వీలునామా

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

  మొదటి భాగం

స్కాట్లాండ్ లోని ఒక పల్లె దగ్గర వుండే ఒక పెద్ద భవంతిలో, ఆ వేసవి రోజు ఒక రకమైన దిగులు అలుముకోని వుంది. ఆ భవంతి సొంత దారు శ్రీయుతులు హొగార్త్ గారు జబ్బు చేసి మరణించి అప్పటికి రెండు రోజులైంది. ఆ రోజు ఉదయమే ఆయన అంత్య క్రియలు ముగిసాయి.

 స్త్రీలంటే వుండే అపారమైన గౌరవం చేత ఆయన వివాహం చేసుకోలేదని ఊళ్ళో వాళ్ళనుకుంటారు. భార్యా బిడ్డలూ లేకపోయినా, ఆయనతో పాటు పదిహేనేళ్ళుగా నివసిస్తూన్న  మేనకోడళ్ళు, జేన్, ఎల్సీ లిద్దరూ వున్నారు. ఒక్కగానొక్క చెల్లెలు పదిహేనేళ్ళ క్రితం చనిపోతే వాళ్ళిద్దర్నీ ఆయన చేరదిసి ఇంటివద్దనే చదువు చెప్పించారు. ఆయనకున్న ఇద్దరు అన్నలూ సంతానంలేకుండానే మరణించారు. అందువల్ల ఆయన ఆస్తి పాస్తులన్నీ ఇప్పుడా ఇద్దరు అమ్మాయిలకే చెందొచ్చని అందరి ఊహ. ఆయనకింకెవరూ బంధువులు వున్నట్టు లేరు. కనీసం ఆ భవంతిలో వేరే బంధువులెప్పుడూ కనపడలేదు.

ఊళ్ళో అంతా ఆయన గురించి కొంచెం వింతగా చెప్పుకుంటారు. ఏ క్షణంలో ఆయన మనసెలా వుంటుందో, ఎప్పుడే విచిత్రమైన పని చేస్తారో ఎవరికీ అంతుబట్టదు. ఇప్పుడీ మేనకోడళ్ళ సంగతే తీసుకుంటే, అందరు అమ్మాయిలకు చెప్పించినట్టు సంగీతమూ, చిత్ర లేఖనమూ లాటి నాజూకు విద్యలు కాకుండా కొంచెం విభిన్నమైన చదువులు చెప్పించారని వినికిడి.

అంత్య క్రియలు ముగిసి అందరూ ఆ భవంతిలోని హాలులోకి చేరుకుంటున్నారు. హొగార్త్ మేనకోడళ్ళు, వకీలు మెక్-ఫార్లేన్ గారూ, వైద్యుడు బైర్డ్ గారూ వున్నారు హాలులో. వీళ్ళతోపాటు ఒక అపరిచిత వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డారు అమ్మాయిలిద్దరూ. దాదాపు ముఫ్ఫై యేళ్ళ వయసున్న ఆ పొడుగాటి వ్యక్తిని వాళ్ళింతకు ముందెప్పుడూ చూడలేదు. చాలా గంభీరంగా వున్నాడెందుకనో.

వకీలు గారూ, డాక్టరు గారూ కొంచెం ఇబ్బందిగా, చిరాగ్గా వున్నారు. వీలునామా చదివే ముందు అవసరమైన చిన్న చిన్న పనుల వల్ల అయి వుండొచ్చు. ఏవేవో కాగితాలు చూస్తూ కాలయాపన చేస్తున్నారు.

ఆఖరికి అందరూ కూర్చున్నాక వీలునామా చదవడం మొదలైంది. ఎందుకనో వకీలు గారికి గొంతు పట్టేసినట్టుంది.

“.. నా అభిప్రాయం ప్రకారం, స్త్రీలకి పురుషలకీ పెద్ద తేడాలేం లేవు. అవసరమైన చదువులు చెప్పిస్తే, ఆడవాళ్ళు కూడా తమ కాళ్ళమీద తాము నిలబడగలరు. ప్రపంచంలో తమ దారి తాము వెతుక్కోనూగలరు. ఈ సూత్రానన్నుసరించే నేనూ నా మేనకోడళ్ళు ( జేన్ మెల్వీల్, ఎల్సీ గా పిలవబడే ఆలిస్ మెల్వీల్) ఇద్దరికీ తగు విద్యా బుధ్ధులు నేర్పించాను. ఇప్పుడు గనక నేను నా ఆస్తిపాస్తులన్నీ వారికిస్తే, వాళ్ళు తమ కాళ్ళ మీద తాము స్వతంత్రంగా నిలబడాలన్న నా ఆశయానికి భంగం వాటిల్లక తప్పదు. ఇద్దరిలోకి పెద్దదీ, తెలివైనదీ అయిన జేన్ తెలివితేటలెందుకూ పనికిరాకుండా పోతాయి. చిన్నది ఆలిస్ ఆమాయకురాలు. డబ్బున్న అమాయకురాలిని వంచించటానికి కాచుకోని వుండే నక్కలకి మన సంఘంలో లోటు లేదు. వారి తండ్రి జార్జి మెల్వీల్ ఆ డబ్బు కోసమే కదా మా చెల్లి చుట్టూ తిరిగి దాని మనసునీ, జీవితాన్నీ ముక్కలు చేసింది! అందువల్ల ఈ డబ్బు వారిద్దరికీ హాని చేయడమే తప్ప ఇంకెందుకూ పనికిరాదని నా అంచనా.

అందుకే నా స్థిరాస్తులూ, చరాస్తులూ, అన్నిటినీ బేంక్ ఆఫ్ స్కాట్ లాండ్ లో హెడ్ క్లర్కు గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ ఆర్మిస్టవున్ పేర రాస్తున్నాను. అతని తల్లి ఎలిజబెత్ ఆర్మిస్టవున్ ని నేను దాదాపు ముఫ్ఫై అయిదేళ్ళకింద రహస్య వివాహం చేసుకున్నాను. ఫ్రాన్సిస్ కి ఈ సంగతి ఈనాటి వరకూ తెలియదు. ఎలిజబెత్ తో అన్ని రకాలుగా తెగతెంపులు చేసుకున్న నేను, ఫ్రాన్సిస్ కి దూరం నించే సహాయం చేస్తూ వున్నాను. నేనిచ్చే అతి కొద్దిపాటి దబ్బుతో ఫ్రాన్సిస్ పేదరికాన్నించి పైకొచ్చి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అలా చదువుకొని ఉద్యోగస్తుడవ్వడానికి అతనెంతో కష్టపడ్డాడు. అందుకే అతనిప్పుడు డబ్బునీ, ఆస్తినీ అందుకోవడానికి అర్హుడని నా అభిప్రాయం.

అయితే, అతను ఏలిస్, జేన్ లకి ఒకరొకరికీ  సంవత్సరానికి పన్నెండు పౌన్ల చొప్పున మూడేళ్ళు ఇవ్వాల్సి వుంటుంది. ఆ మూడేళ్ళల్లో వాళ్ళిద్దరూ తమ జీవనోపాధి వెతుక్కోవాల్సి వుంటుంది. మూడేళ్ళ తర్వాత ఆ డబ్బు ఆపేయ వలసివుంటుంది.

తమకి చెందిన బట్టలూ, కొంచెం ఇంటి సామాన్లతో ఇద్దరు అమ్మాయిలూ ఇల్లు వొదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వారికి ఇంకే విధమైన ధన సహాయం ఫ్రాన్సిస్ చేయటానికి వీల్లేదు. వాళ్ళల్లో ఎవరినీ వివాహమాడటానికి కూడా వీల్లేదు.

నేను నియమించిన షరతులలో వేటిని ఉల్లంఘించినా, నా అస్తంతా సాంఘిక సంక్షేమ సంస్థలకి చెందుతుంది. అటువంటి సంస్థల పట్టిక ఈ వీలునామాకి జత చేయబడి వుంది. నేనీ ఏర్పాటు పిల్లల మంచికోసమే చేసానని నమ్ముతున్నాను…”

హాలంతా నిశ్శబ్దం. జేన్ నిర్ఘాంతపోయి, మొహం ఎర్రబడి, కళ్ళల్లో నీళ్ళు నిండినా, వాటిని జారనీయకుండా నిబ్బరంగా, కఠినంగా కూర్చుంది. ఏలిస్ మొహం పాలిపోయి, మూర్ఛపోయింది. అందరికంటే సిగ్గుతో, అపరాధ భావనతో తడబడ్డాడు, ఫ్రాన్సిస్. అతి కష్టం మీద మాటలు కూడదీసుకొని,

“హొగార్త్ గారు విల్లు రాసినప్పడు ఆరోగ్యంగానే వున్నారు కదా?” అన్నాడు.

“చక్కగా వున్నారు! దాన్లో అనుమానం లేదు. ఏమంటారు డాక్టరు గారూ?”

లాయరు గారి ప్రశ్నకి డాక్టరు బైర్డ్ గారు అవునన్నట్టు తలాడించారు.

“ఈ వీలునామా దాదాపు ఆరు వారాల కింద రాయించారు. అప్పుడాయన ఆరోగ్యంగానే వున్నారు. ఇంత విచిత్రమైన వీలునామా రాసారెందుకో! పాపం లాయరు గారు కూడా వద్ద న్నారట. అయినా మీ మామయ్య ఎవరి మాటా వినిపించుకోరు. మీ ఇద్దర్నీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతూంది! ”

ఇంతలో ఏలిస్ కళ్ళు తిరిగి సోఫాలో ఒరిగిపోవటంతో, డాక్టరుగారూ, జేన్ ఆమెకి ఉపచారాలు చేయసాగారు.

లాయరు గారు ఫ్రాన్సిస్ వైపు తిరిగి ఉన్నట్టుండి ధనవంతుడైనందుకు అభినందనలు తెలిపాడు. ఫ్రాన్సిస్ కి ఆ పరిస్థితి దుర్భరంగా, అవమానంగా అనిపించసాగింది. ఏం మాట్లాడాలో తోచక ఊరికే హాల్లోని బొమ్మలనీ, కిటికీ బయట తోటనీ చూడసాగాడు. అతనికి ఆ ఇద్దరి అమ్మాయిలనీ తలచుకుంటే ఏదోలా వుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎటెళ్తారు? అసలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరా? తనిప్పుడేం చేయాలి? తనకంటే సంవత్సరానికి పన్నెండు పౌన్లతో గడుపుకోవటం అలవాటే. వాళ్ళిద్దరూ?

పెద్దమ్మాయి కాస్త ధైర్యస్థురాలిలానే వుంది కానీ, చిన్నమాయి పాపం నాజూకుగా, అమాయకంగా వుంది. వాళ్ళిద్దరికీ ఇప్పుడేం ఉద్యోగాలొస్తాయి?వాళ్ళనెవరు పెళ్ళాడతారు? వాళ్ళిద్దరూ పాపం పెళ్ళి పెటాకులూ లేక పెద్దైపోతుంటే తాను వాళ్ళ డబ్బంతా అనుభవిస్తూ సంతోషంగా వుండగలడా? మధ్యలో తనేం సహాయం చేయకూడదని షరతు విధించాడెందుకో ఆ పెద్దాయన!

ఫ్రాన్సిస్ మెల్లిగా లేచి ఏలిస్ పడుకున్న సోఫా దగ్గరికెళ్ళి నిలబడ్డాడు. ఏలిస్ చేతుల్లో మొహం కప్పుకొని ఏడుస్తోంది. జేన్ అతని వంక నిర్వికారంగా చూసింది. ఫ్రాన్సిస్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు.

“నన్ను నమ్ము జేన్! ఈ వీలునామాతో నాకే ప్రమేయమూ లేదు. దాంతో సంతోషమూ లేదు. వీలైనంత త్వరగా నేను ఇదంతా మీ ఇద్దరి పాలు చేసే ఉపాయం ఆలోచిస్తాను.”

“వొద్దొద్దు! మావయ్య ఆశయాలనీ, ఆలోచనలనీ మన్నించడమే మనం చేయవలసింది. తప్పో ఒప్పో, ఆయన అభిప్రాయాలు ఆయనవి. చాల సార్లు ఇలాటివన్నీ ఆయన నాతో చర్చించేవారు. నాకూ ఆయన అభిప్రాయాలు సరిగ్గానే అనిపించేవి. ఇప్పుడు కూడా ఆయన సరిగ్గా ఆలోచించే ఈ పని చేసి వుంటాడు.”

“ఏం ఆలోచనలో, ఏం అభిప్రాయాలో! నాకైతే మీ ఇద్దర్నీ ఇలా కట్టుబట్టలతో ఇల్లొదిలి వెళ్ళమనడం అన్యాయంగా అనిపిస్తుంది. నా సంగతి వేరు.నేను మగవాణ్ణి, ఎక్కడున్నా సర్దుకోగలను. పైగా పేదరికం నాకలవాటే! మీరంటే పాపం, ఆడవాళ్ళు….”

“భలే వారే! ఆడవాళ్ళు ‘పాపం’ ఆడవాళ్ళెందుకయ్యారు? పేదరికానికీ, కష్టాలకీ మీరు అలవాటు పడగలిగితే మేం అలవాటు పడలేమనా మీ ఉద్దేశ్యం?” కఠినంగా అంది జేన్.

“మావయ్య మమ్మల్నేమీ అన్యాయం చేయలేదు.  మా అమ్మ పోగానే, ఎందుకుపనికిరాని మా నాన్న నుంచి మమ్మల్ని విడిపించి ఈ యింటికి తీసుకొచ్చాడు. ఆడవాళ్ళు తలచుకుంటే ఏ పనైనా మగవాళ్ళకి తీసిపోకుండా చేయగలరని ఆయన నమ్మకం. నేనాయాన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను.  అందులోనూ ఇదంతా మావయ్య స్వార్జితం. తన ఇష్టం వచ్చిన వారికిచ్చే హక్కు ఆయనకుంది.”

ఉన్నట్టుండి ఏలిస్ వెక్కిళ్ళు వినిపించడంతో మాటలాపి వెనుదిరిగింది జేన్.

“ఎంత పని చేసావు మావయ్యా? నీకు మనసెలా వొప్పిందసలు? ఇప్పుడు మేమేం చెయ్యాలి?”

ఏలిస్ దుఃఖాన్ని చూడటంతో జేన్ ధైర్యం కొంచెం సడలింది. కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి.

“ఎల్సీ! నువ్వలా ఏడవొద్దు. నేనేదో చేస్తాగా? అంత భయపడితే ఎలా చెప్పు?”

“ఇప్పుడు మనం మీ సమీప భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆర్మిస్టవున్ గారికి, అదే, హొగార్త్ గారికి మీరీ ఇంట్లో ఇంకొక నెల రోజులుంటే ఏమీ అభ్యంతరం వుండకపోవచ్చు. నెలలోగా మీరు ఉద్యోగమూ, ఇల్లూ వెతుక్కోవచ్చూ. ఏమంటారు ఫ్రాన్సిస్?”  లాయరుగారు ఫ్రాన్సిస్ వైపు చూస్తూ అడిగారు.

“అయ్యొయ్యో! దానిదేముందండి. ఇంత పెద్ద ఇల్లు. నెల రోజులే ఏమిటి, ఎన్ని రోజులున్నా నాకేం అభ్యంతరం లేదు.”

“పూర్తిగా ఇక్కడ వుండడానికి వీల్లేదనుకో! నెల రోజులు వుండడంలో చిక్కేమీ వుండదనుకుంటాను.” లాయరు తీర్మానించారు.

“నేను ఈ లోగా మా వూరు వెళ్ళి నా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొస్తాను. ముందుగా నా బదులు బాంకిలో పని చేయటానికి ఎవరినైనా చూడాలి. ”

“ఫ్రాన్సిస్! మీరు మాకు ధన సహాయం చేయడానికి వీల్లేదు. కానీ, సలహాలు ఇవ్వచ్చేమో! మీరిప్పుడు ఎడిన్ బరో వెళ్తున్నారు కదా! అక్కడ మాకు పనికొచ్చే ఉద్యోగాలుంటే చూసి చెప్పగలరా?” జేన్ అడిగింది.

“తప్పకుండా! ఇంతకీ మీరు ఎలాటి వృత్తి కావాలనుకుంటున్నారు? ”

“ఏదో ఒకటి! మా ఇద్దరికీ ఇంత తిండి పెట్టేదైతే చాలు.”

“అయితే ఏదైనా కుటుంబాల్లో గవర్నెస్ ఉద్యోగాలున్నాయేమో చూస్తాను.”

“చూడండి! అయితే ఆడపిల్లలకి ఎలాటి చదువు చెప్పాలో నాకంతగా తెలియదు. మగపిల్లలకైతే చక్కగా చెప్పగలను. అక్కవుంటింగూ, జామెట్రీ, లెక్కలూ, కెమిస్ట్రీ, వ్యాకరణమూ, అన్నీ తెలుసు నాకు. అన్నిటికంటే మావయ్య నా అక్కవుంటింగుని బాగా మెచ్చుకునేవాడు. అక్కవుంటింగంటే గుర్తొచ్చింది! మీ ఉద్యోగం ఎలా మొదలైంది?”

“నేను బాంకులో గుమాస్తా గా పదహారేళ్ళప్పుడు చేరాను. అప్పుడు నాకు యేడాదికి ముఫ్ఫై పౌన్లొచ్చేవి. దానికి తోడు హొగార్త్ గారిచ్చే పన్నెండు పౌండ్లు!”

“యేడాదికి ముఫ్ఫై రెండు పౌండ్లు! సరిపోతుందా?”

“సరిపోవడానికేముంది లెండి. ఎలాగో సరిపుచ్చుకోవాలి. అయితే అలా మూడేళ్ళే ఇబ్బంది పడ్డాను. పని చేస్తూ చదువు పూర్తి చేసాను. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం మొదలైంది. ఇప్పుడు నాకు యేడాదికి దాదాపు మూడొందల పౌండ్లొస్తాయి. అదే బాంకు లో పదిహేడేళ్ళుగా పనిచేస్తున్నా కదా? ”

“మొదట్లో యేడాదికి ముప్పై పౌండ్లు. పదిహేడేళ్ళు గడిచేసరికి యేడాదికి మూడొందలు. అచ్చంగా మావే! ఎవరి దయా ధర్మాల మీదా ఆధారపడకుండా! ఎంత బాగుంటుంది! నాకేం భయం లేదు. ఎల్సీ కొంచెం ధైర్యంగా వుంటే బాగుండు.”

“పదిహేడేళ్ళా! అంతలో మనం చచ్చే పోతాం!” మళ్ళీ ఎల్సి బావురుమంది.

“ఎల్సీ! నేనున్నాకదా!”

“తిండికే లేక మల మల మాడి పొతామో యేమో!”

“ఏదో ఒకటి చేస్తా కదా! సరే ఫ్రాన్సిస్! నీకే ఉద్యోగం గురించి తెలిసినా నాకు చెప్పు!”

మెల్లిగా ఒకరొకరూ సెలవు పుచ్చుకున్నారు. హాలంతా ఖాళీ అయింది.

***

 

(సశేషం)

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)