తెలంగాణ ఒక చిన్న అడుగు

17.08.2013

 మిత్రమా!

మనం విడిపోయి చాలా రోజులయ్యింది కదూ! అట్లాగే ఎవరి దారిలో వాళ్లం  చాలా చాలా దూరం వెళ్లిపోయాం కదూ! నువ్వు అన్నింటిని కదుపుతూ, లీనమౌతూ, అంతర్లీనమౌతూ – ప్రకృతిలా, పాటలా ఒక అజేయమైన, స్థితికి సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నావు…

నేను ఎక్కడ తిరుగుతున్నానో తెలియకుండా! కాని మనం కలిసి పంచుకున్న అపురూపమైన యుద్ధ, భీభత్స, సమ్మోహనమైన, ప్రతి అనుభవం, ప్రతిక్షణం గుర్తుంది. మనం అందరం నిద్రపోతున్న ఒక గాఢమైన రాత్రి… వెలుగు రాసిన గొంతుతో.. అక్టోబరు 17 రష్యా విప్లవానికి ముందటి లెనిన్ మానసిక స్థితి గురించిన నీలం నోట్‌బుక్ గురించి చర్చించుకున్నాం గుర్తుందా?( మిత్రులు ఆర్.కె. పర్స్పెక్టివ్ ప్రచురణలు తనకు ఆ పుస్తకం దొరికిందన్నారు. మళ్లీ చదవాలి.) పాత సమాజం కూలిపోవడం కూడా ఎంత క్లిష్టమైందో చెప్పుకున్నాం కదూ! ఆ తరువాత వెతికి వెతికి ప్రపంచాన్ని కుదిపేసిన “ఆ పది రోజులు” చదువుకున్నాం కదా ?

నేను తెలుగు ప్రాంతానికి దూరంగా ఉన్నాను. అయినా అల్లకల్లోలమౌతున్న ప్రజల మానసిక స్థితుల గురించి తెలుస్తూనే ఉంటుంది. రెండు ప్రపంచ  యుద్ధాలు. పెను మార్పులకు లోనైన ఇక్కడి ముఖ్యంగా యూరప్ సమాజం ఎంత అలజడిని చూసిందో కదా! అందుకే ఇక్కడి మనుషులు, సమాజాలు ఘనీభవించిన ఒంటరితనంతో ఉంటాయేమో? అధికారం రెండు ప్రాంతాల్లో అతలాకుతలమౌతున్నది.

20% లాభం ఉన్నదని తెలిస్తే పెట్టుబడిదారులు తమ మెడ నరుక్కోవడానికి సిద్ధపడుతారట. నాకీ మాట కారల్ మార్క్స్ చెప్పినట్టు కొడవటి కుటుంబరావు రాశారు. అధికారం క్రూరమైంది. అది అంతులేని దాహంతో కూడుకున్నది. ఇప్పుడు అన్ని రకాల తప్పుడు మాటలు  పదే పదే ప్రసార సాధనాల్లో మారు మ్రోగుతున్నాయి. ఇప్పుడు ఇంత చెత్తలో నిజం తెలుసుకోవడం ఎంత కష్టం?

తెలంగాణా ప్రాంతం అరవై సంవత్సరాలుగా యుద్ధరంగంలా ఉన్నది. శ్రీకాకుళం, అదిలాబాదు, కరీంనగరే వచ్చింది. సింగరేణి, మాచెర్ల గుంటూరుకు వెళ్లింది. సృష్టికర్తలైన ప్రజల మధ్య ప్రేమ తప్ప యుద్ధం లేదు. కాని స్వార్ధపరులు తమ దురాశపూరితమైన అధికారదాహాన్ని అందమైన, సున్నితమైన పేర్లతో అందరికీ పూస్తున్నారు. బహుశా ఇది అతి పురాతనమైన ఎత్తుగడ. ప్రతి దోపిడి అందమైన ముసుగులతో ఉంటుంది. ప్రపంచ పోలీసు  ప్రపంచంలో శాంతిని కాపాడడానికి తనకు లొంగని దేశంలో తనే ఉద్యమాలు సృష్టించి ఊచ కోతలు కోస్తాడు. ఈ చిత్రమైన  నాటకానికి ప్రపంచీకరణ అనేక అందమైన పేర్లు కనుక్కొన్నది. అంతా మార్కెట్టు. అధికారం. రెండు ప్రాంతాల ప్రజలకు ఆస్థి తగాదాలు లేవు. తగాదాలల్లా  వాళ్లు కోల్పోయిన సంపదను తిరిగి దక్కించుకోవడమే.

అంతటా అద్భుతమైన పంటభూములు.. చెయ్యిపెడితే పిడికెడు అన్నం దొరికే భూములు ముక్కలుగా కత్తిరించి రియల్ ఎస్టేట్లయ్యాయి. సెజ్‌లయ్యాయి. చెమట చుక్క చిందించనోడు, శ్రమంటే తెలియనోడు. దళారి అవతారమెత్తి లక్షల కోట్లు సంపాదించి అన్నిరకాలుగా కల్లిలి పోయాడు. ఊళ్ళు వల్లకాడులయ్యాయి. వందల గ్రామాలు ఓఫెన్‌ కాస్టులయ్యాయి. నామరూపాలు లేకుండా పోయాయి. ప్రజలు వాటిని తిరిగి గెలుచుకోవాలి.

అతిసుందరమైన అడవులు ఆక్రమించి మైనింగు మాఫియా లక్షలకోట్ళు సంపాదించింది. ఒకటేమిటీ సమస్తం ఒక పెను విధ్వంసానికి అటు తెలంగాణా, ఆంధ్రాలో ముంచెత్తింది. చిన్న పెట్టుబడిదారులు గుత్త పెట్టుబడిదారులయ్యారు. అంతటా సంపద కొల్లకొట్టారు. అతి నైపుణ్యంగా సంపద చేతులు మారింది. అడిగిన వాళ్లందరిని తరిమి కొట్టారు. శ్రీకాకుళంలో నైతేనేమి, వెంపెంట, గోదావరిఖని, మందమర్రి ఎక్కడైనా ఏ చిన్న అలికిడైనా వీధులు రక్తసిక్తమౌతాయి. కోర్టులు, జైళ్లు, నోళ్లు తెరుస్తాయి.

ప్రజలంతా తమ సర్వసంపదలు రోజురోజుకు  పోగొట్టుకుని నిరాయుధులుగా వీధుల్లో నిలబడుతున్నారు. తెల్లబట్టలేసుకున్న ప్రతివాడు అక్రమ సంపాదనాపరుడు, సాయుధుడై తిరుగుతున్నాడు. అధికారం ప్రజల సొమ్ముతో సాయుధ గార్డ్సుతో తిరుగుతోంది. సాయుధ గార్డ్సులేని ప్రజానాయకుడే లేడు. ప్రజలు  అధికారం – సంపద ఎంత క్రూరంగా ఎదురు బొదురుగా నిలుచున్నారో? నిత్యం నిరంతరం  వాళ్ల అంతరంగంలో ఊపిరైన  నీకు నేనేం చెప్పాలి ?

తెలంగాణా ఉద్యమం అనేక అనుభవాల సారంగా వచ్చింది. ప్రజల పక్షానా నిలబడ్డ తమ బిడ్డలు అయితే ఎన్‌కౌంటర్ లేకపోతే జైలుపాలో, అడవిపాలో అయిన తర్వాత అనేక అనుభవాల సారంగా వచ్చింది. ఈ ఒత్తిడిని చిత్తడిని పెంచిందెవరు? రాష్ట్ర, దేశ, విదేశ హస్తాలు ఇక్కడిదాకా సాచి లేవా?

దీనికి తెర తీసిందెవరు? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు. హైటెక్ ద్వారాలు తెరిచి విద్యాలయాలను వద్యశాలలుగా మార్చారు. విద్యార్థులను యుద్ధవీరులైన విధ్యార్థులను ఆత్మహత్యలు చేసుకునే దయనీయ స్థితి మన విద్యారంగం కల్పించలేదా? రైతుల ఆత్మహత్యలకు కారకులెవరు? రెండు ప్రాంతాలలో రైతులు ఎంత హీనంగా ఉన్నారు. ధాన్యాగారం క్రాపు హాలిడేస్ ప్రకటించలేదా? అంతటా విస్తరించేదెవరు? రైతులను, వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందెవరు?

మనిషిలోపల చేపల్లోపల కుళ్ళడం మెదడులో మొదట ఆరంభమౌతుందని మహాశ్వేతాదేవి అంటారు. కుళ్లిన మెదళ్ళ వీళ్లు మనుషులను వేటాడుతున్నారు. లూషున్ పిచ్చివాడి డైరీ జ్ఞాపకం వస్తోంది. ఆ కథలో హీరో సమస్త మానవభాష మనుషులను తినడానికే అనే నిర్ధారణకు వస్తాడు. అడవిలోని మూడువందల గ్రామలు పోలవరం ముంపు బలిపీఠం మీదుగా ఆదివాసులు నిలుచున్నారు. నోరువాయిలేని ఆదివాసుల మీద యుద్ధం అంతకంతకు విస్తరిస్తూనే ఉన్నది. ప్రజలు ప్రేమిస్తారు. ఆ ప్రేమ కోసం మనమింకా ప్రతి చోటికి తిరుగుతూనే ఉన్నాం కదా! ఉన్నవ లక్ష్మీనారాయణ, చలం, కొడవటిగంటి, గోపిచందు, గురజాడ, భూషణం, పాణిగ్రాహి, రావిశాస్త్రి, కారా మాస్టారు, శ్రీశ్రీ, చలసాని, రుక్మిణి, సత్యవతి, బండి నారాయణస్వామి, పాణి, కె.వి.రమణారెడ్డి, కేశవరెడ్డి, మధురాంతకం, సురవరం, కాళోజీ, దాశరధి, వట్టికోట, ఆల్వారు, స్టాలిను, గద్దర్, ఉమా మహేశ్వరరావు, వోల్గా, రంగనాయకమ్మ, బోయ జంగయ్య, శశికళ, త్రిపురనేని మధుసూధనరావు, వరవరరావు , హరగోపాల్, బాలగోపాల్, గోరేటి వెంకన్న, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, సుద్దాల, సుంకర, వాసిరెడ్డి, మహిందర్, జాషువా,,,  ఎందరెందరో ప్రజల కోసం రవ్వంత సుఖశాంతికోసం అంతటా కవులు, రచయితలు విస్తరించి లేరా? ఇప్పుడు  కొన్ని వందలమంది రచయితలు కవులు అంతట విస్తరించలేదా?

తెలంగాణా, అంధ్రా తెలంగాణా, రాయలసీమ ప్రజల వ్జయం. దోపిడీదారులు ఏకమౌతున్న దశలో ఒక చిన్న విజయం ఇప్పుడు రెండు ప్రాంతాలల్లో విచ్చిన్నమైన వ్యవసాయం, పెచ్చరిల్లిన అధికార దోఫిడి, చిన్నాభిన్నమైన పరిశ్రమలు, మానవ సంబంధాలు నిర్మిద్దాం. ప్రజలతో కలిసి నిర్మించే దిశగా నువ్వాలిస్తావని నాకు తెలుసు.

భారతదేశంలో క్రూరుడైన, జిత్తులమారి బ్రిటిష్ పరిపాలన దురాశపూరితులైన ఫ్యూడల్ సంబంధాలు అస్తవ్యస్త అభివృద్ధి ప్రాంతాలకు తావిచ్చాయి. వీటన్నింటినీ సరిచేసి పీడిత ప్రజల పక్షాన పోరాటం చేపట్టింది శ్రీకాకుళం నుండి .. నేటి పోరాటం కదా! వనరులను అభివృద్ధి చేసే విధ్వంసాన్ని ఆపి మనుషులను నిర్మించే పోరాటంలో తెలంగాణ ఒక చిన్న అడుగు.

భారతదేశం యుద్ధంలోకి నెట్టబడుతోంది. స్థానిక ప్రజలకు దోపిడీదారులకు, గగ్గోలౌతున్న మన దగ్గరి టక్కరి పెట్టుబడిదారులకు, ప్రజలకు, రెండు ప్రాంతాల ప్రజలు కలిసి పోరాడుదాం. దారి తెన్నూ లేని  నాలోపలివెన్నో నీతో పంచుకోవాలనుకున్నాను. నీకు ఈ విషయాలన్నీ సర్వ సమగ్రంగా తెలుసు. నీకు ఇంత డొంక తిరుగుడుండదు కదా! నువ్వు మాటల కన్నా చేతలు నమ్మినావు కదా !

నీ మిత్రుడు

 

Download PDF

2 Comments

  • balasudhakarmouli says:

    aasa vunnadi. నమ్మకం vunnadi naaku…….

  • Garimella Nageswararao says:

    అల్లం వారికి నమస్కారం!
    తెలంగాణ ఏర్పాటు ఒకచిన్న అడుగో.. .పెద్ద తప్పటడుగో ..కాలం నిర్ణయిస్తుంది. ఆత్మా గౌరవ పోరాటం లోంచి పుట్టుకొచ్చిన అత్యాస ఇవాళ కవులని బాషని, ఇక్క్కడి ప్రజల మనోభావాలని చిన్న చూపు చూస్తోంది. రాజకీయ నాయకుల స్వార్ధం ఒకవైపు కుహనా ఆదర్సవాదుల మౌనం ఒకవైపు ప్రజలని తీవ్రమైన కలతకి గురి చేస్తోంది. 30 రోజులుగా పోరాటం చేస్తోన్న వాళ్ళంతా ప్రజలు కారా.. వారి మనోభావాలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యతా సామజిక్ స్పృహ లోకి రాదా..పెద్ద పెద్ద కళలు కనెవాళ్ళందరి మెదళ్ళూ ప్రాంతీయపు బురాడతో నిండి పోయాయి..మీరకున్న మనుషులను నిర్మించే పోరాటానికి నిజంగా తెలంగాణా యే అవసరం లేదన్నడి నా భావన. మితిమీరిన మొహమాటాలతో భయాలతో.. కనీసం కవులుకూడా తమ సహజమైన భావజాల్లన్ని స్వేచ్చగా పంచుకోలేని అనారోగ్య సాహిత్య వాతావరణం నేదు అలముకొంది. యాసకీ భాషకి మధ్యన కూడా తేడా తెలీనంత గందరగోళం ..దీని విస్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యతా కలం పట్టిన ప్రతీ ఒక్క్కరి మీదా ఉందన్నది నా అభిప్రాయం. మీరి కలగంట్న్న నిర్మాణాలకి అవకాసం తెలంగాణా రాష్ట్రం లో కూడా దొరకదు..మీకు ఆ అవకాశాన్ని రాజకీయ నాయకులు ఖచ్చితంగా దక్కనివ్వారు.పైగా.. మనలో మనకి విద్వేషాలు వద్దనుకున్నా పెరిగి పోతున్నాయి ..గమనించి కనీసం సాహిత్య కారులైన ఒక అర్ధ వంతమైన అవగాహనకి రాలేకపోతే..మనం చెప్పుకునే పాండిత్యం ..ఆకలి చావుల చేతుల్లో అంతమై పోతుంది ముందు ముందు కవులని కూడా నమ్మని స్తితి ఏర్పడుతుంది.దయుంచి వేదనని అపార్ధం చేసుకోరని భావిస్తూ.విశ్వ మానవ సంక్షేమాన్ని కోరుతూ విధేయుడు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)