ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు: ‘The Visceral-Corporeal’, బైరాగి కవిత్వం

aluri-bairagi

1.

మనకు జీవితకాలం పాటు ‘నిరంతరానంద భిక్ష’  పెడుతూవుండే కవితో మనకు – వైయక్తిక స్థాయిలో – చాలా సంక్లిష్టమైన, ambivalent అయిన సంబంధం ఉంటుందనిపిస్తుంది.

 

గాథాసప్తశతి ని ‘The Absent Traveller’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన  Arvind Krishna Mehrotra,  ఆయన  Translator’s Note లో ఇలా అంటారు: ‘As readers we sometimes feel possessive about certain authors. They are our discoveries, and write only for us. When the whole world comes to know of them, the magic of their pages is destroyed and we feel robbed.’ ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు ఆయన మనస్సులో ఏ రచయిత మెదిలారో గాని, ఆలూరి బైరాగి కవిత్వంపైని నా లుబ్ధత్వం గురించే రాసారనిపించింది. బైరాగిని అందరూ చదవాలనీ, చర్చించుకోవాలనీ వుంటుంది. అదే సమయంలో, నేను మాత్రమే unlock చేయగల రహస్యమేదో ఆయన encrypt చేసి వదిలివెళ్ళారనిపిస్తుంది.‘రంగుల తోట’ అనే కవిత చివరలో ‘నీతో ఒకటి చెప్పలేదు-/నా రంగుల తోటలోకి అప్పుడప్పుడు నిన్ను తప్ప/ ఎవ్వరినీ రానివ్వను’ అని నన్నుదేశించి రాసారనే అనుకుంటూవుంటాను. ‘ప్రశ్నను ప్రశ్నించిన కవి బైరాగి’ (‘మో’ మాట) ని కేవలం eulogize చేయడంవల్ల ఒరిగేదేమీ లేదు. మన సాహిత్యలోకం బైరాగిని అర్థంచేసుకోవడానికి చేసిన కృషి స్వల్పం. అలాగని గణించదగ్గ విమర్శ రాలేదనికాదు. ఇంతకంటే pressing, urgent  అవసరాల్ని literary mainstream పట్టించుకోవడం వల్ల ఆయన అర్థవిస్మృతుడు. అంతే.

 

2.

జెర్రులు ప్రాకుతున్నై, తేళ్ళు, త్రాచుపాములు నాచుట్టూ,

కత్తిరించి కుడుతున్నారు నన్నెవరో చొక్కాలా

శ్వాసనాళంలోంచి  శ్వాస త్రాగుతున్నారు హుక్కాలా

ఏదో ప్రవాహంలో(బహుశా అది నెత్తురేమో)

కొట్టుకుపోతున్నాను. నాచుట్టూ నాతోబాటు వందలు వేలు

చేతులు, కాళ్ళు, తెగిన శిరస్సులు, మొండాలు, పీకిన గ్రుడ్లు

వెంట్రుకలు నాచులాగ, ప్రేవులు నరాలు కాడల్లా;

పొగచూరిన ఎర్రకిరసన్ వెలుతురులో

కనుపించని ఒక చిక్కని ద్రవంలోన (నెత్తురే అయిఉంటుంది)

గిలగిల తన్నుకొంటున్నాను మాంసపు ముద్దలాగ;

అరుస్తున్నాను భయంతో చుట్టూచూసి, వినరాని కేకలువేసి,

సమస్త జీవకోటులు కొట్టుక వస్తున్నాయి

ఎటువైపు తిరిగినా ఏదో ఒకటి తగులుతోంది

మెత్తగా, నున్నగా, చీదరగా.

బిలబిల ప్రాకుతున్నవి పురుగులు నా ముక్కులోకి, చెవుల్లోకి

ఒంటినిచుట్టి పట్టుకొనే జలగలమూక.

అదిగదిగో, కొట్టుకొని వస్తున్నది శిరస్సొకటి,

దాని నొసట ఎర్రని నోరు, మూడవకన్ను,

తెరచిన రంధ్రమొకటి వెక్కిరిస్తోంది

పుర్రెలపాటలాగ గుడగుడమనే సుడిగుండం

కొంగ్రొత్త ఉపనదులవి, మహానగరాల మురుగు మోస్తూ

ఆసుపత్రి కాల్వల్లోంచి చీముతో, రసితో నిండి.

వినీల లోహకాంతులు విరిసినాయి దిక్కులలో

మసిగుడ్డవలే గగనం పరుచుకొన్నది నల్లనిదై

ప్రవాహవేగంవల్ల కదులుతోంది ప్రతి జీవం

చావులోకి, బ్రతులోకి, నిదుర మగతల మూర్ఛలోకి.

 

ముందున్నది క్షితిజం కాదు, అంతులేని సొరంగమది

గోడలు మెరుస్తున్నవి కొలిమిలో ఇనుములాగ

జీవంగల రుధిరామిషబిలం అదే

గోడలు చలిస్తున్నవి ప్రాకుతున్నపురుగుల్లా

ప్రవాహం ప్రవేశించింది గుహలో, సృష్టి రంధ్రంలో,

ఆవలనున్న సాగరంలో, రజనీ నైశ్శబ్ద్యంలో

నే నెవణ్ణి, ప్రభువునా, బానిసనా,

మెదులుతున్న మాంసపుముద్దనా, మానిసినా?

ఈ అగ్నిశిఖల్లోంచి, ఈ రక్తమఖం లోంచి

నూతన జననమా, లేక ప్రాక్తన మరణమా?

 

Literary Modernism యూరోప్ లోనూ, మన దేశంలోకూడా alienation/dehumanization ని చిత్రించడం ప్రధాన లక్షణంగా కలిగివుందని అందరికీ తెలిసిందే. కానీ, ఈ విషయాన్ని కవిత్వంగా మార్చేక్రమంలో కవి వాడే tropes, techniques అతడి విలక్షణతని పట్టిస్తాయి.

 

‘నూతిలో గొంతుకలు’ కవితాసంపుటిలో ‘హామ్లెట్ స్వగతం’, ‘అర్జున విషాదయోగం’, ‘రాస్కెల్నికోవ్’ అనే మూడు భాగాల ముందు eponymous కవితైన ‘నూతిలో గొంతుకలు’ ఐదు భాగాలుగా వుంది. ఈ ప్రారంభకవితలోని concerns నీ, themes నీ తరువాత వచ్చే మూడు స్వగతాలు dramatize చేస్తాయి. ‘అర్జున విషాదయోగం’, ‘రాస్కెల్నికోవ్’ అనే భాగాలు స్థూలంగా చూస్తే స్వగతాలు కావుగానీ, జాగ్రత్తగా గమనిస్తే అవీ స్వగతాలే.

ప్రారంభ కవితలో digressions , సంవాదం, exposition , illustration  లాంటి discursive పద్ధతులెన్నో కనిపిస్తాయి. కొన్ని దృశ్యాల్ని condense చేస్తూ, కొన్నింటిని extend చేస్తూ సాగే శైలి దీర్ఘకవితల్లో కానవచ్చేదే. పైన quote చేసిన extended image అటువంటిదే.

 

‘కత్తిరించి కుడుతున్నారు నన్నెవరో చొక్కాలా

శ్వాసనాళంలోంచి  శ్వాస త్రాగుతున్నారు హుక్కాలా

 

Loss of autonomy of the individual ని పైపంక్తుల్లో వ్యక్తీకరించిన పద్ధతి బైరాగి aesthetic (noun form లో) లోని ఒక కీలకమైన అంశాన్ని తెలియజేస్తుంది. ఎవరో తనని చొక్కాలా కత్తిరించి కుడుతున్నారనడంలో – bodily mutilation , invasion of the corporeal (ఇంకా చెప్పాలంటే, ‘body snatching’) ని ఆయన alienation కు సంకేతంగా వాడుతున్నారు. అప్పటి (1951) తెలుగు కవిత్వంలో కనిపించని ఆశ్చర్యకరమైన associations బైరాగి ఏర్పరిచారు. ఆయన కవిత్వ ‘ecosystem’ (కావ్యాంతర్గత జగత్తు) లో కొన్ని ప్రత్యేకమైన motifs పరిభ్రమిస్తూవుంటాయి. వేరే కవితల్లో ‘దేహపు పరిధానంలోంచి’ , ‘మాసిన చొక్కాలా దేహాన్ని వదలి’ వంటి మెటఫర్స్ కనిపిస్తాయి. భగవద్గీతలో శరీరాన్ని వస్త్రంతో పోల్చే శ్లోకం ప్రసిద్ధం.  పై image మిగతా related images ని ఎలా meta-morphose చేస్తోందో గమనించండి.

 

నేను ఈ కావ్యభాగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం, బైరాగి,  శరీరాన్ని (ఇది hyper-sexualized స్త్రీదేహం  కాదు)  కేంద్రంగా చేసుకొని ‘దుర్భరతర జీవిత బాధావధి’ ని దృశ్యమానం చేసారని చెప్పటానికే. ‘దైహికత’ (corporeality) గురించిన మన received, a priori knowledge అంతటినీ దైహికానుభవం defy చేస్తూనేవుంటుంది. అసలు ఒక శరీరావయవం కలిగుండటమంటే ఏమిటి? Surrealist paintings లోలా disembodied limbs, torso, eyes, nose ని శరీరపు ‘presumed’ unity నుంచి వేరు చేసి చూడటమంటే ఏమిటి? బైరాగి వాడిన విశేషణాలు చూడండి – ‘మెత్తగా’ , ‘నున్నగా’ , ‘చీదరగా’. ఆ disconcertingly visceral experience ద్వారా ఆయన సూచిస్తున్నదేమిటి? చుట్టూరా అవయవాలు, తనే  ఒక మాంసపుముద్ద. పోతున్నది ‘రుధిరామిష బిలం’ లోకి. ఆ contiguity , juxtaposition of visceral images ద్వారా fluid స్థితిలో ఉన్న subjectivity ని allegorize చేస్తున్నారు. ఇటువంటి interpretation ని బలపరిచే imagery ఇతర modernists లోనూ కనిపిస్తుంది. అలాగని, కేవలం allegorical potential (మరీ ముఖ్యంగా, ప్రతిదీ potential allegory అయినప్పుడు) ఉండటమే ఇక్కడ ప్రత్యేకత కాదు. బైరాగి కల్పనలో ముఖ్యమైంది ఆ visceral, visual immediacy.

 

చిన్న detour. ఈ పంక్తులు –

 

‘గోడలు మెరుస్తున్నవి కొలిమిలో ఇనుములాగ

జీవంగల రుధిరామిషబిలం అదే

గోడలు చలిస్తున్నవి ప్రాకుతున్నపురుగుల్లా

ప్రవాహం ప్రవేశించింది గుహలో, సృష్టి రంధ్రంలో,’

 

చదివేటప్పుడు Roberto Bolano రాసిన Anne Moore’s Life కథలోని (ఆయన Last Evenings on Earth కథాసంకలనం లోది) ఈ భాగం స్ఫురిస్తుంది: ‘…It was as if the walls of the hotel room were made of meat. Raw meat, grilled meat, bits of both. …she looked at the walls and she could see things moving, scurrying over that irregular surface…’ పై రెండు సన్నివేశాలూ (కథ చదివి చూడండి) ఎక్కడో దిగంతంలో కలిసేవే.

 

ఇక ‘రక్త మఖం’ గురించి. ‘యజ్ఞం’ motif  బైరాగి కవితల్లో చాల చోట్ల కనిపిస్తుంది.’ఆగమగీతి’ కవిత ‘మానస యజనవాటిక పై మరల నేడు…’ అనే మొదలవుతుంది.’మృత్యు యజనపు జీవమంత్రం’, ‘యజనారణులు విఫలమైనవి/ ఇక ప్రజ్వరిల్లదీ హోమాగ్ని’ – యిలా. ఈ recurring motifs ని ఆయన మరింత శక్తిమంతం చేసుకుంటూపోయి, ఇంచుమించు ఒక private cosmogony వంటిది తయారుచేస్తారు.

 3444572043_9c3ce9bb22_o

 

3.

‘త్రిశంకు స్వర్గం’ బైరాగి దీర్ఘకవితల్లో అత్యంత విశిష్టమైనది. అది Nausea (Sartre) లా, The Stranger  (Camus) లా ఒక గొప్ప existentialist text. కానీ, దాని నిజమైన precursor మాత్రం, Soren Kierkegaard  రాసిన ‘Sickness Unto Death’ అనే తాత్త్విక రచన. Kierkegaard ని ‘Father of Existentialism’ అన్నారు. ఆయన దర్శనం theistic existentialist thought కి అత్యున్నత ఉదాహరణ.

 

(A section of the book relevant to this discussion and analysis can be accessed with this link (……………). Reading the whole excerpt will be helpful for understanding the drift of Kierkegaard’s argument.)

 

Kierkegaard దేన్ని ‘ఆమరణ రుగ్మత’ అంటున్నాడు? మరణహేతువైన వ్యాధి – అంటే terminal illness

– ‘Sickness Unto Death’ కాదు. మరణం రోగానికి అంతమేమో కాని, అదే అంతం కాదు. Kierkegaard ప్రకారం, మరణం అనేది పరమచరమాంతం అని భావించడమే రుగ్మత. Kierkegaard ‘నిస్పృహ'(despair) ని Sickness Unto Death అంటున్నాడు. ఈ నిస్పృహ భౌతికమృతితో ముగిసేది కాదు. అది ఎటువంటిది? Kierkegaard మాటల్లో –

 

‘On the contrary, the torment of despair is precisely this inability to die. Thus it has more in common with the situation of a mortally ill person when he lies struggling with death and yet cannot die. Thus to be sick unto death is to be unable to die, yet not as if there were hope of life; no, the hopelessness is that there is not even the ultimate hope, death. When death is the greatest danger, we hope for life; but when we learn to know the even greater danger, we hope for death. When the danger is so great that death becomes the hope, then despair is the hopelessness of not even being able to die.’

 

సరిగ్గా, ఈ స్థితినే ‘త్రిశంకు స్వర్గం’ లో బైరాగి చిత్రించారు. ‘రంగుల తోట’ అనే కవితలో, ఆయన ‘జీవిత జ్వరం’ అన్నది ఈ స్థితినే. Kierkegaard ‘నిస్పృహ’ – బైరాగి కవితలో ‘మెలకువ’ గా మారింది. ఆ మెలకువ – ఆ ‘స్వాప్నికసంయోగాల స్వేదదుర్భర జాగరణ’ – సర్వస్వం పొట్టబెట్టుకున్న రక్కసి.

 

ఈ కవితలో కేవలం psychological , spiritual torment  మాత్రమే లేదు. Mortality ఒక corporeal – visceral reality గా పరిణమించటమే కవిత ఇతివృత్తం. Kierkegaard అన్నట్లు అది – ‘to die dying, i.e., live to experience dying’.

 

‘జపాపుష్ప కాంతిలాగు, పచ్చిపుండు వాంతిలాగు

పసినెత్తురు కారుతున్న ఒక్క క్షణం!

చావు పుట్టుక బ్రతుకుల, విషమబాహు త్రిభుజంలో

మధ్యనున్న ఒక అదృశ్య బిందువులా

ఘనీభూత వాస్తవ కేంద్రీకరణం, ఒక్క క్షణం!’

 

Conscious selfhood ను పొందటమంటే ‘కంది కనలి కెంపెక్కిన ఒకే ఒక జ్వలితజీవిత క్షణం’ – ఆ epiphanic second – కోసం సంసిద్ధమవటం. కాని కేవలం ఇదే బైరాగి ఎరుక కాదు.

 

‘విసుగు! విసుగు!

కనులముందు విసుగులేని ఇసుకబయలు

జీవితపు శూన్యంపై ముసుగు విసుగు!

ఎంతకూరాని తుమ్ము, వెళ్ళిపోని వాంతి

కడుపులో త్రిప్పుతోంది విసుగు త్రేపు!

….

మెరసే నున్నని చర్మంపై ప్రాకే దురద విసుగు!

విసుగు! జీవితాల ముసుగు

 

‘This too shall pass.’ ఆ రక్తోజ్వల ముక్తిక్షణం తరువాత ఏమిటి? Tedium. Banality. Boredom. Ennui. ఇదీ బైరాగి దర్శనం.

 

Kierkegaard పుస్తకం బైబిల్ లోని Lazarus ప్రస్తావనతోటి మొదలవుతుంది. బైరాగికి intense reading of the scripture వల్ల ఆయా పురాగాథల connotative possibilities అర్థమైనాయని చెప్పవచ్చు (T. S.Eliot ‘The Love Song of J.Alfred Prufrock’ లో ఒక్కసారి Lazarus ప్రస్తావనొస్తుంది). బైరాగి మొత్తం రచనల్లో Lazarus ఒక central myth . బైరాగి లోని మరో ముఖ్య లక్షణం – a Modernist predilection for the mythic: Gulliver, Hamlet, Jesus, నహుషుడు, మార్కండేయుడు, ‘జగతీవిషసార పాయి(శివుడు)’ పదేపదే ప్రస్తావించబడతారు.

 

బైరాగి వాడే భాష గురించి కొంత చెప్పుకోవాలి. ఆయన శైలిలోని ఆసక్తికరమైన సమస్య గురించి ఆరుద్ర ఇలా అంటారు: ‘సరే, కల్తీలేని భారతీయ పద్ధతుల్లో వ్రాసే బైరాగి సంస్కృతపదభూయిష్టమైన మంచి కవిత్వం కూడా ఈ పండితులు గుర్తించరేం అని మధనపడ్డా.’ ప్రతి ప్రతిభావంతుడైన కవికీ తనదైన idiolect ఉంటుందని అనుకున్నా, బైరాగి భాషలోని సంస్కృతం పూర్తిగా క్లాసికల్ తెలుగుకావ్యాల సంస్కృతం కాదు. అలాగని సంస్కృతకావ్యాల లలితమృదుల సంస్కృతమూ కాదు. ఆయన, హిందీసాహిత్యంలో వాడే సంస్కృతపదాల కూర్పు వంటిది ఉపయోగించడం వల్లనూ, కఠిన శబ్దాలు – కర్ణపేయంగా అనిపించనివి – ఎన్నుకోవడం వల్లనూ పాఠకులు defamiliarization కి లోనవుతారు. పైగా, ఈ సంస్కృతం status-quoist కాదు. ‘Sanskrit cosmopolis’ (Sheldon Pollock) తాలూకు భాషా కాదు. ఆయన భాష సంస్కృతభాష లోనుంచి gothic, baroque  లక్షణాల్ని వెలికితీసి తయారుచేసుకున్న భాషనవచ్చు. అందుకే, ఆయన ‘దేవముఖ్యులు’ , ‘నవయుగ దైత్యులు’ లాంటి పదాల్ని వాడుతున్నప్పుడు, వాటిని మామూలు అర్థాల్లో వాడటంలేదనీ  , subvert చేస్తూ, problematize చేస్తూ ఉన్నారనీ తెలుస్తూంటుంది. ఇందుకు ఆధారాలు చాల కవితల్లో (‘రెండు క్రిస్మస్ గీతాలు’, ‘దైత్యదేశంలో గెలివర్’) కనిపిస్తాయి.

 

‘Beowulf’ epic ని గానం చేసిన అజ్ఞాత Anglo-Saxon కవులు సముద్రాన్ని whale-road అనీ, swan-road అనీ అన్నారు. మరీ అద్భుతంగా , శరీరాన్ని bone-house (banhus) అనగలిగిన ప్రజ్ఞ వారిది. ‘మేలుకొన్నవాడు’ అనే కవిత చివరలో –

 

‘విచ్ఛిన్న నైశసైన్యపు ప్రాణావశిష్ట భటుడు

అగ్రేసరుల ప్రథమ దూత,

ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు పై ఉదర్కపు ఊహోద్ఘటుడు.

 

అన్న పంక్తుల్లో శరీరాన్ని ‘ఎముకలూ , మాంసముతో నిర్మించిన, కూలే స్థితిలో ఉన్న సేతువు’ అన్నారు. దేహం – లేదా ఒక  highly dynamic visceral-corporeal presence – గురించి ఇంత potent metaphor బైరాగి కవిత్వ తపః ఫలం.

 

(1978 లో మరణించిన బైరాగి- వాడ్రేవు చినవీరభద్రుడు, కవులూరి గోపీచంద్ అనే ఇద్దరు యువకుల సాహిత్య   చర్చల్లో పునరుత్ధానం పొందాడు. వారిలాగే ’80ల్లో చాలామంది ఎవరికి వారే బైరాగిని rediscover చేసారని తెలుస్తోంది. బైరాగి కవిత్వం గురించి వీరభద్రుడిగారితో మాట్లాడుతూ rhapsodic trance లోకి వెళ్ళి, తిరిగి  మర్త్యలోకానికొచ్చాక రాసుకున్న యాత్రాచరితమే యిదంతా. కాబట్టి ఈ వ్యాసానికి authorship నిర్ణయించటం చాలా nebulous/dubious విషయం. బైరాగి సాహచర్యంలో నిదురలేని రాత్రులు గడిపిన వారందరిదీ.. యిది.)

 

– ఆదిత్య

Painting : Robert Matta, Untitled Drawing, 1938.
Download PDF

26 Comments

 • ఏక గవాక్ష విమర్శ,.. మెహర్ గారు కూడా అదే కిటికీలోంచే చూసినట్లున్నారు.

 • పూర్ణిమ says:

  “బైరాగి సాహచర్యంలో నిదురలేని రాత్రులు గడిపిన వారందరిదీ.. యిది.”

  Thanks for the article. I’ve been waiting to read something like this about Bairagi, because he saw me through many a nightmarish nights.

  Keep writing.

 • ఆదిత్య says:

  పాఠకులకు మనవి:

  1. చిన్న typographical error : వ్యాస శీర్షికలో comma లోపించింది.
  ” ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు: ‘The Visceral-Corporeal’ , బైరాగి కవిత్వం ” అని వుండాలి.
  ‘The Visceral-Corporeal’ ని విశేషణంలా వాడలేదు. ‘The Visceral-Corporeal’ అనే థీమ్ బైరాగి కవిత్వంలో ఏ విధంగా ‘చలిస్తుందో’ explore చేయడం వ్యాస ఉద్దేశం.

  2. పైన Kierkegaard పుస్తకంలోంచి relevant excerpt కి link వ్యాసంలో లేదు. A PDF of the excerpt can be accessed from this Scribd link:

  http://www.scribd.com/doc/214789088/KierkergaardSicknessUntoDeathExcerpt

  – వ్యాసకర్త

 • editor says:

  ఆదిత్య:

  పొరపాటుకు క్షమించాలి. శీర్షికలో మార్పు చేసాం. Kierkegaard లింక్ ఇచ్చినందుకు థాంక్స్!

  మీ నించి ఇల్లాంటి మరిన్ని రచనలు రావాలని కోరుకుంటున్నాం.

 • మళ్ళీ పూనుకుని చదవాలనిపించేంత ఆవేశం తెప్పిస్తోంది వ్యాసం.

 • రాజశేఖర్ గుదిబండి says:

  బైరాగిని మరింత లోతుగా చదివే అవకాశం కల్పిస్తున్న ఆదిత్య గారికి ధన్యవాదాలు..

 • Elanaaga says:

  ఆదిత్య గారూ!

  ఒక అద్భుతమైన వ్యాసాన్ని చదివిన అనుభూతి కలిగిందంటే నమ్మండి. ఆంగ్లాంధ్ర భాషల మీద మీకు మంచి పట్టు వుండటం అత్యంత శ్లాఘనీయం. శీర్షికలో కామా గురించి కూడా తపన చెందారు మీరు. అలా minutest details గురించి కూడా మధనపడే రచయితలు ఈ రోజుల్లో ఎంత మంది వుంటారు? Propriety ని చేకూర్చే భాష తాలూకు nuances పట్ల మీకు గల శ్రద్ధ చాలా అరుదైనది. అంతే కాక, బైరాగి కవిత్వం గురించిన లోతైన అవగాహన వుంది మీకు. అవగాహన ఉన్నా రాసే నైపుణ్యం అందరికీ వుండదు. మీలాంటి వారు ఇటువంటి మంచి వ్యాసాలను మరిన్నిటిని రాసి మా లాంటి వాళ్ల మేధా దాహాన్ని తీర్చవలసిందిగా కోరుతున్నాను. ఉన్నత స్థాయి వ్యాసాన్ని అందించిన మిమ్మల్నీ, ప్రచురించిన సంపాదకులనూ అభినందించకుండా వుండ లేను.

 • V.Ch.Veerabhadrudu says:

  ఆదిత్య, తెలుగులో ఇట్లాంటి వ్యాసం ఆశిస్తే దొరికేది కాదు. ఇది తెలుగుపాఠకుల అదృష్టం.

 • This is the kind of analysis I was waiting for. I always thought I belonged to a secret club of people who discovered Bairagi. His two books were the the part of 10 books I got with me when I moved to the US in the 80s. After moving to the west, I read Eliot (spent an year studying Waste Land and following footnotes), and Kierkegaard. If any Bairagi has impeccable taste in books and poetry. He was my guide to the world literature as well.

  I am glad to see this essay. I was commenting about the essay by Ravinutala, and I feel all the questions I was asking are discussed here. For the reference, here is my comment about that review:

  It is easy to say that he is a lover of humanism — but his poems show lot of the same turmoil that 30’s and 40’s have brought into the world. Somehow, not much analysis of that.

  — HERE WAS MY COMMENT ABOUT SOME OTHER REVIEW, WHICH THIS REVIEW ANSWERS QUITE A BIT —
  Specifically, I would like to see the analysis along the lines of the following:

  1. Bairagi draws influences from different modern philosophers. Who and how? For example, look at his translations — almost all of them are heavily influenced by philosophy (not just say economic philosophy, which are popular in India, but existential, christian spiritual and so on).

  2. His motifs are peculiarly non-telugu. His recurring themes (lazarus etc) are from purely the modern poetic traditions of the west. How does that square with his drawing of other motifs from sanskrit works?

  3. His word usage is very non-standard for Telugu. His sanskrit word usage is almost similar to Hindi people (based on my very limited exposure). How did it complicate his Telugu poetry?

  4. His expressions including visishTaa dwaitam, all of them come from an angle that most people do not see even before or after. Who is closest to him in his POV, among other Telugu poets?

  5. It pains me to say this, but Bairagi is probably has some clinical issues of depression. How does his poetry portend this?

  It is easy to call him a modern poet — in lot of ways, how the west defined modernity is what we see in his poetry. The definition of “abhyudaya” however, is a bit skewed and it lets most poets be clubbed under that definition.

  —– END OF MY COMMENT ABOUT SOME OTHER REVIEW—

  Thank you for the analysis.

 • నా యువ మిత్రుడు 22 ఏళ్ల ఆదిత్య ఈ మధ్యనే B.Tech పూర్తి చేసాడు . ఇప్పుడు అతను MA , English చేస్తున్నాడు . తెలుగు సాహిత్యం , ఆ మాటకొస్తే ప్రపంచ సాహిత్యం , కళలు అన్నీ అతనికి నిత్య స్నేహితులు . స్నేహితులు అంటే చిన్న మాటే . ప్రాణం . ఎప్పుడు చదువుతాడో , ఎట్లా చదువుతాడో తెలియదు కానీ కొంత మంది గొప్ప స్కాలర్స్ కు కూడా తెలియని ప్రపంచ రచనలేన్నిటినో చదివాడు, చదువుతున్నాడు . కేవలం చదవడమే కాదు ప్రాచీన సాహిత్యాన్ని , ఆధునిక సాహిత్యాన్ని, ఆధునికానంతర సాహిత్యాన్ని పోల్చుకుంటూ ఎవరూ చూడని కోణంలో విమర్శనాత్మకంగా , ప్రశంషపూర్వకంగా చూస్తాడు . కలువరిస్తాడు , పలవరిస్తాడు . ఎవరికో చెప్పడానికో అతను ఈ వ్యాపకాన్ని ఎంచుకోలేదు . అలా దానితో తాదాత్మ్యం చెందుతూ కొత్త లోకాల్ని చూస్తూ enjoy చేయడానికే .

  తెలుగు కవి బైరాగి అంటే అతనికి అతని ప్రాణం కంటే మిన్న అన్న అభిప్రాయమైతే నాకు కల్గింది . బైరాగి మొత్తం కవిత్వాన్ని అతను పుస్తకం చూడకుండా అలా చదువుతుంటే, విశ్లేషిస్తుంటే మనల్ని కూడా ఎదో తెలియని తరంగాలు ఆవహిస్తాయి . ఒకరోజు మా ఇంటికి వచ్చినపుడు తన జీవిత లక్ష్యాలలో ఒకటి బైరాగి పుస్తకాలని ఏ తప్పులు లేకుండా , మంచి ప్రింటింగ్ తో అద్భుతమైన పుస్తకాలుగా సొంత ఖర్చుతో తేవాలని అంటే ఈ యువ మిత్రుడుని చూసి నేనూ , మా అరుణ ఆశ్చర్యపోయాం . ఒక కోణంలో చూస్తే , ఇట్లాంటి సునిశిత విమర్శనాత్మక అభిమానిని ఒక్కడిని సంపాదించుకోవడం అంటే లక్ష మంది readers ని సంపాదించుకోవడంతో సమానం అని అనిపిస్తది . ఆ విధంగా బైరాగి అదృష్టవంతుడు అని అంటే తప్పు కాదేమో .

  రేపు హైదరాబాద్ లో రిలీజ్ కాబోతున్న వాడ్రేవు చినవీరభద్రుడు గారి కవిత్వ పుస్తకం ” నీటి రంగుల చిత్రం ” చివరి పేజీలో అతను కవిని ఇంటర్వ్యూ చేసిన విధానం ద్వారా తెలుస్తుంది ప్రపంచ , భారతీయ , తెలుగు సాహిత్యలపై అతని సాధికారత, విశ్లేషణ, ప్రేమ . అతను తన మొదటి రచనగా సారంగ లో బైరాగి గురించి రాసిన ఈ రచనను చదివి చెప్పండి మీ అభిప్రాయం . ఇప్పటి Globalization కాలంలో యువకులంతా సహజంగానే అందరూ Technical, MNC , Carporate sector ల వైపు చూస్తున్న ఈ కాలంలో, 30 ఏళ్ల లోపు యువకులు వాళ్ళంతట వాళ్ళు బుక్స్ కొని సాహిత్యాన్ని చదివే వాళ్ళని కానీ , తమంతట తాముగా ఏదైనా సాహిత్య మీటింగ్స్ లకు వచ్చే వారు గానీ లేని ఈ career కాలంలో, ఆదిత్య రేపటి సాహిత్య లోకంలోకానికి ఒక ఆశాకిరణం . Adityaa , All the best .

 • ఓ పట్టాన అర్దమయిచావని, ఎందుకు రాస్తారో తెలియని అకాడమిక్ పోయెట్రీ jargon, సాధారణ పాఠకుడిగా బైరాగి అంటేనే ఎవరో పెద్దగా తెలీనపుడు ఆయనది ఒకానొక కవిత చదువుతుంటే ఇంకా అస్సలు తెలిసే అవకాశంలేని ఎవరో Roberto Bolano రాసింది ఎలా *స్ఫురిస్తుంది* ? అనుకొని కొట్టిపారేశాను. వేరేచోట వ్యాసకర్త నేపధ్యం కొంత తెలిసి (విశ్లేషణను అభినందించడానికి ఇది అవసరం లేదనుకోండి కాని ఆసక్తినైతే కలిగించింది) ఆశ్చర్యపోయి మళ్ళీ మళ్ళీ చదివాను… honestly పూర్తిగా అర్దమవలేదు కాని వ్యాసకర్త passion అవగతమైంది, పైగా ఎప్పుడూ కనిపించే వాటిలా ఇదో మూస ప్రెజెంటేషన్ కాదని తెలిసింది… one rarely comes across things which require higher understanding about them. I feel that this is one such post.
  Expecting more from you, రాస్తూండండి ఆదిత్యా.

 • విచ్ఛిన్న నైశసైన్యపు ప్రాణావశిష్ట భటుడు

  అగ్రేసరుల ప్రథమ దూత,

  ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు పై ఉదర్కపు ఊహోద్ఘటుడు.’ దీనిలో ప్రతిపదానికి అర్థాన్ని,. మెుత్తంమ్మీద కవి భావాన్ని వీలైతే వివరిస్తారా,..

 • అద్భుతమైన అనుభవం వచ్చింది ఈ విమర్శ చదువుతుంటే.బైరాగి తెలియదు నాకు కాని వైతరణి లో ఈది స్పృహ పోయినట్లుంది.ఆదిత్య కీప్ ఇట్ అప్.బైరాగి ని మళ్లీ చదువుతాను

 • అరుదుగా మాట్లాడబడే కవి / రచయిత గురించి అరుదైన పరిచయం చాలా బావుంది. ఆగమగీతి చదువుకుంటూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలీదు. బైరాగి వచనం కూడా కవిత్వమే. ఒక్కో వాక్యమూ తిరిగి తిరిగి చదువుకుంటేనే గానీ తనివి తీరదు. (ఇలా వచనం లో కవిత్వం కరిగి హొయలు పోయేది మళ్ళీ చినవీరభద్రుడి గారి దగ్గరే నాకు తెలిసినంతలో )

  ‘నీతో ఒకటి చెప్పలేదు-/నా రంగుల తోటలోకి అప్పుడప్పుడు నిన్ను తప్ప/ ఎవ్వరినీ రానివ్వను’ అని నన్నుదేశించి రాసారనే అనుకుంటూవుంటాను. – – నేనూ అలానే అనుకుంటాను.
  @@బైరాగి సాహచర్యంలో నిదురలేని రాత్రులు గడిపిన వారందరిదీ.. యిది
  :-) థాంక్ యు.

 • 1978 లో మరణించిన బైరాగి- వాడ్రేవు చినవీరభద్రుడు, కవులూరి గోపీచంద్ అనే ఇద్దరు యువకుల సాహిత్య చర్చల్లో పునరుత్ధానం పొందాడు, ……… దీనిని మీరెలా నిర్థారిస్తారు. అంటే వారి చర్చల కారణంగా ఆయన కవిగా బతికాడని మీ ఉద్ధేశ్యమా,.., ఆగమగీతి రూపొందించడంలో కాని, సాహిత్యఅకాడమీ అవార్డు విషయంలో వీరు ఏమైనా కృషిచేసారా,. వీలైతే వివరిస్తారనుకుంటాను.,,. ( పూర్తిగా తెలుగులో వుంటే,, నాలా ఇంగ్లీషు అర్థం కాని వారికి కాస్తా సౌలభ్యంగా వుంటుందేమో,. ఆలోచించగలరు.)

  • ఆదిత్య says:

   భాస్కర్ గారు,

   వారు (ఆ ఇద్దరు వ్యక్తులు) ఆగమగీతి రూపొందించడానికి గానీ, ఆయనకి అకాడెమి అవార్డు రావడానికి కృషి చేయటం చేయకపోవటం ఇక్కడ ప్రధానం కాదు. మీకు తెలిసే వుంటుంది. బైరాగి కుటుంబ సభ్యులే ఆగమగీతి సంకలనం చేసి ప్రచురించారు. ఇక నేను చెప్పిన వ్యక్తులే ముఖ్యులు అని నా ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. ఇక్కడ comment చేసిన కన్నెగంటి రామారావు గారు, అంబటి సురేంద్రరాజు గారు- ఇలా చాలామందే 80 ల్లో బైరాగి ‘పోల్చుకున్నారు’. మీరు కూడా ఇంచు మించుగా ఆ కాలం లోనే వీరిని కనుగొనివుండ వచ్చు. ఇద్దరు యువకులు – వారెవారైనాగని – ఒక అద్భుతమైన కవిని discover చేసినపుడు వారు పొందే excitement లో ఒక స్వచ్ఛమైన authenticity వుంటుంది. అది సూచించడానికే రెండు పేర్లు చెప్పాను. చినవీరభద్రుడు గారు 1996లో బైరాగి గురించి ప్రామాణికమైన , మౌలిక ప్రతిపాదనలు గల వ్యాసాన్ని రాసారు. అది వారి ‘సహృదయునికి ప్రేమలేఖలో లభ్యం.

   English గురించి: వ్యాసం రాస్తూన్నంత సేపూ , ఇంగ్లీష్ పదాలు అతి తక్కువ గా వుంచుదామనే చాల ప్రయత్నం చేసాను. నిజానికి , వాటికి సరైన equivalents దొరికి వుండి వుంటే అవే వాడే వాడిని. Literary critical terminology , Western academia లో చాల తొందరగా standardise అయిపోతుంది. తెలుగు లో బలహీనమైన అనువాదం చేసి , ఆ మాటల్ని ఉపయోగించడం కంటే – ఆయా మాటల అర్థచ్చాయలని యథాతధంగా ఉంచగలగటానికి నేను అనుసరించిన మార్గం తప్ప వేరే మార్గం తోచలేదు. Neologisms ని పేరుస్తూ వుంటే వ్యాసం మీద అనవసర భారం తప్ప అదనంగా ఏ ఉపయోగమూ లేదు.

   Shakespeare criticism అంటే మొదట్లో character criticism మాత్రమే. అంటే, Macbeth , Lear, Hamlet, Desdemona ల పాత్ర చిత్రణ ని విశ్లేషించడమే ఆ ధోరణి లక్ష్యం. తరువాతి కాలంలో, Feminist, Post-colonial, Structuralist, Post-structuralist పద్ధతుల్లో చదవడం జరిగింది. అది Shakespeare ని అపార్థం చేసుకోవడం ఎంత మాత్రమూ కాదు. ‘లేని’ అర్థాల్ని ఆపాదించడమూ కాదు.

   నేను ఈ వ్యాసంలో వాడిన విమర్శనా సామగ్రి చాల ప్రాథమిక మైంది.

   వ్యాసం చదవటానికి కష్టంగా వుందనేదే మీ అభిప్రాయమైతే , పాఠకుడిగా మీరు చేయ వలసిన శ్రమ కొంత వుంటుంది. (Dictionaries , Literary Criticism and Theory మీద అవగాహన కల్పించే సాధనాలు, పుస్తకాలు ఇంటర్నెట్లో చాలా వరకు దొరుకుతున్నాయి.)

   నేను బైరాగి ని అపార్థం చేసుకున్నాను అనేదే మీ అభిప్రాయమైతే, నా అజ్ఞానాన్ని నేను ఒప్పుకుంటున్నాను. క్షమించండి.

   విమర్శకుడికి అవసరమైన ముఖ్య లక్షణం – empathy . అది విమర్శ చదివే పాఠకుడి కి కూడా అవసరం.

   • ఆదిత్య గారు,
    :) , అయ్యో , మీ యొక్క ప్రతిభ గురించి కాని,.. జ్ఞానం గురించి కాని మాట్లాడేంత సాహిత్య విషయపరిజ్ఞానం నాకేమి లేదండి,. ఓ రెండేళ్లనుంచి సరదాగా ఏవో కొన్ని వాక్యాలు రాసుకుని కవిత్వమని భ్రమపడే స్థాయి నాది. నేను విమర్శకుడిని అంతకన్నా కాదు (ప్రశ్రించడం విమర్శకోసం కాదు, అర్థం చేసుకునే లేదా నేర్చుకునే ప్రయత్నంలో భాగమేనని నేననుకొంటాను.) కాని ఓ ప్రముఖ కవి విషయంలో పునరత్ధానం అనే మాట నా కున్న చిన్న పరిధిలో సబబుగా అనిపించలేదు.(మీకున్న విస్తృత ఆలోచనా దృష్ట్యా అది సరైనదే అయితే నేనా స్థాయిలో లేననుకుంటాను) , ఎవరికివారు కవిని రీ డిస్కవర్ చేయడంలో నాకేమి అభ్యంతరమూ లేదు. కాస్తో కూస్తో శ్రమపడినా కూడా, మీ ప్రాథమిక స్థాయి పదజాలాన్ని అర్థం చేసుకోలేకపోయానంటే, నా అజ్ఞానం నాకు మరింతగా అర్థమవుతుంది,.ధన్యవాదాలు చెప్పుకోవాలి మీకు ఆ విషయంలో.

    ఇక పోతే బైరాగి గారు వారి కవితలకు ఎవరైన భాష్యం చెప్పడాన్ని పెద్దగా సహించేవారు కాదని, ఆ కారణంగానే నూతిలో గొంతుకలు సంపుటికి ఆయనే ముందు మాట రాసుకున్నారని చదివాను.
    బైరాగి అభిప్రాయానుసారం ఏ కావ్యానికైనా భాష్యం అనేది అవసరము లేదు. సామాన్యంగా ప్రతి రచనా స్వతఃశ్సిద్ధం. దానికి భాష్యకారుని చేయూత అనవసరం. భాష్యకారుడు (వ్యాఖ్యాత) అపరిణత బద్ధులైన పాఠకులకు సహాయకారి కావచ్చు, సాధారణార్థాలు బోధించ వచ్చు, ఆ ప్రయత్నంలో అప్పుడప్పుడూ కావ్యం లోని మసృణత్వాన్ని (సున్నిత భావాన్ని) లేదా మనోహరత్వాన్ని చెరచే అవకాశం కూడా లేక పోలేదు. అతి సున్నితంగా వ్రేలిడవలసిన చోట రసాభాస చేసి కూర్చొంటాడు! ( ఇది మీరు చదివేవుంటారనుకుంటాను)

    ఇమేజింగ్ ప్రక్రియను, అధివాస్తవికతను, సైకాలజీ ని తెలుగు కవిత్వంలో నారాయణ బాబుగారు ఎక్కువగా వాడారనుకుంటాను., వీరి ప్రభావం కొంత బైరాగి గారి కవిత్వంలో కనిపిస్తుందంటారు. వీరి పుస్తకం రుధిరజ్వాల 1975 వరకు అచ్చుకు నోచుకోలేదు, చాలా కారణాలవల్ల.

    బైరాగి గారి జీవితం, కవిత్వం ఒక ప్రత్యేకమైన తాత్వికతతో వుంటాయనిపిస్తుంది. వారి జీవన విధానాన్ని గమనించినా, కవిత్వాన్ని తరచి చూసినా,. 1955 తరువాత వారి కవిత్వం ఎక్కువగా ప్రచురితమైనట్లు కనబడదు. వారు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు చీకటినీడలు ముద్రణ పూర్తైన, అది వారు చనిపోయిన తరువాతనే బయటకు వచ్చినట్లనిపిస్తుంది. కవర్ పేజి చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఈ కవితలను బహుశా ఎన్నిక చేసింది బైరాగి గారే. వాటి భాష కాని, వస్తువు కాని చాలా సరళంగానే వుంటాయి. లాజరస్ ప్రస్తావన ఈ 21 కవితల్లో ఎక్కడా కనబడదనుకుంటాను.

    ఆయనెంత సరళంగా జీవించారో,. ఆయన కవిత్వంలో కూడా అదే స్థాయి సరళత్వం, ఆయన జీవితం నాకు కనిపిస్తాయి., బహుశా పాశ్చత్వ తత్వవేత్తల పేర్లుకాని,,మీరు చెప్పే గొప్పవిషయాల పట్ల నాకు అవగాహన లేక పోవడం వలన కావచ్చు.., పత్తిపాడు లో ఆయన ఉపాద్యాయుడిగా, పేదల పిల్లలకు చేసిన సహాయాలు, పేదల కష్టాలతో వారి మమేకం కావడంకాని, చెన్నై లో నారాయణబాబు గారి సహవాసం లోకాని, వారి జీవన విధానంలో కాని నాకో ప్రత్యేకమైన తాత్విక భూమిక కనిపిస్తుంది. అదే నాకు వారి కవిత్వంలోను కనిపిస్తుంది. నాకు ఆయనంటే అభిమానానికి ముఖ్యమైన కారణం వారి జీవితమే.

    నూతిలో గొంతుకలు ఒక సంశయ కావ్యంగా చెబుతారు, బైరాగి గారు. (వారి ముందు మాట నుంచే ఈ విషయాలను తీసుకోవడం జరిగింది). ఇది అనంతమైన ఆవేదనలతో అంతమైన జీవితలను చర్చిస్తుంది. వీటిలోని నాయకులు హామ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్ సందిగ్ధావస్థలో ఒక క్రమబద్ధమైన పరిణామాన్ని సూచిస్తున్నారు. ఉదాహరణకు హామ్లెట్ వేదన కర్మ పూర్వం. అర్జునుడి వేదన కర్మ క్షేత్రంలో తక్షణికం, రాస్కల్నికోవ్ బాధ కర్మ తర్వాత. అది మానవుని సహజ వేదన. అది అతన్ని త్రికాలాల్లోను వెంటాడు తుంది. ఆ బాధలలో మధన పడనివాడు పూర్ణత్వాన్ని అందుకో లేడు. ఆ బాధనుండి అతడు తప్పుకొనే మార్గం లేదా అంటే ఉంది. పలాయనం, కృతక శక్తుల పూజనం, ఆత్మ హననం”. ఈ కావ్యంలో నేను అంటే కవి కాదు. నేనీ మానవుని అనుభూతిలో అధికః తాదాత్మ్యం. స్వీయ బాధ వెలువరించడం కవి పరమావధి కాదు. ప్రపంచం తో ఏకమైన నాడే కవికంఠం సరిగ్గా పలుక గలుగుతుందని నా నమ్మకం” అని .

    ఇక ఆయన వాడిన భాష గురించి, తీవ్రమైన వేదన కాని,. మానవతావాది అయిన బైరాగి కవితల్లో క్రీస్తు,శివుడు వాటి ఆస్థిక ప్రస్తావనలను కాని,. ఆయన జీవితపు ( తోటి ప్రజల) నిస్పృహలు, అసంతృప్తులు, వేదనలు, బాధలు, కష్టాలు, ఏకాకి తనం నుంచి కూడా చూడగలిగితే, అది ఓ నిజమైన అభ్యుదయ కవికి పరిపూర్ణతను ఇస్తుదమోననే ఓ చిన్న ఉబలాటం తప్పితే,. వేరే ఉద్దేశ్యాలు కూడా నాకేం లేవు.

    తొలి విమర్శావ్యాసం తోటే వీరభద్రుడు వంటి పెద్దలతోనే, తెలుగు ప్రజల అదృష్టం ఈ వ్యాసం అనిపించుకున్న, మీలాంటి విజ్ఞానఖనిని కొన్ని సందేహాలను నివృత్తి కోసం అడగడమే తప్పైతే, నా లాంటి ఓ మూడుడి అల్పత్వాన్ని క్షమిస్తారని ఆశిస్తాను.

 • Thirupalu says:

  ఏమైనా భైరాగి మీ ద అద్బుతమైన చర్చ కొన సాగటం ఆనందంగా ఉంది. అంత కంటే అమితోత్సవంగా ఉంది. 1980 ప్రాంతములో అనుకుంటాను ఆయన ఆగమ గీతి పుస్తకాన్ని చెన్నయ్‌ సైదాపేట సాహితీ మిత్రులు పెరిట ప్రచురించి నప్పుడు నాకు తెలిసీ తెలియని తెలుగుతో ఆ పుస్తకాన్ని అరువు తెచ్చుకొని అపురూపంగా అమితోత్సముతో చదివాను (నూతిలో గొంతుకలు కూడా) అప్పటికి ఏమి అర్ధమైందో నాకు తెలియదు కాని శ్రీ శ్రీ కవిత్వ ప్రభావాం తోనే చదవడం జరింది. కొద్దొ గొప్పో అర్దం చేసుకునే స్తాయికి వచేటప్పటికి ఆయన పుస్తకాలేవి చెన్నై లో దొరకలేదు. ఆ తరువాత సమీక్ష వ్యాసాలో లేక విశ్లేషనా వ్యాసాల్లోనో బైరాగిని చూసి ఆయన అభ్యుదయ కవి అవునా కాదా చర్చా చేశారెవరో. ఆయన ‘ నాక్కొంచం నమ్మకమివ్వు ‘ అనే కవితా ద్వారా ఆయన ఆయాన సందిగ్ద కవి అని ఆయనకు అభ్యుదయమీద కూడా నమ్మక లేదణీ ‘ దుర్గమాంద మృత్యు శిఖరమ్మిద ప్రానోదయ విజయ కేతువునెగురేద్దాం రండి రారండి’ అని పిలిసినా ఆయనకు అభ్యు దయ లక్ష్నాలు లేవని రాయగా చదివాము.
  ఆధిత్య గారి విశ్లెషన బాగున్నా ఆయన రాసిన ఆధుని శ్లి ష్ట వ్యాహరికం ఏ పాఠకులను దృష్టిలో పెట్టుకొని రాశారో అర్ధం మయుతుంది. ఏ రచయిత అయినా వారి శైలే వారి పాఠకుల్ని నిర్ణయిస్తుంది.

 • కె. కె. రామయ్య says:

  రావెల్ల సోమయ్య గారికి, వాడ్రేవు చిన వీరభద్రుడు గారికి నమస్కరిస్తూ ~ అద్భుతమైన యీ వ్యాసం ద్వారా, సారంగ సాహిత్య చర్చల్లో బైరాగి పునరుద్ధానం కల్పిస్తున్న ఆదిత్య కి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ~ తన నుండి మరిన్ని ఆశిస్తూ

  “ ఉపాద్యాయుడిగా, పేదల పిల్లలకు చేసిన సహాయాలు, పేదల కష్టాలతో వారి మమేకం కావడంకాని, చెన్నై లో నారాయణబాబు గారి సహవాసం లో కాని, వారి జీవన విధానంలో కాని నాకో ప్రత్యేకమైన తాత్విక భూమిక కనిపిస్తుంది. అదే నాకు వారి కవిత్వంలోను కనిపిస్తుంది. నాకు ఆయనంటే అభిమానానికి ముఖ్యమైన కారణం వారి జీవితమే. “

  “ మానవతావాది అయిన బైరాగి నిస్పృహలు, అసంతృప్తులు, వేదనలు, బాధలు, కష్టాలు, ఏకాకి తనం “ గురించి ప్రస్థావించిన కొండ్రెడ్డి భాస్కర్ గారూ, తెనాలిలో బైరాగి గారు ఉండే చిన్న గది సాహిత్య గ్రంధాలతో నిండి ఉండేదని విన్నాము. విషయ పరిధిని పెంచుతూ మీరిచ్చిన వివరణలకు కృతజ్ఞతలు. ఆదిత్య లాంటి ప్రతిభావంతుడికి మీలాంటి వారి అండ అవసరo సుమా.

  “ కత్తిరించిన వత్తులే వెలుగుతాయి దివ్యంగా / బాధాధగ్ద కంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా “
  బైరాగి వాక్యాలని స్మరించుకుంటూ

 • Meher says:

  భాస్కర్ గారు ఇక్కడ ఈ వ్యాసంలో ఉన్నవి భాష్యాలు కావు. గమనింపులు, పరికింపులు. అటుపిమ్మట సదరు పాఠకుని పలవరింపులు. భాష్యం కనపడితే మళ్లీ మీకు వ్యాసం అర్థం కాలేదనే అనుకోవాలి. వ్యాసం చెప్తున్నది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించకనే మీరు ఎందుకు బైరాగి మీద మీ అవగాహనను/ పాఠకునిగా మీ దృక్కోణాన్ని ప్రమాణికంగా నిర్ధారించి మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. మీ మాటలు వింటే ఈ వ్యాసంలో పేర్కొన్న ఊటంకింపే మళ్లీ గుర్తొస్తుంది:

  “ఒక్కోసారి పాఠకులుగా మనం కొందరు రచయితలు మన సొంతమనే భావన కలిగి ఉంటాం. వాళ్లను కనుగొన్నది మనమే, వాళ్లు రాసేది మన కోసమే. మిగతా ప్రపంచమంతా కూడా వాళ్ల గురించి తెలుసుకున్నప్పుడు, వారి పుటల్లోని మంత్రజాలం నాశనమవుతుంది, మనం దోపిడీకి గురైన భావన కలుగుతుంది.”

  బైరాగి విషయంలో మీకీ సొంతమనే భావన ఉన్నట్టయితే బైరాగి అదృష్టవంతుడే. కానీ మీ దృక్కోణం సార్వజనీనం చేయాలనే ప్రయత్నాలూ, వేరే దృక్కోణాల ఉనికిని అంగీకరించలేని వెటకారాలూ అనవసరం.

  బైరాగిని ఎవరో రీడిస్కవర్ చేశారంటున్న ఆ పాదసూచితో మీకున్న ఇబ్బంది పెద్ద పట్టించుకోవాల్సిందా? సరే ఎవరూ రీడిస్కవర్ చేయలేదు. He is always in vogue. Big deal? మంచిదే కదా పైగా.

  కవిత్వం వెనుక, అసలు ఏ రచన వెనుక ఐనా, బయటి ప్రేరణలు ఎన్ని ఉన్నా, అల్టిమేట్ గా కవిత్వం పుట్టాల్సింది కవి అంతరంగం నుంచి. అంతరంగం పైని ప్రభావాలు ఎంత లోతుగా ఉంటాయో కవి కాబట్టి మీకు నేను చెప్పనక్కర్లేదు. బైరాగి అంతరంగంపై “పత్తిపాడు లో ఆయన ఉపాద్యాయుడిగా, పేదల పిల్లలకు చేసిన సహాయాలు, పేదల కష్టాలతో వారి మమేకం కావడంకాని, చెన్నై లో నారాయణబాబు గారి సహవాసం” వీటి ప్రభావాలు ఉంటే ఉండొచ్చు. కానీ అవి ఆయన చేత కవిత్వాన్ని రాయించేంత బలమైనవీ అని మీరంటే, మీరు బైరాగిని ఆయన కవితల్లో కాక, ఆయన గురించి ఎవరో రాసిన బయోగ్రాఫికల్ అకౌంట్లలో వెతుక్కుంటున్నారని అనుకోవాల్సి వస్తుంది. అంతే కాదు, కవిత్వం పుట్టే కవి అంతరంగపు లోతులు మీకు చాలా shallow గా అనిపిస్తున్నాయని కూడా తెలుస్తోంది. కవి దొరికేది అతని గురించి రాసిన జీవిత చరిత్రల్లోనో, స్మారకసంచికల వ్యాసాల్లోనో కాదు. కవి అతని కవితల్లోనే దొరుకుతాడు. అతని కవిత్వం మీద బాహ్య జీవిత ప్రభావాలు ఉండొచ్చు. కానీ కవిత్వం పుట్టేది ఆ బాహ్య జీవితం తాకే తలం కన్నా ఇంకా లోతైన చీకటి ప్రాంతం నుంచి. ఆ చీకటిలో బాహ్య జీవిత ప్రభావాలు కూడా వింత వింత రూపాంతరాలు పొందుతాయి. ఆ చీకటిపై కవికే అవగాహన ఉండదు. అసలు ఆ చీకటిని విచ్చలుదీసుకుని చూసేందుకు చేసే ప్రయత్నాలే అతని కవిత్వపు మూలాలు కావొచ్చు. ముఖ్యంగా బైరాగి లాంటి కవి విషయంలో అదింకా నిజం. (ఇక్కడ చీకటి అంటే తెలియనిది అన్న అర్థంలో వాడాను.)

  పూర్వం ఫ్రాన్సులో Sainte-Beuve అని ఒక విమర్శకుడు ఉండేవాడు. రచయిత రచనల్ని అర్థం చేసుకోవాలంటే ముందు రచయిత బయోగ్రఫీ అర్థం చేసుకోవాలి అన్నది ఆయన సిద్ధాంతం. ఆయన రాజ్యం చాన్నాళ్లు చెల్లుబాటైంది. రచయిత ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, అప్పటి సామాజిక రాజకీయ వాతావరణం ఎలా ఉంది, ఏయే సాహిత్యధోరణుల ప్రభావం అతనిపై ఉందీ ఇవన్నీ రచయితని నిర్వచించేందుకు చాలా ముఖ్యమైన కొలబద్ధలుగా పెట్టుకుని ఆయన చేసే విమర్శ చాన్నాళ్లు నడిచింది. కొన్నాళ్లకి అక్కడ Marcel Proust అనే రచయిత రాయటం మొదలుపెట్టాడు. ఆయన Contre Sainte-Beuve (“Sainte-Beuve కి వ్యతిరేకంగా”) అని పేరుపెట్టి వరస వ్యాసాలు రాశాడు. కలంతో కాగితంపై పంక్తులు రాస్తున్నప్పుడు పని చేసే కవి అంతరంగం అతను సామాజికునిగా ప్రవర్తిస్తున్నప్పుడు బయటపడే స్వభావం కన్నా చాలా భిన్నంగా ఉంటుందనీ, దాని మూలాలు చాలా లోతుల్లోంచి వస్తాయనీ ఆయన అంటాడు. ఆ వ్యాసాల్లో ఆయన దర్శించిన, దర్శింపజేసిన సత్యంతో ఇక ఎన్నడూ మళ్లీ Sainte-Beuve రకం విమర్శ చెల్లుబాటు కాలేదు.

  ఒకచోట Proust ఇలా రాస్తాడు:—

  At no time does Sainte-Beuve seem to have grasped what is peculiar to inspiration or the activity of writing, and what marks it off totally from the occupations of other men and the other occupations of the writer. He drew no dividing line between the occupation of writing, in which, in solitude and suppressing those words which belong as much to others as to ourselves, and with which, even when alone, we judge things without being ourselves, we come face to face once more with ourselves, and seek to hear and to render the true sound of our hearts – and conversation!

  It is only the deceptive appearance of the image here which lends something vaguer and more external to the writer’s craft and something deeper and more contemplative to sociability. In actual fact what one gives to the public is what one has written when alone, for oneself, it is very much the work of one’s self… What one gives to sociability, that is to conversation (however refined it may be, and the most refined is the worst of all, because it falsifies our spiritual life by associating itself to it: Flaubert’s conversations with his niece or with the clockmaker are without risk) or to those productions intended for one’s intimates, that is to say reduced so as to appeal to a few and which are barely more than written conversation, is the work of a far more external self, not of the deep self which is only to be found by disregarding other people and the self that knows other people, the self that has been waiting while one was with others, which one feels clearly to be the only real self, for which alone artists end by living, like a god whom they leave less and less and to whom they have sacrificed a life that serves only to do him honour.

  కవి సామాజిక పార్శ్వం తెలియటానికి మనం జీవిత చరిత్రలు చదివితే చాలు. అవి చదివి కవి గురించి మనకేదో తెలుసని మాట్లాడటం సులభం. కానీ కవిత్వ పంక్తుల మధ్య ఖాళీల్లో దొరికే కవిని పట్టుకోవటం అంత సులభం కాదు. అక్కడ మీకు ఎలాంటి చారిత్రక జీవితచారిత్రాత్మక సాక్ష్యాలూ ఋజువులూ సాయపడవు. పంక్తుల మెట్ల మీదుగా ఆ పంక్తుల మధ్య శూన్యంలోకి దిగుతూ అక్కడ వ్యక్తావ్యక్తంగా వెలిగే కవి అంతరంగాన్ని పసిగట్టడం కష్టం, దాన్ని గురించి సాధికారికంగా ఏవో రెండు ముక్కలైనా మాట్లాడటం ఇంకా కష్టం. మీకు ఆయన జీవితం గురించి ఏమి తెలుసు? ఏం తెలిసినా అది వేరే వారి మాటల ద్వారానే కదా. స్వయంగా ఆయన పంక్తులు మాట్లాడే దానికన్నా, ఆయన గురించి మీకందిన సెకండరీ అకౌంట్లనే మీరు ప్రామాణికంగా భావిస్తున్నారంటే, అది ఇక మీ ఇష్టమనే చెప్పాలి. “కేక”లో శ్రీశ్రీ “నిద్రకు వెలియై నే నొంటరినై” పడుతున్న బాధ స్వభావం తెలియాలంటే మీరు వెతకాల్సింది శ్రీశ్రీ గురించి అబ్బూరి వరదరాజేశ్వర్రావు రాసిందాన్లోనో, లేదా శ్రీశ్రీ మార్క్సిస్టు ఇనిషియేషన్ గురించి కుప్పలు తెప్పలుగా వచ్చిన వ్యాసాల్లోనో కాదు, ఆ “కేక” అనే కవిత తాలూకు textలోనే. అది మీతో మాట్లాడే నిజమే మీ వరకూ నిజం. ఈ ప్రపంచంలో ఏదైనా చివరకు “మన వరకూ నిజం” మాత్రమే అన్నదే మనకు ఎప్పటికైనా నికరంగా తెలిసే నిజం.

  నూతిలో గొంతుకల్లో హామ్లెట్, అర్జుడు, రస్కాల్నికోవ్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ ముగ్గురి మధ్యా ఒక సంబంధాన్ని చూడగల్గిన బైరాగి అంతరంగాన్ని గురించి? అసలు వాటిని ఎంపిక చేసుకోవటంలో బైరాగికున్న కారణాన్ని గురించి? అది మీకు ఎక్కడో దొరకదు, నూతిలో గొంతుకల్లోనే వ్యక్తావ్యక్తంగా ఉంటుంది. దాని గురించి ఏమైనా మాట్లాడాలంటే, మీరు “నారాయణబాబు, అధివాస్తవికత, ప్రత్తిపాడులో బైరాగి ఉద్యోగం, పేదపిల్లలకు ఆయన చేసిన సాయం…” వీటి గురించి మాట్లాడితే కాదు. నూతిలో గొంతుకలు కావ్యంలో మెటఫొర్లు చేసున్న పని, అక్కడ పదే పదే వస్తున్న ప్రస్తావలు, కామన్ థీమ్స్, వాటిలోని ఇమేజరీ, వాటి ద్వారా వ్యక్తమవుతున్న స్వభావం… వీటి గురించి మాట్లాడాలి. ఇక్కడ ఈ వ్యాసం చేస్తున్నది అదే. హామ్లెట్, అర్జునుడు, రాస్కాల్నికావ్ ల మధ్య ఒక సంబంధాన్ని చూసుకుని ఎంపిక చేసుకున్నాడంటే వాళ్ల గాథలు బైరాగిలోని ఏదో ఆంతరంగిక పార్శ్వాన్ని స్పృశించాయనే. వారి ద్వారా ఆయన తన స్వగతమూ, తన స్వంత బాధా ఏదో చెప్పుకోగలను అనుకున్నాడనే.

  అలాగే ఈ వ్యాసం “బైరాగి అంటే ఇదే” అని ఎక్కడా చెప్పటం లేదు. “బైరాగిలో ఇది కూడా ఉంది” అని చెప్తోంది. ఈ వ్యాసం బైరాగి కవిత్వంలో Visceral Corporeal పార్శ్వాన్నే గమనించి మాట్లాడింది గానీ, అదే బైరాగి కవిత్వం అంతటికీ అర్థమూ పరమార్థమూ అని ఎక్కడా ప్రతిపాదనలు చేయలేదు.

  ఒక వ్యక్తిలో ఎన్నో పార్శ్వాలు ఉండొచ్చునే? అతనికి మనం తగిలించే లేబులే ఎల్లకాలమూ అన్ని సందర్భాల్లోనూ అన్ని కవితల విషయంలోనూ నిజం కావాలని ఎక్కడ ఉంది? అభ్యుదయ కవి అనే లేబుల్ బైరాగి కవిత్వంలో ప్రతీ కవితకూ వర్తింపజేయవచ్చని నేననుకోను. బైరాగి మాట వదిలిపెట్టండి. అభ్యుదయ కవి/ విప్లవ కవి అనే శ్రీశ్రీ లేబుల్ ని ఆయన “కేక” కవితకి వర్తింపజేయగలమా? చేయొచ్చేమో. అప్పుడు అది ఆ కవిత పరిధిని ఆంతరంగికం నుంచి సామాజికం చేసి ఇంకో పఠనీయదృక్కోణానికి వీలు కల్పించేదైతే కల్పించవచ్చు గాక, కానీ అలాంటి అన్వయం కవితలోని నిజాన్నించి దూరం జరగటమే అవుతుంది. అది ఇందాక చెప్పినట్టు మీ నిజం అవుతుంది. నా నిజం నాకుంటుంది. బైరాగిలో అభ్యుదయ కవిత్వం ఏమాత్రం ఉందో నాకు తెలీదు. బైరాగి అంతా అదే అంటే నాకు నిజమనిపించదు. పై వ్యాసంలో ప్రస్తావించిన కవితల్లో అభ్యుదయం నాకు కనిపించలేదు. మీక్కనిపిస్తే అది పాఠకునిగా మీ దృక్కోణమని గౌరవిస్తాను. “ఏయ్ అలా ఎందుకంటున్నావూ”, “నాక్కనపడినట్టే నీక్కనపడటం లేదంటే నీ చూపులో ఏదో తేడా ఉంది చూపించుకో” అని గదమాయించను. That’s not how it works.

  నాయీ స్పందనలో విస్తారానికి మన ఫేస్బుక్ సంభాషణ నేపథ్యం కారణమని ఇక్కడ ప్రస్తావించకపోతే చూపరులకు తలాతోకా అర్థం కాదు. పాఠకుల భిన్న స్వభావాలు ఒకే కవితకు భిన్నమైన అర్థాలు ఇవ్వటం సాధ్యమేననీ, అవి రెండూ సత్యమే అయ్యే అవకాశం ఉందనీ మాత్రమే నేను చెప్పదల్చుకున్నాను. బైరాగి కవిత్వం గురించి మీకు తెలిసినంత నాకు తెలియదు. అసలు నాకు కవిత్వం గురించే మీకు తెలిసినంత తెలియదు. కవిత్వంలో కన్నా బైరాగి “దొంగ”లాంటి కథల్లోనే నాతో ఎక్కువ మాట్లాడాడు. కాబట్టి ఈ కవిత్వ నిరక్షరాస్యుని వచనపూరితమైన అల్ప వాదనలో/ వేదనలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. (ఈ చివరి వాక్యంతో మీ చివరి వాక్యాన్ని మిమిక్ చేస్తున్నా అన్నమాట :))

  • Meher గారు,
   మీరు, వారు చెప్పిన విషయాలు ప్రామాణికాలే అయ్యిండచ్చు,.. నాకున్న చిన్న పరిధిలో ఏవో కొన్ని సందేహాలు,ఊహలే తప్పితే,. స్వ ఊహజనిత టెక్చ్సర్ తలాల మీద తెలుగు సాహిత్వ విమర్శ సత్తా మొత్తాన్ని పరికిస్తున్న మీకు సమాధానం చెప్పే నేర్పు నాకు లేదని, నాకు తెలుసు. మీకు చాలా శ్రమ ఇచ్చినట్లున్నాను, క్షంతవ్యుడిని. నాక్కనపడేదే అసలైంది, అదే సార్వజనీనం అనేంత మూర్ఖత్వం నాలో మీకు కనిపించినందుకు మరీ సంతోషంగా వుంది, ధన్యవాదాలు. :)

 • వాసుదేవ్ says:

  బైరాగి తెలుగు సాహిత్యంలో postmodernism ట్రెండ్ కి ఆద్యుడన్న వాదన చాన్నాళ్ళుండేది. బైరాగి సాహిత్యాన్ని చదివిన ప్రతిసారి పాఠకుడికి భిన్న అర్ధాలు స్ఫురించటం తెల్సినవిషయమే..no doubt its a great essay ..Well composed . Aditya deserves a big pat .
  ఐతే ఈ అద్భుత వ్యాసంలో “ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు: ‘The Visceral-Corporeal’,” లాంటి ప్రయోగాల్లో తెలుగూ ఆంగ్లమూ రెండూ పాఠకులకి అందనంత ఎత్తులో ఉన్నాయి…అంత అవసరం నాకైతె కన్పడలేదు….భాస్కర్ కిచ్చిన వివరణలో పాఠకులు డిక్షనరీలో లిటరరీ క్రిటిసిజం పుస్తకాలు దగ్గరపెట్టుకుని మరీ చదివి అర్ధం చేసుకోమనడంలో వ్యాసకర్త కొంత డిఫెన్స్ లో పడ్డారా అన్న అనుమానం కలగకపోదు.
  కీప్ రైటింగ్ ఆదిత్యగారూ..Definitely those people with M A English Background will enjoy this

 • ఆదిత్యగారు,
  ఈ వ్యాసాన్ని మొదట చూడగానే ఆశ్చర్యమేసింది,. దేహ అవయవాలే తప్ప నాకు ఎక్కడా ఆత్మ కనబడలేదు,. దీనిలో బైరాగి గారిది. మీరు కొన్ని పదాల/వాక్యాల వివరణలను ఇచ్చారు, మీ స్థాయిలో,. నా దృష్టిలో అవి చాలా అసంబద్దంగా వున్నాయనిపించింది. రుధిరమిషబిలం దగ్గర కాని,, రక్తముఖం అనగానే యజ్ఞాన్ని గుర్తుచేసుకోవడం కాని, కిర్క్ గార్ట నిస్పృహ ఇక్కడ మెలుకువగా మారింది, లాంటి చోట్ల పదాలను, మీ భావాల అసోసియేషన్ చూస్తున్నప్పుడు,. మీరిచ్చిన సలహానే గుర్తుకొచ్చింది,. మీరు ముందు మీ మానసిక బద్దకాన్ని వదిలించుకోండి., ఊహలు చేస్తూ పొండి, వాటిని మీరే బద్దలు కొట్టుకోండి. తరువాత మీరొక ఏ మత్తు లేని స్థితిని పొందుతారు.

  మీరిలా పదాలనో, వాక్యాలనో మీ కిష్టమైన వాటికి అసోసియేట్ చేస్తూ, సంబర పడి ప్రకటిస్తే లేదా పలవరిస్తే,. అదే ఎక్కువ ప్రచారమై పాఠకులు అదే భావానికి లోబడే అవకాశం వుంది( ఎర్రక్రీస్తు విషయంలో చూడచ్చు మీరు). దీన్నే బైరాగి వ్యతిరేఖిస్తాడు.

  మీరు ఒక మంచి మాటతో వ్యాసాన్ని మొదలు పెట్టారు,. నీతో ఒకటి చెప్పలేదు-/నా రంగుల తోటలోకి అప్పుడప్పుడు నిన్ను తప్ప/ ఎవ్వరినీ రానివ్వను’ , కాని దాన్ని అర్థం చేసుకోలేకపోయారనిపించింది. ఏ మోతలు, మత్తులు లేని వొంటరిగా, ఏకాంత అంతర్ముఖ ప్రయాణానికి సిధ్దపడితే గాని బైరాగి మీకర్థం కాడేమో. నిన్ను తప్ప అంటే , నువ్వు నన్ను కనుగొంటే తప్ప, నీ స్వతంత్ర్యమైన ఆలోచనలతో,. ఇదొక అద్భతమైన తోట, మంత్ర వనం., ఇక్కడ మనకు మరింతగా మెలుకువ అవసరం. ఇది ఎవరికి వారు బైరాగిని దర్శించడాన్ని సూచిస్తుందేమో. అందకనే ఆయన తన కవిత్వానికి వ్యాఖ్యానాలు అవసరం లేదనే చెప్పారు,. ఆరుద్ర లాంటి వారు కూడా దాన్ని మీరలేదు.

  బైరాగి కవిత్వలోకి దూకి, ఎవరికి వారు ఈత కొట్టుకోవడమే,. ఆనందించడమే, ఊహించుకోవడమే ఆయన కోరుకున్నారనుకోవాలి. ఏదో పట్టుకుని బైరాగి కవిత్వాన్ని ఈదాలనుకోవడం అనేది పరాధీనతను సూచిస్తుంది, అది వద్దనే ఆయన వారించేది.

  ఇంకో ముఖ్యమైన అంశాన్ని కూడా మీరే చెప్పారు,. EMPATHY గురించి, అది మీరు కవి విషయంలోను కలిగివుండటం అవసరం, ఆయన వద్దన్నా కూడా బలత్కారమైనా చేసి ఆయనపై మీ వ్యాఖ్యానాలతో దాడి చేద్దామనుకుంటే, ఇక అది మీ విజ్ఞత.

  ఒక రాయినో లేదా కాస్తా మట్టినో తీసుకుని, దానికి మన ఆలోచనల పసుపు కుంకుమలు పూసి దేవుడిన చేయలను కోవడం ద్వారా, మనం వాటి అస్థిత్వానికి కలిగించే ద్రోహాన్ని అంచనా వేయలేము. అదే విధంగా బైరాగిని మీరే సృష్టించబాకండి.,
  అలా వదిలేయండి,. దుమ్ములోనో, ధూళీ లోనో, ఓ శ్వాసలానో,. ఓ ప్రవహించే మురికికాలువ చెత్తమీదో ఆయన సుఖంగానే వుంటారు.
  విభిన్న దర్శనాల, వైయుక్తిక అనుభూతులను మీరిలా ప్రామాణీకరించడం వలన బైరాగికి జరిగే నష్టమే ఎక్కువ. ( ఎప్పడు ప్రకటన మొదలౌతుందో,, అప్పుడే ప్రామాణీకరించబడటానికి దారులు ఏర్పడతాయి)

  మీరు నిజంగా బైరాగిని కనుగొనాలంటే, మత్తులను, పుస్తకాల బరువులను పక్కన పెట్టి, ఒంటరిగా బైరాగిని స్వతంత్రంగా అన్వేషించండి,. అమాయకుడైన బైరాగిని, వెర్రివాడైన బైరాగిని, బలహీనుడైన బైరాగి, ఉన్మాదైన బైరాగిని, తాత్వికుడైన బైరాగిని. ఇంకా ఎందరినో,.. చివరికి మీరొక అద్భుతమైన సాధారణ బైరాగిని కనుగొంటారు. రహస్య సంకేత భాషా తాళం చెవులు తెరుస్తూ, మిమ్మల్ని మీరు స్వతంత్రంగా తెరుచుకోలేక పోతే బైరాగిని మీరెప్పటికి దర్శించలేరేమో.

  బైరాగి తన కవిత్వంలో ఆత్మను అంటించిపోయారనిపిస్తుంది నాకైతే,. ఆయన కోరుకోని వ్యాఖ్యానాల వెక్కిరింతలతో ఆయనను బాధించడం, ఆయనను ప్రేమించవారెవ్వరూ చేయలేరేమో.

  బైరాగి గారికి ఏమన్నా చేద్దామని మీరనుకుంటే, మీకు వీలైతే, మీకు నచ్చిన ఓ యాభై కవితలో ఓ పుస్తకాన్ని అచ్చేయించి, తక్కువ ఖరీదుతో జనాలలోకి వదేలేయండి. ఎవరికివారు బైరాగిని కనుగొంటారు. (ఓపిక, ప్రేమ, ఆలోచన వుండేవారెవరో కనీసం ఒక్కరైనా)

  మొదట్లో ఆయన కోరుకుంది కూడా అదే,. తరువాత అది కూడా అనవసరమే అనుకున్నట్టున్నారు,. ఎందుకంటే ఎవరికి వారు, వారిని కనుగొనగలితే వారిలో ఒక బైరాగే వుంటాడని ఆయన తెలుసుకున్నారేమో.

  మీ ప్రయోగాలు, విమర్శలు సాహిత్యాలోకానికి చాలా అవసరం, వాటి కోసం చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయన కవిత్వాన్ని మాత్రం వదిలేయండి మీ శుష్క సాహిత్య చట్రాల మధ్య బంధించకుండా. ఏదో లోకంలో ప్రశాంతంగా వుంటాడు. మరేమైనా చేయగలననుకుంటే, ఆయన కవిత్వాన్ని ప్రచారం చేయండి చాలు.
  మీరు ఆయన్ను అర్థం చేసుకున్నా, అపార్థం చేసుకున్నా నాకేం బాధలేదండి.
  ఆయన తాత్వికతను తొక్కేయకండి మీ జ్ఞానపు తొడుగులతోటి.

 • ఆదిత్య says:

  Objective facts – నా interpretation కు తావు లేదు – అనదగ్గవి కొన్ని చెప్పాలి.

  1. చీకటి నీడలు ప్రచురితమైంది మొట్టమొదట 1948లో. అది స్వయంగా బైరాగి గారే ప్రచురించారు. రెండవ ముద్రణ 1978 లో వారి మరణాంతరం జరిగింది.
  మూడవ ముద్రణ 2006 లో. మూడవ ముద్రణ రెండవ పేజీలో చూడవచ్చు. స్వయంగా వారి కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకొన్న విషయమిది.

  The Pain of Being అనే పేరుతో బైరాగి ENGLISH కవితల్ని 2007లో ప్రచురించారు. ఆ పుస్తకం నాల్గవ అట్ట మీద ఆయన పూర్తి రచనల Publication History వుంది. నేను కల్పించింది కాదు.

  నూతిలో గొంతుకలు లోని కవితలు1946-1950 మధ్యలో రాసారని వారి ప్రత్యక్ష శిష్యులు (పత్తిపాడు హై స్కూలులో) ఆంధ్రా యూనివర్శిటీ లో హిందీ ప్రొఫెసర్ గా పనిచేసిన డా. పి. ఆదేశ్వర రావు గారు, నూతిలో గొంతుకలకు 1996లో ‘Voices from the empty well’ అనే పేరుతో అనువాదం చేసిన పుస్తకంలో రాసారు.

  నూతిలో గొంతుకలు 1951లో ‘తెలుగు స్వతంత్ర’ లో వచ్చింది. ఆ కవితల్లో (ఇవి కూడా ఆయన స్వయంగా ఎంపిక చేసినవే) Lazarus ప్రస్తావన వుంది- రాస్కల్నికోవ్ కవితలో. అసలు Crime and Punishment చదివిన వారెవ్వరూ దాంట్లోని Christian అంశాల్ని మరువలేరు. అలాగని ఆయనని ఆస్తిక – నాస్తిక చర్చల్లోకి ఈ వ్యాసం తీసుకు రావట్లేదు. Myth అనేది చాల విస్తృతార్థమున్న మాట. Roland Barthes – Structuralist critic – కు myth అంటే ‘an essential component of meaning-making’.దైనందిన జీవితం లో ప్రతి వాక్కులోనూ myth వుంటుంది.

  2. ‘రక్త మఖం’ అనే మాటే బైరాగి గారే వాడారు. ‘ముఖం’ అని కాదు. ‘మఖం’ అంటే ‘యజ్ఞం’ (ఆంధ్రభారతి లో చూడండి). నేను పొరబాటు పడ్డాను అనుకోండి. నా దగ్గరున్న 2006 ముద్రణ అచ్చు తప్పుల్లో ఇది వొకటి అనుకోండి. నేను రెండవ ముద్రణ ప్రతి వారి కుటుంబ సభ్యుల వద్ద చూసాను. దాంట్లో కూడా ‘మఖం’ అనే వుంది. అదీ తప్పనుకుందాం.

  ఈ పంక్తుల్ని –

  ‘ఈ అగ్నిశిఖల్లోంచి, ఈ రక్తమఖం లోంచి

  నూతన జననమా, లేక ప్రాక్తన మరణమా?’

  డా. పి. అదేశ్వరరావు గారు ‘Voices from the empty well’ లో ఇలా అనువదించారు. 45వ పేజీలో-

  Is it a new birth
  in the flames of fire,
  or an old death
  in the bloody sacrificial fire?

  sacrificial fire అంటే ‘యజ్ఞం’ కాదా ? ‘ముఖం’ అయ్యుంటే bloody face అనే అనువదించేవారు గదా.

  బైరాగి గారి గురించి ఈ factual details – పంచుకోవడానికి అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు.

  • మఖం సరైనదే,. పైన నేను రాసింది టైపో క్షమించండి.
   చీకటినీడలు గురించి మీ పరిశోధన వాస్తవమైనదే అయ్యుండచ్చు, ఆ కాపీ ఎవరి దగ్గరన్నా దొరకవచ్చునేమో కనుక్కోండి.,
   మీ స్ఫూర్తిని అభినందిస్తూ,. సాహిత్వ లోకంలో మీదైన ముద్రతో ప్రకాశిస్తారని ఆశిస్తూ,
   నాకు తోచిన భావాల పంచుకునేందుకు అవకాశమిచ్చినందకు కృతజ్ఞతలతో
   ధన్యవాదాలు ఆదిత్యగారు,

 • కె. కె. రామయ్య says:

  బైరాగి – మబ్బుల్లో పసిపాపల నవ్వులను చూడగలిగారు.
  కొండలపై కులికే కిరణాలకు మురిసిపోగలిగారు.
  అడవులలో వికసించే పువ్వులకు పరవశించగలిగారు.
  బైరాగి ఒక క్లిష్టప్రశ్న. ఒక నిగూఢ ప్రహేళిక, ఒక దుర్భేద్య పద్మవ్యూహం
  – నార్ల వెంకటేశ్వరరావు ( వికీపీడియా నుండి )

  చర్చ ద్వారా వ్యాసం విషయ పరిధిని, వివరణని పెంచిన భాస్కర్, మెహర్, ఆదిత్య లకు అభినందనలు

  http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%AC%E0%B1%88%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)