పరాశరుని ఉదంతం: పండితుల మౌనం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

 

 

 

 

 

కిందటి వ్యాసంలో చెప్పుకున్న విషయాన్ని సంగ్రహంగా పునశ్చరణ చేసుకుంటే…

పొర: 1లో చెప్పినది బీజరూప కథాంశం మాత్రమే. అందులోని పరాశర-మత్స్యగంధుల లైంగిక సంబంధం కానీ, ఆ ఇద్దరి వ్యక్తిత్వాలు కానీ ఫలానా రకమైనవని నిర్ధారణ చేయలేం. వాస్తవంగా మన ఎదురుగా ఉన్నది పొర:2 ఒక్కటే. పొర:1 లోని ఆ రెండు పాత్రలనూ తీసుకుని కథకుడు ఆ ఇద్దరి లైంగిక సంబంధం ఎలాంటిదో, వారి వ్యక్తిత్వాలు ఎలాంటివో చెబుతున్నాడు. ఆ చెప్పడంలో పరాశరునిలోని చీకటి, వెలుగుల కోణాలను రెండింటినీ, అతని ప్రవర్తనలోని వైరుధ్యాన్నీ మన ముందు ప్రదర్శిస్తున్నాడు.

అలా ప్రదర్శించడంలో అతని ఉద్దేశాన్ని ఇలా అర్థం చేసుకోడానికి అవకాశం ఉంది: 1. పురుషుడికి ఒక స్త్రీ పట్ల వాంఛ కలిగినప్పుడు ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆ వాంఛను తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. భయపెట్టో, ప్రలోభపెట్టో ఆమెను లొంగదీసుకోవచ్చు. స్త్రీ పురుషుడి దృష్టిలో ఒక భోగ్యవస్తువు మాత్రమే. 2. పురుషుడి మాటల్లోనూ, చేతల్లోనూ ఎలాంటి తప్పును కానీ, వైరుధ్యాన్ని కానీ వెతకడానికి వీల్లేదు. అతను ఏం మాట్లాడినా ఒప్పే, ఏం చేసినా ఒప్పే. అతని మాట లేదా చేత ఏదైనా సరే, అది శిలాశాసనం.

కథకుడు ఇక్కడ పితృస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

గాంధారి తండ్రి సుబలుడు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశానన్నాడు! ఆ సంబంధం గురించి కుటుంబసభ్యుల్లో ఎలాంటి చర్చ జరిగినా సరే, వారి ఇష్టాయిష్టాలు ఏవైనా సరే; వాటికి సుబులుని మాటతో అడ్డుకట్ట పడిపోవలసిందే. కన్యాశుల్కం నాటకంలో ‘తాంబూలాలిచ్చేసాను, తన్నుకు చావం’డన్న అగ్నిహోత్రావధాన్లు మాట కూడా ఇలాంటి శిలాశాసనమే.

ప్రస్తుతానికి వస్తే, ఈ కథలో మత్స్యగంధి మాతృస్వామ్య అవశేషాలకు ప్రతినిధి. కథకుడు ఆ అవశేషాలను మరుగుపుచ్చలేదు. కారణం ఒకటే; మాతృస్వామ్యంపై పితృస్వామ్య విజయాన్ని లేదా ఆధిపత్యాన్ని కూడా చెప్పడం అతని ఉద్దేశం. అప్పుడు మాతృస్వామ్య అవశేషాలను మరుగుపుచ్చడం వల్ల ఆ ప్రయోజనం నెరవేరదు. ఇంకొకలా చెప్పుకుంటే, ఇదొక యుద్ధం లాంటిది. లేదా నేటి ఎన్నికల యుద్ధం లాంటిది. కథకుడు ఈ యుద్ధంలో పితృస్వామ్య పక్షం వహిస్తున్నాడు. యుద్ధం అన్నప్పుడు తప్పును కూడా ఒప్పుగా బుకాయించడం, రకరకాల సమర్థనలను, ఉపాయాలను, మాయోపాయాలనూ కూడా ఆశ్రయించడం మామూలే. ఈ కథలోనూ, ఇంకా ఇలాంటి అనేక కథలలోనూ కథకుడు ఒక కీలకమైన ఉపాయాన్ని, బహుశా మాయోపాయాన్ని ప్రయోగించాడు. దాని గురించి త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

Satyavati

మత్స్యగంధి మాతృస్వామ్య అవశేషాలకు ప్రతినిధి అనడానికి సాక్ష్యం ఈ కథలోనే ఉంది. మత్స్యగంధిపై కోరిక తీర్చుకోవడమే ప్రధానం తప్ప అనంతర పరిణామాలపై పరాశరునికి ఆసక్తి లేదన్న సూచనను కథాగమనమే అందిస్తోంది. ‘పరాశరుని మహిమ వల్ల మత్స్యగంధికి అప్పటికప్పుడు వ్యాసుడు జన్మించా’డనడం పరాశరుని మహిమోపేతుడిగా మరోసారి నొక్కి చెప్పడానికి కథకుడు చేసిన కల్పన అనుకుంటే, పరాశరుడు కొడుకు పుట్టేదాకా మత్స్యగంధితో ఉండలేదు. కోరిక తీర్చుకున్న వెంటనే తన దారిన తాను వెళ్లిపోయాడు. అంటే, తండ్రి-కొడుకుల మధ్య కలయిక జరగలేదు. భవిష్యత్తులో కూడా ఎప్పుడూ జరిగినట్టులేదు. విజ్ఞులెవరైనా జరిగినట్టు ఆధారం చూపిస్తే ఈ అభిప్రాయాన్ని సవరించుకోడానికి నేను సిద్ధమే.

అంటే ఏమిటన్న మాట…వ్యాసుడు అచ్చంగా ‘తల్లి కొడుకు’. సత్యవతి కొడుకుగా సాత్యవతేయుడు. అతను పుట్టగానే నమస్కరించింది తల్లికి మాత్రమే. తపస్సుకు వెడుతూ ‘నాతో పని ఉంటే నన్ను తలచుకోండి, వెంటనే వస్తాను’ అని చెప్పాడు. ముందు ముందు అతనితో తల్లికి ఒక అవసరం కలగబోతోంది. అది, కురువంశాన్ని నిలబెట్టడానికి తన కోడళ్ళు అయిన అంబిక, అంబాలికలకు అతని ద్వారా సంతానం కలిగించడం. భర్త శంతనుడు మరణించడంతో, భీష్ముడు అవివాహితుడిగా ఉండిపోవడంతో సత్యవతే పితృస్వామిక బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ‘తండ్రికి కొడుకు మీద అధికారం ఎలా ఉంటుందో, తల్లికీ అలాగే ఉంటుంది. కనుక నిన్ను ఒక పనికి ఆదేశిస్తున్నాను’ అని ఆ సందర్భంలో సత్యవతి వ్యాసుడితో అంటుంది. అంటే, మాతృస్వామ్య ప్రతినిధి అయిన సత్యవతి, కోడళ్ళకు సంతానం కలిగించవలసిన ఘట్టంలో తన మాతృస్వామిక అధికారాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి సిద్ధమైందన్నమాట.

ఇదే మాతృస్వామిక కోణాన్ని పరాశర-మత్స్యగంధు(సత్యవతి)ల లైంగిక సంబంధానికి వర్తింపజేస్తే, మత్స్యగంధికి ఆ సంబంధం పట్ల సూత్రరీత్యా వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఆ విధంగా అది ‘అసమ’ లైంగిక సంబంధం కాక,‘సమ’ లైంగిక సంబంధం కావచ్చు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, మాతృస్వామ్యంపై పితృస్వామ్య విజయాన్ని, లేదా ఆధిపత్యాన్ని చెప్పదలచుకున్న కథకుడు దానికి అనుగుణంగా పరాశర-మత్స్యగంధుల సంబంధాన్ని అసమ లైంగిక సంబంధంగా చిత్రించి ఉండవచ్చు.

పరాశర-మత్స్యగంధుల సంబంధాన్ని తలపించే పాత్రలు, చిన్న చిన్న తేడాలతో మహాభారతంలో మరి కొన్ని కనిపిస్తాయి. ఆదిపర్వంలో, సర్పయాగ సందర్భంలో చెప్పిన జరత్కారుడు-జరత్కారువుల సంబంధం, అదే పర్వంలో చెప్పిన కుంతి-దూర్వాసు(సూర్యు)ల సంబంధం, ఆ పర్వంలోనే ఖాండవదహన ఘట్టంలో చెప్పిన మందపాలుడు-చరిత అనే ఒక ఆటవిక యువతి సంబంధం ఇప్పటికిప్పుడు స్ఫురిస్తున్న ఉదాహరణలు. జరత్కారుడు అనే ముని అదే పేరు కలిగిన ఒక నాగజాతి కన్యను పెళ్లి చేసుకుని ఆమె గర్భవతి కాగానే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడామె పుట్టింటికి చేరుకుంటుంది. ఆమెకు ఆస్తీకుడనే కొడుకు కలుగుతాడు. ఇక్కడ కూడా తండ్రీ-కొడుకుల మధ్య కలయిక జరగలేదు. ఇక కుంతీ-దూర్వాసు(సూర్యు)ల సంబంధం ప్రసిద్ధమే. మూడో ఉదాహరణకు వస్తే, మందపాలుడు అనే మునికి నిజభార్యవల్ల సంతానం కలగలేదు. సంతానం లేకపోతే స్వర్గం లభించదు కనుక అతడు చరిత అనే ఆటవిక యువతితో సంబంధం పెట్టుకుని సంతానం కంటాడు. ఆ విధంగా అతనికి రెండిళ్ళు ఏర్పడతాయి.

ఈ కథల పూర్తి వివరాలను వాయిదా వేస్తే, పరాశర-మత్స్యగంధులతో సహా ఈ నాలుగు ఉదాహరణలలో ‘పుట్టింటి’ పాత్రను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవడం అవసరం. మత్స్యగంధి పుట్టింటిలో ఉండగానే పరాశరునితో సంబంధం ద్వారా వ్యాసునికి జన్మనిచ్చింది. జరత్కారుడు తనను విడిచి వెళ్ళగానే జరత్కారు పుట్టింటికి వెళ్లిపోయింది. కుంతి పుట్టింట్లో ఉండగానే దూర్వాసు(సూర్యు)నితో సంబంధం ద్వారా కర్ణుని కన్నది. మందపాలుడు సంబంధం పెట్టుకున్న చరిత పుట్టింట్లోనే ఉండిపోయింది. తపతి-సంవరణుల కథలోకి వెడితే, తపతి కూడా పన్నెండేళ్ళు పుట్టింట్లోనే ఉండి కాపురం చేసింది.

ఇక ఇప్పుడు పరాశర-మత్స్యగంధుల కథలో మరో పొరకు వద్దాం.

 

పొర:3

ఇది రెండవ పొర లోని కథను ఆధారం చేసుకుని పండితుల వ్యాఖ్యలు, వివరణలు,సమర్థనలు పేరుకోవడం ప్రారంభమైన దశ అని స్థూలంగా అనుకుందాం. విశేషమేమిటంటే, ఈ పొర ఇప్పటికీ మన కళ్ల ముందు ఉన్న పొర. అయితే, రెండవ పొరలోని కథ కాస్తా ఈపాటికే ప్రశ్నించడానికి వీలులేని మతవిశ్వాసంగా ఘనీభవించింది. దానర్థం, మీరు కథకు ఎన్ని పైపై మెరుగులైనా దిద్దండి, ప్రధాన కథలో వేలుపెట్టడానికి వీలులేదు. అలాగే, పండితుల భాష్యాలూ హద్దుల్లో ఉండవలసిందే. వారు తమ పాండిత్యాన్ని రంగరించి ఎలాంటి వివరణలైనా ఇవ్వవచ్చు, కానీ సంప్రదాయపరిధిని దాటడానికి వీలు లేదు. పోలిక చెప్పుకోవాలంటే ఇదొక వలయంలో నడక లాంటిది. మనం ఎంతసేపు నడిచినా ఆ వలయంలోనే నడుస్తూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ బయలుదేరిన చోటికే చేరుతూ ఉంటాం. ఆ వలయమే మన ప్రపంచంగా మారిపోతుంది.

సాంప్రదాయికత మనల్ని నీడలా నిరంతరం అంటిపెట్టుకుని మన ఆలోచనలను ఎంతగా నియంత్రిస్తూ ఉంటుందంటే; సాధారణబుద్ధికి అసంబద్ధంగానూ, అన్యాయంగానూ అనిపించేవాటిని కూడా సంభవమైనవిగా, న్యాయమైనవిగా చూడవలసివస్తుంది. అప్పటికీ కొన్ని అంశాలు మన ఇంగితజ్ఞానానికి మరీ కొరకరాని కొయ్యలుగా కనిపిస్తే వాటికి ఏదో దైవిక కారణాన్నో, మహిమనో ఆపాదించి ‘కిట్టించ’ వలసివస్తుంది. అయినాసరే, కొన్ని పూరించని ఖాళీలుగా అలాగే మిగిలిపోతూ ఉంటాయి. ఆ ఖాళీలు వ్యాఖ్యాతల మౌనానికి అద్దం పడుతుంటాయి.

dushyanta

ఇతరేతరమైన దృష్టికోణాలూ, మేధో భారాలూ ఏమీ లేని; మహాభారతం పట్ల భక్తిభావమూ, పూజ్యభావమూ ఉండి, తుడిచిన పలకలాంటి బుద్ధి కలిగిన ఒక జిజ్ఞాసి పరాశర-మత్స్యగంధుల ఉందంతం చదివినప్పుడు ఎటువంటి భావసంచలనానికి లోనవుతాడన్నది ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అతనిలో మహాభారతం పట్ల భక్తి, పూజ్యభావమే ఎక్కువ మోతాదులో ఉంటే, పరాశరుని ప్రవర్తనను, అందులో కనిపించే వైరుధ్యాన్ని మామూలుగా తీసుకుంటాడు. ఇంగిత జ్ఞానాన్ని జోకొట్టి కథకుని వేలు పుచ్చుకుని ముందుకు వెళ్ళిపోతాడు. అంటే అక్కడ విశ్వాసం పనిచేసిందన్న మాట.

లేదా, ఇంగితజ్ఞానమే సలిపినప్పుడు పరాశరుని ప్రవర్తనకు నిజంగా ఆందోళన చెందుతాడు. అయోమయానికి లోనవుతాడు. ఇదేమిటి, ఇంత గొప్ప మహర్షి ఇలా ప్రవర్తించాడేమిటని అనుకుంటాడు. అతనికి పరాశరునిలోని లైంగిక దాహం, మత్స్యగంధి దేహంపై మనోవాక్కాయ కర్మలతో అతను చేసిన దాడి, అతను శాపమిస్తాడన్న భయంతో మత్స్యగంధి లొంగిపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇలా పైకి కనిపించేది నిజం కాదేమో, దీని వెనుక ఏవైనా అతీంద్రియ అన్వయాలు, అంతరార్థాలు ఉండి ఉంటాయేమో నని కూడా అనుకుంటాడు. అలాంటివి కనిపించనప్పుడు అతని ముందు ఉండేవి రెండే మార్గాలు: విశ్వాసాన్ని ఆశ్రయించడం, లేదా అలా సందేహస్థితిలోనే ఉండిపోవడం.

సంప్రదాయ పండితులు పరాశర-మత్స్యగంధుల ఉదంతానికి ఎలాంటి వివరణ ఇచ్చారో పరిశీలించడానికి ప్రయత్నించాను. నా ఎదురుగా దాదాపు 70 ఏళ్ల క్రితం వెలువడిన వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘మహాభారత తత్త్వ కథనము’, దివాకర్ల వేంకటావధాని, జి.వి. సుబ్రహ్మణ్యం గార్ల సంపాదకత్వ, వ్యాఖ్యానాలతో టీటీడీ ప్రచురించిన ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వం మొదటి భాగమూ ఉన్నాయి.

‘మహాభారతతత్త్వ కథనము’ సంప్రదాయబద్ధమైన రచన. సంప్రదాయవిరుద్ధమైన పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలపై ఖండనగా వెలువడిన రచన. ఇందులో గ్రంథకర్త మహాభారతంపై అంతవరకు సంస్కృత, ఆంధ్రాలలో వెలువడిన వ్యాఖ్యలనూ, భాష్యాలనూ మధ్య మధ్య విస్తృతంగా ఉటంకించారు. అయితే, ఇందులో వేదవ్యాసుడు నిషాదుడా లేక బ్రాహ్మణుడా అన్న అంశం పైనా, మత్స్యగంధి కన్యాత్వంపైనే చర్చ జరిగింది తప్ప పరాశరుని ప్రవర్తనపై చర్చ జరగలేదు. అంటే, సంప్రదాయపండిత లోకంలో పరాశరుని ప్రవర్తన అభ్యంతరకరం కాలేదన్న మాట!

ఎందుకని? పరాశరుడి వంటి మహర్షి మత్స్యగంధి అనే జాలరి యువతితో లైంగిక వాంఛ తీర్చుకోవడం, ఆమెకు కొడుకును ప్రసాదించడం వాస్తవంగా ఆమెను అనుగ్రహించడమే నన్న భావనతోనా? లేక, ఆ సంబంధం వల్ల వ్యాసునంతటివాడు జన్మించాడు కనుక, అది లోకోపకారానికి ఉద్దేశించిన జన్మ కనుక పరాశరుని ప్రవర్తనను ప్రశ్నించనవసరం లేదన్న భావనతోనా? లేక, స్త్రీని ఎలాగైనా లొంగదీసుకోవచ్చుననీ, పితృస్వామిక వ్యవస్థలో ఇది సహజమేనన్న భావనతోనా? లేక, పరాశరుని లైంగిక ప్రవృత్తిని అలా చిత్రించడం ఆనాటి కథన పద్ధతి అన్న భావనతోనా?

ఇలా మనం ఊహించుకోవలసిందే కానీ కారణం తెలియదు. అక్కడ మనకు ఎదురవుతున్నది మహామౌనం మాత్రమే.

ఇక టీటీడీ ప్రచురణకు వద్దాం. ఇది 2000లో ప్రథమ ముద్రణ పొంది, 2008లో తృతీయ ముద్రణ పొందిన ప్రచురణ. ప్రతి పద్య, గద్యాలకూ ప్రతిపదార్థం, తాత్పర్యం ఇవ్వడం; కొన్ని చోట్ల విశేషాలను చర్చించడం అనే ప్రణాళికను అనుసరించింది. విశేషాలలో కొన్ని చోట్ల ఛందస్సు, వ్యాకరణం, అలంకారం, రసం లాంటి కావ్యసామగ్రికి సంబంధించిన అంశాలను, పాఠాంతరాలను ఎత్తి చూపడం; కొన్ని చోట్ల సాంప్రదాయిక భాష్యాలకు అనుకూలమైన అన్వయాలు ఇవ్వడం చేసింది. ప్రత్యేకించి మత్స్యగంధిపై పరాశరుని లైంగిక ప్రవర్తనకు సంబంధించిన ప్రస్తుత అంశంలో ‘విశేషం’ పేరుతో ఒక అలంకారం గురించి మాట్లాడింది, అంతే.

పరాశరునిలోని లైంగిక వైపరీత్యం విషయంలో వ్యాఖ్యాతలు పూర్తిగా మౌనం వహించడాన్ని అలా ఉంచుదాం. పరాశరుడు మత్స్యగంధిని చూసి చిత్తచాంచల్యానికి లోనైనట్టు చూపిస్తూ, చెబుతూనే; అతనిని జితేంద్రియుడిగా చెప్పడంలోని వైరుధ్యాన్ని కూడా కనీసం స్పృశించలేదు. ఎందుకంటే, సంప్రదాయం విధించిన పరిమితులు, నిషేధాలు అంత బలవత్తరమైనవి. ఏదైనా ఒక మతవిశ్వాసంగా మారి ఘనీభవించిందంటే, దాని ముందు మన హేతుబుద్ధి, ఇంగితజ్ఞానం వగైరాలు ఏవీ పనిచేయవు. వాటిని అటక ఎక్కించవలసిందే.

మహాభారతంలోని ఒక లైంగిక వైపరీత్యాన్ని చూపించి, దానిని నేటి కాలానికి అన్వయించే ప్రయత్నం చేయడం అతి స్పందనగా, అనవసరచర్చగా కొందరికి కనిపించవచ్చు. నిజానికి ఆ లైంగిక వైపరీత్యంపై స్పందించడమో, అతిస్పందించడమో ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం కాదు. స్త్రీ పట్ల నాటికీ, నేటికీ ఉన్న దృష్టి భేదాన్ని ఒక సామాజిక చారిత్రక కోణం నుంచి ముందుకు తేవడమే.

అదలా ఉంచితే…

పితృస్వామికత పక్షాన నిలబడిన కథకుడు ఈ కథలోనూ, ఇంకా మరికొన్ని కథలలోనూ వివిధ ఉపాయాలను, లేదా మాయోపాయాలను ఆశ్రయించాడని మొదట్లో చెప్పుకున్నాం. ‘కన్యాత్వ వరం’ అనేది వాటిలో ఒక కీలకమైన ఉపాయం, లేదా మాయోపాయం.

దాని గురించి తర్వాత…

 -కల్లూరి భాస్కరం

 

 

Download PDF

17 Comments

  • Thirupalu says:

    మహాభారతం గురించో, దాని కధనకుతూహాలం గురించో నా ఆశక్తి కాదు కానీ, పరాశరుని మత్స్యగంధి పుట్టిన వ్యాసుని గురించిన వివాధం పట్ల నా సందేహాన్ని వ్యక్తపరచడం అవసరమనిపిస్తుంది.

    పురుష స్వామ్యం నిర్వచనం పట్ల మనకు వివరణ అవసరం లేక పోవచ్చు. అయితే మాతృసామ్యం పట్ల సరైన నిర్వచణం అవసరం లేకపోతే అది వివాదస్పదంగానే ఉంటుంది. పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఊహీంచుకుంటే మాతృస్వామ్యమయుతుందా? మాతృ స్వామ్య వ్యవస్తలో పురుషుని పాత్ర ఏమిటి? -అంటే వ్యక్తిత్వపరంగా. ఏ వ్యవస్థలోనైనా పురుషునికి సంతానం పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. లైంగిక కోరిక తీర్చుకోవడం వరకే అతడు పరిమితమై ఉంటాడు. సంతానం పట్ల స్త్రీకి ఉన్న భాధ్యత అతనికిలేదు. ఒక్క పురుషస్వామ్య వ్యవస్థలోనే అతనికి బాధ్యత వహించవలసిన అవసరం వచ్చింది. అదీ స్వంత ఆస్తి విధానంలో వంశాంకురాన్ని పెంపొందించుకొనే పేరిట. ఈ ఆస్తి తనకు కలిగిన పిల్లకు సొంత మై ఉండాలి కాబట్టి తన తన సహా చరురాలు తనకుతప్ప ఇతరులతో పునర్పత్తి పొంద కూడదు, అందు వల్ల ఆమే ఏక పతీవ్రత అయి ఉండాలి. ఇలా ఉండాలంటే ఆమె మీద సర్వ హక్కులు తనవై ఉండాలి.
    మాతృ స్వామ్‌య వ్య వస్థలో స్త్రీలు ఉపయోగించుకున్నా అదికరం ఏమిటీ? వారి కోరిక ద్వారనే వారు పిల్లాల్ని కన్నార? పునర్పత్తికి పురుషుని పాత్రా కేవలం స్త్రీ అనుకూలంగ నడచు కోవటమేనా? – అంటే స్త్రీకి తలవగ్గి. ఇలా కాకుండ పురుషస్వామ్య ప్రవృత్తితోనే -పురుష దురహాంకారముతోనే-అతని పునర్పత్తిలో పాల్గొని ఉంటే స్త్రీ స్వామ్యానికి అర్ద మేమిటి? పునర్పుత్తి కేవలం తండ్రిపరంగా లేక పోవటమే మాతృస్వామ్యమా?

    సాముహిక అవసారలనుండే మానవ సంబదాలు ఏర్పడినవీని మనకు తెలుసు. మానవుడు వేటాడె దశ నుండి పశుపోషణ, వ్యవసాయం కనుగొనే దశవరకు మాతృస్వామ్యం వర్దిల్లింది.- దీన్ని వివరిస్తే బాగుంటుంది.

    • కల్లూరి భాస్కరం says:

      తిరుపాల గారూ…ధన్యవాదాలు. అందరికీ తెలిసిన పురుషస్వామ్యం గురించి కొత్తగా చెప్పడం నా ఉద్దేశం కాదు, మాతృస్వామ్య లక్షణాలు ఉన్న కథలను పితృస్వామ్యానికి ఎలా మార్చారో చెప్పడానికే నా ప్రయత్నం. ఇక మీరు వేసిన ప్రశ్నలు విపులంగా సమాధానం చెప్పుకోవలసినవి కనుక ఇది తగిన చోటు కాదు. ఈ వ్యాసాల అనుక్రమంలో సమాధానాలు దొరకచ్చేమో. చివరగా మీరు చేసిన సూచనను కూడా దృష్టిలో ఉంచుకుంటాను.

  • Nageswara Rao says:

    భాస్కరం గారూ ! నాకు ఒక్క సందేహం .. మీరు మహాభారతం మీద విశ్లేషణ చేస్తున్న ఇతర భాగాల తో పోలిస్తే ఈ పరాశరుడి భాగం మరింత మనోహరంగా ఉంది.. (కళ్ళకి సుమా !) రవివర్మ బొమ్మ తో మొదలుపెట్టిన మీ ఆర్టికల్ అదే బొమ్మని చక్కగా కొనసాగిస్తోంది..అయితే గమనించారో లేదొ – మొదట్లో గడ్డాల రిషి కనిపించాడు కానీ క్రమంగా మీరు పొరల్లోకి పారా పలుగు వేసుకుని దిగుతున్న కొద్దీ పేజి ఎడిటర్ గారు కూడా నెమ్మదిగా (అభ్యుదయ – ప్రగతిశీల- కొత్త కోణాల – ఆదివాసి మరియు స్త్రీ జనోధ్ధారక – మహిళా – మాతృస్వామ్య సమర్థక- కొండొకొచో సాంప్రదాయపాండిత్య – కుహనా పౌరాణిక భావజాల వ్యతిరేక) పొరలు వదిలించుకుని ఆర్టికల్ కథానాయకుడి (పరాశరుని) బాటే పట్టి అమాయక మత్స్యగంధి పైనే కాన్సంట్రేషన్ చేస్తున్నారు! బొమ్మ సైజు కాస్త పెరిగింది కూడానూ! బావుంది .. మరి శ్రద్ధగా చదివే పాఠకులకి కూడా రిషి లాగానే చిలిపి ఊహలు కలిగితే (గిల్లాలనీ, ఎట్సెట్రా- మీరు రాసిందే) ఆ దోషం ఎవరిదీ?
    నట్టింట్లో పెట్టిన టీవీ లో సినిమాల అశ్లీలం మీద చర్చ పెట్టి ముప్పావు వంతు బూతు దృశ్యాలు చూపిస్తూ “మై గాడ్ .. హౌ బ్యాడ్” అంటూ హూంకరించే మీడియా ఆసామీల మీడియా బిజినెస్ కన్నామీరు- మీ కొత్త కోణాల(సారి – పొరల!) గోల ఏ రకంగా తేడా? పైగా తేదీలు అవీ పెట్టి ఢిల్లి ఉదంతాన్ని గుర్తు చేయడం.. అంత సామజిక బాధ్యత ఉన్నవారు ఫోటో ఏమి వస్తోందో గుర్తుపట్టలేరా? (భాస్కరం గారు కచ్చితంగా బొమ్మ పెట్టి ఉండరు నాకు తెలుసు కానీ అయన చెప్పే విషయానికి సరిగ్గా వ్యతిరేక దిశలో విషయం పోతున్నప్పుడు గ్రహించలేని వారు కాదు కదా?)
    మరిప్పుడు మనం ఏ పొరలో ఉన్నాం?
    పురుష జాతి అంతా (భాస్కరం గారితో సహా) పరాశరుడి వారసులమెమో అన్న సందేహం- పరాశరుడి వారసులమే సుమా అనే గ్రహింపు – కలుగుతోంది!
    కుహనా పౌరాణిక భావాలతో (అగైన్ సారీ!) ఒక శ్లోకం –
    (“ఆకాశాత్పతితం తోయం యథా గచ్చతి సాగరం- సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి!”)
    (“ఏ కోణాలైనా ఎన్ని పొరలు తవ్వి ఏమి నిరూపించాలని చూసినా అన్నీ చివరికి చేరేది పాపులారిటీ – సాగర తీరానికే!”)

    • కల్లూరి భాస్కరం says:

      మీ అద్భుత ‘ఖండన’తో నన్ను మరోసారి నిరుత్తరుణ్ణి చేశారు. ధన్యవాదాలు.

      • Nageswara Rao says:

        ముందు మీ సంయమనానికి అభినందనలు.. కొనసాగించండి ..!

  • prabhakara rao ch v says:

    కల్లూరి భాస్కరం గారు
    మీరు రాసినట్లు మాతృస్వామ్యం పోయి పితృస్వామ్యం వస్తున్నా దశలో మగవాని అహంభావాన్ని చూపడానికి స్త్రీ ని ఏదో విధంగా లోన్గాదీసుకోవడమే అతని గొప్పతనం గా మన పురాణం ఇతిహాసాలు చెపుతాయి. భారత దేశం లోని ఎ గ్రంథంలో కూడా పురుషుడు బలవంతంగా స్త్రీని లొంగదీసుకోవడం తప్పు అని చెప్పలేదు. ఒక వేల అలా చెప్పిన రావణుడు కీచకుల కథలు తీసుకొంటే వారు మూల కథలోని కథా నాయకులకు శత్రుత్వం కలిగిన వర్గానికి చెందినవారి ఉంటారు.

    పురాణం ఇతిహాసాల లోని అంశాలను ఈ దృష్టితో చూస్తె అందులో స్త్రీలను పూర్తిగా పురుషునికి ల్లోంగి ఉండే ఒక భొగలాలసమైన వస్తువుగా మాత్రమె చిత్రీకరించారు. ఈ విషయం గ్రహించడానికి మేదావులో పందితులో కానవసరం లేదు. కనీస పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా చదివిన కథలనుంది, విన్న పురాణం వ్యాఖ్యాన్నాలనుంది గ్రహించగలరు.

    గతం విడిచిపెట్టండి. నేటి పరిస్తితి ఏమిటి?
    ఈనాటి పత్రికలలో కాని ఇతార సాహిత్యంలో కాని స్త్రీకి ఇస్తున్న స్తానం ఏమిటి? స్త్రీ ని అందమైన భొగలాలసమైన ఒక వస్తువుగా చిత్రీకరించడం లేదా? దానికే మన సమాజం పెద్దపీట వేయడం లేదా?
    గొప్ప వాలం అని అనుకొనేవారు, ధనవంతుల పార్తిలలో అదే ఆర్తికంగా భాగా సంపాదించిన వారిలో స్త్రీ పరిస్తితి ఏమిటి?
    నేటి సినిమాలో టి వి లో స్త్రీ కి ఎలాంటి స్తానం ఉందో తెలుసుకోవాలి.
    గతం గురించి చర్చించుకోవడం అవసరం అయినా నేటి సమాజంలో స్త్రీ కి తగిన గౌరవం కల్పించే పరిస్తితులు ఉన్నాయా?
    ఆలోచించే జనం కాదు, ఆచరించి, అందరిలో స్త్రీ కి తగిన గౌరవం హక్కులు కల్పించాలి.
    ప్రతి ప్రభుత్వ అధికార కార్యక్రమం లో అతిథులకు ఆహ్వానం పలకడానికి పూలో, మేమొంతో లు అందించాదానికి స్త్రీలే అందంగా అలంకరించుకొని స్టేజి పైన కనబడాలి, ఎందుకు?
    ఇక సినిమా కార్యక్రమాల సంగతి సరే సరి.?
    మరి మనం ముందుకేల్తున్నామా, లేక వేనిక్కా? ఆలోచించండి.

    • Nageswara Rao says:

      నేను చెప్పింది కూడా అదే! నైస్ కామెంట్ !!

    • కల్లూరి భాస్కరం says:

      ప్రభాకరరావు గారూ…నేటి స్త్రీ పరిస్థితి గురించి మీరు చెందిన ఆవేదనలో నిజం ఉంది. ధన్యవాదాలు.

  • మహోజస్ మర్రిపూడి says:

    మగవాళ్ళమై ఉండీ మనం మగవాణ్ణి విమర్శించడం పనికిరాదు. ఇహనైనా ఈ కార్యకలాపాలు ఆగిపోవాలని కోరుతున్నాను. ఇప్పటికే మగవాణ్ణి మీడియాలోనూ, సాహిత్యంలోనూ చాలా లోకువ చేసేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆడవాళ్ళెవరూ ఆడవాళ్ళని విమర్శించడం లేదు. వాళ్ళంతా మగవాళ్ళకి వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఆ విధంగా ఆడవాళ్లూ మగవాడి మీదే పడి ఏడవడం, మగవాళ్ళూ మగవాడి మీదే పడి ఏడవడం – ఇదంతా నాకెందుకో మంచిగా అనిపించడం లేదు. పురుషాహంకారం అనే మాట తరచుగా వింటున్నాం. స్త్రీ అహంకారం కూడా బాగానే కనిపిస్తోందిగా? దానికేమంటారు ?

    • Nageswara Rao says:

      నేను మహోజస్ గారితో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను!

  • Praveen says:

    మాతృస్వామ్యం కోసమే ఈనాడు స్త్రీలు ఉద్యమాలు చేస్తున్నారు . ఆడ పెత్తనం ఉన్న కుటుంబాలు దేశంలో చాలానే ఉన్నాయి. ఈ సంఘర్షణ అనాది నుంచి ఉందని భాస్కరం గారి విశ్లేషణలో తెలుస్తూ ఉన్నది.

  • మహోజస్ మర్రిపూడి says:

    ప్రవీణ్ గారూ ! మాతృస్వామ్యానికి ఇప్పుడు ఉద్యమాలతో పనేముంది ? అమల్లో ఉన్నదే మాతృస్వామ్యం. ఉదాహరణకి, ఈ రోజుల్లో ఏ పిల్లలకైనా తండ్రివైపు బంధువులతో సాన్నిహిత్యం ఉందా ? అలాంటివి ఏవైనా ఉంటే, లేదా ఏర్పడతాయనే అనుమానం కలిగితే వాటిని శాశ్వతంగా కట్ చేయడానికి తల్లి వెంటనే రంగంలోకి దిగుతుంది. పిల్లలు ఏ బళ్ళో చదవాలి ? ఏ మీడియంలో చదవాలి ? ఏ సబ్జెక్టు ఆప్షనల్ గా తీసుకోవాలి ? ఏ ఉద్యోగం చేయాలి ? అంతా తల్లుల నిర్ణయమే తప్ప తండ్రి ప్రమేయం ఎక్కడా కనిపించదు. అలాగే భార్యాభర్తలు విడిపోతే పిల్లలందరినీ తల్లి కస్టడీలో పెడుతున్నారు తప్ప కనీసం వాళ్ళ బరువు మోస్తున్నందుకైనా ఆ తండ్రిని వాళ్ళ దరిదాపుల్లోకి రానివ్వట్లేదు. కన్నబిడ్డలు కదా అనే ప్రేమతో వారి దగ్గరికొస్తే, కిడ్నాప్ చేయబోయాడంటూ అతని మీద కేసులు పెడుతున్నారు. సంపాదించి ఇవ్వడానికీ, ఆస్తులు పంచడానికీ తప్ప మగవాడితో మరే పనీ లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు అందరూ !

  • ikkurthi narasimharaoi says:

    bhaskaram gaaroo ;మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య ము వైపు సమాజము ఎలా ప్రయనిన్చిందో పరిసోధనత్మకంగా వివరించడమే మీ వ్యాసాలుద్దేస్యం అయితే o.k. విశ్లేషణ అభినందనీయం .

    • కల్లూరి భాస్కరం says:

      ఆలస్యంగా…ధన్యవాదాలు నరసింహారావుగారూ…

  • anrd says:

    జరత్కారుడు-జరత్కారువుల సంబంధం..పరాశర-మత్స్యగంధుల సంబంధం లాంటిది కాదు. జరత్కారుడు-జరత్కారువు వివాహం చేసుకుని కలిసి జీవించారు.
    …………………..
    గాంధారి తండ్రి సుబలుడు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశానన్నాడు! ఆ సంబంధం గురించి కుటుంబసభ్యుల్లో ఎలాంటి చర్చ జరిగినా సరే, వారి ఇష్టాయిష్టాలు ఏవైనా సరే; వాటికి సుబులుని మాటతో అడ్డుకట్ట పడిపోవలసిందే.
    ……….
    పూర్వం యయాతి విషయంలో కూడా అతని ఇష్టంతో సంబంధం లేకుండా దేవయాని తండ్రి బలవంతం వల్ల యయాతి దేవయానిని వివాహం చేసుకోవలసి వచ్చింది.

    ( యయాతి, దేవయాని తండ్రి ఇచ్చే శాపానికి భయపడకుండా తనకు దేవయానిని వివాహం చేసుకోవటం ఇష్టం లేదని చెప్పేసి ఉండవలసింది. పోనీ తరువాతైనా శర్మిష్టకు దూరంగా ఉండవలసింది. )
    తనకు దేవయానితో వివాహం ఇష్టం లేదని యయాతి చెప్పలేకపోయాడు. తనకు ధృతరాష్ట్రునితో వివాహం ఇష్టంలేదని గాంధారి చెప్పలేకపోయింది.

    వాళ్ళు అలా చెప్పలేకపోవటానికి అనేక కారణాలున్నాయి. అంతే కానీ, పితృస్వామ్యమా లేక మాతృస్వామ్యమా అన్నది కారణాలు కావు.

    ఎవరి వివాహం ఎవరితో జరగాలనే విషయం వెనుక ఎన్నో అంశాలు ముడిపడి ఉండేవి. ఆర్ధికకారణాలు, రాజకీయకారణాలు, సామాజిక కారణాలు, తల్లితండ్రి, పిల్లల ఇష్టాలు………మొదలైనవి ఎన్నో ఉంటాయి. .

    ఉదా..పూర్వం కొందరు రాజులు రాజ్యవిస్తరణలో భాగంగా వివాహసంబంధాలను పెంచుకునేవారు. అంతేకానీ వివాహాలు జరగటం వెనుక మాతృస్వామ్యం పితృస్వామ్యం అని కాదు.

  • anrd says:

    ప్రాచీన గ్రంధాలలోని కధల ద్వారా ఎన్నో మనస్తత్వాల గురించి , ఎన్నో సంఘటనల గురించి తెలుసుకోవచ్చు. అవన్నీ తెలుసుకుని మన జీవితంలో జాగ్రత్తగా నడుచుకోవచ్చు.

    సత్యవతితో పరాశరుడు, తాను ఇంతకుముందు ఎందరో అప్సరసలను చూసినా మనస్సు చలించలేదని , ఇప్పుడు సత్యవతిని చూసిన తరువాత అలా అనిపించటమేమిటో తనకే వింతగా ఉందని అంటాడు.

    స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ ఎంతో చిత్రమైనది. ఎంత గొప్పవారైనా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.
    ఎంత గొప్ప వ్యక్తులయినా సరే, స్త్రీపురుషుల సామీప్యం, ఒంటరిగా ఉండే అవకాశం వస్తే వాళ్ళ మనస్సులు అదుపు తప్పే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవచ్చు.

    అయితే, ఎటువంటి పరిస్థితి ఎదురైనా కొందరు తమ స్థితప్రజ్ఞతను కోల్పోరు. ఉదా..శ్రీరాముడు, శుకుడు… వంటి మహానుభావులు.

  • anrd says:

    పరాశరుడు సత్యవతీదేవికి కన్యాత్వం పోకుండానే సంతానాన్ని ఇచ్చారంటే ఆమె శీలాన్ని కోల్పోలేదని అర్ధం. అప్పట్లో స్త్రీ పురుషుల కలయిక లేకుండానే గర్భాన్ని ధరించే పద్ధతులు, మహిమలు ఉండేవట.

    ఉదా.. ఒకప్పుడు వ్యాసులవారికి పుత్ర వాంచ కలిగింది. తపస్సు చేసి శివుని ద్వారా వరాన్ని పొందారు. యాగాగ్ని కోసం అరణిని మధిస్తుండగా ఒక అప్సరస శుకిగా( చిలుక )మారి పరిసరాలలో ఎగురుతూ కనిపించింది. ఆ చిలుకను చూసి , సంతానం కోసం ఆమెను వివాహం చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ అరణిని మధిస్తుండగా వీర్యం అరణిలో పడటం , ఇంతలో శుకుడు జన్మించటం, పుడుతూనే పెద్దగా అవటం జరిగిపోయాయి.

    పూర్వం ఇలాంటి చిత్రాలు ఎన్నో జరిగేవి.

    స్త్రీకి కన్యాత్వం పోకుండానే సంతానాన్ని ప్రసాదించ గల మహర్షులు ఉండేవారు. పరాశరుడు, సూర్యుని వంటి దేవతల వల్ల కన్యాత్వం పోగొట్టుకోకుండా సంతానాన్ని పొందిన వారు శీలవతులే.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)