గృహ హింస – కొలకలూరి ఇనాక్ కథ

(ఆచార్య కొలకూరి ఇనాక్ కు పద్మశ్రీ లభించిన సందర్భంగా ఆయన రాసిన ” గృహహింస” కథ ను పునర్ముద్రిస్తున్నాము.)

 సాయంకాలం పెందలాడే ఇంటికి వస్తూ డజను అందమైన పార్శిల్ ప్యాకెట్లు తెచ్చి డబుల్‌కాట్ నిండా పరచిపెట్టాడు కృష్ణమూర్తి. అంతకు ముందే నిద్రలేచిన సరళ ముఖం కడుక్కొని వచ్చి వాటిని చూసి కంపెనీనుంచి భర్త ముందుగా వచ్చినందుకు మురిసిపోతూ “ఇవ్వి?” అంది.

“నీకే!” అన్నాడు.

ఒక పార్శిల్ విప్పింది. కోతి బొమ్మ. ఊలుది. తోక మూరెడు. ముందు కాళ్ళు పొడుగు,వెనక్కాళ్లు కురచ. ఇటువంటి బొమ్మే తాని అత్తవారింటికి వ తెచ్చుకుంది. రెండు ముంగాళ్ళు మెడచుట్టూ, తోక నడుం చుట్టూ చుట్టుకుని కోతిని వీపుమీద కూర్చోబెడితే, అది ముఖంపెట్టి ముద్దిస్తూ ఉంది.

మిగతా పార్శిళ్ళు విప్పింది సరళ. టెడ్డీబేర్! ఎంత బాగుందో! స్కూలుకెళ్ళే పాప గాజుబొమ్మ! ముచ్చటగా వుంది. పల్లెపడుచు! ప్లాస్టిక్ బొమ్మ! కళ్లెంత చక్కగా ఆర్చుతుంది! మూస్తూ తెరుస్తూ వుంది.

ఆనందంగా వాటి వంక చూస్తూ –

“ఎందుకివన్నీ?”     “నువ్వాడుకోవడానికి!”     “నువ్వున్నప్పుడు నీతోనే ఆడుకోవడం!”     “నేను కంపెనీకి పోయినప్పుడు?”

“మీ బొమ్మలతో ఆడుకుంటా! అయినా ఒకేసారి ఇన్ని బొమ్మలెందుకు” అంటూ షోకేసులో సర్దింది.

 

* * *

 

ఆ రోజు సాయంకాలం త్వరగా వచ్చి మంచమంతా పాకెట్లు పెట్టి సరళను నిద్రలేపాడు కృష్ణమూర్తి.

ఆమె కళ్లు నులుముకుంటూ, ఆవులిస్తూ చీర సరిచేసుకొంటూ, తల సవరించుకొంటూ, కళ్ళూ మూస్తూ తెరుస్తూ భర్తను “వచ్చేశారా” అంటూ వాటేసుకొంది. ఆమెను వాష్‌బేసిన్ దగ్గరకు తీసుకుపోయి, ముఖం కడిగి, తల జుట్టు వెనక్కు పెట్టి టవలు ముఖం, చేతులుల్, మెడ తుడిచి, మంచం దగ్గరకు తీసుకువచ్చి, వాటిని చూపించాడు కృష్ణమూర్తి.

“ఏవిటీ?” అంది.

 

“చూడు” అన్నాడు.

విప్పసాగింది. మైసూర్‌పాక్! మెత్తగా తన పెదవిలాగా వుంది. కొరికింది. కొరికించింది. హల్వా! బుగ్గలాగా వుంది. రుచి చూసింది. చూపించింది.

బందరు లడ్డు! జవజవలాడుతూ వుంది. పట్టుకొంటే పగులుతుందా అనిపించింది. పగిలి కిందపడకుండా కొరికింది. భర్తకు ఎంగిలి తినిపించింది.

“ఇంక తినలేను” అంది.

“తినాల్సిందే” అన్నాడు.     “కష్టం బాబూ!”     “ఇద్దరం కష్టపడదాం!”     అన్ని పాకెట్లు విప్పింది. మిగతావి రుచి కూడా చూడలేదు. “ఇన్నా? ఒకేసారా? ముఖం మొత్తదా?” అంది.     “నీకు స్వీట్లు ఇష్టం కదా!”     “ఇష్టమని – ఇన్నా?”     “రోజంతా తింటూ వుండు”    “కడుపా? చెరువా?” అనడిగి “కడుఫే!” అని నవ్వింది.     ఆమె నవ్వుకి వంత నవ్వాడు కృష్ణమూర్తి.

* * *

 

ఆరోజు మధ్యాహ్నమే ఇంటికొచ్చాడు కృష్ణమూర్తి. వస్తూ అయిదుగురు ఆడవాళ్ళను తీసుకొచ్చాడు. ఒక్కక్కరు ఒక్కొక్క గోనెసంచి తెచ్చారు. ప్రతి గోనె తడిగా వుంది. నీటిబొట్లు పడుతున్నాయి.

ఆడవాళ్ళు గోనెసంచులు బెడ్‌రూంలో దించి నిలబడ్డారు. భోజనం చేసి ఆవులిస్తూ పడుకోబోతున్న సరళ భర్తను, బస్తాలనూ, స్త్రీలనూ చూసి అడిగింది.

“ఏమిటి?”         “చూడు!” అన్నాడు.         ఆడవాళ్ళు బస్తాల్లో ఉన్నవాటిని అయిదు సిరిచాపల మీద కుమ్మరించి వాటి ముందు కూర్చున్నారు.

మల్లెలు! బొండుమల్లెలు! సన్నజాజులు! గులాబీలు! సరళ చప్పున మల్లెలు దోసిళ్ళతో ఎత్తుకుంది. బొండుమల్లెలు గుండెలకు హత్తుకుంది. సన్నజాజులు చెక్కిళ్ళకు తాకించుకుంది. కనకాంబరాలు స్వర్ణాంబరాలు లాగ తీసి చూసింది. గులాబీలు చూస్తూ కూర్చుండిపోయింది. కృష్ణమూర్తి ఆమెనే చూస్తున్నాడు. పూలు తెచ్చిన స్త్రీలు పూలు మాలలు కడుతున్నారు. చెండులు, దండలు కడుతున్నారు.

“ఏం ఫంక్షనూ?” దీర్ఘం తీసింది.

“శ్రీమతి సంతోష ఫంక్షన్”

 

“అంటే?”

“అవన్నీ నీకే!”         “నాకా?”         “ఊ నీకే!”         “ఇన్నా?”         “అన్నీను!”         “ఏం చేసుకోను”         “తల్లో పెట్టుకో! మెళ్ళో వేసుకో! మంచం మీద పరుచుకో! దేవుళ్ళకు వేసుకో! ఇంకా మిగిలితే-”         “ఆ మిగిలితే?”         “ఫ్రిజ్‌లో పెట్టుకో”         “పూలు – ఫ్రిజ్‌లోనా?”

సరళ నవ్వుతూ వుంది. ఎంత చక్కగానో నవ్వింది. పూలులాంటి నవ్వు. పరిమళం లాంటి నవ్వు. పరవశం లాంటి నవ్వు. గదంతా వ్యాపించిన నవ్వు. సరళ కరిగిపోతున్న మంచుముక్కలా, మంచి ముత్యంలా, మధుర దృశ్యంలా నిలబడింది. కృష్ణమూర్తి తనివితీరా సరళ సుందర రూపం చూస్తూ పులకించిపోయాడు.

* * *

 

కృష్ణమూర్తి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. కోట్ల వ్యాపారం. కోటానుకోట్లు లాభం. లెక్క తెలియనంత ఆస్తి. పిచ్చిపట్టే సంపద. ఏం చేసుకొంటారు?         ఎం.బి.ఏ. తర్వాత వ్యాపారం చూసుకుంటూ క్షణం తీరిక లేకుండా వుంటున్నాడు. పెళ్ళయి సంవత్సరమైనా ఇంటి ముఖం చూడకుండా కంపెనీ పనులతో తలమునకలై వుండేవాడు కృష్ణమూర్తి. తల్లిదండ్రులకు కొడుకులో వచ్చిన ఈ మార్పు అర్థం కావటం లేదు.

* * *

 

        మర్నాడు కంపెనీకి పోయి గంట కూడా ఉండకుండా ఇంటికి తిరిగి వచ్చాడు కృష్ణమూర్తి. అతడి కారుతో పాటు వ్యాను వచ్చింది. వ్యానులోంచి నలుగురు సేల్స్మేన్లు ఇద్దరు స్త్రీలు వచ్చారు. వ్యాన్లోని ప్యాకెట్లు దించి ఇంట్లోకి తెచ్చి ఒక్కొక్కటిగా పడకగదిలో చాపలమీద పరిచారు. 

            అన్నీ చీరలు! జాకెట్ గుడ్డముక్కలు! 

                సరళ చూసి మురిసిపోయింది. చీరలు విప్పింది. కొన్ని తీసి పక్కన పెట్టింది. కొన్ని ఎదమీద వేసుకుని చూసింది. మంచిరంగులు. చాలా వెరైటీలు. 

       “ఎవరికి?” 

 

       “నీకే!” 

 

       “బంధువులకు పంచాలా?” 

 

       “నువ్వే కట్టుకోవాలి!” 

 

       “అన్నీనా?” 

 

       “అన్నీ!” 

 

       “కొన్ని సెలక్ట్ చేసుకొంటాను!” 

 

       “అన్నీ సెలక్ట్ చేశాను!” 

 

       “ఇన్నా!” 

 

       “ఆ! ఒక్కొక్క రంగు, ఒక్కొక్క వెరైటీ చొప్పున తెచ్చాను. ఏ రంగు, ఏ వెరైటీ రెండోది ఉండదు” 

 

       “మీ టేస్ట్ గ్రేట్”

 

“థాంక్స్!”

“రంగులు బాగున్నాయి”        “థాంక్స్!”        “పల్లు ఎక్సలెంట్!”        “థాంక్స్!”        “వెరైటీలు సుపర్బ్”        “థాంక్స్!”        “అసలు మీరే నచ్చారు”        “థాంక్స్!”        “వీళ్ళు?”        “సేల్స్ మేన్లు!” వాళ్ళు వెళ్ళిపోయారు.        “వీళ్ళు?”        “టైలర్స్!” వాళ్ళు నిలబడిపోయారు.        “కుట్టుమిషన్లు తెచ్చుకొన్నారు”        “ఎందుకు?”        “ఇక్కడే కుడతారు. ఇష్టమైనట్లుగా కుట్టించుకో!”        “ఎప్పుడు వేసుకోవాలి?”        “రోజూ!”        “ఎన్ని?”        “రోజుకు నాలుగైదు!”        “సరా?”        “సరే!”        “ఒకదానిమీద మరొకటి – ఒక చీరమీద మరొకటి, అంతేనా?”        “సరే!”        “ఎందుకూ?”        “సంతోషం కోసం!”        “నువ్వు కట్టుకోవాలి సరళా నా ఆనందం కోసం”        “నాకోసం కాదా?”        “నీకోసం కూడా – నీకోసమే! నీకే!”

 

* * *

 

మర్నాడు పొద్దుపోయేదాకా కృష్ణమూర్తి ఇంటికి రాలేదు. ఆత్రంగా ఎదురుచూస్తున్న సరళ అతడి కారు హారను వినబడగానే గబగబ మెట్లుదిగి కృష్ణమూర్తికి ఎదురు వెళ్ళి పోర్టికోలో దిగుతున్న అతని బ్రీఫ్‌కేసు తీసుకుంది.         “ఇవాళ ఏమీతేలేదా?”         “రా”         “రా”         “ఎందుకింతసేపు?”         “రా”         వాళ్ళు బెడ్‌రూంలో చేరగానే జ్యూయలరీ షాపు వాళ్ళు నలుగురు మోయగలిగినన్ని బాక్సులు తెచ్చి మంచమ్మీద విడివిడిగా పెట్టారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఏమిటివన్నీ అన్నట్లు నొసలు ఎగరేసింది.

 

“నగలు!” అన్నాడు.         చకచకా విప్పింది. ఒక్కొక్కటీ చూసింది. అన్నీ మంచం మీద పేర్చి తదేకంగా పరికించింది. బంగారు ఆభరణాలు. వజ్రాలు పొదిగినవి. ముత్యాలు, రత్నాలు కలిపి చేసినవి – మెడకు, ముక్కుకు, చెవికి, తలకు, చేతులకు, నడుముకు అలంకరించుకొనే ఆభరణాలు. అవన్నీ వేసుకొంటే అందమైన సరళ ఒంగిపోయి గూనిది అవుతుంది. వాటి బరువు గ్రాముల్లో కానీ, వాటి విలువ వేలల్లో కానీ చెప్పడం కుదరదు.         “ఎన్ని కేజీలు?”         “ఇంచుమించుగా వంద!”         నగలు వేసి చూసుకోసాగింది సరళ. మెడ – అద్దం, ముక్కు – అద్దం, చెవి – అద్దం, తల – అద్దం, మూతి – అద్దం, శరీరమంతా – అద్దం, ఆభరణాలన్నీ – అద్దం, వేసుకొని, చూసుకొని, అద్దంలో చూసుకుని, అటు తిరిగి, ఇటు తిరిగి, అలసి పోయి, మంచం మీద కూలబడి రొప్పడం మొదలు పెట్టింది సరళ.

 

“ఎందుకండీ ఇన్ని?”         “అలంకరించుకో”         “ఎన్నని?”         “కొన్ని కొన్ని!”         “ఎప్పుడెప్పుడు?”         “బుద్ధి పుట్టినప్పుడు”         “ఇన్ని నగలతో వీధిలోకి రాలేను”         “ఇంట్లోనే ఉండు”         “ఇంట్లో ఉండటానికి ఇన్ని నగలా?”              “ఇష్టమైతే వేసుకో, లేకుంటే దాచుకో”         “దాయడానికి నగలెందుకు?”         “వేసుకో!”         “ఎన్నని?”         “అన్నీ!”         “ఎప్పుడు?”         “ఎల్లప్పుడూ!”         “నేనూ మనిషినే!”         “దేవతవు!”

* * *

 

సరళ పొద్దున్నే లేస్తుంది. రోజుకొకలా చీర కట్టుకుంటుంది. బుద్ధి పుట్టినన్ని నగలు అలంకన్రించుకుని భర్తను ఆదరంగా కంపెనీకి పంపుతుంది. వెంటనే నగలు తీసివేస్తుంది. చీర మారుస్తుంది. సుఖంగా ఉండే నూలు చీర కట్టుకొంటుంది.

సాయంకాలం భర్త వచ్చే సమయానికి పట్టుచీర కట్టుకొంటుంది. అలమారాడు నగలు పెట్టుకొంటుంది. తల నిండా పూలు పెట్టుకొంటుంది. ఇంటినిండా స్వీట్లు వుంచుతుంది. మంచం దగ్గర పండ్లు వుంచుతుంది. పడకగది నిండా బొమ్మలు షోకేసులో ఉంచి, గోడలమీద విలువైన పెయింటింగులు అలంకరిస్తుంది.         వీళ్ళిద్దరి పరిస్థితి చూసి కృష్ణమూర్తి తల్లిదండ్రులు శుభవార్త చెబుతారని ఎదురుచూశారు. ఎంతకీ చెప్పడం లేదు. వాళ్ళు ఉండబట్టలేక అడగనే అడిగారు. కోడలు సిగ్గుపడింది. సిగ్గుపడింది కాబట్టి శుభమే అనుకొన్నారు.         “పిల్లల తల్లివి కాబోతున్నదానివి మెట్ల మీద ఎగురుతూ, దూకుతూ దిగొద్దు, ఎక్కొద్దు” అన్నారు.         నవ్వింది. ఐనా అలాగే మెట్లెక్కుతూ దిగుతూ వుంది.         “అదేం?” అంటే         “అదేం లేదు” అంది.         “అదేం?” అంటే         “అదేమో” అంది.         “పెళ్ళయి సంవత్సరం దాటింది. ఇంకా అదేమో అంటావేంటి?” అని అత్తామామలు సరళని నిలదీశారు. అప్పుడే వచ్చాడు కృష్ణమూర్తి.         “ఇంతదాకా నన్నుగురించి ఆయన ఆలోచించలేదు. పదిరోజుల్నుంచి ఇలా నన్ను ఆనందింపజేస్తున్నారు. పాపం ఆయనకు తీరుబడేది?” అంది.

అత్తా మామలే కాదు, భర్త కూడా బిత్తర పోయారు.

 

* * *

 

        ఆ రోజు నుంచి కృష్ణమూర్తి కంపెనీకి పోలేదు. సరళ చెంగు వదల్లేదు. రాత్రంతా గదిలో మాటలు, పాటలు. నిద్రలేదు. పగలు భర్త బయటికి పోయినప్పుడే సరళకు నిద్ర. పగటి నిద్రకోసం అతనౌఅ ఆఫీసుకు పోతున్నాడు. కంపెనీలో ఎమ్.డి నిద్రపోవడం ఏమిటని వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు.

చీరలు, నగలు సింగారించుకొని సరళ, భర్తతో వీధిలోకి పోతుంది. అవీ ఇవీ కొనే నెపంతో రోడ్లన్నీ నడచీ, ఎక్కీ దిగీ అలిసిపోయి ఇల్లు చేరుతున్నారు. అది లాకీగా లేదని మానేసి, ఇద్దరూ కార్లో పోయి చైనీస్ హోటల్లో తిని, తేనుస్తూ ఇంటికి చేరి ఆయాసపడుతున్నారు. అదీ కాదంటే ఫష్టు షో లేదా సెకండ్‌షో సినిమా చూసి ఇంటికొచ్చి పడుకుంటున్నారు.

ఇవేవీ బాగాలేవని ఇంటిపట్టునే వుండి సరళకు తినిపిస్తూ పళ్ళరసాలు తాగిస్తూ వున్నాడు కృష్ణమూర్తి.         “నా ఆరోగ్యం బాగుంది” అంది సరళ.         “నువ్వు సుఖంగా ఉండాలి” అన్నాడు కృష్ణమూర్తి.         పెళ్ళయిన మొదటిరోజుల్లో హనీమూన్‌కు పొమ్మంటే కంపెనీ పనుల తొందర వల్ల భార్యను తీసుకుపోలేక పోయాడు, కృష్ణమూర్తి. అందుకు బదులుగా హనీమూన్‌కు పోదామని భార్యతో అంటే “ఇప్పుడొద్దు బాగుండదు” అంది. సరే తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు అని తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భద్రాచలం తీసుకెళ్ళి తిప్పి తీసుకువచ్చాడు.         పూరి, కాశీ, ప్రయాగ, హరిద్వార్, బదరీనాథ్,కేదారనాథ్ చూపించి తీసుకొచ్చాడు.         అంతటితో ఆగకుండా సింగపూర్, మలేషియా, బర్మా, సిలోన్, థాయ్‌లాండ్, రష్యా, చైనా, కెనెడా, అమెరికా, ఆస్ట్రేలియా తిప్పి తీసుకువచ్చాడు.         “ఇన్ని ప్రయాణాలు, ఇంత వేగంగా, ఇంత దూరం, ఇన్ని విధాలుగా, ఇంత నిర్విరామంగా నేను చేయలేను”         అలసి పోయి ఇంటికి వచ్చారు. మర్నాడు పొద్దున్నే భార్యను చూసి బిత్తరపోయాడు కృష్ణమూర్తి.

 

“ఇన్ని చీరలు నేను కట్టను!”         “ఏం?”         “ఇన్ని నగలు నేను పెట్టుకోను”         “అంటే”         “ఇన్ని స్వీట్లు నేను తినలేను. ఇంత ప్రయాణం నేను చేయలేను. ఇన్ని సినిమాలు నేను చూడలేను. ఇన్ని బొమ్మలతో నేను ఆడుకోలేను. ఇన్ని పేయింటింగులు నేను గోళ్ళమీద పెట్టలేను. ఇంత మెలకువ నాకు వద్దు. నేను నిద్రపోవాలి”         కృష్ణమూర్తి బిత్తర పోయి చూశాడు.

 

“ఒక బొమ్మ ఇస్తే ఆనందం. అన్ని బొమ్మలు ఒకేసారి ఎందుకు? ఒక స్వీటు తినిపిస్తే ముచ్చట. అన్నా? అజీర్ణం కాదూ! ఒక పూవో, మాలో తెచ్చి తలలో పెడితే సంతోషం. గోతాలకొద్దీ పూలా? తృప్తిగా ఒక చీర! ఒక జాకెట్టు సంతోషం. అన్నా? వెగటు కాదూ! ఒక నగ – ప్రేమ. ఒక ఊరు, ఒక తీర్థం, ఒక క్షేత్రం. సంతృప్తి! అన్ని చోట్లా! అంత ప్రయాణమా? అంత తిరుగుడా! అలిసిపోమూ! విసుగు కాదూ! పిచ్చి పట్టదూ! నాకేమీ వద్దు!”

 

“మరేం కావాలి?”

“నా ఇష్టం వచ్చినట్లు పదిరోజులు నన్నిట్లా వుండనివ్వండి. పాటలు వద్దు. సినిమాలు వద్దు. చీరలొద్దు. నగలొద్దు. పదిరోజులు నిద్రపోనివ్వండి. మీరు నా ప్రక్కనే వుండండి.”         “తిండి, తీర్థం?”

“నాకేమీ ఇవ్వద్దు. మీరేమీ కల్పించుకోవద్దు. నా ఇష్టం వచ్చినట్లు నన్ను ఉండనివ్వండి”

 

“మరి నేను?”         “నా వెంట వుండండి. నేను కోరినట్లు నేను చెప్పినట్లు చేయండి. నాకు నిశ్శబ్దం, ప్రశాంతత, ఏకాంతం కావాలి. నాకు శూన్యం కావాలి. ఏమీ వద్దు. ఏమీ లేని తనం కావాలి. ఏమీ లేకుండా వుండాలి”         కృష్ణమూర్తి భయం భయంగా చూశాడు.

సరళ ఏమీ తినలేదు. తాగలేదు. పాటల్లేవు. మాటల్లేవు. శబ్దం లేదు. శూన్యం. నిద్రపోయింది.

 

రెండు రోజులు మూసిన కన్ను తెరవకుండా పడుకున్న మనిషి లెవకుండా నిద్రపోయింది సరళ. బుద్ధి పుట్టినప్పుడు లేచి రెండు బిస్కెట్లు తిని, మీళ్ళుతాగి మళ్ళీ పడక. మళ్ళీ నిద్ర. ఏ సుఖాలూ కోరుకోవడంలేదు. ఏ సంతోషమూ పొందడం లేదు. ఏ చీరలు, ఏ నగలు, ఏ పూలూ ఏమీ వద్దు.         నిముషంలో పళ్ళు తోముకుంటుంది. అర్థ నిమిషంలో నీళ్ళు పోసుకొంటుంది. పావు నిమిషంలో మంచం మీద పడుతుంది. మరి రోజంతా లేవదు. లేపినా లేవదు. కూర్చోబెట్టినా కూర్చోదు. బట్టలు మార్చుకోదు. నూనె పెట్టుకోదు. ముఖం కడుక్కోదు. పౌడరు రాసుకోదు. అలంకరించుకోదు. కూర్చోదు. పడుకొనే వుంటుంది. నిద్రపోతూనే వుంటుంది.         “ఇది ఏమైనా జబ్బా?” కృష్ణమూర్తి భయం.         ఫామిలీ లేడీ డాక్టర్ని పిలిపించారు. వచ్చి పరీక్షించింది. అంతా నార్మల్, ఏమీ లేదని వెళ్ళిపోయింది.         స్త్రీల స్పెషలిస్టును పిలిపించాడు. పరీక్షలు అన్నీ చేసి “ఆమెను స్వేచ్చగా ఉండనివ్వండి” అంది.

సైకియాట్రిస్టును రప్పించి పరీక్షలు చేయించాడు. సమస్య ఏమీ లేదని వెళ్ళిపోయాడు.

 

మళ్ళీ ఫ్యామిలీ లేడీ డాక్టరును అర్థించాడు. ఆమె వచ్చి చూసి, “కొందరంతే!” అని అంది.

కృష్ణమూర్తికి కోపం వస్తూ ఉంది. తల్లి దండ్రులు కూడా సరళ గురించి పట్టించుకోవడం లేదు. రెండు వారాల తర్వాత ఒక రోజు నిద్ర లేచి భర్తను చూస్తూ “దగ్గరే ఉన్నారు కదా! అంతే చాలు” అంది.         కృష్ణమూర్తి వొళ్ళు మండింది. “ఎంత చాలు?”         సరళ నవ్వింది. సరళంగా, సరసంగా నవ్వింది.         ఉండబట్టలేక అడిగాడు. “ఎందుకిట్లా ఉన్నావు?”

ఆమె బదులుచెప్పకుండా “మీరు ఎందుకట్లా ఉన్నారు?” అని ప్రశ్నించింది.

 

“ఏమీంది నీకు?”

“మీకేమైంది?”         “ఈ రెండు వారాలు నన్నేడిపించావు”         “నాలుగు నెలల నుంచి మీరు నన్నేడిపించారు”         కృష్ణమూర్తి శూన్యంగా సరళ వైపు చూశాడు.         “పెళ్ళయిన సంవత్సరమంతా మీరు బాగానే వున్నారు. ఈ నాలుగు నేలలనుంచి మీరెందుకింత గందరగోళంగా ప్రవర్తించారు?” అడిగింది.         అతను ఆలోచించుకోసాగాడు.         “ఈ మధ్య గృహహింస చట్టం వచ్చింది. తెల్సా?”         “తెలుసు. అందుకే సంతోష పెడదామని”         “అంతకు ముందు సంవత్సరమంతా?”         “సుఖంగా లేవు!”         “అంటే?”         “కష్టంగా వున్నావు!”         “అంటే?”         “నేను నిన్ను పట్టించుకునే వాణ్ణి కాదు. కంపెనీ పనులతో తలబద్దలు కొట్టుకొంటూ, నువ్వు వున్నా లేనట్లుగానే నా తలనొప్పులు నేను పడుతూ నిన్ను అశ్రద్ధ చేస్తూ వచ్చాను. నీపట్ల తగిన శ్రద్ధ చూపించక పోవడం గృహహింసే! నువ్వు నాది గృహహింస అని పోలీసులకు చెబితే, నన్ను వాళ్ళు అరెస్టు చేయవచ్చు”         “అందుకని?”

“నీకిష్టమని బొమ్మలు, స్వీట్లు, పూలు, బట్టలు, నగలు కొని ఇచ్చాను. పుణ్యక్షేత్రాలు, తీర్థాలు తీసుకుపోయాను. దేశవిదేశాలు అన్నీ తిప్పి చూపించాను. నీకు కావలసినవన్నీ సమకూర్చాను. కొట్టక, తిట్టక వేధించక కట్నం డబ్బు ఇంకా తెమ్మని సతాయించకపోతే గృహహింస లేనట్లే! కిరసనాయిలు పోసి కాల్చి చంపకపోతే గృహహింస లేనట్లే కదా!” అన్నాడు కృష్ణమూర్తి. “కష్టాలు తీరకపోవడమే కాదు, సుఖాలు, సరదాలు కొత్తకోడలికి ముఖ్యం. అవి లేకపోతే గృహహింసే!” అన్నాడు.

 

“పెళ్ళయిన సంవత్సరమంతా నేను సుఖంగానే వున్నాను. ఇటీవలే నాకు గృహహింస ప్రారంభమైంది. ఇప్పుడు పోలీసులకు రిపోర్టు ఇవ్వాలి” అంది.

“అయ్యో అదేమిటి సరళా?”         “మీరు నాకు ఏమి ఇస్తే సుఖంగా వుంటానని అనుకున్నారో అవన్నీ ఇచ్చారు. అవి నాకు కావాలో వద్దో మీరు ఆలోచించలేదు. వాటిని నేను భరించలేకపోయాను. భరించలేకపోతే బాధే! బాధ కలిగితే హింసే! తేనె స్పూనుతో చప్పరిస్తే రుచి. తేనెతో స్నానం రోత! నాకు మీ ప్రేమ రోతగా మారింది. మీరు పెట్టిన ఈ గృహహింస మీద పోలీసులకు రిపోర్టు ఇస్తాను”         “వద్దు సరళా! నువ్వేం చేయమంటే అది చేస్తాను” కృష్ణమూర్తి అదోలా నవ్వాడు.         సరళ పకపకా నవ్వింది.         అత్తా మామలు పైకి వచ్చి “సరళా నీ ఆరోగ్యం భద్రం! డాక్టర్లు అందరిదీ అదేమాట” అన్నారు.         “మెట్లమీద ఎగురుతూ, దూకుతూ ఎక్కనూ, దిగనూ సరేనా?” అంది నవ్వుతూ.         “సరేగాని, అదేకదా?” అడిగారు వాళ్ళు.         “అదే!” అంది సరళ.

“అదే అంటే?” కృష్ణమూర్తి అడిగాడు. అదేమిటో తల్లిదండ్రులుకానీ, భార్యకానీ చెప్పలేదు. చెప్పమని భార్యను బతిమాలుతున్నాడు కృష్ణమూర్తి.

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)