ఒక నడి వయసు ప్రేమ కథ: లిజన్.. అమాయా!

జ్ఞాపకాలే జీవితం కాదు.. జీవితంలో ఒక భాగం మాత్రమే జ్ఞాపకాలు… ఎంత సత్యం! ఇట్స్ ఎ ప్రాక్టికల్ ట్రూత్! ఆ విషయాన్నే చెపుతుంది లిజన్.. అమాయా!

జిందగీ న మిలేగీ దొబారా…ఎవరన్నారు బాస్? జిందగీ మిలేగీ దొబారా! జీవితం మొదలుపెట్టిన కొన్నాళ్లకే జీరోకి చేరితే.. అంతా అయిపోదు. మళ్లీ ఒకటి, రెండు, మూడు అంకెలుంటాయి! పాత జ్ఞాపకాలను, అనుభవాలను ఓ భాగం చేసుకుంటూ కొత్తగా మొదలుపెట్టొచ్చు! దాన్నే చూపిస్తుంది లిజన్.. అమాయా! అమాయా.. అంటే రాత్రికల! బతుకు రాత్రి కలలాగే మిగిలిపోకూడదు!  జీవితం ఇలాగే ఉండాలనే ఫ్రేమ్‌లో మనసున్న వాళ్లెవరూ ఇమడలేరు! ఈ ప్రయాణంలో అనుభవమయ్యే ప్రతిమలుపునూ స్వీకరించడం..ఆస్వాదించడమే! విధివింతల్లో భాగస్వామ్యులవడమే!

ఇవన్నీ స్త్రీ, పురుషులిద్దరికీ సమానమే అయినా  స్త్రీ విషయానికొచ్చేసరికే ఎక్కడలేని సంఘర్షణ! ప్రేమ, సహచర్యం విషయంలో మరీ! ఆమెకు జిందగీ నమిలేగి దొబారా! ఒకవేళ కోల్పోయిన జీవితాన్ని మళ్లీ పొందాలనే ఆశపుడితే కట్టుబాట్ల నుంచి కన్న పిల్లల దాకా అందరికీ శత్రువు అవుతుంది!  కట్టుబాట్లనెదిరించే ధైర్యం చూపినా పిల్లలను కన్విన్స్‌చేసే సాహసం చేయలేదు ! అసలు ఆమెకు ప్రేమించే హక్కేలేనప్పుడు జీవితంలో మలిప్రేమ ఊపిరిగురించి ఊసా? అదీ మధ్యవయసులో! ఆ చర్చనే తల్లీకూతుళ్ల మధ్య సున్నితంగా లేవనెత్తుతుంది లిజన్ అమాయా..!

రమా సరస్వతి

రమా సరస్వతి

చలం రాజేశ్వరి చేసిన ధైర్యం లిజన్ అమాయాలో లీలా చేస్తుందా? రాజేశ్వరికి లోకం ప్రేమ మయం! పిల్లల బంధాలు, బంధనాలు లేవ్! కాని  లీల అలాకాదు! షి ఈజ్ ఎ అర్బన్ లేడి! మెచ్యూర్డ్ అండ్ మోడర్న్‌డాటర్‌కి సింగిల్ పేరెంట్! భర్త చనిపోతే అన్నీ తానై, తనకు కూతురే లోకమై బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. సినిమా కథలో మనకు కనిపించే లీల..ఢిల్లీలో బుక్ ఎ కాఫీ పేరుతో కెఫ్తీరియా నడుపుకొంటూ జీవిస్తున్న మిడిల్‌ఏజ్డ్ ఉమన్! ఆ కెఫ్తీరియాలోనే పరిచయం అవుతాడు ఫోటో జర్నలిస్ట్ జయంత్! అతని భార్యా, పాప ఓ కార్ యాక్సిడెంట్‌లో చనిపోతారు. నడివయసు దాకా ఒంటరిగానే ఈదాడు! లీలతో పరిచయం స్నేహంగా మారుతుంది! ఎంతలా అంటే కెఫ్తీరియాకి వచ్చిన అపరిచితులు జయంత్, లీలను భార్యాభర్తలు అనుకునేంతగా!
లీల కూతురు అమాయా.. ఔత్సాహిక రచయిత! జయంత్‌తో చాలా చనువుగా ఉంటుంది. తన కెరీర్‌కి సంబంధించి ఎన్నో సలహాలు తీసుకుంటుంది. ఆయన్ని ఓ ఫ్రెండ్‌లా, గైడ్‌లా భావిస్తుంది!
లీలా  వయసొచ్చిన తన బిడ్డను ఓ స్నేహితురాలిలా చూస్తుంది. అన్నీ పంచుకుంటుంది. కూతురూ తనతో అన్నీ పంచుకునే స్వేచ్ఛనిస్తుంది. తామిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం అనే భావనలో ఉంటుంది లీల. కాని తర్వాత తెలస్తుంది తనది వట్టి భ్రమేనని!

1005330_10200530760220688_1798645539_n
రాఘవ.. అమాయా ఫ్రెండ్! ఆత్మవిశ్వాసం అమాయా రూపు తొడుక్కుందా అన్నట్టున్న ఆ పిల్లను చూసి ప్రేమలో పడ్తాడు. ఆమె మనసు గెలుచుకోవడానికి నానా తంటాలు పడ్తుంటాడు. అందులో భాగమే కెఫ్తీరియాలో లీలకు సహాయం చేస్తుండడం! ఓపెన్ మైండ్.. మోడర్న్ థింకింగ్ ఉన్నట్టు కనిపించే అమాయాతో సహచర్యం చేయాలని తపిస్తుంటాడు!
కాని తనపట్ల తల్లికి, రాఘవకున్న అభిప్రాయలు అబద్ధాలని తేల్చేస్తుంది అమాయా ..ఈ వయసులో తోడు కావాలనుకుంటున్నావ్ ఆఫ్టర్‌ ఆల్ ఫర్ సెక్స్? అన్న ఒకేఒక మాటతో!
ఖంగుతింటుంది లీల! మనిద్దరం ఒకరికొకరం చాలా అర్థమయ్యాం అనుకునేదాన్ని. కాని అపరిచితులం అని ఇప్పుడు అర్థమైంది అని బాధపడ్తుంది లీల. నా కూతురైతే చెంప చెళ్లుమనిపించే వాడిని అంటాడు జయంత్! ఓపెన్‌మైండ్ అండ్ మోడర్న్ గర్ల్‌గా ఉన్నట్టు నటిస్తావ్.. ఇదేనా నీ ఓపెన్‌నెస్? మీ అమ్మ విషయంలో నీ మాటతో నన్ను చాలా డిస్‌అప్పాయింట్ చేశావ్ అమాయా.. అంటాడు రాఘవ!
అమాయా కరుకు ప్రవర్తనకు, ఘర్షణకు కారణం.. వాళ్లమ్మ జయంత్‌తో ప్రేమలో పడడం. ఆ ఇద్దరు ఆ వయసులో పెళ్లితో ఒకటికావాలనుకోవడమే! ఆ నిర్ణయంతో అమాయా ప్రవర్తనలో మార్పువస్తుంది. తండ్రి అంటే అమాయాకు వల్లమాలిన ప్రేమ! తండ్రిపోయినా ఆ జ్ఞాపకాల్తో తను బతుకుతున్నట్లే తల్లీ బతకాలనుకుంటుంది. తన తండ్రి స్థానంలో ఇంకో పురుషుడిని తల్లి పక్కన ఊహించలేదు! ఆ సంఘర్షణతో మానసికంగా తల్లికి దూరమవుతూ ఉంటుంది. విచక్షణ కోల్పోతుంది. తండ్రి స్థానం ఆక్రమించుకుంటున్నట్టుగా ఊహించుకొని జయంత్‌నూ శత్రువుగా చూస్తుంది.
నిజానికి జయంత్ అమాయా అభిప్రాయాలను చాలా గౌరవిస్తుంటాడు. ఆమె తండ్రి స్థానాన్ని అతను కోరుకోడు. లీలను తనకు తోడుగా, తను ఆమెకు తోడుగా మాత్రమే కోరుకుంటాడు. తమ ఇద్దరి అనుబంధం గురించి అమాయాతో మాట్లాడమని లీల అడిగినా.. ఆమే అర్థంచేసుకోవాలికాని మనం కన్విన్స్‌చేసి ఒప్పించాల్సిన విషయంకాదంటాడు జయంత్!
అన్నట్టుగానే బోలెడంత మానసిక వేదన తర్వాత తల్లికోణంలోంచి ఆలోచించడం మొదలుపెడుతుంది అమాయా. నెమ్మదిగా లీల, జయంత్‌ల మధ్య ఉన్న ప్రేమను అర్థంచేసుకుంటుంది.
ఆధునికత అంటే మారిన టెక్నాలజీని మాత్రమే అడాప్ట్ చేసుకోవడం కాదు స్త్రీ, పురుష సంబంధాలను అవగతం చేసుకోవడం… ప్రేమ విషయంలో స్త్రీ స్వేచ్ఛను అంగీకరించడం… ఆమె మనసును అర్థంచేసుకోవడం.. ఆమె అవసరాన్నీ గుర్తించడం అని రుజువు చేస్తుంది లిజన్.. అమాయా!
నడివయసు.. ప్రేమలు అసహజం కావు! ఆ మాటకొస్తే తోడు కావాలనిపించేది ఆ వయసులోనే కదా. అయితే అమాయా అపోహ పడ్డట్టు నాట్ ఫర్ సెక్స్! మనిషి తాలూకు జ్ఞాపకాలు మనసు నిస్తేజం కాకుండా చూస్తాయేమో కాని జీవితాన్ని నడిపించలేవ్! పాత బంధాలను కలిపి ఉంచేది కచ్చితంగా పిల్లలే కాదనడంలేదు! అంతమాత్రాన ఒంటరైన తల్లో, తండ్రో ఇంకో తోడు కోరుకుంటే ముందు బంధానికి వచ్చిన ముప్పూలేదు! అసలామాటొకొస్తే ఈ రెండిటినీ పోల్చాల్సిన అవసరమూ లేదు! ప్రాక్టికల్‌గా అసాధ్యం కూడా! అవి వర్ణించుకోవడానికి బాగుంటాయంతే! పురుషుడు ఇంకో తోడు కావాలంటే సమాజం ఇలాంటివన్నీ కన్వీనియెంట్‌గా పక్కనపెట్టడంలేదా? ఆ స్వేచ్ఛ స్త్రీకి ఎందుకు లేదు? ఈ చర్చలన్నిటికీ లిజన్.. అమాయా మంచి డయాస్!

1360787547-listen_amaya_20130211
ప్రకతిలో ఇన్ని రంగులున్నా జీవితంలో రెండే రంగులు..బ్లాక్ అండ్ వైట్! ఇది ఈ సినిమాలో మాటే! ఈ నిజాన్ని గ్రహిస్తే మానవసంబంధాల్లోని మంచి, చెడులు కాదు సుఖదుఃఖాలు మాత్రమే తెలుస్తాయి! స్త్రీ ప్రేమించే హక్కుకు పూసిన నలుపు తెలుపుగా కనపడుతుంది! ప్రేమ అనంతం… ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా పుట్టొచ్చు..దాన్ని అంగీకరించడం, వ్యతిరేకించడం కేవలం వ్యక్తిగతం! ఇది అర్థమైతే చాలు దాన్ని మోయాల్సిన బరువును సమాజం తప్పించుకున్నట్టే!
you dont always have to be  right.. you have to be happy అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన లిజన్.. అమాయా సున్నితంగా మనసును తట్టి.. కళ్లను తడిచేసే అద్భుతప్రయోగం! ఈ చిన్న సినిమాను చూశాక పెద్ద ఆలోచన చేయకపోరు!
తన మొదటి సినిమానే ఓ ప్రయోగంగా మలచుకున్న దర్శకుడు అవినాశ్‌కుమార్ సింగ్ సాహసానికి హ్యాట్సాఫ్! అతని ఎక్స్‌పరిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్! గీతాసింగ్ కథకు మంచి న్యాయమే జరిగింది. అయితే అవినాశ్ క్రెడిట్‌లో సింహభాగం  సీనియర్ యాక్టర్స్ దీప్తినావల్, ఫరూఖ్ షేక్‌లదే! వాళ్లు నటించలేదు ఆ పాత్రల్లో బతికారు! అమాయాగా స్వరాభాస్కర్ సింప్లీ సూపర్బ్!

మొన్న ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో కనిపించే అవకాశంలేదు! కాబట్టి డివీడీ దొరికితే డోంట్ మిస్సిట్! బాలీవుడ్‌లో కనిపించే ఇలాంటి ప్రయత్నాలు తెలుగుకి రావడానికి ఇంకో తరమైనా పట్టొచ్చు! అప్పటిదాకా కనీసం రచయితలైనా ఇలాంటి అంశాల మీద కథలు, నవలలు రాస్తే చర్చకు ఆస్కారం ఉంటుంది!

– సరస్వతి

Download PDF

16 Comments

 • sreedhar says:

  you dont always have to be right.. you have to be happy అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన లిజన్.. అమాయా సున్నితంగా మనసును తట్టి.. కళ్లను తడిచేసే అద్భుతప్రయోగం!

 • ప్రియ కారుమంచి says:

  రమా సరస్వతి గారూ ఒక మంచి చర్చని మిస్ కాకుండా చేసారు ,, ధాంక్స్ అండి.
  ఆధునికత అంటే మారిన టెక్నాలజీని మాత్రమే అడాప్ట్ చేసుకోవడం కాదు స్త్రీ, పురుష సంబంధాలను అవగతం చేసుకోవడం… ప్రేమ విషయంలో స్త్రీ స్వేచ్ఛను అంగీకరించడం… ఆమె మనసును అర్థంచేసుకోవడం.. నాకు ఇప్పడు 20స్ లో ఉన్న పిల్లలను చూస్తుంటే నిజంగా నాకు భయం వేస్తుంది డబ్బు / టెక్నాలజీ తప్ప అసలు వీళ్ళకు సున్నితమైన భావాలు ఉంటాయని, వాటికి విలువివ్వాలని ఆలోచనలోకి కూడా రావేమో అనిపిస్తుంది ,..కనీసం మనం మానవ సంబంధాల గురించి ఆలోచిస్తున్నాం …ఓపెన్ మైండ్./ మోడర్న్ థింకింగ్ అంటూ(అనుకుంటూ) టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్నారు కానీ, చలం గారిలా మానవ సంబంధాల గురించి భావోద్వేగాల గురించి ఆలోచించే వారేరి , చలం తప్పా మళ్ళి ఆస్థాయిలో ఎందుకు రచనలు కూడా రావటం లేదు…అంటే ఇంకా మనం ఈ విషయాలలో వందేళ్ళ వెనకే ఉన్నాం ….

 • gorusu jagadeeshwar reddy says:

  రమా … బాగుంది. చక్కని విశ్లేషణ చేసారు. చదువుతుంటే ఇరానీ దర్శకుడు మజీద్ మజ్దీ FATHER సినిమా గుర్తొచ్చింది. వీలయితే ఆ సినిమా చుడండి.
  – గొరుసు

 • కల్లూరి భాస్కరం says:

  ఒకటే నాకు అర్థం కాలేదు…అది నాట్ ఫర్ సెక్స్ అన్నమాట. నడి వయసు వారిలో లైంగిక భావాలు ఉండవా? ఉండడం నిషిద్ధమా? స్త్రీ-పురుషులు ఒకరికొకరు తోడు కావడం అంటే ఏమిటి? వారి మధ్య దాపరికాలు లేని సాన్నిహిత్యం ఏర్పడడమే కదా? ఆ సాన్నిహిత్యం శారీరకమైన కలయికను నిషేధిస్తుందా? నిషేధించినప్పుడు అది సంపూర్ణమైన సాన్నిహిత్యమూ, ప్రేమా అవుతాయా?. నాట్ ఫర్ సెక్స్ అనడం ఆత్మవంచనే అవదా? అమలిన శృంగారం/ప్రేమ అనేవి ఉటోపియా అనీ, భౌతికమైన నేల విడిచి సాగించే ఆదర్శవాదమనీ అనిపిస్తుంది. నాట్ ఫర్ సెక్స్ అనుకోవడంలో అంతర్లీనంగా, భర్త గతించిన స్త్రీకి మరో పురుషునితో సంబంధాన్ని అంగీకరించని సాంప్రదాయిక నీతి పట్ల జంకు,లేదా ఆ నీతి పట్ల అనుకూలతే ఉన్నాయి. కొడవటిగంటి కుటుంబరావు కూడా అమలిన ప్రేమను అంగీకరించలేదు. నాకు అర్థమైనంతవరకు చలం కూడా స్త్రీ-పురుషుల మధ్య అమలిన ప్రేమను ప్రతిపాదించలేదు. నాట్ ఫర్ సెక్స్ అనడంలో ఒక డొల్లతనం ఉంది.
  గతించిన తండ్రి స్థానంలో మరో పురుషుని ఊహించుకోవడమే కాదు; గతించిన తల్లి స్థానంలో మరో తల్లిని ఊహించుకోవడం కూడా పిల్లలకు మనస్తాపం కలిగిస్తుంది. పురుషుడు ఆ మనస్తాపాన్ని బలవంతంగా రుద్దుతాడు. వ్యవస్థ దానిని సమర్థిస్తుంది. స్త్రీ విషయంలో అలా జరగదు. కాకపోతే, పురుషుని విషయంలో సామాజిక ఆమోదం ఉండడం పిల్లల మనస్తాపాన్ని కొంత తగ్గిస్తుందేమో. లేదా స్త్రీ విషయంలో(మన సమాజం మేరకు) కలిగే సాంస్కృతక ఆఘాతం పురుషుని విషయంలో ఉండదు.
  లీల తన కూతురిని స్నేహితురాలిలా చూస్తుందనీ, ఆమెతో అన్నీ పంచుకుంటుందనీ అన్నారు. అది కూడా చాలా అసహజమైన చిత్రణ. కూతురిని స్నేహితురాలిలా చూడడం కొంతవరకు అర్థం చేసుకోవచ్చేమో కానీ, అన్నీ పంచుకుంటుందనడం అబద్ధం, అసహజం. తల్లి కానీ తండ్రి కానీ పిల్లలతో పంచుకోలేనివీ, పంచుకోకూడనివీ ఉంటాయి. వాళ్ళ మధ్య తల్లిదండ్రులు-పిల్లలు అనే ప్రత్యేక సంబంధం ఉంటుంది. ఆ సంబంధం కొన్ని హద్దులు దానికదే విధిస్తుంది. అలా విధించడంలోనే తల్లీ-పిల్లలు అనే అందమైన అనుబంధం దాగి ఉంటుంది.

  • ganesh says:

   సూపర్ గ చెప్పారు సర్ మనుషుల మధ్య సంబంధాలను కచ్చితంగా చెప్పారు సర్ ప్రపంచంలో ఒడిదుడుకులను నిక్కచ్చిగా వర్ణించారు సూపర్ సర్ ఎక్ష్లెన్త్

  • Narsim says:

   భాస్కరం గారికి,
   ఇక్కఢ లీల, జయంత్ ల సాన్నిహిత్యం, ప్రధానంగా వారున్న ఒంటరితనం పరిస్థితుల నుండి తోసుకొచ్చిన ఒక అనివార్యమైన సందర్భం, ఇదే ఆ దగ్గరితనం లేదా ఒకరికొకరు తోడు అనే దానికి మెుట్టమెుదటి కారణం, అంతేకాని, అమాయా అపోహపడ్డట్టుగా సెక్సె మెుదటి కారణం కాదు. ఆ సాన్నిహిత్యపు కొనసాగింపు సెక్స్ అయితే అవుగాక, అదేమి నిషిద్దం కాదే, కాని అందుకొరకే ఆ సాన్నిహిత్యం అని అపార్థం చేసుకోవద్దనే నాట్ ఫర్ సెక్స్ అనడం. అదేమి ఆత్మవంచన కూడా కాకపోవచ్చు. ఆ సాన్నిహిత్యం స్త్రీ కి మగవాడి రక్షణ కావచ్చు, మగవాడికి స్త్రీ లాలన కావచ్చు, ఇదే ప్రధానమైన అవసరం వాళ్ళకు, సెక్స్ తర్వాతి విషయం.
   —–నర్సిం

   • కల్లూరి భాస్కరం says:

    నా స్పందనలో ఉద్దేశం, ఆ సినిమా కథ, రమా సత్యవతిగారి విశ్లేషణ విడిచిపెట్టిన కొన్ని జాగాలను సూచించడం, అంతవరకే. ఉదాహరణకు ఈ కథను లీల, జయంత్ ల కోణం నుంచి చెప్పారు. అదే అమయా కోణం నుంచి చెబితే?!…వ్యాఖ్యానం మారుతుంది. అప్పుడు అమయా సమస్య ఫోకస్ అవుతుంది. లీల, జయంత్ ల తపనను ఒంటరితనం నుంచి బయట పడడం కోసంగా, తోడు కోసంగా చూపించడానికి సెక్స్ ను చిన్నది చేశారు. లేదా మరుగుపుచ్చారు. అమయా కోణంలో చెప్పినప్పుడు, ఆమె అయిష్టానికి మొదటి కారణం, చివరి కారణం కూడా సెక్సే. ఆఫ్టరాల్ సెక్స్ కోసమేనా అని అనడంలో అపోహ లేదు, సరైన ఊహే ఉంది. పిల్లలకు తల్లిదండ్రులు అవిభాజ్యులుగానే పరిచయం అవుతారు. వారు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు వారి ఊహల్లో అవిభాజ్యులుగానే ఉండిపోతారు. ఎవరో ఒకరిని ద్వేషించేందుకు ప్రత్యేక కారణముంటే తప్ప, ఇద్దరినీ ఒకే ఎంటిటీగా చూస్తారు. ఆ అవిభక్తుల మధ్య ఇంకొకరిని వారు సహించలేరు. ఆ ఇంకొకరితో శారీరకమైన కలయిక గురించిన ఊహ ఆ అసహనానికి పరాకాష్ట అవుతుంది. ఆ అసహనం ఆ ఊహ ద్వారానే వ్యక్తమవుతుంది.
    “అమయా అపోహ పడ్డట్టు నాట్ ఫర్ సెక్స్” అని విశ్లేషకురాలు అన్నారు. అంతే తప్ప “నాట్ ఓన్లీ ఫర్ సెక్స్” అనలేదు. ప్రేమ, తోడు అనే భావనలను పెద్దగా చూపించి సెక్స్ ను చిన్నదిగా చూపడం, లేదా మరుగుపుచ్చడం కథలో అసమగ్రత. అదే విశ్లేషణలోనూ వ్యక్తమయింది.
    “ప్రేమ అనంతం. ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టచ్చు. దానిని అంగీకరించడం, వ్యతిరేకించడం కేవలం వ్యక్తిగతం” అన్న వ్యాఖ్యను కూడా పరిశీలించాలి. తల్లిదండ్రులు-పిల్లలు దానికదే ఒక చిన్నపాటి సమాజం. పిల్లలు కలిగాక తల్లిదండ్రుల “వ్యక్తిగతం” సాపేక్షంగా తగ్గిపోతుంది. కనుక ప్రేమ అనంతం, ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టచ్చు, అది వ్యక్తిగతం అనేది త్రికాల సత్యం కాలేదు. పిల్లలు దానికి హద్దులు నిర్ణయిస్తారు. ఇక లీల-జయంత్ ల సమస్యకు పరిష్కారమేమిటి? అది వేరే చర్చ.

  • భాస్కరం గారూ,
   చక్కటి విశ్లేషణ! ఎంతటి ఆధునికంగా, విశాలంగా ఆలోచిస్తున్నామనుకొనే వారు కూడా అక్కడ కొచ్చేసరికి ఆ ఇద్దరి మధ్యా సెక్సు లేదను చెప్పడానికి తాపత్రయపడతారు. నిరూపించబూనుకుంటారు. మనసులు కలిసాక సెక్సు అప్రధానం అనేవారు సైతం అప్రాధాన్యాన్ని నొక్కి చెప్పి దానికి ప్రాధాన్యత ఇస్తారు.
   ఈ సినిమాలో జయంత్, లీలాల మధ్య సెక్సు వున్నా కూడా నా దృష్టిలో ఆ పాత్రల మీద కానీ, ఈ సినిమా మీద కానీ నా గౌరవం ఏ మాత్రం తగ్గదు.

 • Prasuna says:

  మీ విశ్లేషణ చాలా బాగుంది రామ గారు. మంచి సినిమా. ” జీవితం ఇలాగే ఉండాలనే ఫ్రేమ్‌లో మనసున్న వాళ్లెవరూ ఇమడలేరు!” 100% నిజం.

 • రమా! బాగుంది. చదువుతుంటే అస్తిత్వ్‌ సినిమా గుర్తొచ్చింది. క్లయిమాక్స్‌లో కాస్త అటూ ఇటూగా ఇలాంటి చర్చే ఉంటుంది. కాకపోతే నాదీ కల్లూరి భాస్కరం గారి ప్రశ్నే. మొదటా చివరా విడదీసి చూడలేం. అన్ని కారణాలు కలగలిసే ఉంటాయి. అందుకోసం కాదు అని అపాలజిటిక్‌గా చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి? ఎంత మధ్యవయస్కులైతే మాత్రం!

  ఇలాంటి ప్రయత్నాలు హిందీలోంచి తెలుగులోకి రావడానికి ఒక తరమైనా పట్టొచ్చన్నావు. హిందీలో సెన్సిబిల్‌ సినిమాలు పెరిగిన మాట వాస్తవమే కానీ కారణాలు వేరు. హిందీవారికి మనకంటే సెన్సిబిల్‌ బుర్రలుండడమో మరోటో ఏమీ కాదు. మార్కెట్‌ ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా విస్తరించిన మల్టీప్లెక్స్ మార్కెట్‌ వారికి ఇలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగింది. తొంభైల తర్వాత వచ్చిన కొత్త మార్పు ఇది. ప్రాంతీయ మార్కెట్‌లో ఉన్న మల్టీప్లెక్స్‌లు అంతటి ధైర్యాన్ని ఇవ్వలేవు. పోనీ హైదరాబాద్‌ మల్టీప్లెక్స్‌లను నమ్ముకుని దానికితోడు మిగిలిన ఎ సెంటర్లలో నాలుగైదు రోజులు ఆడిద్దామనుకుంటే ఆ మామూలు థియేటర్లు కూడా అందుబాటులో ఉండవు. అవి ఎవరి గుప్పిట ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉద్యమాల పుణ్యమాని పెద్దోళ్ల సినిమాలు ఆగిపోతే ఎన్ని చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయో చూస్తున్నాం. ఒక అయిడియాను సినిమాగా తీసి థియేటర్లో రిలీజ్‌ చేసుకోవచ్చు అనే థైర్యం క్రియేటివ్‌ బీయింగ్‌కి వచ్చిన రోజున మార్పు వస్తుంది. అంటే మార్కెట్లో మార్పు వస్తే మనకూ సెన్సిబిల్‌ సినిమా వస్తుంది. దానికి ఒక తరమేమీ పట్టనక్కర్లేదు.

  • కల్లూరి భాస్కరం says:

   సారీ, రచయిత్రి పేరు రమా సత్యవతి అని పొరపాటున రాశాను. రమా సరస్వతి అని చదువుకోవాలి.

  • Lalitha P. says:

   సెన్సిబిలిటీ ఛాయలు ఈనాటి తెలుగు సినిమాల్లో ఎంత మాత్రమూ కనబడటం లేదు. కేవలం మల్టీప్లెక్స్ సదుపాయం ఉన్నంతమాత్రాన మంచి సినిమా వచ్చేస్తుందనేది అనుమానాస్పదమే. హిందీ సినిమా ఫాం లో, ఎక్స్పరిమెంట్లో, సబ్జెక్టు లో చాలా ముందుంది. మల్టీప్లెక్స్ సూర్యోదయానికి ముందుగా కనపడే అరుణోదయ ఛాయలు ఏవీ తెలుగు సినిమాల్లో కానరావటం లేదు. ఎంతసేపటికీ బండతనమే తప్ప.
   80ల్లొ స్వాతి అనే సినిమా ఇంచుమించు ఇదే విషయంతో వచ్చింది. అప్పట్లో ఆదర్శాల సినిమాలు కొంతమంది అభ్యుదయవాదులు తీస్తూ ఉండేవారు. ఆ సినిమాలో స్వాతి అనే పిల్ల తన తల్లి కి మళ్ళీ పెళ్లి చెయ్యటానికి చాలా శ్రమ పడి, ఆ పనిని సాధిస్తుంది. చాలా క్రూడ్ గా ఉన్నా ఆ సినిమా అప్పట్లో ఉన్న వెనుకబడిన భావజాలాన్ని, పురుషాధిక్యతనూ చర్చకు పెట్టింది. స్వాతి అప్పట్లోనే అంత ముందుంటే అమాయా పాపం ఇరవై ఒకటో శతాబ్దంలో ఇలా ఎందుకుందో! రెండో పెళ్లి లో కూడా ఆడవాళ్లే మళ్ళీ పీడితులనే విషయం కూడా చర్చించింది ‘స్వాతి’ సినిమా.

 • Thirupalu says:

  ఏమైన విశ్లేషణ చాలా బావుంది! చర్చ ఇంకా జరగాలి. రమా సరస్వతి గారన్నట్లు ‘ఇట్స్ ఎ ప్రాక్టికల్ ట్రూత్’ ఇక్కడ చర్చ వ్యక్తులపరంగా జరుతున్నది. అది సమాజపరంగా జరగాలి. ‘ లీల కూతురూ తనతో అన్నీ పంచుకునే స్వేచ్ఛనిస్తుంది. తామిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం అనే భావనలో ఉంటుంది ‘ కానీ అమాయ ఈ సమాజం ఏర్పరిచిన నమూనా ! ఆమెకు అలానే అనిపిస్తుంది! ఎం దుకంటే , సమాజం పురుషుని కోణం నుండి ముందుకు పోతుంది. ప్రతి ఒక ఆలోచన అవైపునుం డే జరుగుతుంది! తల్లి వైపునుండి అలోచిం చాల్సి వస్తే దాన్ని సమాజం అంగిక రించదు. సమాజ నమూనా అయిన అమాయ మాత్రం ఎలా అంగీక రిం చాలని లీలా కోరుతుంది? ఇక్కడ లీల కూడా ఒక నమూనా అయినప్పటికి, తన వైపునుండి తానూ కరక్టే మరి. సమాజం గురించి ఆలో సించే అవసరం తనకు ఉందో లేదొ తనకు తెలిసినా ఇక్కడ ప్రేమే పైచేయి ఉంది కాబట్టి ఆ ఆలోచనే రాదు. ఆ కొత్త ఆలోచన చేయడానికే కధకుడు అమాయ చేత పునరాలోపింప చేస్తాడు.

 • సినిమా పరిచయం బాగుంది. భాస్కరం గారి విశ్లేషణ మరీ బాగుంది

  ఈ సినిమా, చర్చ ఇదంతా నాకు కల్పన కథ “అయిదో గోడ” కథను గుర్తుకు తెచ్చాయి.

  • సుజాత, ఎలా ఉన్నారు?

   ఐదో గోడ కథ ను ఈ సందర్భం లో గుర్తు చేసినందుకు థాంక్స్. మేము కూడా వ్యాసం చదివిన వెంటనే….అరె..నా కథ లాగా ఉన్నదే అనుకున్నాము.

   కల్పనారెంటాల

 • T.N.SRIVIDYA says:

  బాగుంది మీరు రాసిన విధానం .ఆ పరిస్థితి లో కొంతమంది పట్టించుకోరు ,కొంతమంది జాలిపడతారు, ఇంకొంతమంది ఆలోచిస్తారు. కొద్ది మంది మాత్రమే సహాయం చేస్తారు. దురద్రుష్టం ఏంటంటే సాయం చేసిన వాడిని అభినందిచే వారి కంటే విమర్శించే వారె ఎక్కువ. నేను మిమ్మల్ని అభినందిస్తున్న.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)