కారా కధల్లో మానవ సంబంధాల జీవధార

KaRa-Bangalore
KaRa-Bangalore

కథాసాహితి ప్రచురించిన కథా -94 ఆవిష్కరణ సభావేదిక (బెంగుళూరు ) పై వాసిరెడ్డి నవీన్, కాళీపట్నం రామారావు, ఎన్.వేణుగోపాల్, పాపినేని శివసంకర్, ఓల్గా, కె.శివారెడ్డి ( ఈ ఫోటో ఆంధ్రప్రభ లో అచ్చయింది)

 భాష ఎంత పురాతనమయిందో కధా ప్రక్రియ కూడా అంత పురాతనమయినదయి ఉంటుందని చేకూరి రామారావు ఊహించారు. భాషలోనే కధన ప్రక్రియను సాధ్యం చేసే నిర్మాణాంశాలు ఉండటం ఇందుకు కారణమని ఆయన అన్నారు. (కధా యజ్ఞం, 1982, పే.1)

భాషకూ కధకూ ఉన్న ఉమ్మడి పునాదిని మానవ సంబంధాల వైపు నుంచి కూడా చెప్పవచ్చును. మానవ సమాజం మనుగడకు అత్యవసరమైనది సామాజిక ఉత్పత్తి క్రమం. దీని కోసం మనుషులు కలుసుకోవలసి వస్తుంది. ఉమ్మడి కార్యాచరణలో పాల్గొనవలసి వస్తుంది. ఈ అవసరం వల్ల మనుషుల మధ్య ఏర్పడే సంబంధాలను మౌలికంగా ఉత్పత్తి సంబంధాలు అంటారు. ఈ ఉత్పత్తి సంబంధాలు సామాజిక పరిణామ క్రమంలో అనేక రకాల మానవ సంబంధాలుగా ప్రతిఫలనం పొందుతాయి. ఆధునిక సమాజంలో భౌతిక వస్తూత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేనట్టు కనబడే మనుషులు ఉండవచ్చు గాని వాళ్ళ మధ్య సంబంధాలకు కూడా సమాజంలోని ఉత్పత్తి సంబంధాలే మూలంగా ఉంటాయి.

ఇటువంటి వివిధ రకాల మానవ సంబంధాలకు భాష ఒక అవసరం, ప్రాతిపాదిక కూడా. ఈ మానవ సంబంధాలను, ఉత్పత్తి క్రమంలో సహజంగా ఏర్పడిన మానవ సంబంధాలను వర్గ సమాజంలోని అనేక అంశాలు వక్రీకరించాయి. వాటి చుట్టూ అనేక మాయలు అల్లాయి. అందువల్ల ఇవాళ మానవ సంబంధాలు సహజంగా, స్వచ్ఛంగా, మానవుల మధ్య సంబంధాలుగా లేవు. రక్తాల మధ్య, వంశాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, డబ్బు మధ్య, సరుకుల మధ్య సంబంధాలుగా మానవ సంబంధాలు కనబడుతున్నాయి.

ఇలా అనేక రూపాలలో, అనేక ఆచ్ఛాదనలతో వ్యక్తమవుతున్న మానవ సంబంధాలను మనుషులు తప్పనిసరిగా తమ చైతన్యంలో ప్రతిఫలిస్తుంటారు. అదే సృజనాత్మక రూపాలలోకి వస్తుంది. కధ ఈ పనినే అద్భుతంగా నిర్వహిస్తుంది. తద్వారా అది ఉనికిలో ఉన్న మానవ సంబంధాల నివేదికగా, విశ్లేషణగా, రానున్న మానవ సంబంధాల వైతాళికురాలుగా నిలుస్తుంది. ఈ అర్ధంలో కధన ప్రక్రియను మానవ సంబంధాల ప్రతిఫలనంగానూ , అవసరంగానూ గుర్తించవచ్చును.

ఐతే మానవ సంబంధాలే వికృతంగా ఉన్నప్పుడూ కధ చిత్రించ వలసిందేమిటి?ఇక్కడనే ప్రక్రియగా కధ నిర్వహించే పాత్ర కన్నా, వ్యాఖ్యాతగా కధకుడు నిర్వహించే పాత్ర ముఖ్యమయినదవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం పరిశీలనా శక్తి ఉన్న కధకుడయినా సమాజంలో ఉన్న కుళ్ళును గుర్తించగలడు, దాన్ని కధలో చిత్రించగలడు. ఇవాళ తెలుగులో వస్తున్న క్షుద్ర సాహిత్యం కూడా తెలుగు సమాజంలోని విలువల పతనానికి ఒకానొక చిత్రణే. ఇక్కడ కధకుడి సామాజిక బాధ్యత రంగం మీదికి వస్తుంది. కధకునిలో పరిశీలనాశక్తి తో పాటే సమాజానికి అర్ధమూ, లక్ష్యమూ తెలిసి ఉంటే ఈ విలువల పఠనం ఎందుకు ఉన్నదో చెప్పగలడు. దాన్నే చిత్రించినా దాని పట్ల అసహ్యం కలిగేలా, దాన్ని కూలదోసే ఆచరణకు పూనుకునేలా చిత్రించగలడు.

కధకుడి పాత్ర ఇంకా ప్రస్ఫుటంగా కనబడే అంశం మానవ సంబంధాల పరిశీలనలో సమగ్రత. ఏ కధకుడయినా మానవ సంబంధాలనే చిత్రించక తప్పదు. మామూలు కధకులయితే ఏదో ఒక కోణాన్ని మాత్రం అర్ధం చేసుకుని ఆ కోణాన్ని పూర్తిగానో, సగమో చిత్రిస్తారు. ఐతే కధా ప్రక్రియ కేవలం మానవ సంబంధాన్నీ ప్రతిబింబించేది మాత్రమే కాదు. అది మానవ సంబంధాలపై గాఢమైన ప్రభావం వేయగలదు కూడా.

ఈ అంశం గుర్తించాలంటే రచయిత సమాజ సారాంశాన్ని, మానవ సంబంధాల చరిత్రను అర్ధం చేసుకొని ఉండాలి. మానవ సంబంధాల గతాన్నీ, వర్తమానాన్నీ, అవగాహన చేసుకుని భవిష్యత్తును వాస్తవికంగా ఊహించగలగాలి. అంటే మానవ సంబంధాల ఏ ఒక్క కోణాన్నో కాక సమస్తాన్ని అవగాహన చేసుకుని చారిత్రక దృక్పధంతో సాన పెట్టుకోవాలి. సామాజిక పరిణామంలోని గతితర్కం మానవ సంబంధాల అభివృద్ధిలో ఎట్లా ప్రతిబింబిస్తుందో గుర్తించగలగాలి.

కాళీపట్నం రామారావు కధలన్నీ ఒకే వరుసలో చదివినప్పుడు మానవ సంబంధాల పట్ల ఆయనకు గల సమగ్ర దృష్టీ, అది పరిణమిస్తూ, పరిణితి చెందుతూ వచ్చిన క్రమమూ, ఆశ్చర్యాన్నీ, ఉత్తేజాన్నీ కలిగిస్తాయి. (మాష్టారిని స్వయంగా ఎరిగిన వాళ్ళు ఆయనకు అంత మార్క్సిజం తెలియదని చెప్పబోతారు గనుక ఒక వివరణ ఇవ్వాలి. సామాజిక జీవితాన్ని సమగ్రంగా, నిశితంగా పరిశీలించి కనిపెట్టిన సారమే మార్క్సిజం. మౌలికంగా మార్క్సిష్టు పరిజ్ఞానం ఉండిగానీ, కనీసం మార్క్సిష్టు పద్దతి ఉండి కానీ సమాజాన్ని నిశితంగా పరిశీలించ గలవాళ్ళు ఎంత సమగ్రత తో పరిశీలిస్తే అంత ఎక్కువగా సిద్ధాంతానికి దగ్గర కాగలరు. మాష్టారు తన కధల్ని “మార్క్సిస్టు వాసనలు పరోక్షంగా కూడా లేకుండా” రాశారని ఎవరయినా చెప్పబోయినా అది మాష్టారి పరిశీలనా శక్తికీ, మార్క్సిజపు వాస్తవికతకూ తిరుగు లేని నిదర్శనమే అవుతుంది. కానీ “జీవితానికి మార్క్సిజం అవసరం లేద”నే వాదనకు పునాది కాదు)

కారా కధలన్నీ కూడా మానవ సంబంధాల చిత్రణలే. కధా ప్రక్రియ కోసం ఒక్కొక్క కధలో ఒక్కొక్క సంబంధాన్నో, ఒక్కొక్క క్రమాన్నో చిత్రించవచ్చుగాని అక్కడ ఆయనకు ఆయా సంబంధాల గురించి, క్రమాల గురించి సమగ్రమైన అవగాహన ఉన్నదని స్పష్టంగా తెలిసిపోతుంది. అట్లాగే, చాలా సార్లు అమాయకంగా కనబడే ఆ చిత్రణ చాలా పటిష్టంగా పాఠకుణ్ణి ఒక ఉన్నత మానవ సంబంధం వేపు నడిపించే నిర్మాణాత్మక ప్రయత్నంగా ఉంటుంది.

ఇప్పుడు సంకలనంగా వచ్చిన ఆయన కధలు మొత్తం 25, ఈ కధలను వేరువేరు ప్రాతిపదికల మీద గతంలో విమర్శకులు మూడు భాగాలుగానో, రెండు భాగాలుగానో విభజించారు. కానీ ఈ కధలన్నీ మానవ సంబంధాల చిత్రణలనే ప్రాతిపదిక మీద చూసినప్పుడు వాటన్నిటిలోనూ ప్రవహించే అవిచ్ఛిన్న జీవధార కనబడుతుంది. ఐతే మానవ సంబంధాలకు సంబంధించిన ఉద్వేగాల కోణాల్ని చిత్రించడానికి తొలి కధలు పరిమితమైతే, మానవ సంబంధాల పునాదిని, కొంతవరకు ప్రత్యక్షంగా ఉత్పత్తి సంబంధాల్ని తర్వాతి కధలు చిత్రించాయి. బహుశా ఈ కారణం వల్లనే తొలి కధలు ఉన్నత వర్గాల వాతావరణంలో మాత్రమే సాగగా, తర్వాతి కధల వాతావరణం విస్తృతమయింది.

మానవ సంబంధాల వ్యక్తీకరణలో కారా మొట్ట మొదట ఎక్కువగా చిత్రించినది కుటుంబాలలో కొనసాగుతున్న అప్రజాస్వామికత, ముఖ్యంగా ఆయన తన దృష్టిని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీద కేంద్రీకరించారు.

కుటుంబం అనే సామాజిక, ఆర్ధిక యూనిట్టు ఎట్లా ఉనికిలోకి వచ్చిందీ, దాని భవిష్యత్తు ఏమిటి అనే చర్చ అలా ఉంచి ఇవాళ కనబడుతున్న కుటుంబ రూపాల్ని పరిశీలించడమే కారా కధలు చేసిన పని. కుటుంబం ప్రధానంగా అంతరాల వ్యవస్థ మీద ఆధారపడుతుంది. ఈ అంతరాలు కరుడు గట్టిపోయి ఉంటాయి. ప్రాధమిక యూనిట్ నుంచే అంతరాల వ్యవస్థ నెలకొనడం తనకు అవసరం గనుకు రాజ్యం ఈ అంతరాల వ్యవస్థను పెంచి పోషిస్తుంది. ఈ కఠినమైన అంతరాల వ్యవస్థలో ధిక్కారస్వరానికి అవకాశం లేదు. సాంప్రదాయంలో ఇమడని ఆలోచనకు, ఆచరణకు స్థానం లేదు. ఒక అంశం పరిష్కరించవలసి వచ్చినప్పుడు కూలంకషమైన పరిశీలన, చర్చ వేరువేరు అవకాశాల ప్రతిపాదనలు, సమగ్రమైన అవగాహనతో పరిష్కారం అనేది సరైన పద్ధతి. కానీ అంతరాల వ్యవస్థలో ఈ క్రమానికి బదులు కుటుంబ ‘యజమాని’ శాసనమే సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ పరిష్కారం మంచిదైనా, చెడుదైనా అసలు దాని క్రమం చాలా నిరంకుశమైనది.

ఈ అంతరాల వ్యవస్థ ఎంత నిరంకుశమైనదయినా, బాధాకరమయినదయినా వర్గసమాజం కొనసాగినంత కాలం అది కొనసాగుతుంది. భూస్వామ్యంలో బలమైన కుటుంబ వ్యవస్థతో అది కలగలిసి ఉంటుంది. ఒక తాతో, పెదనాన్నో, మామో కుటుంబానికంతటికీ శాసనకర్తగా ఉంటాడు. ఆయనే నిర్వాహకుడూ, తీర్పరీ కూడా. ఆధునిక రాజ్యాలు విడగొట్టిన మూడు అధికారాలు ఇంటికి సంబంధించి నంతవరకు ఆయన తన గుప్పిట్లోనే పెట్టుకుంటాడు. దుస్సహమైన ఈ స్థితి దుర్మార్గమైనది. ఈ స్థితి అనుభవించవలసి వచ్చిన వాళ్ళు తీవ్రమైన వేదనకు లోనవుతారు. ఈ స్థితిలో సమస్యలు పరిష్కారాలు అప్రజాస్వామికంగా, అసంబద్ధంగా జరుగుతాయి. ఈ స్థితికి గల వేరువేరు ముఖాలను ‘పెంపకపు మమకారం’ ‘రాగమయి’ ‘అభిమానాలు’ ‘అశిక్ష- అవిద్య’ ‘తీర్పు’ ‘ఇల్లు’ కధల్లో కారా చిత్రించారు.

ఉమ్మడి కుటుంబంలో మమకారం కూడా ఎట్లా సూటిగాకాక వక్రరూపాల్లో ప్రకటితమవుతుందో ‘పెంపకపు మమకారం’ లో చిత్రణ పొందింది. అందువల్లనే చర్చ ద్వారా పరిష్కరించదగిన అతి చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారిపోతుంది. ఐతే ఆ సమస్య జటిలం అవుతున్న కొద్దీ కుటుంబంలోని అప్రజాస్వామికత వల్ల పరిష్కారం అప్రజాస్వామికంగానే జరుగుతుంది. నిజానికి అప్పుడు పరిష్కారపు మంచి, చెడులుగాక అది అమలయిన తీరు గురించి ఆలోచించవలసి వస్తుంది. వచ్చిన సమస్యను చర్చ ద్వారా, వస్యంగా ప్రజాస్వామికంగా పరిష్కరించి ఉంటే ఆ స్థితిని అనుభవించిన వ్యక్తులందరి వేదనా సమసిపోయేది.

మధ్య తరగతిలో అంతరాల వ్యవస్థతో ఒక కుహనా ప్రతిష్ట కూడ కొనసాగుతుంది. సామాజిక స్థితికీ, ఈ కుహనా పటిష్ఠకూ ఉన్న విభేధంవల్ల ఆ కుటుంబమంతా తీవ్రమైన ఘర్షణలకు లోను కావలసి వస్తుంది. ఈ ఘర్షణలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోగల వాతావరణం లేనప్పుడు నిష్టూరాలు, నిందలూ, అకారణ కోపాలు, అనవసరమైన ఆదేశాలు రంగం మీదికి వస్తాయి. ఈ స్థితిని చిత్రించింది ‘రాగమయి’. గ్రామీణ వ్యవస్థలోని మంచితనం, పరోపకారత వంటి విలువలు ఉన్నప్పటికీ ఈ స్థితి ఇట్లా కొనసాగఊక తప్పదని ‘రాగమయి’ చూపుతుంది.

ఒక వైపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూలి పోతూ, ప్రజాస్వామిక మానవ సమాజ యూనిట్ ఏర్పడని సంది దిశలో వచ్చే విలువల పతనాన్ని ‘అబిమానాలు’ పట్టుకుంటుంది. కొత్త, పాత విలువల మధ్య ఘర్షణ వల్ల, సమన్వయం కుదరక పోవడం వల్ల కుటుంబ వాతావరణంలో అనవసర వైరుధ్యాలే ఎంత ప్రధానంగా కనబడి, ఎంత వేదనకు కారణమవుతాయో ‘అభిమానాలు’ వివరిస్తుంది.

2013-06-16-158

‘అభిమానాలు’ నుండి ఇంకా ముందుకు వెళ్ళి కారా ‘అశిక్ష – ఆవిద్య’, ‘తీర్పు’, ‘ఇల్లు’ రాశారు. ఇవి మూడూ నిజానికి కాల వ్యవధిలో దూరపు కధలైనా ఒకే వరసలో ఉన్న కధలు.

ఉమ్మడి కుటుంబంలో సమస్యా పరిష్కారాలు జటిలంగా ఉండక తప్పదని వివరించాక, ‘అశిక్ష – ఆవిద్య’ కధ, కారా పరిశీలనా శక్తి అనివార్యమైన ములుపుకు చేరిందని చెబుతూ ముగుస్తుంది.

“లోకగతిలో ఇట్లాంటి సంఘటనలనీ ఒక పెద్ద లెక్కలోకి వచ్చే విషయాలు కాక పోయినా వ్యక్తులను వ్యష్టిగా తీసుకొని చూస్తే కొందరి జీవితాలకు ఎంతో అస్తవ్యస్థములుగా మార్చగలిగే ఇంతటి పెద్ద సంఘటనలు కొన్ని కొన్ని కుటుంబాలలో అప్పుడప్పుడూ జరుగుతుండటానికి అసలు మూల కారణాలు – వాటి కుదుళ్ళు – ఏమిటి? ఎక్కడ ఉన్నవి?

“ఈ రెండే అతడు ఎన్నడూ పరిశీలించని విషయాలు – లేక పరిశీలించాలనే స్ఫురణకు గురికాని విషయాలు!” అంటూ ‘అశిక్ష – ఆవిద్య’ ముగుస్తుంది. మనుషుల మధ్య సంబంధాలలో తీవ్రమైన మార్పులు కలిగిస్తున్న మూల కారణాలను- వాటి కుదుళ్ళను – కనిపెట్టాలనే స్ఫురణే లేకుండా చేసింది కుటుంబ వ్యవస్థ. ఆ మత్తు నుంచి తేరుకుని ఆ పరిశీలనకు పూనుకుంటే అద్భుతాలు జరుగుతాయి, సమాజ సారాంశం అవగాహనలోకి వస్తుంది. ఈ కధ తర్వాత తొమ్మిది సంవత్సరాలు పాటు కారా కధలు రాయటం మానేశారు. ఈ రెండు ప్రశ్నలకు ఆయన జవాబులు కనిపెట్టారని తర్వాతి కధలు రుజువు చేస్తాయి. ఐతే ఆయన అంతకుముందు కూడ నిశితమైన, సమగ్రమైన పరిశీలనతో కధలు రాశారు గనుక ధార తెగిపోలేదు. మరీ ముఖ్యంగా సరాసరిగా మూలాలలోకి వెళ్ళేముందు కుటుంబ సంబంధాలలోని మరో రెండు అంశాల్ని ఆయన వివరించవలసి ఉంది. అట్లా వచ్చినవే ‘తీర్పు’, ‘ఇల్లు’.

తీర్పు కధలో సుంద రామయ్య పిల్లల మధ్య వచ్చిన సమస్యను తనకు తోచిన రీతిలో ప్రజాస్వామికంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కాని తీర్పు సాధ్యం కాదు. ఎందువల్లనంటే ప్రజాస్వామిక తీర్పు ఒకానొక వ్యక్తిగత, మానసిక చర్య కాదు. అది ఒక ప్రత్యేక సామాజిక, చారిత్రిక నేపధ్యంలో తప్ప కుదరదు. ఇంట్లో అసమానతల చట్రాన్ని యధాతధంగా ఉంచాక ప్రజాస్వామిక తీర్పు సాధ్యం కాదు. అందుకే చాల రకాల తీర్పులు ఏకకాలంలో న్యాయంగానూ, అన్యాయంగానూ కూడా కనబడతాయి. అంతే అంతరాల వ్యవస్థ ఉన్నంత కాలం న్యాయాన్యాయాల నిర్వచనాలు వేరువేరుగానే ఉంటాయి. ప్రజాస్వామిక తీర్పు ఎప్పుడు సాధ్యమవుతుందో గుర్తించకపోతే, ఎంత చిత్త శుద్ధితో చేసినా ఆ తీర్పు నిష్పలమే అవుతుంది.

మధ్య తరగతి కుటుంబాల గురించి, ఆ కుటుంబాల్లో వ్యక్తుల మధ్య సంబంధాల గురించి పరిశీలనలో గుర్తించవలసిన అంశం భరోసా కోసం వెతుకులాట. కూలి పోతున్న కుటుంబ వ్యవస్థలో ఈ భరోసా కోసం వెతుకులాట ప్రస్ఫుటమవుతుంది. “నేను ఎప్పుడేది చేసినా వాడి మేలుకోరి ఏదీ చేయలేదు. వాడికి చెప్పే నీతులు వాడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాక నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెప్పేను. వాడికి చెప్పించిన చదువంతా నా కోసమే చెప్పించుకున్నాను …..” అని పావనరామయ్య బహిరంగంగా చెప్పిన విషయం, అనేక తరాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదే. ఐతే ఇప్పుడు, కుటుంబం కూలిపోతున్న దశలో భరోసా నిలిచేది పిల్లలా ఆస్తియా,(ఇల్లా) అనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్ననే ‘ఇల్లు’ ప్రతిబింబించింది.

మానవ సంబంధాలు ఇన్ని వేల ఏళ్ళ తర్వాత కొని ఉదాత్తభావనల్ని ఏర్పరచుకున్నాయి. సమాజం వాటిని సాధించవలసిన ఆదర్శాలుగా, ఆహ్లాదకరమైన అంశాలుగా గుర్తిస్తోంది. న్యాయం, మానవతాస్పర్శ, ప్రేమ, స్నేహం, ఆనందం, శాంతి వంటి విలువలు ఇవి. అట్లాగే సమాజం ఈ విలులను నిలబెట్టే క్రమంలో హింసను అధికారాన్ని, భయాన్ని, కుట్రను, శతృత్వాన్ని తోసివేయదలచుకున్నది.

ఇవన్నీ మానవసంబంధాల వ్యక్తీకరణలే. ఇవి వర్గ సమాజంలో ఏ అర్ధాల్ని సంతరించుకుంటాయో, ఎవరెవరు వీటికి ఏ ఏ నిర్వచనాలు ఇచ్చి తమ ప్రయోజనాల కోసం వాడుకుంటారో ‘వీరుడు – మహా వీరుడు’ నుంచి ‘కుట్ర’ వరకు కధలు వివరిస్తాయి.

ఈ కధలలో ప్రధానంగా చర్చించవసినవి ‘హింస’, ‘నో రూమ్’, ‘స్నేహం’ . మిగిలిన కధలన్నిటినీ కూడా అర్ధం చేసుకోవడానికి తగిన విశ్లేషణా సాధనాలను ఈ కధల నుంచి కనిపెట్టవచ్చును. అందుకే ఇక్కడ వీటిని మాత్రమే చర్చించడం జరుగుతున్నది. ఈ మూడు కధలకు కూడ శీర్షికలే వివరమైన ఆలోచనలను ప్రేరేపించగలవి.

‘హింస’ కధలో ముఖ్యమైన పాత్రలు రెండు – దారుణమైన జీవితానుభవాలు పొందిన పైడమ్మ, ఆ దారుణాలన్నీ ఒకే ఒక్క రోజు స్ఫురణకు వచ్చిన సంగి, పైడమ్మ చెల్లెలు. పైడమ్మ పెళ్ళయి కష్టాల కాపురానికి వెళ్ళింది. అత్తవారింట్లో కూలికి వెళ్ళి అక్కడ ఆ భ్రమలకో, ఏ బలవంతాలాకో లొంగిపోయింది. ఆమె “రంకు” ఒక్కటే బయట పడి చావు దెబ్బలు తింది. అక్కడ్నించి పారిపోయి ఒంటరి స్త్రీ అనుభవించే బాధలనీ అనుభవించి చివరికి విశాఖపట్నంలో సబ్బారపు సంజీవమ్మ కంపెనీకి చేరింది. ఒక్క రోజు కోసం తల్లిని చూడడానికొచ్చి అవహేళనలను ఎదుర్కొంది. తల్లి దగ్గర ఆశ్రయం దొరకదని తెలుసుకుంది. ఈ అవహేళనలూ, అవమాణాలూ మరింత సూటిగా సంగి చెవిన పడ్డాయి. కుటుంబాన్ని ఎన్నో రోజుల తర్వాత కలిసిన ఆనందమూ, ఆప్యాయతా లేకుండానే పైడమ్మ వెళ్ళి పోయింది. ఆ దుఃఖంలో చిట్టడివికి వెళ్ళిన సంగి నక్కలు పొట్టన పెట్టుకున్న మేకపిల్లను చూసింది. ఆ అమ్మాయికి నక్కల పని చెప్పాలన్నంత ఆవేశం రగిలింది.

ఇవాళ సమాజంలో భౌతిక హింసను మాత్రమే హింసగా గుర్తిస్తున్నాం. రక్తం కారడమే, గాయంకావడమే, నక్కలు మేకను చంపివేయడమే హింసగా గుర్తిస్తున్నాం. నిజానికి సంగి అనుభవించిన వేళాకోళంలోనే హింస ఉంది. జగ్గమ్మ, పైడమ్మ, సంగిల ఆశలు, వాళ్ళ మధ్య ఆప్యాయతలు బలవంతాన తుంచివేయడంలో హింస ఉంది. ప్రేమ చంపుకోవలసి రావడంలో హింస ఉంది. ఒక తల్లికీ తన బిడ్డను తన ఒడిలోకి తీసుకునే వీలు లేక పోవడంలో హింస ఉంది. కన్నీళ్ళలో హింస ఉంది. గుండె గాయంలో హింస ఉంది. పేదరికంలో హింస ఉంది. అసలు వర్గ సమాజం కొనసాగుతుండడమే ఒక హింస. వర్గ సమాజంలో ఒక అంతర్గత హింస. భౌతిక హింసను మించిన స్థాయిలో , విస్తృతిలో వేరు వేరు రూపాలలో జరుగుతూ ఉంటుంది. ఐతే వర్గ సమాజం ఉద్దేశ్యపూర్వకంగానే ఆ అన్ని హింసరూపాలకూ అందమైన, మోసగించే పేర్లు పెడుతుంది. ఆ పేర్లతో అవి ఎదురయినపుడు మన, వాటిని హింసగానూ గుర్తించలేం. వాటిని రద్దు చేయడానికి అవసరమైన ప్రతిస్పందననూ పొందలేం.

ఈ అంతర్గత హింసను ‘హింస’ కధ ప్రతిభావంతంగా చిత్రిస్తుంది. జీవితక్రమం మొత్తంలోనూ హింస వ్యాపించి ఉన్నదని ఈ కధ మన దృష్టికి తెస్తుంది. విశ్వవ్యాప్తంగా కొనసాగుతున్న హింసకు మనుషులు మామూలు ప్రతిస్పందనలు ఎట్లా ఉంటున్నాయో కూడా కధ వివరిస్తుంది. దాసు, అతని బృందం చేసిన హింస సంగికి హింసగా కనబడలేదు. గనుక వాళ్ళతో ఆ అమ్మాయి మర్యాదగానే వ్యవహరించింది. “కంసాలోడిననడవెందుకూ…. మన బంగారం మంచిదైతే ఆడేం సెయ్యగలడూ…. “ అంటాడు చిన్నాయన తప్పు హింసకు గురయిన వాళ్ళదేనన్నట్లు. “యెనకా గోయ్యే, ముందూ గోయ్యే…. ఇది పరిక్కంప మీద పట్టుకోక అప్పా! తీసినా దక్కదు తియ్యకున్నా దక్కదు” అని నిస్సహాయతను ప్రకటిస్తుంది పెద్దమ్మ. అంతర్గత హింసకు మనం స్పందించే పద్దతులలో ఇవి కొన్ని. ఈ హింస వాళ్ళకు అర్ధం కాలేదు. ఎక్కడో ఒక చోట అది హింస అని అర్ధమయినా దాన్ని కూల్చే మార్ధమేమిటో తెలియదు. ఈ సంగతులేమీ స్పష్టంగా అర్ధాంకాని సంగికి మాత్రం తల్లి ఆశను కోసేసుకోవడానికి చాలా బాధపడుతోందని తెలిసింది. ఇట్లా నిరాయుధ హింస గురించి ఏ కొంచెమో అర్ధమైన సంగి చెలకలో దౌర్జన్యాన్ని, భౌతిక హింసనూ చూసింది. అక్కడ ఆమె వెంటనే నక్కల మీదికి కొడవలెత్తింది. సంగి ఆలోచనల్లోనూ, ఆచరణలోను ఇది గుణాత్మక మార్పు. కానీ చాలా మంది కధకులలోలాగా ఇక్కడ దానికి నాటకీయత లేదు. అది చాలా సహజంగా, అనివార్యంగా సంభవించింది.

ఈ గుణాత్మక మార్పే సమాజమంతా వచ్చే క్రమం మొదలయితే సమాజంలో మానవతా స్పర్శ, ప్రేమ, స్నేహం, స్వచ్చమైన ఆనందం నెలకొనే కృషి ప్రారంభమవుతుంది. అప్పటిదాకా వాటికి ఈ సమాజంలో “ నో రూమ్’.

దుర్మార్గం, అనుమానం, దారిద్ర్యం, నిండిన ఈ సమాజంలో మానవతా స్పర్శకు, ప్రేమకు, స్నేహానికి, స్వచ్చమైన ఆనందానికి స్థానం లేదని లాడ్జి గుమస్తా నుంచి, గాంధీ, నెహ్రూలను దేవుళ్ళుగా కొలిచే నూకరాజు వరకు ప్రతిఒక్కరూ మనకు తమ చేతలతో చూపుతారు. అంతంత మాత్రం శుభ్రమైన లాడ్జింగ్ లోనైనా అమ్మడుతో ఒక్క రాత్రి ఏకాంతంగా గడపాలని నూకరాజు కోరిక. నగర సంస్కృతి వాళ్ళకా అవకాశం లేదంటుంది. ఇదివరకెప్పుడో ఇటువంటి ఆనందం కోసమే తపించి నిరాశ చెందిన దేవుడు కొంతసేపయినాకా, ‘ఆ కుర్రదీ కుర్రోడూ ఏమైనారో’ అని ఆలోచిస్తాడు. తాను అప్పాయమ్మ కోరిక తీర్చలేకపోవడం గుర్తొచ్చి ఈ జంటకు సాయ పడదామనుకుంటాడు. ఎక్కడా గది దొరకక విసిగిపోయి ఉన్న నూక రాజుకి, అమ్మడికి ఎదురుపడి ఆప్యాయంగా పలకరించబోతాడు. ఆ పలకరింపునూ, ఆర్ధ్రతను అనుమానించిన నూకరాజు దేవుణ్ణి చితక తంతాడు.

దేవుడు – అప్పాయమ్మ, నూకరాజు –అమ్మడు కోరుకున్నది ఏకాంతం., ఇష్టాపూర్వకమయిన, స్వచ్చమైన ఆనందం. ఒక్క రోజాయినా మరే ఆలోచనా, మరే భయమూ, మరే ఆందోళనా లేకుండా అనుభవించగల ప్రేమ. వాటికి ఈ వ్యవస్థలో స్థానం లేదు. కోర్కె తీరకుండానే చనిపోయిన అప్పాయమ్మను తలచుకుని పేదతనమంత క్రూరమైంది లేదనుకుంటాడు. ఆ క్రౌర్యానికి గురైన జంటను ఆర్ధ్రంగా పలకరిద్దామనుకుంటాడు. స్నేహం చూపుదామనుకుంటాడు. కానీ ఈ వ్యవస్థ ఎటువంటిదంటే ఇక్కడ స్నేహానికీ స్థానం లేదు. స్నేహ హస్తాలు అనుమానించబడతాయి. ఆర్ధ్రమైన పలకరింతకూ, లాభ నష్టాల లెక్కలలోకి ఇమడని స్నేహానికీ ఇక్కడ గౌరవం లేదు. లోకంలో హింస ఎంత విస్తృతమయిందంటే, ఆప్యాయత ఎంత కరవై పోయిందంటే, గాంధీ భక్తుడైన నూకరాజు కూడా తన పట్ల ఆప్యాయత ప్రదర్శించే వాళ్ళు ఉండగలరని ఊహించలేదు. స్నేహానికి హింసతో జవాబు చెప్పకుండా ఉండలేడు.

మరి లోకంలో ఈ ఉదాత్తభావాలు కరవై పోయి ఉన్న స్థితిలో స్నేహామంతా లాభనష్టాల లెక్కలలోకి ఇమడవలసిందేనా? స్నేహామంటే ఏమిటి? అది ఇవాళ ఉన్న రూపం ఏమిటి? ఈ రూపం ఎందువల్ల వచ్చింది? ఈ ప్రశ్నలకు జవాబుల అన్వేషణలో పుట్టిన కధ ‘స్నేహం’.

కొడుకు ఉద్యోగ ప్రయత్నం కోసం, ఎన్నో ఏళ్ళ కింద తెగిపోయిన స్నేహాన్ని, మళ్ళీ గుర్తు చేసుకుంటూ గోపాలరావు దగ్గరికొస్తాడు శివరామయ్య. అప్పటికప్పుడు డబ్బు అవసరం గనుక శివరామయ్యతో స్నేహం నటిస్తాడు రాజారావు. ఉన్నత వర్గంలో కలిసిపోవాలనే తపనతో గోపాలరావుతో స్నేహం చేస్తుంటాడు రాజారావు. గోపాలారావు కూడా శివరామయ్య స్నేహాన్ని తన అవసరం తీరే మార్గంగా వాడుకుంటాడు. పైగా “ఈ లోకంలో ఒకరికొకరు ఏదో అవుతారన్నది ఒట్టి కల్ల…. మనిషి మనిషితో కలిసి తిరుగుతాడంటే … ఎందుకు కలిసి తిరుగుతాడంటే – అవసరం! ఆ అవసరాన్ని బట్టే అన్నితిరుగుళ్ళూ! ఇన్ని తిరుగుళ్ళూ… స్నేహామంటే ఇంతే. అది బాల్యస్నేహమవ్వచ్చు. పడుచు స్నేహమవ్వచ్చు – ఆ స్నేహం, ఈ స్నేహం… ఏ స్నేహమన్నా కానీ – ఏదయినా పేరు తేడాయేగాని సరుకొక్కటే ….” అని సిద్ధాంతం చెబుతాడు.

“మూడు రూపాయల కోసం మూడు పీకలు కోయగల మనుషులున్నారు ఈ లోకంలో. వాళ్ళకీ ఏవో ధీరీలు ఉండే ఉంటాయి. అలాంటప్పుడు మూడు వందల కోసం డాక్టరు ఓ ముండమోపి థియరీ తీసేడంటే వింత కాదనుకొంది మీనాక్షీదేవి.

లోకంలో స్నేహమే లేదంటే ఆమె భావనాలోకంలో బ్రతుక్కి అర్ధమే లేకుండా పోతుంది మరి!

“అవును అదీ ఓ థీరీయే” అంటూ ఈ కధ ముగుస్తుంది.

ఇక్కడ స్నేహాన్ని ఎవరెవరు ఎట్లా చూస్తున్నారు? వర్గ సమాజంలో స్నేహం ఏ ఏ రూపాలలో వ్యక్తమవుతుంది ? లోకంలో స్నేహమనేది ఉందా? ఉన్నదనుకుంటే మరి ఇవాళ అవసరం మాత్రమే పునాదిగా ఉన్నట్లు కనబడుతున్న స్నేహం సంగతేమిటి? లేదనుకుంటే మరి మనిషికీ మనిషికీ మధ్య సంబంధానికి ప్రాతిపదిక ఏమిటి? అవసరమే ప్రాతిపదిక అనేట్టయితే అవసరాలు తీరిపోయిన మనిషికి స్నేహాలు ఉండవా? మనుషుల అవసరాలు తీరిపోయే వర్గరహిత సమాజంలో స్నేహాలుండవా? – ఈ ప్రశ్నలన్నిటికీ వీలు కల్పించి, స్నేహం పట్ల భావనలు ఎంత గందరగోళంగా ఉన్నాయో ఈ కధ మన దృష్టికి తెస్తుంది.

ఈ గందరగోళాన్ని సృష్టించింది వర్గ సమాజమే. వర్గ వైరుధ్యాన్ని చైతన్యంతో గుర్తించి దాన్ని రద్దు చేసే పోరాట                       క్రమంలో ముందుకు సాగుతున్న కొద్దీ ఈ గందరగోళం తగ్గిపోతుంది. రచయిత ఉద్దేశ్యం ఈ గందరగోళాన్ని మాత్రమే ప్రదర్శించి, కొనసాగుతున్న తప్పుడు భావనలకు బలం కలిగించడం కాదు. స్నేహానికి ఇవాళ కనబడుతున్న అర్ధాల, అసందర్భాన్నీ ఆయన వివరిస్తారు. మీనాక్షీదేవికి స్నేహం అవసరం మీద మాత్రమే ఆధారపడనవసరం లేదన్న స్పృహ ఉంది. ఆమె భావనాలోకంలో స్నేహామంటే బతుక్కి అర్ధం. స్నేహాన్ని అవసరంతో సమానం చెయ్యడం ముండమోపి ధియారీగా భావించిన మీనాక్షీదేవి స్నేహాన్ని మరో కొసకు తీసుకుపోయి, వాస్తవాలతో సంబంధం లేకుండా ఊహాలోకపు ఉద్వేగంగా గుర్తిస్తుంది. దీంట్లో మొదటిది స్నేహం పట్ల మామూలు, యాంత్రిక అవగాహన కాగా, రెండోది కాల్పనిక, స్వీయమానసిక అవగాహన.

“మనిషిని మనిషిగానూ ప్రపంచంతో ఆతని సంబంధాన్ని మానవీయమైనదిగానూ భావించండి. అప్పుడు ప్రేమకు ప్రేమ ద్వారా మాత్రమే బదులు తీర్చుకోగలరు. నమ్మకానికి నమ్మకంద్వారా మాత్రమే జవాబివ్వగలరు… మనిషితోనూ, ప్రకృతి తోనూ మీకు గల ప్రతి ఒక్క సంబంధమూ మీ ఆశయ లక్ష్యానికీ, మీ వాస్తవ వ్యక్తిగజీవితానికీ సంబంధించిన విశిష్ట వ్యక్తీకరణగా ఉంటుంది.” అంటాడు మార్క్స్. (ఎకనమిక్ అండ్ ఫిలాసాఫికల్ మాన్యూ స్క్రిప్ట్స్ఆఫ్ 1844)

వర్గరహిత సమాజంలో మనుషుల మధ్య స్నేహం ఒక సహజత్వం, ఒక అనివార్యత, ఒక చారిత్రక, సామాజిక అవసరం. సంఘజీవులుగా మనుషుల్లో ఈ స్నేహాకాంక్ష ఎల్ల వేళలా ఉంటుంది. మానవుల సంఘ జీవితం ఎన్నెన్ని చీలికలకు దారి తీసిందో అన్నీ అడ్డుగోడలు ఈ స్నేహాకాంక్ష మీద పరుచుకున్నాయి. ఈ గోడలన్నీ పగులగొట్టి స్నేహ స్వరూపాన్ని గుర్తించడం, ఆచరించడం శ్రామికవర్గ దృక్పధానికి మాత్రమే సాధ్య పడుతుంది. కధా కాలంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ రాజారావు, శివరామయ్య, గోపాలరావు, మీనాక్షీ దేవి ఒకే తానులో ముక్కలు గనుకనే వాళ్ళకు స్నేహారూపం అర్ధం కావటం అసాధ్యం. అందువల్లనే వాళ్ళు స్నేహపు వికృత రూపాన్నే దర్శించగలరు. ప్రర్శింపగలరు. (స్నేహ స్వరూపాన్ని గుర్తించిన శ్రామిక వర్గ దృక్పధం గలవాళ్ళు కూడా సమగ్రంగా దాన్ని ఆచరించడం ప్రస్తుత సమాజంలో కష్ట సాధ్యం, అసాధ్యం కూడా.)

ఇక్కడి దాకా, 1969 ఏప్రిల్ లో రాసిన ‘స్నేహం’ దాకా ప్రధానంగా మానవసంబంధాలలోని అప్రజాస్వామికత గురించి రాస్తూ వచ్చిన కారా, ఆ తర్వాత రావలసిన ప్రజాస్వామికత గురించి, అంతకన్న ముఖ్యంగా ప్రజాస్వామికత సాధించే ఆలోచనల, ఆచరణల గురించి కధలు రాయటం మొదలు పెట్టారు. పైననే చెప్పినట్టు ఈ ప్రజాస్వామికతను సాధించే మార్గం శ్రామిక వర్గ దృక్పద్ధమే. ఆ దృక్పధాన్ని ఆయన 1951 నవంబర్ లో రాసిన “అప్రజ్ఞాతం” లో చిత్రించే ఉన్నారు. ఐతే తెలుగు సీమలో 1951 నవంబర్ నాటికి కధా నాయకుడు సుదర్శనానికి మాత్రమే గాక, కమ్యూనిష్టు పార్టీకే ఆ ధృక్పథపు మార్గం అప్రజ్ఞాతం కావడం మొదలయింది.

ఆ అప్రజ్ఞాతాన్ని జ్ఞాతం చేయాలనే ‘ఆర్తి’ 1969 తర్వాతనే మొదలయింది. ఆర్తి, భయం, శాంతి, చావు, జీవధార, కుట్ర కధల్లో కారా సమాజంలోని అప్రజాస్వామికను చూపడంతో పాటే, ప్రజాస్వామికతను సాధించే వివిధ మార్గాల గురించి ఆలోచనను రేకెత్తించడానికి ప్రయత్నించారు.

మోచేతి కూడు తినదలుచుకోని పైడయ్య (ఆర్తి), తన ఊరిని కొత్తగా కనిపెట్టిన గురవడు (భయం), వర్గ సమాజ ఆవిర్భావం నుంచీ “తేలకుండా చిక్కుపడిపోయిన విషయాన్ని” “ఇహ కుదరదు, ఆ రోజు వెళ్ళిపోయింది, ఆ సంగతి గ్రహించాలి” అని యజమానికీ, ప్రభుత్వానికీ సీరియస్ గా హెచ్చరిక జేసిన విశ్వనాధం (శాంతి), “ అది రావాల. బూమ్మీద యీ వొనాశవంత సూసినప్పుడు నాకదే అనిపిస్తాది. పెళయం తప్ప ఈ బూమ్మీది మురికిని మరేది కడగలేదు. పోతే అన్నీ పోతాయి. మనుషులవూ పోతావు. పోయినా సరే.” అనే కన్నయ్య (చావు), కసురుకున్నా, విసుక్కున్నా, కుక్కల్నీ, పోలీసుల్నీ చూపి భయపెట్టినా కలవారినిబ్బంది పెట్టక వల్లకాదని గుర్తించి, ఇద్దరు ముగ్గురై, ముగ్గురు పదిమందిలో చేరీ రెండంతస్తుల భవనాల సింహద్వారాల వద్ద చేరి “కడ వరకూ” గేటు వదలని ఆడవాళ్ళు (జీవధార), “నువ్వాలాగా, మరీ అంతకంతల్లేని గదిలో కాపరవెట్టి, ఉన్న ఒక్క గుమ్మానికీ మంచం అడ్డేసేస్తే ఆ కాపరం సక్కబెట్ట దలచినోడికి రెండే రెండు దార్లు. నిశిరాత్రి నీ పీక పిసికీడం మొదటిది. లేదా గోడలు బద్దలు గొట్టేయాల. మూడో దారి లేదు” అన్న ‘కుట్ర’ వ్యాఖ్యాత మానవసంబంధాల దుస్థితినే వాఖ్యానిస్తున్నారు. అవి మంచి వైపు మారాలనే ఆర్తినీ, అందుకు తమకు తోచిన మార్గాలనూ ప్రకటిస్తున్నారు. కారా కధల మౌలికాంశం మానవ సంబంధాల విశ్లేషణే. వర్తమానం గురించిన ఈ విశ్లేషణ, వర్తమాన అవ్యవస్థను చిత్రించే మాట నిజమే కాని, దాని సందేశం నిరాశ కాదు. ఆ వ్యవస్థను కూల్చేయవలసిన అవసరం, భవిష్యత్తు పట్ల ఆశ. ఈ అర్ధంలో కారా నిశిత సామాజిక వ్యాఖ్యాత, సామాజిక మనస్తత్వవేత్త.

[ఈ పరిధిలోకి వచ్చినా ఇంకా విస్తృతంగా చర్చించవలసి ఉన్న మరికొన్ని కధల్ని స్థలా భావం దృష్ట్యా వదిలేయడం జరిగింది.]

ఎన్. వేణుగోపాల్

“Modata Arunatara January – March 1987 sanchikalo prachuritamaina ee vyaasam aa tarvaata N Venugopal vyaasa samputam Kathaasandarbham (2000) lo kooda achchayindi”

(  మొదట అరుణతార జనవరి -మార్చి 1987 సంచిక లో ప్రచురితమైన ఈ వ్యాసం ఆ తరువాత ఎన్. వేణుగోపాల్ వ్యాస సంపుటి కథాసందర్భం 2000) లో కూడా అచ్చయింది. )

Download PDF

1 Comment

  • N Venugopal says:

    అఫ్సర్, రమాసుందరి గారూ

    తొలి ప్రచురణ వివరాలు, ఫోటో వివరాలు ఇస్తే బాగుంటుంది….

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)