వూస బియ్యం..అనపకాయలు…నిన్నటి తీయని తలపులు!

Grain_millet,_early_grain_fill,_Tifton,_7-3-02

వూస బియ్యం…!

మీరు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..??

ఇది పల్లె టూర్లో  పుట్టి పెరిగిన వారికి మాత్రమే అర్ధమయ్యే మాట. అదీ మాగాణి భూముల్లున్న వారు కాకుండా ,మెట్ట పంటలు పండించే వారికి మాత్రమే తెలుస్తుంది. అవును..మళ్ళీ మెట్ట పంట లేంటీ అనే ప్రశ్న వచ్చింది కదా.. బాగా నీటి వసతి, కాలువలు, చెరువులూ, నదీ తీరాల్లో ఉన్నవారికి  వరి పంట పండుతుంది. లేదా వాణిజ్య పంటలు పండిస్తారు. కానీ నీటివసతి సరిగ్గాలేనివారు , వర్షాధార పంటలు , మెట్ట పంటలు పండిస్తారు. మెట్ట పంటలంటే వేరు శనగ , జొన్న, మొక్కజొన్న, సజ్జ ,కంది ,పెసర ,మినుము ఇలా అన్నమాట. మాకు మావూర్లో నీటి పారుదల లేదు. చిన్న చెరువు ,వర్షాధారం , మోట భావుల ద్వారా మాత్రమే పంటలు పండేవి. ప్రతి వారూ, వారికి సం.నికి సరిపడా వరి పంట వేసుకొని , మిగిలిన భూముల్లో మెట్ట పంట వేసుకొనేవారు అన్నమాట.

మా నాన్న గారూ కూడా అలాగే చేసేవారు. అందుకే మాకు కొద్దిగా వరి , వేరు శనగ, జొన్న ,సజ్జ, కంది ,పెసర , కొద్దిగా మిర్చి పండేవి. వేరు శనగ కాస్త ముదరగానే.. జీతగాళ్ళ ద్వారా అమ్మ ఇంటికి తెప్పించి, పచ్చికాయలు ఉప్పు వేసి ఉడికించడం , లేదా శనగ చెట్లు (ఎండినవి ) వేసి కాల్పించేది. వాళ్ళు ఇంటివెనుక మంటవేసి కాయలు కాలుస్తూ, కర్రతో మంట సరిచేస్తూ, కాయలు మాడకుండా తిప్పుతూ వుంటే , మేం చుట్టూ కూర్చుని కమ్మటి వాసన పీలుస్తూ కూర్చునేవాళ్ళం.  “దూరం జరగండి అమ్మాయి గారూ.. నిప్పురవ్వ ఎగిరొచ్చి మీద పడతుంది..” అన్నా వినేదాన్ని కాదు.నాకూ అలా కర్రతో విన్యాసం చెయ్యాలని వుండేది. కానీ ఇచ్చేవారు కాదు. భయం కదా..మా నాన్న అంటే..”దొర సంపేస్తాడు..నిప్పు తో చెలగాటం అమ్మాయిగారూ ..” అంటూ..అంతాకాల్చాక.. నీళ్ళు పల్చగా చల్లి నిప్పు ఆర్పి , చాటలోకి ఎత్తి, బొగ్గు, నుసి ,బూడిద చెరిగి అమ్మకు ఇచ్చేవాళ్ళు.

download

అమ్మ పేపర్ ముక్కలు చింపి వాటిల్లో కాల్చిన పల్లీలు , తలా ఒక బెల్లం ముక్క ఇచ్చేది..ఆ కమ్మటి  వాసన ,రుచి..ఆ పచ్చికాయలు కాల్చిన రుచి..ఇక జన్మలో తినగాలనా..ఉహూ..నమ్మకం లేదు..అవి గతకాలపు తీపి గుర్తులు మాత్రమే..నాకు ఉడక బెట్టిన పల్లీలు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు రైతుబజార్ లలో పచ్చికాయలు దొరుకుతాయి అప్పుడప్పుడు..అవి ఉడకపెడతాను ,ఉప్పేసి కుక్కర్లో..కానీ ఆ రుచి..నా చిన్నప్పుడు అమ్మ కట్టెల పొయ్యి మీద ,ఇత్తడి గిన్నెలో ఉడికించిన రుచి..మళ్ళీ ఎలావస్తుంది..?
మీకు వూస బియ్యం గురించి కదా చెప్తాను అన్నాను.. అక్కడికే వస్తున్నా.. జొన్న , సజ్జ కంకులు వేసి గింజ పట్టి కొద్దిగా గింజ గట్టి పడగానే వాటిని ‘పాల కంకులు’ అంటారు. అంటే గింజలు తియ్యగా , నమిలితే పాల లాగా ఉంటాయన్నమాట. అప్పుడు కూడా అమ్మ కంకులు తెప్పించేది. పనివాళ్ళు వాటిని రెండు చేతులతో నలిచేవారు. అప్పుడు కంకులనుండి గింజలు రాలినా ,వాటికి నుసి వుండేది..అది గొంతులో గుచ్చుకుంటుంది. మళ్ళీ బాగా నలిచి, చెరిగి, పూర్తిగా నుసి పొయ్యాక మాత్రమే తినాలి. ఆ గింజలని “వూసబియ్యం “ అంటారు. వాటిని అలా తిన్నా..ఎంత తియ్యగా ఉంటాయో..నాకు సజ్జ వూసబియ్యం చాలా ఇష్టంగా ఉండేవి. వాటిలో కొద్దిగా చక్కర వేసి తింటే..ఆ రుచి ఎలా చెప్పను…??? నేను తినే ..దగ్గర దగ్గర 39,40 సం. అయ్యింది. ఇప్పటి వారికి సజ్జ , జొన్న ఎలావుంటాయో కూడా తెలియదు..ఇక వాటి రుచి తెలిసే అవకాశం శూన్యం… పైగా పంటలు రాగానే, మా అమ్మ సజ్జన్నం, జొన్నన్నం వండేది..గోంగూర పచ్చడి , దోసకాయ పప్పు, వెన్న, ఉల్లికారం కాంబినేషన్స్ తో..అసలు అలాంటి విందు భోజనాలూ ,రుచులూ ఎంత మందికి తెలుసు..?తిన్నవారు వుంటే..చెప్పండి ..విని ఆనందిస్తాను.
అలాగే మరో రుచి..నాకు ఎప్పుడూ గుర్తుకొచ్చేది..మేం కోదాడ కి వచ్చేటప్పటికే నాకు దొరకని ఆ రుచి..ఉడకబెట్టిన ‘అనపకాయలు’… అబ్బ.. నాకు విపరీతమైన ఇష్టం ..అవి మాకు పండేవికాదు…అవి పొలం గట్లమీద తీగల్లాగా వేసుకొనేవారు..చిక్కుడు కాయల్లగేవుంటాయి. గింజలు కూడా చిక్కుడు గింజల కన్నా కాస్తపెద్దగా ,ఆకుపచ్చగా..ఉండేవి. కాయలతోసహా తంపెట (నీళ్ళలో ఉడికించడం ) పెట్టేవారు..స్కూల్లో కొందరు అమ్మాయిలు తెచ్చేవారు. నాకు ఇష్టమని ఇచ్చేవారు..కానీ నాకు మాఇంట్లో ఎక్కువగా తినాలని ఆశ. బయట తిన్నానని చెపితే తిట్టేది అమ్మ. అలా ఎవరు పడితే వాళ్ళు పెట్టినవి తినకూడదు అని..( అప్పటి సాంప్రదాయాలకి బద్దులు ).., కానీ నేను తినేదాన్ని. మా రెండో అన్నయ్య ,ఇంటికి వచ్చి అమ్మకి చెప్పేవాడు.అమ్మ తిట్లు..అయినా షరా మామూలె అనుకోండి.. మా ఇంట్లో అవి  ఉడకబెట్టడం మాత్రం జరగలేదు..నాకు పదేళ్ళు దాటాక వాటిని తినలేదు కూడా మళ్ళీ..కానీ నాకు వాటి వాసన , రుచి మాత్రం గాఢ౦ గా గుర్తుండిపోయింది. ‘అనపకాయలు ‘ ఎవరికైనా తెలుసా..? అసలు ఇప్పుడు పండుతున్నాయో లేదో కూడా తెలీదు..

-ఉషారాణి నూతులపాటి

10014699_686488301403306_267157800_n

Download PDF

9 Comments

  • మణి వడ్లమాని says:

    ఉషాగారు

    చాలా చక్కగా వివరించారు. అసలు రైతన్న యెంత కష్టపడతారో పంటలు అందులో మెట్ట పంటల గురుంచి చాలామందికి (అందు లో నేను కూడా వున్నాను) తెలియదు. మీ వ్యాసం ద్వారా వాటిని గురుంచి తెలుసుకొనే అవకాశం కలిగింది.
    ధన్యవాదాలు

    • Usharani Nutulapati says:

      ధన్యావాదాలు మణి గారూ.మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది.

  • V Balasundari says:

    ఉష నీ వ్యాసం చాల బాగుంది. నిజం చెప్పాలంటే నాకు నువ్వు చెప్పిన వివరాలేమీ తెలియవు. అభినందనలు. ఇలాంటి మరిన్ని వ్యాసాలూ రాయాలని కోరుకుంటూ ……… బాలక్కయ్య

    • Usharani Nutulapati says:

      నమస్తే బాలక్కయ్య గారూ. ధన్యవాదాలు.:)
      మీ అభిమానానికి ధన్యవాదాలు.తప్పక మరిన్ని వ్యాసాలు రాయడానికి ప్రయత్నిస్తాను.

  • G.S.Lakshmi says:

    ఉషగారూ,
    నాకు ఈ మెట్టపంటలు తెలీవు. అయినా ఆ రోజుల్లో ఎరువులూ గట్రా వెయ్యకుండా వచ్చే పంటల్లోని సహజమైన రుచి మరింకెప్పుడూ రాదు. చాలా బాగా రాసారు. అభినందనలు.

  • budugoy says:

    ఉషారాణి గారు, బాగుంది మీ జ్ఞాపకం. అనపకాయలు ఈ రోజుల్లో కూడా శుభ్రంగా దొరుకుతాయి. బెంగుళూరులో ఔరేకాయి/హౌరేకాయి అని అమ్ముతారు. కాని వీటికంటే నల్లరేగడి నేలల్లో పండి రంగురంగుల గింజలతో వచ్చేవి చాల బాగుంటాయి. మంచి ప్రొటీను ఫుడ్డు. తెలంగాణలో/రాయలసీమలో, సీజన్లో దొరుకుతాయి. ఆంధ్రా గురించి నాకట్టే తెలీదు.

    • మంజరి లక్ష్మి says:

      మొదట టైటిల్ చూసి అనపకాయలు అని రాస్తే ఆనపకాయ (సొరకాయ) అని రాయబోయి అచ్చుతప్పు జరిగిందేమో అనుకున్నాను. తరువాత వర్ణనను బట్టి అవి వేరేవిలా ఉన్నాయనుకున్నాను. మీరు చేసిన వర్ణన చూస్తే ఇక్కడ(విజయవాడలో) సీమచింతకాయలని అమ్ముతారు, వాటిని గురించి రాసారేమో అనిపిస్తుంది. వాటిలోపల గింజలు కూడా అలా రంగులు రంగులుగానే ఉంటాయి మరి.

      • సాహితి says:

        అనప కాయలు వేరేనండి! అనపకాయలను గుగ్గిళ్ళు చేసి తింటే చాలా రుచిగా ఉంటాయి, మెట్ట ప్రాంతాల్లోనే ఎక్కువగా పండుతాయి.

  • Malathi says:

    చాలా బాగా వివరించారు నా చిన్నతనం లో అమ్మ కూడా అలాగే చేయించే వారు అమ్మని గుర్తుచేసినమ్దుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)