వీలునామా – 30 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఫిలిప్స్ కుటుంబం లో సంక్షోభం

లిల్లీ ఫిలిప్స్ కి చాలా చిరాగ్గా వుంది. తన భర్త స్టాన్లీ ఫిలిప్స్ కి తమ ఇంట్లో పని చేసే మెల్విల్ అక్కచెల్లెళ్ళ మీద అంత గౌరవమూ, ఆప్యాయతా ఎందుకో ఆమెకి అంతుబట్టడం లేదు. పోనీ తనకన్నా అందగత్తెలా అంటే, అంద చందాలలో తన కాలిగోటిక్కూడా సరిపోరు ఇద్దరూ. మరేమిటి వాళ్ళలో ప్రత్యేకత?

ఇప్పుడు ఈ యూరోప్ యాత్రలో ఎల్సీకి తనతో సమానంగా జరుగుతున్న మర్యాదలు చూడరాదూ! అసలు ఈ ప్రయాణం గురించీ, కూడా ఒక పని మనిషిని తీసికెళ్ళగలిగే తన ఆర్థిక స్థోమతని గురించీ స్నేహితుల దగ్గర ఎన్ని గొప్పలో చెప్పుకుందామనుకుంది. తీరా చూస్తే తనతో సమాన స్థాయిలో వుండే స్నేహితురాలిని తీసికెళ్ళినట్టుంది కానీ, చేతికింద వుండి కనిపెట్టుకుని వుండే పనమ్మాయిని తీసికెళ్ళినట్టే లేదు.

ఎప్పుడైనా స్టాన్లీతో ఎల్సీ తమ ఇంట్లో పనిమనిషి అనీ, జేన్ లా టీఛరు కూడా కాదనీ, ఆమెకి అంత గౌరవం ఇవ్వాల్సిన పని లేదనీ చూచాయగా అన్నా కొట్టిపడేస్తాడు.

“నా దృష్టిలో జేన్, ఎల్సీ, ఇద్దరూ సమానమే. చదువు చెప్తోందని జేన్ ని గౌరవిస్తూ, ఇంటి పని చూస్తుందని ఎల్సీని హీనంగా చూడడం నా వల్ల అయ్యే పని కాదు,” అంటాడు మొండిగా. పైగా, ఫ్రాన్సు లో వున్నన్ని రోజులూ,

“ఫ్రెంచి స్త్రీలు చూడు పని చేసే ఆడవాళ్ళతో ఎంత మర్యాదగా ఆప్యాయంగా వుంటారో చూడు! మన ఇంగ్లీషు వాళ్ళం ఎంతైనా నేర్చుకోవాల్సి వుంది వాళ్ళ దగ్గర,” అనడం మొదలుపెట్టాడు.

మొదటిసారి లిల్లీకి ఇంకొక ఆడదాని మీద ఈర్ష్య లాటిది కలిగింది. అయితే తన అందచందాల మీద ఆమెకున్న నమ్మకం ఆపారమైనదీ, తన వ్యక్తిత్వంలోని లోపాలగురించి వున్న అఙ్ఞానం అనంతమైనదీ కావడంతో ఆ ఈర్ష్య ఎక్కువసేపు నిలవలేదు. బాహ్య సౌందర్యాన్ని తప్ప స్త్రీలో ఇంకొక కోణాన్నీ చూడగలిగే మగవాళ్ళుంటారన్న విషయం ఆమె ఊహకందదు. బాహ్య సౌందర్యానికొస్తే తనకి తిరుగులేదు. ఈ ఆలోచనతో లిల్లీ కొంచెం ధైర్యం తెచ్చుకొంది.

అయితే ఈ మధ్య ఎల్సీలో ఏదో ఒకరకమైన ఉత్సాహం, సంతోషం కనబడుతోంది. దానితోపాటు వయసులో వుండడం వల్ల వచ్చిన నాజూకు, నిష్కల్మషమైన చిరునవ్వుతో ఎల్సీ మెరిసి   పోతూంది. తనేమో వరస కానుపులూ, సంసార జీవితంలో వుండే నిరాసక్తతతో ఆకర్షణ కోల్పోతుందేమో! ఈ మధ్య స్టాన్లీ ఎల్సీవైపు ఎక్కువగా చూస్తున్నట్టూ, ఆమెతో ఎక్కువ మాట్లాడుతూన్నట్టు అనిపించి లిల్లీకి ఉక్రోషంగా అనిపిస్తూంది. దానికితోడు ఇద్దరూ మధ్య మధ్యలో ఫ్రెంచిలో సంభాషిస్తూ వుంటారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకున్నప్పుడు తనకి తెలియని రహస్యాలేవో చెప్పుకుంటున్నారేమోనన్న ఆలోచన ఆమెని ఎక్కువగా బాధ పెట్టసాగింది.

నిజానికి స్టాన్లీ కేవలం తన ఫ్రెంచి భాష మెరుగుపరచుకోవాలన్న ఉబలాటంతో ఎల్సీతో ఎక్కువగా ఫ్రెంచిలో మాటాడుతున్నాడు. ఎల్సీ ఏమో తనదైన అందమైన ప్రపంచంలో కొట్టుకొనిపోతూంది. ఆమెకి లిల్లీ మనసులో రేగుతున్న సంఘర్షణ ఏమీ పట్టలేదు. ఈ యాత్ర ఆమెకెంతో ఆనందంగా వుండడమే కాకుండా మళ్ళీ ఈ మధ్య కవిత్వం రాయాలన్న ఆశపుడుతూంది.

పేరిస్, ఫ్లారెన్స్, రోమ నగరాలన్నీ తిరిగారు ముగ్గురూ.

పెద్ద పిల్లల్నిద్దరినీ కూడా తమతో తిప్పి వుండాల్సింది అనుకున్నాడు స్టాన్లీ.

వాళ్ళు లండన్ తిరిగొచ్చేసరికి ఎన్నికల్లో ఫ్రాన్సిస్ నెగ్గిన సంగతి తెలిసింది వారికి.

 

*****************

 

బ్రాండన్ లేని లోటు తప్పితే లండన్ జీవితం యథా ప్రకారం మొదలైంది. కొద్దిరోజులకే మళ్ళీ విసుగెత్తిపోయిన స్టాన్లీ అమెరికా వెళ్ళి చూసొద్దామనుకున్నాడు. అయితే లిల్లీ మాత్రం ప్రయాణాలతో అలిసిపోయాననీ, ఇక ఇంటి పట్టునే వుంటాననీ అన్నది. స్టాన్లీకి ఒంటరి ప్రయాణాలు ఇష్టం వుండదు. అయినా ఇక ఇంట్లో ఏ పనీ లేక విసుగ్గా ఉందని ఒంటరిగానే అమెరికా ప్రయాణమయ్యాడు.

అదలా వుంటే, లిల్లీ మొరటుదనాన్ని చూసి ఎల్సీ ఈ మధ్య ఆశ్చర్య పోతూంది. తనంటే యజమానురాలికి ఏదో కోపం మనసులో వుందన్న విషయాన్ని కనిపెట్టింది కానీ, దానికి కారణం మాత్రం ఊహించలేకపోయింది. వీళ్ళ ఇల్లు వదిలి ఇంకెక్కడైనా వుద్యోగం చూసుకోవాలని నిర్ణయించుకుంది ఎల్సీ.

ఆమె ఆ ప్రయత్నాలలో వుండగానే పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికి విష జ్వరం తగలసాగింది. పాఠాలన్నీ మూలపడ్డాయి. పొద్దస్తమానూ జేన్, ఎల్సీ ఇద్దరూ పిల్లల మంచాల పక్కనే కూర్చుని కనిపెట్టుకోవాల్సి వచ్చింది.

లిల్లీకి మధ్యమధ్య గదిలోకి వచ్చి పిల్లలని చూసి బెంబేలు పడడం తప్ప ఇంకేమీ తెలియదు. నిజానికి వాళ్ళ పరిస్థితి విషమిస్తూన్నట్టు కూడా ఆ అమాయకురాలు తెలుసుకోలేకపోయింది.

జేన్ ఆఖరికి పిల్లల తాతగారు, పెద్దాయన డాక్టరు ఫిలిప్స్ గారిని ఉన్నపళంగా రమ్మని ఉత్తరం రాసినతర్వాత గానీ, లిల్లీకి పరిస్థితి చేయి దాటిపోయిందేమోనన్న అనుమానం రాలేదు. వెంటనే జేన్ కి చెప్పి స్టాన్లీ ని కూడా అమెరికా నించి వెంటనే రమ్మని ఉత్తరం రాయించింది.

ఆమె ఉత్తరం చూడగానే తాతగారితో పాటు స్టాన్లీ తమ్ముడు డాక్టరు వివియన్ కూడా లండన్ చేరుకున్నాడు. తండ్రీ కొడుకులిద్దరూ పిల్లలకి శాయాశక్తులా చికిత్స చేసారు. ఎంత చేసినా స్టాన్లీ పిల్లలందర్లోకీ చిన్నది ఈవాని రక్షించలేకపోయారు.

లిల్లీ మొదలునరికిన చెట్టులా కూలబడిపోయింది. ఇది జీవితంలో ఆమెకి మొదటి దెబ్బ. పెళ్ళైంతర్వాత స్టాన్లీ సం రక్షణలో చీకూ చింతా లేకుండా వున్న లిల్లీ ఈ దెబ్బ తట్టుకోలేకపోయింది. అన్నిటికంటే పిల్లల్ని ప్రాణప్రదంగా ప్రేమించే స్టాన్లీ ఇంటికొచ్చి తనకే శిక్ష విధిస్తాడోనని వొణికిపోయింది. తనకే అంతుబట్టని కారణాల వల్ల బిడ్డ మరణించడం తన తప్పేనన్న నిర్ణయానికొచ్చింది లిల్లీ.

“అయ్యో! స్టాన్లీ, ఇప్పుడే నువ్వమెరికా వెళ్ళాల్సొచ్చిందా? ఇంటికొస్తే నీ ప్రియాతిప్రియమైన ఈవా లేకపోవడం చూసి ఎలా తట్టుకుంటావో! అసలు నాలాటి చేతకాని దద్దమ్మకి ఈ పిల్లల్నెందుకు అప్పజెప్పావ్ స్టాన్లీ? మిగతా పిల్లల్ని కూడా ఇలాగే పోగొట్టుకుంటానో ఏమో!”  గోడు గోడున ఏడ్చింది లిల్లీ.

రెండురోజుల తర్వాత మిగతా పిల్లలు కోలుకుంటున్నారనీ, ఇంకేమీ భయంలేదనీ మరిది వివియన్, జేన్ చెప్పినా నమ్మలేదు లిల్లీ. స్టాన్లీ వొచ్చి, నిజంగానే మిగతా పిల్లలు జ్వరం బారినించి తప్పించుకున్నారని చెప్పిన తర్వాతే ఆమెకి నమ్మకం కలిగింది.

స్టాన్లీ ఫిలిప్స్ పైకి ఏమీ అనకపోయినా ఈవా మరణం అతన్ని ఎంతగానో కృంగదీసింది. అయితే కనీసం మిగతా ముగ్గురు పిల్లలూ కోలుకుంటున్నందుకు అతను భగవంతునికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెల్పుకున్నాడు. జేన్, ఎల్సీ, వివియన్ ముగ్గురూ కలిసి తన పిల్లలని మృత్యు వాత పడకుండా కాపాడగలిగేరని అనుకున్నాడు.

 

అప్పుడే లండన్ లో పార్లమెంటు సమావేశాలకోసం వచ్చిన ఫ్రాన్సిస్ కూడా వచ్చి పిల్లలని అడపాదడపా వచ్చి చూసాడు. పార్లమెంటులో మొదటిసారి ఫ్రాన్సిస్ చేసిన ప్రసంగాన్ని అంతా శ్రధ్ధగా విన్నారు. అతని ప్రసంగం ఎల్సీకంతగా నచ్చకపోయినా, జేన్ మెచ్చుకుంది.

 

మాట ఇచ్చిన ప్రకారం ఫ్రాన్సిస్ డెర్బీషైర్ వెళ్ళి పెద్ద ఫిలిప్స్ గారిని కలిసొచ్చాడు. అతనికి ఆ కుటుంబం లో అందరికంటే చిన్న డాక్టరు వివియన్ ఫిలిప్స్ నచ్చాడు. అయితే అతను జేన్ తో చనువుగా మాట్లాడడం చూసి కొంచెం చిన్న బుచ్చుకున్నాడు. పిల్లల చికిత్స కోసం వివియన్ జేన్ తో దగ్గరగా మసలేవాడు. అతను జేన్ ని ప్రేమిస్తున్నాడేమో నన్న అనుమానం ఫ్రాన్సిస్ ని పుండులా సలుపుతూంది. అతనికి వివియన్ ఎల్సీని ప్రేమిస్తున్నాడేమో నన్న అనుమానం రాలేదెందుచేతనో.

ఇంతకీ వివియన్ ఇద్దరు అమ్మాయిలతోనూ స్నేహంగా మర్యాదగా వున్నా ఇద్దరిలో ఎవరినీ ప్రేమించలేదు. జేన్ లాటి అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించగలిగే మగవారు అరుదుగా వుంటారు. ఆ సంగతి అందరికంటే జేన్ కే బాగా తెలుసు కూడా. అలాటి అమ్మాయిల సహచర్యంలో మగవాళ్ళు తాము అలసిపోతాం అనుకుంటారు. మగవారికి తెలివైన ఆడవారూ, తమతో సమానంగా ఆలోచించగలిగే వారూ కేవలం స్నేహితులుగానే నచ్చుతారు. తమకి భార్య గా వొచ్చే స్త్రీ పెద్దగా తెలివితేటలూ, సొంత ఆలోచనలూ లేకుండా, అన్నిటికి తమ పైన ఆధారపడే మనిషై వుండాలని కోరుకుంటారు.

ఇవన్నీ ఎలా వున్నా పిల్లలు బాగానే కోలుకోవడం మొదలుపెట్టారు. అయితే అందర్లోకీ పెద్దది ఎమిలీ మాత్రం బాగా నీరసించిపోయింది. దానికి తోడు చలికాలం ముంచుకొస్తూంది.

ఆస్ట్రేలియా లోని వెచ్చదనమూ, వేడీ అలవాటైన పిల్ల లండన్ చలిని తన అనారోగ్యంతో తట్టుకోగలదో లేదోనన్న భయం మొదలైంది అందరికీ. మళ్ళీ అరోగ్యం విషమిస్తే ఏం చేయాలో తోచలేదెవరికీ. పినతండ్రి వివియన్ అమ్మాయిని లండన్ చలికాలం నించి దూరంగా తీసికెళ్ళక తప్పదని తేల్చి చెప్పాడు. ఫ్రాన్స్ వెళ్దాం వస్తావా అని ఎమిలీని తండ్రి అడిగాడు.

 

“ఫ్రాన్స్ కాదు నాన్నా! హాయిగా మన వూరు విరివాల్టా వెళ్ళిపోదాం. అసలు ఆస్ట్రేలియాలో ఎప్పుడైనా ఇలా జబ్బు చేసిందా మనకెవరికైనా? వొస్తానంటే టీచరు జేన్ నీ, ఎల్సీనీ తీసికెళ్దాం. అక్కడే చదువుకుంటాం. ఈ లండన్ లో ఏముంది? పొగా, మంచూ, మనుషులూ!”  ఎమిలీ అంది.

స్టాన్లీ ఆలోచనలో పడ్డాడు. నిజంగా పిల్లలందరినీ ఆస్ట్రేలియా తీసికెళ్ళడమే మంచిదేమో. కనీసం పడవ మీద సముద్రపు గాలుల వల్ల ఆరోగ్యం మెరుగవవచ్చు. కాస్త అక్కడ తన ఎస్టేటు వ్యవహారాల పైనా ఒక కన్నేసి వుంచొచ్చు. లండన్ లో జీవితం కొంచెం ఖర్చుదారీగా కూడా అనిపిస్తోంది. అయితే పిల్లల చదువుల దృష్ట్యా జేన్ నీ తమతో తీసికెళ్ళక తప్పదు. ఎలాగైనా ఆస్ట్రేలియా వెళ్ళడమే మంచిదనుకొన్నాడు స్టాన్లీ.

ఈ విషయం వినగానే మండిపడింది లిల్లీ!

“ఏమిటీ? ఆస్ట్రేలియాకా? అసలు మనం ఎప్పటికీ ఇక్కడే వుంటామన్నావుగా స్టాన్లీ? అక్కడికెళ్తే పిల్లల చదువులేం చేద్దాం?”

“చదువుల గురించి నువు భయపడకు. జేన్ టీచర్నీ మనతో తీసికెళ్దాం. ఆవిడ సంగీతం తప్ప అన్నీ నేర్పగలదు. అన్నిటికంటే వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం ఇప్పుడు. మనకి వెళ్ళక తప్పదు.”

“టీచరు చెల్లెల్ని వదిలి రానంటే?”

“అదీ నిజమే! అలా అయితే ఇద్దరినీ మనతో తీసికెళ్దాం.”

“నేనేదైనా అనగానే డబ్బు ఖర్చు ఎక్కవౌతుందంటావు, కానీ వాళ్ళిద్దరు అక్కచెల్లెళ్ళనీ తీసికెళ్ళడానికి నీకే డబ్బు ఇబ్బందులూ గుర్తు రావు,” లిల్లీ కోపంగా అంది.

“ తెలివితక్కువగా మాట్లాడకు లిల్లీ. ఎల్సీ నీకు బట్టలు కుట్టి పెడుతూంది. జేన్ ఇంటి లెక్కలు చూసి పెడుతూంది. వాళ్ళిద్దరి వల్లా ఎంత లేదన్నా మనకి యేడాదికి రెండు వందల పౌండ్లు ఆదా అవుతూంది. అన్నిటికంటే, ఎమిలీ ఎల్సీని వొదిలి వుండలేదు. అసలు ఎల్సీ సహాయం లేకుండా నువ్వు పిల్లలని చూసుకోగలననుకుంటున్నావా?”

“అక్కడ జేన్ తో పనేమీ వుండదు స్టాన్లీ! ఇంతకు ముందు మనం అక్కడ డబ్బులెక్కలు చూసుకోలేదా?”

“ఆ విషయం మాట్లాడకు. నువ్వు డబ్బు లెక్కలు చూసినప్పుడు మన ఇల్లెలా వుండేదో నాకింకా బాగా ఙ్ఞాపకం వుంది. నా మాట విను. పిల్లలకీ, నీకూ, మనందరికీ సహాయంగా వుండడానికీ, చేదోడు వాదోడుగా వుండడానికీ జేన్, ఎల్సీ ఇద్దరూ మనతో రావడమే మంచిది. పిల్లలు కూడా వాళ్ళనొదిలి వుండలేరు.”

“ఆ మాటా నిజమే లే. పిల్లలని అంత అనారోగ్యంలో వాళ్ళిద్దరే కనిపెట్టి వున్నారు. నేను ఏడవడానికి తప్ప ఎందుకూ పనికి రాను,” తలచుకొని మెత్తబడింది లిల్లీ.

“కానీ, స్టాన్లీ, నాకు ఇప్పుడు సముద్రపు ప్రయాణాలంటే మహా విసుగు. పోనీ అందరం విమానం లో వెళ్దాం, ఏమంటావ్? బ్రాండన్ కూడా విమానం లోనే వెళ్ళాడు.” ఆశగా అడిగింది.

“పిల్లలతో విమాన ప్రయాణం కష్టం లిల్లీ! బ్రాండన్ అంటే ఒంటిగాడు, తోడుగా ఒక్క మేనల్లుడు, అంతే. మనమో? ఇంత మందికి విమానం టికెట్లు తడిసి మోపెడవుతాయి. పిల్లల ఆరోగ్యాలు సముద్రపు గాలికి కాస్త కుదుటపడతాయి. మనిద్దరమే కలిసి ప్రయాణం చేసేటప్పుడు నిన్ను విమానం లో తీసికెళ్తా, సరేనా?” భార్యని బుజ్జగించాడు స్టాన్లీ.

తమ కుటుంబంతో పాటు మెల్బోర్న్ రమ్మని స్టాన్లీ అడగగానే ఎగిరి గంతే సారు జేన్,ఎల్సీ.

 

“స్టాన్లీ గారూ! తప్పక మీతో వొచ్చి పిల్లల చదువులు చెప్తాను. అయితే మీకొక్క విషయం ముందుగానే చెప్పడం మంచిది. నేనూ, పెగ్గీ వాకర్ కలిసి ఎప్పటికైనా మెల్బోర్న్ లో మా సొంతంగా వ్యాపారం చేయలని అనుకున్నాము. అదే కనక నిజమైతే మీ కుటుంబాన్ని ఎప్పుడో ఒకప్పుడు వదలక తప్పదు. అప్పుడు మీరు బాధ పడకూడదు. నాకైతే మీ ఇంట్లో పని చాలా హాయిగా వుంది, కానీ…”

“నాకు తెలుసు జేన్! ఎల్సీ కీ మా ఇంట్లో క్షణం కూడ మనశ్శాంతి లేదు. ఎల్సీకి కూడా ఇక్కడికంటే ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం దొరకొచ్చు. అప్పుడు తనైనా నిస్సంకోచంగా మా ఇల్లు వదిలి పోవచ్చు. లిల్లీ కూడా మీ అక్క చెల్లెళ్ళిద్దరూ మా పిల్లలకి చేసిన సేవలకి ఇలా బదులు తీర్చుకోవాలనుకుంటుంది.”

 

ఆస్ట్రేలియా వెళ్ళడానికి స్టాన్లీ, లిల్లీ, పిల్లలూ, జేన్, ఎల్సీ అందరూ సిధ్ధమవుతూ వున్నారు. ఉన్నట్టుండి వాళ్ళతో ఇంకొక వ్యక్తి వచ్చి చేరడం జరిగింది.

 

**************

 

ఎన్నికల తర్వాత ఫ్రాన్సిస్ డెర్బీషైర్ వెళ్ళి ఫిలిప్స్ కుటుంబంతో కాసేపు గడిపి వచ్చాడు. కానీ అతనక్కడ హేరియట్ ఫిలిప్స్ ని కొంచెం కూడా పట్టించుకోలేదు. నిజానికి అక్కడ అతను రాజకీయాలూ, తన పనీ గురించి తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. అదీ తమ తండ్రితోనూ, అక్కయ్య తోనూ. హేరియట్ హతాశురాలైంది. ఆమెకిప్పుడు తను బ్రాండన్ తో అంత నిర్దయగా ప్రవర్తించి వుండల్సింది కాదేమో, అనిపిస్తూంది. తను అతన్ని అంతలా ఉడికించకపోయి వుంటే తప్పక తనని పెళ్ళాడమని అడిగి వుండే వాడే. పైగా అందరిముందూ తనని ఇష్టపడి, తనకోసం పడి చచ్చిపోయే మగవాడు ఉండడం ఆమెకొక గౌరవాన్నీ ఇచ్చేది. ఇప్పుడు బ్రాండన్ లేకపోవడంతో ఆమె ఆ గౌరవాన్ని కోల్పోయింది. హేరియట్ మనసు ఇలాటి ఊగిసలాటల్లో ఉండగానే, అన్న కుటుంబంతో సహా ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నట్టు కబురందింది ఆమెకి.

 

ఉన్నట్టుండి, తనూ అన్న కుటుంబంతో పాటు విక్టోరియా వెళ్తేనో, అన్న ఆలోచన వచ్చిందామెకి. తనకి కాస్త స్థలం మార్పు వుంటుంది. ఎమిలీ ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే “మా వూరు విరివాల్టా” ని చూసే అవకాశం దొరుకుతుంది. అక్కడ తనలాటి లండన్ స్త్రీని అందరూ అబ్బురంగా చూస్తూ వుంటే బాగుంటుంది. అన్నిటికంటే బ్రాండన్ వుంటాడు! ఏడాది రెండేళ్ళు వుండి విసుగు పుట్టగానే మళ్ళీ వచ్చేయొచ్చు.

“లిల్లీకీ పిల్లలకూ తోడుగా వుండడానికి కావాలంటే నేనొస్తాను,” అని అన్నకి కబురు చేసింది హేరియట్. తన భార్యా పిల్లల పట్ల చెల్లెలికున్న ప్రేమ చూసి మురిసిపోయాడు స్టాన్లీ. తప్పక చెల్లిని తనతో తీసికెళ్తానన్నాడు.

రెండు వారాలు అహోరాత్రాలూ కష్టపడి ప్రయాణానికి సిధ్ధమయారు అందరూ.

***

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)