోవాలి… నాకు ఆవిడతో కానీ ఆవిడ పాటలతో కానీ అంతగా పరిచయం లేకున్నా… ఆవిడని, ఆవిడ గానాన్ని, గొంతులోని చిలిపితనాన్ని మీ కవిత్వం కళ్ళకి కడుతోంది, …చెవులకు తడుతోంది అని కూడా అనాలేమో! అలతి పదాలతో చిక్కని కవిత్వం వ్రాయటంలో మీ ముద్ర తెల్లమవుతోంది. ఒక్కో పంక్తినీ ఉటకించలేను… కవిత మొత్తంలోని శిల్పం అలా ఉంది! కొసమెఱుపు కూడా లోతుగా ఉంది! మంచి కవితని కళ్ళ ముందు పెట్టినందుకు నెనర్లు, అఫ్సర్ జీ!

 • veeralakshmidevi vadrevu says:

  అఫ్సర్
  రెండు రోజుల కిందట ఆహ్వానం లక్ష్మి గారిని కలిసాను.వాళ్ళ ఇంట్లో నెట్ లో నీ ఈ కవిత ఇద్దరం కలిసి చదువుకున్నాం.ఎక్కడికో వెళ్ళిపోయాం.ఆమె నీతో మాట్లాడాలని పలవరించారు ,ఎన్నో సార్లు .శంషాద్ పులకిన్చివుంటుంది.లక్ష్మిగారు నీ టెలి నెంబరు కోసం వెతుకుతున్నారు ఆమె నెం మెయిల్ చెయ్యనా?
  కవిత గురించి ఏం చెప్పను ?ఆమె పాటని అక్షరాల్లోకి ఒంపిన నీకు ఆశీస్సులు
  అక్క

 • Manasa says:

  How did I miss it? Beautiful!

 • తిలక్ బొమ్మరాజు says:

  ఇంత అందంగా అక్షరాలను ఎవరు మచ్చిక చేసుకోగలరు ఒక్క మీరు తప్ప.కళ్ళ ముందు ఒక్కసారిగా ఇన్ని భావాలను ఒలకబోసాక ఇదిగో ఇలా తడిసి ముద్దవ్వాల్సిందే అఫ్సర్ గారు.

 • నేనూ మిస్సయ్యా ఈ ఆర్తినిండిన కరుణరస కోకిలకు అర్పించిన నీరాజనాన్ని. గొప్పగా వుంది సార్..

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)