ఇంద్రధనుసుపై ఎగిరిన సీతాకోక ఒకటి

 

కోడూరి విజయ్ కుమార్

కోడూరి విజయ్ కుమార్

 

ఒక పరిమళమేదో అపుడపుడూ అల్లుకుంటుంది

పరిమళమే కాదు … పరిమళాన్ని పంచిన

పూల చాటు ముళ్ళ గాయాలు  కూడా

 

ఒక ఉత్సవ గీతమేదో వెంటాడుతుంది  అపుడపుడూ

ఉత్సవగీతమే  కాదు ….

గీతాలాపన నడుమ దొర్లిన అపశ్రుతులూ

జీర పోయిన విషాదాలూ తరుముతాయి

2

మరిచిపోయాననే   అనుకుంటాను

లోపలెక్కడో పదిలంగా ఒక నేలమాళిగలో

నిన్ను పడేసి, పెద్ద తాళం వేసి

హాయిగా వున్నాననే అనుకుంటాను

 

నిజానికి హాయిగానే వున్నాను కదా

నేను తప్ప మరో లోకం లేని

ఒక స్త్రీ సాంగత్యంలో సుఖంగానే వున్నాను కదా

మరి, దేహాంతర వాసంలో తూనీగ  వలె  ఎగిరే

అప్పటి నీ జ్ఞాపకాన్ని దోసిట్లోకి

తీసుకుని పలకరించేది యెలా ?

3

మీ వీధి మలుపు తిరిగినపుడల్లా

నీవు అప్పటి రూపంతో ఎదురైనట్టే వుంటుంది

కొన్ని నవ్వుల్ని నాకు బహుమతిగా ఇచ్చేందుకు

నీవు మీ పాత ఇంటి గుమ్మం లో

నిలబడి ఎదురు చూస్తున్నట్టే వుంటుంది

 

కళ్ళతో కళ్ళని కలిపే ఇంద్రజాలమేదో తెలియక

కొన్ని పొడి పొడి మాటల తీగ మీద

ఒడుపుగా నిలబడలేక ఓడిపోయిన రోజులవి

 

4

జీవితం తెగిన వంతెనలా వెక్కిరించి

నన్ను పూర్తిగా ఓడించ లంఘించిన రోజుల్లోనే కదా

వంతెన చివర ఇంద్ర ధనుసులా నువ్వు మెరిసింది

 

మబ్బుల ఆకాశం పైన రంగుల ఇంద్ర ధనుసు

నిలిచే ఉండునని భ్రమసిన అమాయక రోజులవి

ఇంద్ర ధనుసు అదృశ్యమయినాక

సాగిన ప్రయాణమొక దుర్భర జ్ఞాపకం

butterfly-2

5

ఈ గడ్డి పోచల గూడులో ఒక

నిప్పుని రాజేసి నీవు నిశ్శబ్దంగా కనుమరుగయ్యాక

తగలబడిన గూడుతో ఒక్కడినే

రాత్రులని కాల్చేసిన రోజులవి  ….

 

అప్పుడే కదా తెలిసింది

దేవదాసు మధువు దాసుడెందుకు అయింది

ఇదంతా నీకు తెలిసి వుండక  పోవొచ్చు

తెలిసినా ఒక నిర్లక్ష్యపు చూపు విసిరి వుండ వొచ్చు

6

ఏం చేస్తూ వుంటావని అనుకుంటాను కాసేపు

ఎవరమైనా ఏం చేస్తూ వుంటాము ?

 

సూపర్ మార్కెట్లలో సరుకులు కొంటూ

సరుకులుగా మారిన మనుషుల రణగొణ ధ్వనుల

నడుమ తల తెగిన కోడిపిల్లలా కొట్టుకుంటూ

రంగుల పెట్టెల్లో, అంతర్జాలలో

మనల్ని మనం కోల్పోతూ

ఇంటి పనీ, బైటి పనీ అని అలసిపోతూ ….

 

ఒకనాడు నీ ఊహల్లో కాలిపోయిన గూటిలో

ఇవాళ కొన్ని సరదా ఊహలు

7

ఒక వర్షాకాలపు సాయంత్రం నేను

నా స్త్రీ వొడిలో తల పెట్టుకుని

లోకపు ఆనందాన్నంతా ఒక్కడినే లాగేసుకున్నపుడు

చల్ల గాలిలో తేలి వొచ్చే కిషోర్ పాట

పరిమళమై నన్ను ఆక్రమించుకుంటుంది –

 

‘యే షామ్ కుచ్ అజీబ్ హై …

వో షామ్ భీ అజీబ్ థీ ‘

 

నేను జీవిస్తోన్న ఇప్పటి రోజులే కాదు

తొలిసారి నేనొక రంగుల సీతాకోకనై

ఇంద్రధనుసుపై  ఎగిరిన

అప్పటి రోజులూ అపురూపమే

–      కోడూరి విజయకుమార్

Download PDF

8 Comments

  • జాన్ హైడ్ కనుమూరి says:

    సూపర్ మార్కెట్లలో సరుకులు కొంటూ
    సరుకులుగా మారిన మనుషుల రణగొణ ధ్వనుల
    నడుమ తల తెగిన కోడిపిల్లలా కొట్టుకుంటూ
    రంగుల పెట్టెల్లో, అంతర్జాలలో
    మనల్ని మనం కోల్పోతూ
    ఇంటి పనీ, బైటి పనీ అని అలసిపోతూ ….
    …………..అలసిపోవడం అలవాటైపోయింది

    అభినందనలు

  • కవిత చుట్టూ పరచుకున్న ఆ సీతాకోక రంగుల హరివిల్లు అపురూపం సార్..

  • balasudhakarmouli says:

    ” దుఃఖపు ముల్లు గాయాల నుంచి తేరుకో.. ”
    ‘గతాన్ని
    వర్తమానాన్ని
    వొకే ఉయ్యాలలో ఊపే సాహసం ‘
    -వో కొత్త అనుభూతి కవిత్వంలో….

  • Veldandi Sridhar says:

    మళ్ళీ ఒక్క సారి తొలి యవ్వన కాలం నాటి అమాయక ప్రేమ పుటలు గుండెలో రెపరెపలాడాయి. సీతాకోకచిలుక కన్నా అందమైన రోజులు మళ్ళీ ఒక్క సారి గుర్తుకొచ్చాయి. ఆకాశానికి నిచ్చెనలేసి అక్కడ ఇంద్ర ధనస్సులో ఊయలలూగిన అనుభూతి.
    ” జీవితం తెగిన వంతెనలా వెక్కిరించి

    నన్ను పూర్తిగా ఓడించ లంఘించిన రోజుల్లోనే కదా

    వంతెన చివర ఇంద్ర ధనుసులా నువ్వు మెరిసింది”
    అద్భుతం…. అభినందలు…

  • పాత జ్ఞాపకాల పందిరి బాగుంది కోడూరి

  • Thirupalu says:

    అసలే ప్రేమ కవిత్వం! ఆ పైన అనుభూతి వాదం ! లోకాన్ని మైమరపిమ్చే ఒక మార్మికత! అచ్చం ఈ అనుభూతి వుంటుందేమో ప్రేమా న్మోదమ్లో! అందు కే ఆ జబ్బు లోంచి బయట పడటం కష్టం. ప్రేమను ప్రేమించ డాన్ని ప్రేమించ మన్నాడు శ్రీ శ్రీ . ప్రేమ సర్వకాల సర్వ జగత్తులో ప్రామాణికమైనది ! స్వప్న సుంద రుడివయ్య కోడూరి!
    ఒక మాయ జలతారు లో దగ ధగ మెరిసి ఇంద్రధనుసుపై ఎగిరిన సీతాకోక వయ్యావు.
    అబినందనలు!

  • కోడూరి విజయకుమార్ says:

    జాన్ హైడ్ గారు … వర్మ గారు … బాలసుదాకర మౌళి … లింగారెడ్డి గారు … శ్రీధర్ గారు … త్రిపురాలు గారు … థాంక్ యు … మీ అభినందనలు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి

  • రవి వీరెల్లి says:

    విజయ్,

    పోయెమ్ చక్కగా వచ్చింది. అభినందనలు.

    రవి

Leave a Reply to Veldandi Sridhar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)