చేరా అంటే మంచి సంభాషణ!

10534397_326754877475156_564669077665495274_n

చేరాగారు ఇక లేరన్న దుర్వార్త వినడానికి రెండురోజుల ముందే హఠాత్తుగా ఆయన గుర్తొచ్చారు. అప్పుడప్పుడు పరిచితుల విషయంలో నాకు అలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అదెలా జరుగుతుందో నాకు తెలియదు. ఆయన ఎలా ఉన్నారో అనుకున్నాను. ఆయన ఆరోగ్యంగా లేరని తెలుసు కనుక ఎక్కువగా తిరగడం లేదని అనుకునే వాడిని. కానీ సభలకు, కచేరీలకు వెడుతూనే ఉన్నారని ఇప్పుడు తెలిసి అవునా అనుకున్నాను. నాకు సభలకు వెళ్ళే అలవాటు పెద్దగా లేకపోవడం వల్ల ఆయనను మిస్ అయినందుకు బాధపడ్డాను.

నగరజీవితం విచిత్రంగానూ, వైరుధ్యవంతంగానూ ఉంటుంది. నగరంలో మనుషుల మధ్య ఉన్నప్పటికీ మనుషుల సంపర్కాన్ని కోల్పోతూ ఉంటాం. ఎవరికి వారం మనలో మనం ఒంటరి జీవితం గడుపుతూ ఉంటాం. ఏదో ఒక రంగంలో అభిరుచిని పంచుకునేవాళ్లు అందరూ ఒకే కాలనీలో ఉండే ఏర్పాటు ఉంటే ఎంత బాగుండుననిపిస్తుంది.

నేను చదువుకునే రోజులలోనే చేరాగారితో పరిచయం. హైదరాబాద్ లోని ఒక సాంస్కృతిక సంస్థవారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో బహుమతిగా వచ్చిన కప్పును నాయని కృష్ణకుమారిగారి చేతుల మీదుగా పుచ్చుకుని విద్యానగర్ వెళ్లడానికి బస్సు ఎక్కాను. బస్సులో ఒకాయన పక్కన సీటు ఉంటే కూర్చున్నాను.

ఆయన నన్ను చూసి చిరునవ్వుతో పలకరించారు. తను కూడా ఆ సభకు వచ్చానని చెప్పారు. కొంత సంభాషణ జరిగాక, నేనే అడిగానో, ఆయనే చెప్పారో గుర్తులేదు కానీ నా పేరు చేకూరి రామారావు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ‘భారతి’లో ఆయన రాసిన భాషాశాస్త్ర వ్యాసాలు చూశాను కనుక వెంటనే ఆ పేరు గుర్తుపట్టాను.

అంతలో బస్సు విద్యానగర్ స్టేజ్ లో ఆగింది. ఇద్దరం దిగాం. ఇళ్ల వైపు నడుచుకుంటూ వెళ్ళాం. ఆయన సమవయస్కునిలా, ఒక మిత్రుడిలా నాతో చనువుగా మాట్లాడడం ఆయన వ్యక్తిత్వంలోని ఒక కోణాన్ని అప్పుడే నాకు పరిచయం చేసింది. తన ‘భారతి’ వ్యాసాలు అర్థం కావడం లేదన్న ఫిర్యాదుపై అప్పట్లో ఆయన బాగా ఆలోచిస్తూ ఉండేవారు కాబోలు, దాని గురించి నన్ను గుచ్చి గుచ్చి అడిగారు. అర్థమయ్యాయని చెప్పగల స్థాయి నాకు అప్పుడు లేదు. నిజానికి ఇప్పుడూ లేదు. అది నా రంగం కాదు. అప్పుడు ఆయనకు ఏం సమాధానం చెప్పానో గుర్తులేదు.

అంతలో ఆయన ఇంటికి దారి తీసే సందు వచ్చింది. ‘రా, మా ఇల్లు చూపిస్తాను’ అంటూ తీసుకెళ్ళారాయన. అది రోడ్డుకు ఆట్టే దూరంలో లేదు. ఆ పక్క సందులోనే మా అన్నయ్య ఉంటున్న ఇల్లు.

ఆ తర్వాత కొన్నిసార్లు ఆయనింటికి వెళ్ళాను. సాహిత్యం గురించి మేము మాట్లాడుకునేవారం అనే సాహసం నేను చేయను. ఆయన మాట్లాడుతుంటే వినేవాణ్ణి. దిగంబర కవిత్వం పట్ల, అందులోని భావజాలం పట్ల ఆయనకు అభ్యంతరం ఉండేది కాదని మాత్రం తెలిసేది. అప్పటి సాహిత్యరాజకీయాలపై కూడా ఆయన చాలా ఆసక్తిని చూపుతూ ఉండేవారు. వాటి గురించి మాట్లాడేవారు. ఫలానా పత్రికలో ఫలానా వ్యాసం వచ్చింది చూడు అనేవారు. తన దగ్గర ఆ పత్రిక ఉంటే ఇచ్చేవారు. అప్పుడే అరసంలో చీలిక, సెవెన్ స్టార్ సిండికేట్ రభస వగైరాలు, శ్రీ శ్రీ, దాశరథి లాంటి కవుల వ్యక్తిగత వైరాలు, శ్రీ శ్రీ వారిపై గుప్పించిన కవితాత్మక దుర్భాషలు ఏదో పత్రికలో అచ్చవుతూ ఉండేవి. చేరాగారు వాటి గురించి ఎంతో కుతూహలంగా మాట్లాడుతూ ఉండేవారు.

అప్పట్లో ఆయన చెప్పిన ఒక పాఠం నాకు గుర్తుండిపోయింది.

అప్పటికి సాహిత్యాన్ని ఐడియలిస్టు వ్యూతో చూసే వయస్సు నాది. సాహిత్యరాజకీయాలు నాకు నచ్చలేదు. సాహిత్యంలో రాజకీయాలేమిటి అంటూ నేను ఆవేశపడ్డాను. చేరాగారు చిరునవ్వు నవ్వి ‘ఏం, సాహిత్యంలో రాజకీయాలు ఎందుకు ఉండకూడ’ దంటూ ఎంతో సౌమ్యంగా ఒక పాఠం చెబుతున్నట్టు నాకు వివరించుకుంటూ వచ్చారు. సాహిత్యమే కాదు, జీవితంలో రాజకీయం కానిదేదీ లేదని తేల్చారు.

సాహిత్యంపై నాకు అలా భిన్నదృక్పథాన్ని పరిచయం చేసింది ఆయనే.

ఆ తర్వాత కొన్నేళ్లు గ్యాప్ వచ్చింది.

‘ఆధునిక సాహిత్యంలో కాలికస్పృహ’ అనే పేరుతో నా వ్యాసం ఒకటి ఉదయం పత్రికలో వచ్చినప్పుడు, చేరా గారు తన చేరాతలలో దాని గురించి రాశారు, సాహిత్యవివేచనకు కొత్త పనిముట్టుగా దానిని పరిచయం కేసారు. కొత్త కవులను, వారి ధోరణులను పట్టించుకోవడంలో చేరాతలు ముందున్న సంగతిని ప్రస్తావిస్తూ , వచనరచనలు గుర్తించడంలో వెనకబడినట్టు ఒప్పుకుంటూ ఆ వ్యాసం ప్రారంభించారు. ఆపైన కొత్త తరంలో గుర్తించదగిన వచనరచనా ధోరణులు లేకపోలేదన్నారు.

నేను ఒకింత వచన పక్షపాతిని కనుక ఈ వ్యాసప్రారంభం నాకు సంతోషం కలిగించింది.

నేను ఆంధ్రప్రభ దినపత్రికలో ఉన్నప్పుడు సాహిత్యం పేజీ చూస్తున్న రోజుల్లో ఆయన అప్పుడప్పుడు మా కార్యాలయానికి వస్తుండేవారు. ఆయన వెంట తరచు హరి పురుషోత్తమరావుగారు ఉండేవారు. ఇద్దరి స్వభావాలలో తేడా ఉండేది. చేరాగారు సంభాషించేవారు, హరిగారు చర్చించేవారు.

చేరాగారు(భాషా)శాస్త్రం నుంచి సాహిత్యంలోకి వచ్చారు. ఆయనలో శాస్త్ర, సాహిత్య దృక్కోణాలు వేటికవే విడివిడిగా ఉండిపోయాయని నాకు అనిపించేది. భాష గురించి పరిశీలించేటప్పుడు ఆయనలో కనిపించే శాస్త్రవేత్త, సాహిత్యపరిశీలనకు వచ్చేసరికి తప్పుకుంటాడనిపించేది. సాహిత్యపరిశీలనలో ఆయనలోని భావుకుడు, అనుభూతివాది పైకి వచ్చేవాడు. చేరాగారితో నన్ను పోల్చుకునేంత సాహసం చేయను కానీ, నాది భిన్నమైన అనుభవం. నాది సాహిత్యదృష్టినుంచి శాస్త్రదృష్టికి పయనించే ప్రయత్నం. భావుకత, అనుభూతి ఒక్కటే నాకు సరిపోవు. వాటితోపాటు కాలికతా, సమాజమూ, చరిత్రా వగైరాలు మరికొన్ని కావాలి. చేరాగారే నాకు చెప్పిన పాఠం ప్రభావం కూడా దీని వెనుక గుప్తంగా ఉందేమో తెలియదు. అలాగని నేను విరివిగా రాసింది కూడా ఏమీలేదు.

నేను ఆంధ్రప్రభలో పద్య ప్రాసంగికత(రెలెవెన్స్) గురించి లేవనెత్తిన చర్చ సందర్భంలో ఈ దృక్పథ భిన్నత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆధునిక లేదా ఆధునికోత్తర భావసంక్లిష్టతను వ్యక్తం చేయడానికి పద్యం తగిన వాహిక కాగలదా అన్నది స్టూలంగా అప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్న. నా ప్రశ్నను వ్యతిరేకిస్తూ, అన్ని కాలాలలోనూ పద్యం సమర్థ వాహికే అవుతుందని నొక్కి చెబుతూ చేరాగారు చేరాతలలో రెండు వ్యాసాలు రాశారు. బేతవోలు రామబ్రహ్మంగారు తదితరులు కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. ఇప్పుడు చూస్తే, పద్యం గురించి నేను చేసిన చర్చలో అసమగ్రత, అవ్యాప్తి, అతివ్యాప్తి లాంటి దోషాలు ఉన్నాయనే అనిపిస్తుంది. అయితే, పద్యం ఆధునిక, లేదా ఆధునికోత్తర భావసంక్లిష్టతను వ్యక్తం చేయగలదా అన్న నా మౌలిక సందేహం మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.

ఇన్నేళ్లలోనూ చేరాగారిని తరచు కలుస్తూ మాట్లాడి ఉంటే ఈ సందేహంపై మరికొంత చర్చ చేసి ఉండేవారమేమో! నగరజీవితం, వృత్తి జీవితం నాకా అవకాశమూ, తీరికా ఇవ్వలేదు.

ఆయన జ్ఞాపకాలను చరిత్రబద్ధం చేసే ప్రయత్నంలో ఈ నాలుగు మాటలూ. ఆయనకు నా నివాళి.

                                                                                                                       -కల్లూరి

Download PDF

2 Comments

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)