జలగండం

peddinti

తెలంగాణా పల్లె జీవితాలను తెలంగాణా భాషలో, యాసలో రాస్తున్నా. పల్లె అద్దం మీద ప్రపంచీకరణ రాయి పడ్డాక పగిలిపోయిన బతుకుల్ని, దీనంగా సాగిపోయిన వలసల్ని చిత్రిస్తున్నా. 2000 సంవత్సరం నుంచి రాయడం మొదలు పెట్టిన. నేను రచన మొదలు పెట్టే నాటికి కథ రైతు కూలీ జీవితం వద్దకి వచ్చి  ఆగింది. నేను ఇంకా అట్టడుగు వర్గాల జీవితాల్లోకి తొంగి చూస్తున్న. ఇంత వరకు అయిదు నవలలు, నూరు కథలు, వ్యాసాలూ, నాటకాలూ రాసా. అయిదు కథా సంకలనాలూ వచ్చాయి. ‘జిగిరి’ నవల ఇంగ్లీషుతో పాటు అనేక భారతీయ భాషల్లోకి తర్జుమా అయింది. –పెద్దింటి అశోక్ కుమార్ 

*

తలుపు తట్టిన చప్పుడు.

మగత నిద్రలో ఉన్న రచయిత ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు.

గదిలో కాగితాలు చిందరవందరగా ఉన్నాయి. ఫ్యాను గాలికి ఎగిరి ఎగిరి అలిసిపోయినట్లుగా చతికిల బడ్డాయి. సగం చదివిన పుస్తకం గుండెల మీద రెక్కలు విప్పుకుంది. కలగన్నాననుకుని కళ్ళు మూసుకున్నాడు రచయిత.

మళ్లీ తలుపు తట్టిన చప్పుడు. ఈసారి చిన్నగా పిలుపు.

లేచి టైం చూసుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. “ఇంత రాత్రివేళ ఎవరబ్బా’ అనుకుంటూ సగం తెరిచిన కిటికీలోంచి బయటకు తొంగి చూశాడు.
ఎవరో అపరిచిత స్త్రీ, వెంట చిన్న పిల్లవాడు. ఆమెని ఎప్పుడు చూసినట్టు కూడా గుర్తు లేదు.

ఎవరో ఎందుకొచ్చారో అర్ధం కాలేదు. అప్లికేషన్లు రాయమనో, ఫారాలు నింపమనో ఎవరయినా ఆఫీసర్లను కలవాలనో అప్పుడప్పుడు ఒకరిద్దరు వచ్చినా పొద్దున్నో, మధ్యాహ్నమో వచ్చేవారు. తలుపు తెరవాలా వద్దా అని ఆలోచిస్తుండగానే రెండుసార్లు తలుపు తట్టిన చప్పుడు.

ఏదో అత్యవసర పని ఉంటే తప్ప రారనుకొని తలుపు తెరిచాడు రచయిత.

వయసు ఎంతుంటుందో తెలియదు.ముఖంలో మాత్రం వృద్ధాప్య చాయలు కనిపిస్తున్నాయి. తల నెరిసి ఉంది. మనిషి బక్కగా, తెల్లగా  ఉంది. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకున్నట్లు స్థిరంగా ఉంది. వెంట ఉన్న పిల్లవాడికి ఆరేడేండ్లు ఉండొచ్చు. భయం, భయంగా చూస్తున్నాడు.

ఎవరు మీరన్నట్లు చూసాడు రచయిత.

అతడి చూపుల్ని చదివినట్లు ‘నేనో అభాగ్యురాలిని,’ అన్నది ఆమె.

“ఎందుకొచ్చారు…?” అడిగాడు రచయిత.

“మీతో పని పడింది,” సన్నగా చెప్పింది.

“నాతోనా.. ఏం పని..” మరీ ఇంత రాత్రి వేళ…” ఆశ్చర్యంగా అడిగాడు రచయిత.

“మీరు ఇంట్లోకి రానిస్తే వివరంగా చెప్పొచ్చు,” స్థిరంగా అన్నది.

వారిని ఇంట్లోకి ఆహ్వానించి కుర్చీ చూపించాడు రచయిత. ఆమె బిడియంగా కుర్చీలో కూర్చుంది. అబ్బాయి ఆమె ఒడిలో ఒదిగిపోయాడు. ఆమెకు ఎదురుగా కుర్చీజరుపుకుని కూర్చుంటూ ‘ఇప్పుడు చెప్పండి’ అన్నాడు రచయిత.

“నిద్ర పోయారా? మెలకువతో ఉన్నారనుకున్నాను.. ” ఆమె అన్నది.

“ఏం.. అలా అడుగుతున్నారు?”

“ఏం లేదు.. ప్రపంచమంతా నిద్ర పోతున్నప్పుడు.. రచయిత మెలకువతో ఉంటాడని…” నసిగినట్టుగా అన్నది.

అతనికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఆమెను పరిశీలంగా చూస్తూ “సరే.. చెప్పండి..” అన్నాడు.

“మీరు నీటి సమస్య మీద రాసిన నవల బాగుంది. రోజు రోజుకు తరిగిపోతున్న జలవనరుల గురించి బాగా చెప్పారు. చదువుతుంటే భయమేసింది. మీరన్నారు చూడండి. రేపు యుద్ధాలంటూ  జరిగితే అవి నీళ్లకొరకేనని.. అది వాస్తవమండి..” అన్నది.

రచయిత విసుగ్గా చూసాడు. ఇంత రాత్రి పూట వచ్చి ఇదా చెప్పేది అనుకున్నాడు. లోలోపల కోపంగా వున్నా నవ్వుతూ “మీరెందుకొచ్చారో చెప్పండి” అన్నాడు.

ఆమె ఒకసారి శూన్యంలోకి చూసి బాబు వీపు నిమురుతూ “నా పేరు సుశీల. మాది పక్క ఊరే. వీడు నా మనవడు” అన్నది.

అయితే ఏమిటన్నట్లు చూసాడు రచయిత. అర్ధరాత్రి నిద్ర లేపడమే కాకుండా విషయం సూటిగా చెప్పకపోవడం అతనికి విసుగును పుట్టిస్తుంది.

సుశీల కొన్ని క్షణాలు మౌనంగా కళ్లు మూసుకొని తెరిచి రచయితను చూసింది. రచయిత తొందరగా చెప్పమన్నట్టు చూసాడు. రచయిత అంతరంగాన్ని చదివినట్టు మనవడిని చూపిస్తూ “వీడు ఎలా చస్తాడో మీరు చెప్పాలి..” అన్నది.

అదిరిపడ్డాడు రచయిత. తను విన్నది నిజమేనా ఆన్నట్టు చూసాడు. అది గమనించిన సుశీల మరోసారి  స్థిరంగా అదే ప్రశ్నను అడిగింది.

రచయిత వింతగా చూస్తూ ‘ఇదేం ప్రశ్నండి.. ఎలా బతుకుతాడో చెప్పమంటారు కాని ఎలా చస్తాడో  చెప్పమని ఎవరయిన అడుగుతారా… అయినా ఎలా బతుకుతారో, ఎలా చస్తారో నాకెలా తెలుస్తుంది..’ అన్నాడు కోపంగా.

సుశీల విరక్తిగా నవ్వింది. నవ్వి ‘మీరు రచయిత కదా’ అన్నది.

ఆ మాటలకు రచయితకు మరింత కోపం వచ్చింది. ‘అయితే! జాతకాలు చెబుతానా.. రచయితంటే జ్యోతిష్కుడిననుకున్నారా?” అన్నాడు విసుగ్గా..

ఆమె అంతే స్థిరంగా ఉంది. ‘రచయితంటే కాలజ్ఞాని కదా’ అన్నది.

రచయితకు కోపం ఎక్కువయింది. తనను తాను అదుపు చేసుకుంటూ ‘మీరు ఎవరినైనా జ్యోతిష్కున్ని కలవాల్సింది. అదీ మీకు నమ్మకముంటేనే.. ఈ విషయంలో నేనేమి సహకరించలేను..’ అన్నాడు.

‘అయ్యో.. కలిసానండి. నా భర్త ఉన్నప్పుడు కలిసాను. నా కొడుకు ఉన్నప్పుడు కలిసాను. వీడితో కూడా కలిసాను. మూడుసార్లు ఒక్కటే చెప్పారు. జలగండం ఉందని..’ సుశీల ఆగిపోయింది.

ఈవిడ పిచ్చిది కాదు కదా అనుకున్నాడు రచయిత. మాట తీరు చూస్తుంటే అలా అనిపించలేదు. నన్ను ఆటపట్టించడం లేదు కదా అనుకున్నాడు. ఆమెను అలాగే పరిశీలనగా చూస్తుండిపోయాడు.

‘.. వీడికి జలగండం ఉంది. అదీ పదేళ్ల వయసులోనే. అంటే ఇంకో మూడేళ్లుంది. ఈలోగా వీడెలా చస్తాడో తెలిస్తే నా ప్రయత్నం నేను చేస్తా.’ చెప్పింది.

రచయితకు నవ్వొచ్చింది. పకపకా నవ్వేవాడే. ఆమె కన్నీళ్లు చూసి ఆగిపోయాడు.

సుశీల ఉగ్గబట్టుకుని ఏడుస్తుంది.

ఆమె ఏడుపును చూసాక పూర్తిగా నమ్మకం కుదిరింది రచయితకు. కాని ‘ఎలా చస్తాడో  నేనెలా చెప్పగలనూ అనుకున్నాడు. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక మౌనం గా  ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత తనే తేరుకుంది సుశీల. రచయిత వైపు చూస్తూ నొచ్చుకున్నట్టుగా ‘రాకూడదనుకున్నాను బాబూ. కాని తప్పలేదు. గతంలోంచి పాఠం నేర్చుకుని వర్తమానం చూసి భవిష్యత్తును దర్శించేవాడే రచయిత అంటారు కదా…… నా సమస్యకు మీరొక్కరే మార్గం చూపిస్తారని వచ్చాను..’ అన్నది.

ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ కొంత సౌమ్యంగా ‘అదే.. ఎలా…? నాకెలా తెలుస్తుంది’ అన్నాడు రచయిత.

సుశీల మనవడిని దగ్గరికి హత్తుకుంది. అతడు ఆమె చీర కుచ్చిళ్ళలో మొహం దాచుకున్నాడు.

‘మీరు ఆలోచిస్తే తప్పక చెప్పగలరన్న నమకం నాకుంది బాబూ. వీడికి జలగండం అని రాసి ఉంది కదా.. చూడబోతే భూమ్మీద నీళ్లే లేవు. కరువు కాటకాలేనాయె. మరి జలగండం ఎలా ఉంటుంది. ఏ రూపంలో వస్తుంది.’ అడిగింది.

అమాయకురాలిని చూసినట్టుగా చూసి నవ్వాడు రచయిత. నవ్వుతూ ‘చూడబోతే చదువుకున్నవారిలా ఉన్నారు. ఈ జాతకాలు, జ్యోతిష్కం అంతా వట్టిదే…. మీరెలా నమ్ముతున్నారూ’ అన్నాడు.

ఆమె సీరియస్‌గా చూస్తూ ‘నేనూ నమ్మను. కానీ జరిగింది. అది యాదృచ్చికం అనుకున్నా మరేదో అనుకున్నా వీడి తాతకు అదే జరిగింది. తండ్రికి అదే జరిగింది. నా ఆరాటమంతా వీడిని ఎలా తప్పించాలనే…’అన్నది.

రచయిత కు  ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఆమెకు ఏదో నచ్చ చెప్పాలని చూసాడు కాని బలంగా వాదించలేకపోయాదు.

అతడు ఎక్కడ విసుక్కుంటాడోనని ముందుగా తన కథని చెప్పడం మొదలుపెట్టింది సుశీల.
కొంత ఆసక్తిగా, కొంత అర్ధం కాకుండా ఉండడంతో మౌనంగా వింటూ కూర్చున్నాడు రచయిత.

* *  *

నాకు పెళ్లయింది. అత్తవారింట్లోనే అడుగుపెట్టాను. మామలేదు. చిన్నప్పుడే బావిలో పడి చనిపోయాడట. అత్త ఒక్కతే ఉంది. నా భర్తకు తోబుట్టువులు కూడా ఎవరూ లేరు. అమాయకుడు. పొద్దంతా కష్టపడి పని చేయడం తప్ప లౌక్యం తెలియదు.

మాకు ఐదెకరాల భూమి, రెండు కరంటు మోటారు బావులు. చాలినన్ని నీళ్లు. పండినంత పంట. అప్పటికే మా అత్త ఆరోగ్యం బాగులేదు. నేను వచ్చిన రెండు మూడేండ్లకే ఆమె మంచం పట్టింది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది.

ఒకనాడు ‘సుశీల….’ అంటూ నన్ను దగ్గరికి తీసుకుని ఏడ్చింది. నేను కూడా ఏడ్చాను. అప్పటికి నాకొక కొడుకు.

‘సుశీలా.. నేను వెళ్లిపోతున్నానే… గంగన్న పయిలం. వాడు ఎందునెరుగని అమాయకుడు. సంసారమంతా నువ్వే ఎత్తుకోవాలి. మన వంశాన్ని ఉద్ధరించాలి.’ అన్నది.
నేను సరే అన్నట్టు తలూపాను.

నన్ను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. ఆప్యాయంగా తల నిమురుతూ ‘సుశీలా.. నీకో విషయం చెప్పాలి’ అన్నది.

‘చెప్పత్తా. ఏమిటా విషయం’ అన్నాను.

‘గంగన్న్నకు జలగండం ఉందే’ అన్నది.

నాకేమీ అర్ధం కాలేదు. భయం భయంగా ‘అంటే ఏంటత్తా’ అన్నాను.

‘వాని నలభైయవ ఏట జలగండం ఉందని రాసి ఉందే. వీడి తండ్రికి ఇలాగే అంటే నేను నమ్మలేదు. కాని మక్క పెరడుకు మోటకొడుతూ బాయిలో పడి చచ్చాడే’ అంది.

నాకు నమ్మబుద్ధి కాలేదు. ఆమె తృ ప్తికోసం నమ్మినట్టు నటిస్తూ ‘అయితే ఎలా మరి?’ అన్నాను.

ఆమె దగ్గర సమాధానం లేదు. ‘ఏం లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ వాడినో కంట కనిపెడుతుండు. నీళ్ల అంచుకు వెళ్లనీయకు’ అన్నది.

నేను సరే అన్నాను. నా మొహంలోకి దీనంగా చూసి కన్నీరు కార్చింది.

తర్వాత నెలలోపే ఆమె కన్ను మూసింది.

ఎంత మరిచిపోదామన్నా ఆమె చెప్పిన విషయం మరిచిపోలేకపోయాను. అప్పుడప్పుడు గుర్తుకు వచ్చి భయం వేసేది. ఊరినిండా బావులు. బావుల నిండా నీళ్లు. ఊరి చుట్టూ వాగు. ఊరు అంచున చెరువులు. నా భర్త బయటకు వెళ్తే భయం వేసేది. నీళ్లకు దూరంగా ఉంచడం సాధ్యం కాలెదు.

ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని పట్టుబట్టి అతనికి ఈత నేర్పించాను. బావుల్లో చెరువుల్లో అతడు ఈత కొడుతుంటే నా గుండె నిండా ధైర్యం నిండేది. త్వరలోనే అతడు గజ ఈతగాడుగా పేరొందాడు. తాటిచెట్టంత లోతైన మడుగులో కూడా సూదిని వెతికి తెచ్చే నైపుణ్యం సాధించాడు.

‘అమ్మయ్య… నాకింక భయమెందుకు… ఇంకెక్కడి జలగండం’ అనుకున్నాను. అయినా జాగ్రత్తగా ఉండేదాన్ని.

చూస్తూ చూస్తుండగానే నీళ్లు మాయమైపోయాయి. వాగులు, చెరువులు ఎండిపోయాయి. వ్యవసాయ బావుల్లో తడిలేదు. కండ్లల్లో తప్ప చేండ్లల్లో చెమ్మలేకుండా పోయింది. ఊరంతా బావులు కూడివేసి బోర్లు వేయడం మొదలుపెట్టారు నేనూ అదే చేసాను.

అప్పుడప్పుడు నాకు జలగండం గుర్తుకువచ్చి నవ్వొచ్చేది. ‘జలమే లేదు. గండమెక్కడిది’ అనుకునేదాన్ని.

ముందటిలా వ్యవసాయం నడవలేదు. కరెంటు రాక, నీళ్లు లేక నానా అవస్థలు పడ్డాను. వేలు ఖర్చు పెట్టి బోరు వేస్తే వేలెడన్ని నీళ్లు పోసేది. అది కూడా వేళ్ల మీద లెక్కించినన్ని రోజులే. అలా బోరు మీద బోరు వేసి బొక్కబోర్లా పడ్డాము. పుట్టెడు అప్పయింది. పండిన పంట వడ్డీలకు సరిపోలేదు. అప్పుల బాధ తట్టుకోలేక ఒకనాడు నా భర్త పత్తిమందు తాగి ఎండిన పొలంలోనే ప్రాణాలు వదిలాడు.

జలగండం అంటే నీళ్లలో మునిగి చావడం అనుకున్నాను కాని నీళ్ల కోసం అప్పుల్లో మునిగి చావడం అనుకోలేదు.

పుట్టెడు శోకంతో ఒంటరిగా మిగిలిపోయాను. వెంటనే నా కొడుకు జాతకం చూపించాను. వాడికి కూడా విచిత్రంగా  అదే జలగండం ఉందన్నారు. అప్పటికి వాడు చదువుతున్నాడు. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. మొత్తం మీద ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను. నా కొడుకును వ్యవసాయంలోకి దించితే  తండ్రిలాగే చస్తాడనిపించింది. అందుకే వ్యవసాయానికి దూరంగా ఉంచాను. వానికి చదువు అబ్బలేదు. ఏ ఉద్యోగం దొరకలేదు.

అప్పటికి మా ఊరికి  ఏవేవో ఫాక్టరీలు వస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఊర్లో పోరాటాలు కూడా జరుగుతున్నాయి.

‘మీకు డబ్బులిస్తాం. ఉద్యోగాలిస్తాం. భూములివ్వండీ అన్నాయి కంపెనీలు.

‘పచ్చని పంట పొలాలను ఫాక్టరీలుగా మారుస్తారా? ‘ అంటున్నారు జనం.

ఎక్కడి పంట, ఎక్కడి పచ్చదనం, అన్నీ బీడుభూములేగా అనిపించింది నాకు. అప్పటికి అప్పుల భారం పెరిగి వ్యవసాయమే బరువైపోయింది.

చాలామంది తమ భూములను కంపెనీలకు అమ్మారు. నేను గూడా నా భూమిని కంపెనీకి అమ్మాను. వచ్చిన డబ్బుతో అప్పు తీర్చాను. మిగిలిన డబ్బుతో ఒక ఇల్లు కట్టుకున్నాను. ఊరిలోకి కంపెనీలు వచ్చాయి. నా కొడుకుకు కంపెనీలో ఉద్యోగం దొరికింది. పెళ్లి చేసాను.

అప్పుడప్పుడు జలగండం విషయం గుర్తుకు వచ్చి నవ్వొచ్చేది. భూమిలేదు. నీళ్లు లెవ్వు. బోర్లు కూడా లెవ్వు. నీళ్లతో సంబంధమే లేదు. జలగండం ఎలా వస్తుంది. అనుకునేదాన్ని. కాని ఆ గండాన్ని తప్పించుకోలేకపోయాను.

ఒకనాటి రాత్రి ఎలక్ట్రోప్లేటిన్ కంపెనీ విడుదల చేసే పాదరస కాలుష్యం తాగునీటిలో కలిసింది. ఆ నీళ్లు తాగి చనిపోయిన వారిలో నా కొడుకు కూడా ఉన్నాడు. సీనియర్ సిండ్రోం వ్యాధి సోకి పిచ్చిపట్టి మరణించాడు. కంపెనీ తప్పంతా మా మీదికే తోసింది. జలగండం ఈ రూపంలో వస్తుందని నేను ఊహించలేకపోయాను.
భర్తను పోగొట్టుకున్నాను. కొడుకును పోగొట్టుకున్నాను. భయం ఎక్కువయింది. వెంటనే నా మనవడి జాతకం కూడా చూపించాను. విచిత్రంగా వీదికి కూడా అదే జలగండం రాసి ఉంది.

*   *  *

చెప్పడం ఆపి రచయిత వైపు చూసింది సుశీల. రచయిత వింటున్నాడు. అప్పటికి ఆమె కళ్లనిండా నీళ్లు. గొంతు బొంగురుగా మారిపోయింది.
“ఇప్పుడు చెప్పండి…. అది ఏరూపంలో వస్తుంది. దాన్ని తప్పించడానికి నేను ఏం చేయాలి?” బాధగా అడిగింది సుశీల.
ఆలోచనల్లో పడాడు రచయిత. సమస్య సుశీలది ఒక్కరిదే కాదని ప్రతీ ఊరిదని తెలిసిపోతుంది. రోజురోజుకు తరిగిపోతున్న నీటి వనరులు పెరిగిపోతున్న కాలుష్యం మనిషిని ఎక్కడికి తీసుకుపోతోందో తెలియడం లేదు.

సుశీల సమాధానం కోసం చూస్తుంది.
రచయిత దగ్గర సమాధానం లేదు.

Download PDF

4 Comments

  • భలే వుంది. ఒక్కో తరాన్ని ఒకో రకంగా చంపుతున్నాయన్నమాట నీళ్ళు. నీళ్ళ కోసం జరిగే ప్రపంచ యుద్ధంలో అమరవీరుడు అవడమే బహుశా తరువాత తరానికి మిగిలిన జలగండం అనుకుంటా..!!

  • Lalitha P. says:

    మనం ప్రకృతిని మింగుతుంటే, ప్రకృతి ఆగ్రహించి నదులూ, సముద్రాలతో మనల్ని ముంచి చంపటం అనేది తరువాతి జలగండం. నీటి కోసం యుద్ధాలు అనేవి ఇంకా మిగిలిపోయిన పేదవాళ్ళ కోసం. సాదా సీదాగా మొదలై, మూడు తరాల సామాజిక చిత్రాన్ని కళ్ళకు కట్టిన అతి చక్కని కథ.

  • balasudhakarmouli says:

    JIGIRI NOVEL – OKA ADBHUTHAM…. KATHALAAGE….

  • స్వాతీ శ్రీపాద says:

    సమస్య సుశీలది ఒక్కరిదే కాదని ప్రతీ ఊరిదని తెలిసిపోతుంది. రోజురోజుకు తరిగిపోతున్న నీటి వనరులు పెరిగిపోతున్న కాలుష్యం మనిషిని ఎక్కడికి తీసుకుపోతోందో తెలియడం లేదు.నీటి గండం -ఒక్క సుశీల మనవడికే కాదు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ ..బాగుంది . రచయితా పరిష్కారం కూడా ఆలోచిస్తే బాగుండేది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)