రాత్రి జీవితాన్ని గెల్చిన వాళ్ళ కథలు – “ Tales of Night Fairies ”

                  

     ‘తాను శవమై ఒకరికి వశమై, తనువు పుండై, మరొకరికి పండై’ …. అలిశెట్టి ప్రభాకర్.

ఆమెను ‘వేశ్య’ అని నాజూకుగా పుస్తకాల భాషలో పిలుస్తారు. ఇంకా కస్టమర్లు ఎక్కడికక్కడ రకరకాల మాండలీకాల్లో మొరటుగానూ, ముద్దుగానూ కూడా పిలుస్తారు.  ఈ రోజు ఆమెనే ‘సెక్స్ వర్కర్’ అంటున్నారు.  ఆ పేరు వినగానే మన కళ్ళముందు చకచకా కొన్ని దృశ్యాల్లో ఆమె జీవితచక్రం గిర్రున తిరిగేస్తుంది. ప్రియుడు మోసంచేసి వేశ్యాగృహాల్లో అమ్మెయ్యటం, బలవంతంగా ఆ ఊబిలోకి దిగటం, కొన్ని అబార్షన్లూ, ఒకరిద్దరు పిల్లలూ, చివరకు రోగాలపాలై ఒళ్ళు శిధిలమై, దిక్కు ఉండో లేకో చావటం… ఇదీ ఆ జీవిత చక్రం.  సమాజపు అంచులలో ప్రమాదకరమైన జీవితాలు గడిపే వీళ్ళకు పోలీసుల, రౌడీల చేతుల్లో తనువు పుండైపోకుండా చూసుకోవటమే ఒక నిరంతర పోరాటం. ఇలా మరకలు పడ్డ జీవితాలక్కూడా మెరుగులు పెట్టుకునే గడుసర్లు లేరా? అంటే … ఉన్నారు. “Tales of Night Fairies” అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ లో సెక్స్ వర్కర్లు హక్కుల పోరాటంతో తమ జీవితాల్ని ఎలా బాగుచేసుకున్నారో  చూడవచ్చు.

“సోనాగచ్చి”- కలకత్తా లోని మూడువందలేళ్ళనాటి రెడ్ లైట్ ఏరియా. అక్కడ మామూలు కుటుంబాలుండే ఇళ్ళతో పాటు, పక్కనే ‘లైన్ ఇళ్ళు’ అనే వేశ్యాగృహాలు కూడా ఉంటాయి. ఇక్కడుండే సెక్స్ వర్కర్ల  గురించి  డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలనే ఆలోచన ‘సోహినీ ఘోష్’ కు చిన్నతనంనుంచే ఉందట. సోహినీ ఘోష్ తల్లి తన ఉద్యోగరీత్యా కలకత్తా అంతా తిరుగుతూ ఉండేదట. ఆవిడ సోనాగచ్చిలో తిరిగేటప్పుడు కొన్ని ఇళ్ళ గోడలమీద “ఇది మర్యాదస్తుల ఇల్లు” అని రాసి ఉండటం చూసిందట. తల్లి తనకు ఈ విషయం చెప్పినప్పటి నుంచీ ఇది తనలో కుతూహలాన్ని రేపిందని చెప్తుంది సోహినీ.

డాక్టర్ స్వరజిత్ జానా ‘సోనాగచ్చి ప్రాజెక్ట్’ పేరుతో  హెచ్.ఐ.వి. ని  అదుపు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ 1990 లలో చేపట్టారు. ఇక్కడుండే సెక్స్ వర్కర్లను ఈ పనిలో భాగస్వాములను చెయ్యటం ఈయన చేసిన గొప్ప పని. ఈ క్రమంలోనే 1995 లో సోనాగచ్చిలో దుర్బర్ మహిళా సమన్వయ కమిటీ (DMSC) ఏర్పడింది. ‘Adult sex work’ ను నేరంగా పరిగణించకుండా దానికి ఒక సామాజిక గుర్తింపునిచ్చి, సెక్స్ వర్కర్లకు శ్రామిక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ఇవ్వాలంటూ ఈ కమిటీ పోరాడింది.  ఈ కమిటీలో 60,000 మంది సభ్యులున్నారు. ఈ విధంగా కమిటీ ఏర్పాటు చేసుకోవటం వల్ల పోలీస్ దాడులు పూర్తిగా ఆగకపోయినా, కొంతయినా తేడా వచ్చిందని చెప్తుంది సాధనా ముఖర్జీ అనే సెక్స్ వర్కర్.  “ఒకసారి ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి బంధించి, డబ్బులిస్తేనే వదులుతామని చెప్పారు. అప్పుడు మేము అక్కడ ధర్నా చేసి ఆఫీసర్ ను సస్పెండ్ చేయించాం. అలాగే రేప్ కేసులు కూడా తీసుకొనేవారు కాదు పోలీసులు.  పైగా “మిమ్మల్ని ఎవరైనా రేప్ చెయ్యటం ఏమిట”ని తేలిక మాటలు మాట్లాడేవారు. అలాంటిది ఈ రోజు మేం పోలీస్ స్టేషన్ లో కుర్చీలో కూర్చోగల్గుతున్నాం”… అంటుంది శిఖా దాస్.

ఈ చలిచీమలన్నీ ఒకచోట చేరి ఇంత బలంగా తయారవటమే కాక, కలకత్తాలో మార్చ్ 2001 లో సెక్స్ వర్కర్స్ మిలీనియం కార్నివాల్ ను ఏర్పాటు చేసి, ఘనంగా నిర్వహించి, మర్యాదస్తుల్ని నివ్వెరపరిచారు. సెమినార్లు, వర్క్ షాప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు .. అన్నీ నిర్వహించారు. ఈ కార్నివాల్ ను అడ్డుకుందుకు ఢిల్లీ మహిళా సంఘాలు చాలా ప్రయత్నించాయట. “మాలో చాలా మందికి చదువు రాదు. కార్నివాల్ లో సరదాగా అందరూ పాల్గొంటారు. ప్రపంచానికి “మేమూ నవ్వుతాం. ఆడుకుంటాం, పాడుకుంటాం” అని చూపించాలని మా ప్రయత్నం. మీరు అనుమతి ఇవ్వకపోతే వేలాదిమందిమి అందరం కలిసి రోడ్లమీద కూర్చుంటాం” అని బెదిరిస్తే గానీ మాకు ఈ పండగ జరుపుకుందుకు చివరి నిముషం వరకూ అనుమతి దొరకలేదు” అంటుంది మాలా సింగ్.  ఈ కార్నివాల్ కు వచ్చి చూసి “మీరు ఇలాంటి పండుగ ఎప్పుడు జరుపుకున్నా మాకు అభ్యంతరం లేద”ని చెప్పిన వాళ్ళ నుంచి వీళ్ళు సంతకాలు కూడా సేకరించారు.  సోనాగచ్చిలో వీళ్ళు బృందాలుగా ఏర్పడి, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా అందరినీ ప్రోత్సహించటం, హెల్త్ క్యాంప్స్ నిర్వహించటం, కండోమ్ వాడకం, వ్యక్తిగత శుభ్రత వంటి విషయాలు బోధించటం … చేస్తుంటారు.

సోహినీ ఘోష్ వీళ్ళలో ఒకరుగా కలిసిపోయి రాబట్టిన విషయాలేమిటో చూడండి….

ఉమా మండల్ :  అరవైలలో ఉన్న ఈమె గొడవలు పడకుండా కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలో అమ్మాయిలకు సలహాలిస్తుంది. హెల్త్ క్యాంపుల్లో చురుగ్గా తిరిగి అందరితోనూ పని చేయిస్తుంది.

ఉమా మండల్

“ఒక సెక్స్ వర్కర్ మాత్రమే ఇంకో సెక్స్ వర్కర్ తో సులభంగా కలిసిపోయి మాట్లాడగలదు. బైటివాళ్ళు ఈ పని చెయ్యటం కష్టం. అందుకే మాలో మేమే బృందాలుగా ఏర్పడి అందరినీ చైతన్యవంతుల్ని చేస్తున్నాం”.

“కోమల్ గాంధార్ … ఇది మా థియేటర్ గ్రూప్ పేరు. ‘కోమల్’ అంటే సున్నితం. ‘గాన్’ అంటే పాటలు. ‘ధార్’ అంటే కత్తికున్న పదును. సున్నితంగా పాడుతూ ఆడుతూ పదునుగా మా పరిస్థితిని వివరిస్తాం. మనుషుల ఆలోచనల్లోని  సంకోచాలను వదిలిస్తాం”.

“శ్రమచేసి వస్తువుల్ని సృష్టించే వాళ్ళను శ్రామికులంటారు. ‘మీరేం సృష్టిస్తున్నారు?’ అని మమ్మల్ని అడుగుతారు. మేం జనం మనసుల్లో ఆనందాన్ని సృష్టిస్తున్నాం”.

సాధనా ముఖర్జీ :  దుర్బర్ మహిళా సమన్వయ కమిటీ ఏర్పాటు కాకముందు కూడా సోనాగచ్చిలో సమస్యలు పరిష్కరించిన ధైర్యస్తురాలు.

మాలా సింగ్                                                                                                            సాధనా ముఖర్జీ

“నేను ఈ పనిలో ఉన్నానని మా ఇంట్లోవాళ్ళకు చాలాకాలం వరకూ తెలియదు. నా భర్త చాలా డబ్బున్నవాడని చెప్పి, మా నాన్నకు డబ్బు పంపిస్తూ ఉండేదాన్ని. ఒకసారి మా నాన్న నా దగ్గరకు వచ్చినపుడు ఆయనకు వీధి వాతావరణంలోనే తేడా తెలిసిపోయి నన్ను నిలదీశాడు. నిజం చెప్పాక కన్నీరుమున్నీరయిపోయాడు. కానీ నన్ను వదులుకోలేకపోయాడు”.

“ఇంతకుముందు మేము కూడా ఈ పని చెడ్డ పనీ, అనైతికమూ అనుకునేవాళ్ళం. అలాగని మనకెలా తెలుసు? పుడుతూనే ఈ ఆలోచనలతో మనం పుట్టలేదు. పెరిగి పెద్ద అవుతున్నకొద్దీ ‘తప్పుడు ఆలోచనలు’, ‘దిగజారిన ఆడవాళ్ళు’, ‘నిషిద్ధ స్థలాలు’ అనే పరిభాష నేర్చుకుంటాం. ఇవన్నీ గొప్ప మేధావులు, గౌరవనీయులు సృష్టించినవే!!

“ఇంతకుముందు ఆడవాళ్ళను బలవంతంగా ఇందులోకి దించేవాళ్ళు. నేనూ అలా వచ్చినదాన్నే. కానీ నా సంపాదనతో నా కుటుంబం మొత్తం బతుకుతోంది కాబట్టి దీన్ని నేను విడిచిపెట్టలేను. ఇప్పుడు కొందరు వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు”.    

“ఇంట్లోకి ఎవరిని రానివ్వాలీ ఎవరిని రానివ్వొద్దన్నది మా నిర్ణయమే. ‘నేనూ డబ్బులిస్తానుకదా’ అన్నా సరే మా ప్రాంతంలోనే ఉండే మగవారిని మేము రానివ్వం”.

మాలా సింగ్:  ఢిల్లీ లో తిరిగి అక్కడి జీ.బీ.రోడ్డు సెక్స్ వర్కర్లను కూడా చైతన్యపరచే పని చేస్తూ, వీధి నాటకాల్లో పాల్గొని మాట్లాడుతూ అందరికీ పెద్ద దిక్కులా ఉండే ఈమె కమిటీలో అతి చురుకైన వ్యక్తి.

“తొమ్మిదేళ్ళ వయసులో నన్ను ఈ పనిలోకి బలవంతంగా దించారు. రెస్క్యూ హోం నుంచి ఒక పోలీసు నన్ను పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్ళి చెప్పలేనంత హీనంగా అత్యాచారం చేశాడు. నా తొడల్ని కత్తులతో చీల్చాడు. పోలీసు స్టేషన్లో కంటే మా సెక్స్ వర్కర్ కాలనీలోనే ఎక్కువ భద్రంగా ఉంటాం”.

“ఈ పని తప్పని మొదట్లో అనుకునేదాన్ని. ఇప్పుడు నా ఆలోచన మారింది. నాకూ మా అమ్మకూ పెద్ద తేడా నాకేం కన్పించటం లేదు. మాకు తిండీ, బట్టా అమర్చటం కోసం మా అమ్మ మా నాన్నతో పడుకుంది. నేనూ అదే పని కొంతమందితో  చేస్తున్నాను. తేడా ఏమిటంటే నేనీ పనికి డబ్బు తీసుకుంటున్నాను. ఆ డబ్బుతో నా పిల్లలకు తిండీ, బట్టా ఇస్తున్నాను”.  

“నేను అడుక్కోవటం లేదు. దొంగతనం చెయ్యటం లేదు. కష్టపడి బతుకుతున్నాను.  నాకు జబ్బు చేస్తే ఎవరూ పట్టించుకోరు.  నా డబ్బులు తింటూ ఈ పోలీసులు నన్ను కొడుతున్నారు. పోలీసులను ఎప్పుడూ అసహ్యించుకునేదాన్ని. అవకాశం వస్తే వీళ్ళ పని పట్టాలని ఉండేది. ఒకసారి తాగినమత్తులో ఒక పోలీసు మా వాడకు వచ్చి ఆడవాళ్ళను బాగా కొట్టాడు. వెంటనే వాళ్ళను ఆసుపత్రికి తీసుకెళ్ళి, పరీక్షలు చేయించి, డాక్టర్ల దగ్గర అవసరమైన  పత్రాలు తీసుకున్నాను. మరునాడు ఈ ఆడవాళ్ళను, డాక్టర్ ఇచ్చిన పత్రాలను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళి కేసు పెడతానన్నాను. పోలీసులు బ్రతిమాలటం మొదలెట్టారు.  మా మీదకు తాగి రాబోమనీ, రైడ్స్ చెయ్యబోమనీ ఉదయం తొమ్మిది లోపు మా ఇళ్ళకు రాబోమనీ రాతపూర్వకంగా ఇమ్మని అడిగి, అలాగే రాయించుకున్నాను. పోలీసు ఆఫీసర్, నేనూ ఆ కాగితం మీద సంతకాలు చేశాం. ఒక కాపీని మా ఆఫీసులో ఉంచాను. కలానికున్న బలం చూడండి. అంతకు ముందెప్పుడూ ఈ కలంపోట్ల తోనే మేము ఇబ్బంది పడ్డాం. ఈ రోజు మేమూ వాళ్ళ ఆటలోనే వాళ్ళను చిత్తు చెయ్యటం నేర్చుకున్నాం”.

 “ప్రభుత్వం సెక్స్ వర్కర్ల ఉద్ధరణ గురించి చెప్పినప్పుడు నాకైతే నవ్వు వచ్చింది. ఒక్కసారిగా మా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందనుకున్నారు? మానవ హక్కులూ, శ్రామిక హక్కులూ అడుగుతున్నాం కదా!  ఏమీ అనలేక, పునరుద్ధరణ పేరుతో మమ్మల్ని అదుపు చేద్దామని చూస్తున్నారు. అసలు నన్ను ఉద్ధరించే అవకాశమే వాళ్ళకు లేదు. ఎందుకంటే నేను పని చేస్తూ నా బతుకు నేను బతుకుతున్నాను. బెంగాల్లో ఒక నలభై వేలమందిని ఉద్ధరించారని అనుకుందాం. మనది పేద దేశం. మరో నలభై వేలమంది ఇందులోకి రారని నమ్మకమేమిటి? ఢిల్లీలో స్త్రీల జాతీయ కమిషన్ లో మోహినీ గిరిని కలిసి ప్రస్తుతం మాతోనే ఉంటున్న ఒక 500 మంది వయసు మళ్ళిన వాళ్ళ పేర్లు ఇచ్చాను. ‘వీళ్ళకు పని లేదు. ఎవరూ పనిమనుషులుగా కూడా తీసుకోవటం లేదు. వీళ్ళకు ఆధారం కల్పించమ’ని అడిగాను. ఆ తరువాత అక్కడినుంచి ఏ జవాబూ లేదు. మాటకీ చేతకీ ఇంత తేడా ఉంటుంది”. 

శిఖా దాస్ :  శిఖా ఈ వృత్తిలోకి రాకుండా ఉందామని చాలా ప్రయత్నించింది. చదువుకుందామని అనుకుంది. రెండు సార్లు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంది. పని మనిషిగా చేసింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ లో పని చేసింది. చెత్త కాగితాలు ఎత్తింది. కానీ సెక్స్ వర్కర్ కూతురనే ముద్రా తప్పలేదు. చివరకు ఆ వృత్తీ తప్పలేదు.  తెలివిని కూడా కలబోసుకున్న ఈ బెంగాలీ అందం, డాక్టర్ జానా ప్రోత్సాహంతో 1999లో జమైకా వెళ్లి, అక్కడి సభలో పదిహేను నిముషాలు జంకూ గొంకూ లేకుండా మాట్లాడి అందర్నీ ముగ్ధులను చేసిందట.

సోహినీ ఘోష్ తో  శిఖా దాస్.                                                                                    దీప్తి పాల్, సాధనా ముఖర్జీ

“నేను సోనాగచ్చిలోనే పుట్టాను. అమ్మ ఒక సెక్స్ వర్కర్. నన్ను బళ్ళో వేసింది. అక్కడ అందరూ ‘మీ నాన్న కనిపించడేమ’ని అడిగేవారు. నేను జవాబు చెప్పలేక అమ్మను అసహ్యించుకునేదాన్ని. ఈ రోజు అమ్మను అలా తిట్టుకున్నందుకు సిగ్గు పడుతున్నాను. నాకూ బడికి వెళ్తున్న ఒక పాప ఉంది. బోర్డింగ్ స్కూల్ లో వేశాను. అక్కడి కాగితాల్లో నా వృత్తి ‘సెక్స్ వర్కర్’ అని రాశాను. పాపకు అన్నీ అర్ధం అవుతున్నాయి. ఏదేమైనా తానెవరో దాచవద్దని చెప్పాను”. 

“ప్రభుత్వం మాకు శ్రామిక హక్కులు ఇవ్వటం లేదు. చిన్న పిల్లలు ఇందులోకి రాకుండా చేసుకొనే ‘self regulatory boards’ కావాలి మాకు. కొత్తవాళ్ళు దీనిలో చేరేముందు మేం పరీక్షించాలి. 18 సంవత్సరాల లోపు పిల్లలైతే వాళ్ళ ఇళ్ళకు పంపించేస్తాం. కుటుంబం ఆమెను ఆదరించకపోతే ఎక్కడో ఒకచోట ఆశ్రయం కల్పిస్తాం”.

“కస్టమర్లను కండోమ్ వాడమని అడిగే ధైర్యం రావాలంటే ముందు మా శరీరాలమీద మాకొక్కరికే అదుపు ఉండాలి”.

తన విదేశయానం గురించి చెప్తూ శిఖా ఇలా అంటుంది. “విమానం ఫ్రాంక్ ఫర్ట్ లో ఆగింది. చలికి బిగుసుకుని నా దుపట్టాను చుట్టూ కప్పుకున్నా. ఫ్రాంక్ ఫర్ట్ దాటాక హిందీ తెల్సిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. సిగరెట్టు వెలిగించా. ఆల్కహాల్ ఇస్తున్నారు విమానంలో…  బీర్ నాకెంతో ఇష్టం…  కానీ ఎక్కువగా  తాగేస్తే,  ‘ఒక్కదాన్నే వెళ్తున్నా కదా నన్నెవరు చూసుకుంటార’ని భయం వేసి తాగలేదు. పైగా విమానంలో టాయిలెట్ కి వెళ్తే తలుపు బిగుసుకుని లోపలే ఉండిపోతానని మరో భయం”.

“సమావేశంలో నాకు అయిదు నిముషాలు కేటాయిస్తే, నేను పదిహేను నిముషాలు మాట్లాడేను. అది అవగానే అందరూ నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. నా మాటలు బాగా నచ్చాయని చెప్పారు. చదువు రాని ఒక భారతీయ సెక్స్ వర్కర్ ఇంత పెద్ద ఉపన్యాసం ఇస్తుందని వాళ్ళు ఊహించలేదు. అక్కడ ఎవరో నాకో నెక్లెస్ బహుమతిగా ఇస్తే నకిలీదేమో అనుకున్నా. ఎవర్నీ నమ్మకపోవటం ఈ వృత్తిలో అలవాటయింది”.

“నేను చచ్చిపోయేక నా పిల్లలు ఈ జమైకా ఫోటోలు చూసి ‘జీవితంలో కొంతైనా సాధించింది. చెప్పుకోదగ్గ మనిషి’ అని నా గురించి  అనుకుంటారు”.

ఇవీ సోహినీ ఘోష్ తన ఫిల్మ్ లో బంధించిన Night Fairies  చెప్పిన కథలు…

***

ఎనభైల్లో శ్యాం బెనెగల్ ‘మండీ’ అనే సినిమా తీశాడు. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళను ఓ పక్క వాడుకుంటూనే…  అవసరమైతే తరిమి కొడుతూ, మళ్ళీ దగ్గరకు తీస్తూ సమాజం ఎలా ఆడిస్తుందో చూపిస్తాడు బెనెగల్. అలాగే ఎంత చావగొట్టినా ఈ పురాతన వృత్తి చావదని కూడా నిష్కర్షగా, హాస్యంగా చెప్పేస్తాడు. ప్రపంచంలో డబ్బు, సెక్స్  అవసరాలూ, స్త్రీలూ, పురుషులూ ఉన్నంత కాలం ఈ వృత్తి కూడా నిలిచే ఉంటుందనిపిస్తుంది. దీనిని ఆపటం ఎవరివల్లా కాదు కాబట్టి, ఈ ‘adult sex work’ ను చట్టబద్ధం చేసి, ప్రాంతాలవారీగా ‘మేము సెక్స్ వర్కర్లం’ అని చెప్పుకునే వాళ్ళకు భద్రత కల్పించి, వేధింపులు లేకుండా చెయ్యటమే సమాజమూ, ప్రభుత్వమూ చేయదగ్గ పని.  పూర్తి స్థాయి సెక్స్ వర్కర్లు, అదీ చదువులేని పేదవారికి ఎటువంటి భద్రతా లేదనటంలో ఏ సందేహమూ లేదు.  ‘సెక్స్ వర్కర్’ అనే మాటను మనం వాడుతున్నామంటేనే, వారిని పనిచేసేవారిగా గుర్తిస్తున్నాం. కాబట్టి అన్ని రకాల పనివారికీ ఇచ్చే భద్రతా, రక్షణా వీరికి కూడా ఇవ్వవలసిన అవసరం ఉందనే అర్ధం కదా!  ‘ఇది మా వృత్తి’ అని చెప్పుకోకుండా వీలైనంత రహస్యంగా డబ్బుకోసం, ఉన్నతస్థాయి జీవన విధానం కోసం  ఒంటిని అమ్ముకుంటున్న అమ్మాయిలూ, గృహిణుల సంఖ్య కూడా సమాజంలో ఇవాళ పెరుగుతోంది. అలాగే మగ సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా. సరే ఇదంతా మరో సామాజిక సమస్య.

ఈ ఫిల్మ్ లో సెక్స్ వర్కర్లను ఒక అర్ధవంతమైన ప్రశ్న అడుగుతుంది ఒక సంఘసేవిక. “మీ వాదనలతో ‘నీతి’ అనేది ప్రమాదంలో పడింది. నా ఉద్దేశ్యంలో వేశ్యావృత్తి అంటే  ఆడవాళ్ళమీద జరిగే హింస. మీరేమంటారు?”  ఈ ప్రశ్నకు సుదీపా బిశ్వాస్ అనే ‘DMSC’ సభ్యురాలి జవాబు ఇది-  “మేము పనిచేసే చోటు అందరికీ తెలుసు. అది స్పష్టంగా హద్దులు గీసి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ వృత్తి జరుగుతుందని తెలిసి, అవసరమైన వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం వస్తారు. వాళ్ళ జీవితాల్లోని ఇరుకుదనాన్నుంచి కొంతసేపు తప్పించుకోవటానికి మా దగ్గరకు వస్తే, అది తప్పని నాకు అనిపించటం లేదు. ఇతరులకు సంతోషాన్నిచ్చి మేం డబ్బు తీసుకుంటున్నాం. అదే సమయంలో మేమూ ఆనందాన్ని పొందుతున్నాం. ఇది  హింసాత్మకమైన వృత్తిగా మేము భావించటం లేదు. ఇది  బాధాకరమైనదే అయితే, ఇన్ని వేల ఏళ్ళుగా నిలిచి ఉండేది కాదు”.

   ఈ వృత్తి బాధాకరమైనదైనా కాకపోయినా, దానిచుట్టూ బాధల విషనాగులు చుట్టుకుని కాటేయడానికి సిద్ధంగా ఉంటాయనటం అబద్ధం కాదు. పోలీసులు, రౌడీలు, మేడమ్ లు, గుప్త రోగాలు, తాగుడు, సిగరెట్లు … ఇవేమీ అబద్ధం కాదు. దీప్తి పాల్ ఇలా అంటుంది. “మొదట్లో ఇంత కలిసికట్టుగా ఉండేవాళ్ళం కాదు. ఒకసారి ఒకడు శాంతి దీ మెడమీద కత్తి పెట్టి “అయిదు వందలు ఇస్తావా, కత్తి దించమంటావా?” అని బెదిరించాడు. అందరం నిశ్చేష్టులమైపోయాం. మరోసారి ఒకడు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. నేనప్పుడు బాగా తాగి ఉన్నాను. తాగితే నేను ఎవరికీ భయపడను. వాడిని నాలుగు తన్నేను. అంతే.. ఆ తరువాత వాడు రెండు చేతులతో రెండు బాంబులు తీసుకొచ్చి నా మీద విసిరేస్తానన్నాడు. ఇంతలో సాధన వెనుకనుంచి నెమ్మదిగా వచ్చి వాడిని గట్టిగా పట్టుకొని, ‘విసురు. అందరం చచ్చిపోదాం’ అంది”.

ఈ దీప్తి పాల్, సాధనా ముఖర్జీ.. ఇద్దరూ కలిసి వీళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసే గూండాలను ఎదిరించారు. లట్టూ అనే గూండా రేజర్ తో దీప్తి ముఖాన్ని చీరేశాడట. అతన్ని ఎదుర్కోవటానికి సాధన మిగతా సెక్స్ వర్కర్స్ అందరినీ కూడగట్టింది. ఇన్ని అపాయాలనూ అన్యాయాలనూ ఎదుర్కొన్న తరువాత DMSC ఏర్పడి, బలోపేతమయింది.

2002 లో సోహినీ ఘోష్ తీసిన ‘Tales of Night Fairies’లో ఉన్నది ‘సెక్స్ వర్కర్ల సాధికారత’ అనే అంశం ఒక్కటే కాదు.  వాంఛల గురించి ఏ అరమరికలూ లేకుండా ఈ సెక్స్ వర్కర్లు మాట్లాడటం కూడా ఉంది. నితాయ్ గిరి ఒక మగ సెక్స్ వర్కర్. అతనికి జుట్టూ, గోళ్ళూ పెంచుకుని ఆడపిల్లలా తయారవటం ఇష్టం.  తన మగ శరీరంలోని ఆడ కోర్కెల్ని అర్ధం చేసుకొని, అంచనా వేసుకొని ఈ వృత్తిలోకి దిగటానికి ముందు అతను సమాజంతోనూ, ఇంట్లో వారితోనూ, పేదరికంతోనూ, తనతో తాను కూడా ఎంతో పెనుగులాడేడు. DMSC, కోమల్ గాంధార్ అతనికి పెద్ద ఆసరాగా, జీవితానికో ధ్యేయంగా నిలిచాయంటాడు.  అలాగే చిన్నప్పుడే హింసాత్మకమైన అత్యాచారానికి గురైనా, ఆ అనుభవంతో మనసును వంకరలు పోనివ్వకుండా  “జీవితంలో చక్కని విషయాలు రెండే. ఒకటి మంచి తిండి. రెండోది సెక్స్” అని మాలా సింగ్ చెప్పగలగటం కూడా నాకు విశేషంగా అనిపించింది.

 నితాయ్ గిరి                                                                                                

ఈ నిషేధ ప్రాంతాల గురించీ, నిషిద్ధ స్వప్నాల గురించీ మాట్లాడుతూ “చిన్నప్పుడు నన్ను మా అమ్మానాన్నలు చాలా సినిమాలకు తీసుకెళ్ళే వారు. కానీ,  కొన్ని సినిమాలకు మాత్రం నన్ను ఎందుకు తీసుకు వెళ్ళరో నాకు అర్ధం అయేది కాదు. వాటిగురించి చాలా కుతూహలంగా ఉండేది. నా కౌమారప్రాయంలో నేనూ నా స్నేహితురాళ్ళూ కలిసి ఒక ఊహాలోకంలో విహరించేవాళ్ళం.  “Prostitute’s Paradise” అనే ఊహాత్మక హోటల్లో, అందర్నీ మోహంలో ముంచెత్తే దేవకన్యల్లా మమ్మల్ని మేం ఊహించుకుంటూ ఉండేవాళ్ళం” అంటుంది సోహినీ ఘోష్.  అంటే … స్త్రీలు తమ ఫాంటసీలనూ, sexuality నీ కొంచెం లోతుగా వెదికి, నిర్భయంగా బైటకు చెప్పగల్గితే, పాతివ్రత్యం, వ్యభిచారం .. అనే భావజాలాల మధ్య ఉన్న సన్ననితెర కదిలి, లక్ష్మణ రేఖలు చెరిగిపోతాయేమో!  ఇంతగా ఎరుసు లేకుండా సోహినీ వీరితో కలిసిపోయి కెమెరా పట్టుకుంది కాబట్టే ఈ స్త్రీలంతా అరమరికలు లేకుండా తనతో మాట్లాడగలిగారు. ఫలితంగా ఒక మంచి సినిమా వచ్చింది. ఎనభైల్లోనే స్త్రీ వాదులు ధైర్యంగా శరీర భాష గురించి రాసిన కవితలను ‘ఒళ్ళు కొవ్వెక్కి’ రాసే తీరిక రాతలుగా పరిగణించిన ఒక ప్రపంచం మనకు తెలుసు.  అలాగే, ట్రాన్స్ జెండర్, లెస్బియన్, హోమో, ఇంకా రకరకాలైన  తమ లోపలి ముఖాలను దర్శిస్తూ, ‘మేం ఇదీ.. మాకిది కావాలి’ అని ధైర్యంగా చెప్పే సమూహాలున్న మరో ప్రపంచం కూడా మన పక్కనే ఉండటాన్ని ఈరోజు చూస్తున్నాం.

మొత్తానికి ‘Tales of Night Fairies’ సెక్స్ వర్కర్ల జీవితాల్లోని వెలుతురు కోణాలను మెరిపించి, వీరి చరిత్ర ఇంకెన్ని రకాల మలుపులు తిరుగుతుందో.. అనిపించేలా చేస్తుంది.

         lalitha parnandi  ల.లి.త.

Download PDF

9 Comments

  • మణి వడ్లమాని says:

    “సమాజపు అంచులలో ప్రమాదకరమైన జీవితాలు గడిపే వీళ్ళకు పోలీసుల, రౌడీల చేతుల్లో తనువు పుండైపోకుండా చూసుకోవటమే ఒక నిరంతర పోరాటం”

    కడుపు కోసం లేదా తిండి కోసం సలిపే ఈ జీవన పోరాటంలో వాడిపోయి,నలిగి న వీరి జీవన చిత్రం గురుంచి పాటుపడిన డాక్టర్త జానా,సోహినిలాంటి లాంటి కొంతమంది వాళ్ళకి దైర్యం,ఆత్మసైర్యం కలిగించడం నిజంగా అభినందనీయం’. వీరు ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు వారిని అసహ్యించుకుకోకుండా వారు కూడా ఈ సమాజం లోని వారె అని గుర్తుంచుకోవాలి.

    మేము కాలేజి లో చదువు కొనే రోజులలో అభ్యుదయ భావాలున్న ఒకలెక్చరర్ విద్యార్ధుల తో క్యాంపు నిర్వహించి వాళ్ళకిమి నిమమ్ చదువు చెప్పాలని ప్రయత్నం చేసారు. అప్పుడే తెలిసింది వీళ్ళబ్రతుకు వ్యధలు

  • manjari. lakshmi says:

    పడవ మీద కూర్చున్న వాళ్ళెవరు? ఆ బొమ్మ, వాళ్ళ గురించి
    లోపల ఎక్కడా రాసినట్లు లేరు.

    • Lalitha P. says:

      పడవ మీద కూర్చున్నది మాలా సింగ్ (చీరలో), సోహినీ ఘోష్… సరదాగా ‘చింగారీ కోయీ భడ్కే’ అనే రాజేష్ ఖన్నా, షర్మిలా టాగూర్ పాటని ఇద్దరూ పాడుతూ నదిమీద విహారం… మంచి ఆత్మస్థైర్యం, జీవనోత్సాహం ఉన్న స్త్రీలు వీళ్ళంతా. వీలయితే ఫిల్మ్ చూడండి యూట్యూబ్ నుంచి.

  • K Mohan Rao says:

    రివ్యూ చాలా బాగుంది. చిత్రము లో చూపించిన అతి సున్నిత మైన విషయములును సహజ దృక్పధము తో పరిశిలించి కల్లుకు కట్టినట్టి గా లలితా గారు వివరించేరు. లలితా గారు ఇంతక ముందు రాసిన సమీక్షలు నేను చదివెను. గుండెలకు హత్తు కున్నట్లు వుంటాయి తన సమీక్షలు. తను కలము పట్టి మంచి రచనలు చేయాలనీ నేను కోరుకుంటున్నాను . మీ రచన శైలి చాల అందము గా ఉన్నది. శుభాకాంక్షలు

  • Naresh says:

    “When I’m meeting with women and girls in prostitution in my own country as well as some countries of Europe, Africa and here in India, I’ve always asked what they would like for their daughter. So far, the answers have not included prostitution.” ….

    Gloria Steinem’s article on the subject is very pertinent.
    http://www.thehindu.com/news/national/article3287212.ece#comments

  • మంజరి లక్ష్మి says:

    ప్రకృతి సహజంగా స్త్రీ పురుషుల మధ్య ఉండేదీ, భావాభివృద్ధిలో ఆ ఇద్దరి మధ్య ఉండే ప్రేమతో కూడిన సహజీవనంగా ఉండవలసిన దాన్ని, పేదతనం వల్లైతేనేమీ, పెట్టుబడిదారులు దాన్ని ఇంటర్నేషనల్ వ్యాపారంగా చేసుకోవటానికి బలవంతంగా స్త్రీలని ఇందులోకి దింపటంవల్లైతేనేమీ, ఈ వ్యవస్థలో ఇదొక దురంతంగా నడుస్తోంది. ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా ఇందులోకి ఎలా దింపుతారు? దీన్ని చూసి ఇదొక వృత్తనీ, దానికి లైసెన్సులు ఇవ్వాలనీ అనటం ఇంకా ఘోరమైన విషయం. చాతైనంత మందిని ఆ వృత్తి మానిపించి షెల్టర్ హోమ్స్ లోకి మార్చటమే ప్రస్తుత వ్యవస్థలో ఉన్న పరిష్కారం అనుకోవాలి.

  • Lalitha P. says:

    నిరుద్యోగ భ్రుతికీ సెక్స్ వర్క్ కీ అభివృద్ధి చెందిన జర్మనీవంటి దేశమే ముడి పెట్టటం లేదంటే, ఈ వృత్తికి ఉన్న మోరల్ ఆంగిల్, ‘శరీరం మీద జరిగే దాడి’ అనే కోణం, అర్ధమౌతోంది. ఈ కోణం నెమ్మదిగా మాయం అవుతూ ఉండటం కూడా చూస్తున్నాం. ఇన్నాళ్ళూ నేను ఆడపిల్లల్ని ఎత్తుకుపోవటం అంటే ఈ వృత్తిలో దించడం కోసమే అనుకున్నాను. తెహెల్కా లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఛత్తీస్ గర్హ్ నుండి అమ్మాయిల్ని దేశం చూపిస్తామని తీసుకెళ్ళి తమిళనాడు ఫ్యాక్టరీలలో బందీలను చేసి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. అందులో కొంతమంది మీద అత్యాచారాలు కూడా అక్కడ అతి సామాన్యమే! గడిచిన పదేళ్ళలో తొంభై వేలమంది దాకా ఈ అన్యాయానికి బలి.. వెట్టి చాకిరీ కూడా శరీరం మీద జరిగే అన్యాయమే, హానే కదా! వ్యభిచారం ఒక వృత్తే అని మనం ఒప్పుకున్నా లేకపోయినా, సంస్కరణ వాదంతో దీన్ని ఏమాత్రం మార్చలేమన్నది తిరుగులేని విషయం. నీతి అవినీతుల భాష్యం ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్కలా ఉంటుంది. మన ప్రాచీన భారతీయ, చైనా, జపాన్ సమాజాల్లో వేశ్యావృత్తికి ఆమోదం ఉండేది. రాజుల ప్రాపకం ఉండేది. మొనొగమీ ఒక ఆదర్శంగా మారిన సమాజంలో దీన్ని అసహ్యించుకోవటం మొదలైంది. ఆపటం మాత్రం వీలు కాలేదు.
    ఒక అమాయకమైన యువతి తను నిండుగా ప్రేమించిన మనిషే తనను అమ్మేసాడని తెలుసుకున్నప్పుడే మనుషుల మీదా, సమాజంమీదా, సున్నితమైన భావాలమీదా నమ్మకాన్ని పోగొట్టుకుంటుంది. ఇక మిగిలేదంతా బతుకు పోరాటమే. దీనికి లైసెన్సులిచ్చినా, ఇవ్వక పోయినా వృత్తిలోకి వచ్చేవాళ్ళు పెరగటమే తప్ప, తరగటం ఏమీ ఉండదు. సమాజం చూపించే చిన్నచూపే మనుషుల్ని చాలా వరకూ ఈ వృత్తిలోకి రాకుండా నిరోధిస్తూ ఉంటుంది. జీవితం, అది నేర్పే పాఠాలు అటువైపు తోస్తూ ఉంటాయి. ఈ పెనుగులాటలో సంస్కరణ ఎంత చిన్న విషయం?
    ఒకసారి రోడ్డు మీద తాగి పడిపోయిన ఒక సెక్స్ వర్కర్ ను మా కాలనీ లో చూసాను. అందరూ ఆమె చుట్టూ మూగి ఉన్నారు. మంచి నీళ్ళు ఇస్తున్నారు. ఆమె మీద ఒక నలుగురు అత్యాచారం చేసి వెళ్లిపోయారట. ఒంటి నిండా పక్కులు కట్టిన పాత గాయాలూ, కొన్ని కొత్తవీ.. తను వేశ్యనని చెప్పటం లేదు. ఇంటికి వెళ్లి పోతాననీ, డబ్బులిమ్మనీ అంటుంది. సరే అని ఆమెను ఆటోలో ఎక్కించుకుని తను చెప్పిన చోటికి తీసుకెళ్ళాను. ఇల్లు చూపించదు. ఇక తనను వదిలెయ్యమంటుంది. అప్పటికే ఆమె విషయం నాకు అర్ధమై వెల్ఫేర్ హోం కి తీసుకెళ్ళి అప్పగిద్దామని ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరకు నా మీద విరుచుకుపడింది. ఇలా విఫలమైంది నా ఆ కాస్త సంస్కరణ వ్యవహారం.

  • మంజరి లక్ష్మి says:

    “ఇక మిగిలేదంతా బతుకు పోరాటమే.” అవును ఇది నిజానికి బతకటానికి వేరే దారి లేక పోవటం, ప్రధానంగా పేదరికానికి సంబంధించినదే. నిజంగా ఈ ప్రభుత్వాలు అందరికీ వృత్తులు, ఉద్యోగాలు కల్పించ గలిగితే మోసపోతే మాత్రం ఇందులోకెందుకు దిగుతారు? అనేక సంబంధాలున్న ధనవంతులైన వ్యక్తులు హాయిగా గౌరవంగా ఏవో పనులు చేసుకుని బతకటం లేదా? ఇది పేదతనంతో ముడిపడిన సమస్యే.
    “దీనికి లైసెన్సులిచ్చినా, ఇవ్వక పోయినా వృత్తిలోకి వచ్చేవాళ్ళు పెరగటమే తప్ప, తరగటం ఏమీ ఉండదు. సమాజం చూపించే చిన్నచూపే మనుషుల్ని చాలా వరకూ ఈ వృత్తిలోకి రాకుండా నిరోధిస్తూ ఉంటుంది. జీవితం, అది నేర్పే పాఠాలు అటువైపు తోస్తూ ఉంటాయి.” కానీ ఎప్పటికైనా రావలసిన మార్పు మంచిగా ఉండాలంటే దానికి ఇప్పటినుంచే భావాలలో తయారుగా ఉండాలి కదా. లైసెన్సులివ్వటమంటే ఆ తప్పు దోవకు మిగతా వాళ్ళను కూడా మనకు తెలియకుండానే మళ్లించిన వాళ్లమవుతాము కదా!
    “ఈ పెనుగులాటలో సంస్కరణ ఎంత చిన్న విషయం?” అవును సంస్కరణ మార్గం కూడా చాలా కష్టమైనదే. మీ అనుభవమే దాన్ని రుజువు చేస్తున్నది. .

  • sangeetha says:

    Thank you for posting this review and it is an eye opener for all of us who are blessed to live under normal circumstances.Hats off to all those women who are standing their ground in spite of going through such Agony in their lives!!!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)