నాలో బయటిలోకం కల్లోలమే ఎక్కువ!

60051_703360903013918_1420695648_n

  ‘అనంతరం’  నేపథ్యం గురించి ఎవరైనా అడిగితే, కొంచెం తటపటాయిస్తాను. 

కారణం, ‘అనంతరం’ వివిధ సందర్భాలలో నేను రాసుకున్న  కొన్ని  కవితల సమాహారం కావడమే! …

‘అయితే, అందులోని కవితల నేపథ్యమే చెప్పు’ అని వొకరిద్దరు మిత్రులు మారు అడిగితే, సరే, యిదేదో యిక తప్పేట్టు  లేదని  ఈమధ్య ఒక సారి పుస్తకం తెరిచి ఒక సారి మళ్ళా కవితలని చదువుకున్నా !

ఈ క్రమం లో నాకొక విషయం మరో సారి  అర్థం అయింది … నేను చాలా బద్ధకస్తుడినని  … కనీసం, రాయడం విషయం లో !…1997 లో నా మొదటి పుస్తకం ‘వాతావరణం ‘ వొస్తే, 2000 లో రెండవ పుస్తకం ‘ఆక్వేరియం లో బంగారు చేప’, తిరిగి పదేళ్ళ తరువాత, 2010 లో  ఈ ‘అనంతరం’ వొచ్చాయి. ఈ మూడు సంపుటాలలో కలిపి మొత్తం కవితలు 100 కూడా లేవు . నిజంగానే రాయలేదా అంటే, ప్రపంచం ముందు ప్రదర్శనకు పెట్టిన దానికన్నా, నాకే నచ్చక వొదిలేసినవో /చించేసినవో  ఎక్కువ.

చుట్టూ వున్న సమాజం , రాజకీయాలు, హేతుబద్ధంగా వ్యవహరించని మనుషులూ వగయిరా నన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి, అంతర్లోక కల్లోలాలు, ఉల్లాసాలు వగయిరా కన్నా ఈ అంశాలే నా కవిత్వం లోకి చొరబడతాయి అని భావిస్తున్నాను. నిజానికి మన దైనందిన జీవితంలో కూడా జరుగుతున్నది అదే కదా!

నా మూడో పుస్తకం కాళోజీ సోదరులకు అంకితం ఇవ్వాలని ముందే అనుకున్నాను . ఒక ముఖ్య కారణం, ఒక నలుగురి నడుమ రాసుకున్న పద్యాన్ని చదివి, దాని బాగోగులకు సంబంధించిన చర్చ లో పాల్గొనడం, తద్వారా, రాసిన దానిని ఎడిట్ చేసుకోవడం అనే ఒక మంచి అలవాటు నాకు కాళోజి  సోదరుల ‘మిత్ర మండలి’ నుండి  అబ్బింది-

ఇక పుస్తకం పేరు గురించి ఆలోచించినపుడు , అంతకు ముందు రాసి పెట్టుకున్న ‘అనంతరం’ కవిత జ్ఞాపకం వొచ్చింది . మిత్రులు కూడా బాగుందన్నారు . ‘అనంతరం’ కవిత ఆజాద్  ఎన్ కౌంటర్ నేపథ్యం లో రాసింది . ఆ సంఘటన నన్ను బాగా డిస్టర్బ్ చేసింది . బహుశా, ఆజాద్ వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ ఉద్యమం లోకి వెళ్లిపోయాడని వినడం కావొచ్చు. తదనంతర కాలంలో నేను అక్కడే చదువుకోవడం కావొచ్చు. ఒక్క  రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ అనే కాదు, వరంగల్ మెడికల్ కాలేజీ నుండి కూడా ఆ కాలంలో ఎంతో మంది ఉద్యమం లోకి వెళ్లిపోయారని మా నాన్న చెప్పేవారు . . వెలుగు జిలుగుల సౌకర్యవంతమైన జీవితాన్ని ప్రసాదించే చదువుల్ని తృణప్రాయంగా వొదిలేసి , దిక్కులేని ప్రజల కోసం జీవితాన్ని ఫణంగా పెట్టి ఉద్యమం లోకి వెళ్ళిపోవడానికి ఏమీ కాని సామాన్యులైన మనుష్యుల పట్ల ఎంత గొప్ప ప్రేమ వుండాలి?

2001 నుండి ప్రారంభిస్తే 2010 లో ‘అనంతరం’ వెలువడే వరకు నేను గడిపింది, మహా నగరంలో స్థిరపడిన ఒక   సగటు మధ్య తరగతి జీవితం … అంటే, ఇప్పుడేదో భిన్నమైన జీవితం గడుపుతున్నానని కాదు . సహజంగానే మహా నగర జీవితంలో ఎదురయ్యే ఆకర్షణలు, ప్రతిరోజూ తప్పనిసరిగా మహా నగర రహదారుల మీద జరపవలసిన నరక యాత్రలూ , స్నేహితులని క్రమం తప్పకుండా కలవాలని ఎంత బలంగా వున్నా కుదరనీయని నిస్సహాయతలూ  లాంటివి అన్నీ కవిత్వం లోకి చొచ్చుకొచ్చాయి . అలా రాసినవే, ‘నగరంలో పద్యం మరణిస్తుంది’, ’40 ఇంచుల కల’, ‘జలపాశం’, ‘నగర జీవితమూ-శిరచ్చేదిత స్వప్నాలూ ‘ , ఒక మహానగర విషాదం’ లాంటివి –

 vijay

అంతకు క్రితం రెండు సంపుటాలకూ , ఈ ‘అనంతరం’ కు  నడుమ నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినంతవరకూ  ఒకటుంది . అది,  రెండవ కవితా సంకలనం తరువాత, ‘కుటుంబ రావు’ ని అయిపోవడం! పెళ్లి తరువాత ఒక విషయం నాకు స్పష్టంగా బోధపడింది . స్త్రీ వాద దృక్పధాన్ని కలిగి వుండడం చాలా  సుళువు , ఆ దృక్పధాన్ని ఆచరణలో పెట్టి సంసారం చేయడం చాలా కష్టం!

ఇంటిపనీ, అంట్ల పనీ పంచుకోవడం , కబుర్లు చెప్పినంత సుళువు  కాదు . సరే, ఈ సొంత గొడవని పక్కన పెడితే, స్త్రీ వాద కవిత్వం విషయంలో నాకొక చిన్న ఫిర్యాదు ఏమిటంటే, అది  ఆధునిక కాలంలో స్త్రీ-పురుష సంబంధాలకు సంబంధించి ఒక స్థాయి దగ్గరే ఆగిపోయింది . ఆధునికానంతర  కాలంలో వివక్ష చాలా సంక్లిష్ట రూపాలలో ఇంకా కొనసాగుతోంది  అనీ, దానిని స్త్రీ వాద కవిత్వం శక్తివంతంగా పట్టుకోలేదనీ నా అభిప్రాయం . బహుశా ఇన్ని ఆలోచనల నడుమా, కొంత నా సొంత గొడవ నడుమా పుట్టిందే ‘ ఒక ఆధునికానంతర మగ దురహంకార పద్యం’

మరొక సంగతి-ఈ దేశం లో  ప్రస్తుతం అత్యంత సంక్షోభం  లో వున్నది మధ్య తరగతి. దానికి సంబంధించిన బాధలు, ఆకర్షణలు  కవిత్వం లోకి పెద్దగా రాకపోవడానికి కారణం ఏమిటి? అందులోనూ, ఈ మధ్య తరగతి ఎదుర్కొంటోన్న ఆర్ధిక పరమైన ఇబ్బందులు, అందులోని కొత్త పద బంధాలు వగయిరా కవిత్వం లోకి ఎందుకు రాలేదు? … ఇలాంటి ఆలోచనలేవో సుప్త చేతనావస్థలో వుండడం వల్ల  అనుకుంటాను , 40 ఇంచుల ఎల్సిడి  టీవీ   నన్ను తన వలలో వేసుకున్న రోజుల్లో ’40 ఇంచుల కల’ రాసాను.

‘అనంతరం’ లో తెలంగాణా ఉద్యమ నేపథ్యం లో రాసిన కవితలు రెండు వున్నాయి. ఒకటి, ‘బాల్య మిత్రుడి ఫోన్ కాల్’, రెండవది , ‘కొంతకాలం తరువాత కొన్ని కొత్త ప్రశ్నలు’. వరంగల్ లో సకలజనుల సమ్మె ఉధృతంగా సాగుతున్న కాలంలో అక్కడ వున్నా నా బాల్య మిత్రుడు రోజూ నాకు కాల్ చేసి ఆ విశేషాలు చెప్పేవాడు . ఆ నేపథ్యం లో నుండి రాసింది  ‘బాల్య మిత్రుడి ఫోన్ కాల్’.

ఇక రెండవ కవిత నేపథ్యం  మా ఇల్లే! … ఒక ప్రాంతం తనకు జరిగిన అన్యాయాలకు పరిష్కారం ‘రాష్ట్ర ఏర్పాటు’ తప్ప మరొకటి కాదు అని నిశ్చయించుకుని పోరాడుతున్న నేపథ్యం లో ‘ప్రాంతం’ అనేది కులం / మతం అనే వాస్తవాలను మించిన అంశమా?… భారతదేశం లాంటి దేశం లో ఇది సాధ్యమేనా?… నన్ను బాగా బాధపెట్టిన ఈ అంశమే ఈ ‘కొంతకాలం తరువాత కొన్ని కొత్త ప్రశ్నలు’ కవిత నేపథ్యం!

 -కోడూరి విజయకుమార్

Download PDF

6 Comments

  • dasaraju ramarao says:

    “అనంతరం” పై మీ స్వీయ సమీక్ష… విశేషాల, విషాదాల, విభిన్న ఆలోచనా అవగతాల,అంతర్ బాహిర్ సంఘర్శణా లో దృక్కుల, బేశజాల్లేని నిర్మొహమాటల సమాహారం ….. సంతోషం

  • Ravi says:

    విజయ్,

    అనంతరం చదివా. చాలా బాగుంది. నేపథ్యం బాగుంది.

    అభినందనలు,

    రవి

  • karanam srinivas says:

    v

  • karanam srinivas says:

    విజయ్ కుమార్ గారు నేను మీ కవిత్వాభిమానిని. సగటు మనిషి సంవేదనని హృద్యంగా కవిత్వీకరిస్తారు. నేను” ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు కవిత్వం -మానవ సంబంధాలు అనే అంశంపై పరిశోధన చేస్తున్నాను.మీ’ అనంతరం’ అందుకు ఎంతో ఉపయోగపడింది. మీ మొదటి రెండు సంకలనాలు నా దగ్గర లేవు.పుస్తకశాలల్లో దొరకలేదు.అందుబాటు తెలిపితే అందుకుంటాను. ధన్యవాదాలు.

  • కోడూరి విజయకుమార్ says:

    కరణం శ్రీనివాస్ గారు !
    మీ అభిమానానికి కృతజ్ఞతలు
    చాలా ఆలస్యంగా మీ వ్యాఖ్య చూసాను … క్షమించండి!
    ఇక్కడ మీ మెయిల్ ఉందేమో అని చూసాను … లేదు
    మీ చిరునామాని నాకు మెయిల్ చేయండి –
    kodurivijay@gmail.com

  • గుండెబోయిన శ్రీనివాస్ says:

    మిత్రమా! పుస్తకం చదవాలని ఉంది!

    గుండెబోయిన శ్రీనివాస్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)