‘‘ఇంటర్ స్టెల్లార్’’ లో దాగిన రహస్యాలు కొన్ని!

our-legend-of-cinema-christopher-nolan-1007037965

చిన్నప్పుడు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం కొనుక్కుని గ్రామర్ నేర్చుకోవాలంటే దానితో పాటు మరో కీ పుస్తకం కూడా కొనుక్కుంటే కానీ సాధ్యపడేది కాదు. ఇప్పుడు అత్యధిక కలెక్షన్లనూ, మనసులనూ దోచుకుంటున్న ‘‘ఇంటర్ స్టెల్లార్’’ సినిమాని బాగా అర్ధం చేసుకోవాలన్నా మరో కీ కావాలనిపిస్తోంది. శాస్త్రీయ నారికేళ పాకం చెట్టుదింపుకుని కాయకొట్టుకుని కొబ్బరిముక్క జాగ్రత్తగా తీసుకుని తింటే కానీ రుచితెలియని విధంగా. సినిమాని అర్ధం చేసుకోవడానికి నామట్టుకు నాకయితే మరికొంత రిపరెన్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మిత్రులతో ఆ తాళం చెవిని పంచుకుందాం అనుకుంటున్నాను.

భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంటే ఏం చేయాలి. తినడానికి తిండి పండించుకోలేని స్థితి, వుండటానికి అనువుగా లేని వాతావరణం ఏర్పడుతుంటే ఏం చేయాలి. ప్లాన్ ఏ, లేదంటే ప్లాన్ బి పనిచేస్తాయేమో ననే ప్రయత్నం ‘‘ ఇంటర్ స్టెల్లార్’’ భూమిలాగానే నివాసానికి అనుకూలంగా వుండే ఇతర గ్రహాలను అన్వేషించడం అక్కడ మళ్ళి మానవ జీవితాన్ని ప్రారంభించడం కోసం చేసే ప్రయాణం తాలూకు కథనం ఇది. ఇక ఈ చిత్ర రచయిత, నిర్మాత, దర్శకుడు క్రిస్టొఫర్ నోలాన్ గురించి చెప్పాలంటే దీనికిముందు తీసింది పట్టుమని పదిసినిమాలే అయినా వందల సంవత్సరాలు గుర్తుంచుకోవలసిన అంశాలని వాటిలో చర్చించాడాయన. నగరాన్ని దాని ఆస్తులనూ నేరస్తుల పాల బడకుండా అడ్డుకునే సూపర్ హీరో బ్యాట్ మెన్ ఆయన సృష్టే, ట్రయాలజీలు తీసినా వెయ్యికోట్ల బిజినెస్ చేయగలగటం అంటే ఫిక్షన్ తాడుపై బ్యాలెన్స్ చేస్తున్నా ప్రేక్షకుల నాడివదలడు అనడానికి నిదర్శనం.

సినిమాలో కీలకంగా వచ్చే కొన్ని పదాలు తెలిస్తే సినిమాలోకి ప్రవేశించడం మరీ సులభం అవుతుంది.

టైటిల్ గా వున్న ఇంటర్ స్టెల్లార్ అంటే తారాతీరం (occurring or situated between stars) అనే అర్ధంలో డిక్షనరీలు ఇచ్చాయి కానీ విశ్వంలోని నక్షత్రాల మధ్య వున్న ఖాళీని కాకుండా రెండు విశ్వాల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని ఈ పేరుతో పిలుస్తారు. అవును ప్రపంచంలో ఒక్కటే విశ్వం కాదు అనేక విశ్వాలు వున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు ఒకవిశ్వానికీ మరో విశ్వానికీ మధ్యనున్న ఖాళీ ప్రదేశాన్నే ఇంటర్ స్టెల్లార్ అని పిలుస్తున్నారు.

AI

ఐదు డైమెన్షన్ల(5D) ప్రపంచం : మనం మనుగడ సాగిస్తున్న ప్రపంచానికి పొడవు, వెడల్పు, లోతు అనే మూడు డైమెన్షన్లతోనే(3D) గమనిస్తున్నాం. కానీ కాలం (time), ప్రదేశం/స్థలం (space) అనే మరో రెండు డైమెన్షన్లు కూడా విశ్వానికి వున్నాయి. కాంతి వేగంతో ప్రయాణించేప్పుడూ, వేర్వేరు గురుత్వాకర్షణలలలో వున్నప్పుడూ మనం లెక్కించుకునే కాలంలోనూ, ప్రదేశం లోనూ మార్పులు వస్తాయి. ఐన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం అత్యధిక ద్రవ్యరాశుల వద్ద కాలం నెమ్మదిస్తుంది. ప్రదేశం సాగుతుంది. అందుకే హీరో కూపర్ వెళ్తూ వెళ్తూ తన పదేళ్ళ కూతురికి తను వచ్చే సరికి తనవయస్సు కూతురు వయస్సు ఒకటిగానే వుంటాయని చెపుతారు.

 

బ్లాక్ హోల్ (కాల రంధ్రంకాలబిలం, కృష్ణ బిలం, కర్రి గుండం) : విశ్వంలోని ప్రతి ద్రవ్యరాశికీ ఆకర్షించే గుణం వుంటుంది దాన్నే గురుత్వాకర్షణ అంటున్నాం. దాన్నుంచి ఏదైనా విడిపోవాలంటే కొంత వేగంతో దూరంగా వెళ్ళాలి దాన్ని పలాయన వేగం అంటున్నాం. భూమిమీదనుంచి బయటకు పంపే రాకెట్లకు ఈ వేగాన్ని అందిస్తేనే అవి భూమి ఆకర్షణనుంచి బయటకు వెళ్తున్నాయి. కానీ బ్లాక్ హోల్ అనే ప్రాంతంలో కాంతికూడా ఆకర్షణనుంచి విడివడలేదు. అంటే కాంతివేగంతో ప్రయాణించగలవస్తువైనా ఈ కృష్ణబిలం నుంచి బయటకు రాలేదు. అందుకే బ్లాక్ హోల్ అంటే నిర్వచనంగా పలాయన గమన వేగము కాంతి యొక్క వేగం కన్నా ఎక్కువ ఉంటుందో దానినే కాల రంధ్రం లేదా కాలబిలం అంటున్నారు. కాంతి కూడా బయటకు రాదు కాబట్టే అది చీకటి గుహ అయ్యింది. విశ్వంలో గుర్తించిన విశాలమైన ఖాళీలు దానివైపు ఆకర్షింపబడుతున్న దూరపు నక్షత్రాల ఆదారంగా దీన్ని పరోక్షంగా గుర్తించడమే.

కాలబిలం లోపలనే అనేక పిల్ల విశ్వాలున్నాయనీ భూమ్మీద నివసిస్తున్నామనుకుంటున్న మనం కూడా ఒకానొక కాలబిలంలో బంధీలమేననేది ఒక సిద్ధాంతం. అయితే ఒక కాలబిలంలోపటి విశ్వలోకి ప్రవేశించిన మనుషులు మరోకాలబిలంలోని మనుషులతో కొంతమేరకు గమనించడం, వారితో సంభాషించేందుకు కొంత అవకాశం వుంటుంది అనేదాని బేస్ మీదనే సినిమా మొదట్లో ప్రయోగశాల ప్రదేశం తాలూకు అక్షాంశ రేఖాంశాలను మోర్స్ కోడ్ పద్దతిలో కనుక్కోవడం దగ్గరనుంచి, చివర్లో హీరో మన ప్రపంచంలోకి చేరుకోవడం వరకూ వుంటుంది. కాల బిలంలో ప్రవేశించిన వారు చనిపోవడం అంటే కాలబిలాలలోని ఈవెంట్ హారిజన్ (నిర్ణీత సరిహద్దు) ప్రవేశమార్గాలను దాటేసి పై భాగంలోని వెనక్కి వెళ్లలేని చోటు (పాయింట్ ఆఫ్ నో రిటర్న్) కు చేరుకోవడమే అని దానికిలోకి పడిపోయే లోగానే ఈ ప్రపంచంలోకి లాక్కోబడటంతో అతను మళ్ళీ భూమ్మీద జీవించేలా దేహంతో చేరతాడు. అయినా ఈవెంట్ హారిజన్‌కు ఆవల మరో లోకముందని దాన్ని క్యాచీ హారిజన్ (Cauchy horizon) అంటారట, ఈ ప్రదేశంలో కాలం, రోదసి రెండూ సుస్థిర దశల్లోకి చేరిపోయి, నిలకడగా ఉంటాయి. ఈ క్యాచీ సరిహద్దు లోపలే ఆధునాతన నాగరికతా ప్రపంచాలు మనుగడలో ఉండి ఉంటాయని ప్రొఫెసర్ డొకుచోవ్ బలంగా వాదిస్తున్నప్పటికీ బిగ్ బ్యాంగ్ సిధ్దాంత కారులు దీన్ని కొట్టిపారేస్తున్నారు.

warmhole

వామ్ హోల్ : విశ్వాంతరాళంలో కాంతిసంవత్సరాలదూరాన్ని దాటుకుంటూ ప్రయాణించేందుకు కనుక్కున్న ఒకానొక షార్ట్ కట్ రూట్ గా దీన్ని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని ఐన్ స్టీన్ రోసెన్ వంతెన అని పిలుస్తారు. రెండు చివరల మధ్య నున్న ఒక టన్నెల్ లాంటి వంతెన ఇది. బ్లాక్ హోలో లో ప్రవేశించిన ఏ పదార్ధాన్నీ బయటకి వదలని స్థితి వుంటే దీనిలోకి వచ్చిన పదార్ధాన్ని కాంతివేగంతో మరో చివరకు నెట్టేస్తుంది. దీనినే సినిమాలో ప్రయాణానికి కీలక సూత్రంగా వాడారు. ప్రయాణానికి కావలసిన ఇంధనాన్నీ, కాలాన్నీ మన పరిమితుల రీత్యా సరఫరా చేయడం అసంభవం అందుకే వార్మ్ హోల్ కున్న ఈ శక్తిని వాడుకోవడం ద్వారా కావాలసిన తీరానికి సులభంగా చేరవచ్చనే ఊహాత్మక లెక్కలతో వీరి ప్రయాణం ప్రారంభం అవుతుంది. నిజానికి ప్రయాణం ప్రారంభం అయ్యేప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేందుకు ఎటువంటి సక్రమమైన దారీ వీరికి తెలియదు.

మోర్స్ కోడ్ : ఈ మధ్యే టెలిగ్రాఫుల ద్వారా సందేశాలను పంపుకునే శకం ముగిసింది కానీ టెలిగ్రాఫుకు కారణం అయిన మోర్స్ కోడ్ ఉపయోగం మాత్రం ముగిసి పోలేదు. కేవలం ఆన్ ఆఫ్ ద్వారా బైనరీ విధానాన్ని (ద్విసంఖ్యామానాన్ని) కంప్యూటర్లలో వాడుకున్నట్లు బిప్ అండ్ గ్యాప్ ద్వారా డాట్ (చుక్క) మరియు డాష్(గీత) అను మాత్రం వాడుతూ సందేశాలను పంపేందుకు ఈ మోర్స్ కోడింగ్ విధానం ఉపయోగపడుతుంది. అందుకే అంతరిక్షంలోకి పంపే అనేక సందేశాలను కోడింగ్ విధానంలోనే తయారు చేసారు. సినిమా మొదట్లో పరిశోధన శాల అడ్రస్ ను ఇదే పద్దతిలో మరో కాలబిలంలో నివసించే వారెవరో అక్షంశరేఖాంశాల (longitude and latitude) కో ఆర్డినేషన్ ను అందించటం ద్వారా గైడ్ చేస్తారు. చివర్లో హీరో కూడా వాచ్ లో సెకన్ల ముల్లులో సహాయంతో తన బిడ్డకు ఈ మోర్స్ సందేశాన్నే పంపించి తన ఉనికిని తెలియజేస్తాడు.

కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) : కేవలం మనిషి తలలో వుండేదే మేధస్సా అస్సలు శరీరంతోనే పనిలేకుండా తెలివితేటలు తమంతట తామే పనిచేస్తే ఎలావుంటుంది. పరిస్థితులను అర్ధం చేసుకోవడం, స్పందించడం, నిర్ణయాలు తీసుకోవడం, లాంటివన్నీ మనిషికి ఆవల జరిగే పద్దతి కృత్రిమ మేధస్సు. ఈ మధ్య అగ్రరాజ్యం అమెరికానుంచి మానవ మెదడును మ్యాప్‌ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించిన కార్యక్రమం కింద భారత నాడీ శాస్త్రవేత్త పార్థా మిత్రాకు గ్రాంట్‌ లభించింది కూడా. ఇలా శరీరమో దేహమో ఆకారమో లేకుండా కేవలం ఎఐ తీసుకునే నిర్ణయాలు వగైరా ఈ సినిమాలో కనిపిస్తాయి.

కథనం : నాసాలో పైలెట్ ఇంజనీర్ గా పనిచేసిన కూపర్ (మాథ్యూ) మానవాళికి తిండిగింజల అవసరం గుర్తించి వ్యవసాయం చేస్తుంటాడు. అతనితో పాటు పదేళ్ళ కూతురు మర్ఫి (మెంకజీ ఫాయ్) , కొడుకు మరియు మామగార్లతో కలిసి వుంటాడు. పదేళ్ళ పాప ఘోస్టుగా పిలుచుకునే ఒకానొక మేధాశక్తి ఆమెను కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలోనే ఒకనాటి ఇసుకతుఫాను గాలివల్ల గదిలో ఏర్పడిన గీతలను మోర్సు పద్దతిలో అర్ధం చేసుకుని అవి సూచించే అక్షాంశరేఖాంశాలున్నప్రాంతానికి చేరతారు తండ్రీ కూతుళ్ళు.

ఆ ప్రదేశం ప్రొఫెసర్ బ్రాండ్ ( మైఖెల్ ఖైనే) ఆద్వర్యంలో నిర్వహింపబడుతున్న నాసా వారి రహస్య ప్రయోగశాల. వీరు మానవాళిని రక్షించేందుకు ప్లాన్-A, ప్లాన్ –B అంటూ రెండు పద్దతులు తయారుచేసుకుని వాటిని ప్రయోగించేందుకు ప్రయత్నిస్తుంటారు. దానిలో కూపర్ ని కూడా ఒక నిపుణుడైన పైలెట్ గా సహాయం చేయమని అడుగుతారు. దీనిలో ప్రధానాంశం జీవనానికి అనువుగా వుండే గ్రహాలపైకి మానవాళిని పంపించడం. అందుకు పిండదశలో జీవాన్ని నిల్వచేసి అక్కడికి పంపి మళ్ళీ జీవం ప్రారంభం అయ్యేలా చూడటం. దీనిలో ప్రొఫెసర్ బ్రాండ్ కూతురు స్వయంగా బయాలజిస్టు అయిన అమెలియా ( అన్నే హాత్ వే), ఫిజిస్టు రొమిల్లీ ( డేవిడ్ గాసీ) జియో గ్రాఫర్ డోయల్ ( వెస్ బెన్ ట్లీ) లతో పాటు మరో రెండు కృత్రిమ మేధస్సుకలిగిన రోబోట్లు TARS మరియు CASE కూడా పనిచేస్తుంటాయి. అతి సుధీర్ఘ ప్రయాణాన్ని సులభతరం చేసుకునేందుకు వార్మ్ హోల్ సహాయం తీసుకోవాలనేది ఈ ప్రయత్నంలో ముఖ్యమైన అంశం. దానివల్ల కాలంతో పాటు ఇంధనం కూడా కలిసి రావడంతో అసాధ్యం అనుకున్న ఈ గ్రహాంతరాలను మించిన విశ్వాంతర ప్రయాణం సాధ్యం అవుతుంది అని ప్రొఫెసర్ బ్రాండ్ వివరిస్తాడు.

తన తండ్రి ఈ ప్రయాణంలో వెళ్ళిపోవడానికి పదేళ్ళ మర్ఫీ ససేమిరా అంటుంది. కానీ తను తరిగి వస్తానని తను వచ్చేటప్పటికి ఆ అమ్మాయి వయసు, తనవయసూ ఒకేలా వుంటుందని నచ్చజెప్పి, కూపర్ బయలుదేరతాడు. అనుకున్నట్లుగానే ప్రయాణంలో వార్మ్ హోల్స్ సహాయం ఉపయోగపడుతుంది. అచ్చం నీళ్ళతోనూ, పూర్తిగా మంచుతోనూ వున్న వివిధ గ్రహాలను గమనించుకుంటూ వీరి ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణంలోనే భూమినుంచి పంపే విడియో ఫుటేజిలను గమనిస్తూ తమ వారు ఎలావున్నారో కూపర్ తదితరులు గమనిస్తుంటారు. కూపర్ మామగారు చనిపోతాడు. కొడుకు బిడ్డ పెద్దవాళ్ళవుతారు. మర్ఫీ కూడా ప్రొఫెసర్ బ్రాండ్ కు సహాయంగా వుంటూ తన తండ్రి ప్రయాణ సమాచారాన్ని తెలుసుకుంటూ వుంటుంది. ప్రొఫెసర్ బ్రాండ్ తన తుదిగడియల్లో చెప్పిన నిజం అసలు తిరుగు ప్రయాణంపై తన సమీకరణాల్లో సరైన ఆధారాలేవీ లేవనే విషయం ఆమెను హతాసు రాలిగా చేస్తుంది. అయినా తన తండ్రి ఇచ్చిన మాట ప్రకారం తిరిగొస్తాడనే ఆశతోనే ఎదురు చూస్తూ బ్రాండ్ అసంపూర్తిగా వదిలేసిన ఆ సమీకరణాన్ని తను పూర్తి చేసేందుకు శాయశక్తులా తన ప్రయత్నాలు చేస్తూ గడుపుతుంది. 40 సంవత్సరాల వయస్సుకూడా దాటుకుని ముసలి తనానికి కూడా వచ్చేస్తుంది.

 

అక్కడ ప్రయాణంలో ఇంధనం అయిపోవస్తుంది. మరొక్క గ్రహాన్ని మాత్రమే చూడగల స్థితికి వస్తారు. అయినా సరే అవకాశం వున్న గ్రహాలను వెదికేందుకు చేతనైనంత ప్రయత్నం చేయడంతోపాటు. స్వంతంగా ఆలోచించగల రెండు రోబోట్లనూ ఆ సమాచార సేకరణ కోసం అంతరిక్షంలో వదిలుతారు. సింగ్యులారిటీ పై సమాచారాన్ని గ్రహించే సందర్భంలో కూపర్ అదనపు డైమెన్షన్ లోకి పడిపోతాడు. అక్కడినుంచి పాక్షిక పద్దతిలోనే ప్రపంచాన్ని గమనించే స్థితిలోకి మారతాడు. కూపర్ కి అప్పుడే అర్ధం అవుతుంది. ఈ అదనపు డైమెన్షన్ లో నివసించగలిగే వారే భవిష్యత్తు మానవులు అని, అక్కడి నుంచి తన బిడ్డతో పూర్వపు ఘోస్ట్ లాగా కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాడు.

Morse Code

గురుత్వ తరంగాలను ప్రయోగించటం ద్వారా ఒక వాచ్ లోకి మోర్స్ కోడ్ పద్దతిలో సమీకరణాన్ని సాధించే పద్దతిని తెలియజేస్తాడు. ఆ సమీకరణం ఆధారంగా ఆమె తండ్రిని భౌతిక ప్రపంచంలోకి తీసుకు వస్తుంది. పూర్తిగా ప్రపంచంలోకి వచ్చిన కూపర్ కి తన కూతురు ముసలి వయస్సులో మంచపట్టిన స్థితిలో కనిపిస్తుంది. ఏ తల్లిదండ్రులకైనా చూడలేని స్థితి తమ బిడ్డలు మరణం అంచున వున్నారని తెలియటం అందుకే నువ్వు నాకోసం ఆలోచించకు దానికి నా బిడ్డలున్నారు అంటుంది మర్ఫీ. అతని తర్వాతి కర్తవ్యంగా వదిలేసిన ఎడ్మండ్ గ్రహాన్నీ, అమెలియానీ అన్వేషించడం ప్లాన్ బిలో భాగంగా జీవ పిండాలను ఆ గ్రహంపై పెంచేందుకు తగిన పద్దతులను అన్వేషించడం ప్రారంభించమంటుంది. ఇతని ప్రయాణం మళ్ళీ ప్రారంభం అవుతుంది. అడ్మండ్ పై అప్పటికే అమెలిన్ తన ప్రధమిక ప్రయత్నాలలో వుందన్న విషయం చూపటంతో సినిమా ముగుస్తుంది.

కేవలం శాస్త్రీయతే కాకుండా మానవీయకోణంలో నడిచే సంభాషణలు కూడా ఈ సినిమాలో కట్టిపడేస్తాయి. మచ్చుకు స్థల కాలాలను అధిగమించగలిగేది ప్రేమ ఒక్కటే అంటూ ప్రొఫెసర్ బ్రాండ్ చెప్పటం. మానవజాతి భూమ్మీద పుట్టిందంటే దానర్ధం భూమ్మీదే అంతరించి పోవాలని కాదు లాంటి డైలాగులు బావున్నాయి. ఇంత సంక్లిష్టమైన ‘సైన్స్‌ ఫిక్షన్‌’ చిత్రాన్ని తండ్రీ కూతుళ్ళ మధ్య వున్న అనుబంధం చుట్టూ అల్లి, ఏమాత్రం సైన్సు పరిజ్ఞానం లేని వారికి కూడా అర్థమయ్యే టంతగా తీర్చిదిద్దిన స్క్రీన్ ప్లే ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి.

నోలన్ ‘సిజిఐ'(కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ) తక్కువగా వాడి సహజత్వానికి దగ్గరగా వుండాలని కెమెరాతో తీసిన దృశ్యాలనే ఎక్కువగా వినియోగిస్తాడు. అందుకే తారాతీరాలలోనూ, విచిత్ర వాతావరణలోని గ్రహాలలోనూ సంచరించడాన్ని కళ్ళకు కట్టినట్లే చూపడం వల్ల కావచ్చు బిగ్ స్క్రీన్ టిక్కెట్లకు అంత రష్ ఏర్పడింది. మొత్తానికి ఒక మంచి సైన్సు పిక్షన్ చూడాలని కోరుకునే వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఈ ఇంటర్ స్టెల్లార్.

 -కట్టా శ్రీనివాస్

 

Download PDF

22 Comments

 • సతీష్ చందర్ గారు ఈ సినిమాని పరిచయం చేయడం వల్ల సినిమా చూశాను. సైన్స్ తో అంతగా పరిచయం లేకపోవడం వల్ల కొంత కన్ ఫ్యూజన్ కు లోనయ్యాను. ఇది చదివిన తర్వాత సినిమా మరొకసారి చూడాలనిపిస్తోంది. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.

 • mohan.ravipati says:

  శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది . ఈ సినిమా ని మానవీయ కోణంలోనో లేదా సినిమాగానో అర్ధం చేసుకోవడం తేలికే, కాకపోతే సాంకేతిక అంశాల ఆధారంగా అర్ధం చేసుకోవాలంటే మాత్రం కొంత సంక్లిష్టత తో కూడుకొన్నదే, మీ వివరణ తో అలాంటి అంశాలు కూడా తేలికగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది

  • అవును మోహన్ గారూ నిజమే ఇంత సీరియస్ సినిమాలోనూ అవసరమైన చోట్ల మానవీయ కోణాలనే కాక మంచి హ్యుమర్ ను కూడా జతచేయగలిగారు.
   సాండ్ స్టామ్ వల్ల ఏర్పడిన గీతల్ని తెల్లార్లూ గమనిస్తూ తండ్రీ బిడ్డా కూర్చొని వుంటే, ‘‘ఇంకా భూతపూజలేనా, గది శుభ్రంచేసుకునేదేమైనా వుందా?’’ అంటూ మామగారు విసుక్కొవడం లాంటివి సీరియస్ బిగింపుకి మంచి రిలీఫ్ స్మైల్స్ అయ్యాయి.

  • పురుషోత్తం గారూ మీరిచ్చిన లంకెలోని సమాచారం బావుంది. బ్లాక్ హోల్ ఇన్నర్, అవుటర్ రొటేషన్ల నుంచి వాళ్ళు కృత్రిమ గురుత్వాశక్తికోసం డాకింగ్ ద్వారా చేసుకున్న చక్రపు భ్రమణాలవరకూ లెక్కప్రకారమే తీసారంటే ఆశ్చర్యం వేస్తుంది.

 • Mohammed Ghouse says:

  శ్రీనివాస్ గారు,
  మీ విశ్లేషణ చాలా బాగుంది .
  మీరు ఎంతో కష్టపడి ఇంతటి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ప్రజలకు పంచుతున్నారు .
  నాకు చాలా సంతోషంగా వుంది !
  మీ మిత్రుడైనందున నాకు ఎంతో గర్వంగా వుంది .
  Wish you all the best !!!

  • మీరు అభిమానం వల్ల నేను షేమ్ ఫీలయ్యేంత పొగిడేస్తున్నారు. నిజానికి నాకోసం తయారు చేసుకున్ నోట్సు ఇలా అప్సర్ గారి వల్ల మిత్రులందరికీ అందుబాటులోకి రావడం సంతోషం.

 • గతవారమే ఈ మూవీ చూశాను. అర్థం కాని కొన్ని విశయాలు ఇప్పుడు అర్థం అయ్యాయి. ఢన్యవాదాలు.

  ” కాంతి వేగంతో ప్రయాణించేప్పుడూ, వేర్వేరు గురుత్వాకర్షణలలలో వున్నప్పుడూ మనం లెక్కించుకునే కాలంలోనూ, ప్రదేశం లోనూ మార్పులు వస్తాయి. ఐన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం అత్యధిక ద్రవ్యరాశుల వద్ద కాలం నెమ్మదిస్తుంది. ప్రదేశం సాగుతుంది.”
  — ఎంత బుర్రను మెలికలు తిప్పి ఆలోచించినా ఈ సూత్రం మాత్రం నా ఊహకు అందదు.

  • అసలు కాలం అంటే ఏమిటి? ద్రవ్యరాశి అంటే ఏమిటి? దగ్గర్నుంచి సాపేక్షసిద్ధాంతాన్ని ప్రయత్నిస్తేకొంచెం అంచనాకు దొరకుతున్నట్లు అనిపించిందండీ. దీనిపై ఎప్పట్నుంచోవున్న రాతల నుంచి ఇప్పటి స్టిఫెన్ హాకింగ్ వరకూ చాలా మంది వారివారి వివరణలు ఇచ్చారు. మీరన్నట్లు ఇది ఊహకంటే తర్కానికే అందుతుందేమో…

 • నిశీధి says:

  ఇంత వరకు చూడలేదు ఈ మూవీ . ఇపుడు మీరు చెప్పారు అంటే ఖచ్చితంగా చూడవచ్చు అన్నమాట

 • srinivasu Gaddapati says:

  ఎనాలిసిస్ బాగుంది సర్ chaalaa ఉపయోగకరంగా undi

 • అవును శ్రీనివాస్ గారూ సమిక్షగా రాయడం కంటే లోపల కొంచెం పంతులితనం మొలకలు వుండటం వల్ల కావచ్చు విశ్లేషణగానే రాసుకుంటూ వచ్చాను. థాంక్యూ ఫర్ యువర్ వర్డ్స్

  • sujana says:

   కథంతా మీరే చెప్పేస్తే సినిమా మీద ఇంటరెస్టు ఏముంటుంది? ఒక మంచి పుస్తకం గురించి అయినా, సినిమా గురించి అంతా చెప్పేయకూడదనే నిర్ణయం రచయితలు అందరూ తీసుకుంటే బాగుంటుంది.

   • బహుశా ఈ రూల్ ఎ మూవి కి వర్తించ దనుకుంతానండి.

   • సుజన గారూ,
    మీరన్న విషయాన్ని అంగీకరిస్తూనే, ఈ సినిమా విషయంలో మా మిత్రులు చివర్లో జరిగిన హడావిడి మార్పులకు గందరగోళపడటంతో ఆ విషయం వరకూ సాధ్యమైనంత టూకిగా పంచుకుందామనిపించింది. ఇది దృశ్యప్రాధన్యం వున్న సినిమా కావడంతో, కథాంశం తెలియక ఆగటం కంటే టూకిగా అర్ధం చేసుకుని చూస్తూ వెళ్ళడం వల్ల బాగా ఎంజాయ్ చేయగలుగుతారనుకున్నానండీ. అందుకే ఈ సినిమా విషయంలో వర్తించదేమో అని మొబైల్ నుంచి టైప్ చేస్తే ఎ అని వచ్చింది. మీ సూచన తర్వాతి రివ్యూలలో తప్పకుండా పట్టించుకుంటాను.
    థాంక్యూ

 • కట్టా గారు మీ ‘‘ఇంటర్ స్టెల్లార్’’ లో దాగిన రహస్యాలు కొన్ని! బాగుంది. సైన్సు పిక్షన్ చూడాలని కోరుకునే వారు సినిమాల వరకే పరిమితం కాకుండా సైన్సు జ్ఙానాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్ర్తం మీద జ్జానాన్ని అర్జించిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. నాసా వాళ్ళు చెప్పిందే ప్రపంచ మంతా అమోదించే పరిస్ధితికి ప్రపంచ ప్రజలు నెట్టివేయబడ్డారు.
  ఆ పరిస్థితి మారాలంటే ఖగోళ శాస్ర్తం మీద లోతుగా అధ్యాయనం చేసే వాళ్ళ సంఖ్య పెరగాలి. నాసా వాళ్ళు చెప్పిందే వేదం అనే పరిస్థితి మారినప్పడే నిజమైన సైన్సు మానవ సమాజానికి అందుతుంది.
  -దాసరి రాజబాబు

  • రాజబాబుగారూ నమస్తే
   ఒకప్పుడు మీరన్నట్లే వాళ్ళు విడుదల చేసిన ప్రకటనలూ, ఫోటోలే సర్వస్వంలా వుండేవేమో, రష్యా తప్ప పోటీపడేందుకు మరో దేశం లెక్కల్లో కనిపించేది కాదు.
   ఇటువైపు పేదదేశాలు అంతరిక్షంపై ఖర్చుపెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టే పరిస్థితి వుండేది. కానీ శాస్త్రీయాంశాలు తెలుసుకోవడంమే కాదు. చంద్రయాన్, మార్స్ మిషన్ లను మనదేశం కూడా సినిమా తయారీ ఖర్చుకంటే తక్కువ ఖర్చుల్తో విజయవంతం చేసి చూపించాయి. ఇస్రో మనం గర్వపడే స్థాయిలోనే నిలబడింది.

 • రవి ప్రకాష్ ఆదిపూడి says:

  నాకు అర్ధం అయ్యినంత వరకు ఇది సైన్సు ఫిక్షన్ మూవీ కాదు…., మనం అనుకునే త్రీ dimensions కాకుండా ఇంకో డై మేన్సన్ ప్రేమ అనేది దీనర్ధం… , అదే గ్రావిటేషనల్ ఫోర్సు అని రచయిత భావన , అందుకే కూతురితో ఎప్పుడూ కనెక్ట్ అయ్యివుంటాడు , చివరిగా తన ప్రేయసి కోసం కూడా అందుకే వేల్లుతాడు…. , ఇక పొతే బ్లాకు హోల్ ,మిగతా విషయాలు ఈ మూవీ లో చిన్న పాత్రలే, ఒకవిదం గా అంట ప్రాధాన్యత లేని విషయాలే……

  • నోలాన్ ఈ లెక్కన ధన్యుడే రవిప్రకాశ్ గారూ,
   కవులే యద్భావం తద్భవతి లాగా చెప్పగలరనుకుంటుండేవాడిని,
   ఇలా సినిమాలలో కూడా కావలసిన కోణం వెతుక్కుంటే దొరికేలా చెయోచ్చని ఈయన చూపించేశాడయితే.
   :)

 • AVINASH KAKARLA says:

  శ్రీనివాస్ గారు ధన్యవాదములు .సినిమా చూసిన తరువాత నాకు ఏమి అర్థం కాలేదు .కానీ ఈ వ్యాసం చదివిన తర్వాత మళ్లీ చూడాలి అనిపిస్తుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)