ఎందరో ‘అయోని’జులు!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఈ వ్యాస పరంపరలో మహాభారత పరిశీలననుంచి వీలైనంత త్వరగా బయటకు వద్దామని ఉంది. అందుకు ఇంకా ఎన్ని వ్యాసాల సమయం పడుతుందో ఈ క్షణాన నాకు అంచనా లేదు. బహుశా మరో పది వ్యాసాలు? ఉహూ…ఇప్పుడే కమిట్ అయిపోతే, దానిని నిలబెట్టుకుంటానన్న ధైర్యం లేదు.

అసలు మహాభారత పరిశీలననుంచి ఎప్పటికైనా బయట పడడం సాధ్యమా అన్న ప్రశ్న ఎలాగూ ఉంది. దానిని అలా ఉంచితే, ఇప్పుడీ వ్యాసాల సందర్భంలో మహాభారతం నుంచి బయటపడాలనుకోడానికి కారణం ఉంది. ఇప్పటికే చాలాచోట్ల ఆయా అంశాలను ప్రస్తావించి వదిలేశాను. ఆ ఖాళీలను పూరించుకుంటూ వెళ్ళాలి. ఆపైన ఇతిహాసంనుంచి పురాచరిత్ర మీదుగా చరిత్ర కాలంలోకి-వర్తమానం వరకూ -రావాలన్నది నేను వేసుకున్న పథకం. ఇతిహాసం దగ్గరే తిరుగుతూ ఉంటే నా పూర్తి పథకంలోకి వెళ్ళడం ఆలస్యమవుతూ ఉంటుంది.

సరే, ఇదంతా నా బాధ. నా బాధను పాఠక ప్రపంచం బాధగా మార్చడం సబబు కాదు కనుక ఇక్కడితో వదిలేస్తాను.

మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి జరిగిన పరివర్తన గురించి, ఆ పరివర్తనను దాదాపు ప్రపంచ పురాణ కథలు అన్నీ ప్రతిఫలిస్తూ ఉండడం గురించి ఇంతకు ముందు పలు సందర్భాలలో రాశాను. మరిన్ని ఆసక్తికరమైన వివరాలను మహాభారత నేపథ్యంనుంచే చెప్పుకుందాం. ద్రౌపది జన్మవృత్తాంతం వాటిలో ఒకటి.

అంతకంటే ముందు, ఆమె తండ్రి ద్రుపదుడు, అతని మిత్రుడు ద్రోణాచార్యుల జన్మ వృత్తాంతాలూ చెప్పుకోవలసినవే. సీతలానే ద్రౌపదిని ‘అయోనిజ’ (అంటే, స్త్రీ యోని నుంచి పుట్టనిది) అంటారని మనకు తెలుసు. ఆ మాటనే యథాతథంగా అన్వయించుకుంటే ద్రుపదుడు, ద్రోణుడు కూడా అయోనిజులే. అయినాసరే, సంప్రదాయం వారిని అయోనిజులని ఎందుకు అనలేదో తెలియదు.

ద్రౌపది తండ్రి ద్రుపదుడు. అతని తండ్రి పేరు పృషతుడు. పాంచాలరాజు అయిన పృషతుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అప్సరస అయిన మేనక పువ్వులు సేకరిస్తూ కనిపించింది. ఆమెను చూడగానే పృషతునికి స్కలనం జరిగింది. దానిని అతను తన పాదంతో కప్పాడు. అప్పుడు మరుత్తుల అంశతో దానినుంచి ద్రుపదుడు పుట్టాడు. పాదం నుంచి వచ్చాడు కనుక అతనికా పేరు వచ్చింది.

పృషతునికి భరద్వాజుడు మిత్రుడు. పృషతుడు తన కొడుకు ద్రుపదుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి తను పాంచాలరాజ్యాన్ని పాలించడానికి వెళ్లిపోయాడు. అంతకుముందు భరద్వాజునికీ పృషతునికి ఎదురైన అనుభవమే ఎదురైంది. అతను గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఓ రోజున గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఘృతాచి అనే అప్సరస జలక్రీడలాడుతూ కనిపించింది. ఆమెను చూడగానే భరద్వాజుడికి కోరిక కలిగింది. స్కలనం జరిగింది. దానిని అతను ఒక ద్రోణి(దొప్ప)లోకి తీసుకున్నాడు. దానినుంచి శుక్రుని అంశతో ఒక శిశువు పుట్టాడు. ద్రోణినుంచి పుట్టాడు కనుక అతనికి ద్రోణుడనే పేరు వచ్చింది.

పృషత, భరద్వాజులలానే ద్రుపద, ద్రోణులు కూడా మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకేచోట వేదాధ్యయనం చేసి, విలువిద్య నేర్చుకున్నారు. కొంతకాలానికి ద్రుపదుడు తండ్రి స్థానంలో పాంచాలరాజ్యానికి రాజయ్యాడు. ద్రోణుడు అగ్నివేశుడనే మునివద్ద విలువిద్యలో మరింత ప్రావీణ్యం సంపాదించి ఆగ్నేయాస్త్రంతో సహా అనేక దివ్యాస్త్రాలు సంపాదించాడు. ఆపైన తండ్రి భరద్వాజుని ఆదేశంతో కృపుని చెల్లెలు అయిన కృపిని పెళ్లిచేసుకున్నాడు. వారికి అశ్వత్థామ అనే కొడుకు పుట్టాడు.

ఇక్కడ కృప, కృపిల జన్మవృత్తాంతం కూడా చెప్పుకోవాలి. వారు కూడా ‘అయోనిజు’లే. గౌతమ గోత్రీకుడైన శరద్వంతునికి కలిగిన కవలపిల్లలు వారు. శరద్వంతుడు పుడుతూనే శరసమూహంతో పుట్టాడు. వేదాధ్యయనాన్ని ఇష్టపడకుండా ధనుర్వేదం నేర్చుకున్నాడు. ఇంద్రుడు అతనికి భయపడ్డాడు. అతని తపస్సు చెరచమని చెప్పి ‘జలపది’ (మూలంలో ఈ మాట ‘జానపది’. దీనర్థం జానపదస్త్రీ. నన్నయ ఈ మాటను జలపదిగా మార్చాడు)అనే అప్సరసను పంపించాడు. ఆమెను చూడగానే శరద్వంతునికి స్కలనం జరిగింది. అది ఒక శరస్తంభం మీద రెండు భాగాలుగా పడింది. ఒక భాగం నుంచి మగ శిశువు, ఇంకో భాగం నుంచి ఆడశిశువు పుట్టారు.

శరద్వంతుడు ఆ ఆశ్రమాన్ని విడిచి మరో చోటికి వెళ్లిపోయాడు. అంతలో ఆ ప్రాంతానికి శంతనమహారాజు వేటకు వచ్చాడు. ఆ పిల్లలను చూశాడు. జాలి కలిగింది. వారిని హస్తినాపురానికి తీసుకెళ్లి కృపుడు, కృపి అనే పేర్లతో పెంచాడు. కొంతకాలానికి శరద్వంతుడు శంతనుని దగ్గరకు వచ్చి వారు తన సంతానమే నని చెప్పి, కృపునికి ఉపనయనం చేసి, వేదాలు, ధనుర్విద్య నేర్పించాడు. శంతనుని కొడుకైన భీష్ముడు కూడా కృపుని ఆదరంగా చూస్తూ కురుపాండవులకు విలువిద్య నేర్పడానికి నియోగించాడు.

కురుక్షేత్రయుద్ధంలో పాల్గొని కౌరవపక్షంలో ప్రాణాలతో మిగిలిన ముగ్గురు వీరులలో (మిగిలిన ఇద్దరు: అశ్వత్థామ, కృతవర్మ) కృపుడు ఒకడు. యుద్ధం తర్వాత ధర్మరాజు కూడా అతనిని వెనకటి ఉపాధ్యాయ పదవిలోనే నియమించాడు.

ద్రోణుడి విషయానికి మళ్ళీ వస్తే, కుటుంబ పోషణకు ధనం అవసరం కనుక ద్రోణుడు పరశురాముని దగ్గరకు వెళ్ళి యాచించాడు. ‘నా దగ్గర ఉన్నదంతా దానం చేసేశాను. అస్త్రశస్త్రాలు తప్ప ఏమీ లేవు. కావాలంటే వీటిని తీసుకో’’ అని పరశురాముడు అన్నాడు. అంతకంటే అత్యుత్తమ ధనం ఏముంటుందంటూ ద్రోణుడు సంతోషంగా వాటిని స్వీకరించాడు. అక్కడినుంచి తన బాల్యమిత్రుడు, పాంచాలరాజు అయిన ద్రుపదుని దగ్గరకు వెళ్ళి తమ స్నేహాన్ని గుర్తు చేశాడు. ద్రుపదుడు రాజ్యగర్వంతో అతన్ని తూలనాడాడు. ‘నీ స్థాయి మరచి మాట్లాడుతున్నావు. ఒక పేదబ్రాహ్మణునికీ, రాజుకీ స్నేహమేమిటి? ధనవంతుడితో దరిద్రుడికీ, పండితునితో మూర్ఖునికీ, వీరుడితో భీరుడికీ స్నేహం ఎలా సాధ్యమవుతుంది? స్నేహమైనా, వివాహమైనా సమానులతోనే సాధ్యం. అదీగాక రాజులకు మిత్ర, శత్రు సంబంధాలు అవసరాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. నీలాంటి పేద విప్రులతో రాజులకు అవసరార్థమైన స్నేహం ఎప్పుడూ కలగదు. కనుక వచ్చిన దారిని పో’ అన్నాడు.

ద్రోణుడు ఆ అవమానానికి తల ఎత్తుకోలేకపోయాడు. మారు మాట్లాకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. భార్యను, కొడుకునీ, అగ్నిహోత్రాన్నీ, శిష్యులనూ వెంటబెట్టుకుని హస్తినాపురం దారి పట్టాడు. అక్కడ అతనికి కురు, పాండవులతో పరిచయమైంది. వారు అతని గురించి భీష్ముడితో చెప్పారు. భీష్ముడు అతనికి ఆశ్రయమిచ్చి కురు, పాండవులకు అస్త్రశస్త్రాలు నేర్పడానికి నియోగించాడు.

విద్యాభ్యాసం ముగిసింది. గురుదక్షిణ చెల్లించే సమయం వచ్చింది. ద్రుపదుడు తనకు చేసిన అవమానం హృదయశల్యంగా మారి అన్నేళ్లుగానూ ద్రోణుని నొప్పిస్తూనే ఉంది. ప్రతీకార క్షణం కోసం అతను ఎదురు చూస్తూనే ఉన్నాడు. ద్రోణుని ఓడించి బంధించి ప్రాణాలతో తన ముందు నిలబెట్టడమే తన గురుదక్షిణ అని కురుపాండవులకు చెప్పాడు. కౌరవులు ఆ పని చేయలేకపోయారు. అర్జునుడి నాయకత్వంలో పాండవులు ద్రుపదుని అవలీలగా ఓడించి బంధించి ద్రోణుడి ముందు ఉంచారు. ద్రోణుడి పగ చల్లారింది. ములుకుల వంటి మాటలతో ద్రుపదుని కుళ్లబొడిచి విడిచిపెట్టాడు. అటు ద్రుపదుడు కూడా ద్రోణునిపై ప్రతీకారం తీర్చుకోడానికి తన ప్రయత్నాలు తనూ మొదలుపెట్టాడు.

ఇది ఆదిపర్వం, ఆరవ ఆశ్వాసంలో నన్నయ చెప్పిన కథ. కానీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ‘మహాభారత చరిత్రము’లో చెప్పిన ప్రకారం ద్రోణుడు ద్రుపదుని ఊరికే విడిచిపెట్టలేదు. పాంచాలరాజ్యంలో గంగకు ఉత్తరంగా ఉన్న అహిచ్ఛత్రాన్ని తనకు ఇచ్చే షరతు మీద విడిచిపెట్టాడు. అహిచ్ఛత్రానికి మాకంది రాజధాని. గంగకు దక్షిణంగా కాంపిల్య రాజధానిగా ఉన్న భాగమే ద్రుపదునికి మిగిలింది. ఆ విధంగా అహిచ్ఛత్రంపై అధికారం ద్రోణుడికి, అతని తర్వాత అతని కొడుకు అశ్వత్థామకు లభించింది. పెండ్యాలవారు ఏ సోర్సు నుంచి ఈ సమాచారం ఇచ్చారో చెప్పలేదు. నా దగ్గర ఆది సభారణ్యపర్వాలు ఉన్న సంస్కృత భారతం లేకపోవడంతో ఈ సమాచారాన్ని ధ్రువీకరించుకునే అవకాశం కలగలేదు. అయితే, తిక్కన అనువదించిన భాగంలో కూడా పాంచాలరాజ్యంలో కొంత ప్రాంతానికి అశ్వత్థామ ఉత్తరాధికారి అన్న సూచన ఉంది. ఎన్నో ఆసక్తికర వివరాలు ఉన్న ఈ కోణాన్ని నా సర్పయాగ వ్యాసాలలో చర్చించాను. విస్తరణ భయం వల్ల ప్రస్తుతం అందులోకి వెళ్లను.

కాకపోతే ఒక్క విషయం చెప్పుకోవాలి. కురుక్షేత్రయుద్ధం కేవలం కురు,పాండవుల యుద్ధమేనని చాలామంది అనుకుంటారు. కానీ, ‘wheel within the wheel’ (చక్రంలో చక్రం) అన్నట్టుగా, అది ఇంకా అనేకమంది వ్యక్తులు, వర్ణాలు, తెగలు తమ పాత పగలు, కక్షలు తీర్చుకోడానికి సొంత అజెండాలతో అనుకూల పక్షంలో చేరి సాగించిన యుద్ధం. అందుకే అది ఆనాటి ప్రమాణాలలో ఒక మహాయుద్ధంగా పరిణమించి, ప్రజల మనసులలో ఒక బలమైన పురాస్మృతి గానూ, దేశాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిన ‘జలచ్ఛాయ’(watershed)గానూ మారినట్టు అనిపిస్తుంది. ఇటీవలి కాలానికి చెందిన రెండు ప్రపంచయుద్ధాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇది మరింత బాగా అర్థమవుతుంది. అసలు కేవలం కురుక్షేత్ర యుద్ధం గురించే చెప్పుకోవడం ప్రారంభిస్తే దానికదే ఒక ఉద్గ్రంథం అవుతుంది. ఆ పని ఇంతవరకు ఎవరైనా చేశారో(నవల, కథ, నాటకం లాంటి ప్రక్రియలను మినహాయిస్తే) లేదో తెలియదు. నాకైతే ఉత్సాహం అయితే ఉంది కానీ…ఏమో?!

Wheel within the wheel లాంటిదే ద్రోణ-ద్రుపదుల శత్రుత్వం కూడా!

ప్రస్తుతానికి వస్తే,‘అయోనిజు’ల జాబితాలో ద్రౌపది మొదలైనవారే కాక ద్రుపదుడు, ద్రోణుడు, కృపుడు, కృపి కూడా చేరినట్టు పై కథనాలు చెబుతున్నాయి. నిజానికి ఈ జాబితా ఇంకా చాలా పెద్దది. వశిష్టుడు, అగస్త్యుడు, శుకుడు, ఋష్యశృంగుడు మొదలైనవారు కూడా ఇందులోకి వస్తారు. ఇక్కడ కూడా గతంలో చెప్పుకున్నట్టు, మహిమతో కూడిన ‘దేవధర్మా’న్ని, మహిమలేవీ లేని ‘మనుష్యధర్మా’న్ని కలగలపడం కనిపిస్తుంది. ఉదాహరణకు, ద్రోణుడు, ద్రుపదుడు యోని సంబంధం లేకుండా వీర్యం నుంచే పుట్టినట్టు కథకుడు చెప్పాడు. అయితే, ద్రోణుడు కృపిని పెళ్లి చేసుకుని సహజపద్ధతిలోనే ఆమె ద్వారా అశ్వత్థామను పొందాడు. ద్రుపదుడు కూడా మనుష్య ధర్మం ప్రకారమే కోకిలాదేవి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి సహజపద్ధతిలో సంతానం కలిగిందా లేదా అన్న వివరంతో కథకు సంబంధం లేదు. ఒక ప్రత్యేకమైన ఆకాంక్షతో ద్రుపదుడు సంతానంగా పొందిన ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది మాత్రమే కథకు అవసరమయ్యారు కనుక వారి గురించే మనకు తెలుసు.

ravi_varma-draupadi_carrying_milk_honey1

‘అయోనిజు’ లన్న ఒక్క అంశాన్ని పక్కన పెడితే, మిగిలిన వివరాలు; అంటే, ద్రోణుడు ద్రుపదుని ధనసాయాన్ని కోరడానికి వెళ్ళడం, అతడు అవమానించడం, ద్రోణుడు హస్తినాపురాన్ని ఆశ్రయించడం, వారి మధ్య పగ, ప్రతీకారం, యుద్ధం వగైరాలు అన్నీ మన సాధారణ బుద్ధికీ, తర్కానీకీ అందే మనుష్య స్వభాన్నీ, లేదా మనుష్య ధర్మాన్నే వెల్లడిస్తున్నాయి. అయితే, దేవ, మనుష్య ధర్మాలను కలగపడంతోనే వస్తుంది చిక్కు. పూర్తిగా దేవధర్మాన్నో, లేదా మనుష్యధర్మాన్నో కథకు ఆపాదిస్తే మనం అర్థం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఆ రెండింటినీ కలగలిపినప్పుడు, అందులో కథకుడికి ఏదో వ్యూహం ఉందన్న అనుమానం కలగడం, అతడు దేనినో మరుగుపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడనిపించడం సహజం.

ప్రస్తుత సందర్భంలో అదేమిటని ప్రశ్నించుకుంటే, సంతానం కలగడానికీ, యోనికీ ఉన్న సంబంధాన్ని అతడు మరుగుపరుస్తున్నాడు. సంతానం కలగడానికి యోని సంబంధం అవసరం లేదనీ, పురుషుని వీర్యం నుంచే నేరుగా సంతానం కలగడం సాధ్యమేననీ అతడు చెబుతున్నాడు. నేటి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ఆనాడే ఉందనడానికి నిదర్శనంగా కొందరు దీనిని అత్యుత్సాహంతో సమర్థించవచ్చు. కానీ టెస్ట్ ట్యూబ్ ప్రక్రియలో కూడా పురుష శుక్ల, స్త్రీ శోణితాల మధ్య కలయిక తప్పనిసరి. కానీ, ద్రోణుడు, ద్రుపదుల పుట్టుకలో ఆ కలయిక ఉన్నట్టు కథకుడు చెప్పడం లేదు.

ఇంతకీ ఇలా యోని సంబంధాన్ని పరిహరించడంలో కథకుని ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న వేసుకుంటే, రెండు సమాధానాలు స్ఫురిస్తాయి. మొదటిది, పృషతుడు, భరద్వాజుడు, శరద్వంతుడు మొదలైనవారు సంతానం కన్నది తక్కువ సామాజిక స్థాయి కలిగిన స్త్రీ ద్వారా కావచ్చు. వారు ఆటవిక, గిరిజన తెగలకు చెందినవారో, జానపదులో కావచ్చు. గంగ, సత్యవతి మొదలైన వారిని ఉదహరించుకుంటే ఇలాంటి సంబంధాలు; నదీ తీరాలు, ఇతర జలవనరుల తావులు లైంగిక క్రీడా స్థలాలు అయిన దశకు చెందినవి కావచ్చు. కోశాంబీ దీని గురించి ఇచ్చిన సమాచారాన్ని మరో సందర్భానికి వాయిదా వేస్తాను.

ఇక రెండో సమాధానానికి వస్తే, సంతానం కనడానికి యోని సంబంధం…ఆ మాటకొస్తే అసలు స్త్రీ సంబంధమే అవసరం లేదని కథకుడు చెప్పదలచుకున్నాడు. అంటే అతను మాతృస్వామ్యం మీద పితృస్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తున్నాడు. స్త్రీకి మాత్రమే సాధ్యమయ్యేదీ, పురుషుడికి సాధ్యం కానిదీ, సంతానాన్ని కనడం! ఆ తేడా పురుషుని న్యూనతకు గురి చేస్తూనే ఉంటుంది. పురుషునికి కూడా పునరుత్పత్తి సామర్థ్యం ఉందని చెబితే తప్ప మాతృస్వామ్యంపై పితృస్వామ్య విజయం సంపూర్ణం కాదు. కథకుడు అదే చేస్తున్నాడు. పనిలో పనిగా ఈ సందర్భాన్ని అతడు పై కథలలోని పురుషుల న్యూన స్త్రీ సంబంధాన్ని కప్పి పుచ్చడానికి కూడా వాడుకుంటున్నాడు.

పురుషునికి కూడా పునరుత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పే ప్రయత్నం ఎంతవరకు వెళ్ళిందంటే, అందుకు యోని సంబంధమే కాక, వీర్యసంబంధం కూడా అవసరం లేదని చెప్పేవరకూ!

ఉదాహరణకు,‘సంకల్ప’ మాత్రంగానో, లేక మనసునుంచో సృష్టి చేసినట్టు చెప్పే కథలు కనిపిస్తాయి. బ్రహ్మ మానసపుత్రులుగా మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆరుగురు పుట్టారనీ; మరీచికి కశ్యప ప్రజాపతి పుట్టాడనీ, కశ్యపుని వల్ల చరాచరప్రాణులన్నీ పుట్టాయనీ ఆదిపర్వం తృతీయాశ్వాసం చెబుతోంది. అదెలాగంటే, బ్రహ్మ కుడి బొటనవేలి నుంచి మళ్ళీ దక్షుడు; ఎడమ బొటన వేలి నుంచి ధరణి అనే స్త్రీ పుట్టారు. వారిద్దరికీ అనేక మంది కొడుకులు పుట్టి సాంఖ్యయోగాభ్యాసంతో మోక్షం పొందారు. ఆ తర్వాత దక్షుడికీ, ధరణికీ యాభైమంది కూతుళ్ళు మాత్రమే కలిగారు. కొడుకులు లేకపోవడంతో దక్షుడు కూతుళ్లకే పుత్రీకరణ చేసి వారిలో పది మందిని ధర్ముడనే మనువుకీ, ఇరవయ్యేడుమందిని చంద్రుడికీ, పదముగ్గురిని కశ్యపునికీ ఇచ్చాడు. వారి నుంచి మొత్తం జీవులన్నీ పుట్టాయి.

ఇందులో గణసమాజ కోణం నుంచి చెప్పుకోవలసిన విలువైన సమాచారం చాలా ఉంది. ప్రస్తుతానికి దానిని అలా ఉంచితే, ఇందులోని ప్రారంభ వివరాలు పురుషుడి ముఖంగానే సృష్టి జరిగినట్టు, పురుషులే ముందు పుట్టినట్టు చెబుతున్నాయి. అయితే, సృష్టి చేయడంలో స్త్రీ పాత్రను పూర్తిగా నిరాకరించే అవకాశమూ లేదు. కనుక రెండవ దశలో స్త్రీని తీసుకొస్తున్నాయి. ఆ స్త్రీ కూడా మళ్ళీ బ్రహ్మ ఎడమ బొటన వేలి నుంచే పుట్టింది.

విశేషమేమిటంటే, ఇలా పురుషుడి ద్వారానే సృష్టి జరిగిందని చెప్పడం మన పురాణ, ఇతిహాస కథలలోనే కాక ఇతర పురాణ, ఇతిహాస కథలలోనూ కనిపిస్తుంది. ఉదాహరణకు, క్రీ.పూ. 9వ శతాబ్దికి చెందిన యెహోవా సృష్టి గాథ ఇలా ఉంటుంది:

యెహోవా భూమినీ, ఆకాశాన్నీ సృష్టించాడు. అయితే వర్షం కురిపించకపోవడంతో భూమిమీద మొక్కలు, మూలికలు మొలకెత్తుకు రాలేదు. భూమిని దున్నడానికి మనిషీ పుట్టలేదు. అయితే, భూమిలోంచి ఒక పొగమంచు పైకివచ్చి నేలను తడిపింది. ఆ మట్టిలోంచి యెహోవా మనిషిని సృష్టించాడు. అతని ముక్కుపుటాలలోకి ప్రాణాన్ని ఊదాడు. అప్పుడు మనిషి ప్రాణిగా మారాడు. ఆ తర్వాత యెహోవా తూర్పు దిక్కున ఈడెన్ లో ఉద్యానవనాన్ని ప్రతిష్టించాడు. మనిషిని అందులో ఉంచాడు. చూడడానికి ఆహ్లాదం గొలుపుతూ, మంచి ఆహారాన్ని అందించే ప్రతి చెట్టునూ, మొక్కనూ అందులో సృష్టించాడు. వాటి మధ్యలో రెండు వృక్షాలను కల్పించాడు, ఒకటి, జీవ వృక్షం; రెండవది, మంచి, చెడులకు చెందిన జ్ఞానవృక్షం. ఆ ఉద్యానవనానికి నీరు అందించడానికి ఒక నదిని సృష్టించాడు. ఆ నది మళ్ళీ నాలుగు నదులుగా చీలింది. మనిషిని ఆ ఉద్యానవనంలో ఉంచిన యెహోవా, దానిని జాగ్రత్తగా సంరక్షిస్తూ సాగు చేస్తూ ఉండమన్నాడు. అయితే ఒక హెచ్చరికా చేశాడు. ఈ ఉద్యానవనంలోని ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు స్వేచ్ఛగా తినచ్చు కానీ, జ్ఞానవృక్ష ఫలాన్ని మాత్రం తినద్దనీ, తింటే మరణిస్తావనీ అన్నాడు.

ఆ తర్వాత యెహోవా మనిషికి సాయపడడానికి జంతువులను సృష్టించాడు. ఇంతా చేశాక అతనికి మంచి తోడు లేదన్న సంగతిని గమనించి అతనికి గాఢనిద్ర ఆవహిల్లేలా చేశాడు. అతని పక్కటెముక నొక దానిని తీసి, ఆ తీసిన ప్రదేశాన్ని మాంసంతో పూరించి, పక్కటెముకను స్త్రీగా మార్చి అతనికి తోడుగా ఇచ్చాడు.

ఆ తర్వాత వారు నిషిద్ధ ఫలాన్ని ఆరగించి ‘పతనం’ కావడం, వారికి సంతానం కలగడం సంభవించాయి.

ఈ కథ కూడా మొదట పురుష ముఖంగానే సృష్టి జరిగినట్టు చెబుతూ, స్త్రీని ఆ తర్వాత ప్రవేశపెడుతోంది.

మిగతా విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం

 

 

Download PDF

7 Comments

 • kalluri bhaskaram says:

  సారీ. “ద్రోణుని ఓడించి బంధించి ప్రాణాలతో తన ముందు నిలబెట్టడమే తన గురుదక్షిణ అని కురుపాండవులకు చెప్పాడు.” అనే ఈ వాక్యాన్ని “ద్రుపదుని ఓడించి…” అని చదువుకోగలరు.

 • భాస్కరం గారూ ,
  మహా భారతం సంస్కృత మూలం కొన్ని వెబ్ సైట్లలో కనిపిస్తోంది . ఎంతవరకూ ప్రామ్నాణికం అన్నది తెలియదు కాని ఈ http://www.aryabharati.org/mahabharat/mahabharsn.asp అన్న సైట్ చూడండి, మీకు ఉపయోగించవచ్చును.

  • kalluri bhaskaram says:

   మీరిచ్చిన లింక్ చూశాను. ధన్యవాదాలు శ్యామలరావు గారూ…

 • అయోనిజ అనడం వింటున్నాం గానీ “అయోనిజుడు” అని పురుషున్ని ఎందుకు అనడం లేదన్న మీ ప్రశ్న చాలా కుతూహలంగా వుంది.
  నాకైతే ఓ సమాధానం స్పురిస్తున్నది. స్త్రీని “పతివ్రత” అనడానికి చూపించే తాపత్రయం పురుషుణ్ణి “పత్నీవ్రతుడు” అనడానికి చూపించం. ఎందుకంటే పతివ్రతగానో, కన్యగానో వున్న స్త్రీకి సమాజం ఇచ్చే ప్రాధాన్యత అదే విషయంలో అలా వున్న పురుషుడికివ్వదు.
  బహుశా ఇదే కారణం వల్ల స్త్రీని పొగిడేప్పుడూ, వర్ణించేటప్పుడూ, తను గొప్పది అని చెప్పాలనుకున్నప్పుడు “అయోనిజ” అనడం ఒక పరిపాటి అయిందనుకుంటాను. అదే పురుషుణ్ణీ గొప్పవాడని పొగడాలనుకుంటే వెయ్యి చేతులున్నాయనో, కవచ కుండలాలతో పుట్టాడనో చెబుతున్నారు.

  మీ వ్యాసాలు చాలా ఆలోచనలు రేకిత్తిస్తూ మంచి విశయపుష్టితో వుంటున్నాయి.

  • kalluri bhaskaram says:

   ధన్యవాదాలు ప్రసాద్ గారూ…మీరన్నట్టు స్త్రీ, పురుషులను పొగడడంలో వేర్వేరు విశేషణాలను ఉపయోగించే మాట నిజమే.

 • మన పురాణాలు,ఇతిహాసాల వెనుక గూఢార్థాలు,సాంఘిక పరిణామాలు ఎన్నో అర్థం చేసుకోవలసినవి ఉన్నాయి.వాటిని గురించి మీరు అధ్యయనం చేసి వ్రాయడం బాగుంది.హీరోలు,హీరోయిన్ల జననం గురించి ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు కొన్ని కథలు కల్పించడం, వారికి దైవత్వం ఆపాదించడం మనపురాణాల్లోనే కాక గ్రీకుపురాణాల్లో కూడా చూడవచ్చును.
  మరొక్క విషయం ;అప్పుడీ టెక్నాలజీ ,శాస్త్ర విజ్ఞానం ఉన్నాయని నేను అనను కాని,నేటి అధునాతన శాస్త్రీయ పురోగతివల్ల పురుషుని సహాయంలేకుండా స్త్రీ,స్త్రీ సహాయం లేకుండా పురుషుడు వారి వారి cells ద్వారా నే సంతానాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.మనం అయోనిజుల్నీ, అవీర్యల్ని చూసే రోజులు రావచ్చును.

  • kalluri bhaskaram says:

   ధన్యవాదాలు రమణారావు గారూ…మీరు అన్నట్టు అప్పుడీ టెక్నాలజీ, శాస్త్రవిజ్ఞానం లేకపోయినా ఆ దిశగా ఊహలు అయితే చేశారు. దానిని అంగీకరించాల్సిందే. ఏ టెక్నాలజీకైనా, శాస్త్రవిజ్ఞానానికైనా ఊహలే ప్రాతిపదికలు అవుతాయి. మిగతా వనరులన్నీ సమకూరిన కొద్దీ ఊహలే ప్రయోగదశకు, ప్రయోగాలు ఫలితాల దశకు చేరుకుంటాయి.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)