తన్మయత్వం అంటే…?

చదివేటప్పుడు పాఠకుడు నేను ఎక్కడ ఉన్నాను?’ అని ప్రశ్న వేసుకుంటే నేను ఇక్కడ ఉన్నానుఅని స్వీయ లోకం నుంచి కాకుండా మరోలోకం నుంచి మారు బదులు వస్తే అదే తన్మయత్వంఅంటారు ప్రముఖ సాహిత్యవేత్త కవికొండల వెంకటరావుగారు యనభై ఏళ్లకిందట ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకని రాసిన ఒక వ్యాసంలో. వారి అబిప్రాయం ప్రకారం పాఠకుడు తన దృష్టిపథాన్ని విడిచిపెట్టి.. కవి దృష్టిపథాన్ని విడిచి పెట్టి.. చదివే అంశం దృష్టిపథం వెంటబడి పోవడమే ఆ తన్మయత్వ ముఖ్య లక్షణం. వాస్తవంకూడా అంతేననిపిస్తోంది.

రామాయణం- రాసిన వాల్మీకి కథ కాదు. చదివే పాఠకుడి కథ అంతకన్నా కాదు. సీతారాముల కథ. మనల్ని మనం  మరచి, వాల్మీకినీ మరచి, సీతారాములనే స్మరించుకుంటో చదువుతాం కదా.. అదేనేమో వెంకటరావుగారు ఉటంకించిన ఆ పరలోక శక్తి! నిజమే. శ్లోకం ప్రతిపదార్థమో.. తాత్పర్యమో తెలుసుకుంటో అంతః సారంలోకి వెళ్ళకుండా పదే పదే ఎంత వల్లె వేసినా అది పురాణ పఠనం అవుతుందేమో  గానీ తన్మయత్వం కాబోదు గదా! ఆ తన్మయలోక ప్రయాణానికి టిక్కెట్టు దొరకటం అంత సులభం కూడా కాదేమో!

అంశా’న్నే లక్ష్యంగా తీసుకోవడం -అంటున్నారు వెంకటరావు గారు. అంటే ఏమిటో? బాహ్య స్వరూపమైన భాషను అనా అర్థం? ఆంతరంగికమైన భావాన్ని అనా అర్థం? రెండూ కాదు. అంశం ప్రతిపాదించే ధర్మం అని అనుకుంటా వెంకటరావుగారి ఉద్దేశంలోఉన్నది.

 ధర్మం ప్రతిపాదించని అంశం అంటూ ఏదైనా అసలు ఉంటుదా? ఉండదేమో. ధర్మం సహజ లక్షణం మర్మం. ఆ మార్మికత మీద లక్ష్యం ఉంచడమే తనయత్వం సాధించే ప్రక్రియల్లోని ముఖ్య మార్గం అనిపిస్తోంది.  రావణాసురిడి పది తలలమీదో, రాములవారి ధనుర్విద్యా పాటవం మీదో దృష్టి లగ్నం చేస్తే పర శక్తి కనికరించదు. సీతారాముల చరిత్ర ముఖ్య ధర్మం-  నైతికత. భాతృధర్మం, పితృవాక్య పరిపాలన, ఏకపత్నీవ్రత సంకల్పం. నిష్ట, నైష్టిక ప్రవృత్తి, శరణాగత ఆర్త త్రాణ పరాయణత్వం లాంటి చరిత్రోదితాలైన ‘ధర్మా’లమీద దృష్టిసారిస్తేనే తన్మయత్వం సాధ్యం అయేది.

unnamed

రావుగారి లెక్క ప్రకారం ఈ ధర్మం మళ్లీ రెండు విధాలు.

1.విశ్రుతం

2.విస్మృతం

ప్రచండ వేగంతో వీచి, పెద్ద పెద్ద చెట్లను పడదోసి, భయంకరమైన వాననీటితో ముంచెత్తే గాలివాన ఆర్భాటం లాంటిది కేవల శ్రుత ధర్మం అయితే..  దూదిగుట్టలాగా విశాల ఆకాశానికి ఒక మూల ఒదిగి  సూర్యకాంతికి ఆరుతున్నట్లుండే తెలిబూది మేఘంలాంటిది విస్మృత ధర్మం.

ప్రకృతిలో  ఆ రెండు ధర్మాలూ విడివిడిగా ఉండవు. ఒకే ఒరలోని  రెందు కత్తుల్లా ఉన్నా.. ముందు మన మనసుకు తళుక్కుమని  తట్టేదే ప్రధాన ధర్మం. తుఫాను వీచేటప్పుడు విరామాన్ని గురించిన ఆలోచన తోచదు కదా! కదలక మెదలక  నిలబడి ఉన్న మేఘ శకలాన్ని చూసినా అంతే! అలాగే అప్పటిదాకా అది చేసిన ప్రయాణం కాని, ఇకముందు చేయబోయే ప్రయాణాన్ని గురించి గానీ మనసుకు తట్టదు. తుఫానుది చలనం.. మేఘశకలానిది నిశ్చలనం.. ప్రధాన ధర్మాలు కావడమే ఇందుకు కారణమేమో! అయితే ఇది కేవలం బాహ్యలోక లక్షణం మాత్రమే.

 

కావ్య ప్రపంచంలో అలా ఉంటుందా?  రెండు ధర్మాలూ ఒకే చర్యలో సమ్మిశ్రితంగా  ఉండి.. పాఠకుడి మనోనేత్రానికి ఒకేసారి దృగ్గోచరం  అవుతుంటాయి కదా! అంశం పరిపూర్ణంగా ప్రత్యక్షం అయే దాకా ఉత్కంఠను నిలిపి ఉంచేదీ ఈ సమ్మిశ్రిత ధర్మ సూత్రమే.

ఆకాశంలో నిలకడగా ఉన్న మేఘాన్ని కాళిదాసు మహాకవి దేశ దేశాల వెంట తిప్పి విశ్రుతం చేసాడు. విస్మృతిలో ఉన్న మేఘానికి విశ్రుత ధర్మం ఆపాదించడమే మేఘదూతంలో మహాకవి చూపించిన గడుసుదనమేమో! అక్కడ పాఠకుడు తన్మయత్వం పొందాలంటే ముందు విస్మృత స్థితిలో ఉన్న మేఘాన్ని దర్శించాలి. దాని వెంట దేశదేశాలు తిరుగుతున్నట్లు ఉహించుకుని శ్లోకాలు చదువుకోవాలి. మనన చాతుర్యం లేకుండా కేవలం పఠన చాతుర్యంతో  తన్మయత్వాన్ని సాధించడం అంటే   తివిరి ఇసుమున తైలంబు తీసే ప్రయాసే అవుతుంది.

అయితే ఆ తన్మయత్వపు స్థాయి చదువరి పఠన చాతుర్య భేదాల మీద ఆధారపడి ఉంటుంది. సుడిగాలి బాలకృష్ణుణ్ని ఎగరేసుకు పోయే తృణావర్తుని కథ చదువుతున్నాం అనుకుందాం. కథ వరకూ చదివి ఊరుకుంటే అది విశ్రుతం. తన్మయత్వానికి ఇ అక్కడ తావన్నదే లేదు. ఆ సుడిగాలిని అచి మందస్మితారవిందంతో కిందకి దిగివచ్చే బాలకృష్ణుణ్ని విస్మృతికి తెచ్చుకుంటేనేగాని సంపూర్ణ తన్మయత్వం సాధ్యం కాదు.

 తన్మయత్వాన్ని పాఠకుడి స్మృతిపథంలోకి మళ్ళించే రసవిద్య బాధ్యత  కృతికర్తది అయితే.. కావ్య పఠనంలోని తన్మయత్వ స్థాయిని అందిపుచ్చుకునే శక్తి చదువరి  బుద్ధిస్థాయి ఆధారితం. ఆ సృజన శక్తి  కవులందరికీ ఒకే విధంగా వశం కానట్లే.. ఈ పఠన కౌశలమూ చదువరులందరి బుద్ధి స్థాయికీ ఒకే విధంగా అందదు. ఆ రస రహస్యం అంతుబట్టకే కావ్య(కవిత్వ)లోకంలో అప్పుడూ ఇప్పుడూ ఇన్నిన్ని వృథా కుమ్ములాటలు!

 

(ఆంధ్ర పత్రిక 1931 సంవత్సరాది సంచిక లోని కవికొండల వెంకటరావుగారి తన్మయత్వంగల్పిక చదివిన తరువాత కలిగిన ఆలోచనలు)

 – కర్లపాలెం హనుమంతరావు

65591_493465577379457_2073403944_n

 

Download PDF

1 Comment

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)