వేదనలోంచి ఒక వేకువ నాదం: అమిరి బరాకా!

barakaweb1-master675

 

ఏప్రిల్ 16, 2009. మా యింటి దగ్గరి లాబిరింథ్ బుక్స్ నుండి ఈ-మేల్ వచ్చింది. తెరిచి చూడగానే  నా కళ్ళు మెరిసాయి. వావ్ అనుకున్నాను. అమిరి బరాకా తో సమావేశం. ఆ రోజు సాయంత్రమే! యెంత గొప్ప అవకాశం. యెన్నాళ్ళకు చూడబోతున్నాను బరాకా ను!

కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ సమాజాన్ని, సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన గొప్ప కవీ, విప్లవకారుడూ బరాకా ను కలిసే  అవకాశం కలుగుతోంది. అమిరి బరాకా అమెరికన్ సమాజాన్ని, సాహిత్యాన్నే కాదు ప్రపంచవ్యాప్తంగా సాహిత్యం పై ప్రభావం చాలానే నెరపారు. ఒక రెండేళ్ళ కింద నిఖిలేశ్వర్ ఇక్కడికి వచ్చినప్పుడు ‘ప్రాణహిత’ సాహిత్య పత్రికకు ముఖాముఖి సందర్భంగా చాలా సేపు మాట్లాడుకున్నాం. దిగంబర కవుల పై అలెన్ గింస్ బర్గ్ ప్రభావం గురించి అడిగినప్పుడు ‘ నిజానిక్ గింస్ బర్గ్ కంటే మాపై అమిరి బరాకా ప్రభావం యెక్కువ వుంది’ అన్నారాయన. అంతకు ముందు వినడమే కానీ అమిరి బరాకా గురించి యెక్కువ చదవలేదు.

నిఖిల్ చెప్పాక  అమిరి బరాకా కవిత్వాన్ని జీవితాన్ని చదివి,  యితన్ని యిన్ని రోజులూ యెందుకు కనుక్కోలేదా అని ఆశ్చర్యపోయాను. అట్లా లాబిరింథ్ కు అమిరి బరాకా వస్తున్నాదని తెలియగానే ఎగిరి గంతేసి బయలుదేరా. దాదాపు ఒక 100 మంది దాకా వచ్చారా సమావేశానికి అమెరికా లో అది చాలా పెద్ద సంఖ్యే! అదీ గురువారం సాయంత్రం. సభను ప్రారంభిస్తూ నిర్వాహకులు బరాకాను మాట్లాడమని ఆహ్వానించారు. మాలో ఒకరుగా కూర్చున్న బరాకా (అప్పటి దాకా నేను గమనించనే లేదు) లేచి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టారు.

సాధారణంగా నల్ల వాళ్ళు ఒడ్డూ , పొడుగూ పెద్దగా ఉండి భారీ శరీరాలతో, కొంత ప్రత్యేకంగా వుంటారు. కానీ ఈయన చూస్తే చిన్న శరీరంతో, వయసుతో కొంచెం వంగిన శరీరంతో చాలా సాదా సీదాగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల అలుపు లేని పోరాటం, ఉద్యమాలూ, అకుంఠిత దీక్షా, అసమాన సమాజం పట్ల ఆయన ఆగ్రహమూ – అనీ ఆయన ముఖ వర్ఛస్సు లో స్పష్టంగా కనబడుతున్నాయి. చాలా మామూలుగా మొదలైన ప్రసంగం మెల్ల మెల్లగా ఒక ప్రవాహంగా మారి అలుపెరుగని ఆవేశపు మాటల జలపాతమై ఒక గంట సేపు సభికుల ని తీవ్ర ఉద్విగ్నతకు గురి చేసింది.

ప్రస్తుత సమాజమూ, సాహిత్యమూ, ప్రపంచవ్యాప్తంగా 9/11 తర్వాత పరిస్థితులూ, పోరాటాలూ, సామ్రాజ్యవాదమూ, వీటన్నింటి నేపథ్యం లో మార్క్సిజం ప్రాసంగికత (అంతకు ముందు సంవత్సరమే ప్రపంచాన్ని సామ్రాజ్యవాద ఆర్థిక సంక్షోభం తీవ్రంగా కుదిపేసి కోట్లాది ప్రజానీకం జీవితాలని అతలాకుతలం చేసింది) – బరాకా ప్రసంగంలో  అనేక అంశాలని తడుముతూ చివరగా “ఈ సంక్షోభాలకూ, అసమానతలకూ, దుర్భరమైన దోపిడీ పీడనలకూ మార్క్సిజమే సరైన మార్గం” అంటూ ముగించారు. ఆయన మాట్లాడిన తర్వాత అనేక ప్రశ్నలు సభికులనుండి – ఆయన ప్రసంగం గురించీ , ఆయన 9/11 తర్వాత రాసిన పద్యం గురించీ – చాలా ఓపికగా సమధానాలు చెప్పాడు.

ప్రశ్నలన్నీ అయ్యాక నేనాయన దగ్గరికి వెళ్ళాను. ముందు నన్ను నేను పరిచయం చేసుకుని, మన తెలుగు సమాజం గురించీ, సాహిత్యం గురించీ, పోరాటాల గురించీ, కవిత్వం మీద ఆయన ప్రభావం గురించీ చెప్పాను. ఆయన ముఖంలో ఒక గొప్ప వెలుగు, కరచాలనం చేయడానికి చెయ్యి జాపాను. ఆయన ఆనందాన్ని ఉద్వేగాన్ని పట్టలేక నన్ను కౌగలించుకున్నారు. ‘ అద్భుతం. చాలా సంతోషం. ఈ విషయాలు వింటుంటే నాకు ఇంకో నూరేళ్ల జీవితం  జీవించాలనిపిస్తుంది’ అన్నారాయన. ఆయన పుస్తకం ‘బ్లూస్ పీపుల్ ‘ పైన  ‘ For Swami – Unite & Struggle’  అని రాసి సంతకం చేసి ఇచ్చారు. ‘మళ్ళీ కలవాలి మనం’ అనుకుంటూ వెళ్ళిపోయారాయన.

కార్పోరేట్ పని గంటల చక్రాల్లో నిరంతరం నలిగిపోయే అమెరికా జీవితం లో ఆయన్ని మళ్ళీ కలవడం కుదరలేదు. యిప్పుడు కలుద్దామనుకున్నా ఆయన లేరు. జనవరి 9 న ఆయన కనుమూసారు. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సార్లు ఆయన ఆరోగ్యం బాగా లేదని విన్నాను. యిప్పుడనిపిస్తోంది ‘యెట్లా అయినా వీలు చేసుకుని ఒక్క సారి కలిసి వుంటే బాగుండేదని’. ఆయన్ని కలిసి, మాట్లాడి, కౌగలించుకున్న ఆ సాయంత్రమే పదే పదే గుర్తుకొచ్చి కళ్ళల్లో సన్నటి నీటి తెర. కోల్పోతే గానీ విలువ తెలిసిరానివి అనేకం జీవితంలో .

2ea12e92479c089aad5256bcd3207ccf

డిప్రెషన్ తరవాతి తరం

అమిరి బరాకా , 1930 ల తీవ్ర ఆర్థిక మాంద్యం కాలం లో (Great Depression) 1934 లో నూవార్క్ , న్యూ జెర్సీ లో ఎవెరెట్  లీ రాయి జోన్స్ గా ఒక దిగువ మధ్య తరగతి కుటుంబలో పుట్టారు.  నాన్న కోయెట్ లీ రాయి జోన్స్ పోస్టల్ కార్మికుడు, లిఫ్ట్ ఆపరేటర్ గా చిన్నా చితకా పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అమ్మ ఆన్నా లోయిస్ ఒక సామాజిక కార్యకర్త. బాల్యం నూవార్క్ లో, బారింగర్ హై స్కూల్ లో చదువు తర్వాత రట్గర్స్ యూనివర్సిటీ లో స్కాలర్ షిప్ తో ప్రవేశం దొరికినా, అక్కడి సామాజిక, సాంస్కృతిక వివక్షల్ని చూసి వాషింగ్టన్ లోని హోవార్డ్ యూనివర్సిటీ లో చేరారు. అక్కడ తత్వ శాస్త్రం, మతం ప్రదాన అంశాలుగా ఉన్నత విద్యను ప్రారంభించినా,  పట్టా తీసుకోలేదు. తర్వాత న్యూ యార్క్ లోని కొలంబియా లో తిరిగి ఉన్నత విద్యను కొనసాగించినా అక్కడా పట్టా తీసుకోలేదు.

కమ్యూనిస్టు అనే నెపం తో

1954 లో అమెరికా వైమానిక దళం లో చేరిన బరాకాను  కమ్యూనిస్టు అనే నెపం తో కమాండింగ్ ఆఫీసర్ బహిష్కరించాడు. (అది అమెరికా లో కమ్యూనిస్టు వ్యతిరేక మెక్ – కార్థీ దుష్ట కాలం). US Airforce నుండి బహిష్కరించబడడమే బరాకా కు మంచిదైంది. తర్వాత ఆయన న్యూ యార్క్ గ్రీన్ విచ్ విలేజి కి మకాం మార్చారు. ఆ రోజుల్లో గ్రీన్ విచ్ విలేజి అమెరికాలో అత్యంత ప్రగతిశీలమైన ప్రాంతం. ఉన్న స్థితి  ని ధిక్కరించి, సామాజిక మార్పు కోరే సాహిత్యం, కళలూ, సామాజిక పోరాటాలూ అలలలుగా కెరటాలుగా వెల్లివిరిసిన ప్రాంతం. బరాకాకు అక్కడ బీట్ తరం కవులు, కళాకారులు , బ్లాక్ మౌంటేన్ కవులు, న్యూ యార్క్ స్కూల్ కవులు పరిచయమయ్యారు. జాజ్ సంగీతం పరిచయమైంది.

మార్పు కోరే సాహిత్యమూ, రాజకీయాలూ పరిచయమయ్యాయి. అంతే ఆయన ఇంక వెనక్కి తిరిగి చూసింది లేదు. హెట్టీ కోహెన్ తో పెళ్ళీ ఇద్దరు అమ్మాయిలూ … హెట్టీ తో కలిసి ఒక ప్రచురణశాల స్థాపించారు. బీట్ కవులు అలెన్ గింస్ బర్గ్ , జాక్ కెరాక్ ల రచనలు ప్రచురించారు. బీట్ కవులతో ‘యూగెన్’ అనే త్రైమాసిక పత్రిక ప్రారంభించారు. తానూ బీట్ కవుల్లో ఒకడై కవిత్వం రాసారు. ‘కల్చర్ ‘ (kulchur) అనే సాహిత్య, కళ ల పత్రికకు సంపాదకీయం వహించారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటి సారి నల్లవారి సంగీతం గురించి, వేర్ల నుండి చరిత్రను వివరిస్తూ, అద్భుతమైన సామాజిక విశ్లేషణ తో బరాకా రాసిన ‘బ్లూస్ పీపుల్ : నీగ్రో మ్యూసిక్ ఇన్ అమెరికా’ అనే పుస్తకం అత్యంత విలువైనది. అది రాసేటప్పటికి ఆయన ఇంకా లీ రాయి జోన్స్ గానే అందరికీ తెలుసు.

లీ రాయి జోన్స్ గా ఆయన రాసిన డచ్ మన్ అనే నాటకం గొప్ప నాటకంగా పేరు తెచ్చుకుంది. అమెరికా అంతటా సుప్రసిద్ధమైంది. న్యూ యార్క్  సబ్ వే లో ఒక తెల్లజాతి స్త్రీ , నల్ల జాతి పురుషుడి మధ్య  దూషణ లతో సాగే సంభాషణ ను,  సందర్భాన్ని, దచ్ మన్ లో  బరాకా అద్భుతంగా నాటకీకరించారు. శ్వేత జాత్యహంకార సమాజం బోను లో చిక్కుకు పోయిన ఆ ఇద్దరి పరిస్థితి ని బరాకా అద్భుతంగా సామాజిక కోణం లో విశ్లేషిస్తూ నాటకీకరించారు. , ఆ కాలంలో ఇతర నాటక రచయితలు ‘సహజవాదం’ తో రాస్తుంటే బరాకా సింబాలిజం వాడుతూ  తన నాటకంలో ఉద్వేగాన్ని పలికించడం కోసం అనేక ప్రయోగాల్ని చేసి తన కాలం కన్నా తాను ముందున్నానని నిరూపించారు.

1959-60 లో క్యూబా ప్రయాణం బరాకా జీవితంలో పెను మార్పు తీసికొచ్చింది. ఆయన సాహిత్య సామాజిక జీవితం లో అదొక మైలు రాయి. క్యూబా లో ఇతర దేశాల రచయితలతో, ముఖ్యంగా పేదరికానికీ, దోపిడీ పీడనల వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మూడవ ప్రపంచ దేశాల రచయితలతో ఆయన సమావేశమయ్యారు. ఆయా రచయితల రచనలు, వారి దేశాల్లో ఉన్న సామాజిక స్థితిగతులూ తెల్సుకున్నారు. అక్కడ పరిచయమైన జేమ్  షెల్లీ అనే మెక్సికన్ రచయిత బరాకా ను ఒక సూటి ప్రశ్న వేసారు ‘ నీ చుట్టూ సమాజం లో కోట్లాది మంది ప్రజలు ఆకలితో తిండి లేక మాడుతూ ఉంటే నీకు ఇంకా రాయడానిక్ వేరే వస్తువు కావాలా?’ – బరాకా తన సాహిత్యం గురించీ , కవిత్వం గురించీ పునరాలోచనలో పడ్డారు. అక్కడి నుండీ ఆయన మౌలిక దృక్పథం మారింది.

BARAKA

బ్లాక్ పాంథర్స్ ఉద్యమం

సామాజిక స్పృహా రాజకీయ దృక్పథమూ ఆయన సాహిత్యం లో ప్రదానమయ్యాయి. అప్పటిదాకా రూపం మీద విపరీతమైన శ్రద్ద పెట్టి శిల్పం లా చెక్కుతూ రాసిన బరాకా తన రాతలని ఎక్కుపెట్టిన రాజకీయ అస్త్రాల్ని చేసారు. డైనమైట్లు పేల్చారు. డచ్ మన్ నాటకంలో,  అమెరికా తెల్ల సమాజం పట్ల  పెరుగుతున్న తన అసంతృప్తినీ , అవిశ్వాసాన్నీ ప్రకటించిన బరాకా తన తర్వాత సాహిత్యంలో ఆ సమాజం పట్ల తిరుగుబాటు ప్రకటించారు. తనదైన ఒక కొత్త సమాజాన్ని కలలు కని దాన్ని నిర్మించేందుకు తాపత్రయపడ్డారు. అప్పుడు ఉధృతంగా జరుగుతున్న నల్ల జాతీయవాద ఉద్యమమూ, బ్లాక్ పాంథర్స్ ఉద్యమం తో ప్రభావితమై న్యూ యార్క్ లోని హార్లెం కు మకాం మార్చారు.

తనదైన అస్తిత్వం, సమాజ నిర్మాణం కోసం బరాకా,  క్రమేణా బ్లాక్ నేషనలిస్టు (నల్ల జాతీయవాద) ఉద్యమంలో భాగమయ్యారు. నల్ల జాతీయవాద సాహిత్య కళా సాస్కృతిక నిర్మాణం కోసం నడుం కట్టారు. అప్పటికే తీవ్రమైన బ్లాక్ పాంథర్స్ (నల్ల చిరుతల) ఉద్యమం తో మమేకమయ్యారు. మాల్కం ఎక్స్ తో సన్నిహిత సంబంధాలు యేర్పర్చుకున్నారు. నల్ల జాతీయుల ప్రదర్శనలో పాల్గొన్న బరాకాను FBI పోలీసులు తీవ్రంగా హింసించారు. దాదాపు చనిపోతారనే అనుకున్నారంతా! కానీ ఆ సంఘటన తర్వాత కోలుకున్న బరాకాలో పోరాట పటిమ ఇంకా తీవ్రమైంది. మరింత రాటుదేలారాయన.

1965 లో మాల్కం ఎక్స్ తో జరిపిన ఒక సుదీర్ఘ సంభాషణలో బరాకా తన కొత్త రాజకీయ సాహిత్య సాంస్కృతిక అస్తిత్వాన్ని కనుక్కొన్నారు. మాల్కం ఎక్స్ తో బరాకా తో  సమావేశం తర్వాత కొన్ని వారాలకే మాల్కం ఎక్స్ హత్య జరిగింది. మాల్కం అంతిమయాత్రలో ఒక ముస్లిం ప్రీస్ట్ లీ రాయి జోన్స్ కు అమిర్ బరకత్ అని పేరు పెట్టాడు. తర్వాత ఆ అరబ్ పేరును ఆఫ్రికనైజ్ చేసి స్వాహిలి భాషలో దాన్ని అమిరి బరాకా కా మార్చుకున్నారు. నల్ల జాతీయవాద సాహిత్య సాంస్కృతిక సైనికుడిగా మారిపోయారు. నల్ల జాతి కళలకు సాహిత్యానికి, సంస్కృతికీ ఒక కొత్త అస్తిత్వాన్ని , తమని బానిసలుగా మార్చిన అమెరికా శ్వేతజాతి సంకెళ్ళ నుండి బయటపడి ఒక నిజమైన ఆఫ్రికన్ నల్ల జాతి అస్తిత్వాన్ని, రాజకీయంగానూ, aesthetical గానూ, నిర్మించేందుకు ఉద్యమించారు.

బీట్ తరం కవుల నుండి తనని తాను వేరు పడేందుకు, నల్ల జాతీయత తన కొత్త అస్తిత్వంగా మలుచుకునేందుకు తీవ్రమైన కృషి చేసారు. బ్లాక్ ఆర్ట్స్ నేషనల్ మూవ్ మెంట్ కు నాయకత్వం వహించారు. కవిత్వమూ, నవలలూ, కథలూ, నాటకాలూ, సంగీత విమర్శా, ఇట్లా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసారు. ఒక సాహిత్య కారుడిగానే కాదు రాజకీయ సాంస్కృతిక ఉద్యమకారుడిగా బరాకా అలుపెరుగని పోరాటం చేసారు. ఈ క్రమంలో FBI బరాకా ను అమెరికా లో ఒక ఎదుగుతున్న నాయకుడిగా, నల్ల జాతి తీవ్ర శక్తిగా అంచనా వేసింది.

అయితే క్రమంగా బరాకా నల్ల జాతీయవాద ఉద్యమానికున్న పరిమితులని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. కేవలం నల్ల జాతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా అశేషప్రజానీకం పేదరికంలో మగ్గిపోతూ దుర్భరమైన దోపిడీ పీడనలకు గురవుతున్నదని, వీటన్నింటికీ శ్వేతజాత్యహంకారం కన్న పెద్ద శత్రువేదో ప్రపంచ ప్రజలని వెంటాడి వేటాడుతున్నదని బరాకా గుర్తించారు. ఆ శత్రువు పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదమనీ, దానికి విరుగుడు మార్క్సిజం లో ఉన్నదని గుర్తెరిగారు. 1970 ల నుండీ బరాకా కేవలం నల్ల జాతీయులతోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలతో తనను తాను గుర్తించుకున్నారు. మమేకమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పీడిత ప్రజల పోరాటాలతో identify అయ్యారు. సంఘీభావం ప్రకటించారు. సాహిత్యాన్ని సృష్టించారు. క్రియాశీలకంగా కూడా తనవంతు పాత్ర నిర్వహించారు. నూవర్క్ నగరంలోనూ , హార్లెం లోనూ, అమెరికా లోని ఇతర నగరాల లోనూ రాజకీయ ఉద్యమాల్లోనూ, హక్కుల ఉద్యమాల్లోనూ,  చివరి ఊపిరి దాకా క్రియాశీలమైన ప్రాత్ర నిర్వహించారు. మార్క్సిజం పట్ల, మూడవ ప్రపంచ దేశాల్లోని పీడిత ప్రజల పోరాటాల పట్లా తన మమేకతను చివరి ఊపిరి దాకా వీడలేదు..

న్యూ జెర్సీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్థాన కవి పదవిని యేర్పాటు చేసి, ఆయనను 2002 లో ఆస్థాన కవిగా నియమించింది. అయితే ఆయన 9/11 దాడుల మీద రాసిన ఒక పద్యం పెద్ద దుమారాన్ని సృష్టించింది. ‘యెవడొ అమెరికా ను పేల్చేసాడు’ అనే శీర్షిక తో ఆయన రాసిన పద్యం ఇలా సాగుతుంది:

 

యెవడో అమెరికాను పేల్చేసాడు

                   ఆఫ్ఘనిస్థాన్ లో యెవడొ అనాగరిక అరబ్
పేల్చేసాడు అన్నారు …

                       …..

                 యెవడు అందరికనా పెద్ద టెరరిస్టు

                యెవడు బైబిల్ ను మార్చాడు

                యెవడు అందరికన్నా యెక్కువమందిని హత్య చేసాడు

                యెవర్నీ పట్టించుకోకుండా తన స్వార్థం కోసం
యెవడు అందరికన్నా దుర్మార్గాలు చెయ్యగలడు

                యెవడికి సామంత రాజ్యాలున్నయి

                యెవడు ప్రపంచం లో అందరికన్నా
యెక్కువ భూమిని దొంగిలించాడు

                యెవడు ప్రపంచాన్ని క్రూరంగా పాలిస్తూ
అంతా మంచే  చేస్తున్నానంటూ పాపాలు మాత్రమే చేస్తాడు

                యెవడు యెవడు యెవడు
ఆ ముష్కరుడెవ్వడు…

 

అయితే ఈ పద్యం లో ఒక చోట ఆయన రాసిన వాక్యాలు ఇజ్రాయీల్ కు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆయనను ‘anti-semitist’ అని దూషించారు. న్యూ జెర్సీ ప్రభుత్వం ఆయన పదవిని రద్దు చేసింది. అయితే ఆయన తాను రాసిందాన్ని వెనక్కి తీసుకోలేదు. 9/11 అమెరికా దాడుల వెనక కుట్ర ఉన్నదని తాను అనుకుంటున్నాననే అన్నారు. తన మీద ఎన్ని అభాండాలు మోపినా, యెన్ని వివాదాల్లో ఇరికించినా, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడంలో , పోరాడడంలో కించిత్తైనా రాజీ పడలేదు. తాను నమ్మిన పీడిత ప్రజల విముక్తినీ , అందుకు మార్గదర్శీ కరదీపికా ఐన మార్క్సిజాన్ని జీవితాంతమూ విడిచిపెట్టలేదు.

ఆయన్ని కలిసింది ఒక్క సారే అయినా, నాకు  ఒక జీవితకాలం జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్ళారు. తన వెచ్చని కరస్పర్శలో, ఆత్మీయ  ఆలింగనం లో తన జీవితాంతం పడ్డ తపననూ, ఆరాటాన్నీ అందించిపోయారాయన. అమెరికా కూ,  మొత్తంగా ప్రపంచ పీడిత ప్రజలకూ ఒక అపురూపమైన వేదనాభరితమైన సౌందర్య సంపద అమిరి బరాకా! జీవితాంతమూ, చివరి ఊపిరి దాకా  అవిశ్రాంతంగా పోరాడిన ఆయన కనుమూసాక మాత్రం,  ప్రశాంతంగా యెలా వుండగలరు? పీడిత ప్రజలకు నిజమైన విముక్తి కలిగి, అసమాన సమాజం అంతమయ్యేదాక ఆయనకు శాంతి కలుగుతుందనుకోను – జీవితంలోనైనా మృత్యువులోనైనా !

నారాయణ స్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

Download PDF

9 Comments

 • ఎన్ వేణుగోపాల్ says:

  చాలా బాగుంది స్వామీ… కృతజ్ఞతలు…, కన్నీళ్లు…

 • SRINIVAS DENCHANALA says:

  కంగ్రాట్స్ నారాయణ స్వామి గారు…

 • నారాయణస్వామి says:

  కృతజ్ఞతలు ప్రియమైన వేణూ, శ్రీనివాస్ గారూ!

 • అమరులు అమిరి బారాకకు జోహార్లు. మీకు ధన్యవాదాలు సార్. మీ చివరి వాక్యాలు మరింత విశ్వాసాన్ని మిగిల్చాయి.

 • rajaram.thumucharla says:

  ప్రపంచ పీడిత ప్రజల కవి ని మీరు పరిచయం చేసినందుకు చాల ధ్యాంక్స్.మీరు పరిచయం చేసిన విధానం అద్భుతంగా వుంది

 • Elanaaga says:

  పీడిత ప్రజానీకపు సంక్షేమం కోసం సొంత జీవితాన్ని పణంగా పెడుతూ కలాన్ని ఝళిపించే మహానుభావులైన రచయితలు కొందరే వుంటారు. అటువంటి గొప్ప రచనాకారులకు తలవొగ్గి ప్రణామం చేయాలనిపిస్తుంది. మనసును కదిలించేలా ఒక మంచి ప్రజాకవి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.

 • Thirupalu says:

  మీ పరిచయం చాలా బావుంది.

 • అద్భుతమైన కవిని హృదయానికి హత్తుకునేలా పరిచయం చేశారు. మీ పరిచయం కన్నీళ్ళను రగిలించేలా సాగింది. ధన్యవాదాలు నారాయణస్వామి గారూ..

 • నారాయణస్వామి says:

  ప్రియమైన ఎలనాగ, తిరుపాల్ , రాజారాం , వర్మా, శ్రీధర్ గార్లకు – వ్యాసం నచ్చినందుకు నెనర్లు!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)