ఒక ప్రశ్న

 01

తన పాదాలను ముఖంతో క్షాళనం చేస్తున్నప్పుడు

కలిగే సన్నని గిలిగింతల మెలకువతో నన్ను తనలోకి హత్తుకొని

తిరిగి ఎక్కడో తనలో  ఒక ఎరుక-

 

యుగాల నాటిది  సదా తొలుచుకపోయే గాయమై సలిపే  స్పర్శతో

రెప్పల వాదరకు చిప్పిల్లిన దుఖాశ్రువుగా  తను ఇలా అన్నది :

 

చిన్నా,  మీ ప్రేమ,ఇంకా అప్పుడప్పుడూ ఇలా ఉక్కిరిబిక్కిరి చేసే మీ

భక్తీ, మీ కోర్కె నన్ను ఎంత వివశను చేస్తాయో  తిరిగి అంతగా భయపెడతాయి

 

నువ్వు నన్ను హత్తుకున్నప్పుడు,

ఒక మానవోద్వేగానికి ఉన్మత్తతను తొడిగి

నా దేహం చుట్టూ ప్రాకృతిక గాథలనూ అల్లి  సేదతీరుతున్నప్పుడు,

గొప్ప సృజనతో ప్రేమ గురించి కవిత్వం రాస్తున్నప్పుడూ

ఒక కంట ఉప్పొంగుతూ మరొక కంట భయదనై ఒదిగి ఒదిగి నాలో నేను బంధీనవుతాను

 

ఒకటి రెండు అవయవాల చుట్టూ, కాకుంటే ఒక దేహం చుట్టూ
ఇంత పారాలౌకికత ఎలా పొదగబడిందో నువ్వూ ఆలోచించి ఉండవు

 

ఇదిగో చూడు: రక్త సంస్పందనమై మామూలుగా,

నిజంగా మామూలుగానే అవయవాలలో అవయవాలై కదలాడే వీటిని చూడు

యోనిగా,వక్షోజాలుగా అతిమామూలుగా శరీరంలో శరీరమైన వీటిని చూడు

 

ఎన్ని గాథలు, ఎన్ని ప్రాకృతిక, పారాలౌకిక పోలికలు
ఎంత చరిత్ర,ఎన్ని సంస్కృతులు
మనిషి సృజన, మనిషి కాలం యావత్తూ

ఒక్క దేహం చుట్టూ మోహరించడం అందరికీ ఆశ్చర్యం కలుగవచ్చును గానీ

 

 

నాకు మాత్రం నిజంగానే ఊపిరి ఆడడం లేదు చిన్నా
ఒదిగి ఒదిగి లోనికి కూరుక పోతూ చివరికి నాలోని ఆఖరి  కణాన్నయినా

నేను మిగుల్చుకోగలనో లేదో అన్న అనుమానంతో బిగుసుక పోయి బతుకుతున్నాను

 

ఒక అవయవం శరీరంలో శరీరం కానప్పుడు

ఒక మనిషి మనిషిగా కనబడనప్పుడు

భక్తితో ప్రేమ పుష్పాలు ఎలా మాలకడతారో

అంతే ద్వేషంగా తాగి పడేసిన సీసాలనూ యోనులలో జొరుపుతారు

 

మీ యుద్ధాలలో, మీమీ ఆధిపత్యపు పోరాటాలలో

మీ స్త్రీలకు అపురూపమైన పారవశ్యాలను కానుకలుగా ఇచ్చినట్లే,

మరొకరికి ఆక్రమణల పైశాచిక అనుభవాలనిస్తారు

 

మీమీ మానవాతీత ప్రేమలతో,

మానవాతీత ద్వేషాలతో కాలపు రేకులపై

మార్మిక రంద్రాంశాలను గురించి అమానుషంగా మాత్రమే రాస్తారు

 

చిన్నా,

నిజంగానే బతిమాలి అడుగుతున్నాను
నన్ను మనిషిగా ఎప్పుడు భావిస్తావు?

Download PDF

3 Comments

 • m s naidu says:

  నాగరాజు గారు, ఇదొక అనేకానేక ఓ శేషప్రశ్నే

 • dasaraju ramarao says:

  యదార్థ దృశ్యానికి వ్యధార్త అక్షరీకరణ బాగుంది. వాచ్యంగా అనిపించినప్పటికీ ఇన్ సైడర్ గా కవిత్వస్పృహ స్పురించడమ్ విశేషం.

 • మీ యుద్ధాలలో, మీమీ ఆధిపత్యపు పోరాటాలలో

  మీ స్త్రీలకు అపురూపమైన పారవశ్యాలను కానుకలుగా ఇచ్చినట్లే,

  మరొకరికి ఆక్రమణల పైశాచిక అనుభవాలనిస్తారు..

  ఈ పాదాలొక్కటే కాదు కానీ కవిత ఆసాంతం మనసును అలజడికి గురిచేస్తూ చివరి ప్రశ్న వెంటాడుతూ వుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)