నువ్వెవరో మరి డిసెంబరు 31 అర్థరాత్రి ఫోన్ చేశావు. “మీరు రాసిన కథ చదివాను బావుంది. నేను…..” ఇంకా ఏదో చెప్పబోయావు. గొంతులో మత్తు, మాటలో ముద్దతో కూడిన తడబాటు - నాకర్థమయింది. ‘ఎవడో తాగి మాట్లాడుతున్నాడ‘ని.
“సారీ! రేపు మాట్లాడదాం” అని ఫోన్ కట్ చేశాను. మళ్ళీ ఫోన్ చేశావు. నేను ఫోన్ సైలెంట్ లో పెట్టాను. నాలుగు మిస్డ్ కాల్స్.
తర్వాత రోజు చేశావు అయితే అప్పుడు టైమ్ రాత్రి ఏడే. ‘పర్లేదు రాత్రి న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికే చేసుంటాడేమోలే‘ అనుకుని ఫోన్ ఎత్తాను.
“సారీ అండీ - మిమ్మల్ని అందరికంటే ముందుగా విష్ చేసి మీతో ఫ్రెండ్ షిప్ చేద్దామని రాత్రంతా మేలుకొని ఆ సమయంలో చేశాను” అన్నావు.
‘పాపం రాత్రంతా మేలుకున్నాడంట‘ అని నేననుకోవాలి కాబోలు - నీ సంగతి అర్థం అయింది అయినా “పర్లేదు చెప్పండి” అన్నాను.
“మీ కథ బావుంది“
“మంచిది - మీ పేరు?”
“వర్మ – రాజా రవి వర్మ“
“ఈ వారం కూడా ఒక కథ వచ్చింది చదవండి వర్మ గారూ. మీరేమైనా రాస్తుంటారా?”
“రాత్రి ఫోన్ చేశానని మీరు నన్ను గురించి చెడ్డగా అనుకుంటున్నారట్లుంది - పైపైన మాట్లాడుతున్నారు“
“అనుకునేదేముంది. రాత్రి పూట తొమ్మిది దాటితే నేను బయటవారెవరితోనూ మాట్లాడను“
“నేను ఉమనైజర్ ని కాదు - నాకు మీ దగ్గర నుండి ఏమీ అక్కర్లేదు. నాకు అన్నీ ఉన్నాయి నేను కోటీశ్వరుడిని - మీకు విషెస్ చెబ్దామని చేశా అంతే”
“ఓ మైగాడ్! ఇదేమిటండీ మీరు అనవసరంగా ఏవేవో మాట్లాడుతున్నారు - సరే ఉంటానండీ” అని ఫోన్ పెట్టేశాను.
మళ్ళీ చేశావు. “ఏమిటండీ ఫోన్ పెట్టేస్తున్నారు? మాట్లాడుతున్నాను కదా! వినండి ప్లీజ్!”
“సరే చెప్పండి - మీరు నా కథలు ఇంకా ఏమైనా చదివారా?”
“లేదు నేను బిజినెస్ మాగ్నెట్ ని - బాగా బిజీగా ఉంటాను. ఇంతకీ మీరు చెప్పలేదు నన్ను మీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేశారా?”
“చూడండి - ఇక్కడ ఫ్రెండ్ షిప్ ప్రసక్తి లేదు. మీరు నా కథ చదివి నచ్చిందని చెప్పడానికి చేశారు. నేను థాంక్స్ చెప్పాను. అంతే - మీకు సాహిత్యాభిలాష కంటే ఫ్రెండ్ షిప్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుంది. ఉంటానండీ” అని ఫోన్ పెట్టేశాను.
అప్పటికి ఊరుకున్నావు మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నరకి చేశావు, కట్ చేశాను. మళ్ళీ చేశావు, కట్ చేశాను. మూడోసారి మళ్ళీ చేశావు. ఫోన్ తీశాను నీ సంగతేందో తేల్చుకుందామని.
“ఎందుకు చేశారు? రాత్రి 9 తర్వాత నేను ఫోన్ లో మాట్లాడనని చెప్పానుగా మీకు” అన్నాను
“మీ కథ బావుందని చెప్దామని చేస్తున్నాను. మీరు నాకు థాంక్స్ చెప్పనే లేదు. ఇందాక థాంక్స్ చెప్పానని అన్నారు కాని థాంక్స్ చెప్పలేదు మీరు నాకు” అన్నావు.
“ఓకే థాంక్స్“
“మీ కథ గురించి మాట్లాడాలి - రెండో పేరాలో మీరు రాసిన వాక్యం …….”
“వర్మ గారూ కథ గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు. నేను మీకు ముందే చెప్పాను 9 తర్వాత మాట్లాడనని - ఇది నేను నిద్రపోయే సమయం కాబట్టి రేపు ఉదయం 10 లోపు లేదా సాయంత్రం 4 తర్వాత 9 లోపు చేయండి - సరేనా - బై” అని నేను ఫోన్ కట్ చేశాను.
మళ్ళీ ఫోన్ చేశావు “ఏమనుకుంటున్నారు మీరు నన్ను నేను ఆడవాళ్ళ వెంట పడే వాడిననుకుంటున్నారా? సాయంత్రమైతే నా చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు తెలుసా! మాకు త్రీ స్టార్ హోటల్ ఉంది. గంటలు గంటలు మాట్లాడుకుంటాం మేము ఆ హోటల్ లో కూర్చుని ……..”
‘ఛీ! వెధవ‘ అనుకుని ఫోన్ కట్ చేసి సైలెంట్ లో పెట్టుకున్నాను. నాలుగు మిస్డ్ కాల్స్.
అప్పడు ఎనలైజ్ చేశాను నీ గురించి - ఖచ్చితంగా వీడెవరో మనకి తెలిసిన వాడే - నా కథలు చదివి ఫోన్ చేసే వాళ్ళకైతే నేనెవరో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ‘మీరెక్కడ ఉంటారు? ఏం చేస్తారు?’ అని అడిగి తెలుసుకుంటారు.
కొంత మందికి నా వయసెంతో తెలుసుకోవాలని ఉంటుంది మరికొంత మందిలో నేను రాసిన కథలు నా స్వానుభవమా అనే ఉత్సుకత ఉంటుంది. ఆఫ్ కోర్సు అన్నీ తెలుసుకున్నాక కొంతమంది వెధవల గొంతులు నా మాటలకి గౌరవం గా మారడం, నిరుత్సాహంగా మారడం కూడా ఉంటుంది. కాని నువ్వు నా గురించి అడగడం లేదు నేనెక్కడ ఉంటానో ఆసక్తి లేదు. పోనీ సాహిత్య విమర్శకుడవీ లేదా అభిమానివి మాత్రమే అయితే కథ గురించీ మాట్లాడటం లేదు - ఈ సంగతి నాకెప్పుడో తెలిసిందనుకో నీకు కథల గురించి ఏమీ తెలియదని… సో - నేనెవరో నీకు తెలుసు. నువ్వు నన్ను చూసి కూడా ఉంటావు. బహుశా నేను కూడా నిన్ను చూసే ఉంటానేమో! నువ్వు ఖచ్చితంగా మాకు తెలిసినవాడివో లేకపోతే నాకు తెలిసిన స్నేహితురాళ్ళకి తెలిసినవాడివో అయి ఉంటావు.
‘ఈసారి ఫోన్ చేయాలి చెప్తా వీడి పని‘ అనుకున్నాను.
తర్వాత రోజు సాయంత్రం 4 కి ఫోన్. నడుస్తూ మాట్లాడుతున్నావు. ఎక్కడో బస్టాండ్ లో ఉన్నట్లున్నావు - చుట్టూ రణగొణ ధ్వనులు.
“ఆఫీస్ నుండి ఇంటికి వెళుతున్నా సరిగ్గా వినపడటం లేదు - మళ్ళీ చేస్తా” అని ఫోన్ కట్ చేశావు. ఇదొక డ్రామా - నాలుగుకి చేయమన్నాను కదా పాపం చేశాడు అని నేననుకోవాలనమాట. ‘సరే .. కానీ… ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావ‘నుకున్నాను. ‘
8 కి ఫోన్ చేసి “సారీ - మీతో కథ గురించి మాట్లాడదామంటే నాలుగుకి చేయమంటున్నారు. అప్పడు చేద్దామంటే నేను బిజీ. ఇప్పుడు మాట్లాడతాను ఇంకా తొమ్మిది అవలేదుగా” అన్నావు. ‘ఆహా! గొంతులో ఏమి నక్క వినయాలు!?’
“ఆఁ మాట్లాడండి“
“మీరు నాతో ఫ్రెండ్ షిప్ చేస్తారా మాట్లాడతాను“
“ ఈ మధ్య ఒక కథ చదివాను….”
“ఏం కథ?”
“ఆ కథలో ఒకావిడని ఫోన్లు చేసి విసిగిస్తుంటుంటాడొకడు. ఆమె ఎంతగా విసిగిపోతుందంటే ఆ బాధ తట్టుకోలేక చేతిలో ఉండే సెల్ ఫోన్ బద్దలు చేస్తుంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆ కథ గుర్తొస్తుంది. ఆ కథలోలా నేను…..”
“నేను మిమ్మల్ని విసిగిస్తున్నానా అయితే - ఇక మీతో మాట్లాడనులెండి. ఇక మీకు ఫోన్ కూడా చేయను” అని కట్ చేశావు.
ఇదింకో ట్రిక్. అలిగినట్లుగా పెట్టేస్తే ఎదుటి వాళ్ళు చేస్తారని. ఇంకాసేపు బహుశా 10 నిమిషాలు చేయవు అనుకుని హాయిగా నైట్ కాఫీ తాగుతూ కూర్చున్నాను. 5 నిమిషాల్లోనే చేశావు పాపం నా టైమ్ వృథా చేయడం ఎందుకని!
మండిపోయింది నాకు - నిన్ను మాట్లాడనివ్వకుండా “వినండి నేను చెప్పేది - ఆ కథలోలా నేను చేతిలో ఫోన్ విసిరికొట్టను ఎందుకంటే మీ నంబరు ద్వారా మీ పేరు, అడ్రస్ కనుక్కోవడం నాకు నిమిషం కూడా పట్టదు. మర్యాదగా ‘మీరు - మీరు‘ అని నన్ను గౌరవించి మాట్లాడారు కాబట్టి వదిలిపెడుతున్నా…..”
ఫోన్ కట్ చేశావు - అంతే ఇక నీనుంచి నాకు ఫోన్లు లేవు. ఇప్పుడు నువ్వు విసిరికొట్టావా ఫోను? లేకపోతే సిమ్ విరక్కొట్టావా? ఎందుకైనా మంచిది సిమ్ పోయిందని పోలీస్ కంపైట్ ఇవ్వు లేకపోతే హెర్రాస్మెంట్ కింద జైల్లో పడతావు.
డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా వెకిలిగా మాట్లాడే మగవాళ్ళని చూస్తే భయం అక్కర్లేదు వాళ్ళ సంగతి వాళ్ళ మాటల్లో తెలుస్తుంది కాబట్టి వాళ్ళని తప్పుకోని పోతాం. కాని లోపల ఏదో పెట్టుకుని పైకి మర్యాదగా మాట్లాడుతుంటారే నీ లాంటి మేకతోలు కప్పుకున్న నక్కలు - వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం.
అమ్మాయిలందరికీ చెప్తా నీలాంటి వాళ్ళ గురించి -
‘అమ్మాయిలూ చూశారుగా ఇది నిజంగా జరిగింది - కథ అనుకునేరు. ఇదొక రకం మేకతోలు కాబట్టి - తస్మాత్ జాగ్రత్త ఇంకా చాలా రకాల మేకతోళ్ళుంటాయి. అయినా మనకి తెలుసుగా - ఎవరో గొప్ప రచయిత అన్నట్లు - మనం మానసికంగా దృఢంగా ఉంటే వెధవలైన మగవాళ్ళు పిరికివాళ్ళవుతారనీ, మనల్నేమీ చేయలేరని!!? –
నువ్వూ విన్నావా?……
***
అయ్యో జరిగిన కథనా…జాగ్రత మేడం మరి.
బాగా రాసారు రాధగారు
దన్యవాదాలండీ డేవిడ్ గారూ
మంజరి లక్ష్మి గారూ అందరూ జాగ్రత్తగా ఉండాలని రాశానండీ. నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు