ప్రేమ ఒక బ్లాక్‌ హోల్‌!

ప్రేమ, పరాధీనత, బానిసత్వం ఈ మూడు పైకి వేరు, వేరు, భిన్నమయిన అంశాలుగా కనిపిస్తున్నప్పటికీ ఈ మూడింటి  అంతఃస్సారం ఒకటే!

ప్రేమ పరాధీనతలోకి, పరాధీనత బానిసత్వంలోకి దారితీస్తుంది. మరో మాటలో చెప్పాలి అంటే ప్రేమ కు మరో పేరు బానిసత్వం. ఇది అతార్కిక ముగింపు అనిపిస్తుందేమో కానీ కొన్ని కొన్ని విషయాలు చదువుతున్నపుడు  కొంత మంది వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నపుడు ‘‘ఇది నిజమే కదా’’! అని కూడా అనిపిస్తుంది. బానిసత్వంలో ‘‘నేను బానిసను, నాకు స్వేచ్ఛ లేదు, నేను పీడింపబడుతున్నాను’’ అన్న ఎరుక, సంవేదన ఉంటాయి.  ప్రేమలోఅదేమీ వుండదు.  

‘‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే స్వర్గము’’ అనే ఆత్మార్పణ భావన ప్రేమలోవుంటుంది.  ఈ అర్పించుకోవటం అనే ప్రక్రియ, లేదూ తనని తాను త్యాగం  చేసుకోవడం అనే భావన ప్రేమ కల్పించే అనేకానేక మాయాజాలాలలో ఒకటి. సముద్రం తన మెత్తని హస్తాలతో మన అరికాళ్ళకింద గిలిగింతలు పెట్టినట్లుగా అనుభూతిని కలిగించి పూర్తిగా తనలోకి లాగేసుకుని మనలని శూన్యం చేసినట్లుగానే ప్రేమ కూడా ప్రేమలో వున్న వాళ్ళని ఖాళీమనుషులను చేస్తుంది. ప్రేమ ఒక బ్లాక్‌ హోల్‌.

ఒక రాత్రివేళ నిద్రపట్టక తెలుగు యూనివర్సిటీ వారు ప్రచురించిన సామల సదాశివ ‘‘మలయ మారుతాలు’’ వ్యాస సంపుటిలోని ‘‘ఇస్మత్‌ చుగ్తాయ్‌’’ పరిచయ వ్యాసం చదువుతున్నపుడు నాలో కలిగిన భావ సంచయం ఇది.

ఇస్మత్‌ చుగ్తాయ్‌ మాత్రమే కాదు. బేగం అఖ్తర్‌, మన రావు బాలసరస్వతీదేవి లాంటి ఉదహరించదగిన వ్యక్తుల జీవితాలలో ప్రేమ ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలుసుకుంటే ఆసక్తికరంగా వుంటుంది.

ఇస్మత్‌ చుగ్తాయ్‌ ప్రముఖ ఉర్దూ రచయిత్రి. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత. ఇప్పటికీ సమాజం ఆమోదించని, చర్చిండానికి యిష్టపడని ఎన్నో విషయాలను నలభై, యాభై సంవత్సరాల క్రితమే తన రచనల ద్వారా ప్రకటించి, చర్చనీయాంశం చేసి సంచలనం సృష్టించిన రచయిత్రి ఇంకా…..

231856

రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కి చెందిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ సంపన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి కలెక్టర్‌. ఆమె పెద్దన్న అజీం బేగ్‌ చొగ్తాయ్‌, ఇస్మత్‌కి ఊహ తెలిసేవరకే పెద్ద రచయిత. ఇస్మత్‌ మనసు రచన వైపు మరలటానికి ఆమె అన్నే కారణం. మధ్య తరగతి ముస్లిం జీవితాలలోని సామాజిక, నైతిక, ఆర్ధిక, చీకటి కోణాలను వెలికి తీస్తూ ఆమె శర పరంపరగా కథలు రాసింది. లైంగిక విషయాలను కూడా ఎక్కడా అసభ్యతకు తావు ఇవ్వకుండా చర్చకు పెట్టింది. ఇస్మత్‌ మీద పెట్టిన కేసులు ఎన్నో… ఒక్కటీ నిలవలేదు.

ఆమెకు, బొంబాయి మహానగర పాఠశాలల విద్యాధికారిగా పని చేస్తున్నపుడు షాహీద్‌ లతీఫ్‌ అనే యువకుడితో పరిచయం అయింది. అతడు కూడా ఒక చిన్న సైజు రచయిత. సినిమాలకు స్క్రిప్టులు రాసేవాడు. ఇస్మత్‌తో పరిచయం అయ్యాక, ఆమె దగ్గర శిష్యరికం చేశాడు. తన రచనలను ఆమె చేత సరిచేయించుకున్నాడు. సలహాలు తీసుకున్నాడు.

ఒకనాడు ఉన్నట్టుండి. సాహీద్‌ లతీఫ్‌, ఇస్మత్‌తో ‘‘మనిద్దరం పెళ్ళిచేసుకుందామా?’’ అని అడిగాడు. ఆమె విస్తుపోయింది. ఆమె గెజిటెడ్‌ ఆఫీసర్‌. పెద్ద పేరున్న రచయిత్రి. ఖ్యాతినీ, ప్రఖ్యాతినీ సమాన స్థాయిలో మూటకట్టుకున్న ఐకాన్‌.

‘‘మనిద్దరికీ ఎలా కుదురుతుంది’’? అన్నది ఆమె. ‘‘ఎందుకు కుదరదు’’? అన్నాడు అతను. ‘‘నేను నీకు తగిన భార్యను కాను. పురుషాధిక్యతను నేను అస్సలు సహించను. నీకు సేవలు చేయను. నేను మొండిదానిని. అనుకున్న పని చేసేదాకా పట్టు సడలించని దానిని. ఎవరు ఏమి అనుకున్నా నాకు పట్టింపు లేదు. ఇంత ఎందుకు? సంప్రదాయక గృహిణి లక్షణాలు నాలో ఒక్కటీ లేవు. అలాంటి నన్ను చేసుకుని నువ్వేం సుఖపడతావు?’’ అన్నదామె.

లతీఫ్‌ పట్టు విడువలేదు. కోపంతో లతీఫ్‌తో మాట్లాడటం మానేసింది ఇస్మత్‌. అయినా అతడు ఆమె దగ్గరకు వెళ్ళడం మానలేదు. ఇస్మత్‌ అన్న అజీంబేగ్‌ ఎందరు, ఎన్ని రకాలుగా చెప్పినా లతీఫ్‌ తన మొండిపట్టు వీడలేదు.

చివరకు వాళ్ళిద్దరి పెళ్ళి జరిగింది. ఆమె గెజిటెడ్‌ ఆఫీసర్‌. అతడు చిన్న చిన్నస్క్రిప్టులు రాసుకునే మినీ రచయిత. ‘‘గతిలేని వాడికి గెజిటెడ్‌ ఆఫీసరా…? అని అతడి మిత్రులు హేళన చేస్తారని ఉద్యోగానికి రాజీనామా చేసింది. అప్పటికీ ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్నా ఆమె, తన కీర్తి ప్రతిష్టలు అతడిని ఆత్మన్యూనతకి గురిచేస్తాయోమోనే ఉద్దేశ్యంతో రచనలు చేయడం మానేసింది. వాళ్ళిద్దరూ వీధిలో నడిచివెళుతున్నపుడు ‘‘ఇద్దరి ఎత్తూ సమానమే’’ అని ఎవరో అన్నారని ‘‘హై హీల్స్‌’’ వేసుకోవడం మానేసింది.

అంతేనా…?

ప్రొడ్యూసర్ల చుట్టూ చక్కర్లు కొట్టి, వెయ్యికీ, రెండు వేలకూ స్క్రిప్టులు రాసే అతడిని నిర్మాతను చేసింది. తను రాసిన నవల ‘‘జిద్ది’’ను సినిమాగా నిర్మించి అతడిని ప్రొడ్యూసర్‌ని చేసింది.

దిలీప్‌ కుమార్‌, కామినీ కౌశల్‌ లాంటి పెద్ద పెద్ద తారలు వాళ్ళ సినిమాలలో నటించారు. సినిమాలు విజయవంతం అయినాయి. సినిమాలకు రాసినా, కథలకీ, స్క్రిప్టులకీ తన పేరు వేసుకోకుండా లతీఫ్‌ పేరునే ప్రకటించేది. ఆ రకంగా అతడిని గొప్ప రచయితను చేసింది.

ఇద్దరమ్మాయిలు కలిగిన తరువాత లతీఫ్‌ మరణించాడు. అతడి అకాల మరణం ఆమెను కుంగదీసింది. కానీ పెరిగిన బాధ్యతలు ఆమెను మళ్ళీ మునుపటి ఇస్మత్‌గా మార్చాయి. తరువాత ఆమె జ్ఞానపీఠ్‌ అవార్డును కూడా పొందింది.

మరణానికి ముందు లతీఫ్‌ తన డైరీలో ఇలా రాసుకున్నాడట. ‘‘నన్ను పెళ్ళిచేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడతావని ఇస్మత్‌ అన్నది. కానీ నాకు తను ఆ అవకాశాన్నే యివ్వలేదు. ఇలాంటి అదృష్టం ఎంత మందికి దొరుకుతుంది?’’

నిజమే. లతీఫ్‌ అదృష్టవంతుడే…

ఇస్మత్‌ కోసం అతడేం చేశాడు. అతడి కోసం ఆమె, ఉద్యోగాన్ని, రచననీ, అన్నింటినీ వదులుకుంది. తను నీడలాగా వెనుక వుండి అతడిని వెలుగులోకి తీసుకుని వచ్చింది. సతీ సావిత్రిని కాను అన్న ఆమె,  సతీ సావిత్రి కంటే తక్కువేమీ కాదు అనిపించుకుంది.

ఇదంతా ప్రేమ కోసమేనా…?

***

LF14_BEGUM2_1296636f

‘‘దీవానా బనానా హైతో బనాదే’’ అనే గజల్‌ ద్వారా ఎంతో మందిని పిచ్చివాళ్ళను చేసిన బేగం అఖ్తర్‌ది మరొక కథ.

అఖ్తర్‌ బాయి ఫైజాబాదీ లక్నోలోమంచి ప్రాక్టీసు గల బారిస్టరు ఇస్తెయాఖ్‌ అబ్బాసీతో  వివాహం జరిగిన తరువాత బేగం అఖ్తర్‌గా మారింది.

సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో పుట్టిన అఖ్తర్‌ బేగం సంగీతం పట్ల ఆసక్తి పెంచుకుని కొన్నాళ్ళు పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్‌ అతా అహ్మద్‌ ఖాన్‌ దగ్గర, మరి కొన్నాళ్ళు ఉస్తాద్‌ అబ్దల్‌ వహీద్‌ ఖాన్‌ దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది.

అఖ్తర్‌ బాయిగా గొప్ప పేరునూ, డబ్బునూ సంపాదించుకుంది. బారిస్టర్‌ అబ్బాసీకి భార్య అయిన తరువాత బేగం అఖ్తర్‌గా మారిన తరువాత కొన్ని సామాజిక కట్టుబాట్లకి లొంగిపోవలసివచ్చింది. బురఖా మాటున ఆమె స్వరం మూగవోయింది. అచ్చం మన రావు బాలసరస్వతిదేవి నూజివీడు జమిందారుల అంత:పురంలో మూగవోయినట్లుగా.

ఆమె సాటి గాయని గాయకులు ఎవరయినా ఇంటికి వస్తే ఆమె అసహాయంగా బేల చూపులు చూసేది. ఎవరి పాటలు విన్నా ఆమెకు ఏడుపు వచ్చేది. ఆ నరకం నుండి ఆమెకు బయట పడాలని వుండేది. కానీ భర్త బారిష్టరు అబ్బాసి పట్ల ఆమెకు వున్న ప్రేమ, భర్త గౌరవం కాపాడాలన్న తాపత్రయం ఆమెను బయటకు రానిచ్చేవి కావు.

ఆ రోజుల్లోనే లక్నో రేడియో స్టేషన్‌కు ప్రొగ్రాం ప్రొడ్యూసర్‌గా వచ్చిన సునీల్‌ బోస్‌కి లక్నో రావడానికి ముందే బేగం అఖ్తర్‌తో పరిచయం ఉంది. ఆవిడ పాడటం మానేయడం పట్ల బాధపడిన సునీల్‌ బోస్‌ ఆమెను ఎలాగయినా పాడిరచాలి అనుకున్నాడు. జస్టిస్‌ మల్హోర్‌ తో కలసి బారిష్టర్‌ అబ్బాసీని ఒప్పించి బేగం సాహెబాని లక్నో రేడియో స్టేషన్‌కి తీసుకురాగలిగాడు.

దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత లక్నో రేడియో స్టేషన్‌ ప్రసారం చేసిన బేగం అఖ్తర్‌ గజళ్ళని విని అసంఖ్యాకులయిన ఆమె అభిమానులు ఆనందపడిపోయారు.

అబ్బాసీ కూడా ఆమె పాటను కట్టడిచేయడం అన్యాయమని, అపచారమని అనుకుని ఆమెకు పాడుకునే స్వేచ్ఛను యిచ్చాడు. అప్పటినుండీ ఆవిడ తన స్వర మాధుర్యంతో ఎందరెందరు సంగీత ప్రియులను తన్మయులను చేసిందో!

***

rbs

అలాగే మన రావు బాలసరస్వతిదేవి. నూజివీడు జమిందారును పెళ్లిచేసుకునేటప్పటికీ గొప్ప గాయని. ఎస్‌. రాజేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడిరది. నూజివీడు దివాణంలోకి అడుగుపెట్టిన తరువాత ఆవిడ మళ్ళీ బయటి ప్రపంచాన్ని చూడలేదు. స్వరాన్ని సవరించలేదు. రాజ సాంప్రదాయాల కోసం, రాజా వారి మీద వున్న ప్రేమ కోసం, బాల సరస్వతీదేవి స్వరాన్ని త్యాగం చేసింది.

పాట పట్ల ప్రేమ వుండీ, పాటే జీవితం అనుకునీ, పాడగలిగే శక్తివుండీ పాటకు దూరం కావడం అంటే పువ్వునుండి పరమళం దూరం కావడమే. మర్యాద కాదని బాలసరస్వతీదేవి బయటకు చెప్పకపోవచ్చు కానీ, పాటకు దూరమయి ఆవిడ ఎంత నరకాన్ని అనుభవించి వుంటుందో…

రాజావారు దివంగతులయిన తరువాత మళ్ళీ బాలసరస్వతీదేవి పాడటం మొదలుపెట్టారు. కానీ సమయం మించిపోయింది కదా…

ఇస్మత్‌ చుగ్తాయ్‌`

బేగం అఖ్తర్‌`

రావు బాల సరస్వతీదేవి`

వీళ్ళంతా లోకజ్ఞానం లేని మామూలు మనుషులుకారు. కానీ ప్రేమ కోసం కరిగిపోయిన కొవ్వొత్తులు. పెళ్లికి ముందు వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు, పెళ్ళయిన తరువాత వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు. సతీ సావిత్రిని కాను అని మరీ చెప్పిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ సతీ సావిత్రిలాగే ప్రవర్తించింది. ఎందుకనీ… లతీఫ్‌ పట్ల ప్రేమకోసం…

హైద్రాబాద్‌ నిజాం రెండవ కుమారుడు ప్రిన్స్‌ మొఖరం జానే ఆత్మాభిమానం కోసం తృణీకరించి వచ్చిన బేగం అఖ్తర్‌ బారిష్టర్‌ అబ్బాసీని పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేక, మౌనంగా వుండి పోయింది ఎందుకని… ప్రేమ కోసం.

నూజివీడు రాజావారు బ్రతికి వున్నంతకాలం రావు బాల సరస్వతీదేవి కోట గుమ్మం దాటి బయటకు రాలేదు ఎందుకని…ప్రేమకోసం

ప్రేమ కోసం వాళ్ళు పరాధీనత లోకి వెళ్లిపోయారు. బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ వాళ్ళ సహజ లక్షణాలని స్వయంగా తృణీకరించారు. పురుషుడికి నీడలాగా మారిపోయారు. అది బానిసత్వమన్న ఎరుక కూడా వాళ్లకు లేదు. అదంతా ప్రేమే అని అనుకున్నారు. నిజంగా అది ప్రేమేనా…?

ప్రేమంటే ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించి పంచుకోవాలి కదా! ఇద్దరూ ఒకే స్థాయిలో స్పందించాలి కదా! ఒకే శృతిలో ఒకే స్వరంలా కలసిపోవాలి కదా! ఒకే నాణేనికి రెండు వైపుల్లా నిల్చిపోవాలి కదా…

కానీ అలా జరగడం లేదు!

ఈ ఆధిపత్య భావజాలాన్నీ, దీన్ని అంగీకరించడాన్నీ, అంగీకరించినట్లుగా కూడా తెలుసుకోలేని అజ్ఞానాన్ని… దీన్నంతటినీ ప్రేమే…. అందామా!

 -వంశీకృష్ణ 

 

 

Download PDF

4 Comments

  • ఈ మధ్యే ABN లో బాలసరస్వతి గారి ఇంటర్వ్యూ చూసాను. అందులో బాల సరస్వతి గారు వేంకటగిరి సంస్థానం రాజాగారి రెండవ భార్య అని ఆవిడే స్యయంగా చెప్పారు. ఆమెకు పెళ్లి జరిగినప్పుడు పదిహేనేళ్ళు మాత్రమే. ఆయన ఆమె కన్నావయస్సులో చాలా పెద్ద. పాడగలిగి ఉండీ, పాడలేని జీవితంలో జీవించ వలసి రావడం చాలా విషాదకరం. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయించ బడతాయి అని అనుకుని సమాధానం చెప్పుకున్నా, ఒక మంచి గాయిని తన గాన మాధుర్యాన్ని ప్రజలకి పూర్తి స్థాయిలో అందించ లేక పోయింది.

  • gorusu jagadeeshwar reddy says:

    ప్రేమ, పరాధీనత, బానిసత్వం … వీటన్నిటి అంత:సారం ఒకటే అంటున్న వంశీ గారితో ఏకీభవించాలా వద్దా అన్న మీమాంసలో పడ్డాను కొద్దిసేపు. ప్రేమ పరాధీనతలోకి , పరాధీనత బానిసత్వం లోకి దారితీస్తుందని అనుకుంటే లోకం లో లింగభేదం లేకుండా స్త్రీ పురుషులంతా ఎప్పుడొ ఒక అప్పుడు ఒకరికొకరు బానిసలే అనిపించింది. నిజమయిన ప్రేమికుల మధ్య ఉండేది కేవలం ఒకరి కొకరు అర్పించుకోవడమే కదా . అర్పణ ను బానిసత్వం అనుకుంటే అది ప్రేమే కాదు. అయితే వంశీకృష్ణ గారు ఈ ముగ్గురు స్త్రీలను పురుష ఆధిక్య సమాజ ద్రుష్టి కోణంతో చూసారు గనక అది ఆయన చెప్పినట్టు కచ్చితంగా బానిసత్వమే. బేగం అక్తర్ , చుగ్తాయి ల సంగతేమో కాని బాలసరస్వతి పెళ్ళితో పరాధీనతగా సాలేగూల్లో చిక్కి కీటకమే అయ్యిందని మాత్రం చెప్పగలం. తన అక్షరాలతో ‘సభ్య ‘ సమాజాన్ని వణికించిన చుగ్తాయి మాత్రం స్వతహాగా రచయిత్రి కాబట్టి ‘ఇచ్చుటలో ఉన్న హాయిని ..’ గుర్తించ గలిగి ఆ ‘బానిసత్వం’ లో అమరత్వం పొందింది. ఇద్దరు గాయనీమణులు, ఒక రచయిత్రి .. తన వ్యాస పరిధి లోకి వీళ్ళను తీసుకొచ్చి విశ్లేషించడం బాగుంది. సాహిత్య సంగీతాలపయిన గాఢమయిన అభిరుచి ఉంది కాబట్టే ఇంతమంచి వ్యాసం రాయగలిగారు వంశీ గారు . అన్నట్టు మహానటి సావిత్రి కూడా ఈ బానిసత్వం లోకి వచ్చి బలయిన స్త్రీ మూర్తి అనుకుంటున్నా.
    – గొరుసు

  • Thirupalu says:

    ”ఇస్మత్‌ చుగ్తాయ్‌ ,బేగం అఖ్తర్‌, బాలసరస్వతీదేవి – ముగ్గుర్ని మీరు విష్లేసించటం బాగుంది. కాని, మొదటి ఆమె తప్ప మిగత ఇద్దరికి జీవితావగహన ఉన్నట్లుగా నాకు అనిపించలేదు. వాల్లు ఎంచుకున్నా జీవితం మీద
    వాల్లకే ఒక అవగహన లేదు. జీవితమంటే సమాజ అంతస్తు తప్ప మరేమి కాదనుకున్నారు. కాబట్టి, వాల్లకున్న కలా కౌశలాని పణంగా పెట్టారు. ఇది ప్రేమ అనుకోవటం తమ్ము తాముమభ్య పెట్టుకోవటం తప్ప మరేమి కాదు. (ఇది వాల్లని తక్కువచేసినట్లుగా అనుకో కూడదు) నా అభి ప్రాయం మాత్రమే చెపుతున్నాను. సహజంగానే సమాజ చట్రంలో భిగించబడిన వారు ఎంచుకొన్న జీవితమే అది. త్యాగం లక్ష్యం నుండి వెను దిరిగి చూస్తే ఓడి పోయి స్వార్ధం అవుతుంది. ఇస్మత్‌ చుగ్తాయ్‌ దగ్గర కోస్తే ప్రేమకు లక్ష్యాన్ని పణంగా పెట్టింది. దాన్ని ఒప్పుకుంటే అది ప్రేమతో కూడిన త్యాగమౌతుంది. లక్ష్యం కావలా లేక సమాజ జీవితం కావాల ? రెండు ఈ వైరుద్యాల సమాజంలో దొరకవు. ఆ ఎంపికలో వారు ఓడిపోయారు.

    • Thirupalu says:

      బాలసరస్వతీదేవి గారికి పదిహెనేళ్ల వయసులో పెల్లైందట. ఎంపిక లో ఆమె పాత్ర ఏమాత్రం లేకపోవటం విషాదం!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)