ఒక చెహోవ్ కథలోంచి ఐరిష్ కథలోకి….

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

కొత్త వస్తువులకు, కొత్త ఆలోచనలకు భయపడుతూ, వాటిని నిషేధిస్తూ, సాంప్రదాయిక భద్రత అనే గూడులో ముడుచుకుని జీవించే బెలికోవ్ లాంటి గుల్ల మనుషులు ప్రతి సమాజంలోనూ కనిపిస్తారు. వీళ్ళల్లో కూడా కొంతమంది అవకాశవాదులు ఉంటారు. వీరు తమ భద్రతకు లేదా ఉపాధికి ఉపయోగపడతాయనుకునే కొత్త పరికరాలను, కొత్త ఆలోచనలను దిగుమతి చేసుకుంటూనే; అందుకు ఉపయోగపడవనుకున్న వాటిని, ముఖ్యంగా తమ భద్రతను దెబ్బతీయగలవనుకున్న వాటిని మాత్రం నిషేధిస్తూ ఉంటారు. వీళ్లతో పోల్చితే బెలికోవ్ కొంత నిజాయితీపరుడిలా కనిపిస్తాడు. సరే, దానిని అలా ఉంచితే, బెలికోవ్ లాంటి మనుషులు జీవించే గుల్ల -సంస్కృతీ, సంప్రదాయాలు, విశ్వాసాల రూపంలో ఘనీభవించినదే తప్ప మరొకటి కాదు. ఆ గుల్లను శిథిలం చేసే ఎలాంటి పరిణామాల పోటు దాని మీద పడినా అది వారికి తీవ్ర ఆఘాతం అవుతుంది. దానినే మనం సాంస్కృతిక ఆఘాతం (cultural shock) అంటాం. బెలికోవ్ ఆ షాక్ తోనే విచారానికి లోనై జబ్బుపడి కన్నుమూశాడు. చెహోవ్ పందొమ్మిదో శతాబ్ది చివరిలో ఈ కథ రాసిననాటినుంచి ఇప్పటివరకు స్త్రీ తనను తాను పునర్నిర్వచించుకునే మార్గంలో ఎన్ని కీలకమైన అడుగులు ముందుకు వేసిందో ఆ చరిత్ర అంతా మన ముందు ఉంది. ఈ క్రమంలో ఎంతమంది బెలికోవ్ లు బద్దలవుతున్న తమ గుల్లను చూసుకుని తల్లడిల్లారో, మానసిక మరణానికి గురయ్యారో; లేదా రాజీ పడ్డారో మనం ఊహించుకోవచ్చు.

 

నాకు ఎంతో ఇష్టుడైన రష్యన్ కథారచయిత యాంటన్ చెహోవ్ రాసిన కథ ఒకటుంది…

దాని ఇంగ్లీష్ అనువాదం శీర్షిక, THE MAN WHO LIVED IN A SHELL. ‘గుల్లలో జీవించిన మనిషి’ అని మనం అనువదించుకోవచ్చు. కొంచెం సంక్షిప్తం చేయాలనుకుంటే ‘గుల్ల మనిషి’ అన్నా అనచ్చు.

పైకి చాలా సీరియస్ గా చెబుతున్నట్టు అనిపించే ఈ కథ అడుగడుగునా హాస్యాన్ని పండిస్తూ పోతుంది. ఆ హాస్యంలో అంతర్లీనంగా విషాదమూ, బీభత్సమూ ఉన్నాయేమో కూడా. ఇద్దరు మిత్రులు ఉబుసుపోకకు చెప్పుకునే కబుర్లనుంచి ఈ కథ మొదలవుతుంది. ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

anton-chekhov-006

‘ప్రకృతిరీత్యానే తమలో తాము ముడుచుకుపోయి జీవించేవారు చాలామంది ఉంటారు. నత్త తన గుల్లలో మొహం దాచుకున్నట్టు వీళ్ళు కూడా మొహం దాచుకుంటూ ఉంటారు. మనిషి సామాజిక జీవి కాకముందు గుహల్లో ఏకాంతవాసం చేసిన కాలానికి వీరు తిరోగమించేవారిలా కనిపిస్తారు. నేను నేచురలిస్టును కాదు కనుక, మనుషుల్లో ఇలాంటి జీవులు కూడా ఒక రకమా అన్నది చెప్పలేకపోతున్నాను’ అంటూ మిత్రుడు కథ ప్రారంభించి, తనకు తెలిసిన అలాంటి ఒక జీవి గురించి చెప్పడం మొదలుపెట్టాడు.

అతని పేరు బెలికోవ్. అతను ఓ గ్రామంలోని స్కూలులో గ్రీకు భాషను బోధించే ఉపాధ్యాయుడు. నడి వయసు మనిషి. బయటి వాతావరణం ఎంత బాగున్నా సరే అతను గొడుగు వేసుకునే వెడతాడు. మంచులో నడిచేటప్పుడు వేసుకునే బరువైన బూట్లే సర్వకాలాలలోనూ  వేసుకుంటాడు. పెద్ద కోటుతో ఒంటి నంతటినీ కప్పుకుంటాడు. కళ్ళకు నల్లని అద్దాలు ధరిస్తాడు. చెవుల్లో దూది పెట్టుకుంటాడు.

గొడుగును అతను ఓ కేసులో ఉంచుకుంటాడు. అతని వాచీకి కూడా ఒక తొడుగు ఉంటుంది. పెన్సిల్ చెక్కడానికి చిన్నపాటి చాకును ఒక కేసులోంచి బయటకు తీస్తాడు. ఆయన ముఖం కూడా ఒక కేసులో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే, ఆయన కోటు కాలర్ ను ముడుచుకోడు,  పైకి తెరచిపెట్టి ఉంచుకుంటాడు. దాంతో ఆ కాలర్ అతని ముఖానికి ఓ తొడుగులా ఉంటుంది. ఆయన గుర్రబ్బండిలో ఎక్కడికైనా వెడుతున్నప్పుడు తప్పనిసరిగా గూడు వేయవలసిందే. ఆయన పడుకునే గది కూడా ఒక పెట్టెలా ఉంటుంది. గాలి కొంచెం కూడా చొరడానికి వీలులేకుండా తలుపులు బిగించుకుంటాడు. పాదాల నుంచి మొహంవరకూ దుప్పటి కప్పుకుంటాడు.

చివరికి తన ఆలోచనలను కూడా ఆయన ఒక కేసులో పెట్టుకుంటాడు. స్కూల్లో అప్పుడప్పుడు వచ్చే సర్క్యులర్లలోనూ, వార్తాపత్రికల్లోనూ కనిపించే నిషేధాల సమాచారం మీదే ముందస్తుగా ఆయన దృష్టి పడుతూ ఉంటుంది. నిషేధాలే ఆయనకు అమితమైన ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. అవే ఆయనకు అర్థమవుతూ ఉంటాయి. విద్యార్థులు రాత్రి తొమ్మిది తర్వాత వీథుల్లో తిరగడాన్ని నిషేధిస్తూ ఏదైనా సర్క్యులర్ వచ్చినా , ఏదైనా పత్రికలో సెక్స్ విషయాలపై వచ్చిన ఓ వ్యాసాన్ని ఖండించవలసివచ్చినా ఆయన ఆలోచనలు ఎంతో తేటగానూ, సూటిగానూ ఉంటాయి. ఇలాంటివి ఎప్పటికీ నిషేధించితీరవలసినవే!

ఎవరైనా ఒక మంచి పని తలపెట్టినా సరే, ఆయన మొట్టమొదటగా దానినుంచి కీడునే శంకిస్తాడు. ‘దీని వల్ల ఎటువంటి చెడూ జరగకుండుగాక!’ అని ఆకాంక్షిస్తాడు.

ఈ గుల్ల మనిషి గురించి ఇలా చెప్పుకోవలసిన విశేషాలు చాలా ఉన్నాయి. వాటిని అలా ఉంచి అసలు విషయానికి వస్తే, ఆయన పనిచేసే స్కూలుకి చరిత్ర బోధించే ఒక ఉపాధ్యాయుడు కొత్తగా వచ్చాడు. అతనికి ఓ పెళ్లి కాని సోదరి ఉంది. ఆమె పేరు వర్వా. వయసు ముప్పై దాటింది. గుల్ల మనిషి లానే ఆమె కూడా తేడా మనిషి. కాకపోతే ఒకరికొకరు  భిన్న ధ్రువాలు. ఆమె ఎప్పుడూ గల గలా మాట్లాడుతూ ఉంటుంది. ఉండి ఉండి అట్టహాసంగా నవ్వుతుంది. ఉక్రెయిన్ పాటలు గొంతెత్తి పాడుతూ ఉంటుంది.

అలా ఉండగా, వీరిద్దరూ ఒక పార్టీలో కలుసుకున్నారు. ఒకే చోట పక్క పక్కనే కూర్చున్నారు. ఆమె ఓ ఉక్రెయిన్ పాట పాడింది. మీ ఉక్రెయిన్ పాట గ్రీకు భాషలానే శ్రావ్యంగా ఉందని ఆయన అన్నాడు. దాంతో ఆమె ఉత్సాహంగా మరికొన్ని పాటలు పాడింది.

ఈ విచిత్రజీవులిద్దరూ పక్క పక్కన కూచున్న దృశ్యాన్ని మిగిలిన ఆడవాళ్ళు కన్నార్పకుండా చూశారు. అంతలో వాళ్ళకు ఓ ఆలోచన వచ్చింది. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుంది! బెలికోవ్ కు పెళ్లి కాలేదన్న సంగతి ఇంతవరకు తమకు తట్టకపోవడం ఆ క్షణంలో వాళ్ళకే ఆశ్చర్య మనిపించింది.

నిజానికి బెలికోవ్ ఆడవాసనకు ఆమడ దూరంలో ఉంటాడు. అందుకే మగవంటమనిషిని పెట్టుకున్నాడు. ఏ కళనున్నాడో కానీ వర్వాతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఆమె ఫోటోను కూడా తన డ్రాయర్ మీద పెట్టుకున్నాడు. ఆమె ఇంటికి రాకపోకలూ, ఆమెతో మాటలూ సాగిస్తూ వచ్చాడు.

ఇలా ఉండగా ఓ రోజున ఆయన ఓ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. కళ్ళు నులుముకుంటూ మళ్ళీ మళ్ళీ చూశాడు. జ్వరం వచ్చినట్టు అయిపోయింది. వర్వా సోదరుడు ఒక సైకిల్ మీద వస్తూ కనిపించాడు! అదే దారుణమనుకుంటే, వర్వా అతని వెనకే ఇంకో సైకిల్ మీద వస్తోంది!!! అతను సైకిలు తొక్కడమే తప్పు. ఆపైన ఆమె…!

సైకిలు ఆయన నిషేధిత వస్తువుల్లో ఒకటి. అదే కాదు, ఆధునికమైనవన్నీ ఆయనకు నిషిద్ధాలే.

ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుని ఇంటికి వెళ్ళాడు. ఇదెక్కడి దారుణం అన్నాడు. సైకిల్ తొక్కడమే కాక, నువ్వు ఎంబ్రాయిడరీ చొక్కాలు కూడా వేసుకుంటున్నావు, ఎంత తప్పు అన్నాడు. అవి తప్పెలా అవుతాయని అతనన్నాడు. మాటా మాటా పెరిగింది. నీ సంగతి హెడ్ మాస్టర్ తో చెబుతానని బెలికోవ్ బెదిరించాడు. చిర్రెత్తిన అతను చెప్పుకొమంటూ బెలికోవ్ కాలర్ పుచ్చుకుని తోసేసాడు. బెలికోవ్ కింద పడిపోయాడు. అప్పుడే ఇంటికి వచ్చిన వర్వా ఆ దృశ్యం చూసి అలవాటుగా అట్టహాసంగా నవ్వేసింది.  బెలికోవ్ బిత్తరపోయాడు. ఆమెను పెళ్లి చేసుకోకూడదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. టేబుల్ మీంచి ఆమె ఫోటో తీసేశాడు.

కానీ  ఆమె సైకిలు తొక్కుతున్న దృశ్యాన్ని మాత్రం మనసులోంచి తీసేయలేకపోయాడు. అది కలిగించిన షాకునుంచి ఎప్పటికీ తేరుకోలేకపోయాడు. ఆ రోజే మంచం పట్టాడు.  రోజు రోజుకీ కృశించిపోయాడు. నెల రోజులకు కన్నుమూశాడు!

***

కొత్త వస్తువులకు, కొత్త ఆలోచనలకు భయపడుతూ, వాటిని నిషేధిస్తూ, సాంప్రదాయిక భద్రత అనే గూడులో ముడుచుకుని జీవించే బెలికోవ్ లాంటి గుల్ల మనుషులు ప్రతి సమాజంలోనూ కనిపిస్తారు. వీళ్ళల్లో కూడా కొంతమంది అవకాశవాదులు ఉంటారు. వీరు తమ భద్రతకు లేదా ఉపాధికి ఉపయోగపడతాయనుకునే కొత్త పరికరాలను, కొత్త ఆలోచనలను దిగుమతి చేసుకుంటూనే; అందుకు ఉపయోగపడవనుకున్న వాటిని, ముఖ్యంగా తమ భద్రతను దెబ్బతీయగలవనుకున్న వాటిని మాత్రం నిషేధిస్తూ ఉంటారు. వీళ్లతో పోల్చితే బెలికోవ్ కొంత నిజాయితీపరుడిలా కనిపిస్తాడు.

సరే, దానిని అలా ఉంచితే, బెలికోవ్ లాంటి మనుషులు జీవించే గుల్ల -సంస్కృతీ, సంప్రదాయాలు, విశ్వాసాల రూపంలో ఘనీభవించినదే తప్ప మరొకటి కాదు. ఆ గుల్లను శిథిలం చేసే ఎలాంటి పరిణామాల పోటు దాని మీద పడినా అది వారికి తీవ్ర ఆఘాతం అవుతుంది. దానినే మనం సాంస్కృతిక ఆఘాతం (cultural shock) అంటాం. బెలికోవ్ ఆ షాక్ తోనే విచారానికి లోనై జబ్బుపడి కన్నుమూశాడు. చెహోవ్ పందొమ్మిదో శతాబ్ది చివరిలో ఈ కథ రాసిననాటినుంచి ఇప్పటివరకు స్త్రీ తనను తాను పునర్నిర్వచించుకునే మార్గంలో ఎన్ని కీలకమైన అడుగులు ముందుకు వేసిందో ఆ చరిత్ర అంతా మన ముందు ఉంది. ఈ క్రమంలో ఎంతమంది బెలికోవ్ లు బద్దలవుతున్న తమ గుల్లను చూసుకుని  తల్లడిల్లారో, మానసిక మరణానికి గురయ్యారో; లేదా రాజీ పడ్డారో మనం ఊహించుకోవచ్చు.

ఇక్కడి నుంచి మనం ఓసారి కాలంలో వెనక్కి వెడదాం. అది కూడా 4,500 సంవత్సరాల వెనక్కి! అప్పుడు స్త్రీ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడం కూడా బెలికోవ్ లాంటి వారికి స్త్రీ సైకిల్ తొక్కడాన్ని మించిన తీవ్ర సాంస్కృతిక ఆఘాతమే.

నా ఉద్దేశంలో, కాలగతిలో అనేక ఆటుపోట్లకు, వడపోతకు గురవుతూనే కాలపరీక్షను తట్టుకుని ఎదైతే నిలబడి ఉందో అదే నిక్కమైన సాంప్రదాయిక విలువ. ఆ విలువను ఏదీ ధ్వంసం చేయలేదు. అది అన్ని కాలాలకూ, సమాజాలకూ చెందిన మానవాళి ఉమ్మడి విలువ.

***

కాలంలో వెనక్కి వెళ్ళి చెప్పుకోవలసిన కథే, నేను కిందటి వ్యాసం చివరిలో ప్రస్తావించిన ‘Mother Right’ గురించిన పురాతన ఐరిష్ కథ:

***

ఐర్లాండ్ రాజు ఎచాయిడ్ కు ఆరుగురు కూతుళ్ళు. వారిలో మీవే ఒకతె. ఆమె ఎంతోమంది రాకుమారులను కాదని కెల్టిక్ జాతీయుడు, లెయిన్ స్టర్ కు చెందిన అయిలిల్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. ఓ రోజు రాత్రి ఆ జంట క్రౌచాన్ అనే చోట ఉన్న తమ కోటలోని అంతఃపురంలో తమ పడకగదిలో విశ్రమించడానికి ఉపక్రమించారు. వారిమధ్య ఎంతో ప్రశాంతత, ఉల్లాసం వెల్లివిరుస్తున్న ఆ సరసమైన క్షణాలలో…

ఉన్నవాడు ఊరుకోకుండా అయిలిల్ ఓ విరసపు సంభాషణకు తెరతీశాడు:

“ఒక ఉత్తముడి భార్య ఉత్తమురాలే అవుతుందని నానుడి. అది నిజమే” అన్నాడు.

“ఆ నానుడికీ నీకూ ఏమిటి సంబంధం?” అని మీవే అడిగింది.

“ఏమిటి సంబంధమంటే, మన పెళ్ళైన రోజుకీ, ఇప్పటికీ చూస్తే నువ్విప్పుడు ఉత్తమ స్త్రీవి అయ్యావు” అన్నాడు అయిలిల్.

“అబద్ధం. నిన్నసలు చూడకముందు కూడా నేను ఉత్తమురాలినే”, అంది మీవే.

“నీ మాట విచిత్రంగా ఉంది. పెళ్ళికి ముందు నువ్వు ఉత్తమురాలివనే మాట నేను ఇంతవరకు ఎవరి నోటా వినలేదు. ఆడదానిగా నీ తళుకు బెళుకులనే నువ్వు నమ్ముకుంటూ వచ్చావనీ, శత్రువులు నీ సరిహద్దుల్లోకి చొరబడి నీ సంపదనంతా యథేచ్ఛగా దోచుకుపోయేవారనే విన్నాను” అన్నాడు అయిలిల్.

ఇక అప్పుడు మీవే అతని మాటకు మాట అప్పజెప్పడం ప్రారంభించింది.

“నేనెప్పుడూ ఇలాగే ఉన్నాను. మా నాన్నకు పుట్టిన ఆరుగురు కూతుళ్లలో నేనే గొప్పదాన్ని. నన్నే అంతా ఎక్కువగా ఆరాధించేవారు. మా నాన్న నాకే ఎక్కువ వైభవాన్ని కట్టబెట్టాడు. యుద్ధాలలో కూడా నేనే గొప్ప. నా చేతికింద మూడువేల మంది రాచయోధులు కిరాయికి ఉండేవారు. అందరూ సర్దారుల కొడుకులే. వాళ్ళలో ఒక్కొక్కరి కింద మళ్ళీ పదిమంది యోధులు ఉండేవారు. మళ్ళీ వాళ్ళలో ఒక్కొక్కరి కింద ఎనిమిది మంది యోధులు ఉండేవారు. మళ్ళీ ఆ ఎనిమిది మందిలోనూ ఒక్కొక్కరికి ఏడుగురు చొప్పున, ఆ ఏడుగురికీ ఆరుగురు చొప్పున…ఇలా యోధులు ఉండేవారు. వీళ్ళంతా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేలా అందుబాటులో ఉండేవాళ్లు. అందుకే మా నాన్న తన ఐర్లాండ్ రాజ్యంలోని క్రౌచాన్ అనే ఈ ప్రాంతాన్ని నాకు ఇచ్చాడు. అందుకే నన్ను అంతా ‘క్రౌచాన్ రాణీ మీవే’ అంటారు. ఇప్పుడు మనం ఉన్నది నా క్రౌచాన్ రాజ్యం లోనే….

ఆ తర్వాత ఏమైందంటే, నన్ను పెళ్లాడతానంటూ నీతో సహా ఏడుగురు రాజులు కబురు పంపారు. నేను మిగిలిన వాళ్లందరినీ తిరస్కరించాను. ఎందుకో తెలుసా? నేను వధువుకు చెల్లించే కట్నం కింద ఏ ఆడదీ ఏ మగవాడినుంచీ కోరుకోని ఒక విచిత్రమైన కట్నాన్ని కోరుకున్నాను. అదేమిటంటే, నాకు కాబోయే మొగుడు పిసినారిగా ఉండకూడదు, అతనిలో అసూయ ఉండకూడదు, పిరికితనం ఉండకూడదు…

నేనిలా ఎందుకు కోరుకున్నానో తెలుసా? నా మొగుడు ఉదారుడు అయితేనే అతనిని మించిన ఔదార్యం నాకుందని  నిరూపించుకోవడానికి వీలవుతుంది. అతడు పిసినారి అయితే ఆ అవకాశం ఉండదు. అది సమవుజ్జీల మధ్య పోటీ అవదు. అలాగే, అతను పిరికివాడు అయితే, యుద్ధాలలో అతనిని మించిన విజేతను నేనే ననిపించుకోవడం కుదరదు. ఇక నాకు కాబోయే మొగుడిలో అసూయ ఉండకూడదని నేను ఎందుకు కోరుకున్నానంటే, నాకు అందుబాటులో ఒక మగవాడు, అతని వెనక్కాల ఇంకో మగవాడు లేకుండా నేను ఎప్పుడూ లేను. నీలో నేను కోరుకున్న ఈ మూడు లక్షణాలూ ఉన్నాయి కనుక నిన్ను పెళ్లి చేసుకున్నాను…

అదీగాక, నీకు పెళ్లి కానుకల కింది ఒక ఆడదాని హోదాకు తగినవన్నీ ఇచ్చాను. నీకు వినోదం కలిగించడానికీ, నీకు దుస్తులు అలంకరించడానికీ పన్నెండుగురు మగవాళ్ళను ఇచ్చాను. ఇరవయ్యొక్క బానిస కన్యల విలువ చేసే యుద్ధ రథాన్ని ఇచ్చాను. నీ మొహం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పున ఎర్రని బంగారం ఇచ్చాను. నీ ఎడమ మోచేయి బరువుకు తూగే తెల్ల కంచు(తగరం)ను ఇచ్చాను. ఇవి ఎందుకు ఇచ్చానంటే, నీకు ఎవరివల్లనైనా మానభంగం జరగచ్చు, అవయవలోపం కలగచ్చు, నిన్ను ఎవరైనా మోసం చేయచ్చు. అప్పుడు వాటికి బీమా కానీ, నష్టపరిహారం కానీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నీ మానాన్ని నేను ముందే కొనేసుకున్నాను. నువ్వు ఇప్పుడు నా లోదుస్తుల  సేవలకు ఉపయోగపడే పింఛనీ(petticoat pensioner)వి మాత్రమే.”

ఈవిధంగా ఆమె తనను కడిగివిడిచిపెట్టడంతో మొహం కందగడ్డలా అయిపోయిన అయిలిల్, “అయితే, నీ ఆస్తి ఎంతో, నా ఆస్తి ఎంతో పోల్చి చూసుకుందాం, పద” అన్నాడు రోషంతో. ఆమె అంగీకరించింది.

ఇద్దరి ఆస్తులను విడివిడిగా ప్రదర్శనకు పెట్టారు. వాటిలో పానపాత్రలు, ఇనప సామగ్రి, కుండలు, గుండిగలు, బీరువాల దగ్గరనుంచి; బంగారు ఉంగరాలు, గాజులు, రకరకాల ఆభరణాలు, రంగు రంగుల దుస్తుల వరకూ సమస్తం ఉన్నాయి. ఆ తర్వాత అసంఖ్యాకంగా ఉన్న గొర్రెల మందల్ని, గుర్రాలను, పందులను కూడా రప్పించి బేరీజు వేశారు. ఇవన్నీ ఇద్దరికీ సమానంగానే ఉన్నాయని తేలింది.

అయితే, పశువుల మందల్ని బేరీజు వేస్తున్నప్పుడు, అయిలిల్ మందలో ఉన్న ఒక ఎద్దు మీద మీవే దృష్టిపడింది. దాన్ని చూడగానే ఆమె మొహం వెలవెల పోయింది. అది భారీగానూ, మంచి దర్పంగానూ ఉంది. దాని కొమ్ములు తెల్లగా ఉన్నాయి. మీవే మందలో దానితో పోల్చదగిన ఎద్దు ఒక్కటి కూడా లేదు. నిజానికి అది లేగగా ఉన్నప్పుడు మీవే మందలోనే ఉండేది. కానీ ఆడదాని మందలో ఉండడానికి నామోషీపడి అయిలిల్ మందలోకి ఫిరాయించింది.

మొగుడి ఆస్తీ, తన ఆస్తీ సమానం కావన్న సంగతి దానితో అర్థమై మీవేకు తల కొట్టేసినట్టు అయింది. అలాంటి ఎద్దు తన మందలో లేనప్పుడు తన ఆస్తి గులకరాయి పాటి కూడా చేయదనుకుంది.

వెంటనే మాక్ రాత్ అనే తన వార్తాహరుణ్ణి పిలిపించింది. ఐర్లాండ్ లోని ఏ ప్రాంతంలో నైనా అలాంటి తెల్ల కొమ్ముల ఎద్దు  ఉందా అని అడిగింది.

“ఎందుకు లేదు? దానికి రెట్టింపు పరిమాణంలో, అంతకంటే ఠీవిగా ఉండే ఎద్దు, కూలీ అనే ప్రాంతంలో డైరే అనే అతని దగ్గర ఉంది” అని అతను అన్నాడు.

“అయితే వెంటనే బయలుదేరి వెళ్ళు. తన ఎద్దును ఒక ఏడాదిపాటు నాకు ఎరువు ఇస్తాడేమో అడుగు. ఏడాది తర్వాత అతనికి వడ్డీ కింద ఆ ఎద్దుతోపాటు యాభై ఆవుల్ని కూడా ఇస్తాను. ఒకవేళ అంత అమూల్యమైన వస్తువును కొద్దికాలమైనా బయటకు పంపడం అశుభం అని అతనున్న చోట ఎవరైనా అభ్యంతరం పెడితే, ఎద్దుతో సహా అతనే ఇక్కడికి రావచ్చు. అతనికి అక్కడ ఎంత జమీ ఉందో అంత జమీ ఇక్కడే ఇచ్చి, ఇక్కడే స్థిరపడేలా చేస్తాను. దానికి అదనంగా ఇరవయ్యొక్కమంది బానిస కన్యల విలువచేసే రథం ఇస్తాను. అంతేకాదు, నా కటిభాగం(upper thighs)తో అతన్ని స్నేహం చేసుకోనిస్తాను” అని మీవే అంది.

మాక్ రాత్ వెళ్ళి డైరేను కలిశాడు. మీవే చెప్పినవన్నీ చెప్పాడు. డైరే ఎగిరి గంతేశాడు. అయితే, ఒక ఆడదానికి భయపడి ఎద్దును ఇవ్వడానికి ఒప్పుకున్నావంటూ డైరేను అతని సాటివాళ్లు నిందించారు. దాంతో పౌరుషానికి పోయిన డైరే, ఎద్దును ఇవ్వడానికి తిరస్కరించాడు.

అప్పుడు మీవే సైన్యంతో వెళ్ళి అతని మీద దాడి చేసి ఎద్దును ఎత్తుకు వచ్చింది.

***

ఈ కథకుగల పురాచారిత్రక నేపథ్యం గురించీ, ఇతర విశేషాల గురించీ తర్వాత…

 – కల్లూరి భాస్కరం

 

Download PDF

6 Comments

  • ikkurthi narasimharao says:

    భాస్కరంగారు మమ్మల్ని మహాభారతం నుండి షార్ట్ బ్రేక్ ఇచ్చి యంతోవ్ చికోవ్ ని పరిచేయం చేసారు .తెలికోవ్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ‘ఉంటారు కూడా .మీరు చెప్పిన విధానం బాగుంది .

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్స్ నరసింహారావు గారూ…అసలే విదేశీ పేర్లు ఎలా పలకాలో ఒక్కోసారి అర్థం కాదు. యాంటన్ చెహోవ్ అనడమే ఎంతవరకూ కరక్టో నాకు తెలియదు. మీరు యంతోవ్ చికోవ్ అనే కొత్త పేరు కల్పించారు. బెలికోవ్ ను తెలికోవ్ ను చేశారు. తమాషాగా ఉంది. టెక్నాలజీ మన చేత తప్పులు చేయిస్తోంది.

  • “ది మాన్ హూ లివెడ్ ఇన్ షెల్” కధను “గుల్లలో జీవించిన మనిషి” పేరు మీద రారా గారు మంచి అనువాదం చేసారు. మీ వ్యాఖ్యానంతో కధ ఇంకా బాగుంది.

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్స్ రమాసుందరి గారూ…రారా గారి అనువాదం నేను చూడలేదు. తప్పకుండా అది గొప్పగానే ఉంటుంది.

  • Radha says:

    “నా ఉద్దేశంలో, కాలగతిలో అనేక ఆటుపోట్లకు, వడపోతకు గురవుతూనే కాలపరీక్షను తట్టుకుని ఎదైతే నిలబడి ఉందో అదే నిక్కమైన సాంప్రదాయిక విలువ. ఆ విలువను ఏదీ ధ్వంసం చేయలేదు. అది అన్ని కాలాలకూ, సమాజాలకూ చెందిన మానవాళి ఉమ్మడి విలువ” – విలువైన మాటలు సర్.

    ఐరిష్ కథ పూరి్త కానట్లుగా అనిపిస్తోంది. వచ్చే వారం మీరు వివరించే విశేషాలతో పూర్తిగా బావుంటుందిగా – ఎదురుచూస్తూ

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్స్ రాధగారూ……ఐరిష్ కథ వరకు పూర్తి అయినట్టే. దానిపై వివరణ మిగిలింది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)