‘రాక్షసులు’ ఎవరు?!

213px-Lord_Brahma_and_Adhiti_-_19th_Century_Illustration
కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

‘రాక్షసులు’ ఎవరు?!

ఈ వ్యాసం ప్రారంభించబోయేసరికి, ఉన్నట్టుండి  నేను మళ్ళీ క్రాస్ రోడ్స్ కు చేరా ననిపించింది…!

కిందటి వ్యాసం చివరిలో జాతిభేదాల గురించిన ప్రస్తావనలను ఉదహరించాను. ఆనాటి జాతులు, తెగల సాంకర్యాన్ని అవి సూచిస్తూ ఉండచ్చని అన్నాను. ఆధునిక చరిత్రకారుల రాతలు ఇందుకు సంబంధించిన పురాచరిత్రను నిర్మించుకోడానికి ఏమైనా సాయపడచ్చు అన్నాను.  అలా అనేటప్పుడు, ఆ అంశాలలోకి నేరుగా వెళ్లచ్చునని ఆ క్షణంలో అనిపించింది. తీరా ఈ వ్యాసం మొదలెట్టేసరికి అదంత తేలికనిపించలేదు. ఇందులో విప్పుకుంటూ వెళ్లవలసిన పొరలు చాలానే కనిపించడం ప్రారంభించాయి. తీరా విప్పడం ప్రారంభిస్తే దృక్కోణాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలూ చాలానే కనిపించాయి.  దాంతో ఎటు వెళ్లాలో తోచని స్థితిలో కాసేపు ఉండిపోవలసివచ్చింది. చివరికి దగ్గరి దారి కాకుండా దూరపు దారి పట్టడం తప్పదన్న నిర్ణయానికి వచ్చాను.

రాక్షసులు, అసురులు, దానవులు, దైత్యులు అనే మాటలు మనకు బాగా తెలుసు. వీటి మధ్య స్వల్పంగా అర్థభేదాలు ఉండచ్చు కానీ వీటన్నిటినీ మనం రాక్షసులు అనే ప్రసిద్ధ అర్థంలోనే తీసుకుంటూ ఉంటాం. మన పురాణ, ఇతిహాస కథలు; వాటి ఆధారంగా తీసే సినిమాల పుణ్యమా అని  రాక్షసుల గురించి మనలో కొన్ని ఊహలు స్థిరపడిపోయాయి. వారు భారీ ఆకారంతో చాలా వికృతంగా భయంకరంగా ఉంటారు. వాళ్ళకు కొమ్ములు, కోరలు ఉంటాయి. వాళ్ళు మనుషుల్ని తినేస్తారు. వాళ్ళ దగ్గర ఏవో మాయలు ఉంటాయి. రాక్షసులను ఇలా ఊహించుకోవడంలో మనలో పెద్దవాళ్ళు, పండితులూ కూడా పసివాళ్లు అయిపోతూ ఉంటారు. ఇటువంటి రాక్షసులు నిజంగానే ఉండేవారని వారు నమ్మడమే కాక మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మహాభారతంలో నరమాంసభక్షణ చేసే రాక్షసజాతికి చెందినదిగా చెప్పే హిడింబ నరుడైన భీముని వరించడమే కాక అతనివల్ల కొడుకుని కూడా కంటుంది. అయినాసరే, ఆమె రాక్షసియే!

వేల సంవత్సరాలుగా సంస్కృతి, సారస్వతం, మతం వగైరాలు మన ఆలోచనలపై ముద్రించే నమ్మకాలు ఎంత బలీయంగా ఉంటాయో తెలుసుకోడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇలాంటి నమ్మకాల చరిత్రను తవ్వుకుంటూ కాస్త లోపలికి వెడితే వాటి వెనుక ఉన్న హేతుత్వం అర్థమవుతుంది. కుక్కను చంపాలంటే మొదట దానిమీద పిచ్చికుక్క అనే ముద్ర వేయాలని నానుడి. అలాగే ఒకప్పుడు(బహుశా ఇప్పుడు కూడా) శత్రువు మీద; లేదా భిన్న ఆచారవ్యవహారాలు పాటించేవారి మీద  అలాంటి ముద్రలే వేసేవారు. ఆ విధంగా జాతి వాచకాలు ఎన్నో తిట్టుపదాలుగా, అవహేళన పదాలుగా మారిపోయాయి. ‘అప్రాచ్యులు’ అనే మాటనే తీసుకోండి. తూర్పుదేశానికి చెందినవారు కారనే దాని సామాన్యార్థం. కానీ అదిప్పుడు తిట్టుపదంగా, అవహేళన వాచకంగా మారిపోవడం మనకు తెలుసు. అలాంటివే మ్లేచ్ఛుడు, పిండారీ లేదా పింజారీ వగైరా మాటలు.

cambell

‘రాక్షసులు’ అనే మాట కూడా అలాంటిదే. ఇంకా విశేషం ఏమిటంటే, శత్రువుపై రాక్షసులుగా ముద్రవేసే ప్రక్రియ పురాచరిత్రలో ఒక నిర్దిష్టసందర్భంలో ప్రారంభమైంది. అంతకన్నా విశేషం ఏమిటంటే, ఆ ప్రక్రియ కేవలం మనదేశంలోనే కాదు; ప్రపంచంలో అనేక చోట్ల జరిగింది. ప్రపంచ పురాణ గాథలను అనేక ఆధునిక వనరుల సాయంతో, అనేక కోణాలనుంచి విశ్లేషిస్తూ నాలుగు బృహత్సంపుటాలను వెలువరించిన జోసెఫ్ క్యాంప్ బెల్ అనే పండితుడు దీని గురించి Occidental Mythology అనే సంపుటంలో చర్చించాడు. పూజారులు ప్రయోగించిన ‘పౌరాణిక అపకీర్తికర చర్య’ (Mythological Defamation) గా దీనిని వర్ణించిన క్యాంప్ బెల్, ప్రధానంగా దీనిని పాశ్చాత్య మతశాస్త్రకారులు ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చినా, మిగతా చోట్ల కూడా కనిపిస్తుందంటాడు. ఒక బాబిలోనియా పురాణగాథను విశ్లేషించే సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ పురాణగాథ సంగ్రహంగా ఇదీ:

తియామత్, అప్సు అనే ఆది దంపతులు ఉంటారు. తియామత్ మన జగజ్జనని లాంటి దేవత. వారి కుమారుడు ముమ్ము. అప్పటికి ఇంకా ఆకాశాదేవత, భూదేవతల నియామకం జరగలేదు. పచ్చిక భూములు లేవు. అంతా జలమయం. తియామత్, అప్సుల వల్ల దేవతలు ఉద్భవించినా వారికి ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. ఇదొక అద్వైత స్థితి. కొంతకాలానికి ఇద్దరికి అధికారమిచ్చారు. అయితే, ఆ తర్వాత ఆ దంపతులు సృష్టించిన మరో ఇద్దరు తెలివిలో, స్థాయిలో మొదటి ఇద్దరినీ మించిపోయారు. వీరికి కలిగిన సంతానం వారిని కూడా మించిపోయి చివరికి జగజ్జననితోనే యుద్ధానికి దిగి ఆమెను, ఆమె మరో సంతానాన్ని ఓడించారు. ఈ యుద్ధంలో గెలుపొందిన దేవతల పక్షానికి  మర్దుక్ అనే దేవుడు నాయకత్వం వహించాడు.

క్యాంప్ బెల్ ప్రకారం, మాతృస్వామ్యంపై పురుషస్వామ్యం విజయాన్ని సంకేతించడంతో సహా ఈ కథ వెనుక చాలా విశేషాలు ఉన్నాయి. అంతా జలమయంగా ఉన్న ఆదిమకాలపు అద్వైతస్థితినుంచీ, నిష్క్రియతనుంచీ మనిషి బయటపడి, భూమిని స్వాధీనం చేసుకుని, దానిని ప్రధాన ఉత్పాదకవనరుగా చేసుకున్న క్రమాన్ని ఈ కథ సూచిస్తుంది. అంతేకాదు, రాజ్యం పుట్టుకను, వీరపురుషుల ఆవిర్భావాన్నీ కూడా ఇది వెల్లడిస్తుంది. క్యాంప్ బెల్ ఈ కథ వెనుక గల చారిత్రక నేపథ్యాన్ని తేదీలతో సహా సూచించడం మరింత ఆసక్తిదాయకం. క్రీ.పూ. 3000 సంవత్సరం నాటికి మెసపొటేమియా ఉత్తరప్రాంతం నుంచీ, సైరో-అరేబియా ఎడారి నుంచీ వచ్చిన సంచారజీవులైన దురాక్రమణదారులు రాజ్యాలు స్థాపించడం; క్రీ.పూ. 2500 నాటికి వీరు మెసపొటేమియాను ఆక్రమించుకోవడం ఈ కథకు పూర్వరంగం అని ఆయన అంటాడు. అన్ని వివరాలలోకీ ఇప్పుడు వెళ్లలేము కానీ, ఒక నూతన సామాజిక వ్యవస్థ ఆవిర్భాన్నీ, ఒక నూతన మనస్తత్వాన్నీ, మనిషి ఆలోచనలో, అనుభూతిలో కలిగిన ఒక నూతన నిర్మాణాన్నీ పౌరాణికపు ముసుగులో ఈ కథ సూచిస్తుందని క్యాంప్ బెల్ అంటాడు. మన ప్రస్తుతాంశానికి సంబంధించి అంతకంటే ముఖ్యంగా, శత్రుప్రజలు కొలిచే దేవతలపై రాక్షసులన్న ముద్రవేయడం (అంటే, శత్రుప్రజలను కూడా రాక్షసులుగా  చిత్రించడమే),  విశ్వంపై తమ దేవతల గుత్తాధిపత్యాన్ని స్థాపించడం, అందుకు అవసరమైన పురాణ కథలను సృష్టించడం ఇందులో భాగమని ఆయన అంటాడు. రాక్షసులను నిర్వీర్యులుగా, దుష్టశక్తులుగా; దేవతలను ఉన్నతులుగా, ధర్మపరులుగా చిత్రించడం ఇక్కడితోనే మొదలైందని కూడా అంటాడు.

joseph-campbell-power-of-myth

క్యాంప్ బెల్ ను ఉటంకించుకునే సందర్భాలు ముందు ముందు చాలావస్తాయి. దానినలా ఉంచితే, ఆయన పాశ్చాత్యుడు కనుక పై పౌరాణిక ప్రక్రియ పాశ్చాత్యంలోనే ఎక్కువగా జరిగిందని ఆయనకు అనిపించి ఉండచ్చు. కానీ మన పురాణ ఇతిహాసాలలోనూ దీని సామ్యాలు అచ్చుగుద్దినట్టు కనిపించి ప్రపంచపురాణకథల మధ్యగల పోలికలను ఆశ్చర్యకరంగా వెల్లడిస్తాయి. ఈ సందర్భంలో, ఒకే రకమైన పురాణకథలు ప్రపంచమంతటా వ్యాపించాయన్న క్యాంప్ బెల్ సూత్రీకరణనూ దృష్టిలో ఉంచుకోవాలి.

మన పురాణ ఇతిహాసాల ప్రకారం, దేవతలు, రాక్షసులు, పక్షులతో సహా సమస్త జీవరాశీ కశ్యపుడు అనే ప్రజాపతి సంతానం. దక్షుడు అనే మరో ప్రజాపతి; అదితి, దితి, దను, కాల మొదలైన పదముగ్గురు కూతుళ్లను కశ్యపునికి ఇచ్చాడు. కశ్యపునికి అదితి వల్ల ఆదిత్యులు అనగా దేవతలు, దితి వల్ల దైత్యులు అనగా రాక్షసులు, దనువల్ల దానవులు కలిగారు. దైత్యులను, దానవులనూ కూడా మనం స్థూలంగా రాక్షసులుగానే చెప్పుకుంటాం. దీని ప్రకారం దేవతలు, రాక్షసులు ఒకే తండ్రికి పుట్టిన సంతానం, అంటే సోదరులన్నమాట. అందుకే రాక్షసులను కూడా దేవతలుగానే గుర్తించిన మన పురాణాలు వారిని పూర్వ దేవులని, పూర్వ గీర్వాణులనీ అన్నాయి. అయితే ఈ సోదరుల మధ్య శత్రుత్వం ఏర్పడింది. యుద్ధాలు జరిగాయి. అవి దేవాసురసంగ్రామాలుగా ప్రసిద్ధి కెక్కాయి.

గమనించండి…పైన చెప్పిన బాబిలోనియా పురాణకథలో జరిగింది కూడా అదే. తియామత్, అప్సు అనే ఆది దంపతులకు కలిగిన తొలి సంతానమైన దేవతలతో మలిసంతానమైన దేవతలు శత్రుత్వం వహించారు. యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో తియామత్ తొలి దేవతల పక్షం వహించింది. ఆ పక్షం ఓడిపోయింది. విజేతల పక్షం పరాజిత పక్షంపై రాక్షసులన్న ముద్ర వేసింది. నిజానికి మన పురాణకథలలోని రాక్షసుల లానే వారు కూడా పూర్వదేవులే నన్నమాట. బాబిలోనియా కథను తియామత్ పరంగా, అంటే మాతృస్వామ్యపరంగా చెబితే; మన పురాణ కథను కశ్యపుని పరంగా, అంటే పితృస్వామ్యపరంగా చెప్పారు. అంటే అప్పటికి మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యం ఏర్పడిందన్న మాట. ఆవిధంగా చూసినప్పుడు బాబిలోనియా పురాణ కథ మన పురాణకథల కన్నా ప్రాచీనం అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కోణంలోకి లోతుగా వెళ్లలేం.

ఈవిధంగా శత్రువులైన దాయాదులపై రాక్షసులుగా ముద్ర వేయడం అనేది క్రమంగా శత్రువులైన ఇతర జాతులకు, తెగలకు విస్తరించడంలో ఆశ్చర్యం లేదు. ఆ క్రమంలో పరాజితులైన శత్రువుల జాతివాచకాలు కూడా తిట్టు పదాలుగా, ఆక్షేపణ వాచకాలుగా మారిపోయాయి. ప్రస్తుత సందర్భంలో ‘దాసులు’ అనే మాట కూడా అలాంటిదే. ఆ మాట ఒకప్పుడు జాతివాచకం మాత్రమే. క్రమంగా అది నిందార్థకంగా మారింది. దాని గురించి మరింత వివరంగా చెప్పుకునే ముందు ఇంకో విషయం చెప్పుకోవాలి.

ఆయా అంశాలను కప్పిన పొరలు విప్పుకుంటూ వెడితే దృక్కోణాలకు సంబంధించిన సమస్యలూ చాలానే ఎదురవుతాయని పైన అన్నాను. రాక్షసులు అనే మాట ఒకే వర్గానికి చెందినవారి గుణ గుణాలలో తేడాను చూపించే గుణవాచకమే తప్ప జాతి వాచకం కాదని కొందరు అనవచ్చు. అలాగే, దేవతలు అనే మాట సత్వగుణాన్ని సూచిస్తుందనీ, రాక్షసులు అనే మాట తమోగుణాన్ని సూచిస్తుందనీ అంటూ ఆ మాటలను భౌతికస్థితినుంచి తప్పించి వేదాంత గగనవిహారం చేయించవచ్చు. ఒక కోణంలో అదీ అవసరమే కావచ్చు కనుక దానిని నేను తప్పుపట్టను. అయితే, ఈ ధోరణికి చరిత్రను మూలమట్టంగా నిరాకరించే స్వభావం ఉంది. దాంతోనే చిక్కు వస్తుంది. చరిత్రలో ఆయా సమూహాల మధ్య యుద్ధాలే జరగనట్టు, సోదర జాతుల మధ్య, భిన్న జాతుల మధ్య అసలు ఘర్షణలే జరగనట్టు; అవి పురాణ కథలకు ఎక్కనట్టు ఒక అవాస్తవిక, అసహజ చింతనకు అది దారితీయిస్తుంది. మౌలికంగా సంచారజీవనులైన గుంపుల మధ్య యుద్ధాలు, ఘర్షణలు జరగడం సహజాతి సహజం. పరాజిత పక్షాల జాతి,  లేదా తెగ వాచకాలను విజేతల పక్షం తిట్టుపదంగా, ఆక్షేపణ వాచకంగా మార్చడం అంతే సహజం.

213px-Lord_Brahma_and_Adhiti_-_19th_Century_Illustration

ఇక రెండో సమస్య; ఆర్యులు-అనార్యులన్న విభజనకు సంబంధించినది. ఇది చాలా వివాదాస్పదమైన సమస్య. ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించేవారు ఉన్నారు. అది పాశ్చాత్యచరిత్రకారుల కుట్రగా వీరు అభివర్ణిస్తారు. ఆర్యులు-ద్రావిడులుగా చెప్పబడేవారు మొదటినుంచీ ఈ దేశంలో ఉన్నవారే ననీ;  అసలు ఆర్యులు-ద్రావిడులు అనే విభజనే అర్థంలేనిదనీ, ఆర్యులనే వారు ఎక్కడినుంచో వచ్చారనే సిద్ధాంతం తప్పనీ వీరు అంటారు. చరిత్రకారులు ఎంతోమంది నమ్మే ఆర్య-ద్రావిడ విభజనను గుడ్డిగా సమర్థించాలన్న ఉత్సాహం నాకేమీ లేదు. ఆర్యులు ఎక్కడినుంచో వచ్చారన్న సిద్ధాంతం పరమ ప్రామాణికంగా, వేదవాక్కుగా భావించాలనీ నాకు లేదు. చరిత్ర శోధనా క్రమంలో పై వాదానికి విరుద్ధమైన సాక్ష్యాలు లభిస్తే ఆమోదించడానికి నేనూ సిద్ధమే. సైన్సు లానే చరిత్ర కూడా ఒక నిరంతర ప్రక్రియ. కొత్త పరిశోధనలు పాత సిద్ధాంతాలను త్రోసి రాజనే అవకాశం ఇక్కడా ఉంటుంది. అయితే, ప్రధానసమస్య ఏమిటంటే; ఆర్య-అనార్య లేదా ద్రావిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవారివైపు చరిత్ర శూన్యత ఉండడం. కనీసం దానిని ప్రామాణిక చరిత్రశూన్యతగా చెప్పచ్చు. రెండోవైపు, సమగ్రమో, అసమగ్రమో  చరిత్ర ఉంది. కనుక నేను నిర్దిష్టమైన ఇలాంటి అభిప్రాయభేదాల జోలికి వెళ్లకుండా ఒకనాటి సమూహాల సంచారజీవనం, ఆ క్రమంలో భిన్న సమూహాల మధ్య జరిగిన యుద్ధాలు, ఘర్షణల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే చరిత్ర ఆకరా(సోర్సు)లను వాడుకోడానికి ప్రయత్నిస్తున్నాను.

మిగతా అంశాలు తర్వాత…

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

Download PDF

13 Comments

 • pavan santhosh surampudi says:

  ఆర్య అనార్య విభజన అవాస్తవం అనే పండితులు ప్రమాణాలు లేకుండానే వాదిస్తున్నారంటారా

 • బత్తుల వామీ అప్పారావు says:

  ఆర్య-అనార్య లేదా ద్రావిడ సిద్ధాంతాన్ని ఆర్య-అనార్య( ద్రావిడ)గా మారిస్తే ఇంకా క్లియర్ గా ఉండొచ్చు.

 • బత్తుల వామీ అప్పారావు says:

  రాక్షసులు మొదలయిన పదాలకు వ్యుత్పత్తులు బాగా వాడి వుంటే ఇంకా వాడిగా వుంటుంది.

 • బత్తుల వామీ అప్పారావు says:

  రచయిత పేరు రచయిత పేరు మధ్య కామా (.)లు పెడితే క్లారిటీ వుంటుంది.

  • కల్లూరి భాస్కరం says:

   అప్పారావు గారూ…1. అనార్యులంతా ద్రావిడులు కారు కనుక వేరుగా చూపించాను. 2. మీ సూచన దృష్టిలో పెట్టుకుంటాను. 3. ఈ వాక్యం అర్థం కాలేదు.

   • bathula vaami apparao says:

    సారంగ రచయితల పేర్ల మధ్య కామాలు (,) ఉంచితే క్లేరిటీ ఉంటుంది. వ్యాసాల్లో పదాల అర్థాలు, వీలున్నంత వరకూ వ్యుత్పత్తులు, (బ్రాకెట్స్ లో ఇంగ్లీష్ పదాలు వాడితే వ్యాసం మరింత పండుతుంది.

 • కల్లూరి భాస్కరం says:

  పవన్ సంతోష్ గారూ…మీ ప్రశ్నలో ప్రమాణాలతోనే పండితులు వాదిస్తున్నారన్న అభిప్రాయం ధ్వనిస్తోంది. లేదా, పండితులు ప్రమాణాలు లేకుండానే వాదిస్తారా అన్న సందేహం ధ్వనిస్తూ ఉండచ్చు. నా వ్యాసంలోనే చెప్పాను, నేను ఓపెన్ అని. నికరమైన ప్రమాణాలతో వాదిస్తే నేనే కాదు, ఎవరైనా స్వీకరించవలసిందే. ఇక నా పరిధిని వ్యాసం చివరి వాక్యాలలో చెప్పాను.

 • chintalapudivenkateswarlu says:

  భాస్కరం గారూ!
  మనం రాక్షసులు అని అనుకొనేవారు ఎవరూ దుర్మార్గులు కారు. మీరు చెప్పిన మాట నిజమే. కేవలం లక్షణార్థమ్ లో మాత్రమే ప్రస్తుతం వాడుతున్నారు. రక్షో ఇతీతి రాక్షస అని కదా. రక్షించేవారు రాక్షసులు. అలాగే దానవులు అన్నా దైత్యులు అన్నా కశ్యపుని పిల్లలే. అసురులు అంటే సుర కూడా తాగనివారు. అంత మంచివారు దుర్మార్గులుగా చిత్రింప బడ్డారంటె అది వారి అవగుణాలు కారణంగానే. అవగుణాలు దేవతలలో లేవాంటే ఉన్నాయి. వాళ్ళూ రాక్షసులే. మీరు చెప్పినట్లు కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్ర వేయాల్సిందే.

 • anrd says:

  నేను ఈ వ్యాఖ్యను వ్రాస్తున్నందుకు దయచేసి తప్పుగా అనుకోవద్దండి. మీ అభిప్రాయాలతో వాదించాలన్నది నా అభిప్రాయం కాదండి. నాకు తెలిసినంతలో అభిప్రాయాలను చెప్పాలనిపించి వ్రాస్తున్నానంతే.

  మన పురాణ ఇతిహాసాలలో రాక్షసులంటే భారీ ఆకారంతో ఉండి, వాళ్ళకు కొమ్ములు, కోరలు ఉంటాయి. అన్నట్లు తెలియజేసారు. అయితే అవన్నీ అబద్ధాలని మనం అనుకోనవసరం లేదు. సృష్టిలో ఒకప్పుడు అలాంటి భారీ ఆకారం కలిగిన జీవులున్నాయని ఆధునిక విజ్ఞానం ద్వారా కూడా తెలుస్తోంది. భారీ ఆకారం కలిగిన మనిషిని పోలిన ఆకారాలు గల శిలాజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు కూడా .

  అలాగే పురాణేతిహాసాలలో భారీ ఆకారం గల పశుపక్ష్యాదుల వర్ణన కూడా ఉంటుంది. మనం ఇలాంటి వర్ణలను కట్టుకధలుగా అనుకుంటాము. అయితే ఒకప్పుడు ఈ భూమి మీద భారీ శరీరం గల పశుపక్ష్యాదులు కూడా ఉండేవనటానికి సాక్ష్యం డైనోసార్స్.

  పురాణాలలో ఈ భూమి అంతా ఒకప్పుడు ఒకే ఖండముగా ఉండేదని తరువాత ఒక ప్రాచీన కాలపు చక్రవర్తి భూమిని ఖండాలుగా విభజించాడని తెలియజేశారు. భూమి అంతా ఒకప్పుడు ఒకే ఖండముగా ఉండేదానికి సాక్ష్యాలున్నాయని ఈనాటి శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ఆనాటి భూమికి గోండ్వానాల్యాండ్ అనే పేరు పెట్టారు.

  భూమి మీది అన్ని జీవులు కశ్యపుని సంతానమే అయినా కూడా పశుపక్ష్యాదులకు మనుషులకు శరీరనిర్మాణంలో చాలా భేదం ఉంది. అలాగే మానవులకు దానవులకు కూడా శరీరనిర్మాణంలో భేదం ఉండే అవకాశం ఉంది.

  అయితే, కొందరు చరిత్రకారులు అనార్యులను దానవులుగా సిద్ధాంతీకరిస్తారు. అనార్యులే రాక్షసులనే భావన తప్పు కూడా కావచ్చు.

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు anrd గారూ… ఇందులో తప్పుగా అనుకోడానికి ఏమీ లేదండీ. మీరు నిరభ్యంతరంగా నా అభిప్రాయాలతో విభేదించవచ్చు. డైనోసార్లలానే సృష్టిలో ఒకప్పుడు భారీ ఆకారాలు కలిగిన జీవులు ఉండేవారనీ, వారే రాక్షసులు కావచ్చనే మీ అభిప్రాయం నిజమే కావచ్చు. బహుశా వాళ్ళను బట్టే మనుషుల్లో కొంతమందిని రాక్షసులన్నారేమో. నేను రాసింది మనుషుల్లోని రాక్షసుల గురించి మాత్రమే.

 • కల్లూరి భాస్కరం says:

  ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారూ…

 • ఆర్య అనార్య భేదాల పరిశీలనకు మానవ శాస్త్రం ( ఆంత్రోపాలజీ ) బాగా ఉపయోగపడుతుందేమో. ఆర్యులకు, ద్రావిడులకు ఉన్న శారీరక నిర్మాణ వైవిధ్యం, ఆర్యులకు బయటి దేశ మానవ జాతులకు శారీరక నిర్మాణంలో ఉన్న సారూప్యతలను బట్టి వారు వలస వచ్చిన వారా ఇక్కడి వారా అనేది తేలిపోతుంది.

 • కల్లూరి భాస్కరం says:

  ఆ పరిశీలన చాలానే జరిగింది సీతారాం రెడ్డి గారూ…అంతమాత్రాన ఏకీభావం ఏర్పడాలని ఏముంది?

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)