వొక మాంత్రికుడితో కొన్ని మాటలు

డా.కేశవరెడ్డి,వెంకట్ సిద్ధారెడ్డి, కత్తి మహేష్ కుమార్ (ఎడమ వైపు నుంచి)

 మార్చి 10 కేశవరెడ్డి గారి పుట్టిన రోజు 

MaheshVenkat_KesavReddy1

(ఎడమ వైపు నుంచి) డా. కేశవ రెడ్డి, వెంకట్ సిద్ధారెడ్డి, కత్తి మహేష్ కుమార్

ధైర్యం కూడగట్టుకుని ఫోన్ చేశాను. అటువైపు రింగ్ అవుతోంది. ఊపిరిబిగబట్టి ఆ రింగ్ వింటున్నాను. ఆ రింగ్ కన్నా నా ఊపిరి నాకే ఎక్కువగా వినిపిస్తోంది. అటువైపునుంచీ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు.

“హలో”

“సర్, నాపేరు మహేష్ అండీ, కేశవరెడ్డిగారేనా!” అంటూ నేను కొంచెం లోవాయిస్ లో…

“అవునబ్బా! కేశవరెడ్డినే. చెప్పండి.”

***

సంవత్సరం 2009.

“మునెమ్మ” చదివాక ఒక ఉన్మాదం ఆవరించింది. అప్పుడప్పుడే ఒక డబ్బింగ్ చిత్రాలకు మాటలు రాయడం, కొన్ని సినిమాలకి స్క్రిప్టు సహకారం అందించడం ద్వారా మెయిన్ స్ట్రీం సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న తరుణం. మునెమ్మ గురించి విన్నప్పుడే ఒక శక్తివంతమైన సినిమాకు సంబంధించిన సరంజామా అనిపించింది. ఒకసారి చదివాక ఆగలేని ఉత్సాహం నిండుకుంది. కాలేజిలో హెమింగ్వే  ‘ఓల్డ్ మెన్ అండ్ ది సీ’ చదువుతున్నప్పుడు తెలిసిన  రెఫరెన్స్ తో “అతడు అడవిని జయించాడు” పుస్తకం చదవటంతో డాక్టర్ కేశవరెడ్డి అనే పేరు పరిచయం అయ్యింది. మా చిత్తూరు రచయిత అనే అభిమానమో ఏమోగానీ, పేరు మాత్రం అలాగే గుర్తుండిపోయింది. మళ్ళీ మునెమ్మ దెబ్బకి ఆ పేరు మర్చిపోలేని విధంగా మెదడులో నిక్షిప్తమైపోయింది.

నా మిత్రుడు, సహరచయిత సిద్దారెడ్డి వెంకట్ (‘కేస్ నెంబర్ 666/2013’ సినిమా దర్శకుడు) తో మునెమ్మ గురించి చర్చిస్తున్నప్పుడు “అరే! నువ్వు కేశవరెడ్డిగారిని ఇన్నాళ్ళూ మిస్ అయ్యావా. చదవాలి బాస్. ఆయన నవల ‘సిటీ బ్యూటిఫుల్’ చదివాకగానీ నాకు తెలుగులో అంత గొప్ప పుస్తకాలు ఉన్నాయని తెలీదు” అంటూ ‘సిటీబ్యూటిఫుల్’ నవలని పరిచయం చేశాడు. ఒక్కబిగిన చదివిన నవలలు నాజీవితంలో తక్కువే. సిటీ బ్యూటిఫుల్ ఆ కోవలోకి చేరింది. చైతన్య స్రవంతి శైలిని గురించి వినడం చదవడం అప్పటికే చేశాను. తెలుగులో అంపశయ్య నవీన్, వడ్డెర చండీదాస్ రచనలు ఆ శైలితో సుపరిచితమే. కానీ కేశవరెడ్డి విన్యాసంలోఆశైలి ఇంకో అద్వితీయమైన స్థాయికి చేరిందని నేను ఖరాఖండిగా చెప్పగలను. చైతన్య స్రవంతికి జేమ్స్ జాయ్స్ ఆద్యుడైతే, తెలుగులో చలం తరువాత ఆ శైలిని ఉఛ్ఛస్థితికి తీసుకెళ్ళిన రచయిత డాక్టర్ కేశవరెడ్డి. కాశీభట్ల వేణుగోపాల్ లాంటివాళ్ళు దీన్ని ఇంటర్నల్ మోనోలాగ్ అన్నా, నాకైతే స్ట్రీమ్ ఆఫ్ కాంషస్నెస్ గానే అనిపిస్తుంది.

ఇక వేట మొదలయ్యింది. ఇన్ క్రెడిబుల్ గాడెస్, చివరి గుడిసె, స్మశానం దున్నేరు, మూగవాని పిల్లనగ్రోవి, రాముడుండాడు రాజ్జిముండాది చదివాకగానీ ఆకలి తీరలేదు. ప్రతిపుస్తకం చదువుతుంటే ఒక అద్భుతమైన సినిమా చూసిన అనుభవం. ధృశ్యాలు కళ్లముందు కదలాడి, ఉద్వేగాలతో శరీరాన్ని ఊపేసిన అనుభూతి. ఇంత సులువుగా, ఇంత శక్తివంతంగా, ఇంత ప్రభావవంతంగా రాయగలగడం ఒక సాధన.

***

“మీ మునెమ్మ నవల చదివాను సర్”

“ఎట్లుంది? బాగుందా?”

“అద్భుతంగా ఉంది సర్. ఆ నవలను సినిమాగా తియ్యాలనుంది సర్.”

“మునెమ్మనా…సినిమాగానా! మనోళ్ళు చూస్తారా? అయినా సినిమా అంటే పెద్ద కష్టం లేబ్బా.”

“నిజమే…కానీ తీస్తే బాగుంటుంది అనిపించింది సర్. మిమ్మల్ని కలవాలనుంది. మీరు హైదరాబాద్ కి ఎప్పుడైనా వస్తున్నారా సర్”

“హైదరాబాదా…ఇప్పట్లో రాలేనుగానీ, నువ్వే మా నిజామాబాద్ కి రా ,కూచ్చుని మాట్లాడుకుందాం.”

“సరే సర్….సార్ మాదీ చిత్తూరు జిల్లానే సర్..పీలేరు దగ్గర యల్లమంద.”

“అవునా…నాకు బాగా తెలుసునే ఆ ఏరియా అంతా…సరే ఇబ్బుడు క్లినిక్ లో ఉండాను. మధ్యాహ్నంగా ఫోన్ చెయ్ మాట్లాడుకుండాము.” అంటూ అటువైపునుంచీ నిశ్శబ్ధం.

నేను ఫోన్ పెట్టేసాను.

***

అప్పట్నించీ అడపాదడపా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. నేను అవడానికి చిత్తూరువాడినే అయినా, చదువురీత్యా, ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో తిరగడం కారణంగా భాష చాలావరకూ న్యూట్రలైజ్ అయిపోయి ఏవోకొన్ని పదాలలో తప్ప మా యాస నాకు దూరమయ్యింది. కానీ డాక్టర్ కేశవరెడ్డిగారితో మాట్లాడుతుంటే, ఆ యాస వింటుంటే ఏదో తెలీని ఆత్మీయత. ఆయన జీవితమంతా నిజామాబాద్ లో గడిపినా, అక్కడి యాసతో భాషతో ఒదిగిపోయినా తన ఇంటొనేషన్, కొన్ని టిపికల్ పదాలువాడటం అన్నీ ‘సిత్తూరు’తీరే.

కొన్నాళ్లకు మిత్రులసహాయంతో ధైర్యం చేసి మునెమ్మ నవల హక్కులు తీసుకోవడానికి నిర్ణయించుకుని నిజామాబాద్ ప్రయాణం అయ్యాను. కలిసాను. ఫోన్లో ఎంత సింప్లిసిటీ వినిపించిందో అంతకన్నా సింపుల్ గా మనిషి కనిపించారు. క్లినిక్ నుంచీ పికప్ చేసుకుని ఇంటికి వచ్చాం. మధ్యాహ్నం కలిసినవాళ్లం మాటల్లో సాయంత్రం ఎప్పుడయ్యిందో తెలీలేదు. ప్రపంచ సినిమాపై కేశవరెడ్డిగారికున్న పట్టు, తన దగ్గరున్న స్క్రీన్ ప్లే కలెక్షన్లూ చూశాక ఆయన నవలలు చదువుతుంటే సినిమా ఎందుకు కనిపించిందో అర్థమయ్యింది. నాదగ్గరున్న చిట్టాకూడా ఏకరువు పెట్టాను. వెనుదిరిగి వచ్చాక పోస్టులో కొన్ని డివిడి లు.  పుస్తకాలు పంపాను.

మునెమ్మ మా సొంతమయ్యింది. పుస్తకం మీదో లేక నా ల్యాప్ టాప్ లోనో ఏదో పిచ్చిగా నోట్స్ రాసుకోవడం. మునెమ్మ పాత్రను, కథను, ఉపకథల్ని పొడిగించుకోవడం, కొత్త కోణాల్ని జోడించడం కేశవరెడ్డిగారికి ఫోన్ చేసి విసిగించడం. పాపం ఆయన ఎప్పుడూ విసుక్కున్న దాఖలాలు మాత్రం కనిపించలేదు. కొన్నిరోజులకి ఇప్పట్లో మునెమ్మను సినిమాగా తియ్యలేమనే నిజం తెలిసొచ్చింది. నేను నిరాశపడ్డా కేశవరెడ్డిగారు నిరాశపడలేదు. “సినిమా తియ్యాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసులేబ్బా! చూద్దాం ఏమవుతుందో” అనేవాళ్ళు. నేను చెప్పిన క్లైమాక్స్ మార్పులకు మించిన ముగింపులు కొన్ని తనే తయారుచేశారు. ఆయన స్వప్నించి మునెమ్మని సృష్టిస్తే నేను ఆ మునెమ్మను ఇంకా శ్వాసిస్తూ ఉన్నాను.

***

డాక్టర్ కేశవరెడ్డిగారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఏదో విధంగా కలిసే ప్రయత్నం చేస్తుంటాం. అప్పుడప్పుడూ ఫోన్లు. సాహితీచర్చలు. సినిమాల గురించి మాటలు. మునెమ్మ గురించి తక్కువగా మాట్లాడతాం.

***

తెలుగు నవలాకారుల్లో డాక్టర్ కేశవరెడ్డి ఒక మాంత్రికుడు. అత్యుత్తమ కథకుడు. ల్యాండ్ స్కేప్ ను, మిథ్ ను, మ్యాజిక్ ను, ఫోక్ లోర్  ని, జీవజంతువుల్ని కలగలిపి వాటితోనే మనుషులకు కథ చెప్పించగలిగిన అరుదైన కళాకారుడు. డాక్టర్ కేశవరెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు.

  

Download PDF

15 Comments

  • kurmanath says:

    he is one of the tallest writers in Telugu. ఎంత బాగుంటుంటాయో ఆయన రచనలు. మన గురించే రాస్స్తున్నట్టు, మన సమస్యల్ని ఎంతో సహానుభూతి చెంది రాస్తున్నట్టు అనిపిస్తుంది. బహుశా డాక్టరు కూడా కావడం వల్లనేమో క్లినికల్ ప్రెసిషన్ వుంటుంది శైలిలో. ఆయన రచనలు చదివితే కొన్ని రోజులు ఆ వాతావరణం లోనే వుండి పోతాం. ఆయన రచనల్ని సమగ్రంగా ఎసెస్ చేయాలి. గుడ్ ఎఫర్ట్, మహేశ్.

  • mercy margaret says:

    మహేష్ గారు , నాకు ఆయన గురించి వినడం , తెలుసుకోవడం కొత్తగానే ఉంది .. మీ ఈ మాటలు చదివాక , మీరు పేర్కొన్న పుస్తకాలను చదవాలన్న ఆసక్తి పెరిగింది . ధన్యవాదాలు …

  • మహేష్ గారు,

    చాలా చాలా నచ్చింది. ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది.

    డాక్టర్ కేశవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు!

    -రవి

  • 2003-2004 ప్రాంతంలో రావిశాస్త్రి పేరిట ఉన్న అనేక సాహిత్య పురస్కారాల్లో ఒక దాన్ని కేశావరెడ్డిగారికి ఇచ్చారు. సభ తెలుగు వివి ప్రాంగణంలో జరిగింది. అప్పటికే సాహిత్య సభలంటే కొంచెం తెనాలి రామకృష్ణుడి పిల్లిలా ఉన్న నేను కేవలం కేశవరెడ్డిగారిని చూడ్డానికి ఈ సభకి వెళ్ళాను. జ్వాలాముఖి అధ్యక్షులు అనుకుంటా. ఎవరెవరో ఏవేవో మాట్లాడారు. ఆయన మాత్రం చిద్విలాసంగా అట్లాగే ఉన్నారు. పురస్కారానికి స్పందనగా కూడా ఆయన ఎక్కువ మాట్లాడలేదు. సభ ముగిసినాక దగ్గిరికి వెళ్ళాను. సాధారణమైన టెరిలిన్ పొట్టి చేతుల చొక్కా, సాధారణమైనదే పేంటు. టక్ చెయ్యలేదు. కాళ్ళకి హవాయి చెప్పులు. కథలు రాస్తాన్సార్ అని చెప్పుకున్నాను. మా వూర్రండి, మాట్లాడుకుందాం అని పిలిచారు. వెళ్ళలేదు .. ఎప్పటికో! .. Thank you Mahesh.

  • ఆర్టికల్ చదివి.. కేశవ రెడ్డిగారిని పర్సనల్గా కలిసిన ఫీల్ వచ్చింది..

    చదవాల్సిన పుస్తకాల లిస్ట్ లో.. ఇక కేశవరెడ్డిగారి రచనలు కూడా కలిపేశాను.
    థాంక్స్ ఫర్ ది ఆర్టికల్

  • కేశవరెడ్డి గారి ‘మునెమ్మ’ నీ పరిచయం చేయండి మహేష్ గారూ! మీ పరిచయ పంథా బాగుంది.

  • అఫ్సర్ says:

    హనుమంత రావు గారు:
    మంచి మాటలకు షుక్రియా
    మహేశ్ రాయాలనే నా కోరిక కానీ…
    మహేశ్ తో రాయించడం కంటే కేశవ రెడ్డి గారితో రాయించడమే తేలిక
    కానీ, ఇటీవలి కాలంలో మునెమ్మ గురించి అత్యంత సమగ్రంగా రాయబడిన వ్యాసం..అదీ అందమయిన శైలిలో…ఇదిగో ఇదీ…
    http://vaakili.com/patrika/?p=1405

  • ns murty says:

    మహేష్ గారూ,

    మీరూ స్క్రీన్ ప్లే లాగ అందంగా కళ్ళకు కట్టినట్టు తెరవెనుక కథని చూపించారు. భాషకి, భావాలకీ కొందరు దాసులైతే, కొందరికి భాషా, భావమూ దాసోహం అంటాయేమో అనిపిస్తుంది కేశవరెడ్డిగారిని తలుచుకుంటుంటే.

    అభివాదములు

  • ఇదుగో ఇప్పుడే కలిశాను… ఒక మాంత్రికుడితో ములాకాత్..!! మునెమ్మ మళ్ళీ కొని ఆయన చేతిలో పెడితే వణుకుతున్న చేతులతో చిరుసంతకం చేసి – “ఈ ఒక్క పేజీ ముందుమాటని కొత్తగా చేర్చారు. చదవండి.” అన్నారు. చదివితే ఏముంది… మునెమ్మను విమర్శించినవారందరికీ వాత పెట్టారు.. ఇలాంటి పుస్తకం పది మందికీ నచ్చటమే నిజమైన మేజిల్ రియాలిటీ అన్నారు..!!

  • the tree says:

    కేశవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు,..చదవాల్సిన , తెలుసుకోవలసిన విషయాలెన్నో,….చాలా బాగుందండి,..

  • Jhansi Papudesi says:

    చాలా బావుందండి. మీ రచనా శైలి బావుంది. చిత్తూరు లో పుట్టి పెరిగిన నేను కేశవరెడ్డి గారి రచనలు నేను ఇంతవరకూ చదవలేదని చెప్పడానికి సిగ్గుపడుతున్నా. ఆయనకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు. మునెమ్మను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.

  • మహేష్ గారూ,
    మీ సంభాషణ బాగుంది. సినిమా తీయడం కష్టమా?
    శుభాకాంక్షలు
    మీ
    దార్ల

  • manjari.lakshmi says:

    ఈ ఫొటోలో కేశవరెడ్డిగారు ఎవరూ? మిగతా ఇద్దరూ ఎవరూ?

    • editor says:

      ఇప్పుడు ఫోటో కి కాప్షన్ ఉన్నది చూడండి మంజరి గారు. ఎడమ వైపు నుంచి చూస్తే కేశవరెడ్డి గారు, వెంకట్ , కత్తి మహేష్. కేశవరెడ్డి గారి ని ఇంటర్వ్యూ చేసింది , రాసింది కత్తి మహేష్. వెంకట్ మహేష్ స్నేహితుడు, సినిమా రంగానికి చెందిన వ్యక్తి.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)