ఎవరిదో..ఒక అనుమతి కావాలి

ramachandramouli

పుట్టిన కోడిపిల్ల నడుస్తూ వెళ్ళిపోయిన తర్వాత

పగిలిన పైపెంకు ఒక విసర్జితావశేషమే కదా.. ఆలోచించాలి

అనంతర చర్యల గురించీ, సాపేక్ష అతిక్రమణల గురించీ, ఉల్లంఘనల గురించీ

చూపులు స్తంభించినపుడు శూన్యమయ్యే నిశ్చలనేత్రాల గురించీ

ఊర్కే..అలసి..రోడ్డు ఫుట్‌పాత్‌పై కూలబడి శిథిలమవ్వడం గురించీ

 

…చాలాసార్లు అన్నీ చెప్పడం నీకు చేతకాదు

జీవితంలో ఎవరికైనా ఎదుటిమనిషితో

చెప్పినవాటికంటే చెప్పకుండా ‘రహస్యం’ చేసినవే ఎక్కువ

 

ఒక చీకటి బిలంలోకి

ఎండుటాకు గాలిలో రాలిపోతున్నప్పటి..విశుద్ధ అనివార్యతను ఊహించగలవా

కొన్నిసార్లు ఏమీచేయలేని నిష్క్రియత్వం,

అలా అద్దంపై ఘనీభవిస్తున్న నీటి బిందువువలె

ఒట్టి దుఃఖపు ఊట..యిసుకను తోడ్తున్నకొద్దీ కన్నీటి జల

కళ్ళు సముద్రాలకు పర్యాయాంగాలా

పాదాలు శరీరాన్ని…గుండెను..మనసునుకూడా మోసుకుని నడుస్తున్నపుడు

ఎవరో రబ్బర్‌ కొసలను లాగి సాగదీస్తున్నట్టు..స్ట్రెచ్‌.,

పరవశమే, కాని..ఏదీ అర్థంకాదు

పెళ్ళాం అర్థంకాదు..పిల్లలు అర్థంకారు.. ఉద్యోగం అర్థంకాదు

రాజకీయాలు అర్థంకావు.. అరాచకాలర్థంకావు

చివరికి జీవితం అర్థంకాదు-

 

చటుక్కున..సుడిగుండంవలె ఒక ఖాళీ ఏర్పడ్తుంది లోపల

అలలు అలసటలేకుండా ఒడ్డుకు తలబాదుకుంటున్నట్టు నిశ్శబ్దవేదన

ఏమి కావాలో తెలియదు.. ఏమి వద్దోకూడా తెలియదు

కాని ఏదో కావాలనిమాత్రం తెలుసు

ఆ ‘ఏదో’ కోసం అన్వేషణ

మనిషిలో, బ్యాంక్‌లో, కుర్చీలో.. ఆమె కళ్ళలో, నవ్వులో

అంతా తుంపర తుంపరగా ముసురు

ముందరున్న పాదముద్రలలో వెదుకులాట

వైకుంఠపాళీ అరుగుపై గవ్వల విదిలింపు

నిచ్చెనలకోసం ఉబలాటం

పాములేమో నోళ్ళు తెరచి, పడగవిప్పి హూంకరింపు

చేతులు రెండూ యిక తెరువవలసిన తలుపులు

 

తీరా..ఇప్పుడు

ఎదుట లోడెడ్‌గన్‌ ఎక్కుపెట్టబడి సిద్ధంగా వుంది

ఇనుపబూట్లు, ఇనుప టోపీ, ఇనుప కవచం

బిగపెట్టబడ్డ శ్వాస.. చికిలించిన కళ్ళు..కాని

…ఎక్కడినుండో..ఎవరిదో..ఒక అనుమతి కావాలి-

 

Download PDF

9 Comments

 • buchi reddy gangula says:

  బాగుంది మౌళి గారు ————— బుచ్చిరెడ్డి గంగుల

  • raamaa chandramouli says:

   ధన్యవాదాలు sir

   • amarajyothi says:

    మీ కవిత చాలా అద్భుతంగా వుంది సర్ మీ ఆలోచనా సరళికి మీ రచనా శైలికి మీ కలం శక్తికి వందనాలు అభినందనలు

 • amarajyothi says:

  మీ కవిత చాలా అద్భుతంగా వుంది సర్ మీ ఆలోచనా సరళికి మీ రచనా శైలికి మీ కలం శక్తికి వందనాలు అభినందనలు

 • vaishnavi says:

  మౌలిగారి కవిత బాగా నచ్చింది.ఆయన శైలి అనితర సాధ్యమైంది ..పదబంధాలు గొప్పవి.అర్థం లోతైనది థాంక్స్ సర్ .

 • Gyaneswar says:

  చాలా బాగుంది. ఎంతో లోతైన అర్థం మీ కవిత్వంలో ఉంది. మీ రచనా నైపుణ్యం ఎంతో గొప్పది. మీ కవితలు, కథలు ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాము.

 • srinivas bomma says:

  ఈ కవిత నాకు చాలా బాగా నచ్చింది.లోతైన అర్థం దీనిలో ఏమిది ఉంది .ధన్యవాదాలు సర్.

 • K.WILSONRAO says:

  “పెళ్ళాం అర్థంకాదు..పిల్లలు అర్థంకారు.. ఉద్యోగం అర్థంకాదు

  రాజకీయాలు అర్థంకావు.. అరాచకాలర్థంకావు

  చివరికి జీవితం అర్థంకాదు-”

  సర్, ఇది చదువుతుంటే “మో” గారి చితి-చింత గుర్తొస్తుంది. కవిత చాల అద్బుతంగా వుంది సర్.

 • K.WILSONRAO says:

  “చటుక్కున..సుడిగుండంవలె ఒక ఖాళీ ఏర్పడ్తుంది లోపల

  అలలు అలసటలేకుండా ఒడ్డుకు తలబాదుకుంటున్నట్టు నిశ్శబ్దవేదన

  ఏమి కావాలో తెలియదు.. ఏమి వద్దోకూడా తెలియదు”

  ఈ కవిత చదువుతుంటే నాకు మీరు రాసిన కవిత
  “ఐనా మనం జీవిస్తూనే వున్నాం” కవిత గుర్తొస్తుంది సర్.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)