వీలునామా – 28 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం  తరువాయి)

వీడుకోలు

జేన్, ఫ్రాన్సిస్ తన గురంచి మాట్లాడుకుంటున్న సమయంలో బ్రాండన్ తన తల్లీ, ఇద్దరు చెల్లెళ్ళనీ కలిసి వీడుకోలు చెప్పడానికి రైల్లో ఏష్ ఫీల్డ్ వైపు వెళ్తున్నాడు. తల్లీ, విధవరాలైన ఒక చెల్లెలు ఫానీ హోంస్, పెళ్ళికాని ఇంకోక చెల్లెలు మేరీ అతని కుటుంబ సభ్యులు. మేరీ చక్రాల కుర్చీకే పరిమితమైపోయిన వ్యాధిగ్రస్త. చెల్లెలి పిల్లల పైన బ్రాండన్ కెంతో ప్రేమ. తల్లినీ, చెల్లెళ్ళనీ, పిల్లల్నీ చూడడం, వాళ్ళతో కొంచెం కాలం గడపడం బ్రాండన్ కి చాలా ఇష్టమైన పనే, అయితే ఆ పల్లెటూళ్ళో పొద్దు పోవడం కొంచెం కష్టమతనికి.

అందరు ఆస్ట్రేలియా వాసుల్లాగే  బ్రాండన్ కి కూడా లండన్ లాటి పెద్ద నగరాలంటేనే ఇష్టం. ఆస్ట్రేలియాలోని విశాలమైన మైదానాలూ, ఏకాంతమూ, చిన్న చిన్న పల్లెటూళ్ళు చూసీ చూసీ విసుగెత్తిపోయిన వాళ్ళు పెద్ద నగరాల్లో సందడీ, సమూహాలూ కావాలనుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. పైగా ఆస్ట్రేలియాలోని పల్లెటూళ్ళల్లో ఒళ్ళు వంచి చాకిరీతో అలిసిపోయి వుంటారేమో, ఇంగ్లండు రాగానే పెద్ద పట్టణాల్లోని విశ్రాంతి జీవితం కోరుకుంటారు ఆట విడుపుగా.

బ్రాండన్ తల్లిగారు తెలివైన మనిషే కానీ బొత్తిగా ప్రపంచ ఙ్ఞానం శూన్యం. ఆచారాలూ, మూఢ నమ్మకాలూ ఎక్కువ. మిసెస్ హోంస్ కేవలం తన పిల్లల పని మాత్రమే పట్టించుకునే మనిషి. ఇంట్లో మిగతా వ్యవహారాలలో ఆమె తల దూర్చదూ, ఆమె అభిప్రాయం ఎవరూ పట్టించుకోరు. మేరీ తల్లి సాయంతో స్నానం చేయడానికి మాత్రమే తన చక్రాల కుర్చీలోంచి లేస్తుంది.

అందరికీ వాల్టర్ బ్రాండన్ పైన ప్రేమాభిమానాలు మెండు. అతను ఎవరైనా మంచి అమ్మాయిని పెళ్ళాడితే బాగుండునన్న ఆశ వున్నా, అతను పెళ్ళయి తమని పట్టించుకోకపోతే తమ గతి ఏంటన్న బెంగా వుంది. ప్రస్తుతం ఆ కుటుంబానికి వాల్టర్ ఆస్ట్రేలియాలో సంపాదిస్తున్న డబ్బే ఆధారం.

వాల్టర్ చెల్లెలు  ఫానీ హోంస్ తన పిల్లల చదువూ సంధ్యలూ శిక్షణ బాధ్యతా అంతా తానే చూసుకుంటుంది. ఆమె ఎంత జాగ్రత్త పరురాలంటే, ఆఖరికి పిల్లలకి చదవడానికిచ్చే పుస్తకాలు కూడా ముందు తాను చదివి వాళ్ళకిస్తుంది. వాళ్ళని ఇంట్లో నౌకర్లతో కూడా మాట్లాడనివ్వదు. దాంతో వాళ్ళకి వాల్టర్ మామ రాకా, అతను తెచ్చే బహుమతులూ, అతనితో వెళ్ళే షికార్లూ చచ్చేంత ఇష్టం. అయితే తల్లి మాత్రం అవేవీ తిసుకోనిచ్చేది కాదు.

ఎంతో మర్యాదగా తనని పలకరించి ఒద్దికగా కూర్చునే తన చెల్లెలి పిల్లలకన్నా, చూడగానే గొల్లుమని నవ్వుతూ పైన పడిపోయే ఫిలిప్స్ పిల్లలు ఎక్కువగా నచ్చుతారు వాల్టర్ బ్రాండన్ కి.

అయితే ఫిలిప్స్ పిల్లలూ ఈ మధ్య జేన్ శిక్షణలో కుదురుగా కూర్చుంటున్నారనీ, వాళ్ళ అల్లరి కొంచెం తగ్గిందనీ చెల్లెళ్ళతో చెప్పాడతను. అల్లరికంటే, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో గారాబం ఎక్కువని అతని అభిప్రాయం.

ఫిలిప్స్ ఇంట్లో చేరిన గవర్నెస్, జేన్ మెల్విల్ గురించి ఇదివరకే ఫానీ విని వున్నది. ఆమెకి అన్న జేన్ ని ప్రేమిస్తున్నాడేమో అన్న అనుమానమూ వచ్చింది. అయితే ఈ మధ్య అలాటిదేమీ లేదని రూఢి చేసుకుంది.

“ఫానీ! నేను మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఎస్టేటు పరిస్థితి కొంచెం అస్త వ్యస్తమైంది, మళ్ళీ నేనెళ్ళి చేతుల్లోకి తీసుకుంటేగాని ఒక కొలిక్కి రాదు. ఒక పది రోజుల్లో బయల్దేరుతాను. మీకెప్పట్లాగే డబ్బు పంపుతూ వుంటాన్లే. అదలా వుంచితే, నాకింకొక ఆలోచన వస్తూంది. ఆరుగురు పిల్లల బాధ్యతతో నువ్వు సతమతమవుతూ వున్నావు. పెద్దవాడు, ఎడ్గర్ ని నాతో తిసికెళ్తాను. నాతో వుంటే ఏదైనా పని నేర్చుకుంటాడు, నీకూ కొంచెం భారం తగ్గుతుంది. ఏమంటావ్?” అడిగాడు వాల్టర్ చెల్లెలిని.

“అమ్మో! వొద్దులే వాల్టర్. వాణ్ణొదిలి నేనుండలేను. చిన్నవాడు, వాడి చదువుకూడా పూర్తికాలేదు.”

“నువ్వు నీ ఒళ్ళో కూర్చోపెట్టుకుని చదువు చెప్తే ఈ జన్మకి వాడి చదువు ఎప్పటికీ పూర్తికాదు కూడా! వాణ్ణి ప్రపంచంలోకి పంపించు ఫానీ! పదహారేళ్ళొచ్చాయి, వాడింకా చిన్నపిల్లాడు కాదు. అయినా నేను వుంటాకదా చూసుకోడానికి. వాడికి పుస్తకాల ఙ్ఞానం తప్పితే లౌకిక ఙ్ఞానం బొత్తిగా లేదు. అలాగని మరీ అంత తెలివి తక్కువ వాడు కూడా కాదు…”

“ ఏమిటీ? తెలివి తక్కువతనమా? వాడి వచ్చినన్ని లెక్కలూ, జాగ్రఫీ, లాటినూ, చరిత్రా మీకెవరికైనా వొచ్చా అసలు? కావాలంటే పరీక్ష చేయి.” గయ్యిమంది ఫానీ

“ఫానీ! నేను వాణ్ణి తెలివి తక్కువ వాడనలేదు. నువ్వన్నట్టే వాడికవన్నీ వొచ్చి వుండొచ్చు. కానీ తన పొట్ట పోసుకోవడానికి ఏదైనా పని కూడా వచ్చి వుండాలి కదా? ఆ పని నేను నేర్పిస్తాను.”

“అవును, నేను చదువైతే నేర్పిస్తాను కానీ, పని ఎలా నేర్పిస్తాను? వాడి కొచ్చిన చదువుకి చర్చిలో ఫాదరుద్యోగమైతే సరిగ్గా సరిపోతుంది,” స్వగతంగా అంది ఫానీ.

“ఫానీ, ఏ పనైనా సరే నేర్చుకోవాలంటే వాణ్ణి వదిలి నువ్వుండక తప్పదు.  వాణ్ణి బయట ప్రపంచంలోకి పంపకా తప్పదు. ఆ పంపేదేదో నాతో పంపు. నీకు వాడెలా వుంటాడో నన్న బెంగా వుండదు.”

“అమ్మో! వొద్దులే వాల్టర్. మీ విక్టోరియా రాష్ట్రమంతా ఖైదీలూ, దొంగల ముఠాలూ! బంగారం కొరకు ప్రాణాలు తీసేవారూ! ఎందుకులే, ఇక్కడే వుండనీ!”

“నా ఎస్టేటులో గొర్రెల మందలు తప్ప మనుషులుండరమ్మాయ్!  అక్కడ ఊపిరి సలపనిపనితో పక్క మనిషితో మాట్లాడే తీరికే వుండదు. కొన్నాళ్ళు పోతే వాడికీ ఒక చిన్న ఎస్టేటు కొనిస్తా. ఆ పైన మెల్లిగా చిన్నవాడి రాబర్ట్ నీ తీసికెళ్తాను.”

“వాల్టర్! నీకు నామీద ఎంతో ప్రేమనీ, నాకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నావనీ నాకు తెలుసు. కానీ ఎందుకో వాళ్ళని వదిలి వుండగలననే నమ్మకం లేదు నాకు. డబ్బు పెద్దగా సంపాదించుకోలేకపోయినా పరవాలేదు. నేర్చుకున్న నీతిని పోగొట్టుకోకుంటే, అదే పదివేలు. బయట ప్రపంచంలో ఎదురయ్యే ప్రలోభాలు ఎదుర్కొనే శక్తి వాళ్ళకుందంటావా? పైగా మేనమామవు, ప్రేమతో వాళ్ళని కట్టడి చేయగలవో లేదో…”

“చూడు ఫానీ! నేను వాళ్ళని ఎంతైనా కట్టడి చేయగలను, ఎంతైనా పైకి తేగలను. అసలు నువ్వు వాళ్ళ అభిప్రాయాలకీ కొంచెం విలువివ్వడం నేర్చుకో. ఇప్పుడొక పని చేద్దాం. మనిద్దరం వాదించుకునే బదులు, వాణ్ణే పిలిచి అడుగుదాం. వాడికి ఎలా బాగుంటే అలా చేయనిద్దాం. ఏమంటావ్?”

సరేనంది ఫానీ. ఎడ్గర్ ని లోపలికి పిలిచారు. మేనమామ సలహానీ, సూచనలనీ శ్రధ్ధగా విన్నాడు ఎడ్గర్. కాసేపు తల్లి వంకా, కాసేపు మేనమామ వంకా, కాసేపునేలవంకా చూసాడు.

“అమ్మా! నువ్వేం చేస్తే బాగుంటుందనుకుంటున్నావు?” తల్లిని అడిగాడు.

“అమ్మ ముందు నీ ఇష్టం తెలుసుకోవాలనుకుంటుంది,” బ్రాండన్ జవాబిచ్చేడు.

“అయితే నేను నీతో వస్తాను మామయ్యా!”

“ఎడ్గర్! నిన్నొదిలి నేనుండలేనురా!” ఫానీ అడ్డుపడింది.

“అమాయకంగా మాట్లాడకు ఫానీ! వాడిష్టమొచ్చినట్టు చేయనీ! ప్రపంచం లో తిరగకుండా వాడు పెద్దవాడెలా అవుతాడు?” చెల్లెల్ని విసుక్కున్నాడు బ్రాండన్.

“అమ్మా! నీకంత బాధగా వుండేటట్టయితే నేను వెళ్ళను. ఇక్కడే వుంటాను,” ఎడ్గర్ తల్లి ఆవేదన చూసి వెనుకంజ వేసాడు.

“ఫానీ! అమ్మనీ, మేరీని కూడా అడిగి చూడు. తొందరపడి వాడి భవిష్యత్తు పాడు చేయకు,” వాల్టర్ సలహా ఇచ్చాడు.

పిల్లవాడి అమ్మమ్మా, పిన్ని మేరీ కూడా ఎడ్గర్ని  బ్రాండన్ తో పంపడమే మంచిదన్నారు. క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తానని వాగ్దానం చేసిన మీదట ఫానీ కొడుకుని అన్నగారివెంట పంపడానికొప్పుకుంది.

           ***

veelunama11

ఆస్ట్రేలియా వెళ్ళే పడవ ఎక్కడానికి ఎడ్గర్ తో కలిసి లండన్ తిరిగొచ్చాడు భ్రాండన్. తనతో చాలా ముభావంగా వున్న హేరియట్ ని చూసి కొంచెం ఆశ్చర్యపోయినా, కొంచెం నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు.

ఫిలిప్స్ పెద్ద కూతురు చిన్నారి ఎమిలీ ఎడ్గర్ మెల్బోర్న్ వెళ్తున్నాడనీ, తమ ఎస్టేటు, ఊరు విరివిల్టా చూస్తాడనీ ఉత్సాహపడింది. అక్కడ వున్న తన స్నేహితులందరికీ పేరు పేరునా ఉత్తరాలిచ్చింది. ఎడ్గర్ అవన్నీ తప్పక అందజేస్తానని మాటిచ్చాడు.

“అది సరే, ఎమిలీ. ఫ్రాన్సిస్ హొగార్త్ కనిపించడే? లండన్ వదిలి తన ఊరికెళ్ళిపోయాడా?” బ్రాండన్ ఎమిలీని అడిగాడు.

“ఆయన పార్లమెంటు ఎన్నికలకి పోటీ చేస్తాడట. అక్కడ పాపం విసుగ్గా వుండదో మరి!”

“ఎమిలీ! చిన్న పిల్లవి, నీకు రాజకీయాలేం అర్థమవుతాయి? అన్నిటిలోనూ తలదూరుస్తావే!” కోపంగా అంది హేరియట్ మేన కోడలితో.

“అవునవును! నేనూ పేపర్లో చూసాను అతను పోటీ చేస్తున్నాడని. ఎమిలీ, నిజంగా పార్లమెంటులో పని చాలా విసుగు,” నవ్వుతూ అన్నాడు బ్రాండన్.

“మీరంతా అలాగే వేళాకోళం చేస్తూ వుండండి. ఆయన మాత్రం నెగ్గేది ఖాయం,”  హేరియట్ ఉక్రోషంగా అంది.

“ఆయన నెగ్గితే జేన్ మెల్విల్ చాలా సంతోషపడతారు.”

“ఆవిడే కాదు, మేమంతా కూడా ఎంతో సంతోషిస్తాం. అసలు ఆయన లాటి వాళ్ళు పార్లమెంటుకే శోభ తెస్తారు. నాన్నగారిక్కూడా ఆయనన్నా, ఆయన పార్టీ అన్న ఎంతో ఇష్టం. ఈ ఎన్నికల్లో నెగ్గగానే మా ఇంటికి వొస్తున్నారాయన!”  అతిశయంగా అంది హేరియట్.

“అవునూ, జేన్, ఎల్సీ బాగున్నారా హేరియట్?”

“బాగుండకేం చేస్తారు? బానే వున్నారు. అయినా, చచ్చే చావుగా వుంది బాబూ ఈ నౌకర్లతో! మంచి మంచి నౌకర్లంతా ఇంగ్లండు వదిలిపెట్టి ఆస్ట్రేలియా వెళ్తున్నారల్లే వుంది,  ఇక్కడ అసలు ఒక్క మనిషైనా దొరకడం లేదు. ఆవిడ, అదే జేన్ మెల్విల్ గారయితే తాను టీచర్నన్న టెక్కో ఏమో కానీ, మా చేతికింద ఒక్క పనైనా అందుకోదు.”

“ఎల్సీ బాగుందా?”

“ఎప్పట్లాగే ఏడుస్తూ వుంది.”

నిట్టూర్చాడు బ్రాండన్.

“సరే, అందరికీ ఒకసారి వీడుకోలు చెప్దామని వచ్చా. మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తానో ఏమో మిమ్మల్నందరినీ!”

లేచాడు బ్రాండన్. ఎమిలీ దగ్గరకెళ్ళి గుసగుసగా అన్నాడు,

“ఎమిలీ! ఒకరోజు నేను మంచి వాణ్ణి కాబట్టి నాకొక బహుమతి ఇస్తానన్నావు, గుర్తుందా? ఆ బహుమతి ఇప్పుడిస్తావా?”

నవ్వేసింది ఎమిలీ!

“ఓ! అదా? నీకు బానే గుర్తుందే!  రా, నాతో వస్తే నీ బహుమతి ఇప్పిస్తా!”

అతన్ని చేయి పట్టుకొని లాక్కెళ్ళింది తాము చదువుకునే గదిలోకి. గదిలో ఎల్సీ ఏదో పని చేసుకుంటూ చిన్న పాట కూనిరాగం తీస్తూ వుంది.

“ఎల్సీ! నీ పాట వినడానికెవర్ని తెచ్చానో చూడు!”  ఎమిలీ గొంతు విని టక్కున పాట ఆపేసింది ఎల్సీ. లేచి నిలబడింది.

“ఎల్సీ! పాట ఆపొద్దు. మళ్ళీ నేను నిన్నెప్పుడు చూస్తానో తెలియదు. ఈ పాట ఙ్ఞాపకాన్నైనా నాతో తీసుకెళ్తాను. పాడు! ఆపకు.” బ్రతిమిలాడాడు బ్రాండన్. ఎల్సీ మొహం సిగ్గుతో ఎర్రబడింది.

“భలే వారే! నేనేదో పిల్లలకోసం గాలిపాట కూని రాగాలు తీస్తుంటే! అసలది పాట కూడా కాదు.”

“నేనొప్పుకోను. అదేం గాలిపాట కాదు. ఎల్సీ మాకోసం ఆ పాట రాసి దానికి వరస కూడా తనే కట్టింది. ఇంతకీ పాట దేని గురించనుకున్నావు? వూళ్ళో మేము పుట్టకముందు ఇల్లు తగలబడుతూంటే నువ్వూ, పెగ్గీ, జిం కలిసి మంటలార్పారు చూడు? దాని గురించి. ఆ కథంతా మేం ఎల్సీతో చెప్పేసాం.”

“ఆ కథ నాతో పెగ్గీ కూడా చెప్పింది.  పిల్లలు మిమ్మల్ని బాగా తలచుకుంటూంటే ఆ పాట కట్టాను.”

“ఓ! అయితే నేను లేకపోయినా నన్ను తల్చుకుంటారన్నమాట!” ఆ మాట అనడం ఎమిలీ తో అన్నా, వాల్టర్ బ్రాండన్  చూపంతా ఎల్సీ పైనే వుంది.

“అయితే మిమ్మల్నందరినీ కాపాడిన హీరో లా కాకుండా, కేవలం ఒక స్నేహితునిగా గుర్తుంచుకోండి చాలు.” తిరిగి తనే అన్నాడు.

“ఇక్కడ మాకెవరూ స్నేహితులే లేరు బ్రాండన్ గారూ!  ఉన్న ఓకే ఒక్క స్నేహితుణ్ణి ఎలా మరిచిపోతాం?” దిగులుగా అంది ఎల్సీ.

“నా గురించి నువ్వు పాట రాయడం…”

మాటలు దొరకలేదు బ్రాండన్ కి. అతనికి అప్పుడక్కడ నించి ఫిలిప్స్ పిల్లలు మాయమయి పోయి తనూ, ఎల్సీ మాత్రమే వుంటే బాగుండనిపించింది.

“బ్రాండన్! ఎల్సీ దేని గురించైనా పాట కట్టగలదు తెలుసా. మా పెంపుడు పిల్లుల గురించి కూడా!” పిల్లలందర్లోకి చిన్నది కాన్స్టన్స్ చెప్పింది. ఎర్రబడ్డ మొహం తో నిలబడ్డ ఎల్సిని చూస్తూంటే బ్రాండన్ కి కొండెక్కినంత సంతోషంగా అనిపించింది.

 

ఆమె మనసులో తనపట్ల ఏదో మూల అభిమానం వుందన్నమాట. తనే తెలివితక్కువగా ఆమెని వొదులుకోవడానికి సిధ్ధపడ్డాడు. ఇప్పుడిక ఆలస్యమైపోయింది. తనూ ఎడ్గర్ మర్నాడే బయల్దేరాలి. అయితే ఏం, తను ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పించెయ్యడూ! అతను ఆలోచనల్లో కొట్టుకుపోతూ వుండగానే

“జేన్ ని పిలుస్తాను,” అంటూ లేచిందిఎల్సీ. అతని మొహంలో కదులుతున్న భావాలని ఆమె గుర్తుపట్టింది.

“ఆగాగు, ఎల్సీ! ఇంతకుముందొకసారి నువ్వూ మీ అక్కా, పెగ్గీ అంతా కలిసి ఆస్ట్రేలియా వెళ్దామనుకున్నారు కదా? ఆ ఆలోచన ఏమైంది?” ఆత్రంగా అడిగాడు బ్రాండన్.

“మా అదృష్టం బాగుంటే అలాగే వెళ్తాము.”

“అయితే నేనక్కడ నిన్ను చూసే అవకాశం వుందన్నమాట!” వెలిగిపోతున్న మొహంతో అన్నాడు బ్రాండన్.

ఇంకేదో అనబోయిన బ్రాండన్ హేరియట్ రాకతో ఆపేసాడు. బ్రాండన్ పిల్లలతో కలిసి ఎక్కడికెళ్ళాడో నన్న కుతూహలంతో వాళ్ళని వెతుక్కుంటూ వచ్చింది హేరియట్.

“ఛీ! ఛీ! ఎమిలీ! ఏంటిది? వాల్టర్ ని ఇక్కడకు తీసుకొచ్చావేం? మీ టీచరమ్మకి ఈ సంగతి తెలిస్తే ఏమవుతుందో తెలుసా?” గద్దించింది మేనకోడలిని.

“పోనివ్వు హేరియట్! నేను వాళ్ళ టీచర్ను వెతుకుంటూనే ఇక్కడకొచ్చాను. ఇంతకీ ఎక్కడుందావిడ?” విసుగ్గా అన్నాడు బ్రాండన్.

“కింద వంటింట్లో మిగతా పనివాళ్ళతో వున్నట్టుంది. రా, నిన్నక్కడికి తీసికెళ్తాను. ”

చేసేది లేక, బ్రాండన్ ఎల్సీకి చెప్పి బయటికెళ్ళాడు. కనీసం జేన్ తో తన మనసులో మాట చెప్పుదామనుకుంటే, అతన్ని వదలకుండా హేరియట్ నిలబడింది.

ఎల్సీ మాత్రం అతని చూపులనీ, మూగ భాషనీ అర్థం చేసుకోవడమే కాక అతని ప్రేమని తన కన్నె మనసులో దాచుకుంది, స్త్రీ సహజమైన సంతోషంతో. మర్నాడే వాల్టర్ బ్రాండన్ ఆస్ట్రేలియాకి నౌకలో బయల్దేరాడు.

 ***

(సశేషం)

Download PDF

1 Comment

  • Radha says:

    శారద గారూ, భలే థ్రిల్లింగ్ గా ఉంది ఎల్సీ, బ్రాండన్ – జేన్, ఫ్రాన్సిస్ లు కలిసేదెప్పుడో – యద్దనపూడి గుర్తొస్తుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)