నిర్దిష్టత నుంచి నిర్దిష్టత లోకి . . .హరికిషన్ ప్రయాణం!

10491252_637115716394991_6117679910662129997_n
( ఆదివారం నాడు కర్నూల్లో  డా.హరికిషన్ కొత్త కథల సంపుటి ‘ కందనవోలు కథలు’ ఆవిష్కరణ)

సీమ సాహిత్యమే సీమ జీవితం – సీమ వెతలే సీమ కతలు : ఇదొక నానుడిగా చెలామణి అవుతున్న రోజుల్లో కర్నూలు కథని ప్రత్యేకంగా యెత్తి చూపిన రచయిత డా. హరికిషన్. నిర్దిష్టంగా కర్నూలు జీవితాన్నీ కథల్నీ అర్థం చేసుకోడానికి 2005 లో హరికిషన్ సంకలనం చేసిన ‘కర్నూలు కథ’ యెంతగానో తోడ్పడింది. ఆ సంకలనం ద్వారానే గొప్ప తవ్వకం పనిమంతుడుగా హరికిషన్ తో నాకు తొలి పరిచయం. రాయలసీమలో మరీ ముఖ్యంగా కర్నూలు ప్రాంతలో కొత్తగా ‘పరుగులు తీస్తున్న పెట్టుబడుల పదఘట్టనల కిందపడి నలుగుతున్న సామాన్యుడి జీవితాన్ని’ గురించి ఆ సంకలనం ముందుమాటలో ప్రస్తావించిన అంశాలు  నన్నెంతగానో ఆలోచింపజేయడమే గాక  హరికిషన్ సాహిత్య వ్యక్తిత్వాన్నీ ప్రాపంచిక దృక్పథాన్నీ యెరుకపరిచాయి.

నిజానికి హరికిషన్  కథారచనాప్రస్థానం తొలి అడుగుద్వారానే (పడగ నీడ – 1997) అతను పయనించబోయే తోవా నడక తీరూ అవగతమయ్యాయి. సీమ నేలని పట్టి పీడించే ఫ్యాక్షనిజం బహుముఖ పార్శ్వాల్ని అతను ఆ కథలో ఆవిష్కరించగలిగాడు. పార్టీ రాజకీయాలూ  కులాధిపత్యపోరాటాలూ  సారా వ్యాపారాలూ రియల్ ఎస్టేట్ దందాలూ చోటా బడా కాంట్రాక్టులూ భూగర్భ వనరుల దోపిడీ అటవీ సంపద అక్రమ తరలింపు . . . ఇవన్నీ ఫ్యాక్షనిజం పెంచుకొన్న కోరలేనని తెలియజేసాడు. అంతేకాదు వీటికి ప్రత్యామ్నాయంగా  మొగ్గతొడుగుతోన్న భూపోరాటాల్ని ప్రస్తావించాడు. పల్లెల్లో  విస్తరిస్తోన్న బి.సి.ల , దళితుల చైతన్యాన్ని ( ఎబిసిడి ల వర్గీకరణతో సహా ) గుర్తిస్తూనే పాలక వర్గాలు దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం  వాడుకొంటున్న వైనాన్ని సైతం వ్యాఖ్యానించాడు. వీటన్నిటినీ – నీళ్ళు లేక  పంటల్లేక పనుల్లేక రోడ్లులేక … ఎడారులై పోతున్న బీళ్ళతో… బీళ్ళవుతున్న పచ్చిక బయళ్ళతో … హత్యలు ఆత్మహత్యలు వలసలతో కునారిల్లుతున్న రాయలసీమ నిర్దిష్టత లోంచే అతను విశ్లేషించాడు. స్వీయ జీవితానుభవానికే అక్షర రూపంలా కనిపించినప్పటికీ  తన నేల మీద బలంగా కాళ్ళూని హరికిషన్ నిలబడ్డాడని  ‘పడగ నీడ’ నిరూపించింది. ఈ నిర్దిష్టత రాను రానూ అతనిలో మరింత పదునుదేరిందని యీ కొత్త కథల సంపుటి ‘కందనవోలు కథలు’ స్పష్టం చేస్తుంది. హరికిషన్ యిటీవల (2012–13ల్లో) రాసిన  ‘జై తెలంగాణ’ , ‘కొత్త కల’ కథలు అందుకు నిలువెత్తు సాక్ష్యాలు.

సీమ సాహిత్యకారుల్లో యింతకుముందు కన్పించిన ప్రాంతీయ స్పృహ తెలంగాణ రాష్ట్రోద్యమం నేపథ్యంలో రాజకీయ ఆర్ధిక రంగాల్లో ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంగా పరిణమించాల్సిన అవసరాన్ని యీ కథలు నిర్దేశిస్తున్నాయి. ఈ చైతన్యం సీమలోని తక్కిన జిల్లాల్లో కంటే ముందుగా కర్నూలు ప్రాంతంలోనే మొదలు కావడం యాదృచ్ఛికం కాదు; అదొక సామాజిక యథార్థత. ఆ యథార్థాన్ని ‘కర్నూలు సాహితీ మిత్రులు’ లో వొకడిగా డా. హరికిషన్ గుండె గొంతుకలోకి తెచ్చుకొని బలంగా వినిపిస్తున్నాడు. కృష్ణా నికర జలాల పంపిణీలో న్యాయబద్ధమైన వాటా గురించి డిమాండ్ చేయడం దగ్గరో హైదరాబాద్ ని స్విస్ బ్యాంక్ గా మార్చుకొన్న సీమ ఫ్యాక్షనిష్టుల వరకో  యీ రచయిత ఆగిపోవడం లేదు. ‘శ్రీబాగ్ ఒడంబడికను చిత్తుకాగితంగా మార్చిన పెద్దమనుషులతో కలసి నడవడం’ గురించి , ‘నాలుగు కాసుల కోసం భాషను సంస్కృతిని రాక్షసంగా మార్చి వెక్కిరించిన వారితో – పదవులు విసిరి ప్రాజెక్టులు కొల్లగొట్టిన పెద్దన్నలతో సహజీవనం చేయడం’ గురించి ‘మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టడం మాని గంజి మెతుకుల కోసం గలం విప్పి ప్రశ్నిద్దాం’ (ఒక ఆలింగనం కోసం) అని హెచ్చరిస్తున్నాడు. కోస్తా వలస ఆధిపత్యాలకి తలుపులు తెరచి వాళ్ళు విసిరిన అదనపు పెట్టుబడులకు  అమ్ముడుపోయిన అన్ని రాజకీయ నాయకత్వాల ద్రోహాల్నీ  (అప్పటి నీలం సంజీవరెడ్డి దగ్గర్నుంచి నిన్నటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ – మధ్యలో సందుకో వైన్ షాపు తెరిపించి , ఇటీవలే బెల్ట్ షాపుల రద్దుకి ‘మూడో సంతకం’ చేసిన చంద్రబాబు నాయుణ్ణి కలుపుకొని ) హరికిషన్   ప్రశ్నిస్తున్నాడు. అయితే అతనీ ప్రశ్నల్ని కేవలం రాయలసీమ చైతన్యం నుంచే అడగడం లేదు; మరింత నిర్దిష్టంగా కర్నూలు గడ్డని కేంద్రంగా చేసుకొని బైరాపురం కాలువ కింద నీరందక యెండిపోయి నెర్రెలిచ్చిన పొలాల జాడల్లోంచీ , కొండారెడ్డి బురుజు సాక్షిగా నడచిన బూటకపు ‘సమైక్య ఉద్యమాల’ నీడల్లోంచీ సంధిస్తున్నాడు. ద్రోహాల చరిత్రని తవ్వితీసి – మరోసారి మోసపోవద్దనీ   తెలంగాణ వుద్యమం నుంచీ స్ఫూర్తి పొందమనీ  యెండు డొక్కల సీమప్రజలకు వుద్బోధిస్తున్నాడు. ఛిద్రమైన రాయలసీమ ముఖచిత్రాన్నీ శిధిలమైన బతుకుల్నీ సామాజిక ఆర్ధిక రాజకీయ కోణాలనుంచి అధ్యయనం చేయడంవల్ల మాత్రమే అతనీ కథలు రాయగలిగాడని నేను నమ్ముతున్నాను. నా నమ్మకానికి బలమైన ఆధారాలు యీ సంపుటిలోనే ‘బతుకు యుద్ధం’ కథలో కనిపిస్తాయి.

‘బతుకు యుద్ధం’ రాసింది కూడా 2013 లోనే. సీమ కరువు వెతలు కథలుగావడం కొత్త కాదు గానీ  దాన్ని సమస్త విలువల్నీ నాశనం చేసే  కఠోర వాస్తవికతగా అభివర్ణిస్తూ యింతకుముందు పి.రామకృష్ణారెడ్డి ‘కరువు పీల్చిన మనుషుల్ని’  హృదయవిదారకంగా సాక్షాత్కరింప జేశారు. కరువులో  బతుకులు బుగ్గైన వ్యక్తుల నైతిక పతనాన్నే మరో రూపంలో చూపిన కథ ‘బతుకు యుద్ధం’. వరస కరువుల్తో ‘అప్పు కట్టలేక , అవమానం తట్టుకోలేక ఆఖరికి పొలంలోనే చింతచెట్టుకి వురేసుకొన్న’ బోయగేరి శంకరప్ప, ‘యవసాయం చేసేదానికన్నా కూలిపనికి పోవడమే మేలు’ అనుకొనే రైతు సుంకన్న , ఆ పనికూడా లేక ‘సూస్తూ సూస్తూ పస్తులతో సావలేక – నాలుగు వేళ్ళు నోట్లోకి పోవాలంటే ఏదో ఒగటి సెయ్యాల ‘ గాబట్టి ఫ్యాక్షనిష్టు రాజారెడ్డి కింద పనిచేస్తూ వ్యసనాల పాలైన సుంకన్న పెద్దకొడుకు వీరేష్ , వూరి బైట కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీ కింద భూమిని కోల్పోయి వచ్చిన దుడ్లు కరిగిపోయి ‘పుట్టినూళ్ళో గంజినీళ్ళు గూడా పుట్టక’ వూరుగాని వూరుపోయి దారిదొంగగా మారిన బలిజగేరి గోవిందయ్య …  యీ కథలో వీళ్ళంతా బతకడమే యుద్ధమైన చోట మంచీ చెడుల గురించి  నీతీ న్యాయాల గురించి ధర్మాధర్మాల గురించి లేవనెత్తే ప్రశ్నలకు జవాబులిమ్మంటారు.

పల్లెలన్నీ ప్లాట్లుగా , సెజ్జులుగా మారిపోయాక గ్రామాల్లోని సాలు సక్కగ వచ్చేటట్లు గొర్రు పట్టి విత్తనమేసే మొనగాళ్ళు , వంచిన నడుం ఎత్తకుండా చక చక నాట్లు వేసే పనిగత్తెలు , కొడవలి పడితే చాలు ఒక్కరోజే ఎకరాలకు ఎకరాలు పంటకోసే పాలెగాళ్ళు , గడ్డివాముల్ని ఎంతటి గాలివానకైనా చెక్కు చెదరకుండా నిర్మించే నేర్పరిగాళ్ళు’    మాయమైపోతున్నారనికూడా యీ కథలోనే రచయిత వాపోతాడు. అయితే యీ పరిస్థితి కేవలం రాయలసీమకే పరిమితం కాదు; కానీ వర్ణించిన భౌతిక/భౌగోళిక వాస్తవికత మాత్రం ఆ ప్రాంతానిదే.  ఆళ్లగడ్డ దున్నపాడు గూళ్యం బైరాపురం ఆలంపూర్  తర్తూరు గాజులదిన్నె కొండారెడ్డి బురుజు  కాల్వబుగ్గ యస్ టి బి సి కాలేజి కండేరి బండిమిట్ట   సి క్యాంప్  … యీ ప్రాంతాలన్నీ కథల్లో అత్యంత సహజంగా వొదిగిపోయి ఆ వాస్తవికత సాధిస్తాయి. రాయలసీమ అనగానే గుర్తొచ్చే అనావృష్టి పరిస్థితులకు భిన్నంగా తుంగభద్ర వరదల్లో కర్నూలు ప్రాంతం ముంపుకి గురికావడానికి కారణమైన పాలకుల నిర్లక్ష్య వైఖరిని పచ్చి కరువు (2004) వరద (2009) కథల్లో నిశితంగా విమర్శించినప్పుడు గానీ , పల్లెల్లో కులం బలంతో ఫ్యూడల్ న్యాయాన్నే అమలుపరుస్తోన్న రెడ్డి దొరతనానికి యెదురొడ్డి నిలవాలని మానసిక ప్రతిన తీసుకొన్న బోయ వెంకటేశ్వర్లు ( చిచ్చు – 2006 ) తెంపరితనాన్నివర్ణించినప్పుడు గానీ , ప్రాణాలకు తెగించి బ్రిటిష్ రాజ్ నెదిరించి కొండారెడ్డి బురుజు మీద మువ్వన్నెల జెండా యెగరేసి జైలు పాలైన విశ్వనాథం వంటి వారి త్యాగభరితమైన పోరాట చైతన్యాన్నీ , వారు సాధించిన స్వాతంత్ర్యం దాని ఫలాలు అవినీతిపరులు హంతకులూ అయిన ఫ్యాక్షనిస్టు రాజకీయ నాయకుల చేతిలో అపహాస్యం అవుతున్న ప్రస్తుత సందర్భాన్నీ బేరీజు వేసినప్పుడు గానీ ( గాయపడ్డ నమ్మకం – 2014 ) , ప్రజల్లో పాతుకు పోయిన మూధవిశ్వాసాల్ని అడ్డం పెట్టుకొని భూదురాక్రమణకు పాల్పడే పెదరెడ్డి కుతంత్రాలకు గురైన ఉలిగమ్మ దైన్యానికి పరిష్కారం చూపేందుకు ప్రయత్నించినప్పుడు గానీ ( బసివిరాలు బరితెగించింది – 2014 )  కర్నూలు స్థానీయతని వొక పరిమళంలా అద్దాడు హరికిషన్.

రచయిత సమకూర్చిన  స్థానీయతా నేపథ్యమే  యీ కథలని ‘కందనవోలు కథలు’ గా తీర్చిదిద్దదానికి ముఖ్యమైన వనరుగా తోడ్పడింది . కథల్లో సందర్భోచితంగా వాడిన కర్నూలు ప్రాంత మాండలికం కూడా అందుకు అదనపు హంగుని జోడించింది.  సూక్ష్మంగా  పరిశీలించినపుడు రాయలసీమ  నాలుగు జిల్లాల్లోనూ వొకే విధమైన జీవితం లేదనీ సమస్యల స్వభావం వేరనీ వాటిని పరిష్కరించుకోడానికి దారులు తీసే చైతన్య భూమిక ప్రత్యేకమైనదనీ వొకే కాలంలో ఆర్ధిక రాజకీయ సామాజిక రంగాల్లో చలనం భిన్నంగా ఉందనీ గతి తార్కికంగా నిరూపించడానికి యీ కథల సంపుటి వొక ఆకర గ్రంథంగా వుపయోగపడుతుంది. రాయలసీమ జీవితాన్ని యథాతథంగా చిత్రించడం దగ్గర ఆగిపోకుండా ఆ జీవితం అలా వుండడానికి కారణమైన  ఆర్ధిక భౌతిక సామాజిక  రాజకీయ శక్తుల్ని దృశ్యమానం చేయడానికి ప్రయత్నించడంవల్ల మాత్రమే అది సాధ్యమైంది.

ఉన్నత విద్యనభ్యసించిన వుపాధ్యాయుడిగా స్వీయ అనుభవాల్నీ, సామాజిక అవగాహననీ కథలుగా మలిచే సందర్భాల్లో సైతం హరికిషన్ తన నేల వాసనని వదులుకోలేదు. మన విద్యా వ్యవస్థలో రోజురోజుకీ పెరిగిపోతున్న అసమానతల్నీ జడలు విచ్చుకొన్న అమానవీయతనీ పాతుకుపోయిన అవినీతినీ అసంబద్ధమైన  పోటీనీ   దగ్గరగా చూస్తూ అందులో యిమడలేని  వూపిరాడనితనంలోంచీ తీవ్రమైన ఆవేదనకి లోనై అతనురాసిన కథలు వొక డజను వరకూ  వున్నాయి. ‘బాల్యంలోనే యుద్ధ ఖైదీలై చదువుల బోనుకు బందీలై’ శిక్షలు అనుభవించే పిల్లల్ని ప్రేమించేవాళ్ళ కోసమే’ ప్రచురించిన ‘ఒక చల్లని మేఘం’  కథల సంపుటి (2008) ద్వారా లోపలి వ్యక్తిగా హరికిషన్ నేటి విద్యా వ్యవస్థలోని సమస్త అస్తవ్యస్త పరిస్థితుల్నీ నిశితంగా చర్చకు పెట్టాడు. చాలామంది వుపాధ్యాయ – రచయితలు చేయని పనిని వొక సామాజిక ఆచరణలో భాగంగా నిర్వర్తిస్తున్నందుకు       డా. హరికిషన్ ని నావరకు నేను బహుధా అభినందిస్తున్నాను. ఈ సంపుటిలోకి యెక్కిన  ‘సదవకురా చెడేవు’ (2001) ‘ఒక చల్లని మేఘం’ (2002) ‘ఒక మైనార్టీ కాలేజి కథ’ (2005) విద్యారంగానికి చెందిన భిన్నపార్శ్వాలను విమర్శకు పెట్టిన  కథలు.

సదవకురా చెడేవు’ బహుముఖీన కథ. పరీక్ష హాల్లో యిన్విజిలేటర్ గా పనిచేసే వుపాద్యాయుడి అంతరంగంలో చెలరేగే సంఘర్షణకి అక్షర రూపమైన యీ కథలో ప్రభుత్వ విద్యా విధానాలు కార్పోరేట్ చదువులు పట్టణ గ్రామీణ విద్యార్థుల విద్యా ప్రమాణాల్లో అనివార్యంగా చోటు చేసుకొనే వ్యత్యాసాలు – వాటికి కారణాలు  ప్రైవేటీకరణలో పేద దళిత విద్యార్థులు  యెదుర్కొనే నిరుద్యోగ సమస్యలు రిజర్వేషన్ పాలసీలు మాతృభాషోద్ధరణ వాదాలు సినిమాల్లో సీమ ఫ్యాక్షనిజం . . . వంటి సవాలక్ష విషయాలు వొడ్డును కోసే వరద ప్రవాహ వేగంతో కదులుతూ వుంటాయి. పది వ్యాసాల పెట్టు యీ కథ. చైతన్య స్రవంతికి దగ్గరగా వుండే టెక్నిక్ ని ఆశ్రయించడంవల్ల యెన్నో విరుద్ధ అంశాలు కథలోకి యెక్కాయి. తానూ బోధించే చదువుల పరమార్థం తన చేతి నుంచి జారిపోయిన కారణంగా కల్గిన వొక విధమైన కసి యీ కథలోని వుపాద్యాయుడి ప్రవర్తనలో చూస్తాం , కానీ  నిజానికి ఆశక్తతలోంచీ పుట్టిన దుర్భరమైన ఆవేదన అది. పోటీ చదువుల్తో బాల్యానికీ ప్రకృతికీ దూరమౌతోన్న పిల్లలపట్ల అపారమైన ప్రేమతో రాసిన కథ ‘ఒక చల్లని మేఘం’. అనివార్యంగా కంట తడి పెట్టించే కథ యిది. పేదలకి విద్యనందకుడా చేసే మైనార్టీ గుట్టుని ‘ఒక మైనార్టీ కాలేజి కథ’ రట్టు చేస్తే , ‘నాలుగో స్తంభం’ కథ విద్యని లాభసాటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిన  కార్పోరేట్ కాలేజీల మధ్య నెలకొన్నఅనారోగ్యకరమైన పోటీనీ , పెట్టుబడులకు పెంపుడు జంతువైన మీడియా క్రూర దౌష్ట్యాన్నీ యేకకాలంలో యెండగట్టింది.  ఇదంతా మన చదువుల కుట్ర. దాన్ని ఛేదించడానికి పూనికతో కథనొక సాధనంగా యెన్నుకొన్న రచయిత  హరికిషన్. ఇప్పుడు కావల్సింది సంస్కరణలు కాదు – సమూలమైన మార్పు అని యీ కథలు చదివాకా అనుకోకుండా వుండలేం.

ఈ సంపుటిలో స్త్రీల ముఖత: వినిపించిన రెండు అద్భుతమైన మౌఖిక కథనాలు ( నిశ్శబ్ద ఆర్తనాదం – 2000 , పొద్దుపోని పంచాయితీ – 2010 ) నన్ను కట్టిపడేశాయి. వాటిలో గుక్కతప్పుకోకుండా పలికిన సాంద్ర దు:ఖ – క్రోధ భాష గుండెను బలంగా తాకుతుంది. కుటుంబ హింస , జెండర్ రాజకీయాల వస్తువా – వర్గ ప్రాంతీయ భాషా – మోనోలాగ్ శిల్పమా యేది ఆకట్టుకుంటుందో నేను చెప్పేకన్నా మీరే స్వయంగా చూసి తెలుసుకోండి. వస్తు శైలీ  శిల్పాల మేలు కలయికకి అవి అమోఘమైన సాక్ష్యాలు అని తప్పక అంగీకరిస్తారు.

ప్రపంచీకరణ ద్వారా మనం కోల్పోతున్నదాన్నీ కాపాడుకోవాల్సిన వాటిని కూడా  హరికిషన్ స్పష్టంగా గుర్తించాడు. గ్లోబల్ సందర్భంలో సాంస్కృతిక పరాయీకరణ అతణ్ణి ఎక్కువగా బాధించింది. రోజుల తరబడి మహా కథనాల్ని గానం చేసి సాంస్కృతిక వారసత్వ సంపదని కాపాడుకొస్తున్న  వుపకులాలకు చెందిన కళాకారులు తమ కళకి దూరమై  పూట గడవక బిచ్చగాళ్ళుగా మారిపోగా, టీవీ పెట్టెలకి అతుక్కుపోయి వొక మత్తులో కూరుకుపోయి చివరికి వూకుడు కథలు చెప్పేవాళ్ళూ కరువై మన పాటా కథా నశించిపోతున్న సందర్భాన్ని  మాయమైన గానం(2006), ఒక్క కథ(2010) ల్లో హరికిషన్ రికార్డు చేసాడు. అందుకే అతను రాయల సీమ పల్లె పట్టుల్లో లభించే జానపద గేయాల్నీ కథల్నీ పిల్లలకోసం సేకరించి ప్రచురిస్తున్నాడు. మనదైన అచ్చమైన దేశీయ  సాహిత్య  సంపదని కాపాడే లక్ష్యంతో చేస్తున్న ఆ పని చొచ్చుకొస్తున్న  సాంస్కృతిక సామ్రాజ్య వాద  ఆధిపత్యాన్ని ఎదుర్కొనే సాధనంగానే భావించాలి. మౌఖిక కథనాల్ని యథాతథంగా అందించడం వల్ల ఆ సాహిత్యలో వినిపించే కర్నూలు మాండలిక భాషా విశేషాలు అట్టడుగు కులాల సామాజిక చరిత్రని తెలుసుకోడానికి సైతం దోహదపడతాయి.

హిందూ ముస్లిం – భాయ్ భాయ్’ (2005) కథ నిచ్చెన మెట్ల సమాజంలో అట్టడుగున వున్న దళితులు వున్నతీకరణని కోరుకొన్నప్పుడు వారిని అణగదొక్కడానికి మత విద్వేషంతో వొకరిపై మరొకరు కత్తులు నూరే హిందూ ముస్లింలు వొకటౌతారన్న చేదు వాస్తవాన్ని విప్పి చెబుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా చేజారిపోయే సంక్లిష్టమైన వస్తువుని హరికిషన్ యెంతో సంయమనంతో నిర్వహించాడు. ఇదే జాగ్రత్త ‘జవా’ నిర్వహణలో కూడా చూస్తాం. ఇనాయతుల్లా దాదా హయాత్ షరీఫ్ లాంటి ఇన్ సైడర్స్ మాత్రమే రాయగల కథ యీ కథ ముస్లిం మతం లోపల ముల్లాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తుంది.

కులం – మతం – ప్రాంతం – జెండర్ నిర్దిష్టతల్లోంచి వస్తు  వైవిధ్యంతో తీర్చిదిద్దిన యీ  కథలకి  ప్రాణభూతమైన అంతస్సూత్రం (యాంకరింగ్ పాయింట్) మాత్రం వొక్కటే – వ్యవస్థీ కృతమైన అసమానతలపై తీవ్రమైన క్రోధం , సమస్త ఆధిపత్యాలపై నిరసన. అదే రచయితగా హరికిషన్ ప్రాపంచిక దృక్పథం. ఆ దృక్పథం వల్లే అతను ఐక్యత –  సంఘర్షణ సూత్రాన్ని అన్వయించుకొంటూ అనేక నిర్దిష్టతల్లోంచీ సాధారణీకరణం వైపు పయనిస్తూ గడ్డిపరకల్తో తాడు పేనుతున్నాడు.

సంపుటిలోని కథలన్నీ తడమలేని  అశక్తుణ్ని. చివరిగా వొక్క ముచ్చట చెప్పి మాత్రం ముగిస్తా –

మంచి కథలో పాత్రలు పాఠకుల్ని వెంటాడతాయి – లోపలా బయటా సంఘర్షణ ప్రధానంగా నడిచే కథల్లోని పాత్రలే పదికాలాలు గుర్తుంటాయి. బహుముఖీన (మల్టీ లేయర్డ్) కథల్లో పాత్రలు పాఠకుడిని వూపిరి తీసుకోనివ్వవు – సుఖంగా నిద్రపోనివ్వవు. అటువంటి బలమైన పాత్రల్ని కథల్లోకి తీసుకురావడానికి అనువైన సమాజమే మన చుట్టూ వుంది . హరికిషన్ కథల్లో యెక్కువ భాగం సింగిల్ పాయింట్ కథలు కావడం వల్ల పాత్రల వ్యక్తిత్వంలోని అనేక పొరలు ఆవిష్కారమవడానికి ఆస్కారం తక్కువ;  అయినప్పటికీ  ‘బతుకు యుద్ధం’లో గోవిందయ్య ,‘చూపు’లో ‘నేను’ , ‘ఒక చల్లని మేఘం’ లో హరి , ‘రాజమ్మ’లో రాజమ్మ , ‘బసివిరాలు బరితెగించింది’లో ఉలిగమ్మ , కోటయ్య  వంటి గుర్తుండే పాత్రల్ని మనముందు సాక్షాత్కారింపజేయగలిగాడు. బాధ్యతనెరిగిన రచయితగా  సమాజంలోని సంక్లిష్టతల్నీ సంక్షోభాల్నీ సాహిత్యీకరించే ఆచరణలో ముందువరసలో నడుస్తున్నాడు కాబట్టి హరికిషన్ నుంచి  ముందు ముందు మల్టీ లేయర్డ్ కథలూ పాత్రలూ తయారవుతాయని యీ సంపుటి భరోసానిస్తుంది. కథానిర్మాణం పై అతను తీసుకొనే శ్రద్ధ ముచ్చటగొలుపుతుంది.

నిరాడంబర శైలీ , ముక్కుసూటి కథనం , వస్తు వైవిధ్యం , శిల్పం పేరున ప్రయోగాలు చేయకపోవడం , పాత్రోచితమైన భాషాప్రయోగం చేస్తూనే కథనంలో సైతం తనదైన ప్రాంతీయ ముద్రని చూపే నైపుణ్యం , తనచుట్టూ వున్న సమాజం లోని గతిశీలతని భిన్నపార్శ్వాలనుంచి విశ్లేషించగల యెరుక , స్వీయ జీవితానుభావాలను  ప్రగతిశీల ప్రాపంచిక దృక్పథం నుంచి వ్యాఖ్యానించే నేర్పు , స్థానీయతకి పెద్దపీట వేసి వొక వాతావరణాన్ని నిర్మించే జాగరూకత,   మానవీయ స్పందనల్ని- వుద్వేగాల్ని నిర్దిష్ట సామాజిక సందర్భం నుంచి చూడగల సంయమనం , ‘కథా సమయం’ వంటి సంస్థలద్వారా పెంచుకొన్న సదసద్వివేచనా   రచయితగా హరికిషన్ కూడగట్టుకొన్న బలాలు. ఇవి భవిష్యత్తులో మరింత పదునెక్కుతాయని ఆశంస.

కర్నూలు జిల్లా చరిత్ర కారుడిగా , బాల సాహిత్య కర్తగా , జానపద సాహిత్య సేకర్తగా – పున: స్రష్టగా , కథా రచయితగా తనకంటూ వొక గుర్తింపు తెచ్చుకొన్న డా. హరికిషన్ నుంచి కర్నూలు ప్రాంత సమగ్ర సామాజిక చరిత్రకి అద్దం పట్టే మంచి నవలని ఆశించడం తప్పు కాదేమో! సీమ నవల అనకుండా కర్నూలు నవల అనటానికి కారణం – కర్నూలు నుంచి హరికిషన్ ని విడదీయలేకపోవడమేనని నివేదిస్తూ … కందనవోలు కథలకు సాదర స్వాగతం పలుకుతూ . . . సెలవ్.

                                                                 -ఎ.కె.ప్రభాకర్ 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)