అజాతశత్రువు- తండ్రి పాలిట మృత్యువు !

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

 

 

 

 

ఏళ్ళు గడుస్తున్నాయి…

మల్లబంధుల కొడుక్కి ఇప్పుడు అయిదేళ్లు. పసనేది కొడుక్కి కూడా. అతనిపేరు విదూదభుడు.

దీర్ఘచరాయణుడు పదిహేనేళ్ళ వాడయ్యాడు.

మల్లిక జ్ఞాపకంగా మిగిలిన కొడుకూ, పసనేది స్నేహమూ, మేనల్లుడి అభివృద్ధీ మల్లబంధులకు ఒకింత ఓదార్పు అయ్యాయి.

అయితే మల్లబంధుల-పసనేదిల స్నేహగీతంలో ఎక్కడో ఏవో అపశ్రుతులు చొరబడుతున్నట్టున్నాయి.

అవెలాంటివో చెప్పుకునే ముందు మనం ఒకసారి మగధకు వెడదాం.

           ***

మగధను పాలిస్తున్న బింబిసారుడికి ఒక కొడుకు. పేరు, అజాతశత్రు. అతనికిప్పుడు ఇరవయ్యేళ్లు. అజాతశత్రు కొంతకాలంగా అసహనంగా ఉంటున్నాడు. తండ్రి మీద కోపం ముంచుకొస్తోంది. కోపం ద్వేషంగా మారుతోంది.

‘నీ తండ్రికి నీ తాత పదిహేనేళ్ళకే సింహాసనం అప్పగించి తప్పుకున్నాడు. నీకు ఇరవయ్యేళ్లు వచ్చాయి. అయిదేళ్లు ఆలస్యమైపోయింది’ అని వస్సకారుడు తన చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాడు. వస్సకారుడు తన ఈడువాడే. బ్రాహ్మణుడు. మంచి తెలివితేటలు ఉన్నవాడు.

అతనంటున్నదీ నిజమే. తన మేనమామ పసనేదికి కూడా ఆయన తండ్రి పదిహేనేళ్ళకే రాజ్యం అప్పగించాడు. అదీగాక, తమ రాజ్యం ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. అక్కడ  మేనమామ మాత్రం తన రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. తన తండ్రి బింబిసారుడు నిమ్మకు నీరెత్తినట్టు కాలం దొర్లిస్తున్నాడు.

ఈ పరిస్థితిని ఊహించుకుంటే తనకి ఆగ్రహమే కాక ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఎందుకంటే, రాజ్యవిస్తరణ అవకాశాలు తన మేనమామకి కంటే తమకే ఎక్కువ ఉన్నాయి. తమ అధీనంలో కావలసినంత లోహ సంపద ఉంది. వస్సకారుడు తనతో రోజూ ఇదే చర్చ. నీ తండ్రి వల్ల ఏమీ కాదు, ఆయన అడ్డు తొలగించుకో, నువ్వు చేతుల్లోకి తీసుకో అని చెబుతున్నాడు. నువ్వు చేయవలసింది చాలా ఉంది, లిచ్ఛవులు, మల్లులు కొరకాని కొయ్యలుగా ఉన్నారు, వారిని దారికి తెచ్చుకోనిదే, రాజ్యవిస్తరణ మాట దేవుడెరుగు, ఉన్న రాజ్యం కూడా ఊడిపోతుందని చెబుతున్నాడు. అతడు చెప్పాడని కాదు కానీ తనకూ అలానే అనిపిస్తోంది.  ఇలాగే ఊరుకుంటే, ఎంత మేనమామ అయితే మాత్రం… అతడు రేపు మగధ మీద పడడని ఎలా చెప్పగలం?!

ఆలోచించిన కొద్దీ ఏదో ఒకటి చేసి తీరవలసిందే నన్న తొందర అజాతశత్రులో పెరిగిపోతోంది. ఏం చేయాలో కూడా కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే, అందుకు మనసు రాయి చేసుకోవాలి…

చేసుకున్నాడు. వస్సకారుని సాయంతో అంతఃపురకుట్ర అమలు జరిగిపోయింది. తండ్రిని చెరలో పెట్టాడు. అంతమాత్రాన సరిపోదు. ఆయన ప్రాణాలతో ఉన్నంతకాలం తన అధికారానికి సవాలే. కనుక ఆయనకు తిండి పెట్టకుండా మాడ్చమని ఆదేశించాడు. ఆకలి మృత్యువుగా మారి కొన్నాళ్ళకు బింబిసారుని కాటేసింది.

      ***

bimbisara=buddha

మేనల్లుడి ఘాతుకం గురించి పసనేదికి తెలిసింది. ఆగ్రహమూ, బాధతోపాటు రకరకాల ఆలోచనలు అతన్ని ముసురుకున్నాయి. బింబిసారుడు తనకు బావా, మిత్రుడూ కూడా. అతని మరణం పసనేదిని నొప్పించింది. మేనల్లుడు రాజ్యదాహంతో తండ్రినే చెరపట్టి, ఆకలిచావుకు అప్పగించినప్పుడు, తనను మాత్రం ఎందుకు విడిచిపెడతాడు? అదీగాక తన కొడుకు విదూదభుడికి కూడా పదేళ్ళు దాటుతున్నాయి. రేపు అతడు కూడా అజాతశత్రును ఆదర్శంగా తీసుకుంటే?! కొడుకు విషయంలో తను ముందే జాగ్రత్తపడాలి. అంతకన్నా ముందు తను మేనల్లుడి నుంచి ఎదురుకాగల ముప్పును కాచుకోవాలి!

పసనేదిలోని ఈ రాజకీయచింతనతో, బావ మరణం కలిగించిన భావోద్వేగాలూ పోటీ పడుతున్నాయి. తను సోదరికి అరణంగా కాశీ దగ్గరలోని ఓ గ్రామాన్ని ఇచ్చాడు. మేనల్లుడు ఇంత చేశాక ఆ గ్రామాన్ని మగధకు విడిచిపెట్టడంలో అర్థం లేదు. దానిని తిరిగి తను స్వాధీనం చేసుకోవాలి. అది గ్రామమైనా చాలా కీలక స్థానంలో ఉంది. ఆ గ్రామం మీంచే కాశీ రేవుకు వెళ్ళాలి. వర్తక వాణిజ్య అవసరాల రీత్యా మగధరాజు దానిని వదలుకోవడం కష్టం. కనుక ఆ వైపునుంచి తీవ్ర ప్రతిఘటనే వస్తుంది. అయినా ఎదుర్కోవలసిందే. తను ఊరుకున్నా అజాతశత్రు ఊరుకోడు. రాజ్యాన్ని స్థిరపరచుకున్నాక తప్పకుండా కోసల మీద పడతాడు. ఎలాగూ ఘర్షణ తప్పనప్పుడు తనే తొలి దెబ్బ తీస్తే?!

అయితే, ఈ క్లిష్ట సమయంలో ఒక లోపం అతని ముందు జడలు విరబోసుకుని కుంగదీస్తోంది. అది, మల్లబంధుల సాయం పొందే అవకాశం లేకపోవడం!

     ***

మల్లిక మరణంతో మల్లబంధుల సగం చచ్చిపోయాడు. దానికితోడు అతనికీ, పసనేదికీ మధ్య దూరమూ పెరుగుతోంది. అందుకు ఇద్దరి వైపునుంచీ కారణాలు ఉన్నాయి.  ఇంకేముంది, మల్లబంధుల ఉనికినీ, పసనేది అతనికి ఇస్తున్న ప్రాధాన్యాన్నీ సహించలేకపోతున్న మిగిలిన వాళ్ళు ఆ కారణాల చిరుమంటకు మరింత నేయి అందించి పెద్దది చేయడం    ప్రారంభించారు. మల్లబంధుల గురించి ఏమనుకుంటున్నావో, అతడు పక్కలో పాము, నీ రాజ్యాన్ని కబళించడానికి చూస్తున్నాడని వాళ్ళు మొదట పసనేదితో అన్నప్పుడు అతను తీసిపారేశాడు. కానీ అదే పనిగా వారు నూరిపోస్తూ ఉండడంతో అనుమాన బీజం నాటుకుని క్రమంగా మొక్కగా ఎదుగడం ప్రారంభించింది. తనపట్ల మల్లబంధుల ప్రవర్తన కూడా అందుకు దోహదం చేసింది. మల్లబంధుల గతంలోలా తనతో మనసు విప్పి మాట్లాడడం లేదు. ముభావంగా, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు.

అది నిజమే. రాను రాను పసనేది ప్రవర్తనలో కూడా మల్లబంధులకు ఏదో తేడా కనిపించడమే అందుకు కారణం. తనను ఇక్కడికి తీసుకు వచ్చే ముందు తెగల స్వాతంత్ర్యాన్ని హరించే ఏ పనీ చేయనని పసనేది మాట ఇచ్చాడు. కానీ అతని ఆలోచనాసరళినీ, జరుపుతున్న కొన్ని సన్నాహాలనూ గమనిస్తున్న కొద్దీ అతడు మాట తప్పుతాడా అన్న అనుమానం బలపడుతోంది.

మొత్తానికి మల్లబంధుల అదృశ్యమయ్యాడు. ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. మల్లిక మరణంతో ఇన్నేళ్లలోనూ మామూలు మనిషి కాలేకపోయిన మల్లబంధుల, జీవితం మీద పూర్తిగా విరక్తి చెంది ఏ అడవులో పట్టి పోయాడని అందరూ అనుకున్నారు.

దీర్ఘచరాయణుడు, మల్లబంధుల కొడుకు మల్ల విక్రముడు ఒకరికొకరు మిగిలారు. మల్ల విక్రముడు అచ్చంగా తండ్రికి ప్రతిరూపం. పసనేది వారిద్దరినీ చేరదీసి వారి ఆలనా పాలనా చూస్తున్నాడు. దీర్ఘచరాయణునిలోని మెరుపును అతను ఎప్పుడో గమనించాడు. అతడి సేవలు రాజ్యానికి అవసరం అనుకుంటున్నాడు. అతనిని మంత్రిని చేసుకోవాలనే ఆలోచన కూడా పసనేదిలో అంకురించింది.

              ***

పసనేది తన సోదరికి ఇచ్చిన అరణపు గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కోసల-మగధల మధ్య యుద్ధాలకు ఆ చర్య నాంది పలికింది. రెండు యుద్ధాలు జరిగాయి. ఆ రెండు యుద్ధాలలోనూ గెలుపు అజాతశత్రుదే అయింది. దాంతో మేనమామను జయించడం సులువే నన్న భరోసా అజాతశత్రుకు చిక్కింది. కనుక ఇప్పుడే కోసలను స్వాధీనం చేసుకోవలసిన తొందరేమీ లేదు.

ఈ లోపల అంతకంటె ముఖ్యమైన సవాలును ఎదుర్కోవాలి. అది లిచ్ఛవుల రూపంలో ఎదురవుతున్న సవాలు. వస్సకారుడు కూడా అదే చెబుతున్నాడు. అయితే లిచ్ఛవులు మొండి ఘటాలు. తేలిగ్గా లొంగరు. వాళ్ళలో ఒక్కొక్కడు ఒక్కొక్క వీరుడు. ఒకరి ప్రాణం తీయడం, తమ ప్రాణం బలిపెట్టడం… రెండూ వారికి ఒక్కలాంటివే. యుద్దం వాళ్ళకు వినోదక్రీడ. పైగా వాళ్ళు మల్లులతో కలసి ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు.

మరో కారణం చేత కూడా, వెంటనే లిచ్ఛవుల పని పట్టవలసిన అవసరం అజాతశత్రుకి కనిపించింది. అది వర్తకుల ఫిర్యాదు. నదీమార్గంలో సరకు రవాణా చేసే వర్తకులు ఇప్పటికే మగధకు ఒకసారి సుంకం చెల్లిస్తున్నారు. మరోవైపు లిచ్ఛవులూ ముక్కుపిండి వారి నుంచి సుంకం వసూలు చేయడం ప్రారంభించారు. ఈ సుంకాల చెల్లింపు తమకు తలకు మించిన భారమవుతోందంటూ వర్తకులు అజాతశత్రుకు మొరపెట్టుకున్నారు. లిచ్ఛవుల అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో అజాతశత్రు తొలి చర్యకు ఉపక్రమించాడు. నదికి దారితీసే మార్గంలో ఒకచోట కోట కట్టించాడు. అక్కడే శోణానది గంగతో కలుస్తుంది. ఆ ప్రదేశమే పాటలీపుత్రం(నేటి పాట్నా)పేరుతో మగధకు భవిష్యరాజధాని కాబోతోంది.

లిచ్ఛవులు కానీ మల్లులు కానీ అంతా తేలిగ్గా లొంగరన్న మాట నిజమే. అయితే ఒక వేరుపురుగు అప్పటికే ఆ తెగలను లోపలినుంచి తొలచడం ప్రారంభించింది. అది వ్యక్తిగత ఆస్తి వ్యామోహం. అది తెగ కట్టుబాటును, సమష్టి స్వభావాన్ని క్రమంగా సడలింపజేస్తోంది. వస్సకారుడు దీనిని కనిపెట్టాడు. నీ కత్తికి ఎక్కువ పనిపెట్టకుండా నేను అటువైపునుంచి నరుక్కు వస్తాను, నాకు విడిచిపెట్టు అని అజాతశత్రుతో అన్నాడు.

వస్సకారుడు లిచ్ఛవీ జనంలోకి వెళ్లాడు. మగధరాజు తనను అవమానించి తన్ని తగలేశాడని వారికి నమ్మబలికాడు. వాళ్ళ సానుభూతినీ, విశ్వాసాన్నీ పొందాడు. క్రమంగా తెగముఖ్యుల్లో ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి, వాళ్ళ ఐకమత్యాన్ని చెరచడం ప్రారంభించాడు. తెగల సభ(అసెంబ్లీ) పనిచేయడం ఆగిపోయింది. లిచ్ఛవుల అనైక్యత అజాతశత్రుకు రాచబాట పరిచింది. అతడు అవలీలగా వైశాలిని ఆక్రమించుకున్నాడు. మల్ల సమాఖ్యలను కూడా ఒక పద్ధతిగా ధ్వంసం చేసే పని అదే సమయంలో మొదలైంది. అయితే, మల్ల కేంద్రాలు పావ, కుశినార మాత్రం అంత తేలిగ్గా పట్టుబడలేదు.

     ***

విదూదభుడికి, మల్లవిక్రముడికి ఇరవయ్యేళ్లు దాటాయి. ముప్పయ్యేళ్లు దాటిన దీర్ఘచరాయణుడు మంత్రాంగంలో పసనేదికి కలసివస్తున్నాడు. మేనల్లుడు అజాతశత్రు తన తండ్రిని చెరబట్టి, తిండి పెట్టకుండా మాడ్చి చంపిన సంగతి అప్పటినుంచీ పసనేది ఆలోచనల్లో అలంగం తిరుగుతూనే ఉంది. నీ కొడుకు విషయంలో జాగ్రత్త పడమని చెబుతూనే ఉంది. దీర్ఘచరాయణుడితో ఆలోచించిన మీదట ఏం చేయాలో స్పష్టత వచ్చింది. విదూదభుని సేనానిగా నియమించాడు. అప్పటినుంచీ అతనికి విదూదభ సేనాపతి అనే పేరు వచ్చింది.

విదూదభుని సేనానిగా నియమించినా పసనేది  కొడుకును ఓ కంట కనిపెట్టుకునే ఉంటున్నాడు. ఎందుకంటే, అతని ప్రవర్తన తను కోరుకున్నట్టు లేదు. తన అనుమానాలను తొలగించేబదులు పెంచుతోంది. అతనిలో తన లక్షణాలకన్నా ఎక్కువగా అజాతశత్రు పోలికలు కనిపిస్తున్నాయి. పగ, ప్రతీకారధోరణి, రాజ్యదాహం, విచక్షణా రాహిత్యం, దుడుకుతనం, తెగలపట్ల చిన్నచూపు, ద్వేషం వ్యక్తమవుతున్నాయి. చిన్నప్పటినుంచీ పరిచయం వల్ల కూడా కావచ్చు, దీర్ఘచరాయణుడితో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే, తను దీర్ఘచరాయణుని అనుమానించడానికి ఎలాంటి కారణమూ లేదు. తనపట్ల అతని ప్రవర్తనలో ఎలాంటి అవిధేయత కానీ, కుటిలబుద్ధి కానీ కనిపించడం లేదు. ఏదేమైనా నిరంతరం అప్రమత్తంగా ఉండడం మినహా తను చేయగలిగింది ఏమీలేదు.

ప్రత్యేకించి విదూదభుడి చర్య ఒకటి పసనేది మనసులో విపరీతమైన చేదు నింపింది. అందులో తమ ఇద్దరి మధ్యా ఉన్న ఒక తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. అది: విదూదభుడు శాక్యుల మీద పడి కనిపించినవారినల్లా నరికి పోగులు పెట్టడం!

అదెలా జరిగిందంటే…

శాక్యులు ఎంత దాచిపెట్టే ప్రయత్నం చేసినా పసనేది పట్ల వారు చేసిన మోసం బయటపడింది. అతని భార్య వాసభ ఖత్తియ మహానామశాక్యుడి క్షత్రియ భార్య వల్ల కలిగిన సంతానం కాదనీ, దాసి కూతురనీ ఆ నోటా ఆ నోటా పసనేది వరకూ చేరింది.

పసనేదికి కోపం వచ్చిన మాట నిజమే. కానీ అదే సమయంలో గత జల సేతుబంధనం వల్ల ప్రయోజనమేమిటన్న వివేకమూ కలిగింది. పాతికేళ్లుగా కాపురం చేస్తున్న వాసభ ఖత్తియపై తనిప్పుడు కత్తి కట్టడం అన్నది ఊహించడానికే అతనికి అసాధ్యంగా అనిపించింది. క్షమించడంలో ఉన్న ఉదాత్తత అతనికీ మధ్య కొత్తగా అనుభవంలోకి వస్తోంది. బుద్ధుడు అతన్ని ప్రభావితం చేస్తున్నాడు.

కానీ విదూదభుడు క్షమించలేకపోయాడు. అసలే అతనిలో తెగల పట్ల అలవిమాలిన ద్వేషం. శాక్యుల మోసం ఆ ద్వేషానికి మరింత ఆజ్యం అందించి ప్రతీకారేచ్ఛకు పురిగొల్పింది. అతని కరవాలం మీదుగా శాక్యుల రక్తం ధారలు కట్టింది. అతని తొలి వేటు తల్లి పుట్టింటి వారి మీదే పడింది.

       ***

ఇటు కోసల…అటు మగధ…

ఇటు విదూదభుడు…అటు అజాతశత్రు…

రెండువైపులనుంచీ తెగల మెడపై కత్తి వేలాడుతోంది. మరోవైపు, అనైక్యత, వ్యక్తిగత ఆస్తి దాహం, ప్రలోభాలకు లొంగే మనస్తత్వం, ఇతర బలహీనతలు తెగలలోని సంఘీభావాన్ని లోపలినుంచి తినేస్తున్నాయి. శతాబ్దాలుగా అనుభవిస్తున్న స్వతంత్ర జీవితం కళ్ళముందే కర్పూరంలా హరించుకుపోతోంది. తెగలలోని ప్రతి సభ్యునిలోనూ అస్తిత్వ భయాలు తారస్థాయికి చేరాయి. కోసల, మగధల హింసకు ప్రతిహింస పరిష్కారంగా కనిపించడంలేదు. తెగలలోని ప్రతియుద్ధ పాటవం ఆశ్చర్యకరంగా అడుగంటిపోతోంది. ప్రాణాలను మంచినీటి ప్రాయంగా త్యజించే ఆ శౌర్యసాహసాలు ఏమైపోయాయో తెలియడం లేదు.

లిచ్ఛవీ మహావీరుని నోటా, శాక్య గౌతముని నోటా అహింసా మంత్రం అదే పనిగా ధ్వనిస్తోంది. ఎంతోమంది కత్తినీ, కార్పణ్యాన్నీ పక్కన పెట్టి ఆ ఇద్దరి మార్గంలోకి మళ్లిపోతున్నారు.

కానీ ఈ పరివ్రాజక జీవితంతో సమాధానపడలేకపోతున్న తెగ సభ్యుల గుండెల్లో తమ మధ్య ఒక మహావీరుని అవతరణకోసం ఒక ఆక్రోశం, ఒక ఆకాంక్ష, ఒక ఆర్తనాదం మిన్నంటుతున్నాయి.

మల్లబంధుల ప్రతి రోజూ ప్రతి క్షణం గుర్తుకొస్తున్నాడు. మల్ల తెగలోనే కాదు, మిగిలిన తెగలలో కూడా ఈసరికి మల్లబంధుల తెగల స్వాతంత్ర్యానికీ, పౌరుషప్రతాపాలకూ ప్రతీకగా మారిపోయాడు. మల్లబంధుల ఎక్కడో ఉన్నాడు, ఎప్పుడో వస్తాడు, తమను ఆదుకుంటాడన్న ఆశ తెగల జీవనాకాశం అంతటా మిణుకు మిణుకు మంటోంది.

       ***

మల్ల విక్రముడు ముమ్మూర్తులా తండ్రికి ప్రతిబింబమే…రూపంలోనే కాదు విక్రమంలో కూడా…

అతను మరో మల్లబంధుల కాగలడా?!

        ***

మిగతా కథ తర్వాత…

 

 – కల్లూరి భాస్కరం

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)