చరిత్ర చట్రంలో యయాతి కథ

yayati1

యజ్ఞం, దానం, అధ్యయనం, దస్యుహింస, జనరంజకపాలన, యుద్ధంలో శౌర్యం రాజధర్మాలు. వీటన్నిటిలోనూ యుద్ధం మరింత ఉత్తమధర్మం

(శ్రీమదాంధ్రమహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం)

ధర్మరాజుకు రాజనీతిని బోధిస్తూ భీష్ముడు ఏమంటున్నాడో చూడండి… యజ్ఞం, దానం, జనరంజకపాలన, యుద్ధంలానే ‘దస్యు హింస’ కూడా రాజు(లేదా యజమాని) నిర్వర్తించవలసిన ధర్మాలలో ఒకటి అంటున్నాడు. దస్యులు-దాసులు అనే రెండు మాటలకు ఏదో సంబంధం ఉన్నట్టు కనిపిస్తుందని రాంభట్ల(జనకథ) అంటారు. దస్యులు ఆలమందలను, వాటిని కాచుకునే మనుషులను అపహరించేవారనీ; మందలను, మనుషులనూ కూడా వ్యవసాయదారులకు అమ్మేసేవారనీ, అలా కొనుక్కున్న మనుషులను దాసులు అనేవారనీ ఆయన వివరణ. వ్యవసాయం పనులకు మంద-మంది ఎప్పుడూ అవసరమే.  ఆవిధంగా వ్యవసాయం పనులకు సహకరించే పశువుకూ, మనిషికీ పోలిక కుదిరింది. అందుకే పని చేసిన తర్వాత  వారికి ‘కూలి’ రూపంలో ఇచ్చే తిండికీ  పోలిక కుదిరింది. దాని పేరు: గ్రాసం. గ్రాసం అంటే గడ్డి, లేదా తృణసంబంధమైన ఆహారం. విశేషమేమిటంటే, ‘గ్రాసం’ అనే మాట నిన్నమొన్నటి వరకు ‘జీతం’ అనే అర్థంలో వాడుకలో ఉంది.

దస్యు-దాస శబ్దాలకు మళ్ళీ వస్తే, వైదిక పద సూచి(Vedic Index) ప్రకారం వీటిని పర్యాయపదాలుగా వాడడమూ ఒకటి, రెండు చోట్ల కనిపిస్తుంది. ఆర్యులకు భిన్నమైన ఆచారవ్యవహారాలు, ఆరాధనాపద్ధతులు, వేషభాషలు, రంగు వగైరాలు కలిగిన దస్యులు లేదా దాసులను ఆర్యులు శత్రువులుగా చూడడం సహజమే. వీళ్ళ మధ్య ఘర్షణలు జరగడమూ సహజమే. కొనుక్కున్న దాసులే కాక, యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు కూడా దాసులే అవుతారు కనుక ఆవిధంగా దస్యులు కూడా దాసులే. అలాగే, దాసుల్లో పుట్టించిన దాసులు, అంటే గర్భ దాసులు ఉండేవారని కూడా చెప్పుకున్నాం. దాసులు ఎవరైనా సరే దండనకు అర్హులే. భీష్ముడు దస్యుహింస అనడంలో ఆ సూచన కూడా  ఉండచ్చు.

ఎందుకంటే, దాసులు ఒక్కోసారి ఠలాయిస్తారు. పని చేయడంలో ఒళ్ళు దాచుకుంటారు. పారిపోడానికి ప్రయత్నిస్తారు. లేదా జట్టుకట్టి యజమానిపై తిరుగుబాటు చేసే ప్రమాదమూ ఉంది. అలా తిరుగుబాటు చేసిన ఉదాహరణలనూ కొన్నింటిని ‘వేదభూమి’లో రాంభట్ల ఇచ్చారు. కనుక దాసులను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలి. ఏదో ఒక కారణాన్ని కల్పించుకుని మధ్య మధ్య దేహశుద్ధి చేస్తూ ఉండాలి. ఎప్పుడూ భయభక్తులలో ఉంచాలి.  ఓ పాత సినిమాలో ఓ స్కూలు మాస్టరు తప్పు చేసిన  కుర్రాడికే కాకుండా, పనిలో పనిగా మిగతా కుర్రాళ్ళకు కూడా నాలుగు తగిలిస్తాడు. మొదటి కుర్రాడు తప్పు చేసినందుకు, మిగతా కుర్రాళ్ళు తప్పు చేయకుండా ఉండేందుకు అన్నమాట.  గ్రీకు, రోమన్; ఇటీవలి అమెరికన్ బానిసవ్యవస్థలలో బానిసల దండన ఎలా ఉండేదో చూస్తే, భీష్ముడన్న ‘దస్యు హింసా’ రూపం కొంత ఊహకు అందచ్చు.  అయితే, దేశాకాలాలను బట్టి వాటి తీవ్రతలో తేడాలు ఉంటే ఉండచ్చు. ‘రూట్స్’ నవలలో కుంటా కింటే పారిపోవడానికి రెండు, మూడుసార్లు విఫలయత్నం చేస్తాడనీ, చివరికి అతని యజమాని అతని పాదం ఒకదానిని సగానికి నరికించేస్తాడనీ ఇంతకుముందు చెప్పుకున్నాం.

వ్యవసాయానికి మంది అవసరం చరిత్రపూర్వకాలం నుంచి, చరిత్రకాలం మీదుగా ఆధునిక కాలం వరకూ నిరంతరం ఉంటూనే ఉంది. వ్యవసాయవిస్తరణను భారీ ఎత్తున చేపట్టిన మౌర్య రాజు అశోకుడు అందుకోసం జనాలను తరలించి కొత్త కొత్త జనావాసా(settlements) లను ఏర్పాటు చేయడం, ఆ జనాలు తమున్న జనావాసం నుంచి పారిపోయే వీలు లేకుండా తగిన బందోబస్తు చేయడం గురించి కోశాంబీ విపులంగా రాశారు. అంతే విపులంగా చెప్పుకోవలసిన ఆ ఘట్టంలోకి ఇప్పుడు వెళ్లలేము కనుక ప్రస్తుతానికి వద్దాం.

వర్ణవ్యవస్థకు చెందిన శిక్షాస్మృతిలోని ఒక అంశాన్నే ఇక్కడ భీష్ముడు బోధిస్తున్నాడు. ఈ బోధ ఇంకా చాలా చోట్ల కనిపిస్తుంది. వర్ణవ్యవస్థలో శిక్షాస్మృతి కూడా వర్ణాల హెచ్చుతగ్గులను బట్టే ఉంటుంది. ఎలాగంటే,  పై రెండు వర్ణాలకూ శిక్ష ఉండదు. ఉన్నా సరళంగా ఉంటుంది. కానీ,  మూడో వర్ణాన్ని అణచిపెట్టి ఉంచాలి, ఇక నాలుగోవర్ణంవారిని కొట్టినా, చంపినా తప్పులేదు.  మహాభారతం మేరకు ఐదో వర్ణం ప్రస్తావన దాదాపు కనిపించదనే చెప్పవచ్చు. మూడో వర్ణం అంటే వైశ్యులు. ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు, ‘ప్రసిద్ధులైన రాజులందరూ అతనికి భయపడి వైశ్యులలా దాసోహమై ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధనరాశులను తెచ్చి కప్పంగా చెల్లించారనీ, దాంతో ధర్మరాజుకు రాజత్వం సిద్ధించిందనీ’ శకునితో దుర్యోధనుడు అంటాడు.

ఇది నాలుగువర్ణాల వ్యవస్థ స్థిరపడిన లేదా,  స్థిరపడుతున్న దశకు చెందిన ముచ్చట. అప్పటినుంచీ దాస-దాసీల గురించిన ప్రస్తావన చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువమంది దాస-దాసీలు ఉండడం, సత్కారరూపంలోనో, కప్పంగానో దాస-దాసీలను ఇవ్వడం, కూతురికి పుట్టింటి అరణంగా దాస-దాసీలను ఇచ్చి పంపడం- ఇలా అనేక విధాలుగా దాస-దాసీలు ఒక హోదా చిహ్నంగా మారడం కనిపిస్తుంది.  ధర్మరాజు జూదంలో ఒడ్డబోయే తన సంపద జాబితా చెబుతూ అందులో వేలాదిమంది దాస-దాసీలను కూడా కలుపుతాడు.  ఈ దాస-దాసీ వ్యవస్థకు అవకాశమిచ్చిన గృహ ఆర్థికత (household economy), దానికి జతగా వర్ణవ్యవస్థ ఎలా అభివృద్ధి చెందాయో రొమీలా థాపర్ From Lineage to State లో చర్చించారు.

అదలా ఉంచితే, మనం చెప్పుకుంటున్న యయాతి కథ అంతకంటే పురాతనం. ఎంత పురాతనం అంటే, అది దాస-దాసీ వ్యవస్థకు ప్రారంభకాలం కావచ్చు.

అసుర, దాస శబ్దాలు మొదట్లో జాతి, లేదా తెగ వాచకాలే తప్ప నిందార్ధకాలు కావని చెప్పుకున్నాం. అసురులు వ్యవసాయనిపుణులనీ; దాసుల్లో కూడా సంపన్నులు, బలవంతులు ఉండేవారనీ అనుకున్నాం. ఈ సందర్భంలోనే ‘శూద్ర’ అనే మాట గురించి కూడా చెప్పుకోవాలి. రొమీలా థాపర్ ప్రకారం దాస, శూద్ర అనే శబ్దాలు గణవాచకాలు. వారు స్వతంత్ర జీవులు, కృష్ణవర్ణులు, అంటే నల్లని వాళ్ళు. ఋగ్వేదం ప్రకారం మొదట్లో ఉన్నవి రెండు వర్ణాలే. అవి: ఆర్యవర్ణం, దాసవర్ణం. ఈ దాసులు, శూద్రులలో కొందరు పేదలైతే కావచ్చు కానీ, మొదట్లో వారు సేవకవృత్తిలో లేరు.  వీరు, ఆర్యులు పక్క పక్కనే ఉండేవారు. పైగా ప్రారంభంలో దాస్యానికి పేదరికమే కారణం తప్ప వర్ణం కాదు. ఆవిధంగా దాసులు, శూద్రుల్లోని పేదల లానే ఆర్యుల్లోని పేదలు కూడా దాస్యం లోకి జారిపోయేవారు. ఆ తర్వాత సొమ్ము చెల్లించో, మరో విధంగానో దాస్యం నుంచి బయటపడే వెసులుబాటు ఉండేది. అందుకే భారతదేశంలో ప్రామాణిక బానిసవ్యవస్థ ఎప్పుడూ లేదని చరిత్రకారులు అంటారు. మరి వర్ణవ్యవస్థ సంగతేమిటనే ప్రశ్న వస్తుంది. వర్ణవ్యవస్థలో హెచ్చుతగ్గుల తేడాలకు పుట్టుకే కొలమానం తప్ప, ఆర్థికతారతమ్యాలు కావు. అది ఒకరకంగా సామాజిక బానిసత్వ రూపం. ఈ వర్ణవ్యవస్థకు మెసపొటేమియాలోని ఒకనాటి బానిసరూపంతో పోలిక ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా వివరంగా చెప్పుకోవలసిన ఈ అంశాన్ని ప్రస్తుతానికి అలా ఉంచుదాం .

‘శూద్ర’ శబ్దానికి వస్తే, ఆ మాట సంస్కృత పదం కాదనీ, ఇతర ఆర్యభాషలకు చెందిన పదం కూడా కాదనీ, సుమేరు పదమనీ రాంభట్ల ‘జనకథ’లో అంటారు. ఆ మాటకు రక్షకుడు అని అర్థంచెప్పారు. రక్షకుడు అనగానే మనకు రాక్షస శబ్దం గుర్తొస్తుంది. సుమేరుల జలప్రళయగాథలో నాయకుని పేరు ‘జీవశూద్ర’. సుమేరులు వ్యవసాయదారులు కనుక ‘జీవశూద్ర’ పంటపండించేవాడు, లేదా పంటకు రక్షణగా ఉండేవాడు అన్నమాట. అసురులు, అంటే రాక్షసులు కూడా వ్యవసాయదారులే నని చెప్పుకున్నాం. ఈ శూద్ర లేదా రక్షక శబ్దంలాంటిదే తెలుగులో ‘కాపు’ అనే మాట. ‘కాపు’ అనే మాటకు పంట రక్షకుడు, జనరక్షకుడు అనే అర్థాలు ఉన్నాయి.

ఈ వివరణకు పూర్వరంగంలో వేద ఋషులు వ్యవసాయానికి మళ్లడం గురించి చాలా విషయాలను రాంభట్ల గారు చర్చించారు కానీ ఇప్పుడు అందులోకి వెళ్లకుండా క్లుప్తంగా చెప్పుకుంటే, వ్యవసాయప్రాధాన్యాన్ని గుర్తించిన ఆర్యులలోని భరతగణంవారు వ్యవసాయవిస్తరణలో అసురుల సహకారం తీసుకున్నారు. అందుకే, అసుర భావనను వ్యక్తం చేసే నారాయణ, నాసదీయ, ‘క’బ్రహ్మ సూక్తాలు ఋగ్వేదం ప్రథమమండలంలోకి ప్రవేశించాయని రాంభట్ల అంటారు. ఆయన ప్రకారం, నారాయణసూక్తం సుమేరుల సృష్టిగాథే. చాలాకాలం తర్వాత ఈ కథనే బైబిలు కొన్ని మార్పులతో స్వీకరించింది. ‘శూద్ర’ పదం ఈ నారాయణ సూక్తంలో తప్ప ఇంకెక్కడా కనిపించదు.  ఇక నాసదీయసూక్తంలోని తొలి వాక్యం అసురసృష్టిగాథ ‘ఎనూమాఎలిక్ష’కు అనువాదం. ‘క’బ్రహ్మసూక్తం ఈజిప్టు భావనకు సంస్కృత రూపం. సుమేరుకు చెందిన సుక్కూరులోని పురోహితుని ‘బరు’ అంటారు. ఈ ‘బరు’యే ‘బరురాంగిరస’ పేరుతో మంత్రద్రష్టగా వేదంలోకి ఎక్కాడు. ఈ పేరులోని ‘అంగిరస’ అనే పదం కూడా సుమేరుకు చెందినదే. సుమేరులు తమ దేశాన్ని ‘ఎంగి’ అనీ, తమ జనాన్ని ‘ఎంగిర్లు’ అనీ అనేవారు.

నారాయణసూక్తమూ-దానికి గల ‘శూద్ర’, సుమేరు సంబంధాల గురించి చెప్పుకుంటూ వెడితే, ఈ గొలుసుకట్టు ఎక్కడిదాకా పోతుందో తెలియదు. మహాభారత కథను వ్యవసాయ విస్తరణ కోణం నుంచి పరిశీలిస్తూ, ‘నర-నారాయణ రహస్యం’ పేరుతో నేను ఇప్పటికే ఒక పెద్ద వ్యాసం(అముద్రితం) రాశాను. దాని గురించి ఈ వ్యాసపరంపరలో చెప్పుకునే సందర్భం ఎప్పటికి వస్తుందో చెప్పలేను.

ఇంతకీ దాస శబ్దం (అలాగే శూద్ర శబ్దం కూడా) నిందార్థకం ఎందుకైంది, ఎప్పుడైంది అనే ప్రశ్నలకు పరిస్థితుల సంబంధమైన సాక్ష్యాలపై ఆధారపడి జవాబు చెప్పుకోవలసిందే తప్ప, కచ్చితమైన స్థలకాలాలను గుర్తించడం కష్టం.  దాస (అలాగే శూద్ర) శబ్దానికీ, అసుర శబ్దానికీ కొంత తేడా ఉంది. దాస శబ్దానికి నిందార్థంతోపాటు న్యూనార్థం కూడా ఉంది. ‘దాస’ అనే, గణ లేదా తెగ వాచకం దాసులనే న్యూనార్థాన్ని తెచ్చుకునే క్రమంలో యయాతి-శర్మిష్టల సంబంధాన్ని ఎక్కడ ఇమడ్చవచ్చు?!

పురావస్తు ఆధారంగా రొమీలా థాపర్ చేసిన పరిశీలన ప్రకారం ఒక భౌగోళిక సన్నివేశం ఇలా ఉంటుంది:

యయాతి-శర్మిష్టల చివరి కొడుకు పూరుడి సంతతి మొదట్లో సరస్వతీ నదీతీరంలో పచ్చిక భూముల వెంబడి జీవించారని ఋగ్వేదం చెబుతోంది. అయితే ఆ తర్వాత ఎంతకాలానికో తెలియదు కానీ, ఒక కీలక పరిణామం జరిగింది. ఉత్తర రాజస్తాన్, దక్షిణ పంజాబ్ ప్రాంతంలోని నదుల గమనంలో మార్పులు సంభవించాయి. ఉత్తర రాజస్తాన్ లో వాతావరణం మారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రీ.వె. 2000 ద్వితీయార్థంలో ఈ మార్పులు సంభవించాయని అంచనా. సట్లెజ్ నదీ గమనం తరచు మారిపోయేదనడానికి వేదానంతర సాహిత్యం ఆ నదిని ‘శతద్రు’, అంటే వంద కాలువలు కలిగినదిగా పేర్కొనడం ఒక నిదర్శనం. ఇక, అనేక సరస్సులు కలిగినది అనే అర్థం ఇచ్చే సరస్వతీ నది సిర్సా అనే చోట ఎడారిలో అదృశ్యమైంది. యమునా నదీ గమనంలో వచ్చిన మార్పులు సరస్వతీ, సింధు, గంగా ప్రాంతంలోని ఇతర నదుల జలాలను ఆకర్షించాయనే వాదం ఉంది. ఈ విధమైన పర్యావరణ అనిశ్చితికితోడు, చిత్రిత మృణ్మయ సంస్కృతికి చెందిన వైదికార్యుల నివసించే ప్రాంతాల పరిమాణమూ పెరిగింది. అంటే, వారి జనాభా పెరిగిందన్న మాట. దాంతో వారు కొత్త వ్యవసాయక్షేత్రాలను, పచ్చిక భూములను వెతుక్కుంటూ పశ్చిమ గంగా లోయవైపు కదిలారు. అయితే, పురులలో ఒక శాఖ, బహుశా ప్రధాన శాఖ పంజాబ్ చుట్టుపక్కలే ఉండిపోగా, ఉప శాఖలు పశ్చిమ గంగా లోయ వైపు పయనించాయి. భరతులు వారికి తోడయ్యారు. ఈ పురు-భరత సమాఖ్య నుంచే కురులు అవతరించారు. ఇంకోవైపు, మరో అయిదు తెగలు కలసిపోయి పాంచాలురుగా ఆవిర్భవించారు. ఈ కురు-పాంచాల ప్రాంతమే మధ్యదేశంగా, ఆర్యావర్తంగా ముందు ముందు గుర్తింపు పొందబోతోంది. జనాభా పెరగడం, దాంతో కొత్త జనావాసాలను ఏర్పాటు చేయవలసి రావడం, కొన్ని యుద్ధ విజయాలు, ఓడిపోయిన వారి లొంగుబాటు మొదలైనవి తెగల ఏకీకరణకు, పునర్వ్యవస్థీకరణకు దారి తీయించి ఉండచ్చు.

పురులు, భరతులు పశ్చిమ గంగా లోయలోకి వలస వెళ్లడానికి ముందు మరో ముఖ్య పరిణామం జరిగింది. అది, దశరాజయుద్ధం. ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించుకున్న ఈ యుద్ధం గురించి క్లుప్తంగా చెప్పుకుంటే, సుదాస్ నాయకత్వంలోని భరతులతో పది తెగల వారు పోరాడారు. వారిలో యదులు, లేదా యక్సులు, తుర్వసులు, ద్రుహ్యులు, అనులు ఉన్నారు. వీరు యయాతి వృద్ధాప్యాన్ని స్వీకరించడానికి నిరాకరించి శాపగ్రస్తులైన అతని నలుగురు పెద్ద కొడుకులు, లేదా వారి సంతతి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు నదీ గమనంలో వచ్చిన మార్పుల వల్ల పురులు నేటి హర్యానావైపు, గంగా-యమునా ఎగువ ప్రాంతానికి  వలసపోయినప్పుడే యదులు(మిగిలినవారి సమాచారం లేదు) సౌరాష్ట్ర, మధురల వైపు వెళ్లారని ఒక సూచన. వైదిక సాహిత్యంలో ‘పంచజను’ల ప్రస్తావన తరచు వస్తుంది. ఈ పంచజనులు ఎవరు, యయాతి కొడుకుల సంతతా  అనేది తెలియదు. యయాతి పెద్దకొడుకును కాదని చిన్నకొడుకు పూరునికి పట్టం కట్టడం పశుపాలన స్థానంలో వ్యవసాయ ప్రాధాన్యం పెరిగిన సంగతిని సూచిస్తూ ఉండచ్చని అనుకున్నాం. భరతులలానే పురులు వ్యవసాయదారులు.

పురులలో కొందరు, భరతులు గంగా-యమునా మధ్యప్రాంతానికి వెడుతున్న కొద్దీ వ్యవసాయ ప్రాధాన్యం కూడా పెరుగుతూ, మరిన్ని నైపుణ్యాలు కలిగిన వ్యవసాయకార్యక్రమాలు పుంజుకున్నట్టు పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. వ్యవసాయ జనావాసాలు కూడా ఏర్పడుతూ వచ్చాయి. అయితే ఆ పరివర్తన మందగతిలో సాగింది. వెనకటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే, ఇప్పుడు పురులు, భరతుల దగ్గర గుర్రమనే కొత్త జంతువు ఉంది. వీరు క్రీ.వె. 1000 తొలి శతకాల నాటికే ఆయుధాలకు పరిమితమై ఇనుము వాడుతున్నారు. సింధు-గంగా మధ్యప్రాంతంలో హరప్పా మలిదశకు చెందిన జనాలు ఉన్నట్టే; వీరు పశ్చిమ గంగా లోయలోకి వెళ్ళేనాటికి అక్కడ కూడా ముందునుంచీ ఉంటున్న కాషాయవర్ణ మృణ్మయ పాత్రల సంస్కృతికి, రాగి సాధనాల సంస్కృతికి చెందినవారు ఉన్నారు. వీరివి చిన్న చిన్న జనావాసాలు. వీరిలో వ్యవసాయదారులు కూడా ఉన్నారు.

పై వలసక్రమమూ, తేదీలూ యయాతి కథను అతిపూర్వానికి తీసుకువెడుతున్నాయి. అది, ఆర్యగణాలలో పశుపాలన ప్రాధాన్యం వ్యవసాయ ప్రాధాన్యానికి మళ్ళుతున్న సంధి దశ కావచ్చు. వారు భారతదేశంలోకి అడుగుపెట్టే నాటికి ఇక్కడ కాషాయవర్ణ మృణ్మయ పాత్రల సంస్కృతికి చెందినవారు ఉన్నారనీ, వారు మలి హరప్పా సంస్కృతికి చెందిన వ్యవసాయదారులు కావచ్చుననీ చెప్పుకున్నాం. వాళ్ళలో దాసులు, అసురులు ఉన్నారు. ఆర్యులు వ్యవసాయదారులను శత్రువులుగా చూసి అసురులుగా పేర్కొనేవారు కనుక దాసులను కూడా అసురులనే అనేవారు కాబోలు. అయితే, పశుపాలన-వ్యవసాయాల సంధి దశలో ఒకటి జరగడానికి అవకాశముంది. అది, ఉభయ వృత్తుల మధ్య ఒక మాదిరి సహజీవనం. ఎలాగంటే, వ్యవసాయదారులు పంట కోసుకున్న తర్వాత పొలాలలో పశువులను మేపుకోనివ్వడమో, పశుగ్రాసం సమకూర్చడమో చేయవచ్చు. అందుకు ప్రతిఫలంగా ఆర్యగణాలు వ్యవసాయదారులకు రక్షణ కల్పించవచ్చు. అదీగాక, స్థిరజీవితానికి అలవాటుపడిన వ్యవసాయదారులు సాగుకు అనుకూలమైన భూముల్ని విడిచిపెట్టి వెళ్లడానికి సాధారణంగా ఇష్టపడరు. ఇతరుల ఆధిపత్యాన్ని అంగీకరించి అయినా భూముల్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తారు. కనుక నాటి సింధు-గంగా ప్రాంతంలో ఆ సంధి దశలో ఉభయవృత్తిదారుల మధ్య సహజీవనం సాధ్యమై ఉండవచ్చు. అందుకు ఋగ్వేదంలో సాక్ష్యాలు ఉన్నాయని రొమీలా థాపర్ అంటారు. ఉదాహరణకు, ఋగ్వేదం చివరి మండలాలలో నాగలి వ్యవసాయం గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. అంతేగాక, కొన్ని వ్యవసాయపరికరాల పేర్లు ఆర్యేతర భాషలకు చెందినవిగా ధ్వనిస్తాయి. ‘లాంగల’ అనే మాట అలాంటిదే. వైదిక సంస్కృతంలో మూల ద్రావిడ, ఆష్ట్రో-ఏషియాటిక్  పదజాలం ప్రవేశించడానికి మూలం ఈ కాలంలోనే ఉండవచ్చు. అయితే, ఆర్యగణాలు వ్యవసాయప్రాధాన్యం వైపు మళ్ళుతున్న కొద్దీ ఈ సహజీవన సంబంధాలు శత్రుసంబంధాలుగా మారడానికి అవకాశముంది.

యయాతి-శర్మిష్టల సంబంధం సహజీవన దశకు చెందినదా, శత్రుపూరిత దశకు చెందినదా అన్నది కచ్చితంగా చెప్పడం కష్టం. రెండింటికీ అవకాశముంది. శర్మిష్ట తండ్రి వృషపర్వుడు కాషాయవర్ణ మృణ్మయపాత్రల సంస్కృతికి, దాస తెగకు  చెందిన అనార్య వ్యవసాయదారుడు కావచ్చు. వ్యవసాయదారుడు కనుక అతనిని అసురునిగా పేర్కొని ఉండచ్చు. యయాతి-శర్మిష్టల సంబంధం సహజీవన దశకు చెందినది అనుకుంటే, దాస స్త్రీ అయిన శర్మిష్టను యయాతి సహజగతిలోనే వరించాడు. ఆర్యులకు అప్పటికి జాతిస్వచ్ఛత గురించి పట్టింపులేదు. వాస్తవంగా ఆ కథ కూర్చేనాటికి దాస శబ్దం న్యూనార్థం తెచ్చుకుంది కనుక కథకుడు శర్మిష్టకు దాస్యం ఆపాదించి దాసిగా కథను మలచి ఉండవచ్చు. యయాతి-శర్మిష్టల సంబంధం శత్రుపూరిత దశకు చెందినది అనుకుంటే, దాస స్త్రీ అయిన శర్మిష్ట దాసిగా మారిపోయి ఉండచ్చు. ఆమె కంటే ముందు వృషపర్వుడే దాసుడుగా మారిపోయి ఉండాలి…

యయాతి కథా పరిశీలనలో ప్రస్తుతానికి ఇవే చివరి వాక్యాలు. అయితే, ఇంత పరిశీలనా చేసి ఏం తేల్చినట్టు అనే ప్రశ్న పాఠకులకు కలగచ్చు. ఏమీ తేల్చలేకపోవడమే మన పురాణ, ఇతిహాసకథలలో ఉన్న బ్యూటీ. నా మటుకు నాకు పురాణ ఇతిహాసకథలలో చారిత్రకతను అన్వేషించడమే గొప్ప ఉత్తేజకర వ్యాసంగం. ఈ అన్వేషణలో నేను పొందిన మజాను పాఠకులలో ఏ కొందరు పొందినా నా ప్రయత్నం సఫలమైనట్టే.

 – కల్లూరి భాస్కరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

 –

 

 

Download PDF

2 Comments

  • Nageswara Rao says:

    నమస్తే .. మీరు రాస్తున్న వ్యాసాలు బాగుంటున్నాయి.. చరిత్రకు – ఇతిహాసాలకు సంబంధం చూపడం అద్భుత ప్రక్రియ ! అయితే మీరు చెబుతున్న చారిత్రకాధారాలన్నీ విదేశీ రచనకారులతో ప్రభావితమైనవే కదా ! ఆర్య – ద్రావిడ విభజన అనే అందమైన అబద్ధం నుంచి మనం ఎప్పుడు బయట పడటం ? ప్రపంచమంతా మీరు ఒకటే జాతిగా ఉన్నారు అని వైజ్ఞానిక ప్రమాణాలతో రుజువు చేసి- ఇంకా చేస్తున్నా కూడా మనం బ్రిటిషర్లు నూరిపోసి – తరవాత ప్రాంతీయ రాజకీయ నాయకులు వల్లేసిన “సింధు నాగరికతను ఆర్యులు ధ్వంసం చేసారు”లాంటి పడికట్టు పద – భావజాలం నుంచి బయటికి వచ్చి ఆలోచించలేమా?

  • కల్లూరి భాస్కరం says:

    నమస్తే…ఆర్య-ద్రావిడ వాదం పై నా అభిప్రాయాలు ఇవే వ్యాసాలలో చెప్పాను. క్లుప్తంగా మరోసారి చెబితే, ఆర్య-ద్రావిడ విభజన ఉందనీ, లేదనీ చేసే రెండు వాదాలూ నా ఉద్దేశంలో శిలాక్షరాలు కావు. సైన్సులో లానే చరిత్రలో కూడా శిలాక్షరాలు ఉండవు. ఆ మాటకొస్తే ఈ వ్యాసాల్లో చెప్పే అనేక అభిప్రాయాలను కూడా శిలాక్షరాలని నేను అనను. మీ వ్యాఖ్య నుంచి నాకు కూడా కొన్ని ప్రశ్నలు పుడుతున్నాయి. 1. ఆర్య-ద్రావిడ విభజన తప్పని అంత బల్లగుద్ది ఎవరైనా(ఒక శిలాక్షరం మాదిరిగా) ఎలా చెబుతారో నాకు అర్థం కాదు. రెండు రోజుల క్రితం ndtv చానెల్ లో, అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అబ్బాయిని ఢిల్లీలో హత్య చేసిన నేపథ్యంలో ఓ చర్చ ప్రసారమైంది. అందులో పాల్గొన్న ఒక అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయిలో chinese features స్పష్టంగా కనిపించాయి. అంటే ఈ దేశంలో భిన్న జాతుల ఉనికి నేటికీ చూస్తున్న వాస్తవం అన్న మాట. అలాంటప్పుడు చరిత్ర పూర్వకాలంలో ఆర్య-ద్రావిడ విభజన తలెత్తడంలో ఆశ్చర్యం ఏముంటుందో నాకు అర్థం కాదు. 2. అయితే, ఆర్య-ద్రావిడ విభజన తప్పనే వాదాన్ని కొందరు ఒక శిలాక్షరంగా ఎందుకు నొక్కి చెబుతున్నారు? ఎందుకంటే నా ఉద్దేశంలో దాని వెనుక ఉన్న రాజకీయాలు. రాజకీయాలతో చరిత్రను కలగలిపితే చరిత్ర శిలాక్షరంగా మారిపోతుంది. అందులో ఇంకా చాలా ప్రమాదాలున్నాయి. రాజకీయనాయకులు చెప్పే చరిత్రలో మౌర్య చంద్రగుప్తుడు కాస్తా గుప్త చంద్రగుప్తుడుగా మారిపోతాడు. 3. ప్రపంచమంతా మీరు ఒకే జాతిగా ఉన్నారని వైజ్ఞానిక ప్రమాణాలతో రుజువు చేశారని మీరు అన్నారు. ఆర్య-ద్రావిడ వాదం వెనుక అలాంటి ప్రమాణాలు లేవా అన్నది నా ప్రశ్న. 4. చరిత్రకు విదేశీ, స్వదేశీ తేడాలు ఎలా ఉంటాయో కూడా నాకు అర్థం కాదు. సైన్సు, టెక్నాలజీలలో కూడా ఆ తేడా ఉంటుందా?

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)