కథ అయినా, కళ అయినా…ఒక సహప్రయాణం!

Vinod AnantojuWorkingstill1 (1) అసలు కథ చెప్పాల్సిన అవసరం ఎందుకొస్తుంది ?

కథే కాదు.. మనిషికి కళ అవసరం ఎప్పుడొస్తుంది?

ఒక విషయాన్ని అవతలి వ్యక్తికి ఎన్నో విధాలుగా తెలియజెయ్యొచ్చు. మాటల ద్వారా, రాతల ద్వారా, బొమ్మల ద్వారా ఎలగైనా తెలియజెయ్యొచ్చు. ఆ విషయం తెలుసుకున్నాక ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడు అనేది మాత్రం ఆ విషయం ఎంత కళాత్మకంగా చెప్పబడింది అనేదాని మీద ఆధారపడుతుంది. అనుభూతులను, భావాలను పంచుకునే సాధనం కళ. మంచిగా మట్లాడటం కళ, బాగా రాయడం కళ, నృత్యం చేసి ఆనందపడటం, ఆనందాన్ని పంచడం కళ. మనసులో ఏదైనా సరే ఒక స్పందన కలగజేసే కథ రాయడం, సినిమా తీయడం కళ.

‘ శూన్యం’ రాయడం మొదలుపెట్టినప్పుడు చాలా ప్రశ్నలు, సందేహాలు నన్ను వేధించాయి. నేను చూస్తూ పెరిగిన సినిమాల ప్రభావం కావొచ్చు, కొన్ని రకాల కథలకే పరిమితమవ్వాలేమో అనే అలోచన ఉండేది. కాని నేను సినిమాని చూస్తున్న కోణం వేరు. సినిమా ఒక కళ. కళ కేవలం వినోదం కోసమే కాదు. దాని లక్ష్యాలు అనేకం. దాని అవసరం వేరు. మానవాభివృద్ధిలో దాని పాత్ర విడదీయరానిది. పుస్తకాలకి సినిమాకన్నా శక్తి ఎక్కువ ఉన్నప్పటికీ ప్రపంచీకరణ పుణ్యమా అని పుస్తకాలు చదివేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపొతోంది.. నాటకం, తోలుబొమ్మలు లాంటి కళలు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం సినిమా అన్ని కళల్లోకల్లా ఆదరణ ఎక్కువ పొందుతోంది. కాని ఇప్పుడున్న సినిమా రంగం పరిస్థితి చాలా నిరాశాజనకంగా, భయంకరంగా ఉంది. ఇక్కడ మార్పు అవసరం. సినిమాని సరైన దారిలో పెట్టాలి, సమాజంలో దానికున్న పురోగామి పాత్రని దానికి గుర్తుచెయ్యాలి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే ‘శూన్యం’ రాయడం మొదలుపెట్టాను.

“కథ”కీ “సినిమాకథ”కీ చాలా తేడా ఉంది. ఆధునిక కథ వర్తమాన జీవనశైలికీ, జీవిత సంక్లిష్టతకీ తగ్గట్టు చాలా మార్పులకి లోనయ్యింది. చాలా అభివృద్ధి చెందింది. కానీ తెలుగు సినిమాకథ ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. ఇంకా పాతకాలపు “ఎత్తుగడ-సమస్య-పరిష్కారం-శుభం” పద్ధతినే అనుసరిస్తున్నారు. ఆధునిక కథ ఈ నిర్మాణాన్ని దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయింది. కథ చదువుతున్న పాఠకుడు కథతో పాటు ప్రయాణం  చెయ్యగలిగితే చాలు. కథను ఉద్దేశపూర్వకంగా ముగించాల్సిన అవసరం లేదని నా నమ్మకం. ఎందుకంటే అంతిమంగా కథ చదవడం వల్ల కలిగిన అనుభూతే అన్నిటికన్నా ముఖ్యం. మరి ఈ విషయాలన్నీ ప్రేక్షకుడితో ఎలా చర్చించాలి? నేను రాసే కథలో ప్రేక్షకుడు నాతో పాటు కథ రాయడంలో ఉండే అన్ని అవస్థల గుండా ప్రయాణించాలి. నా అభిప్రాయాల్ని, భావాలని ప్రేక్షకుడితో పంచుకుంటూ, అతని అభిప్రాయాలకి తావు ఇస్తూ, ప్రేక్షకుడిని నా తోటి ప్రయాణికుణ్ణి చేసుకోడానికి ప్రయత్నించాను.

Workingstill1 (2)

లఘుచిత్రాలకి అనేకానేక పరిమితులు ఉంటాయి. శూన్యం సినిమాలో చెప్పినట్టు “కథ రాసేస్తే సరిపోదూ..!!” నాకున్న పరిమితులని అర్థంచేస్కుని అధిగమించాలి. నేను ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్య నటులకి కథ మీద నమ్మకం కలిగించడం. కొంతమంది అయితే ఇది కథే కాదు అన్నారు. ఒక కళాకారుడిగా నేను చేస్తున్న ప్రయోగం మీద నాకు నిర్దిష్టమైన అవగాహన, నమ్మకం ఉన్నాయి. ఆ నమ్మకంతోనే నా స్నేహితులని ఒప్పించి షూటింగుకి పూనుకున్నాము. కథలో లొకేషన్స్ చాలా వరకు లైవ్ లొకేషన్స్ కావడంతో న్యాచురాలిటీ కోసం గెరిల్లా షూటింగ్ స్టైల్ ని అనుసరించాము. ఇది కొంచం రిస్కీ అయినా సినిమాకి చాలా ఉపయోగపడింది.

ఒకడు సినిమా తీస్తే, దాని ప్రభావం ప్రేక్షకుల మీద ఎంత ఉంటుందో దాన్ని తీసినవాడి మీద కుడా అంతే ఉంటుంది. శూన్యం విడుదలయ్యాక వచ్చిన స్పందనలు, అభినందనలు, విమర్శలు అప్పటిదాకా నాలో ఏ మూలో సినిమా కళ పట్ల ఉన్న అలసత్వాన్ని పూర్తిగా పోగొట్టాయి. సినిమాకి ఉన్న శక్తి సామర్ధ్యాలు తెలిసొచ్చాయి. కళ పట్ల నాకున్న బాధ్యత అర్థమైంది. ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్లో, కళాకారుల్లో “సినిమా” మీద ఉన్న అవగాహనలో మార్పు తీస్కురావాలి. అలా పుట్టిన అలోచనే “వర్ణం”. మిత్రుడు స్మిజో దీన్ని ప్రతిపాదించాడు. సినిమాల పట్ల ఇలాంటి అలోచనా సరళిని వ్యాప్తి చెయ్యాలన్నా, ఇలాంటీ సినిమాలు విరివిగా తీయాలన్నా సిమిలర్ మెంటాలిటి ఉన్న టీం కావాలి. అలా “వర్ణం” అనే పేరుతో ఒక టీం తయారు చేస్తున్నాం. ఆ టీం మొదటి ప్రయత్నం “ఒక మరణం” షార్ట్ ఫిల్మ్.

కళ ఏదైనా అది జీవితంలోంచి పుట్టాలి. సామాజిక మూలాలని అన్వేషించాలి, జీవితపు సంక్లిష్టతని సులభతరం చెయ్యాలి. వ్యాపారం కోసం పుట్టేది కళ కాదు. నేను రాసే కథలు, తీసే సినిమాలు అంతిమంగా ప్రేక్షకుడి వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించేవిగా ఉండాలని అనుకుంటాను.

Download PDF

7 Comments

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)