చిన్న విషయాలు కూడా పెద్ద బాధ్యతే!

myspace

నా అమెరికా ప్రయాణాలు-2

కొత్తగా జర్నలిజంలోకి వచ్చినవాళ్ళకి, లేదా కొత్తగా ఓ ‘బీట్’ వచ్చిన రిపోర్టర్ కి వార్తా ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. అన్నీ వార్తగా మలచదగ్గ అంశంగా  కనిపిస్తాయి. ఇక్కడినుంచి వెళ్ళిన వాళ్ళకి సరిగ్గా అలానే కనిపిస్తుంది — ముఖ్యంగా అమెరికా వ్యతిరేక క్యాంపు నుంచి వెళ్ళేవాళ్ళకి.

అమెరికా ఓ అసంబంధ అంశాల పుట్ట. ఎవ్వరైనా బతకదగ్గ మార్గాలుంటాయి. Dignity of labour వుంటుంది. నిన్న ఓ కంపెనీకి సీయీఓగా పనిచేసే ఆయన ఏదైనా రిటైల్ స్టోర్ లో హెల్పర్ గా దర్శనమివ్వొచ్చు మీకు. ఏదైనా టెక్నాలజీ కంపెనీకీలకమైన పదవిలో వున్న మహిళ అప్పటిదాకా తను చేసిన పనికి అస్సలే సంబంధంలేని, తక్కువ డబ్బులు వచ్చే పనిలో చేరవచ్చు. పిల్లల చదువులో సాయం చెయ్యడానికి చేస్తున్న వుద్యోగం నుంచి విరామం తీసుకునే లేదా పిల్లల కాలేజీల్లోనే చేరే తల్లిదండ్రుల్నీచూస్తాం.
కానీ, పిల్లల్ని అలా రాత్రికి రాత్రికి వదిలేసి వెళ్లిపోయే వాళ్ళనీ చూస్తాం. ఎక్కువసార్లు తల్లికే, ఆమె రెండు మూడు సార్లు పెళ్లి చేసుకున్నా సరే, ఆ బాధ్యత పడుతుంది. అన్ని పెళ్లిళ్ల ద్వారా కలిగిన పిల్లల బాధ్యత కూడా ఆమెదే.
పిల్లల నుంచి, ఆపదలో వున్న వారినించి వచ్చే ఫోన్లు విని నిమిషాల్లో వాలిపోయే పోలీసులూ వుంటారు. ఒకసారి, న్యూయార్కు హోటల్ లోంచి బయటకు ఫోన్ చేసినపుడు పొరపాటున 911 (హోటల్ బయటకు 9, లోకల్ నంబర్ కి 1, మళ్ళీ అనవసరంగా 1) డయల్ చేశాను. తప్పు తెలుసుకుని, నంబర్ కరెక్ట్ గా డయల్ చేసి ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా, ఈ లోపల డోర్ బెల్ మోగింది. ఎవరా, అని చూస్తే పోలీసులు! నేను చేసిన పొరపాటును చెప్పినా కూడా, రూమ్ లోకి వచ్చి చూసి “Are you sure? Are you okay?” అని తరచి తరచి అడిగిగాని వెళ్లలేదు.
కానీ, వాళ్ళు నిన్ను అనుక్షణం వెన్నాడుతున్నారని తెలుసు. నిన్నే కాదు అమెరికాలో, ప్రపంచంలోని అన్నీ దేశాల్లోని వాళ్ళనీ – రాత్రీ, పగలూ, ఆఫీసుల్లోనూ, పార్కుల్లోనూ, పార్కుల బయటా – నీడలా వెంటాడుతూ వుంటారనీ, గమనిస్తూ వుంటారని తెలుస్తూనే వుంటుంది. మనమొక పొటెన్షియల్ శత్రువుగా కనిపిస్తుంటామనీ కూడా మనకి తెలుసు.

చాలా దూరాలు కూడా నేను కొంచెం లగేజీతోనే వెళ్ళడం నాకిష్టం. సుఖంగా వుంటుంది బరువు లేకపోతే. ఓసారి దాదాపు కేబిన్ లగేజికి  (విమానంలోకి తీసుకెళ్లగలిగే బరువు) సరిపోయే బేక్ పేక్, చిన్న బేగ్ తో బయలుదేరా. ఓ ఫ్రెండ్ వారించాడు. ఇలా అయితే, విమానాశ్రయంనుంచే పంపించే అవకాశం వుందని.

అన్న్తట్టుగానే, ఇమ్మిగ్రేషన్ అధికారి: “నీ లాగేజి వివరాలు చెప్పు. చెకిన్ (మనతో కాక విడిగా వచ్చే లగేజీ) చేశావా,” అని.

ఇక ప్రకృతి వనరుల్ని వృధా చెయ్యొద్దు, పర్వావరణాన్ని రక్షించడాని మూడో ప్రపంచదేశాలకి పొద్దున్న లేస్తే పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే అమెరికా, భూమికి చేసే నష్టం అంతా ఇంతా కాదు. అమెరికా కొన్ని చోట్ల పొగమంచు సమస్య వుంటుంది. ఇక్కడ లాగే. దానివల్ల డ్రైవింగ్ కష్టమై ప్రమాదాలు జరుగుతాయి.  అందువల్ల మనమైతే అవసరమైన లైట్లు రాత్రిపూట వేసుకుంటాం. కానీ, చాలాచోట్ల కార్లు, బస్సులు పగటిపూట, ఎండ దగదగ కొడుతున్నపుడు కూడా లైట్లతోనే తిరుగుతాయి. ఓ ఫ్రెండ్ చెప్పేడు, మరిచిపోతామేమోనని, డీఫాల్ట్ గానే వెలిగిపోతాయి లైట్లని.
వాహనాల ప్రస్తావన వచ్చింది కాబట్టి తప్పని సరిగా మాట్లాడుకోవాల్సింది ప్రజా రవాణా (public transport) గురించి. అమెరికాలో ప్రజా రవాణా మృగ్యం. నువ్వెక్కడికైనా వెళ్లాలంటే నీకో కారుండాలి. లేదా, కారుండే వాళ్ళు నీకు తెలిసుండాలి.
“ఓ రోజు ఫ్రీ పెట్టుకున్నా. అలా తిరిగొద్దామని” అని ఓ ఫ్రెండ్ తో అన్నాను. ఏ శాన్ ఫ్రాన్సికోలోనో, న్యూయార్క్ లోనో సాధ్యం అవుతుంది అలా తిరిగడానికి కారో, డబ్బో లేకపోతే ఎక్కడికీ వెళ్లలేవు,” అన్నాడు. (అలా, ఒంటరిగా తిరగగలిగే వూళ్లలో కూడా కొన్ని చోట్లకే వెళ్లగళం. పట్టపగలే నిన్ను స్టాక్ చెయ్యగలిగే వీధులు చాలానే వుంటాయి.)

ఏవో శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ లాటి ఒకటి రెండు నగరాలు మినహాయిస్తే, చాలా నగరాల్లో ప్రజా రవాణా సౌలభ్యం వుండదు. క్యాబ్లు మన పర్సులకి అందుబాటులో వుండవు. ప్రతి ఒక్క కుటుంబం తప్పనిసరిగా ఒక కారు (చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ కూడా అవసరపడతాయి) వుండి తీరాలి. అది ఆటోమొబైల్ రంగం, ఇంకా ఆ రంగానికి అనుబంధంగా వుండే పరిశ్రమలు ప్రజారవాణాని హరించి వేశాయి. ప్రభుత్వం ప్రజారవాణా నుంచి ఎన్నడో వైదొలిగిపోయింది. దగ్గరి దగ్గరి వూర్లకి వెళ్లడానికి, ఇంకా (ప్రజా రవాణా వున్నచోట్ల) last mile connectivity సొంత వాహనం లేకపోతే వెళ్ళడం దుస్సాధ్యం.

ఇక్కడిలాగ, ఎవరు కనపడితే వాళ్ళని ఎడ్రస్ అడగలేం కూడా. ఎందుకంటే, చాలా మందికి తెలీదు. (ప్రధాన రహదార్లు, వీధులు వదిలేస్తే.) కానీ, ఎడ్రస్ లు ఎంత సైంటిఫిక్ గా వుంటాయంటే కొంచెం కాళ్లలో పిక్క బలం వుంటే, ఓపిక వుంటే చాలావరకు మేనేజ్ చెయ్యొచ్చు. ఓ మంచి పేకేజ్ వున్న ఫోన్ చేతిలో వుంటే చాలా ఉపశమనం ఎడ్రస్ లు పట్టుకోవడంలో.

ఈసారి అమెరికా చదువులగురించి, చదువుపట్ల వాళ్ళకున్న జిజ్ఞాస, శ్రధ్ధగురించి…..

గమనిక: ముందు చెప్పినట్టుగానే, ఇక్కడి నా అభిప్రాయాలన్నీ highly subjective. నాకొద్ది exposure పరిమితులకి లోబడి.

 

Download PDF

1 Comment

  • Nandiraju Radhakrishna says:

    అన్యదేశం దర్శించని నా బోంట్లకు కూడా ఆసక్తికరంగాఉందీ..కంటిన్యూ చెయ్యండి..

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)